Pages

Wednesday, 15 January 2014

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమ్ - తాత్పర్యం


శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమ్ - తాత్పర్యం

పూర్వం వేదవ్యాస మహర్షిని సంకల్పసిద్ధి పొందే ఉపాయం చెప్పమని ఋషులు అడిగిరి. అందుకు వేదవ్యాస మహర్షి, ఒక్కసారి చదివితే చాలు సంకల్పాన్ని సిద్ధింపచేసేది, భోగమోక్షాలను ప్రసాదించేది చెపుతాను, అందరూ వినండి అంటూ ఉపక్రమించాడు.

హిమవత్పర్వత గౌరీశృంగంపై రత్నసింహాసనం మీద ఆసీనుడై ఉన్న పరమేశ్వరునితో ఒకనాడు పార్వతీ దేవి, "ఓ లోక శంకరా! నీవల్ల అనేక మంత్రాలను, యంత్రాలను, తంత్రాలను తెలుసుకున్నాను, ఇప్పుడు మహీతలాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను" అని పలికింది. పార్వతి కోరికను సంతోషంతో అంగీకరించిన పరమేశ్వరుడు వృషభవాహనం పై బయలు దేరి భూలోక వింతలు చూపించసాగాడు. వారు వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక దుర్గమమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ వారికి గొడ్డలి ధరించి సమిధలను సేకరిస్తున్న ఒక కిరాతుడు కనిపించాడు. అతని శరీరం వజ్రము వలె ధృఢముగా ఉన్నది. ఇంతలో ఒక పెద్ద పులి అతని పై దాడి చేయుటకు వేగముగా వచ్చినది. అయితే దానిని చూచిన కిరాతుడు తనను రక్షించుకొనుటకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా సంతోషముతో నిర్భయముగా నిలబడి ఉన్నాడు. అదే సమయములో ఒక లేడి పరిగెత్తుకుంటూ అక్కడకు రాగా దానిని చూచిన పులి బెదిరి పారిపోయింది.

ఈ వింతను చూసిన పార్వతి శంకరునితో "ఏమాశ్చర్యం! ప్రభూ, ఎదురుగా చూడు" అన్నది. దానికి పరమేశ్వరుడు "దేవీ! మేము చూడనిదంటూ లోకంలో ఏ కొంచమూ లేదు. వాక్కులకు, మనస్సుకు అందని అద్భుతం నీకు చెబుతాను, విను" అంటూ చెప్పనారంభించాడు.

ఈ భిల్లుని పేరు దూరశ్రవుడు. పరమ ధార్మికుడు. ప్రతీరోజూ అడవికి వెళ్ళి కష్టపడి సమిధలూ, దర్భలూ, పుష్పాలూ, కందమూల ఫలాలూ తెచ్చి మునీంద్రులకిస్తాడు. ప్రతిఫలంగా తానేమీ కోరడు. ఆ మునులందరూ కూడా అతని పట్ల దయతో ఉంటారు.

అక్కడే దలాదనుడను మహాయోగి ఉన్నాడు. ఒకనాడు దలాదనుడు, "దత్తాత్రేయుడు స్మర్తృగామి (స్మరించిన‌వారి వద్దకు తక్షణమే వెళతాడు)" అని విన్న కథను తలుచుకొని, దత్తుని స్మరించాడు. మరుక్షణంలో దత్త యోగీంద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దలాదన మహర్షి ఆశ్చర్యానందాలు పెల్లుబికగా ఆయనను పూజించి, "ఓ దత్తాత్రేయ మహామునీ! నా ఆహ్వానం విని నీవు విచ్చేశావు. స్మర్తృగామివని విని, కేవలం పరీక్షించడానికే నిన్ను స్మరించాను. నా అపరాధం మన్నించు." అన్నాడు. అందుకు దత్త భగవానుడు ఆ మునితో "నా ప్రకృతి ఇటువంటిది. భక్తితోగాని, భక్తి లేకుండా కాని అనన్యచిత్తంతో నన్ను స్మరించిన వారి వద్దకు వెళ్ళి వారి కోరికలు తీరుస్తాను" అని చెప్పాడు. "నీవు తలచుకున్నందుకు వచ్చాను గదా, నీకు ఏమి కావాలో కోరుకో" అని దత్తుడు అడుగగా, దలాదుడు, "ఓ మునిపుంగవా! నేనేమీ అడగను. నీ మనస్సులో ఉన్నది, నాకు శ్రేయస్కరమైనది నాకు ప్రసాదింపుము" అన్నాడు.

