Pages

Saturday, 1 February 2014

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం రెండవ అధ్యాయం

పరమాత్మ కంటే భిన్నమైన దానిలో మనసుని లగ్నం చేయకూడదు. దాని వల్ల ఆత్మ పతనమవుతుంది

శ్రీశుక ఉవాచ
ఏవం పురా ధారణయాత్మయోనిర్నష్టాం స్మృతిం ప్రత్యవరుధ్య తుష్టాత్
తథా ససర్జేదమమోఘదృష్టిర్యథాప్యయాత్ప్రాగ్వ్యవసాయబుద్ధిః

ఇంతకు ముందు పరమాత్మ యందు ధారణ చేయాలి అని చెప్పాను. ఆత్మయోని అయిన సృష్టికి అర్త బ్రహ్మగారు (న్ష్టాం స్మృతిం ప్రత్యవరుధ్య) మరచిపోయిన సృష్టి విధానాన్ని పొందారు. ఇక్కడ స్మృతి అంటే మరచుట కాదు. ఇక్కడ స్మృతి అంటే సృష్టి చేయడం. (బ్రహ్మ లోకంలో బ్రహ్మ యొక్క నూరేళ్ళు దాటిన తరువాత బ్రహ్మలోకంలో ఉన్నవారంతా మోక్షం పొందుతారని వేదం చెబుతుని. బ్రహ్మ గారి స్థానం మారుతూ ఉంటుంది. హనుమ కూడా రాబోయే కల్పానికి బ్రహ్మగారవుతారు,). జరిగిపోయిన సృష్టి విధానాన్ని పరమాత్మ యందు ధారణతో సకల ఇంద్రియాలను నిగ్రహించి సృష్టి చేసాడు. బ్రహ్మగారు అనంతమైన చరాచర సృష్టినే చేస్తున్నారు. ఆయనద్ అమోఘ దృష్టి (సార్ధకమైన జ్ఞ్యానం ) కలవాడు
అప్యయాత్ప్రాగ్వ్యవసాయబుద్ధిః : వ్యవసాయం అంటే నిశ్చయం. అప్యయాత్ ప్రాక్ -  ప్రళయం కంటే ముందు

శాబ్దస్య హి బ్రహ్మణ ఏష పన్థా యన్నామభిర్ధ్యాయతి ధీరపార్థైః
పరిభ్రమంస్తత్ర న విన్దతేऽర్థాన్మాయామయే వాసనయా శయానః

పరమాత్మ యందు బుద్ధిని నిలపాలి మనసును నిలపాలి, ఆత్మను కూడా అక్కడే పెట్టి ధ్యానం చేయాలి అని చెప్పినా మళ్ళీ ఈ యాగాలెందుకు చెప్పబడ్డాయి వేదంలో.
వేదం ఏవో కొన్ని పేర్లు చెప్పి అపార్థమైన (పరమాత్మని తప్పించే ) పేర్లతో, స్వర్గాది నశ్వరమైన విషయ భోగములయందు మనసు నిలపడానికి ప్రయత్నిస్తారు. పరమార్ధమని ఒకటి ఉన్నదని తెలపడానికే ఈ మార్గం చెప్పి ముందుగా పరమాత్మని మరిపిస్తుంది. వేదం వలన మన ఉపాయాలతో పొందలేనిది ఒకటి ఉంది అని చెప్పడం ఉద్దేశ్యం. ఈ లోకంలో మనం అనుకున్న దాన్ని మన ప్రయత్నంతో పొంది. మనం పొందిన వస్తువు మన కళ్ళముందే పోతూ ఉంటే చూచి వచ్చేవన్నీ పోయేవే అయినప్పుడు అసలు ఎప్పుడూ పోనిది ఏమైనా ఉందా అనే ఆలోచన కలగడానికే వేదంలో ఇవన్నీ ప్రతిపాదించబడ్డాయి.
మన కోరికలతో పరమాత్మనుండి దూరం కాగలం గానీ మన ప్రయత్నంతో మనం ఆయనను చేరలేము. ఆయన ప్రయత్నం చేతనే మనం ఆయనని పొందగలము.
శాబ్దస్య హి బ్రహ్మణ ఏష పన్థా  - ఇలా చేయడం వేదం యొక్క పంధా
ధ్యాయతి ధీరపార్థైః - బుధ్ధి దీన్నే ధ్యానం చేస్తాడు
పరిభ్రమంస్తత్ర న విన్దతేऽర్థాన్మాయామయే వాసనయా శయానః - మాయా మయమైన ప్రపంచంలో ఉండి పరిభ్రమిస్తూ ఉంటాడు. అలా తిరుగుతూ పరమాత్మ సంబంధమైన విషయాలను తెలియడు (న విన్దతేऽ అర్థాన్)

అతః కవిర్నామసు యావదర్థః స్యాదప్రమత్తో వ్యవసాయబుద్ధిః
సిద్ధేऽన్యథార్థే న యతేత తత్ర పరిశ్రమం తత్ర సమీక్షమాణః

కాబట్టి కవి (అంటే జ్ఞ్యానం కలవాడు) నిశ్చయాత్మక బుద్ధి కలవాడై పరమాత్మ యందే రమిస్తాడు. ఆ బుద్ధి కలవాడై స్వర్గాది పేర్లలో అతనికి మనసు కలగదు (నామసు యావదర్ద: ఎంత ప్రయోజనం కావాలో అంతే). ఏమరపాటుతో ఉండవద్దు (స్యాదప్రమత్తో ). కష్టపడితే ఏది లభిస్తుందో కష్టపడకుండానే అది లభిస్తుంది. మన ప్రయత్నం లేకుండానే దు:ఖం వచ్చినపుడు, ప్రయత్నం లేకుండానే సుఖం కూడా వస్తుంది. ప్రయత్నం చేయకుండానే వచ్చేవాటికోసం కన్నా ప్రయత్నం చేస్తే తప్ప రాని మోక్షాని కొరకు ప్రయత్నం చేయాలి. జన్మ జర వ్యాధి సుఖం దుఖం ఇలాంటివి అన్యధా సిధ్ధములు.
సిద్ధేऽన్యథార్థే న యతేత  - ప్రయత్నం లేకుండానే సిద్ధించేవాటికోసం ప్రయత్నిచకు. కేవలం వాటి విషయంలో శ్రమ మాత్రం మిగులుతుంది. ఫలితం మాత్రం వస్తుంది. ఇది వరకు ఆచరించిన పుణ్య పాప కర్మలకనుగుణంగా అనుభవిస్తాము. ముందే నిర్ణయించబడిన వాటికి ప్రయత్నం వలన పరిశ్రమ ఒకటే మిగులుతుంది.

సత్యాం క్షితౌ కిం కశిపోః ప్రయాసైర్బాహౌ స్వసిద్ధే హ్యుపబర్హణైః కిమ్
సత్యఞ్జలౌ కిం పురుధాన్నపాత్ర్యా దిగ్వల్కలాదౌ సతి కిం దుకూలైః

 కిం కశిపోః ప్రయాసై - పరుపు కోసం ప్రయత్నం ఎందుకు, పరమాత్మ ఇచ్చిన భూమిన్ ఉండగా.
బాహౌ స్వసిద్ధే హ్యుపబర్హణైః కిమ్ - చేయి ఉండగా దిళ్ళు మెత్తలూ ఎందుకు. నేల మీద నీ చేయి పెట్టుకుని హాయిగా పడుకోవచ్చు.
సత్యఞ్జలౌ కిం పురుధాన్నపాత్ర్యా - దోసిటి ఉండగా వెండి బంగారు పాత్రలు ఎందుకు
 దిగ్వల్కలాదౌ సతి కిం దుకూలైః - మన / ఇతరుల శరీరం మీద భోగ బుధ్ధి కలగకుండా, జుగుప్సను కలిగించకుండా వస్త్రం కట్టుకోవాలి గానీ శరీరం మీద వ్యామోహం పెంచుకోవడానికి కాదు.
ఇవన్నీ ప్రయత్నం లేకున్నా వస్తున్నప్పుడు, పరమాత్మ సహజంగానే ఇచ్చినపుడు వీటికోసం మళ్ళి ప్రయత్నం ఎందుకు

చీరాణి కిం పథి న సన్తి దిశన్తి భిక్షాం
నైవాఙ్ఘ్రిపాః పరభృతః సరితోऽప్యశుష్యన్
రుద్ధా గుహాః కిమజితోऽవతి నోపసన్నాన్
కస్మాద్భజన్తి కవయో ధనదుర్మదాన్ధాన్

చీరాణి కిం పథి న సన్తి - మనం వెళ్ళే దారిలో నాలుగు గుడ్డపీలికలు దొరకవా. దిశన్తి భిక్షాం - చెట్లు నిన్ను పోషించవా? అవి మీకు భిక్ష పెట్టుటలేదా
సరితోऽప్యశుష్యన్ - నదులన్నీ ఎండిపోయి ఉన్నాయా
రుద్ధా గుహాః కిం - గుహలు మూసివేయబడ్డాయా?
కిమజితోऽవతి నోపసన్నాన్ - ఆశ్రయించినవారిని పరమాత్మ కాపాడుటలేదా
కస్మాద్భజన్తి కవయో ధనదుర్మదాన్ధాన్ - ధనవంతులనూ ధుర్మధాందులనూ శ్రీమంతులనూ జ్ఞ్యానులు ఎందుకు సేవిస్తున్నారు

ఏవం స్వచిత్తే స్వత ఏవ సిద్ధ ఆత్మా ప్రియోऽర్థో భగవాననన్తః
తం నిర్వృతో నియతార్థో భజేత సంసారహేతూపరమశ్చ యత్ర

మనం సహజంగా వేటికోసం చేసే ప్రయత్నంలో పరమాత్మని మరచిపోతున్నామో అది అంతా అజ్ఞ్యానం. ఇతరులను వంచించి మోసగించి సంపాదించేది వీటికోసమే. అవసరాలు పెరిగిన కొద్దీ ఆలోచనలు పెరిగాయి. ఏవం స్వచిత్తే - ఇవన్నీ స్వతహాగా ఏరపడుతున్నాయి.  ఈయన పరమ ప్రియ్డు. మనకి మనం కోరుకున్నవన్నీ అనర్థములే. ఈయనొక్కడే అర్థము. దేనికి నాశం లేదో దాన్ని కోరాలి. దాని వల్ల దు:ఖం ఉండదు. ఆయన అనంతుడు. అనత్మంటూ లేని వాడు.
అలాంటి పరమాత్మను ఆనందపూర్ణుడవై తృప్తి పొంది (నియతార్థో ) పరమాత్మనే జేరతానని ఆయననే సేవించు. దాని వల్ల సంసారమునకు కారణమైన అవిద్య అంతరించిపోతుంది.

కస్తాం త్వనాదృత్య పరానుచిన్తామృతే పశూనసతీం నామ కుర్యాత్
పశ్యఞ్జనం పతితం వైతరణ్యాం స్వకర్మజాన్పరితాపాఞ్జుషాణమ్

ఇంత వివరంగా తెలిసినా, తెలిపినా, అలాంటి పరమాత్మ చింతను ఆదరించకుండా, పశువులు తప్ప నశించే సంసారాన్ని ఎవరు కోరుకుంటారు.
మనము కోరుకుంటున్న సుఖములు సంపదములు అయిశ్వర్యములు పొందిన వారు మన ముందే వెళ్ళిపోతున్నారు. తాము కోరిన కోరికలతో ఇహలోకంలో నరకం చూడటమే కాదు, పరలోకంలో కూడా వైతరిణీ నదిని దాటుతారు. (90 లక్షల యోజనాలున్న నరకానికి 2.5 ఘడియల్లో నడిపిస్తారు. అదీ తక్కువ పాపి అయితే. పాపం పెరిగిన కొద్దీ ఆ నది దాటాల్సిన సమయం తగ్గుతూ ఉంటుంది) వైతరిణిలో మునిగి అనేక నరకాలు అనుభవిస్తారు. ఇక్కడ కూడా ఎన్నో బాధలు అనుభవిస్తారు.
నరకంలో అనుభవించే బాధలు, ఇక్కడ అనుభవించే బాధలు పరమాత్మ ఇచ్చినవి కావు. మన కర్మలతో మనం కల్పించుకున్నవే. నీకు సహజంగా ఎవడు ప్రియుడొ అలాంటి పరమాత్మని సేవించు. పరమాత్మ సహజంగా ఇచ్చిన దాన్ని అనుభవించు గాని కొత్త కోరికలతో దుఖం తెచ్చుకోకు

కేచిత్స్వదేహాన్తర్హృదయావకాశే ప్రాదేశమాత్రం పురుషం వసన్తమ్
చతుర్భుజం కఞ్జరథాఙ్గశఙ్ఖ గదాధరం ధారణయా స్మరన్తి

మహాత్ములు కొందరు తమ శరీరంలో దహరాకాశంలో ఉన్న అంగుస్టమాత్రం ఉన్న పురుషున్ని స్మరిస్తారు. ఆ అంగుష్ట ఆకారంలో కూడా నాలుగు భుజములు, శంఖం గద చక్రం పద్మం ధరించినవాడు. అక్కడ పెడతారు వారి మనసును

ప్రసన్నవక్త్రం నలినాయతేక్షణం కదమ్బకిఞ్జల్కపిశఙ్గవాససమ్
లసన్మహారత్నహిరణ్మయాఙ్గదం స్ఫురన్మహారత్నకిరీటకుణ్డలమ్
ఉన్నిద్రహృత్పఙ్కజకర్ణికాలయే యోగేశ్వరాస్థాపితపాదపల్లవమ్
శ్రీలక్షణం కౌస్తుభరత్నకన్ధరమమ్లానలక్ష్మ్యా వనమాలయాచితమ్


ప్రసన్నమైన వదనం కలవాడు విశాలమైన నేత్రములు కలవాడు. కదంబ పుష్పములో మధ్యలో ఉన్న కింజల్కముల రంగులో ఉండే పసుపు పచ్చని వస్త్రం (పీతాంబరం). అంగదములు కిరీటములు కుండలములు. వికసించిన హృదయమనే పద్మం మధ్యన వేంచేసి ఉన్న పరమాత్మ పాదములు. అవి మహాయోగీంద్రులచేత హృదయములో నిలుపుకున్న పరమాత్మ పాద పంకజములను, శ్రీ వత్సము, కౌస్తుభమణి మెడలో ఉన్నవాడు. వాడని పూలతో ఏర్పడిన వనమాల అలంకరించుకున్నవాడు, ఉంగరము,

విభూషితం మేఖలయాఙ్గులీయకైర్మహాధనైర్నూపురకఙ్కణాదిభిః
స్నిగ్ధామలాకుఞ్చితనీలకున్తలైర్విరోచమానాననహాసపేశలమ్

మేఖల (బంగారు మ్రొలత్రాడు) అందెలుం, కంకణాలు, ప్రకాశించే చిరునవ్వుతో ఉన్న మహానుభావుడు

అదీనలీలాహసితేక్షణోల్లసద్భ్రూభఙ్గసంసూచితభూర్యనుగ్రహమ్
ఈక్షేత చిన్తామయమేనమీశ్వరం యావన్మనో ధారణయావతిష్ఠతే

విశాలమైన ధీరమైన గంభీరమైన దయను కురిపించే చిరునవ్వుతో అనుగ్రహాన్ని సూచించే వాడు. ఇలాంటివాన్ని ధ్యానం చేయాలి

ఏకైకశోऽఙ్గాని ధియానుభావయేత్పాదాది యావద్ధసితం గదాభృతః
జితం జితం స్థానమపోహ్య ధారయేత్పరం పరం శుద్ధ్యతి ధీర్యథా యథా

ఒక్కసారి పరమాత్మ విగ్రహాన్ని మనం ధ్యానించలేము ధరించలేము. ఒక్కొక్క అంగాన్ని చూడు,  ఒక్క పాదాలను ధ్యానం చేయి. అవి హృదయంలో లగ్నమయ్యే దాకా చేయి. దేన్ని నీ మనసు గెలిచిందో దాన్ని వదిలి ఇంకో భాగానికి, దాని తరువాత అంగాన్ని ధ్యానం చేయి. వేటిని ధ్యానం చేస్తే అదే కనపడాలి. దీనితో బుద్ధికి శుద్ధి ఏర్పడుతుంది

యావన్న జాయేత పరావరేऽస్మిన్విశ్వేశ్వరే ద్రష్టరి భక్తియోగః
తావత్స్థవీయః పురుషస్య రూపం క్రియావసానే ప్రయతః స్మరేత

పరావరుడు - పరులకి పరుడు, అవరులకు అవరుడు . ఈయన సకల జగత్తుకు ద్రష్ట. ఆయన యందు భక్తి ఎంతవరకూ కలగదో, అది కలిగే వరకూ మనసు అక్కడే లగ్నం చేయి. పెద్దగా ఉన్న పరమాత్మ రూపాని ధారణ చేయి భక్తి కలిగే దాక. భక్తి కలిగాక యే ఆకారమైన నిరాకారమైన ధ్యానం చేయి.

స్థిరం సుఖం చాసనమాస్థితో యతిర్యదా జిహాసురిమమఙ్గ లోకమ్
కాలే చ దేశే చ మనో న సజ్జయేత్ప్రాణాన్నియచ్ఛేన్మనసా జితాసుః

నిరంతరం పరమాత్మనే ధ్యాంచేవాడు స్థిరంగా కూర్చుంటాడు. దీన్నే సమాధి అంటారు. స్థిరమైన సుఖమైన ఆసనాన్ని ఆశ్రయించి శరీరం మీద విరక్తి పుట్టి శరీరాన్ని విడవదలచితే ఉత్తరాయణ పుణ్యకాలం కోసమో క్షేత్రం కోసమో వెతకవలసిన పని లేదు. భగవంతుని చేరడానికి ముహూర్తం అక్కరలేదు (మనో న సజ్జయేత్). శ్వాసను జయించి (జితాసుః) ప్రాణాలను నిరోధించాలి (ప్రాణాన్నియచ్ఛేత్).

మనః స్వబుద్ధ్యామలయా నియమ్య క్షేత్రజ్ఞ ఏతాం నినయేత్తమాత్మని
ఆత్మానమాత్మన్యవరుధ్య ధీరో లబ్ధోపశాన్తిర్విరమేత కృత్యాత్

పరిశుద్దమైన బుద్ధితో మనసుని నిరోధించాలి. ఈ మనసుని క్షేత్రజ్ఞ్యునిలో (చీతములో ) ఉంచాలి. ఆ చిత్తాన్ని ఆత్మలో, ఆత్మని పరమాత్మలో ఉంచాలి. అపుడు అన్ని పనులు చేయడం ఆపాలి

న యత్ర కాలోऽనిమిషాం పరః ప్రభుః కుతో ను దేవా జగతాం య ఈశిరే
న యత్ర సత్త్వం న రజస్తమశ్చ న వై వికారో న మహాన్ప్రధానమ్

ఎక్కడ కాలం కూడా పని చేయదో; ఎవరు దేవతలందరికీ దేవుడో.
ఆ పరమాత్మ దగ్గర సత్వ రజో తమో గుణాలు ప్రకృతి మహత్ తత్వములు లేవు. మహత్ తత్వం పనిచేస్తున్ననత కాలం మన బుద్ధి సంసారంలో ఉంటుంది.

పరం పదం వైష్ణవమామనన్తి తద్యన్నేతి నేతీత్యతదుత్సిసృక్షవః
విసృజ్య దౌరాత్మ్యమనన్యసౌహృదా హృదోపగుహ్యార్హపదం పదే పదే

ఎక్కడ ఇవేమీ పని చేయవో (దేవతలు, కాలం, ప్రకృతి, త్రిగుణాలు మహత్తు) దానిని పరమపదం అంటారు.
ఎవరు నశ్వరమైన ఇతర ప్రపంచం లేదు లేదు అని తెలుసుకొని ఆ ప్రపంచాన్ని విడువదలచుకున్నవారు అక్కడికి చేరతారు.
ఇలాంటి పరమాత్మ యందు పరమపదం యందు బుద్ధి ని మనసుని లగ్నం చేసిన వారు మనసు యొక్క దౌర్జన్యాన్ని విడిచి పెడతారు. అది విడిచిపెట్టాక మరియొక దాని యందు స్నేహం లేకుండా పరమాత్మ యందు ప్రీతి గల హృదయంతో ప్రతీ అడుగులో ప్రతీ క్షణంలో పరమాత్మయందే మనసు లగ్నంచేస్తారు అనన్యసౌహృదా - భగవంతుని కంటే ఇతరములైన వాటియందు ప్రీతి లేకుండా (సంసారంలో కాస్త మనసు పరమాత్మ యందు కాస్త మనసు కాకుండా)

ఇత్థం మునిస్తూపరమేద్వ్యవస్థితో విజ్ఞానదృగ్వీర్యసురన్ధితాశయః
స్వపార్ష్ణినాపీడ్య గుదం తతోऽనిలం స్థానేషు షట్సూన్నమయేజ్జితక్లమః

ఇలా నిశ్చయాత్మకమైన బుద్ధి కలవాడై సంసారం నుంచి విరమించాలి.దృష్టి అంతా పరమాత్మ యందు జ్ఞ్యానంతో నింపి అన్ని కామనలను తొలగించుకోవాలి (సురన్ధితాశయః ) ప్రాణ బుద్ధి హృదయం మనసు ఆత్మ అనే అయిదింటినీ పరమాత్మ యందే లగ్నం చేసి ఆయన కంటే భిన్నమైన జగత్తుమీదా దృష్టిలేకుండా మడమతోను మూలాధారాన్ని నొక్కిపెట్టి (వాయువు బయటకి పోకుండా), స్వాధిష్టానం మణిపూరం అనాహతం విశుద్దం ఆజ్ఞ్యా చక్రం సహస్రారం అనే షట్చక్రాలయందు ప్రాణవాయువునూ ఆత్మనూ బయటకు తీసుకువెళ్ళి సహస్రారాన్ని చేధించాక కపలాన్ని భేధించి తీసుకు వెళ్ళాలి. ఈ మొత్తంలో ఎక్కడ శ్రమ ఉండకూడదు, బాధ ఉండకూడదు.

నాభ్యాం స్థితం హృద్యధిరోప్య తస్మాదుదానగత్యోరసి తం నయేన్మునిః
తతోऽనుసన్ధాయ ధియా మనస్వీ స్వతాలుమూలం శనకైర్నయేత

ఆ ఆరుస్థానాలు : మొదలు మూలాధారాన్నుంచి నాభిలోకి, అక్కడి నుంచి హృదయంలోకి, వక్షస్థలంలోకి, బుద్ధితోటి ప్రాణవాయువును అనుసంధానం చేసి తాళు మూలానికి (అంటే కంఠం వద్దకు ) మెల్లగా తీసుకుని వచ్చి, అజ్ఞ్యా చక్రానికి (కనుబొమల మధ్యకు తీసుకు వచ్చి).

తస్మాద్భ్రువోరన్తరమున్నయేత నిరుద్ధసప్తాయతనోऽనపేక్షః
స్థిత్వా ముహూర్తార్ధమకుణ్ఠదృష్టిర్నిర్భిద్య మూర్ధన్విసృజేత్పరం గతః

అజ్ఞ్యా చక్రానికి వచ్చాక మనకున్న ఏడు రంధ్రాలను (శ్రోత్రములు నేత్రములు నాసిక ఆస్యం - వాయువు పోయే ద్వారలను నియమించి) నియమించి దేని యందు అపేక్ష ఉంచకుండా, ఇలా భ్రూమధ్యంలో వాయువును నిలిపి ముహూర్తకాలం ఉండాలి. అక్కడే తదేక దృష్టితో ఉంచి బ్రహ్మకపాలాన్ని బ్రహ్మరంధ్రాన్ని భేధించుకుని వదిలిపెట్టాలి (జీవాత్మను). అక్కడి నుంచి పర ప్రదేశానికి వెళ్తాడు

యది ప్రయాస్యన్నృప పారమేష్ఠ్యం వైహాయసానాముత యద్విహారమ్
అష్టాధిపత్యం గుణసన్నివాయే సహైవ గచ్ఛేన్మనసేన్ద్రియైశ్చ

ఇలా బ్రహ్మరంధ్రాన్ని భేధించుకుని బయటకి వెళ్ళినపుడు ఆకాశంలో ఉండే ఆయా లోకాల్లో నీవు విహారించాలనుకుంటే అప్పటికే నీకు అష్ట సిద్ధులు వచ్చి ఉండుట వలన (అణిమ గరిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం) వాటిని తీసుకుని త్రిగుణాత్మకమైన ప్రకృతిలోని లోకాలను విహరించ దలచుకుంటే నీ ఇంద్రియాలను మనసును వెంటబెట్టుకుని వెళ్ళాలి. అనుభవించాలంటే మనసు ఇంద్రియాలతో కలిసి వెళ్ళు. పరమాత్మ దగ్గరకు వెళ్ళాలంటే మాత్రం మనసు ఇంద్రియాలను వదిలేసి వెళ్ళాలి.

మనకు కనపడే శరీరం స్థూల దేహం, ఈ దేహాన్నించి బయటకు వెళ్ళేవాడు సూక్ష్మ దేహంతో వెళ్తాడు. ఆ సూక్ష్మ దేహంలో జ్ఞ్యాన కర్మ ఇంద్రియాలు మనసు బుద్ధి చిత్తం అంత: కరణం ఉంటాయి. ఎక్కువ పుణ్యం ఉంటే భోగ దేహంతో వెళ్తాడు, అది సూక్ష్మ దేహము నుంచే వస్తుంది. పాపాలే ఎక్కువ చేస్తే అతనికి యాతనా దేహం వచ్చి నరకానికి ముందు వెళ్తాడు. ఆ దేహం ఉల్లిపొరలో పదహారవ వంతు ఉంటుంది. ఈ రెండూ కాక అతల వితల సుతల లోకాలకు వెళ్ళవలసి వస్తే సంవిత్ దేహం వస్తుంది (అక్కడ ఉన్న భోగాలు ఇంకాస్త ఎక్కువ కాబట్టి ఆ అనుభవించే దేహం ఆ ప్రకారంగా నిర్మింపబడుతుంది. ) ఊర్ధ్వ లోకాలనే జనో మహో తపో లోకాలకి వెళ్ళవలసి వస్తే జ్యోతిర్దేహం వస్తుంది. ఇవి కాక బ్రహ్మాండ కటాహాన్ని దాటి విరజా నదిలో స్నానం చేసిన తరువాత వచ్చిన దేహం పంచ ఉపనిషన్మయ దివ్య దేహం. ఇలా మనకు మొత్తం ఏడు దేహాలు ఉంటాయి. పితృ స్వర్గాది లోకాలను చేరాలనుకునే వారు సూక్షం దేహంతో వెళ్తారు. ఆ స్థితిలో ఇంద్రియ వర్గం ఉంటుంది మనసు ఉంటుంది. ఆ స్థితిలో అష్టాదిపత్యం  (అణిమ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వసిత్వం ) పొంది.

యోగేశ్వరాణాం గతిమాహురన్తర్బహిస్త్రిలోక్యాః పవనాన్తరాత్మనామ్
న కర్మభిస్తాం గతివిద్యాతపోయోగసమాధిభాజామ్మాప్నువన్తి

యోగేశ్వరాణాం గతిమాహు: యోగములు కూడా రెండు రకాలు. ఆత్మయోగం పరమాత్మ యోగం. కేవలులూ ( జీవాత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించే వారు. వారు పొందేది కైవల్యం. కైవల్యం అంటే కేవల ఆత్మ సాక్షాత్కారం. అది కూడా యోగమే, వారు కూడా యోగేశ్వరులే. కేవలులు ముక్తులు పొందే లోకాన్ని చేరలేరు. వారికి కూడా ఇహ పర లోకాలయందు ఆసక్తి ఉండదు. వారు ఒక్కరే ఉంటారు), ముక్తులూ.

త్రిలోక్యాః పవనాన్తరాత్మనామ్: ఇలాంటి కేవలులు కూడా, మూడు లోకాలకు వెలుపల, లోపలా, తాను తన మూలాధరం నుండి బయలుపడిన ఏ ప్రాణ వాయు శక్తి ఉందో ఆ వాయువులోనే అంతర్భవించి, తాను వాయు మార్గం ద్వారానే వెళ్తాడు. వాయు రూపంగానే వెళ్తాడు

శాస్త్ర జన్యం ద్వారా ఆచరించే కర్మను తపసు అంటారు, అలా లేకుండా ఆచరించే కర్మను బంధము అంటారు. జ్ఞాయం కలవారు చేసేది తపసు, లేని వారు చేసేది బంధము. జ్ఞ్యానము లేని వారు ఫలము  యందు ఆసక్తి లేకుండా చేస్తారు. కాని వారికి ఆసక్తి లేదనే విషయం చూచే వారికి తెలియదు. కృష్ణుణ్ణి కూడా పైకి చూచి జారుడూ, చోరుడూ అన్నారు. చేసే పనుల బట్టి వ్యక్తి యొక్క స్వభావాన్ని అంచనా వేయలేము. చూసే వారికి జ్ఞ్యాని చేసే పనులు ఎంతో మోజుతో చేసినట్లు అనిపిస్తుంది.

న కర్మభిస్తాం గతివిద్యాతపోయోగసమాధిభాజామ్మాప్నువన్తి - న కర్మభి: తాం గతిం విద్యాతపోయోగసమాధిభాజామ్మాప్నువన్తి  విద్య కాని తపసు గానీ యోగం కానీ సమాధి గానీ కేవలులకూ ముక్తులకూ సమానమే. కైవల్యాన్ని ఆశించి ఆచరించే కర్మల్తో పరమాత్మను ఆశించి ఆచరించే కరమల వలన వచ్చిన ఫలితాన్ని పొందలేరు. కర్మలు అవే అయిన ఫలితం తేడా ఉంటుంది లక్ష్యం తేడా ఉంటుంది ఉద్దేశ్యం తేడా ఉంటుంది. పరమాత్మ కావాలా, ఆత్మ కావాల అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆత్మసామ్రాజ్యాన్ని కోరేవారు చేసేపనులతో పరమాత్మసామ్రాజ్యాన్ని పొందలేరు. అలాగే సంసారిక విషయభోగములని ఆశించి చేసే పనులతో కైల్వల్యాన్ని పొందలేరు.
పరమాత్మని ఆశించేది ఆత్మని ఆశించేది సాంసారిక విషయాలని ఆశించేదిగా విభజించవచ్చు.
ఇంకో విధంగా చెప్పాలంటే 1. ప్రకృతిని ఆశించుట 2. జీవున్ని ఆశించుట 3. పరమాత్మను ఆశించుట.
ఒక దానితో చేసే పనుల వలన రెండొ దాన్ని పొందలేరు. ఈ మూటిలో పరమాత్మ ప్రాప్తి కష్టం. పరమాత్మ ప్రాప్తే కాదు, ఆ అభిలాష పొందటమే కష్టమే. ఈ సౌందార్యాన్ని ఎర చూపి ప్రకృతి మనల్ని దాటి పోనివ్వదు. జ్ఞ్యాని కైవల్యాన్ని గాని, సంసారాన్ని గానీ ఆశించకూడదు.

వైశ్వానరం యాతి విహాయసా గతః సుషుమ్ణయా బ్రహ్మపథేన శోచిషా
విధూతకల్కోऽథ హరేరుదస్తాత్ప్రయాతి చక్రం నృప శైశుమారమ్

ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగానే మొదలు సూర్య కిరణముల వెలుతురు (సూర్య కిరణముల వెలుతురు - అర్చి), ఆ కాంతిలోకి ప్రవేశిస్తాడు. కాంతి నుండి దినంలో కి ప్రవేశిస్తాడు. ఆ పగటి నుంచి శుక్లపక్షానికి ప్రవేశిస్తాడు. అక్కడి నుండి మాసంలోకి ప్రవేశిస్తాడు, అక్కడినుంచి ఋతువులోకి, అక్కడి నుంచి అయనంలోకి ప్రవేశించి అక్కడి నుండి సూర్యమండలంలోకి ప్రవేశిస్తాడు. అక్కడినుండి వాయువులోకి, వాయువు నుండి చంద్రునిలోకి, చంద్రుని నుండి అగ్నిలోకి ప్రవేసించి, అగ్ని నుండి పైలోకానికి వెళ్తాడు (ఇంద్రుడు వరుణుడు నక్ష్త్ర పధాలు మొదలైనవి).
ఇక్కడ వైశ్వానరం  అంటే సూర్యమండలాన్ని భేధించి అగ్నిలోనికి ప్రవేశించడం. (ఇది విష్నుపురాణాంతర్గతం).
అగ్నిలోకి వెళ్ళాక చిన్నవాడైపోతాడు. సూర్యునికీ చంద్రుఇనికీ మధ్యన ఉంటాడు అగ్ని. సూర్యుడు వెళ్ళేముందు తన కాంతిని చంద్రునికి అప్పగించి వెళ్తాడు. ఇదే విషయం కాళిదాసు విరచితమైన రఘు వంశంలో ఉంది. (సరాజ్యం గురుణా దత్తం ప్రతి పద్యాధికం భబౌ!
దినాంతే నిహితం తేజ: సవిత్రేవ హుతాశన: - దిలీప మహారాజు చేత ఇవ్వబడిన రాజ్యాన్ని పొంది అంత కంటే బాగా ప్రకాశించాడు. ఎంత బాగా అంటే సాయంత్రం కాగానే సూర్యభగవానుని చేత తేజస్సు పొంది ప్రకాశించిన అగ్ని హోత్రునిలాగ) సౌర్యం తేజ: సయమగ్నిం సంక్రమతే! ఆదిత్యోవా అస్తం యన్నగ్ని మనుప్రవిశతి. అగ్నివా ఆదిత్య:  సాయం ప్రవిశతి. అంటే సూర్య సంభంధమైన తేజస్సు సాయం సమయం లో అగ్ని లో ప్రవేసిస్తుందని సారాంశం.దిలీపుడు-సూర్యుడు, రఘువు-అగ్ని  రాజ్యానికి-తేజస్సు వీటి మధ్యన పోలిక.
అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞ్యానమయ ఆనందమయ కోశములు. లంకలో హనుమంతుడు ప్రవేసించినపుడు ముందు పాన శాలను చూస్తాడు తరువాత పుష్పకాన్ని చూస్తాడు (దివం గతం వాయు పథం ప్రతిష్టితం) అదే ప్రాణమయం. రావణుణ్ణి చూస్తాడు తరువాత - మనోమయం. రావణుడంటే మనసు. తరువాత అశోకవనాన్ని చూస్తాడు. అది విజ్ఞ్యానమయం. తరువాత అమ్మవారిని చూస్తాడు. అదే ఆనందమయం. ఇవే పంచకోశములు. ఆచార్యుడు విజ్ఞ్యాన మయమునకు రాగానే మనసు మళ్ళి వచ్చి స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే హనుమ అశోకవనానికి రాగానే రావణుడు అక్కడికి వచ్చాడు.
యాతి విహాయసా -   ఆకాశ మార్గం, అదే వాయుపధం అంటాం. ఈ వాయు కోశంలో (ఆకాశ మార్గంలో వెళ్ళి)
విధూతకల్కోऽథ - అనతకుముందు ఆచరించిన పుణ్య పాపాలు తొలగిపోయి. పుణ్యమున్నా పాపమున్నా, అదే మురికి అవుతుంది.
సుషుమ్ణయా బ్రహ్మపథేన శోచిషా - సుషుమ్నా నాడి నుంచి కపాల మార్గంతో (బ్రహ్మపథేన )
హరేరుదస్తాత్ప్రయాతి చక్రం నృప శైశుమారమ్: పరమాత్మ యొక్క మొదటి మైథిలి శింశుమారచక్రం అంటారు. ప్రపంచం అంతా అందులోనే ముసలి ఆకారంలో ఉంటుంది. దాని తోక దగ్గర ద్రువుడు శిరో ప్రారంభంలో విష్ణువు ఉంటారు.


తద్విశ్వనాభిం త్వతివర్త్య విష్ణోరణీయసా విరజేనాత్మనైకః
నమస్కృతం బ్రహ్మవిదాముపైతి కల్పాయుషో యద్విబుధా రమన్తే

అదే విశ్వానికి నాభి. (శరీరం మొత్తంలో వాయువుని సమానం చేసేది నాభి - అలాగే శింశుమారం విశ్వానికి నాభి). దాన్ని కూడా దాటి పరమాత్మ దివ్య తేజస్సుతో, ఎలాంటి పాప పుణ్యాలు లేని ఆత్మతో, అతి సూక్షమైన శరీరంతో (అణీయసా) మహర్లోకానికి వెళ్ళి జనోలోకానికి వెళ్ళి జనో లోకానికి వెళ్ళి తపో లోకానికి వెళ్ళి, తరువాత శింశుమారానికి వెళ్తాడు. అక్కడినుంచి పరమపదానికి వెళ్తాడు

అథో అనన్తస్య ముఖానలేన దన్దహ్యమానం స నిరీక్ష్య విశ్వమ్
నిర్యాతి సిద్ధేశ్వరయుష్టధిష్ణ్యం యద్ద్వైపరార్ధ్యం తదు పారమేష్ఠ్యమ్

మహర్లోకానికి వెళ్ళిన తరువాత అంతకు ముందు తాను ఎక్కడినుంచి బయలు దేరివచ్చాడో (భూ: భువ: స్వ: - ఈ మూడులోకాలు ప్రతీ నైమిత్తిక ప్రళయంలోనూ, అంటే బ్రహ్మగారికి ఒక పూట ఐతే భస్మమవుతాయి. 4 యుగాలు వెయ్యి సార్లు తిరిగితే బ్రహ్మకు ఒక పూట, ఇప్పుడు నడుస్తున్నది 28వ మహాయుగం. అంటే నాలుగు వెళ యుగాలకు 28*4 = 112 యుగాలు గడిచాయి. ) ఈ మహర్లోకానికి వెళ్ళినవారు కిందకి చూస్తే తాను అంతకుముందు ఏ లోకమ్నుంచి వచ్చాడో, ఆ లోకాలన్నీ అనంతుని జ్వాలలో భస్మం అవడం కనిపిస్తుంది.
నిర్యాతి సిద్ధేశ్వరయుష్టధిష్ణ్యం యద్ద్వైపరార్ధ్యం తదు పారమేష్ఠ్యమ్ - అప్పుడు అక్కడినుంచి బయలుదేరి పరమేష్టి స్థానాన్ని (బ్రహ్మలోకాన్ని) పొందుతాడు. పారమేస్ట్యంకూడా కల్పాంతంలో ఉండదు

న యత్ర శోకో న జరా న మృత్యుర్నార్తిర్న చోద్వేగ ఋతే కుతశ్చిత్
యచ్చిత్తతోऽదః కృపయానిదంవిదాం దురన్తదుఃఖప్రభవానుదర్శనాత్

జరా మృత్యువు శొకం ఆర్తి ఉండవు.
అనిదంవిదాం యచ్చిత్త: అऽదః  దీనిని నిరంతరం చింతించడం వలన, ఇది పరమాత్మ కన్న బిన్నమైనదని, ఆయన స్వరూపం కాదు అని ఆలోచించేవారికి అక్కడ కూడా దు:ఖం తప్పదు. అలా తొలగించుకోలేని పెద్ద ధుకం కలుగుతోంది కాబట్టి ఇది పరమపదం కాదు

తతో విశేషం ప్రతిపద్య నిర్భయస్తేనాత్మనాపోऽనలమూర్తిరత్వరన్
జ్యోతిర్మయో వాయుముపేత్య కాలే వాయ్వాత్మనా ఖం బృహదాత్మలిఙ్గమ్

ఆ బ్రహ్మలోకం నుంచి (తతో విశేషం ప్రతిపద్య), తేన ఆత్మన అప:ऽ అనలమూర్తి: అరత్వరన్: బ్రహ్మాండమండలం దాటి ప్రకృతి మండలం దగ్గర ఉన్నాం. దాన్ని దాటాలంటే అక్కడ పంచ్భూతములు ఉన్నాయి. వీటిని దాటాలి. ప్రకృతిలో జలాన్ని వాయువునీ శబ్దమును ఆకాశమును దాటాలి. వీటిలో దేన్ని దాటాలంటే ఆత్మ ఆ రూపం పొంది దాటుతుంది. అగ్నిని దాటాలంటే అగ్ని రూపంలో, వాయువును దాటాలంటే ఆ రూపన్ని పొంది ప్రశాంతంగా దాటుతాడు. అగ్నిరూపంలో వాయువు కి వచ్చి. వాయురూపంలో ఆకాశంలో కి వచ్చి (శబ్ద బ్రహ్మ అనే జ్ఞ్యాన) స్వరూపాన్ని పొంది,

ఘ్రాణేన గన్ధం రసనేన వై రసం రూపం చ దృష్ట్యా శ్వసనం త్వచైవ
శ్రోత్రేణ చోపేత్య నభోగుణత్వం ప్రాణేన చాకూతిముపైతి యోగీ

దేన్ని పొందాలంటే ఏ విషయాన్ని ఏ ఇంద్రియం పొందుతుందో, అక్కడ ఆ ఇంద్రియంతో ఆ విషయాన్ని తీసుకుని లేకుండా చేస్తుంది. అంతర్లీనం చేస్తుంది. రూపన్ని చక్షు ఇంద్రియంతో, స్పర్షను త్వగ్ ఇంద్రియంతో శబ్దాన్ని శ్రోత్రంతో, ప్రాణంతో ఆకూతిని (కర్మవాసన, సంస్కారం)

స భూతసూక్ష్మేన్ద్రియసన్నికర్షం మనోమయం దేవమయం వికార్యమ్
సంసాద్య గత్యా సహ తేన యాతి విజ్ఞానతత్త్వం గుణసన్నిరోధమ్

అహంకారం మూడు రకాలు. సాత్విక అహంకారం వలన ఇంద్రియాధిష్తాన దేవతలూ మనసు పుడుతుంది. రాజస అహంకారం నుంచి జ్ఞ్యానేంద్రియ కర్మేంద్రియాలు తామస అహంకారం నుండి పంచభూతాలు.ఇక్కడ మనో మయం దేవమయం అంటే సాత్విక అహంకారం, వికార్యమ్ అంటే రాజస అహంకారం
సంసాద్య గత్యా సహ తేన యాతి విజ్ఞానతత్త్వం - ఇది మహత్ తత్వం (విజ్ఞానతత్త్వం -- విజ్ఞ్యానం అంటే బుద్ధి, మహత్ తత్వం). గుణసన్నిరోధమ్ - ప్రకృతి అంటే గుణాలతో కూడి ఉన్నది. సృష్టి ఎప్పుడు గుణాలు వైషమ్యంగా (వైరూప్యంగా) ఉన్నప్పుడే జరుగుతుంది. గుణ (సత్వ రజ తమ) సమానత్వం ప్రళయం. ప్రకృతికి గుణసన్నిరోధమ్ అని పేరు. మనోమయం దేవమయం వికార్యమ్ అంటే అహంకారం, విజ్ఞానతత్త్వం  - మహత్ తత్వం. గుణసన్నిరోధమ్ - ప్రకృతి.
అలా ప్రకృతి తత్వానికి వచ్చి దాన్ని దాటితే

తేనాత్మనాత్మానముపైతి శాన్తమానన్దమానన్దమయోऽవసానే
ఏతాం గతిం భాగవతీం గతో యః స వై పునర్నేహ విషజ్జతేऽఙ్గ

జీవాత్మ పరమాత్మని చేరుతాడు, ఇన్నిలోకాలు వాటి మీద మమకారాలు దాటాలి. ఇదే చివరిది.
ఆనన్దమానన్దమయో ముపైతి - పరమాత్మను చేరే ముందు జీవుడు కూడా ఆనందమయుడే అవుతాడు. అంటే ప్రకృతి వాసన్ ఉన్నంతవరకూ ఆనందం ఉండదు అది దాటాకే ఆనందం. బ్రహ్మాండ కటాహాన్ని దాటిపోతే ప్రకృతిని దాటిపోతే పరమాత్మ ఎలా ఆనందమయమో జీవుడు కూడా అలాగే అవుతాడు
ఇలా పరమ భాగవత గతిని పొందిన వాడు మళ్ళీ పుట్టడు. దీనే అర్చిరాజి మార్గం అనీ , భాగవతీ గతి అని అంటారు.
అర్చిరాజి మార్గాన్ని చెప్పడంలోనే ధూమ మార్గాన్ని కూడా చెప్పారు. కైవల్యం ధూమ మార్గం, మోక్షం అర్చిరాజి మార్గం. వీటినే నల్ల దారి, తెల్ల దారి అని అంటారు

ఏతే సృతీ తే నృప వేదగీతే త్వయాభిపృష్టే చ సనాతనే చ
యే వై పురా బ్రహ్మణ ఆహ తుష్ట ఆరాధితో భగవాన్వాసుదేవః

నీవడిగిన ప్రశ్నకు ఇదే సమాధానం. ఇది వైదికమైన సమాధానం, సనాతనం. ఇది నేను నీకు చెప్పినదే కాదు, సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మగారు అడిగిన ప్రశనకు భగవానుడు వాసుదేవుడు చెప్పిన మార్గం

న హ్యతోऽన్యః శివః పన్థా విశతః సంసృతావిహ
వాసుదేవే భగవతి భక్తియోగో యతో భవేత్

సంసారంలో ప్రవేశించిన వాడికి ఇంతకంటే మంగళకరమైన మార్గం ఇంకోటి లేదు.
ఈ మార్గాన్ని గురించి వింటే పరమాత్మ మీద భక్తి కలుగుతుంది.

భగవాన్బ్రహ్మ కార్త్స్న్యేన త్రిరన్వీక్ష్య మనీషయా
తదధ్యవస్యత్కూటస్థో రతిరాత్మన్యతో భవేత్

ఈ మార్గం ఉన్న అన్ని మార్గాల్లోకల్లా అత్యుత్తమమైనది అని భగవానుడు మూడు సార్లు సిద్దంతం చేసి,  జాగ్రత్తగా పరిశీలించి ఈ నిశ్చయం చేసాడు. కూటస్థ: (త్రిగుణ అతీతుడై) పరమాత్మ యందు ప్రీతి కలిగించేది భక్తి యోగం. పరమాత్మ ఇలా ప్రసన్నుడై కరుణిస్తే యోగం లోకి వెళ్తాము. అప్పుడు పరమాత్మని చేరతాము.

భగవాన్సర్వభూతేషు లక్షితః స్వాత్మనా హరిః
దృశ్యైర్బుద్ధ్యాదిభిర్ద్రష్టా లక్షణైరనుమాపకైః

సర్వాంతర్యామి పరమాత్మ. పరమాత్మ యందు భక్తి కలవాడు తన ఆత్మతో సకలభూతముల యందు పరమాత్మనే చూస్తాడు. సకల భూతములూ ఆయన రూపమే.
ఇన్ని మార్గములు తెలిసీ, గురువుని సేవిస్తే మాత్రం పరమాత్మ కనపడతాడా? అంటే ప్రతీ ప్రాణిలోనూ ప్రతీ చిన్న వస్తువులోనూ పరమాత్మ మనకు కనపడతాడు. అన్నిటియందూ పరమాత్మ కనపడతాడు. మరి ఆయన దృశ్యమా ద్రష్టయా? వస్తువులాగ పరమాత్మ కూడా జడమా? ఆయన కనపడేవాడు (చూడబడేవాడూ), చూచేవాడూ కూడా. కుండలోనూ తాను ఉన్నాడు, మనలో తాను ఉన్నాడు. కుండలో ఉన్న తనని చూస్తున్న మనలో ఉండి చూస్తున్న వాడు కూడా ఆయనే. అచేతనములలో దృశ్యములాగ, చేతనములలో ద్రష్టలాగా, తానే దృశ్యము తానే ద్రష్ట. తానే కనపడుతున్నాడు, తానే కనిపెడుతున్నాడు
దృశ్యైర్బుద్ధ్యాదిభిర్ద్రష్టా - అంటే మహత్ తత్వం అహంకార తత్వం, ఇంద్రియాదులతో చూచే వాడు చూడబడే వాడు
లక్షణైరనుమాపకైః - అనుమాన ప్రమాణమైన శాస్త్రాలు, తర్క వ్యాకరణ మీమాంస జ్యోతీష
పరమాత్మ ఉన్నాడన్న విషయం మనకు మూడు విషయాల ద్వారా నిరూపితమవుతుంది:
1. ప్రత్య్క్షంగా చూడటం 2. శాస్త్రం ద్వారా అనుమానం ద్వారా ఉన్నాడు అని తెలుసుకుంటాం. 3. ఆ తెలుసుకున్నవాటిలో పరమాత్మను ఈ రూపంలో చూస్తాం.
చూస్తున్న మనము ఆయనే చూడబడే వస్తువూ ఆయనే అని తెలుసుకుంటాం. ఈ రెంటినీ బోధించే బుద్ధి ద్వారా, అహంకారం ద్వారా, మహత్ తత్వం ద్వారా అవ్యక్తం ద్వారా కనపడేది అతనే, వీటి  ద్వారా కనిపింపజేసేదీ అతనే. నీవు చూసే ప్రతీ వస్తువులో ఆయనే ఉన్నాడు, కనపడుతున్నాడు. మనకి కనపడుతున్నాడు అంటే మనం కూడా ఒక వస్తువే కాబట్టి, మనలో కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి దృశ్యమూ ద్రష్ట ఆయనే, వస్తువు ఆయనే ద్రవ్యమూ ఆయనే, వ్యక్తీ ఆయనే శక్తీ ఆయనే.
ధర్మాది తర్కాది శాస్త్రములతో, అహ్మాకర ప్రకృతి బుద్ధి తత్వములతో, సకల వస్తువులయందు ఉంటూనే ఆయనే చూస్తున్నాడు.

తస్మాత్సర్వాత్మనా రాజన్హరిః సర్వత్ర సర్వదా
శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ స్మర్తవ్యో భగవాన్నృణామ్

కాబట్టి, చూచి చూడబడే, విని వినబడే వాడు ఆయనే కాబట్టి, నేనులో ఉన్నదీ బుద్ధిలో ఉన్నదీ తెలుస్తున్నదీ తెలుపుతున్నదీ ఆయనే కాబట్టి, అన్ని చోట్ల అన్ని వేళలా అన్ని రూపాలలో ఆయననే స్మరించాలి కీర్తించాలి వినాలి. మానవులందరికీ ఆయనే కీర్తింపదగినవాడు.
ఇలాంటి దాన్ని వింటే, చెవులు అనే దొప్పలతో పరమాత్మ కథలను బాగా నింపి పరమాత్మ కథామృతాన్ని ఎవరు తాగుతూ ఉంటారో

పిబన్తి యే భగవత ఆత్మనః సతాం కథామృతం శ్రవణపుటేషు సమ్భృతమ్
పునన్తి తే విషయవిదూషితాశయం వ్రజన్తి తచ్చరణసరోరుహాన్తికమ్

శబ్ద స్ప్రశ రూప రస గంధములతో మురికి బట్టిన మనసును కడుగుతారు, పరమాత్మ పాద పద్మములని చేరుతారు. ఇహలోకంలో