Pages

Tuesday, 4 March 2014

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ప్రధమాధ్యాయం


రాజోవాచ
ప్రియవ్రతో భాగవతాత్మారామః కథం మునే
గృహేऽరమత యన్మూలః కర్మబన్ధః పరాభవః

నారదుడి వలన ఆధ్యాత్మ జ్ఞ్యానం పొంది కూడా ప్రియవ్రతుడు, భాగవతుడు పరమాత్మ యందే రమించేవాడు, సంసారములో ఎలా రమించాడు. అలాంటి మహానుభావుడు సంసారములో ఎలా రమించాడు. అన్ని కర్మబంధాలూ పరాభవాలు సంసారము వలనే వస్తాయి కదా? న్

న నూనం ముక్తసఙ్గానాం తాదృశానాం ద్విజర్షభ
గృహేష్వభినివేశోऽయం పుంసాం భవితుమర్హతి

అన్ని సంగములూ వదిలిపెట్టిన అలాంటిన్ వారికి సంసారము యందు అభిలాష ఉండదు కదా

మహతాం ఖలు విప్రర్షే ఉత్తమశ్లోకపాదయోః
ఛాయానిర్వృతచిత్తానాం న కుటుమ్బే స్పృహామతిః

పరమాత్మ యందు ఆసక్తి ఉన్న వారికి సంసారము యందు ఆసక్తి ఉండదు కదా? అంత సంసారములో ఉన్నవాడు ముక్తిని ఎలా పొందాడు. పరమాత్మయందు జారని మనసు ఎలా ఉంది.

సంశయోऽయం మహాన్బ్రహ్మన్దారాగారసుతాదిషు
సక్తస్య యత్సిద్ధిరభూత్కృష్ణే చ మతిరచ్యుతా

శ్రీశుక ఉవాచ
బాఢముక్తం భగవత ఉత్తమశ్లోకస్య శ్రీమచ్చరణారవిన్దమకరన్దరస ఆవేశితచేతసో
భాగవతపరమహంసదయితకథాం కిఞ్చిదన్తరాయవిహతాం స్వాం శివతమాం పదవీం న ప్రాయేణ హిన్వన్తి

మంచిగా చెప్పావు.  జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు గల నారాయణుని మీద మనసు ఉంచినవాడికి, పరమాత్మ యందు ప్రేమ కలిగిన వారు పరమాత్మ భక్తికి ఏ కొద్ది విఘ్నమొచ్చినా సహించరు.

యర్హి వావ హ రాజన్స రాజపుత్రః ప్రియవ్రతః పరమభాగవతో నారదస్య
చరణోపసేవయాఞ్జసావగతపరమార్థసతత్త్వో బ్రహ్మసత్రేణ దీక్షిష్యమాణోऽవనితలపరిపాలనాయామ్నాత
ప్రవరగుణగణైకాన్తభాజనతయా స్వపిత్రోపామన్త్రితో భగవతి వాసుదేవ ఏవావ్యవధానసమాధియోగేన
సమావేశితసకలకారకక్రియాకలాపో నైవాభ్యనన్దద్యద్యపి తదప్రత్యామ్నాతవ్యం తదధికరణ
ఆత్మనోऽన్యస్మాదసతోऽపి పరాభవమన్వీక్షమాణః

ఆ రాజపుత్రుడైన ప్రియవ్రతుడు పరమభాగవతుడు. నారదుని పాద సేవతో సులభముగా పరమాత్మ జ్ఞ్యానం తెలుసుకున్నవాడై, పరమాత్మను చేరాలని కోరుతూ బ్రహ్మదీక్షలోకి దిగబోయే సమయములో తండ్రి రాజ్యపరిపాలన చేయమని ఆహ్వానించాడు. ఉత్తముడైన అన్ని గుణగణములు గల తన తండ్రి చేత ఆహ్వాఇంచబడి పరమాత్మ మీద ఏ మాత్రం వ్యవధానం లేకుండా భక్తి కలవాడు, చేయవలసిన పనులు పరమాత్మ యందు ఉంచి తండ్రి మాటలను అంతగా ఆమోదించలేదు. ఎందుకంటే దాన్ని ఆమోదిస్తే పరాభవం తప్పదు.

అథ హ భగవానాదిదేవ ఏతస్య గుణవిసర్గస్య పరిబృంహణానుధ్యానవ్యవసితసకలజగద్
అభిప్రాయ ఆత్మయోనిరఖిలనిగమనిజగణపరివేష్టితః స్వభవనాదవతతార

ప్రియవ్రతుని ఉత్తమ గుణాలు ఎంత బాగా వ్యాపించాయో తెలుసుకుని, నిరంతర పరమాత్మ గుణములలో మునిగి ప్రాపంచిక విషయాల మీద విరక్తితో ఉన్నాడని తెలుసుకుని స్వయంభువైన బ్రహ్మ అఖిల వేదాలూ ఋషులతో పరివేష్టించబడి కిందకు వచ్చాడు..

స తత్ర తత్ర గగనతల ఉడుపతిరివ విమానావలిభిరనుపథమమర
పరివృఢైరభిపూజ్యమానః పథి పథి చ వరూథశః సిద్ధగన్ధర్వసాధ్యచారణముని
గణైరుపగీయమానో గన్ధమాదనద్రోణీమవభాసయన్నుపససర్ప

ఈయన చంద్రునివలే కిందికి దిగి వస్తుంటే దేవతలందరూ విమానాలలో వచ్చి ఈయనని పూజించారు. సిద్ధ చారణులచే కీర్తించబడుతూ, గంధమాధన ప్రాంతమునకు వచ్చాడు

తత్ర హ వా ఏనం దేవర్షిర్హంసయానేన పితరం భగవన్తం హిరణ్యగర్భముపలభమానః
సహసైవోత్థాయార్హణేన సహ పితాపుత్రాభ్యామవహితాఞ్జలిరుపతస్థే

దేవర్షుడైన నారదాదులూ మనువూ లేచి సావధాన మనస్సుతో స్వాగతం చెప్పి అక్కడ కూర్చున్నారు

భగవానపి భారత తదుపనీతార్హణః సూక్తవాకేనాతితరాముదితగుణగణావతారసుజయః
ప్రియవ్రతమాదిపురుషస్తం సదయహాసావలోక ఇతి హోవాచ

బ్రహ్మ కూడా అటువంటి వారిచేత పూజించబడి చక్కని మాటతో సంతోషింపబడి ప్రియవ్రతున్ని దయతో చూస్తూ ఇలా అన్నాడు.

శ్రీభగవానువాచ
నిబోధ తాతేదమృతం బ్రవీమి మాసూయితుం దేవమర్హస్యప్రమేయమ్
వయం భవస్తే తత ఏష మహర్షిర్వహామ సర్వే వివశా యస్య దిష్టమ్

నేను నిజమును చెబుతున్నాను తెలుసుకో. భగవంతుని యందు అసూయ పడకు (దోషాలు ఎంచకు). ఆయన అప్రమేయుడు. ఆయనని ఇంద్రియ మనో బుద్ధి చిత్తమూ అంతఃకరణమూ తెలుసుకోలేవు. ఆయనను దోష దృష్టితో చూడవద్దు. నేనూ శంకరుడూ మహర్షి నారదుడూ ప్రజాపతులూ, మేమందరమూ ఆయన ఆజ్ఞ్యకు బద్ధులమై పరమాత్మ వశములో ఉన్న మేము ఆయన ఆజ్ఞ్యను శిరసా వహిస్తున్నాము.

న తస్య కశ్చిత్తపసా విద్యయా వా న యోగవీర్యేణ మనీషయా వా
నైవార్థధర్మైః పరతః స్వతో వా కృతం విహన్తుం తనుభృద్విభూయాత్

ఏ దేహధారి అయినా ఎన్ని సాధనములు జ్ఞ్యానమును పొందడానికీ పరమాత్మను సాక్షాత్కరింపచేసుకోవడానికి చెప్పబడ్డాయో అవి అన్నీ సంపాదించినా కూడా పరమాత్మ సంకల్పాన్ని అడ్డగించడానికి ఏ దేహధారికీ శక్తిలేదు

భవాయ నాశాయ చ కర్మ కర్తుం శోకాయ మోహాయ సదా భయాయ
సుఖాయ దుఃఖాయ చ దేహయోగమవ్యక్తదిష్టం జనతాఙ్గ ధత్తే

ఈ శరీరం ధరించింది సుఖమూ దుఃఖము కోసము. శరీరం వచ్చిందంటే పుట్టుకా మరణమూ శోకమూ మోహమూ భయమూ సుఖమూ దుఃఖమూ శరీరముతోటే వస్తాయి. ఎవ్వరికీ అందుబాటులో లేని పరమాత్మ సంకల్పాన్ని శిరసా వహించాల్సిందే శరీరముతో వచ్చినవారందరూ. భగవత్సంకల్పముతో వచ్చిన శరీరాన్ని నాదీ అనే హక్కు మనకు లేదు.

యద్వాచి తన్త్యాం గుణకర్మదామభిః సుదుస్తరైర్వత్స వయం సుయోజితాః
సర్వే వహామో బలిమీశ్వరాయ ప్రోతా నసీవ ద్విపదే చతుష్పదః

మనము బంధించబడ్డాము, ఒక దారముతో గుచ్చబడ్డాము. మూడు గుణములు దారములు. ఆరు కర్మలు అధ్యయన అధ్యాపన యజన యాజన మొదలైనవి. ఆరు మూళ్ళు పద్దెనిమిది. అందుకే భారతము పద్దెనిమిది పర్వములు. కర్మలు ఆరు గుణములు పద్దెనిమిది. పూలు దారముతో గుచ్చినట్లుగా మనని ఈ దారముతో గుచ్చారు. ఈ గుణకర్మలను ఎంత కష్టపడినా దాటలేము. ఇలా పరమాత్మ చేత కట్టివేయబడ్డ మనమందరమూ పరమాత్మను పూజిస్తున్నాము. రెండు కాళ్ళు గలవాడు నాలుగు కాళ్ళు గలవాడిని ముకుతాడు వేస్తే అవి ఎలా చెప్పినట్లు వింటాయో పరమాత్మ కూడా మనని అలాగే ఆడిస్తున్నాడు.

ఈశాభిసృష్టం హ్యవరున్ధ్మహేऽఙ్గ దుఃఖం సుఖం వా గుణకర్మసఙ్గాత్
ఆస్థాయ తత్తద్యదయుఙ్క్త నాథశ్చక్షుష్మతాన్ధా ఇవ నీయమానాః

మనకెంత జ్ఞ్యానమున్నా పరమాత్మ చెప్పిన దాన్ని మాత్రమే అనుసరిస్తున్నాము. మన కర్మల బట్టీ గుణములను  బట్టి సుఖములనూ దుఃఖములనూ అనుభవిస్తున్నాము. మనమనుకున్నట్లే అవి జరిగితే ప్రపంచములో ఎవరైనా దుఃఖాన్ని కోరుకుంటారా? పరమాత్మ సృష్టించిన దాన్ని మాత్రమే మనమనుసరిస్తున్నాము. భగవంతుని సంగతి వలన వచ్చిన దుఃఖాన్ని అనుభవించే తీరాలి. మనం ఆయా పనులు చేస్తాము, ఆయా వేషాలలో వ్యవహరిస్తాము. ఇదంతా మన ఇష్టమా? పరమాత్మ నిన్ను దేనిలో నియోగించాడో ఆయా కర్మలను స్వీకరించి గుడ్డివారిని కన్నులు గలవారు చేయిపట్టుకుని సురక్షిత ప్రాంతానికి చేరుస్తారో, సుఖ దుఃఖములను గురించి తెలియని మనని పరమాత్మ గమ్యాన్ని చేరుస్తాడు. మోక్షం పొందినవాడైనా గానీ మోక్షం వచ్చేంతవరకూ స్వామి చెప్పినట్లే వినాలి.

ముక్తోऽపి తావద్బిభృయాత్స్వదేహమారబ్ధమశ్నన్నభిమానశూన్యః
యథానుభూతం ప్రతియాతనిద్రః కిం త్వన్యదేహాయ గుణాన్న వృఙ్క్తే

మోక్షం పొందినవాడైనా మోక్షం వచ్చేంతవరకైనా శరీరాన్ని ధరించాలి. అర్చిరాది మార్గములో బయలు దేరేంత వరకూ దేహ ధారణ తప్పదు. ఈ దేహము ప్రారబ్ద వశాన వచ్చింది. అనుభవించాలి గానీ "నాదీ" అన్న భావనతో అనుభవించకూడదు. మనమాచరించే కర్మకు ఫలితముగా దేన్ని అనుభవించాలని పరమాత్మ సంకల్పించాడో అవి అనుభవించడానికి పరమాత్మ ఆజ్ఞ్యాపించిన కర్మలు చేయడానికి ఇష్టము లేకుండానే రాజువవుతావూ భిక్షువు అవుతావు. మరి ఇలాంటి వాటికి నీ ఇష్టముతో సంబంధము లేనట్లే అనుభవించడములో కూడా నీ ఇష్ఠము ఉండదు. ఏమరుపాటు లేకుండా పరమాత్మ ప్రసాదించిన దాన్ని అనుభవించాలి. మళ్ళీ ఈ అనుభవించడములో పరమాత్మ కైంకర్యముగా చేస్తే పాప నివృత్తి కలిగి మోక్షం వస్తుంది. నీ ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఇష్టము వచ్చినట్లు అనుభవిస్తే పాపం వచ్చి మళ్ళీ జన్మ వస్తుంది. ఇంకో శరీరము రావడానికి పనులు చేస్తావా? ఇంకో శరీరము రాకుండా పనులు చేస్తావా? మళ్ళీ శరీరము రాకుండా ఉండాలంటే ప్రకృతి విషయాలను అనుభవిస్తూ పరమాత్మ నా చేత ఇది అనుభవింపచేయాలనుకుంటున్నాడని చేయి.

భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాద్యతః స ఆస్తే సహషట్సపత్నః
జితేన్ద్రియస్యాత్మరతేర్బుధస్య గృహాశ్రమః కిం ను కరోత్యవద్యమ్

నీవు రాజ్యమూ సంసరామూ వద్దన్నావు. మరి ఈ శరీరముతో ఏమి చేస్తావు.  ఏమరుపాటుతో ఉన్నవాడికి అరణ్యములో ఉన్నా భయమే. నీ వెంట నిత్యమూ ఉన్న ఆరుగురిని తీసుకుని ఎక్కడున్నా ఒకటే. అరిషడ్వర్గాన్ని జయించకుండా అడవికి పోయీ వ్యర్థము, గెలిస్తే ఇంట్లో ఉన్నా భయముండదు. అరణ్యానికి వెళ్ళినా వాడి వెంట కామక్రోధాదులు వెంటనే ఉంటాయి. అడవైకి వెళ్ళి ఇంద్రియాలను గెలుస్తామంటే పరమాత్మ యందే రమించి ఇంద్రియాలను జయించినవాడికి రాజ్యమైనా అడవైనా ఒకటే. ఇంద్రియనిగ్రహం కలిగి ఉన్న ఆత్మా రమునికి గృహస్థాశ్రమం ఎటువంటి చెడూ చేయదు.

యః షట్సపత్నాన్విజిగీషమాణో గృహేషు నిర్విశ్య యతేత పూర్వమ్
అత్యేతి దుర్గాశ్రిత ఊర్జితారీన్క్షీణేషు కామం విచరేద్విపశ్చిత్

అరిషడ్వర్గాలను గెలవాలనుకునే వారు దాన్ని ఇంటిలోనే అభ్యసించాలి. అన్నీ చుట్టూ ఉండి కూడా ఇంద్రియాలను గెలవాలి. మొదలు ఇంట్లో ఉండే ప్రయత్నించాలి. శత్రువులను గెలవాలంటే రాజైన వాడు వారి దగ్గరకు వెళ్ళకుండా తన కోటలోనే ఉండి గెలవాలి. శత్రువులను గెలిచే వాడు దుర్గములో ఉండి ఎలా గెలుస్తాడో అరిషడ్వర్గాలను గెలవాలనుకునే వాడు ఇంటిలోనే ఉండీ గెలవాలి. శత్రువులు క్షయించిన తరువాత ఎంత విహరించినా అపాయముండదు.

త్వం త్వబ్జనాభాఙ్ఘ్రిసరోజకోశ దుర్గాశ్రితో నిర్జితషట్సపత్నః
భుఙ్క్ష్వేహ భోగాన్పురుషాతిదిష్టాన్విముక్తసఙ్గః ప్రకృతిం భజస్వ

నీకు పరమాత్మ పాదముల భక్తీ ఇంద్రియ నిగ్రహం సహజముగా వచ్చాయి. పరమాత్మ యొక్క పాద పరాగము అనే దుర్గములో నీవుండి (శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే) నీమీదకు వచ్చినవారిని ఓడించు
సంగము లేకుండా పరమాత్మ ప్రసాదించిన అన్ని భోగాలను అనుభవించు. ఎన్ని భోగాలను అనుభవించినా వాటి యందు ఆశ వదిలిపెట్టాలి. అనుభవించేప్పుడు అనుభవించే విషయాల మీద ఆసక్తి పెంచుకోకు. సంగతిని వదిలిపెట్టి పరమాత్మ ఇచ్చినవాటిని స్వీకరించు

శ్రీశుక ఉవాచ
ఇతి సమభిహితో మహాభాగవతో భగవతస్త్రిభువనగురోరనుశాసనమాత్మనో లఘుతయావనత
శిరోధరో బాఢమితి సబహుమానమువాహ

బ్రహ్మ చేత ఉపదేశించబడిన ప్రియవ్రతుడు ఆ ఆజ్ఞ్యను స్వీకరించి అలాగే అని చెప్పాడు. బ్రహ్మ ఆజ్ఞ్యను శిరసా వహించాడు

భగవానపి మనునా యథావదుపకల్పితాపచితిః ప్రియవ్రత
నారదయోరవిషమమభిసమీక్షమాణయోరాత్మసమవస్థానమవాఙ్మనసం క్షయమవ్యవహృతం
ప్రవర్తయన్నగమత్

బ్రహ్మకూడా మనువు చేత శాస్త్రోక్తమముగా చేయబడిన పూజలు స్వీకరించి ప్రియవ్రత మనువులు సమాన ప్రీతితో చూస్తుండగా వాక్కుకూ మనసుకూ అందని ఆయన లోకానికి వెళ్ళాడు

మనురపి పరేణైవం ప్రతిసన్ధితమనోరథః సురర్షివరానుమతేనాత్మజమఖిలధరామణ్డల
స్థితిగుప్తయ ఆస్థాప్య స్వయమతివిషమవిషయవిషజలాశయాశాయా ఉపరరామ

మనువు కూడా బ్రహ్మ తన కోరిక తీర్చడముతో నారదునిచే తన కుమారుడు భూఅమండలం పరిపాలించుటకు పట్టాభిషేకం చేసి "అతి విషమములైన విషముతో నిండిన విషయములనే విషజలము కల చెరువు నుండి విరమించుకున్నాడు.

ఇతి హ వావ స జగతీపతిరీశ్వరేచ్ఛయాధినివేశితకర్మాధికారోऽఖిలజగద్బన్ధధ్వంసన
పరానుభావస్య భగవత ఆదిపురుషస్యాఙ్ఘ్రియుగలానవరతధ్యానానుభావేన పరిరన్ధితకషాయాశయో
ऽవదాతోऽపి మానవర్ధనో మహతాం మహీతలమనుశశాస

ఈ రీతిలో ప్రియవ్రతుడు పరమాత్మ సంకల్పముతో తానాచరించవలసిన రాజ సింహాసనాన్ని అధిష్ఠించాడు. సకల జగత్తు బంధాన్నీ నాశనము చేసే ప్రభావముగల పరమాత్మ యొక్క పాద పద్మాలను ధ్యానిస్తునాడు. "నిరంతరమూ" పరమాత్మ పాద పద్మములను ధ్యానము చేస్తూ మనస్సుకున్న మురికంతా పోగొట్టుకున్నాడు. పరమాత్మా, తండ్రి గారు చెప్పినట్లుగా చేస్తూ కీర్తిని పొందినవాడై భూమండలాన్ని పరిపాలించాడు.

అథ చ దుహితరం ప్రజాపతేర్విశ్వకర్మణ ఉపయేమే బర్హిష్మతీం నామ తస్యాము హ వావ
ఆత్మజానాత్మసమానశీలగుణకర్మరూపవీర్యోదారాన్దశ భావయామ్బభూవ కన్యాం చ
యవీయసీమూర్జస్వతీం నామ

విశ్వకర్మ పుత్రిక అయిన బర్హిష్మతిని వివాహం చేసుకున్నాడు. ఆ భార్య యందు తనతో సమానమైన గుణములు గలిగిన పదిమంది కుమారులను పొందాడు. ఊర్జస్వతి అనే అమ్మాయిని కూడా పొందాడు (ఈమెనె శుక్రాచార్యులకిచ్చి పెళ్ళి చేసాడు)

ఆగ్నీధ్రేధ్మజిహ్వయజ్ఞబాహుమహావీరహిరణ్యరేతోఘృతపృష్ఠసవనమేధాతిథివీతిహోత్రకవయ
ఇతి సర్వ ఏవాగ్నినామానః

వారి పుత్రులందరికీ అగ్ని హోత్రుని పేర్లు పెట్టాడు

ఏతేషాం కవిర్మహావీరః సవన ఇతి త్రయ ఆసన్నూర్ధ్వరేతసస్త ఆత్మవిద్యాయామర్భ
భావాదారభ్య కృతపరిచయాః పారమహంస్యమేవాశ్రమమభజన్

కవి మహా వీరా సవన, ఈ ముగ్గురూ ఊర్ధ్వరేతస్కులై సన్యాసాన్ని స్వీకరించి అడవికి వెళ్ళారు. ఈ ముగ్గురూ బాల్యమునుండే ఆత్మ విద్య యందు కోరిక ఉన్న వారు కాబట్టి సన్సారాన్ని అభిలషించలేదు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు.

తస్మిన్ను హ వా ఉపశమశీలాః పరమర్షయః సకలజీవనికాయావాసస్య భగవతో వాసుదేవస్య
భీతానాం శరణభూతస్య శ్రీమచ్చరణారవిన్దావిరతస్మరణావిగలితపరమభక్తియోగానుభావేన
పరిభావితాన్తర్హృదయాధిగతే భగవతి సర్వేషాం భూతానామాత్మభూతే ప్రత్యగ్
ఆత్మన్యేవాత్మనస్తాదాత్మ్యమవిశేషేణ సమీయుః

వీరు సకల ప్రపంచమంతా ఎవరిలో ఉందో అటువంటి పరమాత్మ ఐన వాసుదేవుని యందు (సకల చరాచర జగత్తుని వ్యాపించి ఉన్నవాడూ) భయపడిన వారికి అభయమిచ్చేవాడు, నిరంతరమూ పరమాత్మ పాద పద్మాలను స్మరించుటచేత భక్తియోగము పెరిగింది. అన్ని ప్రాణులకూ ఆత్మగా ఉండే వాడైన పరమాత్మ, నిరంతర స్మరణతో సంసారాన్ని విడిచిపెట్టారు. వారికి పరమాత్మ సాక్షాత్కారం లభించింది. జీవాత్మకూ పరమాత్మకూ తేడా ఇహలోకములోనే కనిపిస్తుంది.

అన్యస్యామపి జాయాయాం త్రయః పుత్రా ఆసన్నుత్తమస్తామసో రైవత ఇతి మన్వన్తరాధిపతయః

ప్రియవ్రతునికి ఇంకో భార్య ఉంది: ఆమెతో ఉత్తమా తామస రైవతులు పుత్రులుగా కలిగారు.

ఏవముపశమాయనేషు స్వతనయేష్వథ జగతీపతిర్జగతీమర్బుదాన్యేకాదశ
పరివత్సరాణామవ్యాహతాఖిలపురుషకారసారసమ్భృతదోర్దణ్డయుగలాపీడితమౌర్వీగుణస్తనితవిరమిత
ధర్మప్రతిపక్షో బర్హిష్మత్యాశ్చానుదినమేధమానప్రమోదప్రసరణయౌషిణ్యవ్రీడాప్రముషిత
హాసావలోకరుచిరక్ష్వేల్యాదిభిః పరాభూయమానవివేక ఇవానవబుధ్యమాన ఇవ మహామనా బుభుజే

ఇలా కొందరు సన్యాసులయ్యారు కొందరు రాజులయ్యారు. తరువాత ఈ భూమండలాన్ని పదకొండు కోట్ల సంవత్సరాలు తన ఆజ్ఞ్యకు అడ్డులేకుండా అమ్మవారి అనుగ్రహం పొందిన భక్తుడు కాబట్టి తన వింటినారి శబ్దము వలన శత్రువులని సంహరిస్తూ, తన ప్రియురాలు బర్హిష్మతి వయ్యారములకు మనసు అర్పించిన వాడు, భూమండలాన్ని గెలిచి ప్రియురాలి భ్రూమండలాన్ని గెలవలేకపోయాడు. కాస్త చిరునవ్వూ సిగూ క్రీగంటి చూపుతో అన్ని వివేకాలూ వదిలిపెట్టి ఏమీ తెలియని వాడిలాగానే అన్ని భోగాలనూ అనుభవించాడు.

యావదవభాసయతి సురగిరిమనుపరిక్రామన్భగవానాదిత్యో వసుధాతలమర్ధేనైవ
ప్రతపత్యర్ధేనావచ్ఛాదయతి తదా హి భగవదుపాసనోపచితాతిపురుష
ప్రభావస్తదనభినన్దన్సమజవేన రథేన జ్యోతిర్మయేన రజనీమపి దినం కరిష్యామీతి సప్త
కృత్వస్తరణిమనుపర్యక్రామద్ద్వితీయ ఇవ పతఙ్గః

ఇలా భోగాలనుభవిస్తూ ఉంటే ఒక ఆలోచన కలిగింది. "పన్నెండు గంటలే వెలుగు ఉంటోంది, ఇంకో పన్నెండు గంటలు చీకటి ఎందుకు ఉంది"  సూర్యభగవానుడు ఈ వైపు ఉండట్లేదు అని, ప్రియవ్రతుడు రథము సిద్ధము చేసుకుని సూర్య్నికి వ్యతిరేక దిశలో తిరగడం మొదలుపెట్టాడు. సూర్యుడు తూర్పు దిక్కులో ఉంటే ఆయన పశ్చిమ దిక్కులో ఉండి, చీకటి అనేది లేకుండా చేసాడు. ఆయన రథ చక్రాల నుండి ఏడు మార్గాలు ఏర్పడ్డాయి, ఇవే ఏడు ద్వీపాలు. ఏడు రోజులు ఏడు దారులు. ఈ దారికీ ఆ దారికి మధ్య ఉన్నది ద్వీపం. దారిలో పడిన గుంటలో జలము చేరి సముద్రమయ్యింది. ఇలా మనకు సప్తసముద్రాలనూ సప్త ద్వీపములను ఏర్పరచాడు. మేరు పర్వతాన్ని చుట్టి వస్తున్న సూర్యభగవానుడూ సగం భూమండలానికి మాత్రమే వెలుగునూ మిగిలిన మండలానికి నీడనిస్తున్నాడని తెలుసుకొని పరమాత్మనారాధించడం వలన సంపాదించిన బలము కలవాడు కాబట్టి సూర్యుని చేష్టితమును మెచ్చుకోక సూర్యుని రథ వేగముతో ఇంకో జ్యోతిర్య్మయమైన ప్రకాశమైన రథం తీసుకుని రాత్రిని కూడా పగలు చేస్తానని ఏడు సార్లు సూర్యున్ని అనుసరించి రెండవ సూర్యునిలా తిరిగాడు

యే వా ఉ హ తద్రథచరణనేమికృతపరిఖాతాస్తే సప్త సిన్ధవ ఆసన్యత ఏవ కృతాః సప్త భువో
ద్వీపాః

తన రథ చక్రాల వలన ఏర్పడిన గుంటలు సప్తసముద్రాలయ్యాయి. ఆ మధ్య భాగాలు ఏడు ద్వీపాలు - జమ్బూప్లక్షశాల్మలికుశక్రౌఞ్చశాకపుష్కర

జమ్బూప్లక్షశాల్మలికుశక్రౌఞ్చశాకపుష్కరసంజ్ఞాస్తేషాం పరిమాణం
పూర్వస్మాత్పూర్వస్మాదుత్తర ఉత్తరో యథాసఙ్ఖ్యం ద్విగుణమానేన బహిః సమన్తత ఉపక్లృప్తాః

పూర్వ ద్వీపము కంటే ఉత్తర ద్వీపం రెట్టింపు ఉంటుంది. ఏడు సముద్రాలు, ఏడు ద్వీపాలకు హద్దులు. ఇలా హద్దులు కల్పించబడి ఈ ఏడు ద్వీపాలలో సన్యాసులు కాగా మిగిలిన ఏడుగురు కొడుకులకూ ఏడు ద్వీపాలనిచ్చాడు. తన పుత్రికను శుక్రాచార్యులకిచ్చి వివాహం చేయగా ఆమెయందు దేవయాని పుత్రికగా పుట్టింది.

దుహితరం చోర్జస్వతీం నామోశనసే ప్రాయచ్ఛద్యస్యామాసీద్దేవయానీ నామ కావ్యసుతా

నైవంవిధః పురుషకార ఉరుక్రమస్య
పుంసాం తదఙ్ఘ్రిరజసా జితషడ్గుణానామ్
చిత్రం విదూరవిగతః సకృదాదదీత
యన్నామధేయమధునా స జహాతి బన్ధమ్

పరమాత్మ యొక్క పాద ధూళితో అరిషడ్వర్గాలను జయించినవారికి ఈ ప్రభావమేమీ వింతకాదు. ఒక్క సారి పిలిస్తేనే సంసార బంధమే పోయినప్పుడు నిరంతరమూ ఆయన నామాన్ని కీర్తించేవారికి ఈ బలముండటం వింతకాదు.ఇటువంటి వాడు సంసార బంధాన్ని విడిచిపెడతాడు. ప్రియవ్రతుడు ఇన్ని రాజభోగాలను అనుభవించినా పరమాత్మ స్మరణను విడిచిపెట్టనందు వలన అవేవీ బంధించలేదు. 

శమ దమ తపః శౌచం తితిక్ష ఉపరతి (విషయముల యందు ఇంద్రియాలు ప్రవర్తించకుండా ఆపుట ఆత్మా రామం.),  ఈ ఆరు అందరికీ ఉండాల్సినవి. అహింస సత్యం అస్తేయం (దొంగతనం చేయకపోవుట) అనసూయ ఉండాలి, అమర్షమూ (ఎదుటివారి వృద్ధిని చూచి సహించకపోవడం), లోలుపత ఉండకుండుట , - ఈ పన్నెండు గుణాలూ బ్రాహ్మణుడికి ఉండాలి. 

స ఏవమపరిమితబలపరాక్రమ ఏకదా తు దేవర్షిచరణానుశయనానుపతితగుణవిసర్గ
సంసర్గేణానిర్వృతమివాత్మానం మన్యమాన ఆత్మనిర్వేద ఇదమాహ

రాజ్యాన్ని పరిపాలించాడూ, పుత్రులకు రాజ్యమిచ్చాడు, ఒక్క సారి ఈయనకి విరక్తి కలిగింది. తన గురించి తానిలా విచారించాడు. నారదుని సేవించిన ప్రభావం వలన సంసార విషయములు అంటకున్నప్పటికీ సంసారముతో సంబంధము పెట్టుకున్నందువలన తృప్తి పొందక తనలో తానే పశ్చాత్తాపం పొందాడు

అహో అసాధ్వనుష్ఠితం యదభినివేశితోऽహమిన్ద్రియైరవిద్యారచితవిషమవిషయాన్ధకూపే
తదలమలమముష్యా వనితాయా వినోదమృగం మాం ధిగ్ధిగితి గర్హయాం చకార

నేను తప్పు చేసాను. పరమాత్మను సేవిస్తున్నట్లు కనపడినా ఇంద్రియ ఆరామము నన్ను వదిలిపెట్టలేదు. ఇంద్రియముల చేత మోసగించబడ్డాను, ప్రభావితున్నయ్యను.అవిద్య చేత ఏర్పరచిన విషమమైన విషయములనే బావిలో పడిపోయాను. 
ఇంతకాలం నేను ఒక స్త్రీకి (భార్యకు) ఆట మృగముగా ఉన్నాను. 

పరదేవతాప్రసాదాధిగతాత్మప్రత్యవమర్శేనానుప్రవృత్తేభ్యః పుత్రేభ్య ఇమాం యథాదాయం
విభజ్య భుక్తభోగాం చ మహిషీం మృతకమివ సహ మహావిభూతిమపహాయ స్వయం నిహితనిర్వేదో హృది
గృహీతహరివిహారానుభావో భగవతో నారదస్య పదవీం పునరేవానుససార

ఇంతకాలం సంసారములో ఉండి ఇంత భోగమనుభవించి విరక్తి పొందడానికి కారణం పరమాత్మ అనుగ్రహం. దాని వలన ఆత్మ పరిశీలనను పొందగలిగాడు. తనను అనుసరించి ఉన్న పుత్రులకు రాజ్యం ఎంత భాగం రావాలో అంత భాగం ఇచ్చివేశాడు. ఇంతకాలం అన్ని రకాల సుఖ దుఃఖములను పంచుకున్న భార్యను కూడా విడిచిపెట్టి, సంపదలను విడిచిపెట్టి పరిపూర్ణమైన విరక్తి కలవాడై హృదయమునను పరమాత్మ ప్రభావాన్ని స్మరిస్తూ, గురువుగారైన నారదుని మార్గాన్ని అనుసరించాడు. 

తస్య హ వా ఏతే శ్లోకాః
ప్రియవ్రతకృతం కర్మ కో ను కుర్యాద్వినేశ్వరమ్
యో నేమినిమ్నైరకరోచ్ఛాయాం ఘ్నన్సప్త వారిధీన్

ప్రియవ్రతుని ప్రభావం చెప్పే శ్లోకాలు ఇవి: ప్రియవ్రతుడు చేసిన కర్మ ఎవరు చేయగలరు పరమాత్మ తప్ప. తన రధ చక్రం యొక్క అంచుగీతలతో ఏడు సముద్రాలను చేసాడు. 

భూసంస్థానం కృతం యేన సరిద్గిరివనాదిభిః
సీమా చ భూతనిర్వృత్యై ద్వీపే ద్వీపే విభాగశః

అదే సమయములో నదులనీ పర్వతములనీ వ్యవస్థ ఏర్పరచాడు. (పర్వతం పర్వతం మధ్యన నీరూ, పర్వతమూ వనమూ గ్రామమూ ఏర్పరచాడు. ప్రతీ గ్రామానికి పర్వతమూ నదీ వనమూ ఉండేట్లు చేసాడు. ప్రతీ ప్రాణికీ నీళ్ళూ రాళ్ళూ చెట్లూ కావాలి. చెట్లు భూగర్భ జలాన్ని కాపాడతాయి. వరషం ద్వారా వచ్చి నీటిని పీల్చుకుంటాయి, ఆ ప్రాంతమెప్పుడూ పదునుగా ఉంచుతాయి. తాను తాగిన నీటిని వదిలిపెడతాయి. వదిలిపెట్టిన నీరు కొత్త నీరు పడగానే ఇంకిపోకుండా ఆపుతుంది. అందుకే వృక్షాలు భూగర్భ జలాన్ని పెంచుతాయి. ) నదులనీ వనములనీ పర్వతాలనీ విభజించాడు అన్ని ప్రాంతాలకీ వచ్చేట్లుగా.  పర్వతాలు ఎక్కువ ఉన్నచోట భూకంపాలు రావు, మేఘాలు కూడా పర్వతాలలో వర్షిస్తాయి. అక్కడ వర్షం పడటం వలన కిందికి రావడములో వేగము తక్కువగా ఉంటుంది, నీరు క్రమముతో వస్తుంది. ఆ నీరు భూమి మీద నిలుస్తాది. వర్షం నీరు గ్రామానికి ఎలా ఉపయోగపడాలో అంత నీరు అంత వేగముతో అందిస్తాయి పర్వతాలు. పర్వతమునుండి వచ్చే నీరుని ఝరీ అంటాము లేదా శిల యేరు (సెలయేరు) అంటాము. ప్రతీ ద్వీపానికీ హద్దులు కూడా ఏర్పరచాడు. ఒక్కో ద్వీపానికీ నదులూ వృక్షాలూ పర్వతాలూ వేరే ఉన్నాయి. అల్లనేరేడు పళ్ళు ఎక్కువ ఉండే ద్వీపం జంబూ ద్వీపము. అంతంత పళ్ళు కిందకి పడి ఆ రసం పారి భూమిలోకి పోయి భూమిలో మట్టిని శుద్ధిచేస్తే గని ఏర్పడింది, దాని నుంచి వచ్చినది బంగారం. అందుకే బంగారానికి జాంబూనదం అంటారు. ద్వీపమూ, నదీ పర్వతమూ ఖనిజమూ ఒక్కో ద్వీపానికీ ఉంటాయి. జంభూనది పరివాహక ప్రాంతం ఉన్న మట్టిలోంచి వచ్చింది బంగారము. 

భౌమం దివ్యం మానుషం చ మహిత్వం కర్మయోగజమ్
యశ్చక్రే నిరయౌపమ్యం పురుషానుజనప్రియః

అక్కడ ఉండే ప్రాణుల సంతృప్తి కోసం అన్నీ ఏర్పాటు చేసాడు. తన రాజ్యములో ఉండేవారికి ప్రీతిపాత్రుడైన ప్రియవ్రతుడు స్వర్గము దాకా నరకము దాకా తన కీర్తిని వ్యాపింపచేసాడు