శ్రీ దత్తాత్రేయుడు, "నా వజ్రకవచం ఉన్నది, తీసుకో" అని చెప్పగా, దలాదుడు అంగీకరించాడు. దత్తుడు తన వజ్రకవచమునకు సంబంధించిన ఋషినీ, ఛందస్సునూ చెప్పి, న్యాసం, ధ్యానం, ప్రయోజనము అన్నీ వివరించి చెప్పాడు.

దత్తాత్రేయ ధ్యానమ్ :

జగత్తు అనే మొక్కకు దుంప వంటి వాడు, సచ్చిదానంద మూర్తి, యోగీంద్రచంద్రుడు, పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారము. ఒకప్పుడు యోగి, ఒకప్పుడు భోగి, ఒకప్పుడు నగ్నంగా పిశాచి వలె ఉండే దత్తాత్రేయుడు ప్రత్యక్ష హరి స్వరూపుడు. భుక్తి ముక్తి ప్రదాయకుడు. ఆయన ప్రతిదినమూ వారణాసిలో స్నానము, కొల్హాపురంలో జపము, మాహురీపురంలో భిక్ష స్వీకరించి, సహ్యాద్రిపై శయనిస్తాడు. ఆయన శరీరం ఇంద్రనీలమణి వలె, కాంతి వెన్నెల వలె, జటలు వైఢూర్యం వలే ఉంటాయి. కన్నులు తెల్లగా మైత్రితో, కనుపాపలు చాలా నీలంగా ఉంటాయి. కనుబొమలూ, గుండెలపై రోమాలూ, గెడ్డమూ, మీసాలూ నల్లగా ఉంటాయి. నవ్వు పొగమంచు కంటే చల్లగా, కంఠం శంఖం కంటే అందంగా ఉంటాయి. భుజాలు పుష్ఠిగా ఉంటాయి. బాహువులు పొడవుగా, చేతులు చిగుళ్ళ కంటే కోమలంగా ఉంటాయి. వక్షస్థలం విశాలంగా బలిసి ఉంటుంది. పలుచటి ఉదరంతో, విశాలమైన పిరుదులతో, అందంగా ఉంటాడు. కటి స్థలం విశాలంగా, తొడలు అరటిబోదెల వలె ఉంటాయి. చక్కటి మోకాళ్ళు, పిక్కలూ కలిగి ఉంటాడు. చీలమండలు గూఢంగా ఉంటాయి. పాదాల పైభాగాలు తాబేటి డిప్పల వలె ఉంటాయి. అరికాళ్ళు ఎర్ర తామర పువ్వుల వలె అందంగా ఉంటాయి.

ఆయన మృగచర్మమును వస్త్రంగా ధరిస్తాడు. ప్రతీక్షణమూ తనను తలచుకున్న వారి వద్దకు వెళుతుంటాడు. జ్ఞానోపదేశం చేయటమంటే ఇష్టం. ఆపదలు తొలగించటం ఆయన దీక్ష. సిద్ధాసనంలో నిటారుగా కూర్చుని ఉంటాడు. నవ్వు ముఖం. ఎడమచేత వరదముద్ర, కుడిచేత అభయ ముద్ర. బాలురు, ఉన్మత్తులు, పిశాచాలతో కలిసి తిరుగుతుంటాడు. త్యాగి. భోగి. మహాయోగి. నిత్యానందుడు. నిరంజనుడు, సర్వరూపి, సర్వదాత, సర్వగామి. సర్వకామదుడు. భస్మోద్ధూళిత శరీరుడు. మహాపాతకాలను నాశనం చేసేవాడు. భోగ మోక్ష ప్రదాయకుడు.

