Pages

Tuesday, 17 December 2013

గణపతి నాల్గవ అవతారము: గజాననావతారము


గణపతి నాల్గవ అవతారము: గజాననావతారము

ధ్యానశ్లోకం: గజానన: స విఙ్ఞేయ: సాంఖ్యేభ్య: సిద్ధిదాయక:, 
లోభాసురప్రహర్తా వై ఆఖుగశ్చ ప్రకీర్తిత:

ఎన్నో అంతరార్ధాలతో కూడుకున్న కధ: ఒకసారి దేవతలయొక్క కోశాధ్యక్షుడు కుబేరుడు కైలాసానికి వచ్చి పార్వతీపరమేశ్వరుల దర్శనంచేసేసమయంలో పార్వతీదేవి సౌందర్యానికి ముగ్ధుడైచూడగా శ్రీ పార్వతీదేవి అది గ్రహించి కోపోద్రిక్తదృక్కులను కుబేరునివైపు ప్రసరించెను. దానితో భయభీతుడైన కుబేరునినుండి లోభాసురుడు ఉత్పన్నమయ్యేడు. ఆ రాక్షసుడు శుక్రాచార్యునివద్ద పంచాక్షరీవిద్యగైకొని కఠోర తపస్సుచేయసాగాడు. తప:ఫలంగా అనేకవరాలనుపొంది, మానవులను, దేవతలను, మునులను పీడించి భూలోకం, స్వర్గలోకాలను కైవశం చేసుకున్నాడు. అంతేకాక వైకుంఠకైలాసాదిలోకాలనుకూడా వరదర్పంతో తనవిగా చేసుకున్నాడు. అపుడు దేవతలు భయముతో ఎమీతోచని పరిస్థితిలో `రైభ్య 'మునిని ఆశ్రయించారు. రైభ్య ముని ఆదేశానుసారం గణేశుని ఉపాసించసాగారు. దానికి ప్రసన్నుడై, `గజానన ' పేరుగల అవతారము దాల్చి మూషిక వాహనంతో వారికి ప్రత్యక్షమై దేవతలకు అభయమిచ్చి శివుని దూతగా లోభాసురునియొద్దకు పంపాడు. పరమశివుడు గజాననుని ప్రతాపమును, వీరత్వమును లోభాసురునికి తెలియజేసి, తనని శరణువేడమనెను. లేనియెడల గజాననుని చేతిలో లోభాసురుని నాశనము తప్పదని హెచ్చరించెను. దానిని శుక్రాచార్యుడు కూడా సమర్థించి శ్రీ గజాననుని శరణువేడమని లోభాసురునితో చెప్పెను. దానితో లోభాసురుడు పశ్చాత్తప్త హృదయంతో శ్రీ గజాననుని పాదాలపై పడెను. శరణాగతవత్సలుడైన గజాననుడు లోభాసురుని క్షమించి తనను స్మరించువారిచెంతకు రావలదని హెచ్చరించి అధోలోకాలకు పంపించివేసెను. ఆ నాటినుండి అందరూ లోభాసురుని బాధలు లేక సుఖముగానుండిరి. 

మనముకూడా గజాననుని ప్రార్థించి లోభాసురుని బాధలనుండి విముక్తినొందెదము. శ్రీ గజాననాయ నమ:.