Pages

Saturday, 1 February 2014

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం నాలుగవ అధ్యాయం

పరమాత్మకు సర్వాత్మనా సేవ చేయని నాడు మానవ జన్మ పొందుట వ్యర్థము. భగవత్ భాగవత ఆచర్య కైంకర్యముతోటే మానవ జన్మ విశిష్టం. అది తప్ప మిగతా క్రియలన్నీ ప్రాణులన్నీ చేసేవే. జ్ఞ్యానం వివేకం మానవుని సొత్తు. వివేకం అంటే వేరు చేసి చూచుట. వేరుగా ఉన్న వాటిని వేరుగానే చూచుట. వేరుగా ఉన్న వాటిని ఒకటిగా చూస్తే అవివేకం. శరీరం ఆత్మ రెండు ఒకటే అనేది అవివేకం. పరమాత్మ ఉండటం వలనే ఆత్మకి ఉనికి ఏర్పడింది. ఆత్మ ఉండటం వలనే శరీరనికి ఉనికి ఏర్పడింది. నా శరీరం నాకు ఇష్టమనే వాడు తనకి తెలియకుండానే పరమాత్మని ఇష్టపడుతున్నాడు.

సూత ఉవాచ
వైయాసకేరితి వచస్తత్త్వనిశ్చయమాత్మనః
ఉపధార్య మతిం కృష్ణే ఔత్తరేయః సతీం వ్యధాత్

శుకుని (వైయాసకేరితి ) ఆత్మ స్వరూప నిశ్చయం విని పరమాత్మ యందు బుద్ధిని నిలిపాడు ఉత్తరా పుత్రుడు (ఔత్తరేయః )

ఆత్మజాయాసుతాగార పశుద్రవిణబన్ధుషు
రాజ్యే చావికలే నిత్యం విరూఢాం మమతాం జహౌ

పరమాత్మయందు మనసు ఉంచాడు అనడం కంటే పరమాత్మయందే మనసు ఉంచాడు అని చెప్పవచ్చు. శరీరం భార్య పుత్ర, ఇళ్ళు, పశువులు, ద్రవిణం, వీటియందు తనది అన్న భావాన్ని విడిచిపెట్టాడు. ఎలాంటి లోటు లేని రాజ్యంలోకూడా (రాజ్యే చావికలే) ఎప్పటినుంచో పాతుకొని ఉన్న (విరూఢాం ) మమకారాన్ని విడిచిపెట్టాడు.

పప్రచ్ఛ చేమమేవార్థం యన్మాం పృచ్ఛథ సత్తమాః
కృష్ణానుభావశ్రవణే శ్రద్దధానో మహామనాః

ఇమమేవార్థం పప్రచ్ఛ  - మీరు నన్ను ఇపుడు ఏమని అడిగారో పరీక్షిత్తు అదే అడిగాడు. పరమాత్మ యొక్క ప్రభావాన్ని వినడంలో శ్రద్దకలిగిన వాడు కాబట్టి ఈ విషయాన్నే అడిగాడు

సంస్థాం విజ్ఞాయ సన్న్యస్య కర్మ త్రైవర్గికం చ యత్
వాసుదేవే భగవతి ఆత్మభావం దృఢం గతః

పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలను కథలను వినాలనే శ్రద్ద కలగడానికి కారణం తాను త్వరలో మరణించబోతున్నాడని తెలుసుకొని (సంస్థాం ), మూడు గుణాల కర్మలను విడిచిపెట్టి (సన్న్యస్య ), మనకి నిజమైన ఆత్మ వాసుదేవుడే అని నిశ్చయ భావానికి వచ్చాడు

రాజోవాచ
సమీచీనం వచో బ్రహ్మన్సర్వజ్ఞస్య తవానఘ
తమో విశీర్యతే మహ్యం హరేః కథయతః కథామ్

విషయభోగ ఆసక్తి శూన్యా!, తాము సర్వజ్ఞ్యులు, (ప్రాకృతిక విషయభోగాలను ఆశించుటే పాపం - అఘం, మళ్ళీ జన్మనిచ్చేవన్నేఏ పాపాలే, ఐహికమైన కోరికలు కూడా పాపం కిందే వస్తాయి, భగవత్సంబంధమైతే పుణ్యం), మీరు చెప్తున్న కథలు వింటుంటే నా అజ్ఞ్యానం తొలగిపోతోంది