"ఇలా ధ్యానం చేసి అనన్యచిత్తంతో నా వజ్రకవచాన్ని పఠించాలి. సర్వత్రా నన్నే దర్శిస్తూ, నాతో సంచరించాలి" అని దత్తుడు తెలిపాడు.

దత్తుడు దిగంబరుడు, భస్మ సుగంధం పూసుకున్నవాడు. చక్రం, త్రిశూలం, డమ్రువు, గద అనే ఆయుధాలు ధరించినవాడు. పద్మాసనుడు. యోగీంద్రులూ, మునీంద్రులూ నిత్యమూ ఆయనను "దత్తా, దత్తా" అంటూ నమస్కరిస్తూంటారు.

దత్తాత్రేయ వజ్రకవచమ్ :

ఓం, దత్తాత్రేయుడు సహస్రార కమలంలో ఉండి, శిరస్సును రక్షించుగాక. అనసూయేయుడు చంద్రమండల మధ్యభాగంలో ఉండి ఫాలాన్ని కాపాడుగాక. మనోమయుడు హం క్షం ద్విదళ పద్మభవుడై భ్రూమధ్యమును రక్షించుగాక. జ్యోతిరూపుడు రెండు కన్నులను, శబ్ద స్వరూపుడు రెండు చెవులను, గంధ స్వరూపుడు ముక్కును, రస స్వరూపుడు నోటిని, వేద స్వరూపుడు నాలుకను, ధర్మ స్వరూపుడు దంతాలను మరియూ రెండు పెదవులను కాపాడుగాక. అత్రిభవుడు నా చెక్కిళ్ళను, ఆ తత్వవేత్త నా ముఖమంతటినీ కాపాడుగాక. సర్వస్వరూపుడు, నా ఆత్మలో ఉండేవాడు షోడశారకమలంలో ఉండి, నా కంఠాన్ని రక్షించుగాక. చంద్రానుజుడు నా భుజ శిరస్సులను, కృతాదిభవుడు నా భుజాలను, శత్రుజిత్తు కొంకులను, హరి వక్షస్థలాన్ని కాపాడుగాక. కకారాది ఠకారాంతమైన ద్వాదశారకమలంలో ఉన్న వాయు స్వరూపుడు యోగీశ్వరేశ్వరుడు నా హృదయాన్ని రక్షించుగాక. పార్శ్వస్థితుడనే హరి నా పార్శ్వాలను, హఠయోగాది యోగజ్ఞుడు మరియు కృపానిధి నా కుక్షినీ కాపాడుగాక. డకారాది ఫకారాంతం కల దశారకమలంలో ఉండే అగ్ని స్వరూపుడు నా నాభిని, వహ్నితత్వమయుడైన యోగి నా మణిపూరకాన్ని రక్షించుగాక. కటిలోని బ్రహ్మాండ వాసుదేవ స్వరూపుడు నా కటిని కాపాడుగాక. బకారాది లకారాంతమైన షట్పత్రకమలాన్ని వికసింపచేసే జలతత్వమయుడైన యోగి నా స్వాధిష్ఠాన చక్రాన్ని రక్షించుగాక. సిద్ధాసనంలో కూర్చున్న సిద్ధేశ్వరుడు నా ఊరువులను కాపాడుగాక. వకారాది సకారాంతమైన నాలుగు రేకుల కమలాన్ని వికసింపచేసే మహీరూపుడైన వీర్యనిగ్రహశాలి, మోకాళ్ళపై హస్తపద్మాలు పెట్టుకున్నవాడు నా మూలాధార చక్రాన్ని, ఇంకా అన్ని వైపులనుండీ నా పృష్ఠాన్ని రక్షించుగాక. అవధూతేంద్రుడు నా పిక్కలను, తీర్థపావనుడు నా రెండు పాదాలను, సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక.

కేశవుడు నా రోమాలను రక్షించుగాక. చర్మాంబరుడు నా చర్మాన్ని, భక్తిప్రియుడు నా రక్తాన్ని, మాంసకరుడు నా మాంసాన్ని, మజ్జాస్వరూపుడు నా మజ్జను, స్థిరబుద్ధి గలవాడు నా అస్థులను, వేధ నా మేధను, సుఖకరుడు నా శుక్రాన్ని కాపాడుగాక. దృఢాకృతి నా చిత్తాన్ని, హృషీకేశాత్మకుడు నా మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని, ఈశుడు నా కర్మేంద్రియాలను, అజుడు నా జ్ఞానేంద్రియాలను రక్షించుగాక. బంధూత్తముడు నా బంధువులను కాపాడుగాక. శత్రుజిత్తు నన్ను శత్రువులనుండి కాపాడుగాక. శంకరుడు నా ఇల్లు, తోట, ధనం, పొలం, పుత్రులు మొదలైనవి రక్షించుగాక. ప్రకృతివిదుడు నా భార్యను కాపాడుగాక. శార్ ఙ్గభృత్తు నా పశువులను రక్షించుగాక. ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను, భాస్కరుడు నా భక్ష్యాదులను, చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. పురాంతకుడు నన్ను దుఃఖం నుండి రక్షించుగాక. పశుపతి నా పశువులను, భూతేశ్వరుడు నా ఐశ్వర్యాన్ని పాలించుగాక.

విషహరుడు తూర్పున, యజ్ఞస్వరూపుడు ఆగ్నేయాన, ధర్మాత్మకుడు దక్షిణాన, సర్వవైరిహృత్ నైరృతి మూల, వరాహుడు పడమటి దిక్కున, ప్రాణదుడు వాయువ్యపు మూల, ధనదుడు ఉత్తరాన, మహాగురుడు ఈశాన్యాన, మహాసిద్ధుడు ఊర్ధ్వదిక్కున, జటాధరుడు అధోదిశన రక్షించాలి. ఆది మునీశ్వరుడు ఏ దిక్కు రక్షణ లేకుండా ఉంటే ఆ దిక్కును కాపాడాలి.

"ఈ నా వజ్రకవచాన్ని ఎవడు చదివినా విన్నా వాడు వజ్రకాయుడు చిరంజీవి కాగలడు. అతడు త్యాగి, భోగి, మహాయోగి, సుఖ దుఃఖ రహితుడు, సర్వత్ర సిద్ధసంకల్పుడు, జీవన్ముక్తుడు అయి వర్తమానంలో ఉంటాడు." అని చెప్పి దత్తాత్రేయ యోగి అంతర్థానం చెందాడు. దలాదుడు కూడా అది జపించి జీవన్ముక్తుడైనాడు. దూరశ్రవుడు అనే భిల్లుడు అప్పుడు దీనిని విన్నాడు. ఒక్కసారి విన్నంతనే వజ్రకాయుడయ్యాడు.

దత్తాత్రేయ కవచమంతా శివుని నోట విన్న పార్వతి, "ఈ కవచం మహత్మ్యమూ, ఉపయోగించే విధానమూ తెలియచేయ"మని అన్నది. వినయంగా అడిగిన పార్వతి ప్రశ్నకు, "ఓ పార్వతీ ఏకాగ్రతతో విను. ధర్మార్థకామ మోక్షాలకు ఇదే ఆధారం"

"ఇది ఏనుగులనూ, గుర్రాలనూ, రథాలనూ, కాలిబంట్లనూ, సర్వైశ్వర్యాన్ని ఇస్తుంది. పుత్ర మిత్ర కళత్రాది సర్వసంతోష సాధనము. వేదశాస్త్రాది విద్యలకు నిధానము. సంగీత, శాస్త్ర సాహిత్య, సత్కవిత్వాలను ప్రసాదిస్తుంది. బుద్ధిని, విద్యను, తలపును, ప్రజ్ఞను, మతిని, నేర్పును ఇస్తుంది. శత్రువులను శీఘ్రమే సంహరిస్తుంది. యశస్సును, కీర్తినీ పెంచుతుంది."

"దీనిని వెయ్యి సార్లు జపిస్తే ఎనిమిది మహారోగాలూ, పదమూడు సన్నిపాతాలూ, తొంభై ఆరు కంటిజబ్బులూ, ఇరవై మేహ రోగాలూ, పద్దెనిమిది కుష్ఠు రోగాలూ, ఎనిమిది విధాల గుల్మాలూ, ఎనభై వాత రోగాలూ, నలభై పైత్య రోగాలూ, ఇరవై శ్లేష్మ రోగాలూ, క్షయ, చాతుర్థికం మొదలైనవీ, మంత్ర యంత్ర, కుత్సిత యోగాదులూ, కల్పతంత్రాదుల వల్ల కలిగించినవీ, బ్రహ్మరాక్షసులూ, భేతాళులూ, కూష్మాండాది గ్రహాలూ, వీటి వల్ల కలిగినవీ, ఆయా దేశకాలాలలో ఉన్నవీ, తాపత్రయం వల్ల కలిగినవీ, నవగ్రహాల వల్ల ఏర్పడినవీ, మహాపాతకాల వల్ల కలిగినవీ, అన్ని రోగాలూ పూర్తిగా నశిస్తాయి. ఇది నిశ్చయం."

"పది వేలసార్లు జపిస్తే గొడ్రాలు పుత్రవతి అవుతుంది. ఇరవై వేలసార్లు జపిస్తే అపమృత్యుజయం లభిస్తుంది. ముప్ఫై వేల సార్లు జపిస్తే ఆకాశ సంచారం అలవడుతుంది. కోటిమార్లు జపిస్తే సర్వకార్యాలు సాధ్యమవుతాయి. లక్ష సార్లకే కార్యసిద్ధి కలుగుతుంది. సంశయం లేదు."

"విషముష్టి చెట్టు మొదట దక్షిణాభిముఖంగా ఒక్క నెల జపిస్తే శత్రువు వికలేంద్రియుడవుతాడు. వృద్ధికి మేడి చెట్టు మొదటా, సిరి కోసం లక్ష్మీ బిల్వం మొదటా, అరిష్టాదుల శాంతికి చింతచెట్టు మొదటా, ఓజస్సు కోసం రావి చెట్టు మొదటా, భార్య కొరకై తీయ మామిడి చెట్టు మొదటా, జ్ఞానార్థం తులసి చెంతా జపించాలి. సంతతి కావాలనుకొనేవారు గర్భగృహంలో, ధనార్థులు మంచి క్షేత్రాలలో, పశువులు కోసం గోశాలలో, ఏ కోరిక గలవరైనా దేవాలయంలోనూ జపించాలి."

"బొడ్డులోతు నీటిలో నిలబడి సూర్యుని చూస్తూ వేయిసార్లు జపించినవాడు యుద్ధంలోగానీ, శాస్త్రవాదంలో గానీ జయిస్తాడు. గొంతులోతు నీటిలో రాత్రిపూట కవచం పఠిస్తే, జ్వరం, అపస్మారం, కుష్ఠు మొదలైన రోగాలూ తాపజ్వరాలూ తొలిగిపోతాయి."

"ఏది ఏది ఎక్కడ స్థిరంగా ఉంటుందో, ఏది ఏది ప్రసన్నమైతే అది నివారణమౌతుందో దాని కొరకు అక్కడ జపిస్తే సిద్ధి కలుగుతుంది. ఇది నిశ్చయం."

అని శివుడు చెప్పాడు. ఈ వజ్రకవచాన్ని పఠించినవాడు దత్తాత్రేయ సమానుడౌతాడు. ఈ విధంగా దత్తాత్రేయుడు దలాదునికి చెప్పినది, శివుడు పార్వతికి తెలియచేశాడు. ఈ కవచమును పఠించినవాడు ఈ లోకంలో దత్తుని వలె యోగి, చిరాయుష్మంతుడు అయి చరిస్తాడు.