Pages

Friday, 7 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధము ముప్పయ్యవ అధ్యాయం - కుటుంబభరణం, మరణావస్థ



                                                       ఓం  నమో  భగవతే వాసుదేవాయ                

కపిల ఉవాచ
తస్యైతస్య జనో నూనం నాయం వేదోరువిక్రమమ్
కాల్యమానోऽపి బలినో వాయోరివ ఘనావలిః

గర్భ వాసం, పుట్టుక, బాల్య, కౌమారమూ, పౌగండ్రమూ, యవ్వనమూ, జరా, మరణమూ, జాగ్రత్తు  స్వప్నా సుసుష్ప్తీ మూర్చా.  జీవూల్నే వారు మూదు రకాలుగా ఉంటారు.   కర్మలు మూడు  రకాలు ఇష్టములూ పూర్తములూ  దానమూ. ఈ పనులు చేయకుండా కేవలం పాపములు చేసేవారు మొదటి రకం. ఇష్టా పూర్తములు ఆచరిస్తూ  దాని  వలన పుణ్యము పొందే వారు రెండవ రకం  వారు.  మూడవ రకం వారు  ఇష్టా పూర్తములను  భగవదారాధనగా   చేసే వారు. ఇలాంటి వారు   బ్రతికున్నంతకాలం తాము కర్మలు   చేసి  అర్చి  మార్గములో అంతకాలములో  వెళతారు. ఆ   మార్గములో   వెళ్ళీ చంద్రలోకం  వరకూ వెళ్ళి వచ్చేవారు    కొందరు. చనిపోయిన వారు  పాపాలు  చేసి   మరణిస్తే   వారు   పొందే   నరకయాతనలూ  ఉంటాయి.             
అలాంటి  ఈ  కాలం యొక్క  సాటిలేని  ప్రభావాన్ని   ఈ జీవుడు  తెలియలేడు. మబ్బులు గాలి వలన వేరవుతున్నాయి. కానీ ఆ మబ్బులు ఆ సంగతిని గుర్తించవు. అది జరిగింది గాలి వలన అని తెలీదు. అలాగే మనము కూడా కాల్ము వలనే వచ్చాము, కాలము వలనే పోతున్నాము అనే సంగతి తెలీదు. ప్రతీక్షణం మనం వాస్తవముగా అనుభవించే మోహము గురించి ఉంటుంది ఇందులో

యం యమర్థముపాదత్తే దుఃఖేన సుఖహేతవే
తం తం ధునోతి భగవాన్పుమాన్ఛోచతి యత్కృతే

మనం సంపాదించే ఇల్లూ,వాకిలీ భార్యా పిల్లలూ, మనం తృప్తి పొందుతామని కష్టపడి సంపాదిస్తున్నాము. సుఖము కొరకు దుఖముతో సంపాదిస్తున్నాము. (ఉదా: ఇల్లు కట్టడానికెంతో కష్టబడ్డాము అంటారు). మరి సంపాదించింది నిల్బడుతుందా అంటే కాలము దానిని నశింపచేస్తుంది. సుఖమును పొందటానికి కష్టపడుతూ  సంపాదించిన వస్తువును కాలము మింగేస్తుంది. 

యదధ్రువస్య దేహస్య సానుబన్ధస్య దుర్మతిః
ధ్రువాణి మన్యతే మోహాద్గృహక్షేత్రవసూని చ

ఇన్నింటికీ కారణమేమిటంటే, తాను సంపాదించిన ఇల్లూ పొలమూ, అన్నీ నిత్యములూ అనుకుంటున్నాడు. ఇవన్నీ శరీరం కోసం   చేస్తున్నాడు. శరీరం చుట్టూ ఉన్నవాళ్ళందరూ తనవాళ్ళనుకుంటున్నాడు. మన శరీరం ఎంత నిత్యమో మన వెంట  వచ్చే భార్యా పిల్లలు కూడా శాశ్వతం కాదు. సంపాదించే  నీవే  అశాశ్వతమైతే సంపాదించవలసిన వస్తువులు ఎలా నిత్యములవుతాయి.

జన్తుర్వై భవ ఏతస్మిన్యాం యాం యోనిమనువ్రజేత్
తస్యాం తస్యాం స లభతే నిర్వృతిం న విరజ్యతే

ఈ జీవుడు తాను సంపాదించిన పాప పుణ్యాలకు అనుగుణముగా దేవ తిర్యక్ మానవ జన్మలు ఎత్తుతాడు. ఏ జన్మ ఎత్తినా తృప్తి ఉండదు. అంటే అనుకున్నది సాధించానన్న తృప్తీ పొందలేదూ, ఇవన్నీ అనిత్యములని తెలుసుకుని విరక్తినీ  పొందలేదు. ఆయా జన్మలలో తృప్తీ లేదూ, విరక్తీ  లేదు.  

నరకస్థోऽపి దేహం వై న పుమాంస్త్యక్తుమిచ్ఛతి
నారక్యాం నిర్వృతౌ సత్యాం దేవమాయావిమోహితః

నరకములో ఉన్నా ఆ శరీరాన్ని  విడిచిపెట్టాలని   అనుకోడు.    ఎందుకంటే భగవంతుని మాయచే మోహించబడి, ఆ మాత్రమే చాలులే అనుకుంటాడు.

ఆత్మజాయాసుతాగార పశుద్రవిణబన్ధుషు
నిరూఢమూలహృదయ ఆత్మానం బహు మన్యతే

తాను తన శరీరం,భార్య, పశువులూ, బంధువులూ, ధనం, వీటిని ఎంతబాగా సంపాదించుకుంటూ, ప్రేమగా చూసుకుంటూ, వాటినే అంటిపెట్టుకుని,ఆ వ్యామోహములో ఉన్నవాడు మూఢ్డై చాలా సంతోషిస్తూ ఉంటాడు. 

సన్దహ్యమానసర్వాఙ్గ ఏషాముద్వహనాధినా
కరోత్యవిరతం మూఢో దురితాని దురాశయః

ఇలా భార్యా పిల్లలూ మొదలైనవాటిని సంపాదించడముతో చాలదు. వాటిని పోషించడానికి ఇంకా కష్టపడాలి (ఉద్వహనాధినా).దీని వలనపడే కష్టముతో ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. ఈ పోషించడానికి పడే తాపాన్ని చల్లార్చుకోవడానికి, న్యాయమైన పుణ్యకర్మలతో వారిని పోషించలేక పాపము చేయుటకు దిగుతాడు. ఒక్కసారి కాదు, ఎప్పుడూ పాపం చేస్తూనే ఉంటాడు. దుష్టమైన మురికిపట్టిన  మనసు  కలవాడై, తన వారిని పోషించలేక, ఆ తాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో పాపాలు చేస్తాడు

ఆక్షిప్తాత్మేన్ద్రియః స్త్రీణామసతీనాం చ మాయయా
రహో రచితయాలాపైః శిశూనాం కలభాషిణామ్

ఒక్క భార్య పుత్రులతో ఇది పోదు, వేశ్యలకోసం చెడుస్త్రీలయొక్క విలాసాలకోసం మనసు హరించబడి, వారితో ఏకాంతకముగా  గడపడానికి ఇంకొన్ని పాపాలు చేస్తాడు. భార్యా  భర్తలవలన కలిగే సంతానం మాట్లాడిన ముద్దు మాటలనే మోహములో పడి ఇంకొన్ని పాపాలు చేస్తాడు.  ఇలా ఇద్దరి మోహములో పడి అన్ని పాపాలూ చేస్తాడు. ఇలా ఎన్ని జన్మలు వచ్చినా, సంసారములో ధర్మాలు మాత్రం మార్పు చెందవు.భార్యా భర్త ఇల్లూ ధనమూ పిల్లలూ ఇవి ఏ యుగములోనూ మారవు

గృహేషు కూటధర్మేషు దుఃఖతన్త్రేష్వతన్ద్రితః
కుర్వన్దుఃఖప్రతీకారం సుఖవన్మన్యతే గృహీ

సంసారములో ఉన్నదంతా  దు@ఖమే. సంసారములో మాత్రం సోమరితనం ఉండదు. దేవాలయానికి వెళ్ళడానికి సోమరితనం అడ్డువస్తుంది గానీ, సాంసారిక విషయాలకు అడ్డురాదు. కలుగుతున్న దు@ఖాలకు ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నాలనే సుఖమనుకుంటాడు. ఉదా: దాహమేస్తే నీళ్ళు తాగుతాము, ఆకలేస్తే అన్నం తింటాము. ఇవి సుఖాలా?దుఖాలా? ఆకలి వేసి కడుపు మండితే   దానికి మందుగా ఆహారం తీసుకున్నాము. ఇలాగే సంసారములో కలిగే  దుఖన్ని పోగొట్టుకుంటున్నాము గానీ, సుఖాన్ని పొందట్లేదు. కానీ గృహస్థు దాన్నే సుఖం అని  భావిస్తున్నాడు.                  

అర్థైరాపాదితైర్గుర్వ్యా హింసయేతస్తతశ్చ తాన్
పుష్ణాతి యేషాం పోషేణ శేషభుగ్యాత్యధః స్వయమ్

వివాహం చేసుకుని సంతానము పొందిన తరువాత వారిని పోషించాలి, అంటే సంపాదించాలి,  అంటే పాపం  చేయాలి. గొప్ప హింసతో అక్కడినుంచీ, ఇక్కడినుంచీ సంపాదించి పాపం చేస్తూ ఉన్నాడు. సంపాదిస్తూ ఉన్నవాడు ఎంత తాను అనుభవిస్తున్నాడు.  సంపాదిస్తున్నాడు, మిగతావారందరూ అనుభవించగా మిగిలినదాన్ని అనుభవిస్తాడు (శేషభుగ్). ఇంత హింసతో సంపాదించిన డబ్బుతో తింటున్నది కేవలం మిగిలినది తినడానికే. సంపాదించినది  భార్యాపిల్లలకోసమే అయినా, ఆ పాపములు చేసి సంపాదించిన వాడు  నరకానికిపోతాడు (అధః స్వయమ్ ). అది అనుభవించినవారు స్వర్గానికి పోతారు. 

వార్తాయాం లుప్యమానాయామారబ్ధాయాం పునః పునః
లోభాభిభూతో నిఃసత్త్వః పరార్థే కురుతే స్పృహామ్

వారిని పోషిస్తున్నాను అన్న తృప్తి కేవలం వారిని పోషిస్తున్నంతవరకే ఉంటుంది. వారిని పోషించే సామర్ధ్యం పోయిన తరువాత గతి ఏమిటి? తన వస్తువులేదు కాబట్టి ధరియము కోల్పోయి పక్కవారి వస్తువుల మీద పడతాడు (పరార్థే కురుతే స్పృహామ్)

కుటుమ్బభరణాకల్పో మన్దభాగ్యో వృథోద్యమః
శ్రియా విహీనః కృపణో ధ్యాయన్ఛ్వసితి మూఢధీః

అది కూడా దొరకకపోతే, ఏ పనీ లేదూ, కుటుంబానిపోషించలేడు, అదృష్టము బాలేదు, రోగి అయ్యాడు, ఇలా ఆలోచిస్తూ క్రుంగి కృశిస్తాడు.

ఏవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తథా
నాద్రియన్తే యథా పూర్వం కీనాశా ఇవ గోజరమ్

తమను పోషించడం చేతకాని భర్తనీ తండ్రినీ, భార్యాపిల్లలు, సంపాదిస్తున్నప్పుడు చూపిన ఆదరం చూపడు, ఎలా ఐతే ముసలి ఎద్దును రైతు ఆదరించడో. అయినా ఇన్నాళ్ళూ మనకు పెట్టాడు కాదా, ఎదో పెడదాములే అని ఎంతో కొంతపడేస్తారు.

తత్రాప్యజాతనిర్వేదో భ్రియమాణః స్వయమ్భృతైః 
జరయోపాత్తవైరూప్యో మరణాభిముఖో గృహే

ఆ స్థిత్లో కూడా వైరాగ్యం కలగదు.ఇంతాకాలం తాను పోషించినవారి చేత పోషింపడుతూ ఉంటాడు. ఇంతలో వార్ధక్యం వస్తుంది.  వార్ధక్యముతో ముఖము వంకరపడుతుంది. మరణాభిముఖముగ ఉంటాడు. 

ఆస్తేऽవమత్యోపన్యస్తం గృహపాల ఇవాహరన్
ఆమయావ్యప్రదీప్తాగ్నిరల్పాహారోऽల్పచేష్టితః

కాళ్ళూ చేతులూ పని చేస్తూ ఉన్నంతవరకూ కొంతవరకూ బాగానే చూస్తారు. ఒకవేళ తన శరీరం తనకు సహకరించడం మానేస్తే, అవమానముతో ముందర పడేసిన ఆహారాన్ని కుక్కలాగ తింటూ, శరీరానికి రోగాలన్నీ వస్తాయి. కొద్దిగా ఆహారం తీసుకుంటాడు. ఎక్కువ  పని చేయలేడు

వాయునోత్క్రమతోత్తారః కఫసంరుద్ధనాడికః 
కాసశ్వాసకృతాయాసః కణ్ఠే ఘురఘురాయతే

కపవాత పిత్తములనే వాయువులతోటి కళ్ళు బయటకు వస్తాయి. కఫముతో నాడి సరిగ్గా ఆడక, దగ్గుతో శ్వాస తీసుకోవడమే కష్టముగా ఉంటుంది

శయానః పరిశోచద్భిః పరివీతః స్వబన్ధుభిః
వాచ్యమానోऽపి న బ్రూతే కాలపాశవశం గతః

పడుకొని ఉంటాడు. అందరూ జాలి చూపిస్తూ ఉంటారు. దుఖిస్తున్న తన బంధువులు తన చుట్టూ చేరి ఉంటారు. వారు పలకరిస్తూ ఉంటారు. కానీ మాట్లాడలేడు.  ఎందుకంటే  "కాలపాశవశం గతః", మృతువు రాదు, బ్రతికి ఉండలేడు. 

ఏవం కుటుమ్బభరణే వ్యాపృతాత్మాజితేన్ద్రియః
మ్రియతే రుదతాం స్వానామురువేదనయాస్తధీః

ఇది సంసారాన్ని పోషించడానికి పడే శ్రమ. ఇదంతా ఎందుకంటే ఇంద్రియ జయం లేనందువలన. ఎప్పుడైతే తాను ఇంటిని పోషించలేడో, అప్పుడే వానప్రస్థాశ్రమం తీసుకుని ఉంటే ఇంద్రియాలను జయించినవాడు అయి ఉండేవాడు. మనం  చేసిన ధర్మమే మనని కాపాడుతుంది.అది లేని వాడు,  ఏదుస్తున్న తన వారిని  చూచి చస్తాడు. 

యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభసేక్షణౌ
స దృష్ట్వా త్రస్తహృదయః శకృన్మూత్రం విముఞ్చతి

అప్పటికి యమదూతలు వస్తారు, మహాభయంకరముగా ఉంటారు. వారిని చూచి భయపడి పక్కలోనే మల మూత్రాలు విడిచిపెట్టి పోతాడు. అప్పుడు ఉల్లిపొరవంటి యాతనా దేహాన్ని పొందుతాడు. వాడి మెడకు బలవంతముగా తాళ్ళు వేసి కట్టి, ఈడ్చుకుని పోతారు. 

యాతనాదేహ ఆవృత్య పాశైర్బద్ధ్వా గలే బలాత్
నయతో దీర్ఘమధ్వానం దణ్డ్యం రాజభటా యథా

దొంగను రాజ భటులు తీసుకుని  పోయినట్లుగా తీసుకుని పోతారు. వారు వీడిని భయపెడుతూ తీసుకుపోతారు. వారిని చూచి భయపడతాడు

తయోర్నిర్భిన్నహృదయస్తర్జనైర్జాతవేపథుః
పథి శ్వభిర్భక్ష్యమాణ ఆర్తోऽఘం స్వమనుస్మరన్

ఆ దారి అంతా కుక్కలుంటాయి. అప్పుడు తాను చేసిన పాపాలన్నీ గుర్తుకువచ్చీ బాధపడతాడు

క్షుత్తృట్పరీతోऽర్కదవానలానిలైః సన్తప్యమానః పథి తప్తవాలుకే
కృచ్ఛ్రేణ పృష్ఠే కశయా చ తాడితశ్చలత్యశక్తోऽపి నిరాశ్రమోదకే

ఆకలి దప్పితో బాధపడుతాడు. అక్కడే సూర్యుడూ దావాగ్నీ సుడిగాలీ ఉంటాయి. ఆదారంతా పరమవేడిగా ఉన్న ఇసుక ఉంటుంది. ఆ కాలుతున్న ఇసుకలో అతికహ్స్టముగా నడుస్తూ, అనుకున్నంత వేగముగా నడవట్లేదని యమభటులు వెనక కొడుతూ ఉంటారు. కొరడాలతో కొడుతూ ఉంటే నిరాశ్రయుడై, చేతగాక నడుస్తాడు కాలుతున్న నేలపై. అలా నడిచీ నడిచీ  అలసిపోతాడు 

తత్ర తత్ర పతన్ఛ్రాన్తో మూర్చ్ఛితః పునరుత్థితః
పథా పాపీయసా నీతస్తరసా యమసాదనమ్

అలా మూర్చపోతాడూ మళ్ళీ లేస్తాడు. అలా పాపపు దారిలో యమసాదనానికి వేగానికి వెళ్తాడు. తొంభైతొమ్మిదివేల యోజనాలని ఆరుఘడియలలో వెళ్తాడు

యోజనానాం సహస్రాణి నవతిం నవ చాధ్వనః
త్రిభిర్ముహూర్తైర్ద్వాభ్యాం వా నీతః ప్రాప్నోతి యాతనాః
ఆదీపనం స్వగాత్రాణాం వేష్టయిత్వోల్ముకాదిభిః
ఆత్మమాంసాదనం క్వాపి స్వకృత్తం పరతోऽపి వా
జీవతశ్చాన్త్రాభ్యుద్ధారః శ్వగృధ్రైర్యమసాదనే
సర్పవృశ్చికదంశాద్యైర్దశద్భిశ్చాత్మవైశసమ్

పాపం ఎక్కువైతే రెండే ముహూర్తాలలో పోతాడు. పోతున్నప్పుడు శరీరం మొత్తం తగలబెడతారు. నూనెలో ఉన్న బట్టలను ఒంటికి చుట్టి మంటపెడతారు. ఆకలేస్తే వాడి చేతినో కాలినో తీసి వాడినే తినమంటారు. వాడినే కోసుకుని తినమంటారు. లేదా వారే కోసిచ్చి ఇస్తారు. వాడికడుపులో ఉన్న పేగులని కుక్కలూ గద్దలూ కాకులూ పాములు తేళ్ళు చేత బయటకి లాగించి బయటకు తీసి తినమంటారు. తన శరీరాన్ని  తానే హింసించుకుంటూ వెళ్తాడు. అలా ఒక్కొక్క చేయి, ఒక్కో కాలు నరికివేస్తూ ఉంటారు

కృన్తనం చావయవశో గజాదిభ్యో భిదాపనమ్
పాతనం గిరిశృఙ్గేభ్యో రోధనం చామ్బుగర్తయోః

పడుకోబెట్టి ఏనుగులచే తొక్కిస్తారు, పర్వతాలమీద నుంచి కిందకు పడేస్తారు. నీటిలోంచి బయటకు లేవకుండా అదిమి పడతారు.

యాస్తామిస్రాన్ధతామిస్రా రౌరవాద్యాశ్చ యాతనాః
భుఙ్క్తే నరో వా నారీ వా మిథః సఙ్గేన నిర్మితాః

ఇలా తామిశ్రమూ అంధ తామిశ్రమూ రౌరవమూ అనే నరకాలు నరులకు గానీ,నారీమణులకు గానీ, ఒకరి మీద ఒకరికి ప్రేమతో ఏర్పరుచుకున్న నరకాలు ఇవి. ఇవన్నీ నిజముగానే ఉంటాయా అని అనుమానిస్తారని ఇక్కడే కొన్ని నరకాలు చూపుతారు

అత్రైవ నరకః స్వర్గ ఇతి మాతః ప్రచక్షతే
యా యాతనా వై నారక్యస్తా ఇహాప్యుపలక్షితాః

జబ్బు వచ్చినప్పుడు పక్కలోనే  మలమూత్రాలు రావడం, వైద్యులు శరీరన్ని కోయడం, ప్రేగులు బయటకి తీయడం అనే కొన్ని చూపుతారు. ఈ నరకాలు ఉన్నాయా అనే అనుమానం అక్కరలేదు. నరకయాతనలని ఇక్కడే మనం కొన్ని రుచి చూస్తూ ఉంటాము. 
  
ఏ వం కుటుమ్బం బిభ్రాణ ఉదరమ్భర ఏవ వా
విసృజ్యేహోభయం ప్రేత్య భుఙ్క్తే తత్ఫలమీదృశమ్
  
ఇలా కుటుంబాన్ని, తన కడుపుని పోషించుకునే వాడు తన దేహాన్ని విడిచిపెట్టి, తన కుటుంబాన్నీ విడిచిపెడతాడు. వెంట ఎవరూ రారు, ఏమీ రావు. ఒంటరిగానే వెళ్తాడు. పాపాన్ని మాత్రమే తీసుకుని వెళతాడు. తనది అనుకున్న శరీరము కానీ, తనవారు అనుకున్న వారు  గానీ వెంట రారు. తన వారు అనుకునే వారందరు తాను తెచ్చిపెట్టినవాటిని అనుభవించడానికి మాత్రమే పనికి వస్తారు. అలా తెచ్చిపెట్టడములో చేసిన పనుల వలన వచ్చిన నరకాన్ని  మాత్రం తానొక్కడే అనుభవిస్తాడు.  

ఏకః ప్రపద్యతే ధ్వాన్తం హిత్వేదం స్వకలేవరమ్
కుశలేతరపాథేయో భూతద్రోహేణ యద్భృతమ్

ప్రకృతిలో  శరీరాన్ని విడిచిపెట్టి ఒక్కడే నరకానికి వెళతాడు. ఎంతో మందికి ద్రోహం చేసి పోషించుకున్న శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళతాడు.కుశల ఇతర పాధేయః- పాపం మాత్రం మూట గట్టుకుని పోతాడు. పాపం చేసిన శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టివెళ్తాడు. అన్నీ పోయినప్పుడు పాపం మాత్రం  ఎందుకు ఉంటుంది వెనక?

దైవేనాసాదితం తస్య శమలం నిరయే పుమాన్
భుఙ్క్తే కుటుమ్బపోషస్య హృతవిత్త ఇవాతురః

తన కుటుంబాన్ని  పోషించడానికి దబ్బును ఎంత జాగ్రత్తగా దాచుకుంటాడో, తన కుటుంబాన్ని పోషించడానికి చేసిన పాపాన్ని పరమాత్మ అనే భద్రముగా దాచిపెడతాడు ఆ పాపాన్ని నరకములో అనుభవించి, కుటుంబాన్ని పోషించడానికి చేసిన పాపాన్ని "సంపాదించిన దబ్బు పోతే ఎంత బాధపడతాడో" "సంపాదించిన పాపము పోలేదే" అని బాధపడతాడు

కేవలేన హ్యధర్మేణ కుటుమ్బభరణోత్సుకః
యాతి జీవోऽన్ధతామిస్రం చరమం తమసః పదమ్

ఏ కొద్దిపుణ్యమూ చేయక పాపమును మాత్రమే చేసి కుటుంబాన్ని పోషించినవాడు అంధ తామిశ్ర నరకాన్ని పొందుతాడు. అదిమహా నరకం. అది పొంది

అధస్తాన్నరలోకస్య యావతీర్యాతనాదయః
క్రమశః సమనుక్రమ్య పునరత్రావ్రజేచ్ఛుచిః 

నరలోకం కంటే కింద ఉన్న నరకలోకములో ఆచరించిన పాపాలకు తగిన నరకాలు అనుభవించి, ఆ పాపాలనుంచి పరిశుద్ధుడై మళ్ళీ ఇక్కడికి వస్తాడు. నరకానుభవం మన పరిశుద్ధికే కానీ మనను బాధించడానికి కాదు. స్వామికూడా "అనుగ్రహించేవాడి  విత్తం హరిస్తాను " అన్నాడు