Pages

Saturday, 1 February 2014

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం ఐదవ అధ్యాయం

పరీక్షిత్తు శుకున్ని అడిగిన ప్రశ్నకు బదులుగా శుకుడు "ఇది వరకే ఈ ప్రశ్నను నారదుల వారు బ్రహ్మగారిని అడిగారు నేను నీకు ఇపుడు అదే చెప్పబోవుతున్నాను"

నారద ఉవాచ
దేవదేవ నమస్తేऽస్తు భూతభావన పూర్వజ
తద్విజానీహి యజ్జ్ఞానమాత్మతత్త్వనిదర్శనమ్

దేవ దేవా! అన్ని ప్రాణులనీ సృష్టించేవాడా, అందరికన్నా ముందు పుట్టినవాడా, ఆత్మ తత్వమును బోధించే జ్ఞ్యానమేదో అది తెలియజేయ వలసింది

యద్రూపం యదధిష్ఠానం యతః సృష్టమిదం ప్రభో
యత్సంస్థం యత్పరం యచ్చ తత్తత్త్వం వద తత్త్వతః

ఈ ప్రపంచమంతా ఎవరి రూపంతో ఉంటుంది (ఏ రూపంతో ఉంటుంది), ఇది ఎవరిది - యద్రూపం
ఈ ప్రపంచానికి ఎవరు ఆధారం (అధిష్ఠానం), ఎవరివల్ల ఇది సృష్టించబడింది (ఉపాదానం - అనే ముడి సరుకు, దేనితో తయారైందో దాన్ని ఉపాదానం, నిమిత్త  కారణం అంటే దాన్ని తయారుచేసిన వారు, సహకారీ కారణం అంటే ఆ కార్యానికి సహకరించిన వారు)
ఇది ఎవరిలో ఉన్నది - ఇది ఎవరిలో లీనమవుతున్నది (యత్సంస్థం ). "యతో వా ఇమాని భూతాని జాయంతే యతో జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజ్ఞానస్వః " లో ఇది యతో వా ఇమాని భూతాని జాయంతే అనేదానికి ఇది అర్థం.
యత్పరం  - ఇది దేనితో సృష్టిచబడుతుంది దేనితో జీవించబడుతుంది దేనిలో చేరుతుంది. ఈ మూటి స్థితిలో దేన్ని ఆశ్రయిస్తుంది. ఆశ్రయంలో మూడు రకాలు. ద్రవ్యాశ్రయం గుణాశ్రయం భావాశ్రయం. ఉదాహరణకు మనం భూమి మీద ఉండుట వలన మనకుండే గుణాలు పాంచభౌతికాలు. ద్రవ్యం భూమి, గుణం పాంచభౌతికం, భావం మహత్ తత్వం. అంటే అహంకారం. ఇలా ఏ భావాన్ని పొంది ఉంటుంది

సర్వం హ్యేతద్భవాన్వేద భూతభవ్యభవత్ప్రభుః
కరామలకవద్విశ్వం విజ్ఞానావసితం తవ

నీకు ఇవన్నీ తెలుసు - జరిగినది జరుగుతున్నది జరగబోయేదీ మీకు తెలుసు. ఆ మూడిటికీ నీవు ప్రభువు. అరచేతిలో ఉసిరికాయ వలే (కరామలకవద్) నీకు సకల జగత్తు గురించి తెలుసు. నీ విజ్ఞ్యానం వలనే ఈ జగత్తు
ఏర్పడింది

యద్విజ్ఞానో యదాధారో యత్పరస్త్వం యదాత్మకః
ఏకః సృజసి భూతాని భూతైరేవాత్మమాయయా

జగత్తుని సృష్టించడానికి నీవు ఏ విజ్ఞ్యానాన్ని ఆశ్రయిస్తున్నావు. నేవే అందరికీ ఆధారమా. నీకు కూడా ఇంకొకరు ఆధారముగా ఉన్నారా. నీవు స్వతంత్ర్యుడవా లేక ఎవరి ఆజ్ఞ్యకైన కట్టుబడ్డావా, నీవు ఎవరి స్వరూపం. జగత్తంతా నీ స్వరూపమేనా, నీవు కూడా ఇంకొకరి వలన ఏర్పడ్డావా. నీవొక్కడివే సృష్టిచేస్తున్నావని అనుకుంటున్నాను.

ఆత్మన్భావయసే తాని న పరాభావయన్స్వయమ్
ఆత్మశక్తిమవష్టభ్య ఊర్ణనాభిరివాక్లమః

సకల చరాచర జగత్తుని సృష్టిస్తున్నావు గాని, వాటి చేత నీవు భావింపబడట్లేదు. నీవు స్వయం ప్రకాశకుడివి గానీ నిన్నెవరూ ప్రకాశింపలేరు. సాలె పురుగులాగా నీవే సృష్టిస్తున్నావు, నీవే లయం చేస్తున్నావు.

