Pages

Wednesday, 19 March 2014

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పన్నెండవ అధ్యాయం


పరమాత్మను చేరాలంటే సంసారం యందు విరక్తి కలగాలి. సంసారములో ఉన్న దోషాలు తెలియాలి. సంసారమనేది పెద్ద అరణ్యము. సామాన్యమానవుడు అడవిలో వెళుతూ ఉంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. 

రహూగణ ఉవాచ
నమో నమః కారణవిగ్రహాయ స్వరూపతుచ్ఛీకృతవిగ్రహాయ
నమోऽవధూత ద్విజబన్ధులిఙ్గ నిగూఢనిత్యానుభవాయ తుభ్యమ్

పరమాత్మలాగే గురువు కూడా కారణ విగ్రహుడే. మనం కర్మవిగ్రహులము. ఈ శరీరం ఎంత బాగా ఉన్నా అది పరిణామశీలనం. శరీరం మీద మమకారం పెంచుకుంటే అందులో ఉన్న ఆత్మ పరమాత్మ గురించి జ్ఞ్యానం భాసించదు. ఆత్మ స్వరూప పరిజ్ఞ్యానముతో శరీరము హేయమనే జ్ఞ్యానం కలిగినవాడవు. నీవు అవధూతవు. సకల ప్రాపంచిక విషయములను తోసివేసినవాడవు. నీవు బ్రాహ్మణుడవని చూస్తే గాన్ని గుర్తుపట్టలేము. బ్రాహ్మణ లింగాన్ని (యజ్ఞ్యోపవీతాన్ని) మరుగు పరుచుకున్నావు గానీ నీ బ్రహ్మజ్ఞ్యానాన్ని నిత్యమూ అనుభవిస్తూ ఉన్నావు. 

జ్వరామయార్తస్య యథాగదం సత్నిదాఘదగ్ధస్య యథా హిమామ్భః
కుదేహమానాహివిదష్టదృష్టేః బ్రహ్మన్వచస్తేऽమృతమౌషధం మే

రోగగ్రస్థుడికి మందులాగ, వేడితో అలమటించినవాడికి చల్లటి నీరులాగ. దేహాత్మాభిమానమనే మహా సర్పము చేత కాటువేయబడిన మాలాంటి వారికి నీ వాక్యామృత ఔషధం ఉపశమనాన్ని కలిగిస్తుంది.

తస్మాద్భవన్తం మమ సంశయార్థం ప్రక్ష్యామి పశ్చాదధునా సుబోధమ్
అధ్యాత్మయోగగ్రథితం తవోక్తమాఖ్యాహి కౌతూహలచేతసో మే

సంసారమంటే ఏమిటో జ్ఞ్యానమంటే ఏమిటో చెప్పారు. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని అడుగుతున్నాను. సందేహం తొలగించడానికి తాత్కాలికముగా సమాధానపడే సమాధానం కాకుండా ఆధ్యాత్మ యోగ గ్రంధితమైన సమాధానం చెప్పండి. నాకు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలని కుతూహలం ఉంది. 

యదాహ యోగేశ్వర దృశ్యమానం క్రియాఫలం సద్వ్యవహారమూలమ్
న హ్యఞ్జసా తత్త్వవిమర్శనాయ భవానముష్మిన్భ్రమతే మనో మే

కనపడుతున్నది నిజం కాదు, చేస్తున్నది పని కాదు, చేస్తున్న పని వలన వస్తున్న ఫలితం మనకు కాదు అని చెప్పారు. ఇదంతా వ్యవహార మూలమే తప్ప ఇంకేదీ కాదు అన్నారు. కుండలోంచి నీరు తెస్తే కుండా నీరూ అబద్దమెలా అవుతుంది. మీరు ముందు చెప్పిన తత్వ విమర్శ సులభముగా అర్థం కాదు. కంటికి కనపడే దాన్నీ శరీరముతో అనుభవించేదాన్ని భ్రమ అని ఎలా అనుకోగలము. 

బ్రాహ్మణ ఉవాచ
అయం జనో నామ చలన్పృథివ్యాం యః పార్థివః పార్థివ కస్య హేతోః
తస్యాపి చాఙ్ఘ్ర్యోరధి గుల్ఫజఙ్ఘా జానూరుమధ్యోరశిరోధరాంసాః

నీ సందేహాన్ని నీ మాటలోనే చెబుతాను. ఒక మనిషి అని నీవు ఒప్పుకుంటున్నవు కదా? ఒక మనిషి నడుస్తున్నాడు అంటున్నవు. ఇక్కడ నడిచేవాడు ఎవరు? మొత్తం శరీరం నడుస్తోందా? నడిచేది కేవలం కాళ్ళే. మరి కాళ్ళకే మనిషని పేరా? ముందు మనిషి అంటే ఎవరో తెలుసుకో. భూమి మీద నడుస్తున్నవాడు కూడా భూమే (శరీరము మట్టే కదా!).అంటే భూమి మీద భూమి నడుస్తోంది అనవచ్చా? పార్థీవ అంటే పృధ్వీ సంబంధం, పార్ధివా అంటే రాజు.  అంటే అంతా మట్టే. ఇందులో ఏ మట్టి నడుస్తోంది ఏ మట్ట్లి నిలబడి ఉన్నది. నీవు ఏ మనిషిని చెబుతున్నావో ఆ  మనిషి కూడా భూమి మీద కాళ్ళు పెట్టి నడుస్తాడు. అంటే మీద ఉన్నది నడుస్తున్నది, భూమి మీద కాళ్ళు ఉన్నాయి. అంటే పిక్కలూ మోకాళ్ళు ఊరువులూ నడుము వక్షస్థలమూ కంఠమూ తల. 

అంసేऽధి దార్వీ శిబికా చ యస్యాం సౌవీరరాజేత్యపదేశ ఆస్తే
యస్మిన్భవాన్రూఢనిజాభిమానో రాజాస్మి సిన్ధుష్వితి దుర్మదాన్ధః

పల్లకి మా మీద ఉంది, నీవు పల్లకీలో ఉన్నవు, పల్లకీలో చెట్టు ఉంది. అంటే ఎవరు ఎవరిని మోస్తున్నట్లు. భుజము మీద చెక్కతో చేయబడిన పల్లకీ ఉంది, అందులో మాంసముతో చెయబడిన శరీరం ఉంది, రెండూ పృధ్వీ స్వరూపములే. అందులో నీవు మదముతో అభిమానముతో రాజునని అంటున్నావు.

శోచ్యానిమాంస్త్వమధికష్టదీనాన్విష్ట్యా నిగృహ్ణన్నిరనుగ్రహోऽసి
జనస్య గోప్తాస్మి వికత్థమానో న శోభసే వృద్ధసభాసు ధృష్టః

బలమూ శక్తీ సామర్ధ్యం ఉండి నీవు చేతగాని వానిలా కూర్చుంటే దీనులైన వారు నిన్ను మోస్తున్నారు. దృఢముగా ఉన్న నీవు కూర్చున్నావు, బలహీనులు మోస్తున్నారు. దీనికి రాజుననే నీ అభిమానం కారణం. కష్టపడుతున్నారని ఆలోచించకుండా దయలేకుండా ప్రవర్తించావు. వాళ్ళ చేత నీవు కాపాడబడుతూ వాళ్ళని నీవు కాపాడుతున్నవని అన్నావు. నీ అభిప్రాయాన్ని పెద్దలు ఒప్పుకోరు. 

యదా క్షితావేవ చరాచరస్య విదామ నిష్ఠాం ప్రభవం చ నిత్యమ్
తన్నామతోऽన్యద్వ్యవహారమూలం నిరూప్యతాం సత్క్రియయానుమేయమ్

వ్యవహారమని అంటున్నావు గానీ ఆ పేరు దేనికి చెప్పుకోవాలి. అన్ని భూమిలో పుడుతూ భూమిలో ఉంటూ భూమిలో లీనమవుతున్నాయి.  భూమిలో పుట్టే వాటిలో ఒక దన్ని మనిషని ఒక దాన్ని పక్షి అని అంటున్నావు. వీటిలో వ్యత్యాసమేముంది. అందరిలో పరమాత్మ ఉన్నాడు, జీవాత్మలందరూ ఒకలాంటి వారే, అన్ని జీవాత్మలకున్న శరీరాలూ పార్ధివాలే. కేవలం పనిని బట్టి అంచనా వేస్తున్నావు. క్రియని బట్టి ఇది చేతనమూ జడమూ అంటున్నావు. క్రియ అందరిలో సమానముగా ఉంటే గుఱ్ఱం మీద వెళుతూ నేను వెళుతున్నాను అంటాము. 

ఏవం నిరుక్తం క్షితిశబ్దవృత్తమసన్నిధానాత్పరమాణవో యే
అవిద్యయా మనసా కల్పితాస్తే యేషాం సమూహేన కృతో విశేషః

మనమందరం పృధ్వీ అంటున్నాము. పృధ్వి అంటే కొన్ని లక్షల కోట్ల పరమాణువులు విడి విడిగా ఉన్నవి గడ్డకడితే భూమి అంటున్నాము. మళ్ళీ ఆ పరమాణువులను వేరు చేస్తే ఈ భూమి ఎక్కడ ఉంది. పృధ్విలో  వాయువూ జలమూ అగ్నీ ఆకాశమూ ఉన్నాయి, అయినా భూమి భాగం ఎక్కువ ఉండటం వలన దాన్ని భూమి అంటున్నాము. ఇలా చూస్తే ప్రతీ ప్రాణిలో భూమి ఉంటుంది. పరమాణువులు వేరుగా ఉంటే వాటిని పరమాణువులూ అంటాము, అవి కలిస్తే దాన్ని భూమి అంటున్నాము. వేరుగా ఉన్న పరమాణువులన్నీ కలిసాయి అనుకోవడం అంటే అది మాయ వలన కల్పించబడింది. 

ఏవం కృశం స్థూలమణుర్బృహద్యదసచ్చ సజ్జీవమజీవమన్యత్
ద్రవ్యస్వభావాశయకాలకర్మ నామ్నాజయావేహి కృతం ద్వితీయమ్

పంచభూతములన్నీ పరమాణువుల సమూహమే. ఇదే రీతిలో కొన్ని పరమాణువులు ఎక్కువ కలిస్తే లావు అనీ తగ్గితే సన్నవాడనీ, పొడవూ పొట్టీ అంటున్నాము. పరమాణువులో కలయికను బట్టే ఆ పేరు వస్తోంది. సకల ప్రపంచానికీ మూలం ద్రవ్యమూ స్వభావమూ ఆశయం (మనసు సంస్కారం) కాలమూ కర్మా. వీటి కలయికతోనే జలమూ వాయువూ మొదలైనవన్నీ పుడుతున్నాయి. వాస్తవముగా ఉన్నదంతా భూమే. పెరగడాన్ని బట్టి మారడాన్ని బట్టీ వేరే పేరు పెడుతున్నాము.

జ్ఞానం విశుద్ధం పరమార్థమేకమనన్తరం త్వబహిర్బ్రహ్మ సత్యమ్
ప్రత్యక్ప్రశాన్తం భగవచ్ఛబ్దసంజ్ఞం యద్వాసుదేవం కవయో వదన్తి

పరమాత్మ ఒక్కడే సత్యం, ఆయన అద్వైతుడు, ఆయన పరబ్రహ్మ. పరమాత్మ లోపలా వెలుపలా ఉంటాడు. ఆయనకు  లోపలా వెలుపలా అని ఉండదు. బ్రహ్మ సత్యం. దానికే ప్రత్యక్ అని పేరు - తనను తాను తెలుసుకునేది ప్రత్యక్, ఎదుటి వాటిని గురించి తెలిపేది పర. ఈ పరమాత్మే జీవాత్మగా, ప్రత్యగ్ గా ఉంటాడు. ఈ పరమాత్మ ఎటువంటి త్రిగుణ వికారాలు లేనివాడు. ఈయనని భగవత్ శబ్దముతో పిలుస్తారు. ఈయననే వాసుదేవుడని అంటారు. 

రహూగణైతత్తపసా న యాతి న చేజ్యయా నిర్వపణాద్గృహాద్వా
న చ్ఛన్దసా నైవ జలాగ్నిసూర్యైర్వినా మహత్పాదరజోऽభిషేకమ్

రహూగణా, ఈ జ్ఞ్యానమూ స్వరూపమూ తపస్సు వలన గానీ, (నాయమాత్మా ప్రవచనేన లబ్దః) యజ్ఞ్యము వలన గానీ, ఆరాధనలతో కానీ తర్పణాదులతో గానీ గృహస్థ ధర్మాలతో గానీ తెలియబడేది కాదు. ఇది అర్థం కావాలంటే మహాత్ముల పాదధూళి సోకాలి. పెద్దలని సేవించడం వలన తెలియాల్సిన విషయమిది. ఆడంబరాలతో ఈ జ్ఞ్యానం లభించదు. పెద్దల పాదసేవతో మాత్రమే ఇది లభిస్తుంది. 

యత్రోత్తమశ్లోకగుణానువాదః ప్రస్తూయతే గ్రామ్యకథావిఘాతః
నిషేవ్యమాణోऽనుదినం ముముక్షోర్మతిం సతీం యచ్ఛతి వాసుదేవే

మహానుభావుల పాద రజాస్సు అభిషేకం చేయించుకోవడం వలన ఎలా తెలుస్తుంది? ఎందుకంటే పరమాత్మ గుణానుసంధానం వారి దగ్గర ఉంటుంది. దాని వలన ప్రాకృత సంభాషణ ఆగిపోతుంది. మనం చెప్పిన అవాకులూ చవాకులూ ఉండవు. ఇటువంటి మహాత్ములను సేవిస్తే పరమాత్మ యందు బుద్ధి పుడుతుంది. వారిని సేవించడం వలన మన వాక్కు నియమించబడుతుంది, బుద్ధి పరమాత్మ యందు నిలుస్తుంది. దీనికి నేనే ఉదాహరణ. 

అహం పురా భరతో నామ రాజా విముక్తదృష్టశ్రుతసఙ్గబన్ధః
ఆరాధనం భగవత ఈహమానో మృగోऽభవం మృగసఙ్గాద్ధతార్థః

నేను పూర్వం భరతుడనే రాజును. భరతుడిగా ఉండి చూచినవీ విన్నవీ అనే వాటి వలన కలిగే బంధములను తొలగించుకున్నవాడిని (విముక్తదృష్టశ్రుతసఙ్గబన్ధః). దృష్ట శ్రుత బంధము భంగమయ్యింది, ఎందుకంటే దేహాత్మాభిమానం భంగమయ్యింది కాబట్టి. ప్రపంచం యందు వైరాగ్యం పొందిన నేను భగవానుని ఆరాధన చేయదలచుకుని తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక లేడి పిల్ల వలన, దాని సంగము వలన అన్నీ వదిలిపెట్టాను. 

సా మాం స్మృతిర్మృగదేహేऽపి వీర కృష్ణార్చనప్రభవా నో జహాతి
అథో అహం జనసఙ్గాదసఙ్గో విశఙ్కమానోऽవివృతశ్చరామి

దాని వలన లేడిగా పుట్టాను. అలా పుట్టినా రాజుగా ఉన్నప్పుడు భగవంతుని ఆరాధించడం వలన పూర్వ జన్మ జ్ఞ్యానం కలిగింది. అందుకే ఎవరినీ చూడవద్దూ ఎవరితో మాట్లాడవద్దు అని అనుకున్నాను లేడిపిల్లగా ఉన్నప్పుడు. ఎవరికీ కనపడకుండా తిరిగాను.

తస్మాన్నరోऽసఙ్గసుసఙ్గజాత జ్ఞానాసినేహైవ వివృక్ణమోహః
హరిం తదీహాకథనశ్రుతాభ్యాం లబ్ధస్మృతిర్యాత్యతిపారమధ్వనః

సంగము యందు సంగము వదిలిపెట్టాలి. సంగము యందు అసంగము ఉంచితే జ్ఞ్యానం కలుగుతుంది. ఈ శరీరం ఉన్నప్పుడే జ్ఞ్యానముతో సంగాన్ని ఖండించాలి. దానికొరకు పరమాత్మ యొక్క స్మరణ చేయాలి. పరమాత్మ యొక్క లీలలను వినుటా చెప్పుటా చేయాలి. ఈ రెంటితో జ్ఞ్యానం కలిగి దారికి అవతల చేరుతాము. సజ్జన సావాసం వలన జ్ఞ్యానం పొంది జ్ఞ్యానముతో మోహాన్ని తొలగించుకొని పరమాత్మ కథలను వినగలుగుతాము