Pages

Friday, 7 February 2014

భగవంతుని చేరడానికి తొమ్మిది అడుగులు


కపిల గీతాంతర్గతం (మూడవ స్కంధం ఇరవై ఏడవ అధ్యాయంలోనించి)
 ప్రకృతితో చిత్తము బలముగా తగలుకొని ఉంటుంది. ఆ చిత్తాన్ని మెల్లగా బయటకి లాగు. ఇంద్రియ మార్గములో (అసతాం పధి)  ఆసక్తముగా ఉన్న చిత్తమును మెల్లగా నీ వశములోనికి తెచ్చుకో. తీవ్రమైన భక్తి యోగముతో, తీవ్రమైన విరక్తితో చిత్తాన్ని నీ వశములోకి చేసుకో. సహజముగా మనకి సంసారం అంటే ప్రేమ, భగవంతుని మీద విరక్తి వస్తుంది. ఈ విరక్తిని సంసారము వైపు, భక్తిని పరమాత్మ వైపు మళ్ళించు. అలా ఇంద్రియ మార్గములో సంచరించే చిత్తాన్ని నీ వశములోకి తెచ్చుకో.

1. దీనికి శ్రద్ధ కావాలి. బుద్ధీ, మనసు , అహంకారమునూ, చిత్తమునూ, ఈ నాలిగింటిని ఒకే దారిలో నడుపుట శ్రద్ధ. 
2. నీ చెవులు నా కథలు వినేట్టు చేయి. అలా వింటూ ఉంటే, మనసు నా యందు తగలుకుంటుంది. ప్రకృతికి కేటాయించే సమయాన్ని పరమాత్మకి కేటాయించబడుతుంది. ఆ సమయం మెల్లిగా త్రికరణ శుద్ధిగా, కపటము లేకుండా పెంచుకుంటూ వెళ్ళు. అలా చేస్తూ వెళ్ళగా, నా మీద భక్తి కలుగుతుంది. 
అప్పుడు ఈ కింది వరుస క్రమములో జరుగుతాయి:
3.  ద్వేషభావం తొలగుతుంది - తరువాత అన్ని భూతములయందు సమానముగా ఉన్న భగవానుని చూస్తావు -  దేనియందు ఆసక్తి ఉండకూడదు - తరువాత ఎవరిమీదా ద్వేషము పొందకుండా, అందరినీ సమముగా చూడాలి. ఇవి జరగాలంటే, 
4. శరీర భోగాల మీద ఆసక్తి తగ్గాలి - తగ్గాలంటే  బ్రహ్మచర్యాన్ని అలవరచుకోవాలి. అలా చేయాలంటే,  బ్రహ్మచర్యానికి భంగం కలిగించేది, కనపడిన ప్రతీ వారితో మాటలు కలపడం. బ్రహ్మచర్యానికి మూలం మౌనం. మౌనం అలవాటు చేసుకోవాలి. మౌనం అలవాటు కావాలంటే స్వధర్మాసక్తి కావాలి. 
5. ఇవన్నీ కలగాలంటే, భగవంతుని సంకల్పముతో లభించిన దానితో తృప్తి పొందడం నేర్చుకోవాలి. పరమాత్మ ఏమి ఇస్తే దానితో సంతృప్తి చెందాలి. అలా కలగాలంటే, మితముగా భుజించాలి. ఆహారం కొంచెం తీసుకుంటే ఆశలు పెరగవు. మౌనముగా ఉండాలి. మౌనానికి ప్రధాన సాధనం "ఒక్కడే ఉండటం" లేదా ఒంటిగా ఉండటం.
6. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి (శాంతః), అలా ఉండాలంటే అందరి యందు మిత్ర భావన కలిగి ఉండాలి. అది ఉండాలంటే, ఎదుటి వారి మీద కరుణ కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలవాడు, ఆత్మ యాదాత్మ్య జ్ఞ్యానం కలవాడు (ఆత్మవాన్) అయి ఉండాలి. 
7. ఇవన్నీ కలిగిన తరువాత, ఈ శరీరము యందు ఆసక్తిని తగ్గించాలి. దుష్టమైన కోరికనూ, ఆసక్తినీ తగ్గించాలి. ఒక్క దేహానికి మాత్రమే కాదు. స బంధు. పుత్ర మిత్రాదులతో ఉన్న దేహం యొక్క ఆసక్తిని తగ్గించాలి. ఈ భోగాలలో ఏదీ ఆత్మకోసం లేదు. ఇన్ని అనుబంధాలతో ఉన్న శరీరమునకు సత్స్నేహాలు పెంచుకోవాలి. ఆ స్నేహాలు వలన భక్తి పెరిగితే మంచిదే, కానీ అసత్ స్నేహాలని దూరముగా ఉంచాలి.
ప్రకృతి తత్వమునూ పురుష తత్వమునూ చక్కగా తెలుసుకోవడమే జ్ఞ్యానం.
8. బుద్ధి యొక్కా, మనసు యొక్కా, ఆసక్తిని తొలగించాలి, ప్రవృత్తిని తొలగించాలి. మనసు బుద్ధీ వేటి యందు ప్రవర్తిస్తుందో వాటిని వెనక్కు మరల్చాలి. ఇతరములను చూడకూడదు.  ఇతరములను చూచుట దూరము చేసుకో. మెల మెల్లగా విడిచిపెట్టు.  భగవంతుని కంటే ఇతరములైన విషయములను విడిచిపెట్టుట మెలమెల్లగా తగ్గించు, ఒక్కసారిగా కాదు. అప్పుడు జీవునితో పరమాత్మను తెలుసుకోవాలి
9. అప్పుడు జీవునితో పరమాత్మను తెలుసుకోవాలి. సూర్యుడు ప్రపంచాన్ని చూపుతున్నాడు. ప్రపంచాన్ని చూపుతున్న సూర్యుడిని కన్ను చూపుతున్నది. కన్నుతో సూర్యుని చూడాలన్నా, కన్నులో ఉన్న సూర్యుడే కారణం. సూర్యభగవానుడు కంటిలో ఉంటాడు. ఆయన చేతనే, ఆయన కంటిలో ఉండుట చేతనే సూర్యున్ని చూస్తున్నాము. అలాగే అంతర్యామిగా పరమాత్మ ఉన్న ఆత్మతో పరమాత్మను చూడాలి. అంటే చూపేవాడూ, చూపకుండా ఉండే వాడూ ఆయనే.