భూయ ఏవ వివిత్సామి భగవానాత్మమాయయా
యథేదం సృజతే విశ్వం దుర్విభావ్యమధీశ్వరైః

నిజమైన జ్ఞ్యానానికి అర్థం నాకేమీ తెలియదు అని తెలియడమే. శ్రీ హరి కథను వినడం వల్ల నా అజ్ఞ్యానం తొలగి తెలుసుకోవాలనిపించింది. భూయ ఏవ వివిత్సామి - తెలియాలనే కోరికా.
పరమాత్మ ఈ సకల చరాచర జగత్తుని ఎలా సృష్టించాడు. పరమాత్మ వేరుగా ఉండి సృష్టించాడా? ఎలా సృష్టించాడు.
దుర్విభావ్యమధీశ్వరైః - అధీశ్వరైః  దుర్విభావ్యం  - బ్రహ్మ రుద్రేందాదుల ఊహకు అందని ఈ సకల చరాచర సృష్టినీ ఎలా చేసాడు. ప్రపంచంలో ఎంత అద్భుతమైనా చూచి మానవ సృష్టి అంటున్నాం, మరి ఆ మానవున్నే సృష్టించిన భగవంతుని సృష్టి?

యథా గోపాయతి విభుర్యథా సంయచ్ఛతే పునః
యాం యాం శక్తిముపాశ్రిత్య పురుశక్తిః పరః పుమాన్
ఆత్మానం క్రీడయన్క్రీడన్కరోతి వికరోతి చ

సకల జగత్తుని రక్షిస్తున్నాడు (యథా గోపాయతి ), సంహరిస్తున్నాడు.
రక్షణ ఎలా చేస్తున్నాడు, సృష్టి ఎలా చేస్తున్నాడు, సంహారం ఎలా చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నది ఒక్కడేనా?
అనేక శక్తులు కలవాడు (పురుశక్తిః ) ఏ ఏ శక్తిని స్వీకరించి చేస్తున్నాడు. తనను ఆడిస్తుంటాడు, తాను ఆడుతుంటాడు. బ్రహ్మగారి రూపం పొంది, బ్రహ్మగారితో తానే ఉండి, బ్రమ్హగారితో తానే చేయిస్తాడు. ఆడించే వాడు ఆడేవాడూ తానే. ఆయనే ఏర్పాటు చేస్తాడు, పోగొడతాడు. ఉత్తరాభిమన్యుల వివాహానికి ఎంతగానో ప్రయత్నించిన కృష్ణుడు, ఉత్తర గర్భవతి కాగానే అభిమన్యున్ని లేకుండా చేసాడు. పరీక్షిత్తుని రక్షించడానికి గర్భానికి వెళ్ళి కాపాడాడు. పరీక్షిత్తుకి శాపం వచ్చేట్లు పరీక్షిత్తు బుద్ధినీ ఆయనే ప్రచోదనం చేసాడు.

నూనం భగవతో బ్రహ్మన్హరేరద్భుతకర్మణః
దుర్విభావ్యమివాభాతి కవిభిశ్చాపి చేష్టితమ్

ఈ స్వామివి అద్భుతకర్మలు. పరమాత్మ అన్ని చేష్టలూ లీలలూ జ్ఞ్యానులకి కూడా అందవు.

యథా గుణాంస్తు ప్రకృతేర్యుగపత్క్రమశోऽపి వా
బిభర్తి భూరిశస్త్వేకః కుర్వన్కర్మాణి జన్మభిః

ఈ పరమాత్మ ప్రత్యేకత ఏమిటంటే, సత్వ రజ తమో గుణాలని చేసి కూర్చి, మార్చి, ఆ గుణాల వలన కలిగే చరాచర ప్రపంచాన్ని భరిస్తాడు, ఆయనే సంహరిస్తాడు. ఈ చరాచర సృష్టిని భరించడానికే ఆయన అవతారాలు ఎత్తుతాడు. ప్రపంచంలో ఉండి కాపాడుతున్నాడు, ప్రపంచం బయట ఉండి కూడా కాపాడుతున్నాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత: ప్రపంచంలో పరమాత్మని, పరమాత్మలో ప్రపంచాన్ని చూడగలగాలి. లోపలా వెలుపలా ఉన్నవాడు తన అవతారములతో అన్ని కర్మలూ చేస్తూ విడిగా ఉండి భరిస్తున్నాడు, లోపల ఉండి కాపాడుతున్నాడు, బయట ఉండి సృష్టిస్తున్నాడు. పరశురామాది అవతారాలు ఎత్తినప్పుడు కూడా స్వామి వైకుంఠంలో ఉన్నాడు. అంటే స్వామి ఒక్కడా ఇద్దరా? ఒక్కడే అంటే వైకుంఠంలో ఉన్నాడంటే ఇక్కడ లేడా.

విచికిత్సితమేతన్మే బ్రవీతు భగవాన్యథా
శాబ్దే బ్రహ్మణి నిష్ణాతః పరస్మింశ్చ భవాన్ఖలు



సూత ఉవాచ
ఇత్యుపామన్త్రితో రాజ్ఞా గుణానుకథనే హరేః
హృషీకేశమనుస్మృత్య ప్రతివక్తుం ప్రచక్రమే

పరమాత్మ గుణములని చెప్పమని పరీక్షిత్తు శుకున్ని ఆహ్వానించాడు (ఉపామన్త్రితో).
ఇంద్రియాలకు అధిపతి అయిన హృషీకేశున్ని తలచుకొని బదులు చెప్పడం మొదలుపెట్టాడు

శ్రీశుక ఉవాచ
నమః పరస్మై పురుషాయ భూయసే సదుద్భవస్థాననిరోధలీలయా
గృహీతశక్తిత్రితయాయ దేహినామన్తర్భవాయానుపలక్ష్యవర్త్మనే

స్తోత్రంతోటే సమాధానం మొదలుపెట్టాడు శుకుడు. 'ఈయన పరమ పురుషుడు (పురుష ప్రకృతి కంటే అతీతుడు). సృష్టి స్థితి లయముల లీలకోసం సత్వ రజ తమో శక్తులను తీసుకున్నాడు. ఆయన మన అందరిలోనూ అంతరాత్మగా ఉంటాడు. ఆయన మనలోనికి ప్రవేశించినపుడు వెళ్ళినపుడు మనకి ఆయన ఏ దారిన వస్తున్నాడో వెళ్తున్నాడో ఎవరికీ తెలియదు. కృష్ణ పరమాత్మ అవతారం చాలించేప్పుడు 'ఈయన ఏ దారిలోంచి వెళ్తాడో చూద్దం' అని సర్వ దేవతలూ వచ్చి నిలుచున్నా ఎవరికీ అర్థంకాని రీతిలో ఆయన వెళ్ళిపోయాడు.

భూయో నమః సద్వృజినచ్ఛిదేऽసతామసమ్భవాయాఖిలసత్త్వమూర్తయే
పుంసాం పునః పారమహంస్య ఆశ్రమే వ్యవస్థితానామనుమృగ్యదాశుషే

సద్వృజినచ్ఛిదే - సత్ వృజిన చ్ఛిదే : సత్ పురుషుల పాపం (వృజినం) పోగెట్టే వాడు.
అసతామసమ్భవాయా - దుర్జనులను నశింపజేసేవాడు
అఖిలసత్త్వమూర్తయే - అన్ని ప్రాణులలో మూర్తీభవించినవాడు
పారమహంస్య ఆశ్రమే - సన్యాస ఆశ్రమంలో ఉన్నటువంటి (వ్యవస్థితానామ) పురుషులకు (పుంసాం ) వెతికేదాన్ని ఇచ్చేవాడు (అనుమృగ్యదాశుషే)

నమో నమస్తేऽస్త్వృషభాయ సాత్వతాం విదూరకాష్ఠాయ ముహుః కుయోగినామ్
నిరస్తసామ్యాతిశయేన రాధసా స్వధామని బ్రహ్మణి రంస్యతే నమః

పరమాత్మ యొక్క యథార్థమైన స్వరూపం కలిగిన వారికి (యోగులు) ప్రభువు (వృషభాయ )
కుయోగులకు పరమాత యే దిక్కున (కాష్ఠ - దిక్కు) ఉన్నాడో కూడా అర్థం కాదు
పరమాత్మతో సమానుడే లేనప్పుడు అంతకన్న ఎక్కువ అయిన వాడు ఇంకోడు ఉండడు (శృతి వాక్యం). దివ్యమైన తన తేజస్సుతో తనకంటే సామ్య అధికాలను నిరసించిన వాడు - నిరస్త సామ్య అతిశయేన.
తన ధామలోనే, తనలోనే తాను ఉండి సదా ఆనందించేవాడు, మనందరిలో ఉండి మన అందరికీ తన ఆనంద స్వరూపాన్ని అభివ్యక్తీకరించేవాడు.

