Pages

Saturday, 1 February 2014

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 2

1. వేటకు వెళ్ళెప్పుడు ఋషులు ఆశ్రమానికి వెళ్ళకూడదు. వేటలో మన మనసు రాజస తామస గుణాలతో ఉంటుంది. ఋషుల ఆశ్రమం సాత్విక గుణంతో ఉంటుంది. పరీక్షిత్తు వెళ్ళి శాపం పొంది వచ్చాడు. కార్తవీర్యార్జనుడు వెళ్ళాడు మొదటికే మోసం వచ్చింది, విశ్వామిత్రుడు వెళ్ళాడు అవమానం పాలయ్యాడు, దుశ్యంతుడు వెళ్ళాడు బాధలు పడ్డాడు. వేటకు వెళ్ళకుండా వెళ్ళినవారు బాగుపడ్డారు. రాముడు భరతుడు, రఘు మహారాజు, దిలీపుడు, ఇక్ష్వాకు. 


2. చనిపోయిన ఏ దేహాన్నైనా తాకచ్చుగాని సర్పదేహాన్ని తాకకూడదు. ముట్టుకుంటే ఆ చంపిన పాపం వస్తుంది.
పరీక్షిత్తు  ప్రాణంపోయిన సర్పాన్ని ధనువు యొక్క కొసతో తీసి (ధనుష్కోట్యా ) ఆయనమీద వేసి వెళ్ళాడు. కలిపురుషుడు అడిగిన కొన్ని స్థాలాల్లో బంగారం ఒకటి. ఆయన్ కిరీటాన్ని నెత్తినపెట్టుకుని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే ఆ విషయం గుర్తుకు వచ్చింది. ఆయన పెట్టుకున్న కిరీటం జరాసంధుడిది. ఒకరు వాడే వస్తువులు ఇంకొకరు వాడకూడదు. ఆ వ్యక్తికీ వస్తువుకీ ఉన్న సంబంధంతో ఆ వ్యక్తి గుణాలు ఆ వస్తువుకి వస్తాయి.(ఈ భాగం పాద్మపురాణంలో స్కాంధపురాణంలో ఉంది. )

3. ఆత్మ అచ్చేద్యం - శరీరం దేహం. ఆత్మ అక్లేద్యం - శరీరం క్లేద్యం. తన స్వరూపానికి పరిపూర్ణంగా విరుద్దమైన స్వరూపం గల దానిలో (శరీరంలో) చిక్కుకున్నది ఆత్మ. జడమైన శరీరంలో చైతన్యం ఉన్న ఆత్మ ఉంది. తనకన్న తక్కువ దానిలో, తన కన్న తక్కువ అయిన దానిలో ఉంది ఆత్మ. నశించే శరీరంలో ఉండే ఆత్మ మళ్ళీ అలాంటి శరీరంలో ఉండకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి
శ్రోతవ్యాదిషు యః పరః - వినదగిన దానిలో ఇదే చివరిది శ్రేష్టమైనది. తెలియవలసినదేమిటో తెలియవలసిన మనమేమిటో తెలియవలసిన ఉపాయం ఎమిటో తెలిస్తే కలిగే ఫలమేమిటో, అది తెలియకుండా ఆపేది ఎమిటో తెలియాలి. దీన్నే అర్థ పంచకం అంటారు. మనం పరమాత్మని చేరాలి. పరమాత్మ ఎలా ఉంటాడు పరమాత్మను చేరే మన స్వరూపం ఏమిటి, పరమాత్మని చేరడానికి ఉపాయం ఏమిటి, పరమాత్మని చేరితే ఫలం ఏమిటి, పరమాత్మని చేరకుండా ఆపేది ఏమిటి. ఈ అయిదవదైన విరోధి జ్ఞ్యానం అన్నిటికన్నా బలీయమైనది. ఇన్ని కోట్లమందిని అడ్డగిస్తోంది అంటే అది ఎంత బలీయము. పరమాత్మ కంటే జీవాత్మ కంటే ఉపాయం కంటే ఫలం కంటే బలీయం. మనని పరమాత్మని చేరకుండా ఆపేది ఏమిటి.

4. నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన చ వా వయః
దివా చార్థేహయా రాజన్కుటుమ్బభరణేన వా

జీవితమునకు రాత్రి పగలు వయసు ముఖ్యములు. మనము వృధాగా గడిపేది ఈ మూడింటిని. పగలు ఎలా గడుపుతున్నాము రాత్రి ఎలా గడుపుతున్నాము. ఈ పగలూ రాత్రీ రెండూ ఉండే వయసును ఎలా గడుపుతున్నాము. ఇవి తెలుసుకుంటే వైరాగ్యం అదే వస్తుంది. పగలంతా అర్థం సంపాదించడంలో, కుటుంబం పోషించడంలో గడుపుతున్నాము. పగలు ఇంత కష్టపడి రాత్రి నిద్రలో గడుపుతాము. ఈ రెంటితో ఉంటే ఇబ్బందిలేదు గానీ, ఈ రెండూ వయసుకోసం అని అనుకొని స్త్రీ పురుష సంగమానికి (వయః) గడుపుతాము. సంగమానికోసమే అర్థం సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం, నిద్రపోవడం చేస్తాం. దానికోసమే అన్నీ కూర్చుకుంటాము. భగవంతుడు ఇచ్చిన మూడింటినీ దానికోసం పాడుచేస్తున్నాము.

5. జితాసనో జితశ్వాసో జితసఙ్గో జితేన్ద్రియః - ముందు శరీరానికి స్థిరత్వాన్ని ఏర్పరచాలి. కూర్చున్న భంగిమలో మార్పు రాకూడదు. అదే ఆసన్ విజయం. మన ముక్కుకు రెండు నాళికలుంటాయి, సూర్య నాళిక చంద్ర నాళిక. ప్రతీ నలుగున్నర నిముషాలకు మారుతూ ఉంటుంది. శ్వాస ఏ వైపుందో గుర్తిస్తే ఆ శ్వాస వెళ్ళే మార్గాన్ని మార్చుకోవచ్చు. సూర్య నాళం జ్ఞ్యాన మార్గమైతే చంద్ర నాళం భక్తి మార్గం. నిరాకారం యందు మనసు లగ్నం చేయాలంటే సూర్యనాళిక వాయు శ్వాసతో చేయాలి. భక్తి మార్గానికి చంద్రనాళిక. మొదట మనసు దాని మీద ఉంచడం మొదలుపెట్టాలి, కూర్చున్నా నించున్న. ఏ నాసికా రంధ్రం నుండి శ్వాస బయటకు వెళ్తొంది, ఎక్కడ శ్వాస నిలుస్తోందో, గుర్తించాలి. మరి మామూలుగా మనకు ఎందుకు ఇది తెలియట్లేదు. మనం తీస్తున్న శ్వాసే కదా? మన మనసు అక్కడ లేదు కాబట్టి.
సూర్యనాళిక నిరోధం వచ్చిన వాడు యోగి అవుతాడు, చంద్ర నాళిక యందు సాధన చేసిన వాడు భోగి అవుతాడు.
మనం అనుకున్నప్పుడు మనం అనుకున్న నాళము నుండి శ్వాస విడుచుట పీల్చుట చేయగలిగితే మనసు మనం చెప్పినట్టు వింటుంది. జ్ఞ్యాన సాధనకు అవసరమయ్యే పనులలో సూర్యనాళంలో శ్వాస తీసుకోవాలి. సూర్య నాళంలో శ్వాస తీసుకున్నప్పుడు హృదయ వేగం తగ్గుతుంది. అంటే భోగం యందు మనసు ఎపుడు లగ్నం చేసామో (చంద్ర నాళం నుండి శ్వాస తీసుకునేప్పుడు, మన కోరిక తీరుతుందో లేదో అన్న ధ్యాసలో మన హృదయస్పందన హృదయ వేగం పెరుగుతుంది).శ్వాస నియమంతో హృదయ గతి యొక్క నియమం కలుగుతుంది, మనోనియమం కలుగుతుంది, దానితో ఇంద్రియనిగ్రహం కలుగుతుంది, దానితో ధారణ కలుగుతుంది, ధ్యానం నిలుస్తుంది.

6. సర్వధీవృత్త్యనుభూతసర్వ  - ప్రపంచంలో ఉండే అన్ని రకాల ప్రాణుల బుద్ధి వృత్తులు ఆయనే, ఆ బుద్ధి వృత్తులకి జరిగే అనుభవం కూడా ఆయనే. (దదామి బుద్ధియోగం... అన్నట్లుగా) బుద్ధి ఆయనే ఇచ్చి ఆలోచన ఆయనే ఇచ్చి సంకల్పం ఆయనే కలిగించి పని అతనే చేయిస్తాడు. ఇది గుర్తిస్తే మన అహంకారం పోతుంది. అలా అనుకున్న వాడికి పరమాత్మ పాప బుద్ధి కలిగించడు.  (అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. ) కర్తుత్వ భోక్తృత్వ జ్ఞ్యాతృత్వ అభిమాన రాహిత్యం ఏర్పడితే పరమాత్మ యందు ధారణ ఉంచగలం. ప్రపంచంలో ఉండే అన్ని రకాల ప్రాణులు బుద్ధి వృత్తులు పరమాత్మే. ఆ బుద్ధి వృత్తుల చేత అనుభవించబడే అన్ని అనుభవాలు ఆయనే, అన్ని ఆత్మలూ ఆయనే.

7. మనకు కనపడే శరీరం స్థూల దేహం, ఈ దేహాన్నించి బయటకు వెళ్ళేవాడు సూక్ష్మ దేహంతో వెళ్తాడు. ఆ సూక్ష్మ దేహంలో జ్ఞ్యాన కర్మ ఇంద్రియాలు మనసు బుద్ధి చిత్తం అంత: కరణం ఉంటాయి. ఎక్కువ పుణ్యం ఉంటే భోగ దేహంతో వెళ్తాడు, అది సూక్ష్మ దేహము నుంచే వస్తుంది. పాపాలే ఎక్కువ చేస్తే అతనికి యాతనా దేహం వచ్చి నరకానికి ముందు వెళ్తాడు. ఆ దేహం ఉల్లిపొరలో పదహారవ వంతు ఉంటుంది. ఈ రెండూ కాక అతల వితల సుతల లోకాలకు వెళ్ళవలసి వస్తే సంవిత్ దేహం వస్తుంది (అక్కడ ఉన్న భోగాలు ఇంకాస్త ఎక్కువ కాబట్టి ఆ అనుభవించే దేహం ఆ ప్రకారంగా నిర్మింపబడుతుంది. ) ఊర్ధ్వ లోకాలనే జనో మహో తపో లోకాలకి వెళ్ళవలసి వస్తే జ్యోతిర్దేహం వస్తుంది. ఇవి కాక బ్రహ్మాండ కటాహాన్ని దాటి విరజా నదిలో స్నానం చేసిన తరువాత వచ్చిన దేహం పంచ ఉపనిషన్మయ దివ్య దేహం. ఇలా మనకు మొత్తం ఏడు దేహాలు ఉంటాయి. పితృ స్వర్గాది లోకాలను చేరాలనుకునే వారు సూక్షం దేహంతో వెళ్తారు. ఆ స్థితిలో ఇంద్రియ వర్గం ఉంటుంది మనసు ఉంటుంది. ఆ స్థితిలో అష్టాదిపత్యం  (అణిమ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వసిత్వం ) పొంది.

8. పరమాత్మకు సర్వాత్మనా సేవ చేయని నాడు మానవ జన్మ పొందుట వ్యర్థము. భగవత్ భాగవత ఆచర్య కైంకర్యముతోటే మానవ జన్మ విశిష్టం. అది తప్ప మిగతా క్రియలన్నీ ప్రాణులన్నీ చేసేవే. జ్ఞ్యానం వివేకం మానవుని సొత్తు. వివేకం అంటే వేరు చేసి చూచుట. వేరుగా ఉన్న వాటిని వేరుగానే చూచుట. వేరుగా ఉన్న వాటిని ఒకటిగా చూస్తే అవివేకం. శరీరం ఆత్మ రెండు ఒకటే అనేది అవివేకం. పరమాత్మ ఉండటం వలనే ఆత్మకి ఉనికి ఏర్పడింది. ఆత్మ ఉండటం వలనే శరీరనికి ఉనికి ఏర్పడింది. నా శరీరం నాకు ఇష్టమనే వాడు తనకి తెలియకుండానే పరమాత్మని ఇష్టపడుతున్నాడు.

9. మూడు శ్లోకాలను సుభద్ర స్తుతి అంటారు. వీటిని నిత్యం పారాయణ చేస్తే పద్దెనిమిది పురాణాల సారాంశం ఇందులో ఉంది.

యత్కీర్తనం యత్స్మరణం యదీక్షణం యద్వన్దనం యచ్ఛ్రవణం యదర్హణమ్
లోకస్య సద్యో విధునోతి కల్మషం తస్మై సుభద్రశ్రవసే నమో నమః

ఎవరి కీర్తన స్మరణ ధ్యానం వందనం కథలు వినుట పూజించుట (అర్హణం) వెంటనే లోకాల యొక్క పాపాలు పోగొడుతుందో అటువంటి పరమ మంగళ కీర్తి కలవానికి నమస్కారం.

విచక్షణా యచ్చరణోపసాదనాత్సఙ్గం వ్యుదస్యోభయతోऽన్తరాత్మనః
విన్దన్తి హి బ్రహ్మగతిం గతక్లమాస్తస్మై సుభద్రశ్రవసే నమో నమః

వివేకం కలవాడు (విచక్షణా ) ఎవరి పాద పద్మములను చేరడం వలన, ఇహముయందు పరముయందూ మనసుకు గల ఆసక్తి తొలగించుకొని, అన్ని శ్రమలు అలసటలు బాధలు తొలగిపోయి పరమాత్మ పాదములను ఆశ్రయించడం వలన పరమాత్మను పొందుతారు. అలాంటి స్వామికి నమస్కారం

తపస్వినో దానపరా యశస్వినో మనస్వినో మన్త్రవిదః సుమఙ్గలాః
క్షేమం న విన్దన్తి వినా యదర్పణం తస్మై సుభద్రశ్రవసే నమో నమః

కొందరు తపస్వులు కొందరు దానపరౌలు, కొందరు కీర్తిని పొందిన వారు, ఇంకొందరు బుద్ధిమంతులు, కొంతమంది వైదికులు (మంత్ర విదులు), కొందరు పరమ పావనులు, ఇలాంటి వారు కూడా తాము ఆచరించినవి, తాము తమవి అనుకున్నవి ఎవరికి అర్పించకుంటే క్షేమాన్ని పొందలేరో అలాంటి పరమాత్మకు నమస్కారం. పొరబాటున కూడా నావి నావి అని అనుకోకుండా, ఒక వేళ నావి అని మనసు అనుకున్నా, అది పరమాత్మకు అర్పించాలి.

10. ఆత్మకు ఎటువంటి సంగం ఉండదు. ఉండే సంగం మనసుకే ఉంటుంది. మనసుకు సంగం ఉన్నప్పుడు ఆత్మకు బంధం ఎందుకు? మనసుతో ఉన్నందుకు. మనసుతో కోరుకున్నవన్నీ ఆత్మ తనవి అనుకుంటుంది. మనసుతో బంధించబడి ఉన్నతకాలం ఆత్మ సంసారంలో ఉంటుంది. ఆనదమయం విజ్ఞ్యానమయమైన ఆత్మకి మనసు యందు సంగముతో మనసు నాది అన్న భావన వలన ఆత్మ బంధములో ఉంటుంది. నా భార్య అనుకున్నప్పుడు భార్యకు కలిగిన కష్టాలన్ని ఎలా భర్తకు కూడా ఉంటాయో, నా మనసు అనుకున్నంత వరకూ మనసుకు కలిగిన సంగమంతా ఆత్మకూ ఉంటుంది

11. ఈ కింది శ్లోకం విద్యార్థులు చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి

ప్రచోదితా యేన పురా సరస్వతీ వితన్వతాజస్య సతీం స్మృతిం హృది
స్వలక్షణా ప్రాదురభూత్కిలాస్యతః స మే ఋషీణామృషభః ప్రసీదతామ్

బ్రహ్మకు కూడా ఎవరి అనుగ్రహంతో వాక్కు ( సరస్వతీ, వేదం) ప్రసన్నమై సృష్టి కలిగించే స్వచ్చమైన జ్ఞ్యానాన్ని ప్రసాదించిందో.  (భాగవత ప్రారంభ శ్లోకంలో ఉన్న 'తేనే బ్రహ్మ బృదా యదా ఆది కవయే' బ్రహ్మకు ఎవరి సంకల్పంతో వేదములను ఎవరుపదేశించారో)
అలాంటి బ్రహ్మ ఈ జ్ఞ్యానమును పొంది పరమాత్మ యొక్క స్వస్వరూప (స్వలక్షణా )జ్ఞ్యానాన్ని పొందాడో ఎవరి సంకల్పంవలన బ్రహ్మకు భాసించిందో అటువంటి ఋషులకు ఋషి అయిన స్వామి ప్రసన్నుడగు గాక 

స్వలక్షణ అంటే వేదం కూడా కేవలం వేదం కాకుండా - సృష్టి స్థితి సంహారములు, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములు,  హ్రస్వమూ ధీర్ఘము ప్లుతము ఉదాత్తము అనుదాత్తము స్వరితమూ, పశ్యంతి మద్యమా వైఖరీ (అందులో స్వరములు మూడు , అందులో భేధములు మూడు, ఇలా ఒక్క వర్ణం 32 రకములు ఉంటుంది, 'ఆ అన్నమంటే ఇది హ్రస్వమా ధీర్ఘమా ప్లుతమా? ఉదాత్తమా అనుదాత్తమా స్వరితమా, మంద్రమ మధ్యమమా ఉత్తమమా, తరమా వితారమా అనుతారమా, వివృతమా సంవృతమా, సంవృతములో మళ్ళీ ఉదాత్తమా అనుదాత్తమా, కంఠ్యమా లేక ఉపకంఠ్యమా  - ఇవన్నీ వేద లక్షణాలు, స్వరములతోటి  - మంద్ర మధ్య తారాది వర్ణ కంఠగత భేధములతోటి ఉర: కంఠ శిరోరాది స్థాన భేధములతోటి కంఠాల్వాది అవస్థా భేధములతోటి ఇన్ని రకములుగా ఉన్న వేదం)