నాహం వేద పరం హ్యస్మిన్నాపరం న సమం విభో
నామరూపగుణైర్భావ్యం సదసత్కిఞ్చిదన్యతః
స భవానచరద్ఘోరం యత్తపః సుసమాహితః
తేన ఖేదయసే నస్త్వం పరాశఙ్కాం చ యచ్ఛసి

కాబట్టి నేను మీకంటే పరమో అపరమో సమానమో ఉందని నేననుకోవడంలేదు. అన్ని నామ రూప గుణాలు మీ మాయ శక్తితో ఏర్పడేవే. సత్ గానీ అసత్ గాని, ఉన్నట్లుగా కనిపించేవి లేనట్లుగా అనిపించేవి ఉండీ లేనట్లుగా భాసించేవి అంతా నీ సృష్టే. ఇదంతా నీ గురించి నేను ఏర్పరచుకున్న భావం. కానీ నీవు కూడా తపస్సు చేయడం చూసి ఈ పెద్ద సందేహం వచ్చింది.


ఏతన్మే పృచ్ఛతః సర్వం సర్వజ్ఞ సకలేశ్వర
విజానీహి యథైవేదమహం బుధ్యేऽనుశాసితః

కాబట్టి నాలో కలిగిన ఈ సందేహాన్ని నీ విజ్ఞ్యాన బలంతో వివరించండి

బ్రహ్మోవాచ
సమ్యక్కారుణికస్యేదం వత్స తే విచికిత్సితమ్
యదహం చోదితః సౌమ్య భగవద్వీర్యదర్శనే

ప్రపంచంలో ఉన్న జ్ఞ్యానులందరి మనసులో ఉన్న సందేహాన్ని తీర్చడానికి నీవు ఈ ప్రశ్న అడిగావు కనుక నీవు కారుణికవు. పరమాత్మ యొక్క పరాక్రమాన్ని బలాన్ని చెప్పే అవకాశాన్ని నాకు ఇచ్చావు.

నానృతం తవ తచ్చాపి యథా మాం ప్రబ్రవీషి భోః
అవిజ్ఞాయ పరం మత్త ఏతావత్త్వం యతో హి మే

నా గురించి నీవు చెప్పినదంతా అబద్దం కాదు. నాకంటే పరతత్వాన్ని తెలియని వారు నన్నే పరతత్వమనుకుంటారు

యేన స్వరోచిషా విశ్వం రోచితం రోచయామ్యహమ్
యథార్కోऽగ్నిర్యథా సోమో యథర్క్షగ్రహతారకాః

సూర్యుడు చంద్రుడు అగ్ని నక్ష్త్రాలు తారకలు, ప్రకాశిస్తున్నాయా ప్రకాశింపచేయబడుతున్నాయా? ఎవరు సూర్యునికి ఆ కాంతి ఇచ్చారో ఆ పరమాత్మ తన కాంతితో ప్రకాశింపచేస్తున్నాడు. ఆ ప్రపంచాన్నే నేను చూపిస్తున్నాను. సూర్య్డు చంద్రుడు అగ్ని నక్ష్త్రాలు తారకలు యే పరమాత్మ అనుగ్రహంతో ప్రకాశిస్తున్నాయో నేను కూడా ఆయన ప్రకాశంతో బయలుపడిన ప్రపంచాన్నే చూపెడుతున్నాను

తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి
యన్మాయయా దుర్జయయా మాం వదన్తి జగద్గురుమ్

ఇది ద్వాదశాక్షరీ మంత్రము. భగవంతుని మాయను ఎవరూ గెలెవలేరు. అందరూ నన్ను జగద్గురువు అంటున్నారు

విలజ్జమానయా యస్య స్థాతుమీక్షాపథేऽముయా
విమోహితా వికత్థన్తే మమాహమితి దుర్ధియః

మనం ఇపుడు అనుభవిస్తున్నదంతా సత్యమే అని మనకు అనిపించేట్లు చేసే మాయ పరమాత్మ ముందు నిలవడానికి సిగ్గు పడుతుంది. ఆయన దృష్టి పధంలో నిల్వడానికే సిగ్గుపడే మాయ చేత మోహించబడే మనము, నేను - నాది అనుకుంటున్నాము. మాయ చేత మోహించబడిన మనకు ఈ అహంకార మమకారాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఆయన చూపు పడే చోట ఆ మాయ కూడా సిగ్గుపడుతుంది

ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ
వాసుదేవాత్పరో బ్రహ్మన్న చాన్యోऽర్థోऽస్తి తత్త్వతః

ద్రవ్యం (శరీరం) కర్మ (కర్మేంద్రియాలు) కాలం (వాటి ప్రవర్తకం) స్వభావం (వాటి స్థితి) జీవం - ఒక పని జరగడానికి వీటిలో ఏమి కారణం? చెట్టు మీది కాయ పండు ఐతే దాని రంగూ స్పర్శ రసం గంధము రుచి అన్నీ మారతాయి. ప్రపంచములో ఎవరైనా అది చేయగలరా? అలాగే అన్నం వండుతున్నాము అంటే అన్నంలో జరిగే మార్పులకు కారణం ఎవరు? అగ్ని కారణమా వంట చేసే వాడు కారణమా? అగ్ని ఉండి వండేవాడు లేకపోయినా, వండే వాడు ఉండి అగ్ని లేకపోయినా, ఈ రెండూ ఉండి బియ్యం (ద్రవ్యం) లేకపోయినా, ఈ అన్నీ ఉండి కాలం రాకపోయినా (అది అర్థ రాత్రి అయినా), ఒక వేల్ళ అన్నీ ఉండి తినాలనే బుద్ధి పుట్టకపోయినా పని కాదు.
పరమాత్మకన్నా భిన్నమైనది ఏదీ లేదు. ఈ అయిదులో ఏ ఒక్కటీ స్వతంత్ర్యంకాదు

నారాయణపరా వేదా దేవా నారాయణాఙ్గజాః
నారాయణపరా లోకా నారాయణపరా మఖాః

అన్నివేదాలు శ్రీమన్నారాయణుని స్వరూప స్వభావాలు చెప్పేవే. అన్ని లోకాలు ఆయన అధీనములే. అన్ని యజ్ఞ్యములు ఆయన పరములే

నారాయణపరో యోగో నారాయణపరం తపః
నారాయణపరం జ్ఞానం నారాయణపరా గతిః

అన్ని యోగములు తపస్సులు జ్ఞ్యానములు, గతి (రక్షణ) ఆయన పరమే.

తస్యాపి ద్రష్టురీశస్య కూటస్థస్యాఖిలాత్మనః
సృజ్యం సృజామి సృష్టోऽహమీక్షయైవాభిచోదితః

అతనే ద్రష్ట, అధిత్పతి, నిత్యుడు (కూటస్థ), సకల జగత్ స్వరూపం. అలాంటి పరమాత్మ చేత సృజింపబడిననేను, ఆయన శక్తితో సృష్టిచేస్తున్నాను. ఆయన సృష్టించిన దాన్ని మీకు చూపుతున్నాను, ఆయన సంకల్పం చేత ప్రేరేపించబడి.

సత్త్వం రజస్తమ ఇతి నిర్గుణస్య గుణాస్త్రయః
స్థితిసర్గనిరోధేషు గృహీతా మాయయా విభోః

పరమాత్మ నిర్గుణుడు. సత్వ రజో తమ గుణాలు ప్రకృతివి (దీన్ని మూల ప్రకృతి అంటారు, రెండవ స్వరూపం అవ్యక్తం, మూడవది ప్రధానం, నాలుగవది ప్రకృతి. ఎందుకంటే మూల ప్రకృతి అత్యంత సూక్ష్మాకారంలో ఉండి గుణములు లేని దాని లాగానే అవికృతంగా ఉంటుంది. దాని రెండవ స్వరూపం అవ్యక్తం. అంటే గుణాలు ఉండి కూడా కనపడవు. మూడవది ప్రధానం. అందులో గుణాలు అన్నీ కనపడతాయి. నాల్గవది ప్రకృతి. ప్రకృతి నాలుగు స్థితులతో ఉంటుంది )
పరమాత్మ మూల ప్రకృతినే కదిలిస్తాడు. పూర్వం పొయ్యి వెలిగించడానికి కట్టె కదిలించేవారు. అప్పుడే అది మండుతుంది, గురువుచే కదిలించబడిన శిష్యుడి జ్ఞ్యానం లాగ. సృష్టించాలనుకున్న పరమాత్మ ప్రకృతి గుణాలను స్వీకరిస్తాడు, సృష్టి స్థితి లయాలకు స్వీకరిస్తాడు

కార్యకారణకర్తృత్వే ద్రవ్యజ్ఞానక్రియాశ్రయాః
బధ్నన్తి నిత్యదా ముక్తం మాయినం పురుషం గుణాః

కార్యం - శరీరం. కారణం - ఇంద్రియములు కర్త - జీవుడు. ఇవే ద్రవ్య జ్ఞ్యాన క్రియలు. ఈ మూడు పురుషున్ని నిత్యం బయటకు వెళ్ళకుండా బంధిస్తాయి. మనకు ఎలాంటి సంబంధం లేని జీవున్ని కూడా ఇవి బంధిస్తాయి. జీవున్ని గుణాలే బంధిస్తాయి (బధ్నన్తి నిత్యదా ముక్తం మాయినం పురుషం గుణాః). కొంతకాలం కన్ను కొంతకాలం చెవులు అలా కర్మేంద్రియాలు జ్ఞ్యానేంద్రియాలు బంధిస్తాయి

స ఏష భగవాంల్లిఙ్గైస్త్రిభిరేతైరధోక్షజః
స్వలక్షితగతిర్బ్రహ్మన్సర్వేషాం మమ చేశ్వరః

ఆ పరమాత్మ  ఈ మూడిటితో ద్రవ్య జ్ఞ్యాన క్రియలతో, కార్య కారణ కర్తృత్వములతో, సత్వ రజ తమసులతో , ఈ మూడిటితో ఇంద్రియ వ్యాపారాలను కిందకి చేసే పరమాత్మ (అధోక్షజుడు) తాను కనపడాలనుకుంటే కనపడతాడు, అతని స్వరూపం అతని చేత మాత్రమే గుర్తిచబడుతుంది. ఆయనే అందరికీ నకూ ప్రభువు.

కాలం కర్మ స్వభావం చ మాయేశో మాయయా స్వయా
ఆత్మన్యదృచ్ఛయా ప్రాప్తం విబుభూషురుపాదదే

పరమాత్మ ఏది ఏ రూపంలో ఎవరిచేత అనుభవింప్చేయాలనుకుంటాడో

పాద్మ పురాణంలో ఉన్నట్లుగా

యస్మాఛ్చ యేనచ యధాచ యదాచ యచ్చ
యావచ్చ యత్ర చకృతాకృత మాత్మ కర్మ
తస్మాఛ్చ తేనచ తధాచ తదాచ తచ్చ
తావచ్చ తత్ర చ విధాతృ వళాదుపైతి

యస్మాఛ్చ -  దేనివలన
యేనచ దేనితో
యధాచ ఏ విధంగా
యదాచ ఎప్పుడు
యచ్చ ఏది
యావచ్చ ఎంత
 యత్ర
చకృతాకృత మాత్మ కర్మ - మంచి చెడు కరమలు
తస్మాఛ్చ దానివల్లనే
తేనచ  దానితోటే
తధాచ అప్పుడే
తదాచ అదే
 తచ్చ అంతనే
తావచ్చఆ విధంగానే  అనుభవించబడుతుంది
తత్ర చ విధాతృ వళాదుపైతి - భగవంతుని ఇచ్చవలన

చేసిన పాపమంతా ఒక్క సారిగా అనుభవింపచేయక పరమాత్మ ఇష్టం మీద ఆధారపడి ఎంత అనుభవింపచేయాలో అంత అనుభవింపచేస్తాడు. మనం చేసిన వాటిని కొంత దాచుకొని కొంత ముందరపెట్టి కొంత అనుభవింపచేస్తాడు. కాలం కర్మ స్వభావం - ఈ మూడింటిని తన మాయ చేతా ఉంచాడు పరమాత్మ. ఆయన సంకల్పం చేత ఇచ్చిన దానిని మాత్రమే ఇచ్చినంత ఇచ్చిన రీతిలో నేను స్వీకరిస్తాను. ఆయన సంకల్పంతో లభించిన దాన్ని స్వీకరిస్తున్నాను. దాన్నే కొందరు కాలమంటారు (కాలం కలిసి రాలేదనీ) కర్మ (కర్మం కలిసి రాలేదని ) అంటారు స్వభావం (వాడి స్వభావం అంతే అని) అంటారు.

కాలాద్గుణవ్యతికరః పరిణామః స్వభావతః
కర్మణో జన్మ మహతః పురుషాధిష్ఠితాదభూత్

ఏ గుణాలు లేనట్లు కనపడే ప్రకృతిలో గుణాలు కాలం చేతనే కనపడతాయి. సృష్టి చేయాలంటే గుణాల్లో వైషమ్యం ఉండాలి. ఈ గుణ వ్యతికరం వలనే పరిణామం (మార్పు) వస్తుంది. గుణాల్లో హెచ్చు తగ్గు కాలం వలన, గుణాల్లో మార్పు స్వభావం వలన వస్తుంది.
ఈ రెండూ ఐతే కర్మ ఏర్పడుతుంది. మహత్ తత్వం పుడుతుంది. ప్రకృతిలో గుణ వ్యతికరం ఏర్పడి పరిణామం ఏర్పడితే మహత్ పుడుతుంది. ఈ మహత్ తత్వం కేవలం ప్రకృతి వలన పుట్టదు - అందులో పరమాత్మ అదిష్టిస్తాడు.

మహతస్తు వికుర్వాణాద్రజఃసత్త్వోపబృంహితాత్
తమఃప్రధానస్త్వభవద్ద్రవ్యజ్ఞానక్రియాత్మకః

ఆ మహత్ తత్వాన్ని క్షోభింపచేస్తాడు స్వామి. ఆ మహత్ తత్వం నుండి అహంకారం పుడుతుంది. ఈ అహంకారం మూడు విధములు. సాత్విక అహంకారం నుండి ఇంద్రియ అధిష్టాన దేవతలు మనసు పుడతాయి. రాజస అహంకారం యొక్క సహకారమున్న సాత్వికాహంకారం వలన పంచ జ్ఞ్యాన కర్మేంద్రియములు పుడతాయి. తామసాహంకారం నుండి - పంచభూతములు పుడతాయి.
ఇవే ద్రవ్య (భూతములు) జ్ఞ్యాన (జ్ఞ్యానేంద్రియాలు) క్రియలు (కర్మేంద్రియాలు) - తామస రాజస సాత్వికములు.

సోऽహఙ్కార ఇతి ప్రోక్తో వికుర్వన్సమభూత్త్రిధా
వైకారికస్తైజసశ్చ తామసశ్చేతి యద్భిదా
ద్రవ్యశక్తిః క్రియాశక్తిర్జ్ఞానశక్తిరితి ప్రభో

మూడుపేర్లతో మూడు రకాలుగా ఏర్పడిన వాటిని అహంకారములు అహంకార తత్వం అంటారు. సాత్విక రాజస తామస భేధములతో ద్రవ్య జ్ఞ్యాన క్రియ స్వరూపముతో మనము పిలవబడేదాన్ని అహంకార తత్వం అంటారు. దీని నుంచే మనసు పుట్టింది.
సాత్వికం అంటే వైకారికం
రాజసం అంటే తైజసం
వీటికే పేరు పంచ బూతములు (ద్రవ్య శక్తి) జ్ఞ్యానేంద్రియములు (న్యాన శక్తి) కర్మేంద్రియాలు (క్రియా శక్తి)
క్షోభింపజేయబడిన ప్రకృతినుండి మహత్ తత్వం, క్షోభింపజేయబడిన మహత్ నుండి అహంకార తత్వం, ఈ అహంకారమే మూడు రకాలు. ప్రకృతి గుణాలు అహంకారం వచ్చకే బయట పడతాయి. ఈ అహంకారమే మూడు రకాలు. దాని నుండే ఇంద్రియ అధిష్టాన దేవతలు మనసు పుడతాయి. రాజస + సాత్వికంతో పది ఇంద్రియాలు పుడతాయి. ఇందులో రాజసం పాలు ఎక్కువ. అందుకే ఇంద్రియాలకు ఉండేది ప్రవృత్తి (ప్రవర్తకం)

తామసాదపి భూతాదేర్వికుర్వాణాదభూన్నభః
తస్య మాత్రా గుణః శబ్దో లిఙ్గం యద్ద్రష్టృదృశ్యయోః

తామస అహంకారానికి పేరు భూతాది అని పేరు. భూతాది అంటే తన్మాత్రలు. పంచ భూతాల గుణాల (శబ్ద స్పర్శ రూప రస గంధములు) యొక్క సూక్ష్మ రూపం ఈ తన్మాత్రలు. ముందు గుణం పుట్టే ద్రవ్యం పుడుతుంది. గుణాన్నాశ్రయించే ద్రవ్యం ఉంటుంది.  ఈ గుణం కంటే ముందు కూడా ఆ గుణం యొక్క సూక్ష్మావస్థ ఉండాలి. (చెట్టుకు ముందు బీజం ఏర్పడ్డట్టు - చెట్టు గుణం ఐతే, మొలక తన్మాత్ర). ఈ తన్మాత్రలంటే పంచభూతాల మొదటి దశ. ఈ తామస అహంకారానికి భూతాది అని పేరు
తామస అహంకారమునుండి పుట్టేది శబ్ద తన్మాత్ర - దాని నుండి పుట్టేది శబ్దం - దాని నుండి పుట్టేది ఆకాశం
శబ్ద తన్మాత్ర - శబ్దం - ఆకాశం
ఆకాశం నుంచి స్పర్శ తన్మాత్ర - దాని నుండి స్పర్శ - దాని నుండి వాయువు పుట్టింది
వాయువు నుండి రూప తన్మాత్ర - దాని నుండి రూపం - రూపం నుండి అగ్ని
అగ్ని నుండి రస తన్మాత్ర - దాని నుండి రసం - రసం నుండి జలం
జలం నుండి గంధ తన్మాత్ర - దాని నుండి గంధం - గంధం నుండి పృధ్వి పుట్టింది.
పంచభూతముల కంటే ముందు పుట్టేవి వాటి గుణాలు, ఆ గుణాలకంటే ముందు పుట్టేవి తన్మాత్రలు. వీటినే "గీతలో" "మాత్రస్పర్శాస్తు" అన్నారు.
శబ్దో లిఙ్గం యద్ద్రష్టృదృశ్యయోః - శబ్దం ద్రష్టకి దృష్యానికి గుర్తు. పేరులేకుండా మనం దేన్నీ గుర్తుపట్టలేము. అందుకే శబ్దాన్ని చూడబడే దానికీ చూచేదానికి చిహ్నం అంటారు శబ్దాన్ని