ఇక్కడనుంచి మూడు శ్లోకాలను సుభద్ర స్తుతి అంటారు. వీటిని నిత్యం పారాయణ చేస్తే పద్దెనిమిది పురాణాల సారాంశం ఇందులో ఉంది.

యత్కీర్తనం యత్స్మరణం యదీక్షణం యద్వన్దనం యచ్ఛ్రవణం యదర్హణమ్
లోకస్య సద్యో విధునోతి కల్మషం తస్మై సుభద్రశ్రవసే నమో నమః

ఎవరి కీర్తన స్మరణ ధ్యానం వందనం కథలు వినుట పూజించుట (అర్హణం) వెంటనే లోకాల యొక్క పాపాలు పోగొడుతుందో అటువంటి పరమ మంగళ కీర్తి కలవానికి నమస్కారం.

విచక్షణా యచ్చరణోపసాదనాత్సఙ్గం వ్యుదస్యోభయతోऽన్తరాత్మనః
విన్దన్తి హి బ్రహ్మగతిం గతక్లమాస్తస్మై సుభద్రశ్రవసే నమో నమః

వివేకం కలవాడు (విచక్షణా ) ఎవరి పాద పద్మములను చేరడం వలన, ఇహముయందు పరముయందూ మనసుకు గల ఆసక్తి తొలగించుకొని, అన్ని శ్రమలు అలసటలు బాధలు తొలగిపోయి పరమాత్మ పాదములను ఆశ్రయించడం వలన పరమాత్మను పొందుతారు. అలాంటి స్వామికి నమస్కారం
 (ఆత్మకు ఎటువంటి సంగం ఉండదు. ఉండే సంగం మనసుకే ఉంటుంది. మనసుకు సంగం ఉన్నప్పుడు ఆత్మకు బంధం ఎందుకు? మనసుతో ఉన్నందుకు. మనసుతో కోరుకున్నవన్నీ ఆత్మ తనవి అనుకుంటుంది. మనసుతో బంధించబడి ఉన్నతకాలం ఆత్మ సంసారంలో ఉంటుంది. ఆనదమయం విజ్ఞ్యానమయమైన ఆత్మకి మనసు యందు సంగముతో మనసు నాది అన్న భావన వలన ఆత్మ బంధములో ఉంటుంది. నా భార్య అనుకున్నప్పుడు భార్యకు కలిగిన కష్టాలన్ని ఎలా భర్తకు కూడా ఉంటాయో, నా మనసు అనుకున్నంత వరకూ మనసుకు కలిగిన సంగమంతా ఆత్మకూ ఉంటుంది )

తపస్వినో దానపరా యశస్వినో మనస్వినో మన్త్రవిదః సుమఙ్గలాః
క్షేమం న విన్దన్తి వినా యదర్పణం తస్మై సుభద్రశ్రవసే నమో నమః

కొందరు తపస్వులు కొందరు దానపరౌలు, కొందరు కీర్తిని పొందిన వారు, ఇంకొందరు బుద్ధిమంతులు, కొంతమంది వైదికులు (మంత్ర విదులు), కొందరు పరమ పావనులు, ఇలాంటి వారు కూడా తాము ఆచరించినవి, తాము తమవి అనుకున్నవి ఎవరికి అర్పించకుంటే క్షేమాన్ని పొందలేరో అలాంటి పరమాత్మకు నమస్కారం. పొరబాటున కూడా నావి నావి అని అనుకోకుండా, ఒక వేళ నావి అని మనసు అనుకున్నా, అది పరమాత్మకు అర్పించాలి.
ఈ కీర్తి తపసు జ్ఞ్యానం మొదలైనవన్నీ ఇచ్చినవాడు కూడా ఆయనే.

కిరాతహూణాన్ధ్రపులిన్దపుల్కశా ఆభీరశుమ్భా యవనాః ఖసాదయః
యేऽన్యే చ పాపా యదపాశ్రయాశ్రయాః శుధ్యన్తి తస్మై ప్రభవిష్ణవే నమః

ప్రపంచంలో పరమపాపులెవరైతే ఉన్నారో, వీరందరూ ఎవరిని ఆశ్రయించినవారిని ఆశ్రయిస్తే (యదపాశ్రయాశ్రయాః - పరమాత్మ భక్తుల) వారి పాపాలు పోయాయో అటువంటి స్వామికి నమస్కారం

స ఏష ఆత్మాత్మవతామధీశ్వరస్త్రయీమయో ధర్మమయస్తపోమయః
గతవ్యలీకైరజశఙ్కరాదిభిర్వితర్క్యలిఙ్గో భగవాన్ప్రసీదతామ్

మనందరికీ ఆయనే ఆత్మ, ఆత్మ కలవారికి ఈశ్వరుడు. ఆయనే వేద స్వరూపుడు, ధర్మ స్వరూపుడు, తప స్వరూపుడు. పాపములు పోగొట్టుకున్న బ్రహ్మ శంకరాదులతో ఈయన చిహ్నములు వెతకబడే వాడు. పరమాత్మ యొక్క గుర్తులు (చిహ్నములు) వెతకాలన్న సంకల్పం కలగాలన్నా పాపం ఉండకూడదు. వారిచే వెతకబడుతున్న చిహ్నముగల భగవానుడు మా యందు ప్రసీదుడు (ప్రసన్నుడు) అగుగాక.

శ్రియః పతిర్యజ్ఞపతిః ప్రజాపతిర్ధియాం పతిర్లోకపతిర్ధరాపతిః
పతిర్గతిశ్చాన్ధకవృష్ణిసాత్వతాం ప్రసీదతాం మే భగవాన్సతాం పతిః

లక్ష్మీ దేవి భర్త, సమస్త యజ్ఞ్యములకూ అధిపతి భర్త, సమస్త సృష్టికీ పతి, ఆయనే జ్ఞ్యాన స్వరూపుడు, సమస్త లోకాధిపతి, భూమికి అధిపతి, యాదవ వృష్ణి అంధకుల వంశాలకు గతి, పతీ ఆయనే. ఆయన సాధువులకు పతి. ఆయన నా విషయంలో ప్రసన్నుడగు గాక.

యదఙ్ఘ్ర్యభిధ్యానసమాధిధౌతయా ధియానుపశ్యన్తి హి తత్త్వమాత్మనః
వదన్తి చైతత్కవయో యథారుచం స మే ముకున్దో భగవాన్ప్రసీదతామ్

ఆత్మ తత్వం తెలియాలంటే ఎవరిని ధ్యానించడం వలన కల్మషములు తొలగబడిన వాడు, ఎవరి సమాధి ధ్యానముల వలన కలిగినటువంటి బుద్ధి జ్ఞ్యానముల చేత పరమాత్మను తెలుసుకుంటారో, ఈ ఆత్మ తత్వాన్ని తమ తమ రుచులకు, శక్తులకూ అనుగుణంగా కల్పించుకుని ఈ స్వరూపాన్ని చెబుతారు. ఇలాంటి పరమాత్మ (మోక్షాన్ని ఇచ్చేవాడు - ముకుందుడు) నా యాందు ప్రసన్నుడగు గాక.

ఈ కింది శ్లోకం విద్యార్థులు చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి

ప్రచోదితా యేన పురా సరస్వతీ వితన్వతాజస్య సతీం స్మృతిం హృది
స్వలక్షణా ప్రాదురభూత్కిలాస్యతః స మే ఋషీణామృషభః ప్రసీదతామ్

బ్రహ్మకు కూడా ఎవరి అనుగ్రహంతో వాక్కు ( సరస్వతీ, వేదం) ప్రసన్నమై సృష్టి కలిగించే స్వచ్చమైన జ్ఞ్యానాన్ని ప్రసాదించిందో.  (భాగవత ప్రారంభ శ్లోకంలో ఉన్న 'తేనే బ్రహ్మ బృదా యదా ఆది కవయే' బ్రహ్మకు ఎవరి సంకల్పంతో వేదములను ఎవరుపదేశించారో)
అలాంటి బ్రహ్మ ఈ జ్ఞ్యానమును పొంది పరమాత్మ యొక్క స్వస్వరూప (స్వలక్షణా )జ్ఞ్యానాన్ని పొందాడో.
స్వలక్షణ అంటే వేదం కూడా కేవలం వేదం కాకుండా - సృష్టి స్థితి సంహారములు, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములు,  హ్రస్వమూ ధీర్ఘము ప్లుతము ఉదాత్తము అనుదాత్తము స్వరితమూ, పశ్యంతి మద్యమా వైఖరీ (అందులో స్వరములు మూడు , అందులో భేధములు మూడు, ఇలా ఒక్క వర్ణం 32 రకములు ఉంటుంది, 'ఆ అన్నమంటే ఇది హ్రస్వమా ధీర్ఘమా ప్లుతమా? ఉదాత్తమా అనుదాత్తమా స్వరితమా, మంద్రమ మధ్యమమా ఉత్తమమా, తరమా వితారమా అనుతారమా, వివృతమా సంవృతమా, సంవృతములో మళ్ళీ ఉదాత్తమా అనుదాత్తమా, కంఠ్యమా లేక ఉపకంఠ్యమా  - ఇవన్నీ వేద లక్షణాలు, స్వరములతోటి  - మంద్ర మధ్య తారాది వర్ణ కంఠగత భేధములతోటి ఉర: కంఠ శిరోరాది స్థాన భేధములతోటి కంఠాల్వాది అవస్థా భేధములతోటి ఇన్ని రకములుగా ఉన్న వేదం) ఎవరి సంకల్పంవలన బ్రహ్మకు భాసించిందో అటువంటి ఋషులకు ఋషి అయిన స్వామి ప్రసన్నుడగు గాక

భూతైర్మహద్భిర్య ఇమాః పురో విభుర్నిర్మాయ శేతే యదమూషు పూరుషః
భుఙ్క్తే గుణాన్షోడశ షోడశాత్మకః సోऽలఙ్కృషీష్ట భగవాన్వచాంసి మే

ఈయన సంకల్పముతో పంచ్భూతములను సృష్టిస్తాడు. 24 తత్వములతో ఏర్పడిన పురములలో నివసించువాడు - పురుషుడు. అందుకే ఆయన పురుషుడు, అలాంటి పురుషులచే పాలింపబడు మనం స్త్రీలము. నిర్ర్మాయ శేతే  - ఎలా ఐతే మనము మన గృహాలను నిర్మించుకుంటామో పరమాత్మ కూడా పురములను నిర్మించుకుని దానిలో నివాసముంటాడు. అందుకే ఆయనను పురుషుడంటారు.
ఈ పురములో ఉన్న పదహారుతో (5 జ్ఞ్యానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు పంచ తన్మాత్రలు మనసు, అన్నీ కలిపి పదహారు) అనుభవిస్తున్నాడు. ఇది నిశ్చయంగా తెలుసుకుంటే నరకము లేదు. ఐతే వీటిని అనుభవిస్తున్నట్లుగా ఉంటాడు గాని అనుభవించడు. ఆయన ఎల అనుభవించడో మనము కూడా అనుభవించము. పదహారింటిని పదహారు రూపములలో ఉన్న తాను అనుభవిస్తున్నట్లు ఉంటాడు
సోऽలఙ్కృషీష్ట భగవాన్వచాంసి మే -  మేము మాట్లాడు మాటల్లో ఆయనే వచ్చి అలంకరించాలి. భగవంతునికి భిన్నమైనవాటిని ఆయన మాచే పలకించకుండా ఉండు గాక. మా వాక్కులన్నీ ఆయనపరమై ఉండు  గాక.

తన గురువుగారైన వ్యాసునికి నమస్కరిస్తున్నాడు శుకుడు.
నమస్తస్మై భగవతే వాసుదేవాయ వేధసే
పపుర్జ్ఞానమయం సౌమ్యా యన్ముఖామ్బురుహాసవమ్

ఆరు గుణములు కలిగిన, భగవంతుడైన ఆ వాసుదేవునికి నమస్కారం. ఎవరి యొక్క ముఖపద్మము నుండి వెలువడ్డ మకరందాన్ని అందరూ పానం చేసారో అటువంటి వ్యాస భగవానునికి నమస్కారం

ఏతదేవాత్మభూ రాజన్నారదాయ విపృచ్ఛతే
వేదగర్భోऽభ్యధాత్సాక్షాద్యదాహ హరిరాత్మనః

నన్ను నీవు దేని గురించి అడిగావో ఇదే విషయాన్ని నారదుడు బ్రహ్మను అడిగాడు. అదే నేను నీకు చెప్పబోతున్నాను.

                                                    సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు