Pages

Tuesday, 17 December 2013

గణపతి మూడవ అవతారము: మహోదరావతారము.


గణపతి మూడవ అవతారము: మహోదరావతారము.

ధ్యానశ్లోకం: మహోదర ఇతి ఖ్యాతో ఙ్ఞానబ్రహ్మప్రకాశక:, 
మోహాసురస్య శతృర్వై ఆఖువాహనగ: స్మృత:.

ఎన్నో అంతరార్ధాలతో కూడుకున్న కధ: రాక్షస గురువైన శుక్రాచార్యుని శిష్యులలో ఒక శిష్యుడు మోహాసురుడు. గురువుగారి అదేశంతో మోహాసురుడు సూర్యుని ఉపాసించి సర్వత్రా విజయం చేకూరేలా వరాన్ని పొందేడు. దానితో దైత్యరాజుగా పట్టాభిషిక్తుడై సకల లోకాలను, దేవతలను క్షోభింపసాగాడు. మోహాసరుడు తన భార్య "మదిర"తో సుఖజీవనం సాగించసాగాడు. మోహాసురునివలన వర్ణాశ్రమధర్మాలు, సత్కర్మలు అన్నీక్షీణించసాగాయి. దు:ఖితులైన దేవతలు, ఋషులు సూర్యునివద్దకు చేరి మొఱపెట్టుకున్నారు. ఆ విపత్తికరపరిస్థితులను చూసి సూర్యభగవానుడు వారికి గణేశుని ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించి గణేశుని ప్రసన్నముచేసుకోవలసిందిగా ఆదేశించాడు. వారి ఉపాసనకు సంతుష్టుడైన గణేశుడు `మహోదరు 'నిగా ఎలుకవాహనంతో వారికి ప్రత్యక్షమయ్యాడు. ఇంతలో నారదముని మోహాసురునితో మహోదర ఆవిర్భావంగురించి చెప్పి, అతని శక్త్రిసామర్థ్యాలను కీర్తించాడు. శుక్రాచార్యుడు కూడా మోహాసురునితో మహోదరుని శరణువేడడమే ఉచితమైనదని చెప్పాడు. అదే సమయంలో శ్రీమహావిష్ణువు మహోదరుని దూతగా మోహసురుని వద్దకువచ్చి, మహోదరుని శరణుజొచ్చి, దేవతలు మునులయొక్క ధర్మజీవనానికి ఆటంకపరచకుండా ఉండవలసనిదిగా హెచ్చరించాడు. అలా ఐతే మహోదరుడు క్షమిస్తాడు లేకపొతే యుద్ధంలో తనప్రాణాలనుతీయడం తథ్యమనిచెప్పాడు. దానితో మోహాసురుని అహంకారంతొలగి, మహోదరుని దర్శనం అనుగ్రహించవలసిందిగా వేడుకున్నాడు. అంతట మహోదరుని దర్శించుకుని గద్గదకంఠముతో అనేకస్తోత్రములు చేసి తన అఙ్ఞానమును మన్నించి తనను రక్షించవలసినదిగా వేడుకున్నాడు. అంతేకాక ఆనాటినుండి మోహాసురుడు దేవతలవద్దకుగానీ, మునులవద్దకుగానీ పొరపాటుగాకూడావెళ్ళనని, మహాత్ముల ధర్మకార్యములకు విఘ్నములు కలిగించనని చెప్పి మహోదరుని శరణుజొచ్చాడు. సహజ కృపాళువు అయిన మహోదరుడు మోహాసురుని క్షమించి తనపై భక్తిని అనుగ్రహించాడు. దానితో దేవతలు, ఋషులు, మానవులు అందరూకూడా ధర్మపరాయణులై సుఖముగా జీవించసాగారు. ...మనము కూడా మహోదరుని ఆశ్రయించి మోహాసురునిబాధలు తొలగించమని వేడుకుందాము. "శ్రీ మహోదరాయ మమ:"