Pages

Tuesday, 25 March 2014

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం ఆరవ అధ్యాయం


శ్రీప్రహ్రాద ఉవాచ
కౌమార ఆచరేత్ప్రాజ్ఞో ధర్మాన్భాగవతానిహ
దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్థదమ్

తండ్రికి ఉపదేశమిచ్చిన తరువాత ప్రహ్లాదుడు గురుకులములో రాక్షసపిల్లలకీవిధముగా ఉపదేశమిచ్చాడు
"ప్రాజ్ఞ్యుడైన వాడు, జ్ఞ్యానం పొందదలచుకున్న వాడు కౌమారావాస్థలోనే (ఐదో ఏటి నుంచే) భగవంతుని పొందడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే భాగవత ధర్మముని ఆచరించాలి. భగవత్ లీలా శ్రవణం ఐదేళ్ళ వయసులోనే ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ మానవ జన్మ రావడం ఎంతో దుర్లభం. ఈ మానవ జన్మ కూడా అధృవం. ఉన్నన్నాళ్ళు కూడా ఒకే రకమైన ఆలోచన ఉంటుందని లేదు. మానవ జన్మ అధృవం అస్థిరం.

యథా హి పురుషస్యేహ విష్ణోః పాదోపసర్పణమ్
యదేష సర్వభూతానాం ప్రియ ఆత్మేశ్వరః సుహృత్

మానవుడిగా పుట్టినవాడికి ప్రధాన కర్తవ్యం శ్రీమన్నారాయణుని పాదములను చేరుట. ఆయన ఒక్కడే అన్ని ప్రాణులకూ ప్రియుడు, ఆత్మ ప్రభువూ, సుహృత్. 

సుఖమైన్ద్రియకం దైత్యా దేహయోగేన దేహినామ్
సర్వత్ర లభ్యతే దైవాద్యథా దుఃఖమయత్నతః

దేహములనూ ఇంద్రియములనూ ఇచ్చిన పరమాత్మే మన ప్రయత్నముతో పని లేకుండా మనకి ఏమేమి కావాలో ఇస్తాడు. దానికి కావలసిన సౌకర్యాలను స్వామి కలిగిస్తూనే ఉన్నాడు. దానికి మీ ప్రయత్నం అవసరం లేదు. దీనికి ఉదాహరణ, దుఃఖం కొరకు ఎవరూ ప్రయత్నించరు. మరి మనకి ఇష్టం లేనిది మన ప్రయత్నం లేకుండా వస్తున్నప్పుడు ఇష్టమైనది కూడా ప్రయత్నం లేకుండానే వస్తుంది. కర్మననుసరించి సుఖ దుఃఖాలు వస్తాయి. కానీ భగవత్ భాగవత ఆచార్య కైంకర్యం అలా రాదు. దానికి మన ప్రయత్నం అవసరం. సుