Pages

Tuesday, 17 December 2013

గణపతి రెండవ అవతారము: ఏకదంతావతారము.


గణపతి  రెండవ అవతారము: ఏకదంతావతారము.

ధ్యానశ్లోకం: ఏకదంతావతారౌ వై దేహినాం బ్రహ్మధారక:, 
మదాసురస్య హంతా స ఆఖువాహనగ: స్మృత:

ఎన్నో అంతరార్ధాలతో కూడుకున్న కధ: చ్యవన మహర్షినుండి ఒకానొక సందర్భంలో మదాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించేడు. ఆ రాక్షసుడు 14 భువనాలకు ఆధిపత్యంకోసం శకిమంత్రంతో దేవిని ఉపాసించాడు. ఆ తపస్సుకి ఫలితంగా అనేకశక్తులను పొంది 14 భువనాలను ఆక్రమించుకున్నాడు. చింతాక్రాంతులైన దేవతలు మదాసురుని నశింపజేసి ధర్మసంస్థాపనానికి ఉపాయం చెప్పమని సనత్కుమార మహర్షిని వేడుకున్నారు. మహర్షి దేవగణములకు ఏకదంతుని మంత్రోపదేశం చేసి సాధన చేయవలసినదిగా ఆదేశించాడు. వారి సాధన ఫలితంగా ఆఖు (ఎలుక) వాహనారూఢుడై గణపతి ఏకదంతావతరంగా ఆవిర్భవించాడు. పాశము, అంకుశము మొదలుగాగల అనేక ఆయుధములతో విరాడ్రూపంతో యుద్ధభూమిలో అడుగుపెట్టి అనేక దైత్యసైన్న్యాన్ని క్షణంలో నశింపజేసాడు. మదాసురుడు యుద్ధంలో ధనుర్బాణాలతో ఏకదంతుని ఎదుర్కొనగా తన పరశువుతో రాక్షసుని ధనుర్బాణాలను నశింపజేసి పాశముతో మదాసురుని బంధించగా, రాక్షసుడు మూర్చ్చిల్లి, కాసేపటికి తేరుకుని ఏకదంతుని శరణుజొచ్చి రక్షించమని వేడుకున్నాడు. శరణత్రాణతత్పరుడైన ఏకదంతుడు మదాసురునితో, ఏకదంతుని స్మరణ, పూజ జరిగే ప్రదేశాలకు ఎన్నడూ ప్రవేశించవద్దని చెప్పి మదాసురుని కుడా నియంత్రించి అధోలోకాలకు పంపించివేసాడు. 

......శ్రీ ఏకదంతాయ నమ:...మనలో మదము ఏకదంతుని అనుగ్రహం వలన నశించుగాక.