నభసోऽథ వికుర్వాణాదభూత్స్పర్శగుణోऽనిలః
పరాన్వయాచ్ఛబ్దవాంశ్చ ప్రాణ ఓజః సహో బలమ్

ఆకాశం వికారం చెందితే అందులోంచి స్పర్శ గుణం పుట్టింది. అందులోంచి వాయువు పుట్టింది.  వాయువు ఆకాశం నుండి వచ్చింది కాబట్టి దాని గుణం కూడా ఉంటుంది. శ్పర్శతో బాటు శబ్దం కూడా ఉంటుంది.
వాయువుకి మూడు గుణాలు 1. ఓజ: ప్రవర్తింపచేసే లక్షణం 2. సహ: వేగాన్ని సహ అంటారు 3. బలం: ధరించే శక్తి. ఈ మూడిటినే ఇంద్రియములు (ఓజ - ప్రవర్తిచేవి ఇంద్రియాలు), మనసు (సహ - మనో వేగం) , శరీరం (బలం) అని కూడా అనవచ్చు. వాయువు ఈ మూటిలో ఉంటుంది. ఈ వాయువే ప్రాణ రూపంలో కూడా ఉంటుంది.

వాయోరపి వికుర్వాణాత్కాలకర్మస్వభావతః
ఉదపద్యత తేజో వై రూపవత్స్పర్శశబ్దవత్
తేజసస్తు వికుర్వాణాదాసీదమ్భో రసాత్మకమ్
రూపవత్స్పర్శవచ్చామ్భో ఘోషవచ్చ పరాన్వయాత్
విశేషస్తు వికుర్వాణాదమ్భసో గన్ధవానభూత్
పరాన్వయాద్రసస్పర్శ శబ్దరూపగుణాన్వితః

కాలం కర్మ స్వభావం వలన వాయువు వికారం చెందితే, వాయువు నుంచి అగ్ని పుడుతుంది. రూపంతో
బాటు స్పర్శ శబ్దం కూడా ఉంటాయి. ఈ తేజస్సు వికారం చెందితే జలం పుడుతుంది. ఇందులో రూపం శబ్ద స్పర్శలతో బాటు రసం కూడా ఉంటుంది.
పృధ్విలో ఐదు గుణాలు వస్తాయ్ శబ్ద స్పర్శ రూప రస గంధం కూడా ఉంటాయి. అనతకంటే పైవాటితో అన్వయించడం వలన (పరాన్వయాత్) గంధంతో బాటు నాలుగు గుణాలూ ఉంటాయి.

వైకారికాన్మనో జజ్ఞే దేవా వైకారికా దశ
దిగ్వాతార్కప్రచేతోऽశ్వి వహ్నీన్ద్రోపేన్ద్రమిత్రకాః

సాత్వికాహంకారం (వైకారికా) నుండి మనసు ఏర్పడింది. పుట్టబోయే జ్ఞ్యానేంద్రియ కర్మేంద్రియ అధిష్టాన దేవతలు కూడా పుడతారు.
1 దిక్ 2. వాత 3. అర్క 4.ప్రచేతా 5.అశ్వి 6.వహ్ని 7.ఇంద్ర 8.ఉపేంద్ర 9.మిత్ర 10. కా
1 దిక్ - శ్రోత్రేంద్రియానికి దిక్కు
2. వాత - త్వగ్ ఇంద్రియానికి వాత (వాయువు)
3. అర్క - చక్షు ఇంద్రియానికి అర్క
4.ప్రచేతా - రసనేంద్రియానికి ప్రచేతులు (జిహ్వకు)
5.అశ్వి - నాసిక
6.వహ్ని - వాక్కుకు అగ్ని
7.ఇంద్ర - హస్తములకు
8.ఉపేంద్ర - పాదములకు ఉపేంద్రుడు (విష్ణువు)
9.మిత్ర - పాయు ఇంద్రియానికి మిత్రుడు
10. కా - ఉపస్థ కి ప్రజాపతి
వీరందరూ సాత్వికాహంకారం నుండి పుట్టారు

తైజసాత్తు వికుర్వాణాదిన్ద్రియాణి దశాభవన్
జ్ఞానశక్తిః క్రియాశక్తిర్బుద్ధిః ప్రాణశ్చ తైజసౌ
శ్రోత్రం త్వగ్ఘ్రాణదృగ్జిహ్వా వాగ్దోర్మేఢ్రాఙ్ఘ్రిపాయవః

రాజసాహంకారం చేతా (ఇంద్రియాలు కేవలం రాజస అహంకారంచేత మాత్రమే కాకుండా, రాజస అహంకారం చేత సహకరించబడిన సాత్విక అహంకారం చేత) పది ఇంద్రియాలు పుట్టాయి. ఇది జ్ఞ్యాన శక్తి క్రియా శక్తి (పది ఇంద్రియాలు) వాటి శక్తి అయిన బుద్ధి రాజస అహంకారం చేత పుట్టాయి
శ్రోత్రం త్వక్ ఘ్రాణ దృక్ జిహ్వ వాక్ దో (హస్తములు) మేడ్రం (ఉపస్థ) అంఘ్రి (పాదములు) పాయువు.

యదైతేऽసఙ్గతా భావా భూతేన్ద్రియమనోగుణాః
యదాయతననిర్మాణే న శేకుర్బ్రహ్మవిత్తమ

ఇవన్నీ అసంగతా భావ (పంచ జ్ఞ్యానేంద్రియాలు కర్మేంద్రియాలు, అధిష్టాన దేవతలూ పంచ భూతములు మనసు అన్నీ కలిపి 25 మంది -వీటికి తమలో తాము కలవాల్సిన భావ స్వారూప్యం వాటంతట వాటికి ఉండదు ), ఇవన్నీ కలిస్తే శరీరం అవుతుంది. ఆ శక్తి వాటికి లేదు. ఒక ఆయతనమును (ఆకారమును) కల్పించడానికి శక్తి సరిపోకపోయినపుడు భగవానుడు తన శక్తితో వాటిని ప్రేరేపించి కలుపుతాడు.

తదా సంహత్య చాన్యోన్యం భగవచ్ఛక్తిచోదితాః
సదసత్త్వముపాదాయ చోభయం ససృజుర్హ్యదః

అపుడు ఆ ఆకారాన్ని సత్ - అసత్ అని అంటారు. అంటే అంతకు ముందు ఉన్నదే ఏర్పడింది, కాబట్టి ఉన్నదే పుట్టింది, కాబట్టి సత్. విడి విడి గా ఉన్నవి కలవడం వలన అంతకు ముందు లేనిది పుట్టింది, కాబట్టి అసత్. సత్ అసత్ రెండిటికీ ఆధారం పరమాత్మే.

వర్షపూగసహస్రాన్తే తదణ్డముదకే శయమ్
కాలకర్మస్వభావస్థో జీవో ఞ్జీవమజీవయత్

ఇలా ఏర్పడిన ఆకారం ఒక అండములా ఏర్పడింది. అండము స్వతంత్ర్యంగా ఉండలేదు. పంచభూతాలలో చాలనా శక్తి ఉన్న జలం అండముని ఆవరించింది. ఈ అండము చుట్టు జలముంది. జలములోనే అండముంది. ఈ జలాన్నే అండ జలం, ప్రకృతి జలం మూల జలం అంటాం. ఇందులో పరమాత్మ ప్రవేశించాడు. ఆయననే బ్రహ్మ అంటాం. అందులో ప్రవేశించి ఆ అండాన్ని భేధించాడు.
పరమాత్మ అండములోకి ప్రవేశించి అందులో ఉన్న జీవ శక్తిని ప్రాణములు కల్పించి బ్రతికించాడు. పరమాత్మ అందులో చేరి తాను ఆవిర్భవించాడు. ఈయననే విరాట్ పురుషుడు సూత్ర గర్భుడు అనిరుద్ధుడు అంటాము. తరువాత ఈయన సకల అవయములతో సకల సృష్టీ జరిగింది. అండమూ బ్రహ్మాండమే, అందులోంచి పుట్టిన సృష్టి కూడా బ్రహ్మాండమే. ఆయన లేకుంటే మనకు జీవమూ ప్రాణమూ లేదు. 25 తత్వాలు కలిసినా వాటిలో సృష్టిచేయు శక్తి లేదు. అంటే కేవలం కలయిక వలన సృష్టి జరగదు. పరమాత్మ సంకల్పంతోనే జరిగేది సృష్టి. ఆ కలయికలో జీవ శక్తి ప్రాణం, చైతన్యం ఆవిర్భవిస్తేనే సృష్టి. ప్రాణ శక్తి చైతన్య శక్తి అయిన పరమాత్మ, ఆ రెండూ లేని వాటిలో జీవ శక్తిని చేకూర్చాడు (జీవమజీవయత్). దీన్నే సమష్టి సృష్టి అనటారు. ఇదే అనిరుద్ధ తత్వం, బ్రహ్మ తత్వం, విరాట్ పురుష తత్వం.

స ఏవ పురుషస్తస్మాదణ్డం నిర్భిద్య నిర్గతః
సహస్రోర్వఙ్ఘ్రిబాహ్వక్షః సహస్రాననశీర్షవాన్

ఎపుడైతే పరమాత్మ ప్రాణ శక్తి ఏర్పరిచాడో, ఆ అండాన్ని భేధించుకుని పురుషుడు వచ్చాడు. అతను సహస్ర ఊరు అంఘ్రి బాహు అక్ష శీర్షములతో ఉన్నడు. సహస్ర అంటే అనంతం అని అర్థం. అంటే జ్ఞ్యాన కర్మేంద్రియాలు పంచ్భూతాలు - అనంత క్రియా శక్తి అనత జ్ఞ్యాన శక్తి అనంత ద్రవ్య శక్తి కలవాడుగా ఒక పురుషుడు వచ్చాడు. అందుకే ఆయనను సహస్రుడు అంటారు

యస్యేహావయవైర్లోకాన్కల్పయన్తి మనీషిణః
కట్యాదిభిరధః సప్త సప్తోర్ధ్వం జఘనాదిభిః

ఆయన అవయములతోనే సకల లోకములేర్పడ్డాయి (లోకులు మాత్రమే కాదు, లోకములు కూడా ఏర్పడ్డాయి) అని జ్ఞ్యానులు అంటారు. నడుము నుండి కింది భాగంతో కింది ఏడు, పై భాగంతో పై ఏడు లోకాలు ఏర్పడ్డాయి.

పురుషస్య ముఖం బ్రహ్మ క్షత్రమేతస్య బాహవః
ఊర్వోర్వైశ్యో భగవతః పద్భ్యాం శూద్రో వ్యజాయత

బ్రాహ్మణులు క్షత్రియ వైశ్య శూద్రులు, నాలుగు ఆశ్రములు, అన్ని లోకాలు పుట్టాయి

భూర్లోకః కల్పితః పద్భ్యాం భువర్లోకోऽస్య నాభితః
హృదా స్వర్లోక ఉరసా మహర్లోకో మహాత్మనః

పాదములనుండి భూలోకం, భువర్లోకం నాభి నుండి, ఉదరం నుండి స్వర్లోకం, వక్షస్థలం నుండి మహా లోకం,

గ్రీవాయాం జనలోకోऽస్య తపోలోకః స్తనద్వయాత్
మూర్ధభిః సత్యలోకస్తు బ్రహ్మలోకః సనాతనః

(మెడ)గ్రీవం నుండి జనలోకం , స్తనద్వయం నుండి తపోలోకం, తల నుండి సత్యం.

తత్కట్యాం చాతలం క్లృప్తమూరుభ్యాం వితలం విభోః
జానుభ్యాం సుతలం శుద్ధం జఙ్ఘాభ్యాం తు తలాతలమ్

కటి నుండి (నడుము) అతలం , ఊరువుల నుండి వితలం, మోకాలనుండి సుతలం, పిక్కలనుండి తలాతలం
మడమ నుండి మహాతలం

మహాతలం తు గుల్ఫాభ్యాం ప్రపదాభ్యాం రసాతలమ్
పాతాలం పాదతలత ఇతి లోకమయః పుమాన్

పైపాదల నుండీ రసాతలం అరికాళ్ళనుండి పాతాలం. భూతమయ: ఇంద్రియ మయ: విజ్ఞ్యానమయ; ప్రాణి మయ: లోకమయ: - పరమాత్మ పంచరూపాలనే పంచాయతనం అని, అర్థ పంచకం అని, పంచ అవయవ శక్తి అంటాం. అందుకే పంచాహ్నిక ప్రక్రియ ఆరాధనంలో వచ్చింది

భూర్లోకః కల్పితః పద్భ్యాం భువర్లోకోऽస్య నాభితః
స్వర్లోకః కల్పితో మూర్ధ్నా ఇతి వా లోకకల్పనా

భూ భువ సువ అనే లోకాల గురించి మాత్రమే చూచుకుంటే. భూలోకం పాదాలనుండి భువర్లోకం నాభినుండి సువర్లోకం శిరసు నుండి అని అంటారు
సముద్రంలో ఎంత జలం ఉన్నా కావలిసినంతే తీసుకుంటాం. జ్ఞ్యాని అయిన వాడు వేదాలు ఎన్ని కామ్య కర్మలు చెప్పినా, ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటాడు.