Pages

Friday, 7 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై ఏడవ అధ్యాయం - కపిల దేవహూతి సంవాదం - భక్తి యోగము


శ్రీభగవానువాచ
ప్రకృతిస్థోऽపి పురుషో నాజ్యతే ప్రాకృతైర్గుణైః
అవికారాదకర్తృత్వాన్నిర్గుణత్వాజ్జలార్కవత్

సకల చరా చర సృష్టి చేసిన పరమాత్మ మనందరికీ అవయవాలు ఇంద్రియాలు అధిష్ఠాన దేవతలనిచ్చాడు, వాళ్ళతో పని చేయిస్తున్నాడు, ఫలితాన్నీ ఇస్తున్నాడు. ఇది తెలిసిన మనం పరమాత్మని తప్ప మరి దేన్నీ ధ్యానం చేయము. ఇదంతా పరమాత్మ అధికారములో ఉంది. ఇలాంటి పరమాత్మని చేరడానికి ఉపాయం ఏమిటి. అదే భక్తి.
భక్తి కలగాలంటే జీవాత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి తెలియాలి. ఆత్మ స్వరూపం అతీంద్రియం. కంటికీ ముక్కుకీ వేరే ఇంద్రియాలకు అందదు. మరి శరీరములో ఉన్నవాటితో అర్థం చేసుకోలేకపోతే ఏమి చేయాలి. మనం నిద్ర పోయినపుడు ఆత్మ పరమాత్మతో ఉంటాడు. ఆత్మకు ఎలాంటి సంసారం లేదు. ప్రకృతితో ఏర్పడిన సంబంధమే ఆత్మకు సంసారం. ప్రకృతి సంబంధం వలన వచ్చిన వికారములు. ఆ వికారములే "నేను నిదురపోయాను, నేను కలలు కన్నాను, మెలకువగా ఉన్నాను" అనే భావనలు వస్తాయి. ప్రకృతి సంబంధం లేకుంటే (శరీరం లేకుంటే) సుఖమూ దుఖమూ లేదు. ప్రకృతి సంబంధ ఆయత్తములే కర్తృత్వం గానీ, జ్ఞ్యాతృత్వం గానీ భోక్తృత్వం గానీ. జీవుడు శరీరములో ఉన్నా, శరీరములో ఉన్న దోషాలు వాడికి అంటవు. శరీరములో ఉండే సత్వ రజ తమస్సులు గానీ, దేవత్వం మనుష్యత్వం గనీ, సుఖ దుఖములు గానీ ఆత్మకు అంటవు. ఈ వికారాలన్నీ శరీరానికి గానీ, ఆత్మకు కాదు.

ఆత్మ ఎక్కడికీ వెళ్ళదూ, ఏమీ చేయదు. బాహ్యముగా ఉండే సాంసారిక వ్యాపారాలు ఆత్మకు లేవు. సత్వ గుణమూ రజో గుణమూ తమో గుణమూ ప్రకృతికే ఉన్నాయి గానీ ఆత్మకు లేవు. ఆత్మ శుద్ధం. గుణ త్రయాతీతం. ఆత్మ శరీరములో ఉన్నా, ఆత్మకు శరీర గత దోషములు అంటవు. ఎలాగంటే సూర్యుడు ఎక్కడో ఉండి నీటిలో ప్రతిబింబిస్తాడు. నీరు కదిలితే సూర్యుడు కద్లినట్లు అనిపిస్తాడు. అలాగే శరీరముతో వచ్చిన సుఖ దుఖాలన్నీ ఆత్మకు ఉండవు. అసలు వస్తువు చాలా దూరములో ఉంది. ఈ దూరాన్ని మూడు రకాలుగా చెప్తారు
అలాగే ఆకాశము అన్ని చోట్లా ఉంటుంది. గానీ ఏ చోటా ఉన్న మలము ఆకాశానికి అంటదు. అలాగే కుండ ఉన్నా పగిలినా అందులో ఆకాశం ఉంటుంది. కుండ ఉన్నంత కాలం దాన్ని ఘటాకాశం అంటం.  ఇది కాల విప్రకర్షం.  కరక్కాయని తిని నీరు తాగితే నీరు తీయగా ఉంటుంది. ఆ తీయదనం కరక్కాయ ఉన్నంతవరకూ ఉంటుంది. అంటే ఇది స్వభావముతో వస్తుంది. ఈ విప్రకర్షాలన్నీ సహజమైనవి కావు
1. దేశ విప్రకర్షం
2. కాల విప్రకర్షం
3.స్వాభావిక విప్రకర్షం
కట్టె ఆకారాన్ని బట్టి మంట ఆకారం ఉంటుంది. పాత్ర ఆకారాన్ని బట్టి నీటి ఆకారం ఉంటుంది. పొట్టి పొడుగూ బ్రాహ్మణ క్షత్రియ రాక్షసా స్త్రీ పురుష భేధాలు శరీరానివి కానీ ఆత్మవు కావు
1. ఆత్మలో ఏ వికారాలు లేవు 2. ఆత్మ దేనికీ కర్త కాదు 3. ఆత్మలో ఏ గుణాలు లేవు

స ఏష యర్హి ప్రకృతేర్గుణేష్వభివిషజ్జతే
అహఙ్క్రియావిమూఢాత్మా కర్తాస్మీత్యభిమన్యతే

మరి అలాంటప్పుడు "నేను చేస్తున్నాను" అని ఎందుకు అనుకుంటున్నాడు? ఆ అనుకునే "నేను" అసలు నేను కాదు. ప్రకృతి గుణములలో చిక్కుకున్నప్పుడు అహంకారముతో కప్పి వేయబడతాడు. దానితో "నేనే కర్త" అనుకుంటాడు. అసలు కర్తను చూడలేకపోతాడు. అది వేరు (ప్రకృతి వేరు) నేను వేరు అనే జ్ఞ్యానాన్ని కోల్పోతాడు. ఆ ప్రకృతి ఈ ఆత్మను కప్పివేస్తోంది. అప్పుడు నేను కర్తనూ, అనే భావానికి వస్తాడు జీవుడు.
ఈ కారణముతోనే మనసుతో సంసారములో మునుగుతాడు. పాపం ఎంత దోషమో పుణ్యమూ అంతే దోషం. పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్ళి మళ్ళీ పుట్టాలి.

తేన సంసారపదవీమవశోऽభ్యేత్యనిర్వృతః
ప్రాసఙ్గికైః కర్మదోషైః సదసన్మిశ్రయోనిషు

ఇది దేవ రాక్షస మానవ (సదసన్మిశ్రయోనిషు - సత్ - అసత్ మిశ్రయోనిషు). ఆత్మ పుట్టదు. శరీరం చేసిన పని నాదే అనుకున్న పాపానికి, ఆ శరీరానికి ఏ శిక్ష పడాలో దానికి తగ్గా శరీరం వస్తుంది. మానవుడి శరీరం తట్టుకొనే కష్ట సుఖాలను క్రిమి కీటకాలు తట్టుకోలేవు. మనం ఎంత పాపం చేస్తే అంత చిన్న శరీరం వస్తుంది. ఎలాంటి పాపం చేస్తే నాకిలాంటి శరీరం వచ్చింది అని ఆలోచించే కాలము కూడా లేని శరీరం వస్తుంది.

అర్థే హ్యవిద్యమానేऽపి సంసృతిర్న నివర్తతే
ధ్యాయతో విషయానస్య స్వప్నేऽనర్థాగమో యథా

ఆత్మకు వాస్తవముగా దేవక్ తిర్యక్ మనుష్యాది శరీరాలు లేకున్నా ఈ ఆత్మ సంసారాన్ని విడిచి పెట్టదు. సంసారమూ ఆత్మని విడిచిపెట్టదు.  నేను మన్సిషినీ అంటే ఎంత అహంకారమో, నేను మనిషిని కాదు అన్నా అహంకారమే. నేను మంచివాడినీ అంటే ఎంత అహంకారమో, నేను చెడ్డవాడినీ అంటే అంతే అహంకారం. ఆత్మ ఏమీ కాకున్నా, ఆత్మకు ఏమీ లేకున్నా, ఎక్కడో ఉన్న విషయాలను ధ్యానం చేస్తూ ఉంటే విషయాలతో సంగం ఏర్పడుతుంది. ఎలాగంటే కలలో వచ్చే విషయాలు నిజముగా మనకే వస్తాయి అనిపిస్తాయి.

అత ఏవ శనైశ్చిత్తం ప్రసక్తమసతాం పథి
భక్తియోగేన తీవ్రేణ విరక్త్యా చ నయేద్వశమ్

నీకు వాస్తవముగా ఏమీ లేదు, నీకు దేనితో సంబంధము లేదు. సంబంధము లేని దానిని ధ్యానించుటచే సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రకృతితో చిత్తము బలముగా తగలుకొని ఉంటుంది. ఆ చిత్తాన్ని మెల్లగా బయటకి లాగు. ఇంద్రియ మార్గములో (అసతాం పధి)  ఆసక్తముగా ఉన్న చిత్తమును మెల్లగా నీ వశములోనికి తెచ్చుకో. తీవ్రమైన భక్తి యోగముతో, తీవ్రమైన విరక్తితో చిత్తాన్ని నీ వశములోకి చేసుకో. సహజముగా మనకి సంసారం అంటే ప్రేమ, భగవంతుని మీద విరక్తి వస్తుంది. ఈ విరక్తిని సంసారము వైపు, భక్తిని పరమాత్మ వైపు మళ్ళించు. అలా ఇంద్రియ మార్గములో సంచరించే చిత్తాన్ని నీ వశములోకి తెచ్చుకో.

యమాదిభిర్యోగపథైరభ్యసఞ్శ్రద్ధయాన్వితః
మయి భావేన సత్యేన మత్కథాశ్రవణేన చ

దీనికి శ్రద్ధ కావాలి. బుద్ధీ, మనసు , అహంకారమునూ, చిత్తమునూ, ఈ నాలిగింటిని ఒకే దారిలో నడుపుట శ్రద్ధ. యమ నియమాదులతో, మెల్లిగా అభ్యాసము చేయాలి. నీ చెవులు నా కథలు వినేట్టు చేయి. అలా వింటూ ఉంటే, మనసు నా యందు తగలుకుంటుంది. ప్రకృతికి కేటాయించే సమయాన్ని పరమాత్మకి కేటాయించబడుతుంది. ఆ సమయం మెల్లిగా త్రికరణ శుద్ధిగా, కపటము లేకుండా పెంచుకుంటూ వెళ్ళు. అలా చేస్తూ వెళ్ళగా, నా మీద భక్తి కలుగుతుంది.

సర్వభూతసమత్వేన నిర్వైరేణాప్రసఙ్గతః
బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ బలీయసా

అప్పుడు ద్వేషభావం తొలగుతుంది. అలా చేయగా అన్ని భూతములయందు సమానముగా ఉన్న భగవానుని చూస్తావు. అలాంటి భావన వచ్చినప్పుడు  దేనియందు ఆసక్తి ఉండకూడదు. ఎవరిమీదా ద్వేషము పొందకుండా, అందరినీ సమముగా చూడాలి. ఇవి జరగాలంటే, శరీర భోగాల మీద ఆసక్తి తగ్గాలి. బ్రహ్మచర్యాన్ని అలవరచుకోవాలి. బ్రహ్మచర్యానికి భంగం కలిగించేది, కనపడిన ప్రతీ వారితో మాటలు కలపడం. బ్రహ్మచర్యానికి మూలం మౌనం. మౌనం అలవాటు చేసుకోవాలి. మౌనం అలవాటు కావాలంటే స్వధర్మాసక్తి కావాలి.

యదృచ్ఛయోపలబ్ధేన సన్తుష్టో మితభుఙ్మునిః
వివిక్తశరణః శాన్తో మైత్రః కరుణ ఆత్మవాన్

ఇవన్నీ కలగాలంటే, భగవంతుని సంకల్పముతో లభించిన దానితో తృప్తి పొందడం నేర్చుకోవాలి. పరమాత్మ ఏమి ఇస్తే దానితో సంతృప్తి చెందాలి. అలా కలగాలంటే, మితముగా భుజించాలి. ఆహారం కొంచెం తీసుకుంటే ఆశలు పెరగవు. మౌనముగా ఉండాలి. మౌనానికి ప్రధాన సాధనం ఒక్కడే ఉండటం. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి (శాంతః), అందరి యందు మిత్ర భావన కలిగి ఉండాలి. అది ఉండాలంటే, ఎదుటి వారి మీద కరుణ కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలవాడు, ఆత్మ యాదాత్మ్య జ్ఞ్యానం కలవాడు (ఆత్మవాన్)

సానుబన్ధే చ దేహేऽస్మిన్నకుర్వన్నసదాగ్రహమ్
జ్ఞానేన దృష్టతత్త్వేన ప్రకృతేః పురుషస్య చ

ఇవన్నీ కలిగిన తరువాత, ఈ శరీరము యందు ఆసక్తిని తగ్గించాలి. దుష్టమైన కోరికనూ, ఆసక్తినీ తగ్గించాలి. ఒక్క దేహానికి మాత్రమే కాదు. స బంధు. పుత్ర మిత్రాదులతో ఉన్న దేహం యొక్క ఆసక్తిని తగ్గించాలి. ఈ భోగాలలో ఏదీ ఆత్మకోసం లేదు. ఇన్ని అనుబంధాలతో ఉన్న శరీరమునకు సత్స్నేహాలు పెంచుకోవాలి. ఆ స్నేహాలు వలన భక్తి పెరిగితే మంచిదే, కానీ అసత్ స్నేహాలని దూరముగా ఉంచాలి.
ప్రకృతి తత్వమునూ పురుష తత్వమునూ చక్కగా తెలుసుకోవడమే జ్ఞ్యానం. అసదాగ్రహం - లేని దాన్ని గురించి పట్టుదల. శరీరము నేనే అనుకోవడం కూడా అసదాగ్రహమే. నేనూ-నాదీ అనుకోవడం కూడా అసదాగ్రహం. ఇది పోగొట్టుకోవాలి. జ్ఞ్యానం కేవలం ఆత్మకే ఉంటుంది. జ్ఞ్యానానికి నెలవు ఆత్మ.

నివృత్తబుద్ధ్యవస్థానో దూరీభూతాన్యదర్శనః
ఉపలభ్యాత్మనాత్మానం చక్షుషేవార్కమాత్మదృక్

శరీరమునకూ ఇంద్రియములకూ మనసుకూ జ్ఞ్యానం ఉండదు. ప్రకృతి పురుషుల యధార్థ తత్వము తెలిపే జ్ఞ్యానముతో బుద్ధి అవస్థానం (బుద్ధి యొక్క సమూహం - బుద్ధి మనసు చిత్తం అంతఃకరణం) చేసే పని అయిన సంకల్ప వికల్పాలు, నిశ్చయ, విపరీత జ్ఞ్యానాలనుంచి పక్కకు తొలగుతుంది. ఇలా జరగాలంటే ప్రకృతి అంటే ఏమిటో పురుషుడు అంటే ఏమిటొ తెలిస్తే, ప్రకృతితో పురుషుడు సంబంధం ఏర్పరుచుకోవడానికి చేసే వ్యాపారమే, సంకల్పం వికల్ప్లం, భ్రమ అన్యధా జ్ఞ్యానం విపరీత జ్ఞ్యానం. ఇవి మానేసినపుడు, బుద్ధి మనసు యొక్క పనులైన సంకల్ప వికల్పాలను విడిచిపెడతాడు. దాని వలన పరమాత్మ కన్నా ఇతరమైన వాటిని దర్శించడు. భగవంతుని కంటే భిన్నమైన వాటిని చూడకుండా అయ్యి, పరమాత్మ చేత జీవాత్మను తెలుసుకుంటాము.  భగవంతుని చేతనే జీవాత్మ స్వరూపం తెలుస్తుంది.

బుద్ధి యొక్కా, మనసు యొక్కా, ఆసక్తిని తొలగించాలి, ప్రవృత్తిని తొలగించాలి. మనసు బుద్ధీ వేటి యందు ప్రవర్తిస్తుందో వాటిని వెనక్కు మరల్చాలి. ఇతరములను చూడకూడదు.  ఇతరములను చూచుట దూరము చేసుకో. మెల మెల్లగా విడిచిపెట్టు.  భగవంతుని కంటే ఇతరములైన విషయములను విడిచిపెట్టుట మెలమెల్లగా తగ్గించు, ఒక్కసారిగా కాదు. అప్పుడు జీవునితో పరమాత్మను తెలుసుకోవాలి.
సూర్యుడు ప్రపంచాన్ని చూపుతున్నాడు. ప్రపంచాన్ని చూపుతున్న సూర్యుడిని కన్ను చూపుతున్నది. కన్నుతో సూర్యుని చూడాలన్నా, కన్నులో ఉన్న సూర్యుడే కారణం. సూర్యభగవానుడు కంటిలో ఉంటాడు. ఆయన చేతనే, ఆయన కంటిలో ఉండుట చేతనే సూర్యున్ని చూస్తున్నాము. అలాగే అంతర్యామిగా పరమాత్మ ఉన్న ఆత్మతో పరమాత్మను చూడాలి. అంటే చూపేవాడూ, చూపకుండా ఉండే వాడూ ఆయనే.
భగవత్సాక్షాత్కారమైనా, భగవదంతర్ధామైనా భగవంతునితోటే జరుగుతుంది. పరమాత్మ, తాను ఆత్మలో ఉండి, ఆ ఆత్మతోనే పరమాత్మను చూపుతాడు. అంటే భగవంతుని చూపేదీ, సంసారాన్ని చూపేదీ పరమాత్మే.  పరమాత్మను ఆశ్రయించడమొక్కటే పరమాత్మను చూడటానికి మార్గము.

పరమాత్మ అనుగ్రహంతోటే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆయన సంకల్పము లేకుంటే ఉన్న శాస్త్ర జ్ఞ్యానముతో ఆయుష్షు వ్యయము అవుతుంది తప్ప లాభం ఉండదు.

ముక్తలిఙ్గం సదాభాసమసతి ప్రతిపద్యతే
సతో బన్ధుమసచ్చక్షుః సర్వానుస్యూతమద్వయమ్

ముక్త లింగః అంటే జీవుడవుతాడు. ముక్త లింగం అంటే పరమాత్మ అవుతాడు. ద్వితీయా విభక్తి అయితే పరమాత్మను, ప్రధమా విభక్తి అయితే జీవాత్మను చెబుతాయి.
లింగమంటే దేహం. మనమే పేరు పెట్టినా, ఆ పేరు శరీరానికే గానీ ఆత్మకు కాదు. ఎపుడైతే పరమాత్మ స్వరూప జ్ఞ్యానం అవగతమవుతుందో, అపుడు దేహాసక్తి పోతుంది. అప్పుడు ముక్తలింగుడవుతాడు. ఆత్మ ఉంది అని చెప్పడానికి గుర్తుగా చెప్పబడుతున్న శరీరం మీద అనుబంధం వదిలిపెట్టబడుతుంది. దేవ తిర్యక్ మనుష్యాది బుద్ధిని విడిచిపెడతాడు. ఇది ముక్త లింగః - జీవుడు. ఇది పరమాత్మ జ్ఞ్యానం కలిగిన ఆత్మ జ్ఞ్యాని ప్రవర్తించే విధానం. దేహం యందు అభిమతి పోతుంది.
అలా అయిన తరువాత, ఎప్పుడు సత్ గానే ప్రకాశించే, ఉత్పత్తీ వినాశం లేని, సంకోచ వికాసమూ లేనీ, జీవాత్మకు బంధువైన, దేహాన్ని  చూపేవాడైన, ప్రతీ వానిలోనూ (జీవుడిలోనూ, శరీరములోనూ) అంతర్యామిగా ఉండేవాడు, అద్వయం (రెండవ వాడైన వాడు లేని వాడు) ఐన వాడు అయిన పరమాత్మను దేహమునందు చూడగలడు.
పరమాత్మ అనుగ్రహంతో ఆత్మస్వరూపం తెలుసుకున్నవాడు, తెలుసుకున్న ఆత్మ స్వరూపముతో, లేనట్లుగా, అంతవరకూ ఉన్నట్లు అనిపించిన, అంతలోనే ఇది లేకుండా ఉండేదనుకునే శరీరములోనే, ఈ దేహములోనే పరమాత్మను చూస్తాడు.
ప్రకృతికంటే విడిగా ఉన్న ఆత్మను చూస్తాడు, ఆత్మకన్నా వేరుగా ఉన్న పరమాత్మను కూడా చూస్తాడు. దేహముగా అంతర్యామిగా ఉన్న ఆత్మలో, అంతర్యామిగా ఉన్న పరమాత్మ చేతనే, 1. ఆత్మ జ్ఞ్యానమూ 2. పరమాత్మ జ్ఞ్యానమూ 3. దేహజ్ఞ్యానమూ కలుగుతాయి.
ఇంద్రియములచే చూడదగని ఆత్మను శరీరముతో ఎలా చూడగలడు. ఆత్మ పరమాత్మ స్వరూపాన్ని మొదట ఎలా తెలుసుకోవాలి?

యథా జలస్థ ఆభాసః స్థలస్థేనావదృశ్యతే
స్వాభాసేన తథా సూర్యో జలస్థేన దివి స్థితః

నీటిలో సూర్య ప్రతిబింబాన్ని చూస్తున్నాము. అన్నిటినీ చూపే వెలుగుతోటే నీటిలో ఉన్న సూర్యుని చూస్తున్నాము. ఆకాశములో ఉన్న సూర్యుని చేతనే నీటిలో ఉన్న సూర్యున్నీ చూస్తున్నాము. సూర్యభగవానుడే నీటి ప్రతిబింబాన్నీ చూపుతాడూ, ఆ సూర్యభగవానుడే, తన నిజమైన స్వరూపాన్నీ చూపుతాడు. అలాగే, దేహములో ఆత్మ స్వరూపాన్ని, ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మే చూపుతాడు. ఆత్మలోని పరమాత్మ జ్ఞ్యానమూ, ఆత్మలోని పరమాత్మ వలన కలిగే ఆత్మ జ్ఞ్యానమూ, ఈ రెండూ పరమాత్మ వలననే కలుగుతాయి. శరీరములో ఉన్న ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మే, "ఇది ఆత్మా", అని చెబుతాడు, అది ఉన్న శరీరం ఆభాసమూ అని చెబుతాడు, ఆ శరీరములో ఉన్న తననీ చూపుతాడు.

ఏవం త్రివృదహఙ్కారో భూతేన్ద్రియమనోమయైః
స్వాభాసైర్లక్షితోऽనేన సదాభాసేన సత్యదృక్

తివృత్ అయిన అహంకారం (సత్వ రజ తమో గుణాలతో కూడి ఉన్న,), పంచ భూతాలు, జ్ఞ్యానేంద్రియ కర్మేంద్రియాలతో కూడి ఉన్న అహంకారం. అహంకారమునకే త్రివృత్ అని పేరు. శరీరమే ఆత్మ అనే భ్రమ కలగడానికి అహంకారమే కారణం. శరీరములో ఇంద్రియములో మనసులో ఆత్మ బుద్ధిని చూపుతుంది. ఏ జ్ఞ్యానమైతే దేహాత్మ జ్ఞ్యానముని కలిగిస్తుందో, అదే జ్ఞ్యానం పరమాత్మ అనుగ్రహం కలిగిన నాడు ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తుంది. అన్ని వికారాలకు మూలైమైన దేహాత్మాభిమానం మాయమై, సత్యమైన, నిర్వికారమైన, జ్ఞ్యాన స్వరూపమైన ఆత్మను అహంకారమే చూపుతుంది. పరమాత్మ సాక్షాత్కారమయ్యే దాకా, దేహాన్ని చూపే అహంకారం, పరమాత్మ సాక్షాత్కారమయ్యాక, ఆత్మను చూపుతుంది.  ఆత్మ జ్ఞ్యానం కలిగేది పరమాత్మ వలననే. అహంకారం కలిగేది కూడా పరమాత్మ వలననే. యధార్థ జ్య్నానమైనా భ్రాంతి అయినా పరమాత్మ వల్లే కలగాలి.
నీటిలో సూర్యుడు కానిదైన సూర్యబింబాన్ని చూపేది సూర్యుడే, అలాగే నిజమైన సూర్యున్ని చూపేది కూడా సూర్యుడే. అలాగే ఆత్మ కాని దాన్ని ఆత్మా అని చూపే పరమాత్మే, ఆత్మ స్వరూప జ్ఞ్యానాన్నీ చూపుతాడు.

భూతసూక్ష్మేన్ద్రియమనో బుద్ధ్యాదిష్విహ నిద్రయా
లీనేష్వసతి యస్తత్ర వినిద్రో నిరహఙ్క్రియః

భూతేంద్రియమనస్సులు పనిచేయకున్నా ఆత్మ పనిచేస్తుందా? ఆత్మ పని చేస్తేనే ఇవి పని చేస్తాయి. ఆత్మ పని చేస్తున్నా భూతెంద్రియమనసులు పని చేయకుండా ఉండొచ్చు. అయినా ఆత్మ పని చేయట్లేదు అనుకోవడానికి వీలు లేదు.
నిదురపోయినపుడు ఇంద్రియాలు మనసు నిద్ర కూడా నిద్రపోతాయి. ఐనా ఆత్మ నిద్రపోదు. ఆత్మ ఉన్నదని గుర్తుపట్టడానికి నిద్రపోవడమే ఒక ప్రమాణం. అంటే ఇవన్నీ పని చేయడం మానేసినా పని చేసేది ఒకటి ఉంది. మనము నిద్రపోయినా అది మేలుకొనే ఉంటుంది. నిదురపోయి లేచిన వాడు "హాయిగా నిద్రపట్టింది" అంటే. నిద్రపోయినప్పుడు ఇందిర్యములూ మనసూ ఎటువంటి అనుభూతి పొందకపోయినా, ఆ అనుభూతిని చెప్పగలిగేది ఒకటి ఉంది. నిద్రావస్థలో కూడా ఆత్మ జాగరూకతతోనే ఉంటుంది. శరీరేంద్రియాలు పని చేయకున్నా ఆత్మ జ్ఞ్యానం ఉంటుంది. నిద్రలో కూడా మనకి "బాగా నిద్రపోయాను" అనే జ్ఞ్యానం కలిగిందంటే శరీరమునకు విడిగా ఆత్మ అనేది ఒకటి ఉంది. శరీరాదులు నిద్రపోయినా అది నిద్రపోదు. నిద్రపోకపోయినా నిద్రపోయినందు వలన కలిగే అనుభూతిని వ్యక్తీకరిస్తుంది. నిద్రపోకుండా నిద్రపోతున్న వాటిలో ఉండి అవి పొందిన అనుభూతిని మనకు చెబుతుంది. నిద్రావస్థలో కూడా ఆత్మ జ్ఞ్యానం కలుగుతుంది. భూత సూక్ష్మ ఇంద్రియాలు, మనసు కూడా నిద్రపోతాయి.  అప్పుడు కూడా నిద్రపోకుండా ఉండేది ఆత్మ. ఆ ఆత్మకు అహంకారం ఉండదు.

మన్యమానస్తదాత్మానమనష్టో నష్టవన్మృషా
నష్టేऽహఙ్కరణే ద్రష్టా నష్టవిత్త ఇవాతురః

శరీరాదులు నిద్రపోతే ఆత్మ నిద్రపోతున్నట్లు ఎలా కనపడుతుంది. నశించని వాడు కూడా నశించిన వాడిలా కనిపిస్తాడు. శరీరం నిద్రపోతే ఆత్మ కూడా నిద్రపోయినట్లు అనిపిస్తుంది. ఎలా అంటే డబ్బు మొత్తం పోయిన వాడు "డబ్బు లేకపోతే నేను లేనట్లే" అని ఎలా అనుకుంటాడో (వాడే పోయినట్లు ఎలా అనుకుంటాడో), అహంకారం పోయిన వాడు, తానే పోయాను అనుకుంటాడు. అహంకారం నశించినప్పుడు కూడా వాడే ద్రష్ట. ఇది శరీరం కాదు, ఆత్మ, అని చెప్పేవాడు కూడా వాడే.

ఏవం ప్రత్యవమృశ్యాసావాత్మానం ప్రతిపద్యతే
సాహఙ్కారస్య ద్రవ్యస్య యోऽవస్థానమనుగ్రహః

ఇలా నిద్రపోతున్నవాడు, తన నిద్రా స్వరూపాన్ని ఈ రీతిలో తెలుసుకుని, "ఎప్పుడూ ఉండేధీ, సత్యమైంది ఆత్మ " అని తెలుసుకుని, ఇలా ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. శరీరం పంచభూత సముదాయమైనది (సాహఙ్కారస్య ). ఈ శరీరం ఉండేది ఎవరి దయ వలన? ఆత్మ లేకుండా శరీరం ఉండదు. ఆత్మ అనుగ్రహిస్తేనే శరీరం ఉంటుంది. లోపల ఆత్మ లేకుంటే శరీరం పని చేయదూ, శరీరానికి ఉనికే లేదు. అహంకారముతో కూడి ఉన్న పంచ జ్ఞ్యానేంద్రియ కర్మేంద్రియములతో కూడిన ఈ అవస్థానం ఆత్మ యొక్క అనుగ్రహమే. నిద్రపుచ్చేదీ, మేలుకొలిపేదీ ఆత్మే. ఇవన్నీ చేస్తున్న ఆత్మ, వీటన్నిటిలో ఒక భాగమా, వేరా? వీటిలో ఒక భాగమైతే ఆత్మకు కూడా నిద్ర ఉండాలి. ఆత్మ వీటికన్నా వేరు. ఏ ఆత్మకు ఏ శరీరము రావాలో చెప్పే పని మాత్రం పరమాత్మది. శరీర సంబంధం వచ్చిన తరువాత, శరీరము నేనే అనే భ్రమ దేహేంద్రియాలతో వస్తుంది. అ భ్రమను విరక్తితో భక్తితో సత్సేవతో పోగొట్టుకోవాలి.

దేవహూతిరువాచ
పురుషం ప్రకృతిర్బ్రహ్మన్న విముఞ్చతి కర్హిచిత్
అన్యోన్యాపాశ్రయత్వాచ్చ నిత్యత్వాదనయోః ప్రభో

ఆత్మ జ్ఞ్యానం కలిగాక ప్రకృతి పురుషున్ని విడిచిపెడుతుందా? జీవాత్మ పరమాత్మ ప్రకృతీ మూడూ అనాధులు. ఎంత తపసు చేసినా పురుషున్న ప్రకృతి వదిలిపెడుతుందా? ఒక దాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. ప్రకృతీ పురుషుడూ రెండూ నిత్యములూ, ఒక దాన్ని ఒకటి ఆశ్రయించి ఉన్నాయి.

యథా గన్ధస్య భూమేశ్చ న భావో వ్యతిరేకతః
అపాం రసస్య చ యథా తథా బుద్ధేః పరస్య చ

లోకములో గంధములేని భూమి, భూమి లేని గంధం ఉండదూ, నీరు లేని రుచి, రుచి లేని నీరు ఉండదు. ఏ పనీ చేయనీ, దేనికీ కర్త కానీ ఆత్మకు బంధమెందుకూ. అన్ని చేస్తున్న ప్రకృతికి బంధమెందుకు. ప్రకృతి పురుషున్ని విడవనప్పుడు జీవునికి మోక్షం ఎలా లభిస్తుంది

అకర్తుః కర్మబన్ధోऽయం పురుషస్య యదాశ్రయః
గుణేషు సత్సు ప్రకృతేః కైవల్యం తేష్వతః కథమ్

క్వచిత్తత్త్వావమర్శేన నివృత్తం భయముల్బణమ్
అనివృత్తనిమిత్తత్వాత్పునః ప్రత్యవతిష్ఠతే

శ్రీభగవానువాచ
అనిమిత్తనిమిత్తేన స్వధర్మేణామలాత్మనా
తీవ్రయా మయి భక్త్యా చ శ్రుతసమ్భృతయా చిరమ్

జ్ఞానేన దృష్టతత్త్వేన వైరాగ్యేణ బలీయసా
తపోయుక్తేన యోగేన తీవ్రేణాత్మసమాధినా

ప్రకృతిః పురుషస్యేహ దహ్యమానా త్వహర్నిశమ్
తిరోభవిత్రీ శనకైరగ్నేర్యోనిరివారణిః

భుక్తభోగా పరిత్యక్తా దృష్టదోషా చ నిత్యశః
నేశ్వరస్యాశుభం ధత్తే స్వే మహిమ్ని స్థితస్య చ

యథా హ్యప్రతిబుద్ధస్య ప్రస్వాపో బహ్వనర్థభృత్
స ఏవ ప్రతిబుద్ధస్య న వై మోహాయ కల్పతే

ఏవం విదితతత్త్వస్య ప్రకృతిర్మయి మానసమ్
యుఞ్జతో నాపకురుత ఆత్మారామస్య కర్హిచిత్

యదైవమధ్యాత్మరతః కాలేన బహుజన్మనా
సర్వత్ర జాతవైరాగ్య ఆబ్రహ్మభువనాన్మునిః

మద్భక్తః ప్రతిబుద్ధార్థో మత్ప్రసాదేన భూయసా
నిఃశ్రేయసం స్వసంస్థానం కైవల్యాఖ్యం మదాశ్రయమ్

ప్రాప్నోతీహాఞ్జసా ధీరః స్వదృశా చ్ఛిన్నసంశయః
యద్గత్వా న నివర్తేత యోగీ లిఙ్గాద్వినిర్గమే

యదా న యోగోపచితాసు చేతో మాయాసు సిద్ధస్య విషజ్జతేऽఙ్గ
అనన్యహేతుష్వథ మే గతిః స్యాదాత్యన్తికీ యత్ర న మృత్యుహాసః
అన్ని యోగాలతో సహకరించిన భక్తి యోగముతో పరమాత్మను ఆరాధిస్తే. అలా ఆరాధించబడిన పరమాత్మతోటి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఈ శరీరములో ఎలా ఆత్మ ఉంటుందో, అలాగే పరమాత్మ జీవాత్మకి అంతర్యామిగా ఉంటాడు. ఆత్మ లేని శరీరానికి ఎలా ఉనికి లేదో, పరమాత్మ లేని జీవాత్మకు కూడా ఉనికి ఉండదు. అంటే పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మ స్వరూపం కలగాలి. ఈ జీవాత్మకు మోక్షమని పరమాత్మ ప్రాప్తిని అంటారు. పరమాత్మ ప్రాప్తి, ఆత్మ స్వరూప జ్ఞ్యానముతో వస్తుంది. ఎలాంటి ఆత్మ స్వరూప జ్ఞ్యానం? పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మ స్వరూపం.  పరమాత్మ ఆనందస్వరూపుడు. ఆయన మనదగ్గరకు రావాలి. ఆ ఆనందం మనం పొందేది కాదు. పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మే ఆత్మ స్వరూపం అని తెలుసుకున్న వాడు, తనకు ఆత్మగా ఉన్న పరమాత్మను జేరతాడు. అలాంటి వాడిని ప్రకృతి మళ్ళీ పట్టుకోదు. ఆత్మసాక్షాత్కారమూ, ఆత్మ స్వరూప జ్ఞ్యానము, స్వస్వరూప జ్ఞ్యానమూ, పరమాత్మ ప్రాప్తి, ఈ నాలిగిటిలో ఏదో ఒకటి పొందేంత వరకే ప్రకృతి మనని అంటిపెట్టుకుని ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి కలిగినా, ప్రకృతి విడిచిపెడుతుంది. అంటే పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మ అనే జ్ఞ్యానం భగవంతుని అనుగ్రహముతో కలగాలి. అది కలగాలంటే పరమాత్మను ఆరాధించాలి. పరమాత్మను ఎలా ఆరాధించాలి? కేవలం భక్తితోనేనా? ఉపాంగములతో కూడిన భక్తి. అంటే కర్మ, జ్ఞ్యానమూ,  భక్తి, ప్రపతీ, అవతార రహస్య జ్ఞ్యానం. ఇన్ని యోగములతో కూడిన భక్తితో ఆరాధించబడిన పరమాత్మ ప్రసన్నుడై, అనుగ్రహించి మనను, తాను ఆత్మగా ఉన్న జీవాత్మ స్వరూప జ్ఞ్యానాన్ని కలిగిస్తే, అది కలిగిన తరువాత, ఆయన అనుగ్రహముతో ఆయనను పొందుతాము. పరమాత్మ అనుగ్రహం కలిగిన తరువాత ప్రకృతి మనని విడిచిపెడుతుంది. 
ఈ భక్తి యోగానికి అంగాలుగా ఉన్న మిగతా యోగాలు కూడా అర్థంకావాలి.