Pages

Wednesday, 19 March 2014

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పదమూడవ అధ్యాయం


బ్రాహ్మణ ఉవాచ
దురత్యయేऽధ్వన్యజయా నివేశితో రజస్తమఃసత్త్వవిభక్తకర్మదృక్
స ఏష సార్థోऽర్థపరః పరిభ్రమన్భవాటవీం యాతి న శర్మ విన్దతి

పరమాత్మ యొక్క మాయ చేత నీవు దారిలో (సంసారములో) పడవేయబడతావు. గుణత్రయముల కర్మలను చేస్తాము.  మనము పని చేయడం ప్రారంభించగానే "ఈ పని ఎలాంటిది" రాజసికమా తామసికమా సాత్వికమా అని ఆలోచిస్తాముగానీ, "ఇది నిర్గుణమా" అని ఆలోచించము. నిర్గుణున్ని ఆరాధిస్తే పని నిర్గుణమవుతుంది. సగుణమైన ప్రకృతిని ఆరాధిస్తే పని కూడా త్రైగుణ్యమవుతుంది. సంసారములో పని చేస్తున్నమనగానే సాత్విక రాజసిక తామసిక కర్మలుగానే చూస్తాము.
వ్యాపారానికి వెళ్ళేవాడు మూటపెట్టుకుని అంగడిలోకి ఎలా వస్తాడో మనం కూడా పూర్వ జన్మ కర్మలనే మూటలను పట్టుకుని వస్తాము. అందుకే ఆ జీవుడు సార్థః. నెత్తిన బరువు ఉండి కూడా ఇంకా బరువు కావాలంటాడు.  ఉన్నదాన్ని పోగొడదామని చేసే పనుల వలన కొత్తవి పుడుతున్నాయి. ప్రయోజనాన్ని ఆశించి ఈ దారిలో తిరుగుతూ సంసారమనే అరణ్యానికి ప్రవేశిస్తాడు. ఒక ఊరికి వెళ్ళడానికి పోయి అడవిలో ప్రవేశిస్తాడు. ఆ అడవిలో సుఖమనే మాటే ఉండదు.

యస్యామిమే షణ్నరదేవ దస్యవః సార్థం విలుమ్పన్తి కునాయకం బలాత్
గోమాయవో యత్ర హరన్తి సార్థికం ప్రమత్తమావిశ్య యథోరణం వృకాః

అడవిలోకి వెళ్ళగానే ఒక్క సారిగా ఆరు దిక్కుల నుంచి  ఆరు దొంగలు ప్రవేశిస్తారు. వారు పట్టి లాగుతారు. వారు మీ దగ్గర ఉన్న డబ్బంతా దోచుకుంటారు. నీ బుద్ధిని గుంజుకుంటారు. ఇంద్రియములు బుద్ధిని తన వశం చేసుకుంటాయి. దాని వలన మనం చేసే పనులన్నీ బుద్ధి లేని పనులవుతాయి. నక్కలన్నీ (తోడేళ్ళు) కలిసి మేకలని లాగినట్లుగా మన శరీరాన్ని మనసునీ బుద్ధినీ అంతఃకరణాలనూ ఆరు ఇంద్రియాలూ మనసూ తీసుకుని పోతాయి.

ప్రభూతవీరుత్తృణగుల్మగహ్వరే కఠోరదంశైర్మశకైరుపద్రుతః
క్వచిత్తు గన్ధర్వపురం ప్రపశ్యతి క్వచిత్క్వచిచ్చాశురయోల్ముకగ్రహమ్

అది చూసి మనం వేగముగా పరిగెత్తబోతాము. అప్పుడు ఒక పొదలో పడతాము. పొదలో పడగానే కందిరీగలూ దోమలూ పురుగులూ తేల్ల్లు ఉంటాయి. అవి అన్నీ ఒక్క సారి పడి కరుస్తాయి. బ్రహ్మచారిగా ఉండి పెళ్ళి చేసుకోగానే అరిషడ్వర్గాలు ఉన్న పొదలో పడతాము, అందులో దుర్మార్గులూ దుష్టులూ ఎందరో ఉంటారు. ఇలా బాధపడుతూ కూడా "ఇలా ఎంతకాలం ఉంటుందిలే నేను తప్పించుకుని బయటపడతాను" అని గంధర్వ నగరాన్ని చూస్తూ ఉంటాడు. కొరివి దెయ్యాలు పట్టుకుంటాయి (ఉల్ముకగ్రహమ్) - భార్యకు భర్తా భర్తకు భార్యా కొరివి దెయ్యాల వంటి వారు

నివాసతోయద్రవిణాత్మబుద్ధిస్తతస్తతో ధావతి భో అటవ్యామ్
క్వచిచ్చ వాత్యోత్థితపాంసుధూమ్రా దిశో న జానాతి రజస్వలాక్షః

ఈ అడవిలో "ఎలాగా అడవిలోకి వచ్చాము కదా" అని ఇంటినీ డబ్బునీ ఏర్పరచుకుని ఉంటాడు. ఇలా పరిగెత్తుతూ ఉంటే పెద్ద సుడిగాలి (దుర్జనులూ శత్రువులూ ద్రోహులూ ఆపదలూ) వచ్చి కన్నులో కొడతాయి. అప్పుడు ఏమీ కనపడకుండా ఉంటుంది. కీచురాళ్ళ ధ్వని వలన చెవులు కూడా వినపడవు. ఇంకో పక్క నక్కలు కూస్తూ ఉంటాయి, కళ్ళు కనపడవు చెవులు వినపడవు.

అదృశ్యఝిల్లీస్వనకర్ణశూల ఉలూకవాగ్భిర్వ్యథితాన్తరాత్మా
అపుణ్యవృక్షాన్శ్రయతే క్షుధార్దితో మరీచితోయాన్యభిధావతి క్వచిత్

అలా వెళ్ళి వెళ్ళి పాప వృక్షాలను ఆశ్రయిస్తాడు. దప్పి కాగానే ఎండమావుల నీటికోసం చూస్తాడు.

క్వచిద్వితోయాః సరితోऽభియాతి పరస్పరం చాలషతే నిరన్ధః
ఆసాద్య దావం క్వచిదగ్నితప్తో నిర్విద్యతే క్వ చ యక్షైర్హృతాసుః

ప్రియురాళ్ళ ముద్దు మాటలలో పడతాడు. తరువాత చిన్న పిల్లల ముద్దుమాటలలో పడతాడు.

శూరైర్హృతస్వః క్వ చ నిర్విణ్ణచేతాః శోచన్విముహ్యన్నుపయాతి కశ్మలమ్
క్వచిచ్చ గన్ధర్వపురం ప్రవిష్టః ప్రమోదతే నిర్వృతవన్ముహూర్తమ్

చలన్క్వచిత్కణ్టకశర్కరాఙ్ఘ్రిర్నగారురుక్షుర్విమనా ఇవాస్తే
పదే పదేऽభ్యన్తరవహ్నినార్దితః కౌటుమ్బికః క్రుధ్యతి వై జనాయ

క్వచిన్నిగీర్ణోऽజగరాహినా జనో నావైతి కిఞ్చిద్విపినేऽపవిద్ధః
దష్టః స్మ శేతే క్వ చ దన్దశూకైరన్ధోऽన్ధకూపే పతితస్తమిస్రే


మనలోపల ఉన్న అసలు వస్తువులని ఇంద్రియాలు దోచుకున్నాయి. నేను ఆలోచిస్తున్నాను అనమని నేను చూస్తున్నాను అని అనమని చెబుతున్నాయి. మేకని తోడేళ్ళు ఎత్తుకుపోయినట్లు నీ స్వరూప జ్ఞ్యానన్ని లోనున్న ఇంద్రియాలు దోచుకుంటున్నాయి. ఇక్కడ పెద్ద లతలూ చెట్లూ గడ్డీ బలిసిపోయి ఉన్నాయి, పెద్ద దోమలూ ఈగలూ ఉన్నాయి. గంధర్వ పురమని ఒకటి కనిపిస్తోంది, గంధర్వపురమంటే ఇపుడు ఉండి మరొక క్షణములో ఉండని ఇంద్రజాలం వంటిది. ఇవాల మంచి సుఖమనుభవించాము. రాత్రి సుస్తీ చేసింది. అంటే ఒక కాలములో ఉన్నది ఇంకో కాలములో ఉండదు. కొరివి దయ్యాలలాంటివి. నిజము కావు. మన జీవితములో కళ్ళు కనపడకుండా ఇసక చల్లే గాలి వచ్చి కొడుతుంది, ఇందాకటిది కళ్ళ దోషమైతే, ఈ దోషం ముక్కుది. కళ్ళు కనపడకుండా చేస్తుంది. ఇంతలో పెద్ద గోలబయలు దేరుతుంది చెవికి. కీచురాళ్ళ ధ్వని. కంటికి కనపడవు కానీ ధ్వని వస్తుంది. తరువాత ఆకలేసింది, గానీ అక్కడ అన్నీ విషపు చెట్లు ఉన్నాయి. తప్పని సరి పరిస్థుతుల్లో అవే తినాల్సి వచ్చింది. ఒక చోట నీరు కనిపించింది. అవి నిజమైన నీరు కావు. నీళ్ళల్లా కనిపిస్తోంది వెన్నెల్లో. దానికోసం పరిగెడుతున్నాము. ఒక సారి కార్చిచ్చు వస్తుంది. ఇవన్నీ మనం అనుభవించేవి. ఇంద్రియములచే మనమనుభవించే సుఖమనుకుని అనుభవించే సుఖము కానివి. అడవిలో కనపడేవి ఎలాంటి సుఖాలో ఇవీ అలాంటి సుఖాలే. ఇంతలో దొంగలొచ్చి అంతా దోచుకుని వెళ్ళిపోయారు. ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఇంతలో ఎవరో వచ్చి మాయతో విచిత్రమైన పదార్థాలన్నీ ముందు పెట్టాడు. కానీ అది మాయ. పదే పదే ఆకలి వేస్తుంది. ఆకలి ఎక్కువగా వేస్తే పెళ్ళాం మీదా పిల్లల మీదా కోపం వస్తుంది.
కర్హి స్మ చిత్క్షుద్రరసాన్విచిన్వంస్తన్మక్షికాభిర్వ్యథితో విమానః
తత్రాతికృచ్ఛ్రాత్ప్రతిలబ్ధమానో బలాద్విలుమ్పన్త్యథ తం తతోऽన్యే

క్వచిచ్చ శీతాతపవాతవర్ష ప్రతిక్రియాం కర్తుమనీశ ఆస్తే
క్వచిన్మిథో విపణన్యచ్చ కిఞ్చిద్విద్వేషమృచ్ఛత్యుత విత్తశాఠ్యాత్

క్వచిత్క్వచిత్క్షీణధనస్తు తస్మిన్శయ్యాసనస్థానవిహారహీనః
యాచన్పరాదప్రతిలబ్ధకామః పారక్యదృష్టిర్లభతేऽవమానమ్

అన్యోన్యవిత్తవ్యతిషఙ్గవృద్ధ వైరానుబన్ధో వివహన్మిథశ్చ
అధ్వన్యముష్మిన్నురుకృచ్ఛ్రవిత్త బాధోపసర్గైర్విహరన్విపన్నః

తాంస్తాన్విపన్నాన్స హి తత్ర తత్ర విహాయ జాతం పరిగృహ్య సార్థః
ఆవర్తతేऽద్యాపి న కశ్చిదత్ర వీరాధ్వనః పారముపైతి యోగమ్

మనస్వినో నిర్జితదిగ్గజేన్ద్రా మమేతి సర్వే భువి బద్ధవైరాః
మృధే శయీరన్న తు తద్వ్రజన్తి యన్న్యస్తదణ్డో గతవైరోऽభియాతి

ఈ ఆకలి ఎందుకు పుడుతోంది అన్న ఆలోచన ఉండదు. ఇలా అడవిలో వెళుతూ ఉంటే కొండచిలువను చూచుకోకుండా దాని నోటిలో ప్రవేశిస్తాడు, ఒక చోట పాములు ఒక చోట గోతులు. జీవితమంతా ఒక అడవి. దీనికి భవాటవి అన్న పేరు. భవ అంటే సంసారం. సంసారమంటే అడవి. ఇందులో సుఖమనుకున్నవి అడవిలో అనుభవించేవీ ఒకటే. ఒకప్పుడు బాధలన్నీ పోయి తన వారు కనపడి వస్తున్నాడు. అంటే జ్ఞ్యానం కలిగి భగవానుడు తెలుస్తాడు ఒకసారి. అయినా పూర్తిగా భగవానుని మీద ధ్యాస నిలపడు. రహూగణా నీవు కూడా ఇదే స్థితిలో ఉన్నావు. నేను శాసకున్నీ నేను శిస్ఖిస్తున్నాను అనుకోకు. దేని యందూ నాది అన్న బుద్ధిని పెంచుకోక భగవానుని సేవచేయి.

ప్రసజ్జతి క్వాపి లతాభుజాశ్రయస్తదాశ్రయావ్యక్తపదద్విజస్పృహః
క్వచిత్కదాచిద్ధరిచక్రతస్త్రసన్సఖ్యం విధత్తే బకకఙ్కగృధ్రైః

ఇలాంటివాటితో వెళుతూ వెళుతూ ఉంటే పెద్ద పెద్ద సింహాలు వస్తాయి. వివాహం అయి నాలుగు ముద్దుమాటలలో పిల్లలు పుట్టి వారు పెరుగ్తూ ఉంటే వచ్చే సమస్యలే సింహాలు. కొంగలూ గద్దలూ రాబంధువులు అయిన బంధువులతో స్నేహం చేస్తారు. కొందరు కళ్ళు మూసుకుని జపం చేస్తున్నట్లు నడిచేవారు, కొందరు కళ్ళు పొడిచేవారు, కొందరు తెలియకుండా మోసం చేస్తారు కొందరు తెలిసి మోసం చేస్తారు. అలాంటి వాళ్ళను నమ్ముతావు. నీకు వాస్తవముగా తత్వం బోధించే సజ్జనుల వాక్యాన్ని నీవు వినవు.

తైర్వఞ్చితో హంసకులం సమావిశన్నరోచయన్శీలముపైతి వానరాన్
తజ్జాతిరాసేన సునిర్వృతేన్ద్రియః పరస్పరోద్వీక్షణవిస్మృతావధిః

వారు మోసం చేసాక కూడా మంచి వారిని ఆశ్రయించడు. కోతి స్వహావమైన చపల చిత్తముతో ఉంటాడు. జారి పడుతూ కూడా అదే చెట్టు ఎక్కాలనుకుంటోన్న కోతిలాగ. జూదం ఆడే వాడు ఒక సారి ఓడితే మరలి వెళ్ళక గెలిచే దాకా ఆడగోరుతాడు. సంసారము కూడా అంతే. ద్వేషమూ వైరమూ కక్షా పగా ఎంతటి అనర్థాన్నైనా తెస్తాయి. అలాంటి వారితో తిరిగి అలాంటి వారితో మోసగించబడి, వారితో కలిసి ఉంటేనే బ్రతకగలం అని అలాంటి జాతితో కలిగే వాటితోనే తృప్తి పొందుతాడు. అబ్బాయికి అమ్మాయి జాతి, ఆడవారికి అమ్మాయి పరస్పరం ఒకరి ముఖం ఒకరు చూస్తూ కూర్చుంటాడు (పరస్పరోద్వీక్షణ), ఎంత సేపు చూసారో కూడా కాలం మరచిపోతారు (విస్మృతావధిః)

ద్రుమేషు రంస్యన్సుతదారవత్సలో వ్యవాయదీనో వివశః స్వబన్ధనే
క్వచిత్ప్రమాదాద్గిరికన్దరే పతన్వల్లీం గృహీత్వా గజభీత ఆస్థితః

ద్రుమేషు - చేట్ల కింద కూర్చుని ఉంటారు అమ్మాయిలూ అబ్బాయిలూ. అలా వినోదించడం వలన పిల్లల మీద ప్రేమ, భార్యల మీద ప్రేమ కలవారి కేవలం సమాగమం తప్ప సాధించవలసిన పని లేదని అందులో మునిగి పోయి తనను తానే కట్టేసుకుంటాడు. తనకు కట్టేసే తాళ్ళు తానే తెచ్చుకుంటాడు. అడవిలో వెళుతుండగా ఏనుగు కనపడితే కొండ ఎక్కాడు, అక్కడ పెద్ద పులి కనపడింది, దన్ని తప్పించుకోవడానికి ఒక తీగను పట్టుకుంటే ఆ తీగ తెగి పాములు కుడతాయి.

అతః కథఞ్చిత్స విముక్త ఆపదః పునశ్చ సార్థం ప్రవిశత్యరిన్దమ
అధ్వన్యముష్మిన్నజయా నివేశితో భ్రమఞ్జనోऽద్యాపి న వేద కశ్చన

ఇన్ని కష్టాలు పడి కూడా భగవంతుని అనుగ్రహం వలన ఒక సారి ఆపదలు పోతే , ఈ సారైనా వాటి వైపు వెళ్ళకుండా జాగ్రత్త తీసుకోడు. అతి కష్టము మీద ఆపద పోగొట్టుకొని కూడా పునః దానిలో ప్రవేశిస్తాడు. ఇదంతా భగవంతుని మాయ. ఆ మాయతో అడవిలో (సంసారము) పడి ఇన్ని వేల కోట్ల సంవత్సరాలుగా పరిభ్రమిస్తున్నాడు

రహూగణ త్వమపి హ్యధ్వనోऽస్య సన్న్యస్తదణ్డః కృతభూతమైత్రః
అసజ్జితాత్మా హరిసేవయా శితం జ్ఞానాసిమాదాయ తరాతిపారమ్

రహూగణా నీవు కూడా ఇన్నాళ్ళూ ఇలాంటి అడవిలోనే ఉన్నావు. "నేను రాజును. వాడు తప్పు చేసాడ్,  నేను శిక్షిస్తాను" అన్న భావం వదిలిపెట్టు. హింస మాను. తోటి ప్రాణులతో మైత్రి చెయ్యి. హరి సేవతో సంసారము యందు మనసు లగ్నం చేయకుండా జ్ఞ్యానమనే ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని అడ్డం వచ్చిన తీగలను నరుక్కుంటూ సంసారం యొక్క (అడవి యొక్క) ఆవలి తీరం చేరు.

రాజోవాచ
అహో నృజన్మాఖిలజన్మశోభనం కిం జన్మభిస్త్వపరైరప్యముష్మిన్
న యద్ధృషీకేశయశఃకృతాత్మనాం మహాత్మనాం వః ప్రచురః సమాగమః

అన్ని రకాల జన్మల కంటే మానవ జన్మే ఉత్తమం. కానీసం మనకేదీ తెలియదన్న సంగతి తెలుస్తుంది. ఈ సంసార అరణ్యములో మానవేతర జన్మల వలన ఏమి లాభం. పరమాత్మ యొక్క కీర్తి యందు మనసు పెట్టిన మాహత్ములతో సమావేశం కేవలం మానవ జన్మలోనే ఉంది.

న హ్యద్భుతం త్వచ్చరణాబ్జరేణుభిర్హతాంహసో భక్తిరధోక్షజేऽమలా
మౌహూర్తికాద్యస్య సమాగమాచ్చ మే దుస్తర్కమూలోऽపహతోऽవివేకః

గురువర్యా! నీ పాద పద్మ పరాగ తాకిడితో అన్ని పాపములూ పోయి పరమాత్మ యందు భక్తి కలుగుట వింతేమీ కాదు. మనం పుణ్యం సంపాదించుకుని దానితోనే పరమాత్మను పొందాలనుకోవడం కాని పను. గురువు గారి పాదాలను ఆశ్రయించడం మాత్రమే మార్గం. ఒక్క క్షణ కాలం మీతో మాట్లాడితే ఇంతవరకూ నాలో ఉన్నటువంటి అన్ని కుతర్కాలూ పోయాయి. కుతర్కం వలన ఉన్న అవివేకం నశించిపోయింది.

నమో మహద్భ్యోऽస్తు నమః శిశుభ్యో నమో యువభ్యో నమ ఆవటుభ్యః
యే బ్రాహ్మణా గామవధూతలిఙ్గాశ్చరన్తి తేభ్యః శివమస్తు రాజ్ఞామ్

ఇది వేద మంత్రం. మహానుభావులకూ శిశువులకూ వటువులకూ అందరికీ నమస్కారం. బ్రహ్మజ్ఞ్యానం కలవారికి నమస్కారం చేయడానికి వయసుతో నిమిత్తం లేదు. ప్రహ్లాదుడూ ద్రువుడు వంటి వారు చిన్న పిల్లలుగానే జ్ఞ్యానం పొందారు. కొందరు మహనుభావులు అవధూత వేషములో జడ అంధ బదిర మూక రూపాలలో బ్రాహ్మణుడిగా గుర్తుపట్ట వీలులేని రూపములో సంచరించేవారికి నా నమస్కారములు. రాజులకు మేలగు గాక. అడవిలోకి వెళ్ళిన రాజులకు తెలియకుండా సంచరించే బ్రహ్మజ్ఞ్యానుల వలన మంగళం కలగాలి. 
మహాత్ములైన మీ వంటి వారిని కలవడానికి ఉపయోగపడే శరీరం ఉంటే ఆ శరీరం వచ్చిన మానవజన్మ ధన్యం. ఒక క్షణ కాలం మీ పరిచయముతో అనాధిగా నాలో ఉన్న దుస్తర్కం వలన నశించిన వివేకం ఉదయించింది. 
గొప్పవారికీ శిశువులకీ యువకులకీ బ్రహ్మచారులకీ బ్రాహ్మణులకీ అవధూతలకీ నమస్కారం. అందరికీ క్షేమం కలిగించే స్థితి వచ్చింది. అందరిలో ఉన్న భగవానునికి నమస్కారం చేస్తున్నాడు. 

శ్రీశుక ఉవాచ
ఇత్యేవముత్తరామాతః స వై బ్రహ్మర్షిసుతః సిన్ధుపతయ ఆత్మసతత్త్వం విగణయతః
పరానుభావః పరమకారుణికతయోపదిశ్య రహూగణేన సకరుణమభివన్దితచరణ ఆపూర్ణార్ణవ ఇవ
నిభృతకరణోర్మ్యాశయో ధరణిమిమాం విచచార

ఈ ప్రక్రారముగా భరతుడు రహూగణుడికి ఆత్మ తత్వాన్ని కరుణ మనస్కుడై బోధిస్తే ఇంత జ్ఞ్యానం పొందిన రాజు పరిపూర్ణ భక్తితో రాజుకు నమస్కరించి పూర్తిగా నిండిన సముద్రములా అవయములూ మనస్సు బుద్ధీ చిత్తమూ అంతఃకరణం ఆరు ఊర్ములతో భూమండలం మొత్తం భరతుడు సంచరించాడు.

సౌవీరపతిరపి సుజనసమవగతపరమాత్మసతత్త్వ ఆత్మన్యవిద్యాధ్యారోపితాం చ దేహాత్మ
మతిం విససర్జ ఏవం హి నృప భగవదాశ్రితాశ్రితానుభావః

మహానుభావుల కలయికతో తెలియబడిన పరమాత్మ తత్వం కలవాడై, అజ్ఞ్యానం వలన కలిగిన "దేహమే ఆత్మ" అన్న భావాన్ని రాజు భరతుని ఉపదేశం వలన విడిచిపెట్టాడు.

రాజోవాచ
యో హ వా ఇహ బహువిదా మహాభాగవత త్వయాభిహితః పరోక్షేణ వచసా జీవలోకభవాధ్వా స
హ్యార్యమనీషయా కల్పితవిషయోనాఞ్జసావ్యుత్పన్నలోకసమధిగమః అథ తదేవైతద్దురవగమం
సమవేతానుకల్పేన నిర్దిశ్యతామితి

గురువుగారి భక్తులనాశ్రయించిన వారికి పొందిన వారికి ఎటువంటి స్థితి వచ్చిందో చూసావా. రహూగణుడికి భరతుని కన్నా ముందే మోక్షం వచ్చింది. అనేకమైన జ్ఞ్యానములు తెలుసుకున్న వారు కూడా నీవు పరోక్షముగా వచ్చిన మహాభాగవత ధర్మాలు బోధించావు, బుద్ధి బలం చేత ఏవో కొన్ని విషయాలను కల్పించుకుని అవ్యుత్పన్నలోకమును సులభముగా పొందలేరు.
అజ్ఞ్యాని లోకములతో మనం కలిసి ఉండము. జ్ఞ్యానులనూ పరమాత్మభక్తులనూ ఆశ్రయిస్తే అజ్ఞ్యానులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు.