Pages

Friday, 7 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై ఎనిమిదవ అధ్యాయం


శ్రీభగవానువాచ
యోగస్య లక్షణం వక్ష్యే సబీజస్య నృపాత్మజే
మనో యేనైవ విధినా ప్రసన్నం యాతి సత్పథమ్

ఓ రాజపుత్రీ! సాధనములతో కూడి ఉన్నటువంటి భక్తి యోగ లక్షణాలను నేను వివరిస్తాను. ఈ భక్తి యోగము తెలుసుకున్నందు వలన మనసు ప్రసన్నమవుతుంది. ఇక్కడ సత్పధములో, సత్ అంటే పరమాత్మ - ఆయనను ఆశ్రయించడానికి మార్గం. దానికి మనసు ప్రసన్నముగా ఉండాలి. అందుకు రాగమూ, ద్వ్హేషమూ, మోహమూ పోవాలి. ప్రశన్నతా అనేది సకారణం కాదు. ఐహిక విషయాలతో వచ్చేది ప్రశాంతత కాదు. రాగ ద్వేషాలు లేని మానసిక స్థితి.

స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ్చ నివర్తనమ్
దైవాల్లబ్ధేన సన్తోష ఆత్మవిచ్చరణార్చనమ్

ఈ శ్లోకం నిరంతరం అనుసంధానం చేయాలి. మనసు ప్రశాంతతను పొందాలీ అంటే తన ధర్మాన్ని తాను శక్తి మేరకు ఆచరించాలి. ధర్మము కాని దాని నుండి వైదొలగాలి. స్వధర్మమే ఫలమును కోరిచేస్తే విధర్మమవుతుంది. భగవదాజ్ఞ్యయా భగవత్కైంకర్య రూపేణా కర్మలు చేయాలి. అవిహిత అప్రతిషిద్ధ నిషిద్ధ వ్యాపారాలు విధర్మం. నిషేధించిన దాన్ని విడిచిపెట్టాలి, ఏ ఏ పని చేయకూడదని చెప్పలేదో దాన్ని కూడా విడిచిపెట్టాలి.  వీటినుండి తొలగడానికి  పరమాత్మ ప్రసాదించిన దానితో తృప్తి పొందాలి. అలా తృప్తి చెందడం వలన విధర్మ నివృత్తి కలుగ్తుంది. మరి పరమాత్మ ఇచ్చిన దానితో తృప్తి చెందాలంటే? మనసు కడగబడాలి. అది భాగవత ఆరాధనతో కలుగుతుంది. భగవంతుని భక్తులని ఆరాధిస్తే, భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిపడడం అలవాటవుతుంది. అంటే భగవంతుని భక్తులూ అనడానికి చిహ్నం, వారు భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి పడే వారు.

గ్రామ్యధర్మనివృత్తిశ్చ మోక్షధర్మరతిస్తథా
మితమేధ్యాదనం శశ్వద్వివిక్తక్షేమసేవనమ్

అహింసా సత్యమస్తేయం యావదర్థపరిగ్రహః
బ్రహ్మచర్యం తపః శౌచం స్వాధ్యాయః పురుషార్చనమ్

మౌనం సదాసనజయః స్థైర్యం ప్రాణజయః శనైః
ప్రత్యాహారశ్చేన్ద్రియాణాం విషయాన్మనసా హృది

స్వధిష్ణ్యానామేకదేశే మనసా ప్రాణధారణమ్
వైకుణ్ఠలీలాభిధ్యానం సమాధానం తథాత్మనః

ఏతైరన్యైశ్చ పథిభిర్మనో దుష్టమసత్పథమ్
బుద్ధ్యా యుఞ్జీత శనకైర్జితప్రాణో హ్యతన్ద్రితః

అసత్పధములో వెళ్ళే ఇంద్రియాలను బుద్ధితో జయించు. బుద్ధికీ మనసుకీ అనుసంధానం ఉన్నంతకాలం అసత్పధములో వెళ్ళము. ఎందుకంటే బుద్ధికి ఆలోచించే శక్తి ఉంది. మనసు ఆలోచించదు. మనసుని బుద్ధితో కలపాలంటే ప్రాణాయాముదలతోటి ప్రాణ వాయువుని జయించాలి. సోమరితనాన్ని విడిచిపెట్టాలి. అలాంటి వాడే ప్రాణ వాయువును గెలువగలడు. అటువంటి వాడే మనసును బుద్ధితో కలపగలడు

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య విజితాసన ఆసనమ్
తస్మిన్స్వస్తి సమాసీన ఋజుకాయః సమభ్యసేత్

దానికి మొదలు, కూర్చోవడం రావాలి. కూర్చున్న తరువాత అటూ ఇటూ కదలకూడదు. కదిలితే మనసు కూడా కదులుతుంది. ఎంత సేపు కూర్చున్న శ్రమలేకుండా ఉండాలి. నిటారుగా కూర్చుని ఉండాలి. ముందు ఎలా కూర్చోవాలో నేర్చుకోవాలి. ఎంత సేపు కూర్చున్నా బాధపడకూడదు. దీనితో మొదలు పెడితే, ఆసనములో స్థైర్యం వచ్చాక, ప్రాణాయామము చేయాలి. ప్రాణాయామం చేసేప్పుడు వెన్నెముక నిటారుగా  ఉండాలి. అప్పుడే వాయువ్ జయం కుదురుతుంది.

ప్రాణస్య శోధయేన్మార్గం పూరకుమ్భకరేచకైః
ప్రతికూలేన వా చిత్తం యథా స్థిరమచఞ్చలమ్

ఆసన శుద్ధి, ఆసన స్థైర్యం తరువాత, ప్రాణము చేరే మార్గాన్ని శుద్ధి చేయాలి. మన కోరికలే ప్రాణ వాయువు యొక్క నాడీ మండలాన్ని మురికి చేస్తాయి. దాని వలనే అన్ని రోగాలూ వస్తాయి. అది శుద్ధిగా ఉండాలి.
1. మొదలు వాయువును తీసుకొనుట - పూరకం 2. నిలపాలి - కుంభకం 3. వదులుట - రేచకం.
ముందు పూరకం చేసి తరువాత రేచకం చేయచ్చు. లేదా ముందు రేచకం చేసి తరువాత కుంభక పూరకాలు చేయవచ్చు. ఇడా రేచకం -  పిగళాతో పూరకం. చిత్తాన్ని స్థిరముగా, అచంచలముగా ఉంచాలి.
ప్రాణాయామము సక్రమముగా ఆచరించిన వాడి మనసు స్థిరముగా ఉంటుంది. ప్రాణ వాయువును నిలపగలిగితే మనసు కూడా నిలిచి ఉంటుంది.

మనోऽచిరాత్స్యాద్విరజం జితశ్వాసస్య యోగినః
వాయ్వగ్నిభ్యాం యథా లోహం ధ్మాతం త్యజతి వై మలమ్

శ్వాసను గెలిచిన యోగికి, ఇలా ప్రాణాయామాదులతో ప్రారంభిస్తే త్వరలోనే మనసు స్థిరమవుతుంది, రజో గుణం లేకుండా అవుతుంది. మనసుకి పట్టిన మురికి పోతుంది. వాయువు అగ్నిని ప్రేరేపిస్తే, వాయువు ద్వారా ప్రేరేపించబడిన అగ్ని లోహం యొక్క మురికి పోగొడుతుది. అలాగే ప్రాణాయామముతో ఆయా మార్గములలో వెళ్ళినపుడు మనసు మురికి వదులుతుంది

ప్రాణాయామైర్దహేద్దోషాన్ధారణాభిశ్చ కిల్బిషాన్
ప్రత్యాహారేణ సంసర్గాన్ధ్యానేనానీశ్వరాన్గుణాన్

ప్రాణాయామముతో వాత పిత్త శ్లేష్మ దోషాలు పోతాయి. ఇంద్రియములను ధారణ చేయగలిగితే పాపాలు పోతాయి. ప్రాణాయామముతో శారీరిక, ధారణతో మానసిక రోగాలు పోతాయి. ప్రత్యాహారముతో (వెనక్కు మరల్చుకోవడం) వలన సంబంధాలు తొలగుతాయి. ధ్యానముతో ప్రభువుకు ఉండకూడని గుణాలు అయిన కష్టమూ, లోభమూ బాధలనూ పోగొట్టుకోవాలి.
ప్రాణాయామముతో - దోషాలనూ
ధారణతో - పాపాలను
ప్రత్యాహారముతో - బంధాలను
ధ్యానముతో - కష్టాలను

యదా మనః స్వం విరజం యోగేన సుసమాహితమ్
కాష్ఠాం భగవతో ధ్యాయేత్స్వనాసాగ్రావలోకనః

ఈ దారిలో వచ్చి మన మనసును యోగముతో దోషాలు పోగొట్టుకుని ఏకాగ్రముగా పరమాత్మయందు ఉంచగలిగితే, పరిశుద్ధమవుతుందో, అప్పుడు భగవంతుని విగ్రహాన్ని ధ్యానము చేయాలి.
దృష్టిని నాసికాగ్రము యందు ఉంచాలి

ప్రసన్నవదనామ్భోజం పద్మగర్భారుణేక్షణమ్
నీలోత్పలదలశ్యామం శఙ్ఖచక్రగదాధరమ్

పద్మ పత్రముల వంటి, ఎర్రాగా ఉన్న, నీలమేఘశ్యాముడు, పీతాంబరధారుడూ, అయిన పరమాత్మని ధ్యానం చేయాలి. పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం వలన ప్రకృతి మనని బంధించదు. అలాంటి పరమాత్మని చేరడానికి జ్ఞ్యాన కర్మాదులతో కూడి ఉన్న భక్తి యోగం సహకరిస్తుంది. దానికి అన్ని ఇంద్రియాలనూ మనసులో, మనసును హృదయములో చేర్చాలి. మనసు ప్రాణాయామముతో మనం చెప్పినట్లు వింటుంది. పరమాత్మ భూషణాలూ, ఆయుధాలు ఉన్న పరమాత్మని ధ్యానించాలి. హృదయ దహరాకాశములో స్వామి ఉంటాడు. ఎలాంటి స్వామిని ధ్యానించాలి. పడుకుని ఉన్నా, కూర్చుని ఉన్నా, నడుస్తూ ఉన్నా, ఆ రూపాన్ని ధ్యానం చేయాలి. సంపూర్ణ ధ్యానం చేయాలి. కేశముల నుండీ పాదముల వరకూ, పాదముల నుండీ కేశముల వరకూ ధ్యానించవచ్చు.
ఒకే సారి పరమాత్మను మొత్తం ధ్యానములో నిల్పుకోలేని నాడు, ఒక్కొక్క అవయవాన్నే ముందు పెట్టుకుంటూ దాని మీదే ధ్యానం చేయాలి. ఇతర ఏ విషయములవైపూ మనసు వెళ్ళకుండా, పరమాత్మ యొక్క ఆ అవయవం మీదే ధ్యానం కుదిరే వరకూ చేయాలి. ఇలాంటి ఏకాగ్రత కలిగిన తరువాత సాంసారికమైన విషయాలు బాధించవు. ఇది సులభ ఉపాయం.

లసత్పఙ్కజకిఞ్జల్క పీతకౌశేయవాససమ్
శ్రీవత్సవక్షసం భ్రాజత్కౌస్తుభాముక్తకన్ధరమ్

మత్తద్విరేఫకలయా పరీతం వనమాలయా
పరార్ధ్యహారవలయ కిరీటాఙ్గదనూపురమ్

కాఞ్చీగుణోల్లసచ్ఛ్రోణిం హృదయామ్భోజవిష్టరమ్
దర్శనీయతమం శాన్తం మనోనయనవర్ధనమ్

అపీచ్యదర్శనం శశ్వత్సర్వలోకనమస్కృతమ్
సన్తం వయసి కైశోరే భృత్యానుగ్రహకాతరమ్

కీర్తన్యతీర్థయశసం పుణ్యశ్లోకయశస్కరమ్
ధ్యాయేద్దేవం సమగ్రాఙ్గం యావన్న చ్యవతే మనః

స్థితం వ్రజన్తమాసీనం శయానం వా గుహాశయమ్
ప్రేక్షణీయేహితం ధ్యాయేచ్ఛుద్ధభావేన చేతసా

తస్మిన్లబ్ధపదం చిత్తం సర్వావయవసంస్థితమ్
విలక్ష్యైకత్ర సంయుజ్యాదఙ్గే భగవతో మునిః

సఞ్చిన్తయేద్భగవతశ్చరణారవిన్దం
వజ్రాఙ్కుశధ్వజసరోరుహలాఞ్ఛనాఢ్యమ్
ఉత్తుఙ్గరక్తవిలసన్నఖచక్రవాల
జ్యోత్స్నాభిరాహతమహద్ధృదయాన్ధకారమ్

పరమాత్మ యొక్క పాద పద్మములను ధ్యానించాలి. ఆ పాదములలో వజ్రాయుధమూ, శంఖమూ, చక్రమూ, అంకుశమూ కూడుకొని ఉంటాయి.
పరమాత్మ పాదముల వేళ్ళ కొసకు ఉండే నఖములు వేలు కన్న ఎత్తులో ఉండి, ఎర్రగా ఉండి, వెన్నెలతో, కాంతులతో, పరమాత్మను ధ్యానించే భక్తుల హృదయాంధకారాన్ని తొలగించేవి ఆ పాదలు. అలాంటి పరమాత్మ చరణారవిందాన్ని ధ్యానం చేయాలి.

యచ్ఛౌచనిఃసృతసరిత్ప్రవరోదకేన
తీర్థేన మూర్ధ్న్యధికృతేన శివః శివోऽభూత్
ధ్యాతుర్మనఃశమలశైలనిసృష్టవజ్రం
ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిన్దమ్

పరమాత్మ పాద ప్రక్షాళన చేసిన తీర్థం నదిగా వస్తే, దాన్ని శివుడు తన శిరస్సుపై ధరించాడు. ధ్యానం చేసే వారి మనసులో ఉన్న పాపమనే పర్వతాన్ని భేధించడానికి బయలుదేరిన వజ్రాయుధం వంటిది పరమాత్మ పాదం.

జానుద్వయం జలజలోచనయా జనన్యా
లక్ష్మ్యాఖిలస్య సురవన్దితయా విధాతుః
ఊర్వోర్నిధాయ కరపల్లవరోచిషా యత్
సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్

పరమాత్మ పిక్కలు (లేదా మోకాళ్ళు) ఎలాంటివంటే, దేవ దానవులందరి చేత స్తుతింపబడే జలజలోచన (అమ్మవారు) ఆ పాదాలను ఒడిలో ఉంచుకుని, చిగురుటాకులవంటి చేతులతో ఆ పాదలను వత్తుతూ ఉంటుంది. పుట్టుక లేని వాడూ, సంసారాన్ని నశింపచేసేవాడూ అయిన పరమాత్మ పాదాలను ధ్యానం చేయాలి.

ఊరూ సుపర్ణభుజయోరధి శోభమానావ్
ఓజోనిధీ అతసికాకుసుమావభాసౌ
వ్యాలమ్బిపీతవరవాససి వర్తమాన
కాఞ్చీకలాపపరిరమ్భి నితమ్బబిమ్బమ్

భగవానుని తొడలు, గరుత్మంతుని భుజముల మీద శొభిస్తాయి, ఉజ్జ్వలమైన కాంతికి నిలయం. అవిసె పూవులాగ ప్రకాశించేవి. పీతాంబరముతో, బంగారు మ్రొలనూలుతో ప్రకాశించే స్వామి పురుదులు.

నాభిహ్రదం భువనకోశగుహోదరస్థం
యత్రాత్మయోనిధిషణాఖిలలోకపద్మమ్
వ్యూఢం హరిన్మణివృషస్తనయోరముష్య
ధ్యాయేద్ద్వయం విశదహారమయూఖగౌరమ్

అన్నిలోకాల యొక్క మూలము ఉన్నది స్వామి ఉదరం. అక్కడే ఆత్మ యోని (బ్రహ్మ) సృష్టికి మూలం అయిన అఖిల లోకాలు తనలో దాచుకున్న పద్మం ఆ నాభిలోనే ఉంది. ఒక్కొక్క బ్రహ్మాండం, పద్మము యొక్క ఒక్కొక్క రేకులో ఉంటాయి. అలాంటి దళములు కల పద్మమునూ, దాని మీద ఉన్న బ్రహ్మను, ఇవన్నీ ఉన్న నాళాన్ని, వీటినన్నిటికీ మూలం అయిన నాభిని ధ్యానం చేయాలి. పరిశుద్ధమైన హారముల కాంతితో ప్రకాశించేది, శుభ్రమైన, దివ్యమైనా, వస్త్రములతో ఆభరణములతో ప్రకాశించే పరమాత్మ వక్షస్థలాన్ని ధ్యానం చేయాలి.

వక్షోऽధివాసమృషభస్య మహావిభూతేః
పుంసాం మనోనయననిర్వృతిమాదధానమ్
కణ్ఠం చ కౌస్తుభమణేరధిభూషణార్థం
కుర్యాన్మనస్యఖిలలోకనమస్కృతస్య

అది అమ్మవారికి రాణి వాసం లాంటిది, అమ్మవారి నివాస స్థానమైన పరమాత్మ వక్షస్థలం, జీవులందరి మనసుకూ, జీవులందరి నేత్రాలకూ తృప్తినీ సంతోషాన్నీ కలిగించేది.
అఖిల లోకమలుల చే నమస్కరించబడే  పరమాత్మ కంఠం, కౌస్తుభమణిని ధరించి ఉంటుంది. పరమాత్మ ధరించుటచే కౌస్తుభమణి శొభ పెరిగింది.

బాహూంశ్చ మన్దరగిరేః పరివర్తనేన
నిర్ణిక్తబాహువలయానధిలోకపాలాన్
సఞ్చిన్తయేద్దశశతారమసహ్యతేజః
శఙ్ఖం చ తత్కరసరోరుహరాజహంసమ్

మందరగిరిని చిలికినప్పుడు స్వామి యొక్క చేతికున్న కంకణాలకు నగిషీ పెట్టినట్లు అయ్యింది. ఆ కంకణములు మరి కాస్త వన్నె తేలాయి. మెరుగుపెట్టబడిన కంకణములు కలిగినా, అష్టదిక్పాలకుల నివాసమైన పరమాత్మ బాహువులు ధ్యానం చేయాలి. కుడి చేత్తో వేయి అంచులు కలిగిన, ఎవరూ ఆపతరం కాని తేజస్సు కలిగిన సుదర్శనం ఆయన చేతిలో రాజహంసలా ఉంది (రాజహంస పద్మములో ఉంటుంది. ఈ రాజహంస పరమాత్మ చేయి అనే పద్మములో ఉంది)
పరమాత్మ చేతులని ధ్యానం చేసేప్పుడు ఇవన్నీ కనపడాలి. క్షీరసాగరమధనం, లోకపాలకులూ, కంకణములూ, శంఖమూ, చక్రమూ, అవి చేసిన గొప్ప పనులూ స్మరించుకుంటూ చేతూలని ధ్యానం చేయాలి.

కౌమోదకీం భగవతో దయితాం స్మరేత
దిగ్ధామరాతిభటశోణితకర్దమేన
మాలాం మధువ్రతవరూథగిరోపఘుష్టాం
చైత్యస్య తత్త్వమమలం మణిమస్య కణ్ఠే

ప్రపంచములో ఆనందాన్ని కలిగించేది అయిన కౌమోదకీ స్వామి గద. పరమాత్మకు చాలా ఇష్టమైనది ఈ గద. శత్రు సైన్యం యొక్క రక్తము చేత పూయబడినదీ గద. తుమ్మెదల యొక్క సమూహముచేత ధ్వని చేత కూడి ఉన్న మాలను ధ్యానం చేయాలి. ఈ పరమాత్మ యొక్క (కౌస్తుభ) మణి స్వామి ధరిస్తున్నడంటే అఖిల జీవతత్వానికి ప్రతినిధి. కౌస్తుభ మణి అంటే జీవులకు ప్రతినిధి.

భృత్యానుకమ్పితధియేహ గృహీతమూర్తేః
సఞ్చిన్తయేద్భగవతో వదనారవిన్దమ్
యద్విస్ఫురన్మకరకుణ్డలవల్గితేన
విద్యోతితామలకపోలముదారనాసమ్

తన భక్తులను దయ చూడాలనే సంకల్పముతో రూపు దాల్చిన పరమాత్మ ముఖము (నిరాకారుడైన పరమాత్మ మనని అనుగ్రహించడానికి స్వీకరించిన రూపం). బాగా ప్రకాశించే మకర కుండలముల కాంతితో, ఆ కంతి పడిన చెక్కిళ్ళ మీద పడి ఆయన చిరునవ్వుతో ముఖమింకా ప్రకాశిస్తోంది.

యచ్ఛ్రీనికేతమలిభిః పరిసేవ్యమానం
భూత్యా స్వయా కుటిలకున్తలవృన్దజుష్టమ్
మీనద్వయాశ్రయమధిక్షిపదబ్జనేత్రం
ధ్యాయేన్మనోమయమతన్ద్రిత ఉల్లసద్భ్రు

ఆయన ముఖము నిండా తుమ్మెదలూ చేపలూ ఆటలాడుతున్నాయి. తుమ్మెదలనూ చేపలను ధిక్కరించే పరమాత్మ ముఖము. తుమ్మెదలంటే పరమాత్మ ముంగురులు, చేపలంటే పరమాత్మ కళ్ళూ, ఆ కేశములు వంకరలు తిరిగినవి. రెండు చెపలవంటి. ఎవరి మనసు యోగములో ఉంటుందో వారికి పరమాత్మ ముఖం భాసిస్తుంది. ఎవరు యోగము చేత పరిశుద్ధులో వారిలో ప్రకాశిస్తాడు. అలాంటి స్వామిని సోమరిపాటు లేకుండా

తస్యావలోకమధికం కృపయాతిఘోర
తాపత్రయోపశమనాయ నిసృష్టమక్ష్ణోః
స్నిగ్ధస్మితానుగుణితం విపులప్రసాదం
ధ్యాయేచ్చిరం విపులభావనయా గుహాయామ్

ఇపుడు పరమాత్మ కటాక్షాన్ని ధ్యానం చేయాలి. కృపతోటి పరమభయంకరమైన తాపత్రయాన్ని చల్లర్చడం కోసమే కనులనుండి సృష్టి చేయబడ్డ పరమాత్మ చూపు. ఆ చూపుకు చిరునవ్వు ఆభరణం. చిరునవ్వు దంతముల కాంతి చూపు మీద పడి ప్రకాశిస్తున్న చూపు . స్నేహభరితమైన చిరునవ్వు వెంట రాగా, విస్తృతమైన అనుగ్రహం నిండి ఉన్న అధికమైన పరమాత్మ కటాక్షాన్ని హృదయములో చాలా కాలం వరకూ స్థిరమైన భావనతో ధ్యానం చేయాలి. అందమైన పద్మములవంటి నేత్రముల కొన నుండి బయటకు ప్రసరించిన చూపును ధ్యానించాలి. పరమాత్మను ధ్యానం చేయడం కంటే, పరమాత్మ కృపా కటాక్షాన్ని, దయతో నిండిన చూపుని మనసులో నిలుపుకుని ధ్యానం చేయాలి. మన తాపత్రయాలను తొలగించడానికే పరమాత్మ తన దివ్య నేత్రములనుండి చూపును సృష్టించి మనకు పంపుతున్నాడు. ఆ చూపుతో బాటు చిరునవ్వునూ పంపాడు. ఆ చిరునవ్వు ఆ కటాక్షానికి తోడుగా ఉంటుంది. దానిని వ్యాపించి ఉండే స్థిరమైన భావనతో ధ్యానం చేయాలి

హాసం హరేరవనతాఖిలలోకతీవ్ర
శోకాశ్రుసాగరవిశోషణమత్యుదారమ్
సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య
భ్రూమణ్డలం మునికృతే మకరధ్వజస్య

పరమాత్మని ఆశ్రయించిన సమస్త లోకాలకు ఉన్న దు@ఖమనే కన్నీరు నిండిన సముద్రాన్ని ఎండింపచేసేది పరమాత్మ చిరునవ్వు. పరమ ఉదారమైనది ఆ నవ్వు. తరువాత పరమాత్మ భ్రూమండలాన్ని ధ్యానం చేయాలి. ఆ కనుబొమ్మలు మోహింపచేస్తాయి. ఎవరిని? మన్మధుడిని మోహింపచేస్తాయి. ఎందుకంటే తనవారికి మేలు చేసే వారిని మోహములోంచి బయటపడేస్తాడు. తన భక్తులని పక్కదారి పట్టించేవారిని మోహింపచేస్తాడు. తన ధనస్సుతో మన్మధుడు తన బాణం ఎక్కుపెట్టి మోహింపచేయకుండా పరమాత్మ తన కనుబొమ్మలనే ధనస్సు ఎక్కుపెట్టి మోహింపచేస్తాడు. మునులను మోహింపచేసే మన్మధున్ని కూడా మోహింపచేసేవి పరమాత్మ కనుబొమ్మలు

ధ్యానాయనం ప్రహసితం బహులాధరోష్ఠ
భాసారుణాయితతనుద్విజకున్దపఙ్క్తి
ధ్యాయేత్స్వదేహకుహరేऽవసితస్య విష్ణోర్
భక్త్యార్ద్రయార్పితమనా న పృథగ్దిదృక్షేత్

పరమాత్మ ప్రహసిత్ర (పెద్ద నవ్వు). మనందరి ధ్యానానికీ అదే ఆధారం కావాలి. తెల్లటి (కుంద) పళ్ళ మీద, కింది పెదవి యొక్క అరుణ కాంతి ప్రసరించి ఎర్రగా ఉన్న పళ్ళని ధ్యానం చేయాలి. సన్నని పళ్ళు అనే మల్లెమొగ్గల వరుస కలది. ఇలాంటి పరమాత్మ నవ్వును ధ్యానం చేయాలంటే హృదయ దహరాకాశములో ఉన్న స్వామిని పరవశించిన భక్తితో (శరీరం పులకించి కళ్ళవెంట నీరు రావాలి) ధ్యానం చేయాలి. మనసు అక్కడే అర్పించాలి. దాని కంటే వేరే దాన్ని చూడాలనుకోవద్దు.

ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధభావో
భక్త్యా ద్రవద్ధృదయ ఉత్పులకః ప్రమోదాత్
ఔత్కణ్ఠ్యబాష్పకలయా ముహురర్ద్యమానస్
తచ్చాపి చిత్తబడిశం శనకైర్వియుఙ్క్తే

ఇలా ఒక్కొక్క అవయవాన్నీ, సమగ్ర అవయవాన్ని, అన్ని కలసిన పరమాత్మ రూపాన్ని, ముఖాన్నీ, చూపునూ ధ్యానం చేయాలంటే పరమాత్మ యందు మనసు పరిపూర్ణముగా లగ్నమవ్వాలి. అప్పుడు హృదయం ద్రవిస్తుంది. అప్పుడు ఆనందముతో శరీరమంతా ఆనందముతో పులకింతలు వస్తాయి. పరమాత్మను చూడాలన్న కోరిక తీవ్రమైనందు వలన కన్నీళ్ళు వచ్చి మాటి మాటికీ పీడించబడి. అలా ధ్యానము చేయగా చేయగా నిరాకారుడైన పరమాత్మను ధ్యానించగలగాలి. అలా చేయగలగాలంటే ఇప్పటిదాకా ధ్యానించిన సాకార స్వరూపాన్ని పక్కన పెట్టాలి. మన చిత్తానికి గాలం వంటిది (బడిశం) పరమాత్మ యొక్క సాకారరూపం (పరమాత్మను పట్టుకోవడానికి మనం ఉపయోగించే గాలము). నిరాకార ధ్యానం, సాకార ప్రపంచం మీద విరక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.

ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం
నిర్వాణమృచ్ఛతి మనః సహసా యథార్చిః
ఆత్మానమత్ర పురుషోऽవ్యవధానమేకమ్
అన్వీక్షతే ప్రతినివృత్తగుణప్రవాహః

పొగలేనప్పుడు జ్వాల బాగా ప్రకాశిస్తుంది. ముక్తులందరికీ ఆశ్రయమైన వాడు పరమాత్మ - ముక్తాశ్రయం. మనం ఆకారాన్ని వదిలిపెట్టాలి. శబ్ద స్పర్శాది ఆశ్రయాలు మనం విడిచిపెట్టాలి - ముక్తాశ్రయం. నిర్విషయముగా ఉండాలి. అలా అవ్వాలంటే ప్రపంచం యందు విరక్తి పొంది ఉండాలి. అలాంటప్పుడే మనసు తృప్తిని పొందుతుంది. ప్రపంచములో బయట ఉన్న సకల వ్యాపారాలనూ ఆపేస్తుంది. బాహ్య వ్యాపార ఉపరతి. అలా బాహ్య వ్యాపారాలను తొలగించుకుని, పరమాత్మ యందే ఎలాంటి ఎడబాటు లేకుండా, శరీరమే ఆత్మ అనీ, నేను స్వతంత్ర్యుడనీ అభిమానాలు తొలగిపోయిన వాడై, తన ఆత్మను పరమాత్మయందు చూడగలగాలి.

ప్రారంభములో, అభ్యాసములో, పరమాత్మను తన ఆత్మగా చూడాలి. భక్తి జ్ఞ్యాన యోగ కర్మలు పూర్తిగా ఫలించి ధ్యానములో పరమాత్మ విగ్రహాన్ని పూర్తిగా చూడగలిగితే, దాన్ని తప్ప మరి దేన్నీ చూడలేనప్పుడు, మన మనసులో మరేదీ భాసించదూ, ఏ వ్యాపారమూ ఉండదు. అలాంటప్పుడు ఆ జీవున్ని పరమాత్మలో చూడగలగాలి. ఈ జీవాత్మ పరమాత్మ ఆత్మకం అని తెలుసుకోవాలి. అలా చూడగలుగుట ధ్యానం. తాను విడిగా లేనని, పరమాత్మ ఆత్మగా కలిగి ఉన్నానని తెలుసుకోవాలి.

సోऽప్యేతయా చరమయా మనసో నివృత్త్యా
తస్మిన్మహిమ్న్యవసితః సుఖదుఃఖబాహ్యే
హేతుత్వమప్యసతి కర్తరి దుఃఖయోర్యత్
స్వాత్మన్విధత్త ఉపలబ్ధపరాత్మకాష్ఠః

ఇలాంటి భక్తి యోగమేర్పడితే, భక్తి యోగాన్ని అనుసరించి, ధ్యానములోకి వెళ్ళి పరమాత్మను చూడగలిగి, పరమాత్మ ఆత్మగా ఉన్న జీవత్మను చూడగలిగి ఉన్న వాడికి మళ్ళీ సంసారం ఉండదు. మన దేహాన్ని బట్టి పూర్వ జన్మలో మనం చేసిన పనులు చెప్పవచ్చు. ప్రారబ్దమైన పాపం పూర్తిగా తొలగిపోయే దాకా ఇలాంటి భక్తితోనే  ఉండాలి. మనసును పరమాత్మ భక్తిలోనే ఉంచి, సంసారం నుండి మరల్చి ఉంచాలి. మన ఆత్మలో పరమాత్మ స్వరూపాన్ని పూర్తిగా పొంది, నశించ సుఖ దు@ఖముల కంటే వెలుపల ఉండి, కర్తృత్వ భావన లేకుండా ఉంచుకోవాలి. అలాంటి భావన కలగాలంటే, "దేహమంటే ప్రకృతి యొక్క పరిణామ రూపమనీ, దేహమున్నంత వరకూ శరీరం పని చేస్తుందీ, ఆ చేసే పని కూడా నేను చేయట్లేదు" అని తెలుసుకోవాలి. దేహ సంబంధ జ్ఞ్యానమే సుఖ దుఖానుభూతిని కలిగిస్తాయి. ఆత్మకు ఇవి లేవు. "ఆ దేహం నాది" అనుకోవడముతోనే బంధము వస్తుంది. ఈ భావన శరీరం మీద మనసు ఉన్నంతవరకూ తప్పదు. మరి ఆ భావన తొలగాలంటే, మనసులో మనదేహం బదులు పరమాత్మ దివ్య మంగళ విగ్రహాన్ని నిలుపుకోవాలి. అప్పుడు "నేను నావి" అనుకున్నవన్నీ శరీరానివే. "నాకు" దేనితోనూ సంబంధం లేదు అన్న విషయం అర్థమవుతుంది. నా వాడు పరమాత్మ, అని అర్థమవుతుంది. దేహాత్మాభిమానం తొలగుతుంది. అది ఒకసరి పోతే మళ్ళీ రాదు.

దేహం చ తం న చరమః స్థితముత్థితం వా
సిద్ధో విపశ్యతి యతోऽధ్యగమత్స్వరూపమ్
దైవాదుపేతమథ దైవవశాదపేతం
వాసో యథా పరికృతం మదిరామదాన్ధః

శరీరములో శరీరముతో ఉన్నాం. శరీరమాచరించే పని వలన వచ్చే సుఖ దుఖాలన్నీ మనవే అనుకుంటాం. మనసు ఎప్పుడు శరీరముతోనే ఉంటుంది. ఆ మనసులో పరమాత్మను పెట్టుకోవాలి. అప్పుడు దేహాత్మాభిమానం కలగదు.
ఆత్మ స్వరూపజ్ఞ్యానం కలిగిన తరువాత శరీరం మీద "నా శరీరం" అనే జ్ఞ్యానం ఉండదు. పరమాత్మ ధ్యానమే ప్రధానమైన కర్తవ్యముగా ఉంటుంది. దేహాత్మాభిమానం ఉండదు. ఇంతకు ముందు ఉన్న శరీరం గురించి తెలియదు. ఇప్పుడు ఉన్న శరీరం గురించీ తెలియదు. ఇప్పుడున్న శరీరం పోయినా కానీ తెలియదు. (నేను శరీరాన్ని విడిచిపెట్టాను అన్న జ్ఞ్యానం సాధారణముగా ఆత్మకు ఉంటుంది. అప్పుడు ఆత్మ, ఈ దేహాన్ని విడిచిపెట్టింది కాబట్టి, ఆ దేహములో ఉన్న మనసుకూ బుద్ధి ఆత్మతో కలిసే ఉంటాయి. ప్రకృతి మండలములో ఉన్నంత వరకూ మనసూ బుద్ధీ ఆత్మతో కలిసే ఉంటాయి. ప్రకృతి మండలం దాటి శ్వేత దీపానికి వెళ్ళాక వాటియొక్క ప్రభావం ఉండదు. మహా భారతములో నారాయణీయం అని పదహారు అధ్యాయాలు కలది ఉన్నది. అందులో శ్వేత ద్వీప వాసులకి ఇంద్రియాలూ అభిమానమూ ఉండవు అని ఉంటుంది. వారికి ప్రకృతికి సంబంధించిన స్పర్శ ఉండదు ). 
సమాధి అన్నది చరమం. ఈ శరీరమూ ఈ శరీరములో ఉండే ఇంద్రియములు (జ్ఞ్యానేంద్రియములూ కర్మేంద్రియములూ మనసు బుద్ధి చిత్తం అంతఃకరణం అహంకారం మహత్ తత్వమూ,) ఏ ఒక్కటీ కూడా తమను గురించి తాము ఆలోచించుకునే స్థితి నుండి అంతా పరమాత్మ యందే ఉండాలి. పరమాత్మ యందు ఉంచడం ధారణ. విషయములో ఉండే మనో చిత్త అహంకార వ్యాపారాన్ని వెనకూ తిప్పి, పరమాత్మ యందు ఉన్న మనసు యొక్క వ్యాపారాన్ని ప్రత్యాహారం. 
సమాధి అంటే " మనసు బుద్ధి మొదలైనవి పరమాత్మ యందే ఉంచిన తరువాత ఫలం ఏమిటి" అన్న దానికి ఆస్కారం ఉండదు. కర్మకూ ఫలానికి  వ్యవధానం లేని స్థితే సమాధి. సమాధికి వెళ్ళిన తరువాత ఫలితం వస్తుందో, ఎపుడు వస్తుందో అనే ఆలోచన రావడానికి వీలులేదు. అందుకే సమాధి అంటే చరమం. అలా పరమాత్మ దగ్గరకి వెళ్ళిన తరువాత ప్రకృతి సంబంధం రాదు. 
వీరిని సిద్ధః అంటారు. అంటే భగవంతుని అనుగ్రహంతో తన స్వరూపం తాను సాక్షాత్కరింపచేసుకున్నవాడిని సిద్ధుడు అంటారు. కేవలం ఆత్మగా, పరమాత్మగా కాకుండా, పరమాత్మ ఆత్మగా ఉన్న ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే సిద్ధి. 
ఇలాంటి వ్యక్తి నశ్వరమైన దేహం ఉన్నదా పోయినదా(దేహం చ తం న చరమః స్థితముత్థితం వా) అనే విషయం కూడా తెలియదు (దహన సంస్కారం జరిగినదా లేదా అనేది కూడా తెలియదు) - సిద్ధో విపశ్యతి
ఎందుకంటే ఇలాంటి ఆనందస్వరూపం (యత అऽధ్యగమత్స్వరూపమ్ - ఆత్మకు ఉన్న అష్ట గుణ ఆవిర్భావం పొందినవాడు. ). శరీరం వచ్చేదీ పోయేదీ స్వామి వలననే (దైవాదుపేతమథ దైవవశాదపేతం). 
అలా ఎలా ఉంటుంది? బాగా మద్యపానం చేసిన వాడికి ఒంటి మీద బట్ట ఉందా లేదా అని కూడా తెలియనట్లుగా. అలాగే ఆత్మ స్వరూప సాక్షాత్కారాన్ని పొందిన సిద్ధుడు పరమాత్మ వలన వచ్చిన శరీరం ఉన్నదా లేదా అన్నది కూడా గుర్తించడు.

దేహోऽపి దైవవశగః ఖలు కర్మ యావత్
స్వారమ్భకం ప్రతిసమీక్షత ఏవ సాసుః
తం సప్రపఞ్చమధిరూఢసమాధియోగః
స్వాప్నం పునర్న భజతే ప్రతిబుద్ధవస్తుః

ఈ శరీరం కూడా మనం ఆచరించిన పుణ్య పాప కర్మలకు అనుగుణమైన శరీరం పరమాత్మ ఇస్తే వస్తుంది. ఆ కర్మల ఫలితాన్ని అనుభవించడానికే ఏ శరీరం అణువైనదైతే ఆ శరీరం ఇస్తాడు. మనమే ప్రాణమూ (సాసుః) ఇంద్రియమూ మనసూ బుద్ధి ఉన్నవరకూ, ఈ శరీరముతో అనుభవించే వాటిగురించీ, కర్మల గురించీ ఆలోచిస్తూ ఉంటాము. ఆ ఆలోచనకు కావలసిన ఉపకరణాలు మాత్రం పరమాత్మే ఇస్తాడు. మరి ఆ పాపం చేసేవాటిని పరమాత్మ ఎందుకిచ్చాడు? విత్తనం భూమిలో పడ్డప్పుడు ఎలాంటి విత్తనం పడితే అలాంటి చెట్టు వస్తుంది. పూర్వ జన్మలో ఆచరించిన కరమ సంస్కారానికి తగిన శరీరం ఇస్తాడు. అది మారాలనటే సిద్ధుల సంపర్కం కావాలి. అదే సత్సంగం. పరమాత్మకు దయ కలిగితే అలాంటి వారితో సంగం కలిగిస్తాడు. 
ఎంత వరకూ శరీర సంబంధం విడిచిపెట్టదో అంతవరకూ దేహాత్మాభిమానం పోదు, ఆత్మ సాక్షాత్కారం కలగదు. ఆత్మ స్వరూప సాక్షాత్కారం కలగడం అనేది, ఈ శరీరమూ ప్రాణము పోయిన తరువాతనే. అంటే ప్రారబ్ధ కర్మ కూడా పోయిన తరువాతనే. కొందరు సిద్ధులకి మాత్రం ఈ శరీరం ఉన్నా వారికి ఆత్మ స్వరూపజ్ఞ్యానం మోక్షం కలుగుతుంది. 
ఒక సారి అలాంటి సాక్షాత్కారం కలిగితే, కలలో కన్న వస్తువులను పొందలేనట్లుగా, వారు సంసారాన్ని పొందలేరు. వాస్తవముగా ఈ బ్రతుకంతా ఒక స్వప్నములాంటిది. అలాంటి వారు మళ్ళీ దేహ సంబంధాన్ని పొందరు. మళ్ళీ సంసారానికి రారు ("నన్ను పొందిన తరువాత వాడు మరలా పుట్టడు - గీత) 

యథా పుత్రాచ్చ విత్తాచ్చ పృథఙ్మర్త్యః ప్రతీయతే
అప్యాత్మత్వేనాభిమతాద్దేహాదేః పురుషస్తథా

శరీరమూ బుద్ధి మనసు అహంకారం చిత్తం. ఈ ఆరింటికన్నా ఆత్మ వేరే ఉందా. ఉన్నట్లు ఎలా నమ్మాలి? ఏ ప్రమాణం ఉంది?  "నా శరీరం" అంటే నేను వేరు శరీరం వేరు. "నా పుత్రుడు" అంటే నేను వేరు పుత్రుడు వేరు. ఏది నా అంటున్నామో అది ఆత్మ. ప్రపంచములో అందరికంటే అన్నిటికన్నా ప్రీతిపాత్రమైనది పుత్రుడు. అయినా కొడుకు వేరు "నేను " వేరు. పుత్రుడు మిత్రుడూ వీరు మనకు ప్రీతి పాత్రమైన వారు. వారికంటే మనిషి విడిగానే కనపడతాడూ, తెలుసుకుంటాడు. కొడుకు మీద ప్రేమ ఉంది అంటే మొదట తన మీద తనకు ప్రీతి ఉన్నది అని అర్థం. అత్యంత ప్రీతి పాత్రమైంది దేహం. "నాకు నా మిత్రునికీ/పుత్రునికి భేధమే లేదు" అని మాటలలో అన్నా, ఆ "నేను" వేరు, పుత్రుడు/మిత్రుడు వేరు. అలాగే దేహము వేరు పురుషుడు వేరు. 

యథోల్ముకాద్విస్ఫులిఙ్గాద్ధూమాద్వాపి స్వసమ్భవాత్
అప్యాత్మత్వేనాభిమతాద్యథాగ్నిః పృథగుల్ముకాత్

శరీరమూ ఆత్మా ఎలా వేరో, ప్రకృతి వేరు పరమాత్మ వేరు. అగ్ని వల్లనే నిప్పు రవ్వ (విస్ఫులింగం) ఏర్పడుతుంది. అగ్ని, పచ్చి కట్టే సమ్యోగము వలనే పొగ వస్తుంది. ఆ కట్టెకు అంటుకున్న నిప్పు కట్టె బాగా కాలి కిందపడితే అది నిప్పు కణం అంటాం. మరి నిప్పూ, నిప్పుకణం, పొగ ఈ మూడూ ఒకటేనా? వేరా? నిప్పు వలన వచ్చిన పొగా ఎలా నిప్పు కాదో, అగ్ని సమ్యోగం వలన వచ్చిన కట్టే, కట్టెలోంచి వచ్చిన నిప్పు కణం, ఎలా నిప్పుకన్నా వేరో, దాని కన్నా అగ్ని ఎలా వేరుగా ఉందని చెప్పుకుంటామో 

భూతేన్ద్రియాన్తఃకరణాత్ప్రధానాజ్జీవసంజ్ఞితాత్
ఆత్మా తథా పృథగ్ద్రష్టా భగవాన్బ్రహ్మసంజ్ఞితః

పొగ వేరు, నిప్పు కణం వేరు, నిప్పు వేరు - అలాగే ప్రకృతి వేరు, జీవుడు వేరు, పరమాత్మ వేరు. పొగ నిప్పు రవ్వా, అగ్ని వలనే వస్తుంది. కానీ అగ్ని వీటన్నిటికన్నా వేరుగా ఉంటుంది. పరమాత్మ నుంచి వచ్చినవన్నీ చూచి వాటిని తాత్కాలికముగా వాటిని పరమాత్మ అని భ్రమించుట, పొగను నిప్పు అనుకోవడం అని భ్రమించుట వంటిది. 
ప్రధానం (కర్మేందిర్య జ్ఞ్యానేంద్రియ మనసు బుద్ధి చిత్తం అంతఃకరణం), జీవుడు, వీటి కంటే పరమాత్మ వేరు. వేరుగా ఉండి, అన్నింటిలోనూ ఉండి చూచేవాడు, ఆరు గుణములు కలవాడు, బ్రహ్మ సజ్ఞ్యిత అయిన వాడు పరమాత్మ. 

సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని
ఈక్షేతానన్యభావేన భూతేష్వివ తదాత్మతామ్

సర్వభూతేషు చాత్మానం - దేవ మనుష్య తిర్యక్కులూ స్థావరాలు ఈ నాలుగు రకముల ప్రాణులూ ఒకటా వేరా? వీటన్నింటిలో ఉన్న ఆత్మలు ఒకటే. అనేకమంది జీవులలో ఉన్న ఆత్మలన్నీ జ్ఞ్యానస్వరూపాలే. అన్ని ప్రాణులలో ఆత్మ ఒకటే. ఆన్ని ఆత్మలలో ఉన్న ప్రాణులు (శరీరాలు) కూడా ఒకటే. ఎలాగంటే దేవ తిర్యక్ మనుష్య స్థావరాలు కూడా వారి వారి పాప పుణ్యాలతో జన్మించినా, అన్ని శరీరాలు పాంచభౌతికములే. ప్రతీ ఆత్మ ధరించే శరీరాలన్నీ పాంచభౌతికములే. ఆ శరీరాలు ధరించే ఆత్మలు జ్ఞ్యానాధికరణములే. వీటన్నింటిలో ఉన్న పరమాత్మ ఒక్కడే (ఏకమేవ అద్వితీయం బ్రహ్మ) . ఆత్మలకు ధారకమైన అన్ని శరీరాలు పంచభౌతికములే, అన్ని ఆత్మలు జ్ఞ్యానాకారములే, అన్ని ఆత్మలకు ఆత్మ అయిన పరమాత్మ ఒకడే. మనకు వేరు వేరు అనిపించేవి ఏవీ వేరు కాదు. అన్నీ పాంచభౌతికములే. 
ఇలా చూడగలిన వాడే యోగి. అన్ని ప్రాణులలో పరమాత్మ ఆత్మగా ఉన్నాడని చూడాలి

స్వయోనిషు యథా జ్యోతిరేకం నానా ప్రతీయతే
యోనీనాం గుణవైషమ్యాత్తథాత్మా ప్రకృతౌ స్థితః

మంట పెట్టినప్పుడు, కట్టెను బట్టి మంట వంకరగా, పొట్టిగా, పొడుగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే ఆత్మలలో తేడా లేదు. ఆకారములో తేడా. కారణముల యొక్క మార్పుతోటే ఆత్మకూడా మారినట్లనిపిస్తుంది. 

తస్మాదిమాం స్వాం ప్రకృతిం దైవీం సదసదాత్మికామ్
దుర్విభావ్యాం పరాభావ్య స్వరూపేణావతిష్ఠతే

వంకర కట్టెలో గానీ, పొడుగు కట్టెలో గానీ ఒకే నిప్పు చాలారకాలుగా కంపిస్తుంది. అలాగే ఆత్మ కూడా చాలా రకాలుగా కనపడుతుంది. ఈ ప్రకృతి దైవీం (దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా- గీత). ఇది కార్య కారణ రూపములో ఉంటుంది. ఇది మన ఊహకు అందదు. అలాంటి ప్రకృతిని విడిచిపెట్టినవాడే స్వస్వరూపముతో ఉండగలడు. ప్రకృతిని వదిలిపెట్టాకే ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలడు. ప్రకృతి వదిలిపెట్టాలంటే కార్య కారణం గురించి అర్థం కావాలి. ప్రకృతి పురుషున్ని విడిచిపెట్టదు కదా అని దేవహూతి అడిగిన ప్రశ్నకు సమాధానముగా కపిలుడు చెప్పిన సమాధానం ఇది

 శర్వం శ్రీ కృష్ణార్పణమస్తు