Pages

Saturday, 1 March 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై ఐదవ అధ్యాయం



మైత్రేయ ఉవాచ
ఇతి సన్దిశ్య భగవాన్బార్హిషదైరభిపూజితః
పశ్యతాం రాజపుత్రాణాం తత్రైవాన్తర్దధే హరః

శంకరుడు ప్రాచేతసులచే పూజించబడి వారందరూ చూస్తుండగా అంతర్థానమయ్యాడు

రుద్రగీతం భగవతః స్తోత్రం సర్వే ప్రచేతసః
జపన్తస్తే తపస్తేపుర్వర్షాణామయుతం జలే

పరమాత్మ యొక్క స్తోత్రమైన రుద్రగీతను ప్రచేతసులందరూ కూడా జపం చేస్తూ పదివేల సంవత్సరాలు సరస్సులో తపస్సు చేసారు

ప్రాచీనబర్హిషం క్షత్తః కర్మస్వాసక్తమానసమ్
నారదోऽధ్యాత్మతత్త్వజ్ఞః కృపాలుః ప్రత్యబోధయత్

పూర్తిగా కర్మల యందే మనసు లగ్నము చేసిన ప్రాచీన బర్హి దగ్గరకు కృపాళువైన నారదుడు వచ్చాడు. జ్ఞ్యానానికి వైరాగ్యానికీ పనికి రాని కర్మ కర్మ కాదు. ధర్మమాచరిస్తున్నట్లు ఉంటుంది అది భగవదారాధనా రూపము కాదు. నారదుడు ఆధ్యాత్మ తత్వాన్ని బాగా తెలిసినవాడు. ఆయన ప్రాచీన బర్హి వద్దకు బోధించడానికి వచ్చాడు.

శ్రేయస్త్వం కతమద్రాజన్కర్మణాత్మన ఈహసే
దుఃఖహానిః సుఖావాప్తిః శ్రేయస్తన్నేహ చేష్యతే

మహారాజా! నీవాచరించే కర్మతో నీకెలాంటి శ్రేయస్సు కావాలనుకుంటున్నావు. దుఃఖనివృత్తికీ సుఖము కలగడానికీ ఐతే నీవు చేసే యజ్ఞ్య యాగాదుల వలన అది రాదు.

రాజోవాచ
న జానామి మహాభాగ పరం కర్మాపవిద్ధధీః
బ్రూహి మే విమలం జ్ఞానం యేన ముచ్యేయ కర్మభిః

కర్మలాచరించడం వినా వేరే ఉపాయం నాకు తెలియదు. పరిశుద్ధమైన జ్ఞ్యానాన్ని మాకు ఉపదేశించండి. ఆ జ్ఞ్యానముతో నేను కర్మ విముక్తున్ని కావాలి.

గృహేషు కూటధర్మేషు పుత్రదారధనార్థధీః
న పరం విన్దతే మూఢో భ్రామ్యన్సంసారవర్త్మసు

కపట ధర్మాలతో కూడి ఉన్న గృహములలో మేమందరమూ ఉన్నాము. గృహస్థుడు ఏ ఫలమూ లేకుండా కర్మలు చేయడు. అథితులను గౌరవించినా దానాలు చేసినా అధ్యయన అధ్యాపన యజనాది కర్మలూ ఫలితాన్ని ఆశించే చేస్తాడు. గృహస్థ ధర్మము కేవలం పుత్రులూ భార్యా ధనము యందే పురుషార్థము కలిగి ఉంటుంది. మూఢులై పరతత్వాన్ని తెలియజాలడు. సంసార మార్గములో మాటిమాటికీ తిరుగుతూ ఉంటాడు.

నారద ఉవాచ
భో భోః ప్రజాపతే రాజన్పశూన్పశ్య త్వయాధ్వరే
సంజ్ఞాపితాఞ్జీవసఙ్ఘాన్నిర్ఘృణేన సహస్రశః

ఎన్నడైనా నీవు చేస్తోన్న పని గురించి ఆలోచించావా. యజ్ఞ్యముల పేరుతో ప్రాణుల సమూహమును దయ విడిచి సంహరించావు.

ఏతే త్వాం సమ్ప్రతీక్షన్తే స్మరన్తో వైశసం తవ
సమ్పరేతమయఃకూటైశ్ఛిన్దన్త్యుత్థితమన్యవః

నీవు చేసిన హింసను తలచుకుంటూ నీవెప్పుడు వస్తావా అని కోపముతో ఎదురుచూస్తూ ఉంటాయి. ఇన్ని వేల పశువులు చుట్టూ మూగి అవయవాలు లాగేయడానికోసము ఎదురు చూస్తూ ఉంటాయి

అత్ర తే కథయిష్యేऽముమితిహాసం పురాతనమ్
పురఞ్జనస్య చరితం నిబోధ గదతో మమ

ఈ విషయం నీకు అర్థం కావాలంటే ఒక ఇతిహాసాన్ని చెబుతాను. దీన్ని పురంజన ఉపాఖ్యానమంటారు. నేను జాగ్రత్తగా చెబుతాను, నీవు కూడా అంత జాగ్రత్తగానే వినాలి. (పురంజనుడంటే పురమునూ, లేదా ఇల్లును కట్టుకునేవాడు. జీవాత్మకు ఇల్లంటే శరీరము. శరీరము రావడానికవసరమైన కర్మలు చేసేవాడు. )
భగవత్తత్వమూ  భగవత్సేవ పరమపదమూ - ఈ మూడూ తెలియకుండా మనం చేసే పనులు మనము అనుకోని ఫలితాన్నిస్తాయి.

ఆసీత్పురఞ్జనో నామ రాజా రాజన్బృహచ్ఛ్రవాః
తస్యావిజ్ఞాతనామాసీత్సఖావిజ్ఞాతచేష్టితః

ఈ పురంజనుడికి పేరు కూడా తెలియని ప్రాణ మిత్రుడున్నాడు. పేరే కాదు, ఆ స్నేహితుడేమి చేస్తాడో కూడా తెలియదు. కానీ ఆ స్నేహితుడికి మాత్రం ఈ పురంజనుడి గురించి బాగా తెలుసు. తన కర్మలతో తనకు నివాసముగా ఉన్న శరీరమేర్పరచుకున్న వాడు పురంజనుడు. ఈ పురంజనుడు చాలా పెద్ద పేరున్నవాడు. ఇతనికీ కీర్తి బాగా ఉంది. అలాంటి జీవునికి మిత్రుడు పరమాత్మ. హితమును మాత్రమే (ప్రియమును కాదు) కోరేవాడు మిత్రుడు. సంసారములో ఉండే మనం ఆయన పేరే తెలుసుకోలేము. అంతే కాదు ఆయన ఏమి చేస్తున్నాడో కూడా తెలియదు. పరమాత్మకు అవిజ్ఞ్యాతా అన్న నామం ఉన్నది. భక్తుల దోషాలు తెలియని వాడు అని అర్థం. ఆయన ఏమి చేస్తాడో మనకు తెలియదు. ఆయన మనలోపల ప్రవేశించి మననందరినీ శాసిస్తాడు.

సోऽన్వేషమాణః శరణం బభ్రామ పృథివీం ప్రభుః
నానురూపం యదావిన్దదభూత్స విమనా ఇవ

ఈ రాజు తన నివాసాన్ని కోరి భూమి అంతటా సంచరిస్తున్నాడు (జీవాత్మకూడా తానాచరించిన కర్మలకు యోగ్య్మైన శరీరాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. శరీరానికి భోగాయతనం అని పేరు. మనమాచరించే కర్మలకనుభవించవలసిన భోగానికి శరీరమే ఉపకరణం. అన్నిటికంటే పెద్ద రహస్యమిదే. ఏదీ అంటని తాను, ఏదీ పట్టని తాను శరీరమనే ఒక సంచీలో ఉన్నాడు, ఆ సంచీకొచ్చే మార్పులన్నీ తనవనుకుంటాడు. )
ఇంత వెతికినా తగిన శరీరం దొరకలేదు. తిర్యక్ స్థావరములు కూడా శరీరాలే. ఈ పురాలన్నీ చూసాడు గానీ ఇవేవీ నాకనుగుణమైనవి కావు అనుకున్నాడు. అలా తిరస్కరించుకుంటూ వెళ్ళాడు

న సాధు మేనే తాః సర్వా భూతలే యావతీః పురః
కామాన్కామయమానోऽసౌ తస్య తస్యోపపత్తయే
స ఏకదా హిమవతో దక్షిణేష్వథ సానుషు
దదర్శ నవభిర్ద్వార్భిః పురం లక్షితలక్షణామ్

హిమవత్పర్వతానికి దక్షిణ ప్రాంతములో ఉన్న పట్టణాన్ని చూచాడు. ఆ నగరానికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి. నగరానికి కావలసినవి రావడానికి అవసరం లేనివి పోవడానికి ఉన్నాయి ఆ ద్వారాలు.

ప్రాకారోపవనాట్టాల పరిఖైరక్షతోరణైః
స్వర్ణరౌప్యాయసైః శృఙ్గైః సఙ్కులాం సర్వతో గృహైః

ఆ నగరానికి ప్రాకారాలున్నాయి, ప్రాకారానికి కూడా కాపలాగా అగడ్తలున్నాయి, తోరణాలున్నాయి. ప్రాకారాలంటే చర్మము. తోటలు శరీరము మీద ఉన్న రోమాలు. అందులో వేడి నీళ్ళు లోపల ఉన్న రక్తము. కనుబొమలు తోరణాలు. కళ్ళు కిటికీలు. ఆరు చక్రాలు ఆరు గదులు.
బంగారు వెండి ఇత్తడి శిఖరాలున్నాయి. ఇదే సాత్విక రాజస తామస గుణాలు. గోపురము యజమాని యొక్క గొప్ప తనాన్ని చెబుతుంది. గుణాలను బట్టి జీవుని కర్మలను చెబుతాము.

నీలస్ఫటికవైదూర్య ముక్తామరకతారుణైః
క్లృప్తహర్మ్యస్థలీం దీప్తాం శ్రియా భోగవతీమివ

ఎరుపు తెలుపు వైఢూర్య ముక్త మరకత అరుణ అనే ఏడు మణులు ( ఇవి మన శరీరములో సత్ప ధాతువులు)

సభాచత్వరరథ్యాభిరాక్రీడాయతనాపణైః
చైత్యధ్వజపతాకాభిర్యుక్తాం విద్రుమవేదిభిః

హృదయమూ వక్షమూ కంఠమూ మొదలైనవి సభామండపం, ఆస్థానము (హృదయము), ప్రథాన ద్వారము. ఇందులో ఆడుకునేవీ ఉన్నాయీ, అంగళ్ళూ ఉన్నాయి. చక్షురాది ఇంద్రియములే క్రీఎడాయతనములు. సుషుమ్నా నాడి ముక్తి మార్గము. ఇదే ఆధారం ( మూలాధారము) పెద్దా చిన్నా ఎముకలూ స్తంభాలుగా, నరాలు తాళ్ళుగా ఉన్నాయి.

పుర్యాస్తు బాహ్యోపవనే దివ్యద్రుమలతాకులే
నదద్విహఙ్గాలికుల కోలాహలజలాశయే

పురమునకు అవతల ఉన్న తోటలో తుమ్మెదలూ కోకిలలూ విహంగములూ ఉన్నాయి, కొన్ని క్రిములూ కీటకాలూ ఉన్నాయి. మన శరీరములో కూడా ఎన్నో క్రిములూ కీటకాలూ ఉన్నాయి.

హిమనిర్ఝరవిప్రుష్మత్ కుసుమాకరవాయునా
చలత్ప్రవాలవిటప నలినీతటసమ్పది

హిమవత్పరవత సెలయేటి నీటితో వచ్చే చల్లటి గాలితో తోటలో సుగంధాలు వస్తూ ఉన్నాయి. క్రిములే కాకుండా కౄరమృగాలు కూడా ఉన్నాయి.

నానారణ్యమృగవ్రాతైరనాబాధే మునివ్రతైః
ఆహూతం మన్యతే పాన్థో యత్ర కోకిలకూజితైః

అక్కడే మునులూ వారి ఆశ్రమాలూ ఉన్నాయి. వాటి వలన అరణ్య మృగాలు వచ్చినా బాధించవు. తోటలూ కోకిలలూ మొదలైనవి ఆకర్షిస్తూ ఉన్నాయి.

యదృచ్ఛయాగతాం తత్ర దదర్శ ప్రమదోత్తమామ్
భృత్యైర్దశభిరాయాన్తీమేకైకశతనాయకైః

అలాంటి ఉద్యాన వనములో భగవత్సంకల్పముతో ఒక యువతి వచ్చింది. యువతి అంటే ఇక్కడ బుద్ధి. భార్యనూ లేదా బుద్ధిని మనం కోరి తెచ్చుకోలేము. మనం ఇది వరకు ఆచరించిన కర్మలకు ఎలాంటి బుద్ధి (లేదా భార్య రావాలో అలాంటి భార్యే వస్తుంది) . ఇది దైవ సంకల్పం వలన వచ్చింది.
ఆ అమ్మై ఒక్కతే రాలేదు. ఆమెకు పది మంది సేవకులు ఉన్నారు. ఆ పది మందికీ కూడా ఒక్కొక్కరికీ ఒక్కో సేవకుడూ ఉన్నాడు. ( ఆ పది మందీ ఇంద్రియాలు, వారికుండే ఒక్కో వందమంది సేవకుల సమూహం ఇంద్రియ ప్రవృత్తులు)

అఞ్చశీర్షాహినా గుప్తాం ప్రతీహారేణ సర్వతః
అన్వేషమాణామృషభమప్రౌఢాం కామరూపిణీమ్

ఐదు తలల పాము ఉంది ( ఐదు వాయువులు), దానికి కూడా కాపలాదారుడున్నాడు. ఆమె పతిని కోరుతున్నది. కామ రూపి అయిన ఆమె

సునాసాం సుదతీం బాలాం సుకపోలాం వరాననామ్
సమవిన్యస్తకర్ణాభ్యాం బిభ్రతీం కుణ్డలశ్రియమ్

చక్కని కను ముక్కు తీరు, పలు వరుస కపోలములూ, సమానముగా ఉన్న చెవులు యొక్క ఆభరణాలు గలది. (మంచి వారిని చూస్తే వింటే అవి మంచివవుతాయి. మంచి బుద్ధి ఉన్న కనులు మంచి కనులు. మంచినే చూడాలనుకునే కనులు).

పిశఙ్గనీవీం సుశ్రోణీం శ్యామాం కనకమేఖలామ్
పద్భ్యాం క్వణద్భ్యాం చలన్తీం నూపురైర్దేవతామివ

పట్టు పీతాంబరం కట్టుకున్నది. నడుము మధ్యము. పూర్వోత్తర భాగములకు సంధి. స్వర్గ నరకాలకు సంధి. పైకి వెళితే స్వర్గం, కిందకి వెళితే నరకం. బలముగా ఉన్న కాళ్ళు కలది. (నడిచే బుద్ధి)

స్తనౌ వ్యఞ్జితకైశోరౌ సమవృత్తౌ నిరన్తరౌ
వస్త్రాన్తేన నిగూహన్తీం వ్రీడయా గజగామినీమ్

బాల్య యవ్వన మధ్య అవస్థను గుర్తు చేసే స్తనములు

తామాహ లలితం వీరః సవ్రీడస్మితశోభనామ్
స్నిగ్ధేనాపాఙ్గపుఙ్ఖేన స్పృష్టః ప్రేమోద్భ్రమద్భ్రువా

బుద్ధి యొక్క ఇన్ని రకముల శక్తులను చూచాడు. నడుస్తూ నడుస్తూ ఓరకంట వాడిని ప్రేమపూర్వకమైన కనుబొమ్మల తీరు కలిగి ఓర చూపుతో చూసింది. (అంటే బుద్ధి కావాలని మనమనుకోమూ, మనము కావాలని బుద్ధి అనుకుంటుంది)

కా త్వం కఞ్జపలాశాక్షి కస్యాసీహ కుతః సతి
ఇమాముప పురీం భీరు కిం చికీర్షసి శంస మే

విశాలమైన నేత్రము కలదానా, నీవెవరవు ఎవరి దానవు ఇక్కడకెలా వచ్చావు, ఇల్లు వదిలి కోటలోకి ఏమి చేయాలనుకొని వచ్చావు.

క ఏతేऽనుపథా యే త ఏకాదశ మహాభటాః
ఏతా వా లలనాః సుభ్రు కోऽయం తేऽహిః పురఃసరః

పది మంది బటులు ఉన్నారు, వంద మంది స్త్రీలు ఉన్నారు, వెనక పాము కూడా నడుస్తోంది

త్వం హ్రీర్భవాన్యస్యథ వాగ్రమా పతిం విచిన్వతీ కిం మునివద్రహో వనే
త్వదఙ్ఘ్రికామాప్తసమస్తకామం క్వ పద్మకోశః పతితః కరాగ్రాత్

నీవు భూమివా పార్వతివా సరస్వతివా లక్ష్మివా.మునిలాగ అరణ్యములో ఏకాంతములో తపస్సు చేస్తున్నావా, భర్తకోసం వెతుకుతున్నావా.

నాసాం వరోర్వన్యతమా భువిస్పృక్పురీమిమాం వీరవరేణ సాకమ్
అర్హస్యలఙ్కర్తుమదభ్రకర్మణా లోకం పరం శ్రీరివ యజ్ఞపుంసా

నీవు పైన చెప్పిన వారిలో ఎవెత్తవూ కావు. నీ పాదములు భూమికి అంటుకొని ఉన్నాయి. నిరంతరం నీ పాదాలను ఆశ్రయించాలనుకున్న భక్తుల కోరికను తీర్చడానికి వారిని అనుగ్రహించి వచ్చావా అంటే నీ చేతిలో పద్మము లేదే? ఐనా నీవు పైన చెప్పిన వారిలో ఎవత్తెవూ కావు. దేవతవు కూడా కావు. యజ్ఞ్య వరాహ స్వామితో భూమిలాగ, శ్రీమన్నారాయణునితో అమ్మవారిలాగ నీవు నాతో కలిసి ఈ నవద్వారాలు గల నగరాన్ని ప్రవేశిస్తే బాగుంటుంది.

యదేష మాపాఙ్గవిఖణ్డితేన్ద్రియం సవ్రీడభావస్మితవిభ్రమద్భ్రువా
త్వయోపసృష్టో భగవాన్మనోభవః ప్రబాధతేऽథానుగృహాణ శోభనే

నీ ఓరచూపుతో నా మనసు చలించినది.కొంచెం సిగ్గూ కొంచెం ప్రేమా, ఇవనీ తొణికిసలాడే కనుబొమ్మల కదలికతో కాల్చబడిన మన్మధుడు నన్ను బాధిస్తున్నాడు. నీవు నన్ను అనుగ్రహించవలసింది.

త్వదాననం సుభ్రు సుతారలోచనం వ్యాలమ్బినీలాలకవృన్దసంవృతమ్
ఉన్నీయ మే దర్శయ వల్గువాచకం యద్వ్రీడయా నాభిముఖం శుచిస్మితే

సిగ్గుతో తలను వంచుకుని ఉన్నావు. నీ తల ఎత్తి సుందరమైన మధురముగా మాట్లాడే నీ ముఖమును నాకు చూపవలసింది అని పురంజనుడు పురంజనిని కోరాడు.

నారద ఉవాచ
ఇత్థం పురఞ్జనం నారీ యాచమానమధీరవత్
అభ్యనన్దత తం వీరం హసన్తీ వీర మోహితా

ఇలా (అధీరవత్ యాచమానం) దీనుడై యాచించాడు (ఆమె లేకుంటే జీవించలేనట్లుగా దైన్యం కోల్పోయిన వాడిలా) అలా అడగడముతో అభినందించింది (స్త్రీ తన భర్త చేతగాని వాడై ఉండాలి, తన మీదే ఆధారపడి ఉండాలి, నిత్యం తనని బతిమలాడుతూ ఉండాలి, అని ఆలోచిస్తుంది, అందుకే పురుషులను గృహపాలః అని బిరుదు. కానీ భర్తచేత స్త్రీ బతిమలాడించుకుంటే భర్తకు అమంగళం. ఉదా: కైక, దశ్రధుడు. ) పురంజనుడు దీనుడిలా యాచించడాన్ని అభినందించింది. ఈమె కూడా అతనిని మోహించింది. మగవారి కన్నా ఆడవారికే కామం ఎక్కువగా ఉంటుంది కానీ బయటపడకుండా మగవారిచేతే మొదట అడిగించుకుంటారు

న విదామ వయం సమ్యక్కర్తారం పురుషర్షభ
ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం నామ చ యత్కృతమ్

నన్నెవరు చేసారో నా గోత్రమేమిటో నాకీ పేరు ఎవరు పెట్టారో నన్నెక్కడికి ఎవరు వచ్చేట్లు చేసారో తెలీదు (మనకు ప్రేమ ఎపుడు పుడుతుందో శాంతం ఎప్పుడు పుడుతుందో తెలీదు. శాంతముగా ఉన్నవారొక్కసారి కోపావేశానికి గురవుతుంటారు.) ఇక్కడ ఉన్నాను అన్న విషయం మాత్రం తెలుసు

ఇహాద్య సన్తమాత్మానం విదామ న తతః పరమ్
యేనేయం నిర్మితా వీర పురీ శరణమాత్మనః

అంతకు మించి ఇంకేమీ తెలీదు. నీకూ నాకూ అనుకూలముగా ఉన్న ఈ నగరాన్ని ఎవరు నిర్మించారో కూడా తెలీదు. (బుద్ధి చెప్పినట్లే జీవుడూ, స్త్రీ చెప్పినట్లే పురుషుడూ వింటాడు). 

ఏతే సఖాయః సఖ్యో మే నరా నార్యశ్చ మానద
సుప్తాయాం మయి జాగర్తి నాగోऽయం పాలయన్పురీమ్

వీరంతా నా చెలికత్తెలూ మిత్రులూ. ఈ సర్పం నేను నిదురపోయినప్పుడు నాకే ఆపద రాకుండా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. (ఇదే ప్రాణ వాయువు. దీని ప్రాముఖ్యం చెప్పడానికి బృహదారకణ్యములో మొదటి భాగములో రెండో అధ్యాయం దేవదానవ యుద్ధములో దేవతలు ఒక్కో ఇంద్రియాన్ని ఆశ్రయిస్తారు. ఆ ఇంద్రియములో చేరి బలము సంపాదించాలని. అక్కడికి రాక్షసులు కూడా వచ్చి ఆశ్రయిస్తారు. ఫలము సగం ఇటూ అటూ ఉంటుంది. దేవతలు చివరికి ప్రాణ ఇంద్రియాన్ని ఆశ్రయిస్తారు. అక్కడికి రాక్షసులు రాలేక ఓడిపోతారు. ఈ కథ అర్థమేమిటంటే ఇంద్రియములు చెడూ మంచీ రెండూ చేస్తాయి. కన్ను చూడవలసిన దాన్ని చూడాలి. ఒక వేళ ఆసురీ ప్రవృత్తి చేరితే చూడకూడని దాన్ని చూస్తుంది. ఏ ఇంద్రియమైనా ఇంతే. కానీ ప్రాణం సకల ఇంద్రియాలనూ తన శక్తితో బలోపేతం చేస్తుంది. వేద సిద్ధాంతమేమిటంటే, ఇంద్రియాలంటూ ఏమీ లేవు. ఉన్నది ప్రాణమే. అందుకే ఆ ముఖ్య ప్రాణాన్ని ఆరాధన చేయాలి, నియమించాలి. అదే ప్రాణాయామం. అప్పుడు ఏ ఏ ఇంద్రియాలకు ఎంత శక్తి అవసరమో అంత ఆహారం వేళుతుంది. ఈ ప్రాణాన్ని పరబ్రహ్మగా ఆరాధించగలుగుటే మోక్షం) అందుకే అందరూ నిదురపోయినా ప్రాణము నిద్రపోదు.)

దిష్ట్యాగతోऽసి భద్రం తే గ్రామ్యాన్కామానభీప్ససే
ఉద్వహిష్యామి తాంస్తేऽహం స్వబన్ధుభిరరిన్దమ

అదృష్టం బాగుండి నీవు నా దగ్గరకు వచ్చావు. అలాంటి నీ కోరికను నేను మన్నిస్తాను. నిన్ను వివాహం చేసుకుంటాను. నేనొక్కదాన్నే రాను నా బంధువులతో వస్తాను. 

ఇమాం త్వమధితిష్ఠస్వ పురీం నవముఖీం విభో
మయోపనీతాన్గృహ్ణానః కామభోగాన్శతం సమాః

ఈ తొమ్మిది ద్వారాలు గల నగరాన్ని అధిష్టించు. నేను నీతో నూరు సంవత్సరాల కామ భోగాన్ని అనుభవిస్తాను.

కం ను త్వదన్యం రమయే హ్యరతిజ్ఞమకోవిదమ్
అసమ్పరాయాభిముఖమశ్వస్తనవిదం పశుమ్

ఇన్ని మంచి గుణాలు కల నిన్ను కాక ఎవరిని కోరుకుంటాను. "రేపు" అంటే తెలియని వాడిని ఏ స్త్రీ కోరుతుంది. (బాగా సంపాదించి కూడబెట్టినవాడినే స్త్రీ కోరుతుంది). అసమ్పరాయా (సమ్పరాయా - మృత్యువు) - చాలా కాలం జీవించి ఉండాలన్న దీర్ఘాయుష్మంతున్నీ బలాడ్యున్నీ సంపదలున్న వాడినీ కోరుతుంది. వైరాగ్యముతో ఉన్న వాడిని ఏ భార్యా కోరదు. ఇహమూ పరమూ తెలిసిన నిన్ను కాక నేను మరెవరిని కోరుకుంటాను. 

ధర్మో హ్యత్రార్థకామౌ చ ప్రజానన్దోऽమృతం యశః
లోకా విశోకా విరజా యాన్న కేవలినో విదుః

గృహస్థాశ్రమానికి మొదట కావలసినది ధర్మం. దాని తరువాత అర్థకామాలు. నిశ్చింతగా అనుభవించడమే భోగము. అది ధర్మము చేతనే వస్తుంది. అనుభవించే వస్తువు మీద అనుభవించేవాడు ఏకాగ్రతతో ఉండాలి, భయము ఉండకూడదు. అర్థాన్ని ధర్మముతో ముడివేస్తేనే అది సాధ్యమవుతుంది. ధర్మము వలన అర్థమును సంపాదించి, అర్థము వలన కోరిక తీర్చుకుంటేనే మోక్షమ్ము. కామము మోక్షము మీద ఉండాలి, ధర్మముతో అర్థాన్ని సంపాదించాలి.
ఈ గృహస్థాశ్రమములో ఈ మూడూ ఉన్నాయి, సంతానమూ కలుగుతుందీ, చివరకు మోక్షం కూడా వస్తుంది. కీర్తి వస్తుంది. సక్రమముగా గృహస్థాశ్రమం పాటించినవారు శోకమూ మాలిన్యమూ కలిగి ఉండరు. నిర్మలులవుతారు. ఈ గృహ్స్థాశ్రమం గురించి నివృత్తి మార్గములో ఉన్నవారికి (కేవలులు) ఏమి తెలుసు

పితృదేవర్షిమర్త్యానాం భూతానామాత్మనశ్చ హ
క్షేమ్యం వదన్తి శరణం భవేऽస్మిన్యద్గృహాశ్రమః

ధర్మబద్ధముగా ఉంటే ఈ గృహస్థాశ్రమమే పితృదేవతలకు, దేవతలకూ ఋషులకూ మానవులకూ ఇతర ప్రాణులకూ తనకూ క్షేమం కలిగిస్తుంది. (పితృ దేవ ఋషి భూత అథితి ఋణము ఉంటుంది)
ఈ ప్రపంచములో గృహాశ్రమమే క్షేమాన్ని కలిగిస్తుంది

కా నామ వీర విఖ్యాతం వదాన్యం ప్రియదర్శనమ్
న వృణీత ప్రియం ప్రాప్తం మాదృశీ త్వాదృశం పతిమ్

నాలాంటి అమ్మాయి నీలాంటి అబ్బాయిని కాక వేరేవరిని కోరుతుంది. ప్రసిద్ధి పొందినవాడవు, సుందరుడవు. 

కస్యా మనస్తే భువి భోగిభోగయోః స్త్రియా న సజ్జేద్భుజయోర్మహాభుజ
యోऽనాథవర్గాధిమలం ఘృణోద్ధత స్మితావలోకేన చరత్యపోహితుమ్

విశాలమైన నీ వక్షస్థలాన్ని ఆశ్రయించాలని ఏ యువతి కోరుకోదు.జాలి (ఘృణ) కేవలం ప్రీతితో కోరికతో చిరునవ్వుతో కూడిన చూపుతో మనసులో ఉన్న బాధను తొలగించగలిగేది. అలాంటి నీ భుజాలను వక్షస్థలాన్ని ఏ స్త్రీ కోరుకోదు

నారద ఉవాచ
ఇతి తౌ దమ్పతీ తత్ర సముద్య సమయం మిథః
తాం ప్రవిశ్య పురీం రాజన్ముముదాతే శతం సమాః

ఇలా ఇద్దరూ మాట్లాడుకున్నారు. పరస్పర ఒప్పందం చేసుకున్నారు. ఆ నగరాన్ని ప్రవేశించి నూరు సంవత్సరాలు ఆనందముగా ఉన్నారు. జీవుడూ బుద్ధీ శరీరములో చేరారు. తాను ఆచరించిన కర్మకు అనుగుణమైన బుద్ధే వస్తుంది. బుద్ధిః కర్మానుసారిణి. తనకర్మకు ఏ ఫలితం పొందాలో ఆ బుద్ధే పుడుతుంది. బుద్ధి జీవునితో కలిస్తే పరమాత్మ కంటే  భిన్నమైన దాని యందే కోరికపుడుతోంది. జాగ్రత్ స్వప్న సుషుప్తి మరణావస్థలో ఉన్న దోషాలను కింద చెబుతున్నాడు. మనము మేలుకొని ఉన్నప్పుడు చేసే తప్పులేమిటి?

ఉపగీయమానో లలితం తత్ర తత్ర చ గాయకైః
క్రీడన్పరివృతః స్త్రీభిర్హ్రదినీమావిశచ్ఛుచౌ

పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, అవి చూస్తూ వింటూ తిరుగుతూ, స్త్రీల సంబంధముతో, ఆషాడమాసములో (చుచౌ) (మబ్బూ వానా మెరుపూ గృహస్థును కలచి వేస్తాయి. అప్పుడు విహరించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది)  అందరితో కలిసి సరస్సుకు వెళ్ళాడు
ఇందులో మనకు గానమూ నాట్యమూ సేవకులూ సరస్సు , ఈ నాలుగూ శ్రవనేంద్రియ చక్సురింద్రియముల వ్యాపారాల గురించి చెబుతాయి. బుద్ధి జీవుడిని ఇంద్రియ సుఖానుభూతికి ప్రేరేపిస్తున్నాయి. 

సప్తోపరి కృతా ద్వారః పురస్తస్యాస్తు ద్వే అధః
పృథగ్విషయగత్యర్థం తస్యాం యః కశ్చనేశ్వరః

నగరమునకు తొమ్మిది ద్వారాలున్నాయి. ఈ తొమ్మిది ద్వారాలలో ఏడు పైన, కింద రెండూ ఉన్నాయి. ఈ ద్వారాలెందుకంటే వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళడానికి (శబ్ద స్పర్శ రూప రస గంధాలనే విషయాలనుభవించడానికి). 

పఞ్చ ద్వారస్తు పౌరస్త్యా దక్షిణైకా తథోత్తరా
పశ్చిమే ద్వే అమూషాం తే నామాని నృప వర్ణయే

ఈ ఏడు ద్వారాలలో కూడా ముందర ఐదు ద్వారాలున్నాయి, రెండు పక్కల రెండు ద్వారాలున్నాయి. తూరుపు దిక్కున రెండు ద్వారాలున్నాయి

ఖద్యోతావిర్ముఖీ చ ప్రాగ్ద్వారావేకత్ర నిర్మితే
విభ్రాజితం జనపదం యాతి తాభ్యాం ద్యుమత్సఖః

ఖద్యోతా (ఖః - సూర్యుడు. సూర్యునితో ప్రకాశింపచేయడం వలన చూచేవి. దక్షిణ నేత్రానికి ఖద్యోత అని పేరు) అవిర్ముఖి  (అవిః ప్రకటం ముఖం - కుడి కన్ను కంటే ఎడమ కన్నే బాగా చూస్తుంది. కుడి కన్ను దైవ కార్య క్రమాలకూ ఎడమ కన్ను లౌకిక కార్యాలకూ. లౌకికాన్ని బాగా చూసేది ఎడమ కన్ను. గ్రంధాలు చదివే వాడికి మొదలు ఎడమ కన్ను దెబ్బ తింటుంది. లౌకికముగా బాగా ఉండేవాడికి మొదట కుడికన్ను దెబ్బతింటుంది. చూచే వారికి ఎడమకన్ను ఎక్కువ ప్రకాశమిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి ఎక్కువ చూపేది కుడి కన్ను. ఎడమ కన్ను ఎక్కువ చూపించినట్లనిపిస్తుంది ఎడమ కన్నుది భ్రాంతి, కుడి కన్నుది వాస్తవం)
ద్యుమత్సఖః - ఈ రాజు విభ్రాజితమనే పట్టణానికి వెళ్ళాడు. విభ్రాజితమంటే ప్రకాశం. సూర్యుని సహాయముతో రెండు కన్నుల ద్వారా వెలుగును చూస్తాడు. 

నలినీ నాలినీ చ ప్రాగ్ద్వారావేకత్ర నిర్మితే
అవధూతసఖస్తాభ్యాం విషయం యాతి సౌరభమ్

ఇంకో రెండు ద్వారాలున్నాయి. దక్షిణ వామ నాసికలు. నలమంటే చిధ్రము (రంధ్రము). అవధూతసఖ (వాయు స్నేహము). వాయు స్నేహముతో సుగంధమనే ఊరిలోకి వెళుతుంది. గంధాన్ని చూడాలంటే దాన్ని అందించేది వాయువు. వాయువు గంధాన్ని మోసుకొచ్చి నాసికకు అందిస్తాడు. అందుచే వాయువు స్నేహితుడు

ముఖ్యా నామ పురస్తాద్ద్వాస్తయాపణబహూదనౌ
విషయౌ యాతి పురరాడ్రసజ్ఞవిపణాన్వితః

నోరు ముఖ్యద్వారం. ఇదే ప్రధాన ద్వారం. తక్కిన ద్వారాల సౌకర్యాన్నీ అసౌకర్యాన్నీ చెప్పేది ఇదే. ఇక్కడ చాలా దుకాణాలకు వెళ్ళీ చాలా వస్తువులు తీసుకుని వస్తాడు. బహూదనౌ - బహు ఔదనం - అన్నం. ఆపణ - అంగడి, పణమంటే వ్యవహారము. వ్యవహారానికీ అన్నానికీ ఇది నేను తింటాను అనడానికీ ఇదే ద్వారము. వ్యవహారానికీ అన్నానికీ రెంటికీ ఇదే మార్గము. 
ఈ ద్వారము గుండా వెళ్ళేప్పుడు రసజ్ఞ్యుడు విపణీ కూడా వస్తారు. రసజ్ఞ్యుడంటే రుచి తెలిసిన వాడు, విపణాన్వితః - కొనుగోలు చేసేవాడూ, లేదా మాట్లాడే వాడు. ఈ ఇద్దరూ మిత్రులు (నాలుక రెండు విషయాలు చేస్తుంది, ఈ రుచి కావాలి అని చెబుతుంది, ఆ రుచినీ చూస్తుంది)

పితృహూర్నృప పుర్యా ద్వార్దక్షిణేన పురఞ్జనః
రాష్ట్రం దక్షిణపఞ్చాలం యాతి శ్రుతధరాన్వితః

దక్షిణ ఉత్తర ద్వారాలు రెండు. దక్షిణ ద్వారానికి పేరు పితృః. పితృ లోక ప్రాప్తి సాధనమైన వేదాలని వినేది దక్షిణ ద్వారము (దక్షిణ కర్ణం). దీఎనికి పేరు పితృః. దక్షిణ కర్ణము వామ కర్ణము కన్నా బలముగా ఉంటుంది, అందుకే శాస్త్రము వినడానికి ఆ చెవి పనికొస్తుంది. శాస్త్ర శ్రవణ సాధనం. వాస్తవముగా పరమాత్మను పొందే ఫలాన్నిచ్చేది నివృత్తి కర్మ. నివృత్తి కర్మను ప్రసాదించే వేదాంత శాస్త్రాన్ని వినడానికి పనికొచ్చేది వామ కర్ణం. వేద పూర్వ  భాగం దక్షిణ కర్ణం. ఉత్తర మీమాంస వామ కర్ణం. వేదాంతము కంటే వేదాంతమును వినాలీ, వేదాంతములో ప్రవర్తించాలంటే అంతకు ముందు ఉన్న ఆశ్రమాల యందు విరక్తి కలగాలి. అలా కలగాలంటే ఆ ఆశ్రమములో ఉన్న మంచి చెడులు తెలియాలి. కర్మ ఆచరిస్తే గానీ అందులో ఉన్న మంచీ చెడులు అర్థం కావు. విరక్తి సహజముగా కలగాలి. ఎవరికి వారే తెలుసుకోవాలి. వైరాగ్యం కలగడానికి ముందు ఉన్న శాస్త్రములే దృఢములు. ఆ విషయాలను వినడానికి వినే కర్ణం బలముగా ఉండాలి. అందుకే కుడి చెవి పితృః. జ్ఞ్యానము కలిగాక బలం తక్కువ ఉన్నా సమస్య ఉండదు. 

దేవహూర్నామ పుర్యా ద్వా ఉత్తరేణ పురఞ్జనః
రాష్ట్రముత్తరపఞ్చాలం యాతి శ్రుతధరాన్వితః

దక్షిణ దిక్కున ఉన్న పంచాలమునకు వెళ్ళాడు (పంచ - ఐదు అలం - చాలు. శబ్ద స్పర్శ రూప రస గ్రధ విషయాలు చాలు). శ్రుతి ధరునితో (శబ్దాన్ని సహాయముగా చేసుకుని) అక్కడికి వెళ్ళాడు. శరణాగతి సంబంధించిన శాస్త్రాన్ని కూడా ఆచార్యులు కుడి చెవిలోనే చెబుతారు. పరమాత్మను ఆశ్ర్యైంచడానికి కావల్సిన చెవి కుడి చెవి. విరక్తి కలిగాక ఎడమ చెవి. 

మనకు కావలసిన శబ్ద స్పర్శ రూప రస గంధములను వినడానికి వాక్కు ఎంత ప్రధానమో చెవి కూడా అంతే ప్రధానం. పంచ విషయాలకు తృప్తి కలిగించే విధానన్ని బోధించే శబ్దములు మనము చెవులతోనే వింటాము. 

ఆసురీ నామ పశ్చాద్ద్వాస్తయా యాతి పురఞ్జనః
గ్రామకం నామ విషయం దుర్మదేన సమన్వితః

కింది ద్వారము పేరు ఆసురి. ఇది గ్రామ్యమనే విషయాన్ని పొందుతుంది. (ఇదే ఉపస్థ ఇంద్రియం). ఇది దుర్మదుడనే (మదము) స్నేహితుడితో కలిసి ఉంటుంది.

నిరృతిర్నామ పశ్చాద్ద్వాస్తయా యాతి పురఞ్జనః
వైశసం నామ విషయం లుబ్ధకేన సమన్వితః

ఇంకో ద్వారం నిరృతి. ఇది మృత్యు ద్వారము. (అపానము. పాయు. మల విసర్జన ద్వారము). 

అన్ధావమీషాం పౌరాణాం నిర్వాక్పేశస్కృతావుభౌ
అక్షణ్వతామధిపతిస్తాభ్యాం యాతి కరోతి చ

ఇందులో రెండు ద్వారాలున్నాయి (ఇంద్రియాలు). కానీ అవి మూసివేయబడి ఉన్నాయి. చూసేవి కావు గాని పని మాత్రం చేస్తాయి. అవి పాణి, పాద. ఇవి గుడ్డివి (చూడలేవు) గానీ పనులు చేస్తాయి. కాని ఇవి జ్ఞ్యానము లేనివి. నిర్వాక్పేశస్కృతావుభౌ - దీనికి మాట కూడా లేదు. పేశస్కృత్ : తన చేయి తనే నరుక్కుంటుంది. తన కాలు తననే గోతిలో పడేస్తుంది. గుడ్డిగా వ్యవహరించి తన ద్వారాన్ని తానే మూసుకుంటుంది. ఈ రెంటితో వండుతాడు (యాతి) పని చేస్తాడు (కరోతి) 

స యర్హ్యన్తఃపురగతో విషూచీనసమన్వితః
మోహం ప్రసాదం హర్షం వా యాతి జాయాత్మజోద్భవమ్

ఈ అన్ని ఇంద్రియాలూ ఉంటే సరిపోదనీ, వీటికొక కేంద్రం కావాలి. దీనికొక అంతః పురం ఉండాలి. రాజూ రాణీ కలిసి ఉండాలి. అదే హృదయం. ఈ అంతఃపురములో పరిచారకులతో సేవకులతో దాసులతో ఉన్నాడు. జీవుడికి ఒక ఆంతరంగిక స్నేహితుడు ఉన్నాడు. మనసు. ఈ మనస్సు అన్నిట్లోనూ ఉంది. మనసనే స్నేహితుడితో జీవుడు ఉంటాడు. విషూచీ - సర్వతా వ్యాపించి ఉండేది. భార్య బుద్ధి, భర్త జీవుడు పుత్రుడు ఇంద్రియ వృత్తులూ, వీరిని వెంటబెట్టుకుని మనస్సు తోడు తీసుకుని హృదయములోకి ప్రవేశించాడు. 
ఇందులో వెళ్ళి మోహాన్ని అనుగ్రహాన్నీ హర్షం (తమో సత్వ రజో గుణాలకనుగుణముగా ) పొందుతాడు. 

ఏవం కర్మసు సంసక్తః కామాత్మా వఞ్చితోऽబుధః
మహిషీ యద్యదీహేత తత్తదేవాన్వవర్తత

కర్మలకు ఆసక్తుడై మోహించబడతాడు. అంతః పురములోకి వెళ్ళిన రాజు ఆమె (బుద్ధి) చెప్పినట్లు విన్నాడు. ఆమె ఏమి చేస్తే అది చేసాడు. భార్య ఏమి కోరితే అది చేసాడు. ఎలా ఉండమంటే అలా ఉన్నాడు. అడిగిందల్లా ఇచ్చాడు

క్వచిత్పిబన్త్యాం పిబతి మదిరాం మదవిహ్వలః
అశ్నన్త్యాం క్వచిదశ్నాతి జక్షత్యాం సహ జక్షితి

క్వచిద్గాయతి గాయన్త్యాం రుదత్యాం రుదతి క్వచిత్
క్వచిద్ధసన్త్యాం హసతి జల్పన్త్యామను జల్పతి

క్వచిద్ధావతి ధావన్త్యాం తిష్ఠన్త్యామను తిష్ఠతి
అను శేతే శయానాయామన్వాస్తే క్వచిదాసతీమ్

క్వచిచ్ఛృణోతి శృణ్వన్త్యాం పశ్యన్త్యామను పశ్యతి
క్వచిజ్జిఘ్రతి జిఘ్రన్త్యాం స్పృశన్త్యాం స్పృశతి క్వచిత్

క్వచిచ్చ శోచతీం జాయామను శోచతి దీనవత్
అను హృష్యతి హృష్యన్త్యాం ముదితామను మోదతే

విప్రలబ్ధో మహిష్యైవం సర్వప్రకృతివఞ్చితః
నేచ్ఛన్ననుకరోత్యజ్ఞః క్లైబ్యాత్క్రీడామృగో యథా

ఆమె మద్యపానం చేస్తే ఇతనూ చేసాడు, తింటే తిన్నాడు పాడితే పాడాడు ఏడిస్తే ఏడిచాడు నవ్వితే నవ్వాడు, పరిగెత్తుతుంటే వెంట పరిగెత్తాడు, నిలబడితే నిలబడ్డాడు. అంటే బుద్ధి చెప్పినట్లు విన్నాడు. పడుకుంటే పడుకున్నాడు కూర్చుంటే కూర్చుంటాడు వింటే వింటాడూ చూస్తే చూస్తాడు వాసన చూస్తే వాసన చూసాడు తాకితే తాకుతాడు ఏడిస్తే పరమ దీనుడిలా ఏడుస్తాడు నవ్వితే నవ్వుతాడు సంతోషిస్తే బాగా సంతోషిస్తాడూ ఆనందిస్తే ఆనందిస్తాడు
ఇలా భార్యతో అన్ని రకాలా వంచించబడి తన స్వభావాన్ని మరచిపోయాడు. చేసిన దాన్ని చేయడమే తప్ప స్వయముగా ఆలోచించడమూ చేయడమూ మరచిపోయాడు అవిజ్ఞ్యానముతో. నపున్సకుడిలా ఎదుటివాడు చెప్పినట్లు విన్నాడు ఒక క్రీడా మృగములా (పెంపుడు జంతువులా)
ఇలా పరిపూర్తిగా వంచించబడి ఆమెకు దాసుడయ్యాడు