Pages

Monday, 13 January 2014

"కృష్ణ సందేశం"

"కృష్ణ సందేశం"

కృష్ణా!
కృష్ణా!
కృష్ణ అన్న శబ్ధం దివ్యమైనది. 
ఇంతటి దివ్యనామాన్ని పెట్టింది యాదవుల గురువు 'గార్గ మహర్షి'.

శ్రీకృష్ణుడు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంస్థాపనకై అవతరించిన భగవంతుడు. శ్రీకృష్ణ జననమే ఓ అద్భుతం. జననమునుండియే నేను మానవుణ్ణి కాను, భగవంతుడిని అనే భావం ప్రతీ పలుకులో, ప్రతీ పనిలో ప్రస్ఫుటం చేస్తుంటాడు. తను రాకముందే తన మాయను ఈ లోకానికి రప్పించడం, పుట్టినపిమ్మటే అందరినీ మైకంలో పడేసి కారాగారంనుండి బయటపడడం, రెండు పాయలుగా యమునానది చీలి వసుదేవునికి దారి ఇవ్వడం, తనకు ఆడపిల్ల పుట్టినవిషయం గానీ, బిడ్డను తీసుకుపోయి మగపిల్లవాడుని తన ప్రక్కన పెట్టిన విషయంగానీ యశోదమ్మకు తెలియకపోవడం ...... అన్నీ పరమాద్భుతఘటనలే. అలానే బాల్యంనందే పూతనను సంహరించడం, మద్దిచెట్లు రూపంలో ఉన్న నలకూబర, మణిగ్రీవులకు శాపవిమోచన చేయడం, కాళియమర్ధనం, వస్త్రాపహరణం......ఇత్యాది పరమాద్భుత ఘటనలన్నీ భగవంతుని బాల్యలీలలు. పరమాత్ముని లీలలన్నీ పారమార్ధిక సందేశాలే.

ఓం దేవకీ గర్భసంజాతాయ నమః 
ఓం యశోదేక్షణ లాలితాయ నమః 
కృష్ణుడు ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డ. దేవాదిదేవుని కన్నది దేవకీమాతయితే, దేవాదిదేవుని దివ్యలీలలను కాంచినది యశోదమాత. యశోదమాత కాంచిన దివ్యదర్శనములలో ఒకటి -
ఓ దినం ఎప్పటిలాగే కృష్ణుడు, బలరామ గోపబాలకులతో కలిసి ఆడుకుంటూ మట్టి తిన్నాడు. మట్టి తిన్నట్లు గోపబాలకుల ద్వారా తెలుసుకున్న యశోదమ్మ కృష్ణుని పిలిచి మందలించగా -
అమ్మా! మన్ను దినంగా నేశిశువునో? యా కొంటినో? వెఱ్ఱినో?
నమ్మంజూడకు వీరి మాటలు మదిన్, నన్నీవు గొట్టంగా వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్యగం
ధమ్మాఘ్రాణముసేసి నా వచనముల్ దప్పైన దండింపవే
అని నోరు తెరిచి చూపగా చిన్నికృష్ణుని నోటిలో చరాచర సృష్టినే కాంచిన ధన్యమాత యశోద.