Pages

Sunday, 2 March 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై ఆరవ అధ్యాయం


బృహదారణ్యకములో స్వప్నము గురించి విశేషముగా చెప్పబడింది. స్వప్నములో అన్ని రకాల సుఖ దుఃఖానుబూతి పొందుతాము. ఉత్తమమైన ఆనందాన్ని భయంకరమైన భయాన్ని పొందుతాము. మనకు ఆ అనుభూతి కలుగుతుంది. మనం చేసిన పాప పుణ్యాల తారతమ్యాలను బట్టి ఉంటుంది. ఇహలోకములో స్వర్గనరకాది లోకములో అనుభవించినా మిగిలిన వాటిని అనుభవించడానికి స్వప్నలోకం సృష్టించబడింది. ఇక్కడ వేట అంటే స్వప్నం. మృగాలంటే ఇంద్రియ ప్రవృత్తి. వాంచ అభిలాష కోరికా ఇవన్నీ మృగాలు. 

నారద ఉవాచ
స ఏకదా మహేష్వాసో రథం పఞ్చాశ్వమాశుగమ్
ద్వీషం ద్విచక్రమేకాక్షం త్రివేణుం పఞ్చబన్ధురమ్

వేటకు వెళ్ళడానికి రథమెక్కాడు. ఐదు గుఱ్ఱాలతో కూడి వేగముగా వెళుతుందీ రథం. రథాన్ని ముందుకు లాగడానికి నొగలు (ద్వీషం) ఒకటి, రెండు చక్రాలు, ఒక ఇరుసు, వీటిని కలిపే మూడు వేణులు, దీన్ని కట్టేసే ఐదు బంధాలు
మహేష్వాసో  - గొప్ప ధనువు కలవాడు.  ధనువును వేదాంత పరిభాషలో ప్రణవమంటారు. జీవుడు ఏ అవస్థలో ఉన్నా ప్రణవార్థ మననం మాత్రం మరవకూడదు. 
ఐదు గుఱ్ఱాలు ఐదు జ్ఞ్యానేంద్రియాలు. రథమంటే శరీరం. ఇది చాలా వేగముగా వెళుతుంది (ఆశుగం) కలలో. 
ద్వీషం - అహంకార మమకారాలు. 
రెండు చక్రాలు - పుణ్య  పాపాలు. 
ఏకాక్షం - వాసన. ప్రధానమనే అక్షము కలది.
సత్వ రజ తమస్సు అనే మూడు వేనులు. 
పఞ్చబన్ధురమ్ - పంచ కర్మేంద్రియాలు.

ఏకరశ్మ్యేకదమనమేకనీడం ద్వికూబరమ్
పఞ్చప్రహరణం సప్త వరూథం పఞ్చవిక్రమమ్

ఒకే పగ్గం. ఒకే సారధి. రధికుడు కూర్చునేది (నీడము), రెండు పక్కల కూబరాలు, కొట్టడానికి ఐదు రకాల ఆయుధాలు, ఏడు బంధములూ, ఐదు రకాలుగా ఇది బయలు దేరుతుంది
మనస్సు పగ్గము.
నియంత ఒకడే - సారాధి , బుద్ధి
నీడము హృదయము.
రెండు కూబరాలు - బీజమూ వాసన (సంస్కారము)
పఞ్చప్రహరణం -శబ్దాది పంచ విషయములు. 
సప్త వరూథం- ఏడు ధాతువులు 
పఞ్చవిక్రమమ్ - ఐదు విక్రమాలు. ఐదు తన్మాత్రలు

హైమోపస్కరమారుహ్య స్వర్ణవర్మాక్షయేషుధిః
ఏకాదశచమూనాథః పఞ్చప్రస్థమగాద్వనమ్

బంగారు తొడుగు ఉంది, ఎన్ని బాణములు కొట్టినా తరగని అమ్ములపొది ఉంది. పదకొండు మంది సైన్యాలను తీసుకుని ఐదు చోట్లకు బయలు దేరాడు.
రథానికి బంగారు తొడుగు. బంగారమంటే వ్యామోహం. చర్మం
స్వర్ణవర్మాక్షయేషుధిః - జీవుడు బాణము. దానికి నిలయం మనస్సు బుద్ధి అంతఃకరణం
పదకొండు మంది సైన్యం - ఏకాదశ ఇంద్రియములు

చచార మృగయాం తత్ర దృప్త ఆత్తేషుకార్ముకః
విహాయ జాయామతదర్హాం మృగవ్యసనలాలసః

బాణాన్ని ఎక్కుపెట్టి మదించి అరణ్యములో సంచరించాడు. భార్యను తీసుకుని వెళ్ళకుండా వేటకు వెళ్ళాడు. వదిలిపెట్టకూడని దానిని విడిచిపెట్టి వెళ్ళాడు - అతదర్హాం  జాయాం. మృగవ్యసనలాలసః - ఇంద్రియ విషయములను వెతుకుతూ వెళ్ళాడు. 

ఆసురీం వృత్తిమాశ్రిత్య ఘోరాత్మా నిరనుగ్రహః
న్యహనన్నిశితైర్బాణైర్వనేషు వనగోచరాన్

ఎందుకు బుద్ధిని విడిచిపెట్టాడంటే అతని ప్రవృత్తి ఆసురీ ప్రవృత్తి. వేటకు వెళ్ళడమంటేనే ఆసురీ ప్రవృత్తి. వేటకు వేళ్ళాల్సివస్తే ఋష్యాశ్రమాలను విడిచిపెట్టాలి. వాటికి దూరముగా ఉండాలి. ఆశ్రమమంటే సాత్వికం. వేట అంటే తామసం. తీవ్రమైన మనసు గలవాడై మృగముల యందు దయ విడిచిపెట్టి తీక్షణమైన బాణములతో మృగాలను చంపాడు. అంటే ఇంద్రియములు అనుభవించాలనుకున్న విషయాలను వివేకం కోల్పోయి అనుభవించాడు. వనమంటే స్వప్నం. స్వప్నములో కనపడే ఇంద్రియార్థాలను ఆలోచించకుండా అనుభవించాడు. 

తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్పశూన్వనే
యావదర్థమలం లుబ్ధో హన్యాదితి నియమ్యతే

వేటాడాలంటే శ్రాద్ధములలో (తీర్థేషు), ఎవరెవరు మాంస భోజనం చేయవచ్చని చెప్పారో అటువంటి వారి విషయములో (ప్రతిదృష్టేషు ), వాటికోసం రాజులు మాత్రమే వేటాడాలి. తినదగిన వాటినే వేటాడాలి. శ్రాద్ధార్థములనే వేటాడాలి. ఊరి పొలిమేరలో వేటాడకూడదు. అడవిలోనే వేటాడాలి. పవిత్రమైనదాన్ని తినదగినదాన్నీ, శ్రాద్ధ విషయములలోనే రాజు మాత్రమే ఎంత కావాలో అంత మాత్రమే వేటాడాలి. (ఇక్ష్వాకు వంశస్థుడైన వికుక్షి పదమూడు కుందేళ్ళను వేటాడి దారిలో ఒక దాన్ని తినేసాడు. ) వేటాడిన దాన్ని ఆశ ఉండి అనుభవించకూడదు. 
పురంజనుడు వేటాడుతున్నాడు గానీ ఈ నియమాలని విడిచిపెట్టాడు
జీవుడు కూడా ఈ సంసారములోకి వచ్చి ఉన్న ఇంద్రియాలతో విషయాలని అనుభవించాలి. అనుభవించాలి అన్న కోరిక తప్పు కాదు. ఆశ తప్పు. (ఉదా: పదిహేను ముద్దలు మాత్రమే భోజనం చేయాలి. అది శరీరం నిలుపుకోవడానికి అవసరం. తినకూడనంత తినకూడని దాన్ని తినకూడని వేళలో తినడం వలన వాయువు ప్రకోపిస్తుంది)
ఇంద్రియార్థముల యందు ప్రవృత్తి నియమితముగా ఉండాలి. కావలసినన్ని మాత్రమే వేటగాడు (లుబ్ధో ) సంహరించాలి. మనం కూడా ఎంత అనుభవించడానికి యోగ్యమో అంత అనుభవించాలి, అంతే సంపాదించాలి. తనకు కావలసినదాని కంటే ఎక్కువ సంపాదించి దాచిపెట్టిన వాడు దొంగ. వేటగాడు కూడా ఎక్కువ మృగాలు వేటాడితే శిక్షార్హుడు. 

య ఏవం కర్మ నియతం విద్వాన్కుర్వీత మానవః
కర్మణా తేన రాజేన్ద్ర జ్ఞానేన న స లిప్యతే

తెలిసిన వాడు విధించిన పనిని నియమబద్ధముగా ఆచరించాలి. శాస్త్ర విహితమైన కర్మను శాస్త్ర విహితమైన పద్దతిలో ఆచరించినప్పుడు, అలా ఆచరించినందువలన కలిగే ఫలితం వాడికి అంటదు. జ్ఞ్యాని అయిన వాడికి కర్మల ఫలముతో కలిగిన సంబంధముండదు. 

అన్యథా కర్మ కుర్వాణో మానారూఢో నిబధ్యతే
గుణప్రవాహపతితో నష్టప్రజ్ఞో వ్రజత్యధః

శాస్త్రాన్ని విధిని విడిచిపెట్టి అహంకార మమకారాలు వంటబట్టి యధేచ్చగా వ్యవహరిస్తే సంసారములో బంధించబడతాడు. అలాంటి వాడు సత్వ రజో తమో గుణాలలో, ఆ ప్రవాహాలలో (సంసారములో) పడి బుద్ధి కాస్తా నశించి నరకలోకములో పడతాడు.

తత్ర నిర్భిన్నగాత్రాణాం చిత్రవాజైః శిలీముఖైః
విప్లవోऽభూద్దుఃఖితానాం దుఃసహః కరుణాత్మనామ్

ఇలా అడవిలో ఈ మహారాజు వేటాడుతూ ఉన్నాడు. బాణముల దెబ్బకు మృగముల చర్మములు లేచి ప్రాణములు పోతున్నాయి. విచిత్రమైన కొనలు గల బాణములతో ఏడ్చేవారి మానసిక క్షోభతో దయగలవారికి ఇలాంటి దృశ్యము సహించలేరు. మృగాలను వధించుటా అంటే విషయములను ఇంద్రియములతో అనుభవించుట. నియమం ప్రకారం అనుభవించుట ఆమోదయోగ్యమే. 
అలా బాణాలతో కొడుతూ ఉంటే కరుణార్థ హృదయులైన చుట్టుపక్కల ఉన్న మునుల మనసు క్షోభించింది. అజ్ఞ్యానులు విషవ్యామోహపరాయణులైతే అది చూసిన జ్ఞ్యానులు తమలో తాము బాధ పడి వారి మీద జాలి పడతారు

శశాన్వరాహాన్మహిషాన్గవయాన్రురుశల్యకాన్
మేధ్యానన్యాంశ్చ వివిధాన్వినిఘ్నన్శ్రమమధ్యగాత్

కుందేళ్ళూ వరాహములూ మొదలైన రక రకాల మృగాలను సంహరిస్తూ అలసిపోయి, 

తతః క్షుత్తృట్పరిశ్రాన్తో నివృత్తో గృహమేయివాన్
కృతస్నానోచితాహారః సంవివేశ గతక్లమః

ఆకలీ దప్పీ అవ్వగానే ఇళ్ళు గుర్తు వచ్చింది. కలలో కూడా అనుకున్న దాన్ని అనుభవించిన తరువాత మెలుకువ వస్తుంది. కథా పరముగా ఇంటికి వచ్చాడు. బుద్ధి లేకుండా పని చేసుకున్నా అని ఆత్మ విమర్శ చేసుకోవడం ఇంటికి రావడం, ఆకలీ దప్పులు వేయడం. స్నానం చేసి ఆహారం చేసి అలసట తీరిన తరువాత

ఆత్మానమర్హయాం చక్రే ధూపాలేపస్రగాదిభిః
సాధ్వలఙ్కృతసర్వాఙ్గో మహిష్యామాదధే మనః

శరీరానికి అగరు గంధమూ మొదలైన సుగంధ ద్రవ్యాలు అలంకరించుకుని, మనసు భార్య యందు లగ్నం చేసాడు (బుద్ధి కావాలీ అని కోరుకున్నాడు)

తృప్తో హృష్టః సుదృప్తశ్చ కన్దర్పాకృష్టమానసః
న వ్యచష్ట వరారోహాం గృహిణీం గృహమేధినీమ్

ఆకలీ దప్పీ అలసట మూడూ పోయాయి. తృప్తి కలిగిన వెటనే దృప్తి వచ్చింది ( మదం). మదావిష్ఠమనస్కుడై కామోద్దీపనం కలిగి ప్రియురాలు ఉన్న అంతఃపురానికి వెళ్ళాడు. బుద్ధి లేకుండా చాలా పనులు చేసానని తెలుసుకుని బుద్ధినీ వివేకాన్నీ పొందడానికి ప్రయత్నం చేసాడు. బుద్ధిని దొరికించుకోవాలంటే దానికంటే ముందు ఉన్న ప్రవృత్తులని మంచి చేసుకోవాలి (చిత్తం అంతఃకరణం)

అన్తఃపురస్త్రియోऽపృచ్ఛద్విమనా ఇవ వేదిషత్
అపి వః కుశలం రామాః సేశ్వరీణాం యథా పురా

చిన్న బోయిన మనసు కలవాడై అంతఃపుర స్త్రీలను అడిగాడు. మీరంతా బాగున్నారా? మీ యజమానురాలు బాగున్నదా?

న తథైతర్హి రోచన్తే గృహేషు గృహసమ్పదః
యది న స్యాద్గృహే మాతా పత్నీ వా పతిదేవతా
వ్యఙ్గే రథ ఇవ ప్రాజ్ఞః కో నామాసీత దీనవత్

మీరు బాగుండాలన్నా మేము బాగుండాలన్నా ఇల్లు బాగుండాలన్నా గృహిణి బాగుండాలి. లేకుంటే ఇవన్నీ ఉన్నా లేనట్లే లెక్క. తల్లిగానీ భార్యగానీ లేని ఇళ్ళు చక్రములు లేని రథములా ఉంటుంది. 

క్వ వర్తతే సా లలనా మజ్జన్తం వ్యసనార్ణవే
యా మాముద్ధరతే ప్రజ్ఞాం దీపయన్తీ పదే పదే

ఇంతకూ నా ప్రియురాలు ఎక్కడ ఉంది. నేను కష్టములో ఉన్నాను. బాధిస్తున్న నన్ను నా బాధ నుండి ప్రతీ క్షణం తొలగించే ఆమె ఎక్కడుంది 

రామా ఊచుః
నరనాథ న జానీమస్త్వత్ప్రియా యద్వ్యవస్యతి
భూతలే నిరవస్తారే శయానాం పశ్య శత్రుహన్

నీ ప్రియురాలు ఎక్కడుందో తెలుసు కానీ ఏమి చేయాలనుకుంటోందో తెలియదు. ఆమె ఇప్పుడు కటిక నేల మీద పడుకుని ఉంది (నిరవస్తారే ). ఏమాత్రం ఆస్తవం లేని భూమి మీద పడుకుని ఉన్నది. 

నారద ఉవాచ
పురఞ్జనః స్వమహిషీం నిరీక్ష్యావధుతాం భువి
తత్సఙ్గోన్మథితజ్ఞానో వైక్లవ్యం పరమం యయౌ

ఒక సారి బుద్ధిని విడిచిపెడితే మళ్ళీ సంపాదించడానికి చాలా కష్టపడాలి. మన బుద్ధి కూడా మనం అది చెప్పినట్లు వింటే అది మన దగ్గరకు వస్తుంది. చీతమూ మనసునే లెక్కిస్తే  బుద్ధి దూరముగా పోతుంది. తన ప్రియురాలైనా తాను  కోరినప్పుడు దగ్గరకు రాలేదు. అతని మనసు కలతచెంది

సాన్త్వయన్శ్లక్ష్ణయా వాచా హృదయేన విదూయతా
ప్రేయస్యాః స్నేహసంరమ్భ లిఙ్గమాత్మని నాభ్యగాత్

ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు. నిరంతరం ప్రేమించే ప్రియురాలు కోపించడానికి గల కారణమేమిటని ఓదార్చడములో నేర్పరి తనమున్న వాడైన ప్రియుడు ఓదార్చాడు. 

అనునిన్యేऽథ శనకైర్వీరోऽనునయకోవిదః
పస్పర్శ పాదయుగలమాహ చోత్సఙ్గలాలితామ్

ఆమె రెండు కాళ్ళూ పట్టుకున్నాడు. ఆమెను ఒడిలోకి తీసుకున్నాడు. 

పురఞ్జన ఉవాచ
నూనం త్వకృతపుణ్యాస్తే భృత్యా యేష్వీశ్వరాః శుభే
కృతాగఃస్వాత్మసాత్కృత్వా శిక్షాదణ్డం న యుఞ్జతే

నిజముగా నీవు యజమానురాలివీ నేను భృత్యున్నీ ఐతే, నేను తప్పు చేసినట్లైతే నీవు అలా భావిస్తే నీవు నన్ను దండించాలి. లేకుంటే ప్రజల చేత దండించబడని వారు నరకానికి పోతారు. ఎవరికైతే దండము విధించరో వారు అదృష్టవంతులు కారు

పరమోऽనుగ్రహో దణ్డో భృత్యేషు ప్రభుణార్పితః
బాలో న వేద తత్తన్వి బన్ధుకృత్యమమర్షణః

యజమాని సేవకున్ని దండించడమంటే దయ చూపడమే (బందుకృత్యం). జ్ఞ్యానము లేని వారికి ఆ విషయం తెలియదు. 

సా త్వం ముఖం సుదతి సుభ్ర్వనురాగభార వ్రీడావిలమ్బవిలసద్ధసితావలోకమ్
నీలాలకాలిభిరుపస్కృతమున్నసం నః స్వానాం ప్రదర్శయ మనస్విని వల్గువాక్యమ్

నేలమీద ముసుగు వేసి పడుకున్న నీవు నాకు మధురముగా మాట్లాడే మంచి వాక్యములతో నీ ముఖమైనా చూపించు. 

తస్మిన్దధే దమమహం తవ వీరపత్ని యోऽన్యత్ర భూసురకులాత్కృతకిల్బిషస్తమ్
పశ్యే న వీతభయమున్ముదితం త్రిలోక్యామన్యత్ర వై మురరిపోరితరత్ర దాసాత్

నీవిలా కోపించి ఉన్నావంటే తప్పకుండా ఎవరో తప్పు చేసే ఉంటారు. ఒక చిన్న మినహాయింపు. బ్రాహ్మణోత్తములూ భగవంతుని భక్తులూ తప్ప ఇంకెవరినైన శిక్షిస్తాను. ప్రపంచమంతా భయపడేదీ భగవంతుని భక్తులకు. వారు శాపమిచ్చినా వరమిచ్చినా తిరుగులేదు. 

వక్త్రం న తే వితిలకం మలినం విహర్షం సంరమ్భభీమమవిమృష్టమపేతరాగమ్
పశ్యే స్తనావపి శుచోపహతౌ సుజాతౌ బిమ్బాధరం విగతకుఙ్కుమపఙ్కరాగమ్

బాగా ఏడ్వడం వలన ముఖము మీద బొట్టు లేదు. ముఖానికి అందం కలిగించేది తిలకం. నీ ముఖము మురికి అంటి కోపముతో భయంకరముగా ఉంది. 

తన్మే ప్రసీద సుహృదః కృతకిల్బిషస్య స్వైరం గతస్య మృగయాం వ్యసనాతురస్య
కా దేవరం వశగతం కుసుమాస్త్రవేగ విస్రస్తపౌంస్నముశతీ న భజేత కృత్యే

నీవు ప్రసన్నురాలవు కావాలి. వ్యసనముతో బాధపడుతూ నిన్ను విడిచి వేటకు వెళ్ళాను. అంత మాత్రముతో వ్యసన బానిసనైన వాడిని లోకములో ఏ ప్రియురాలైనా ఉపేక్షిస్తుందా. అలా నీవు విడిచిపెడితే ఆ వ్యసనం నుంచి విముక్తుడవుతాడా?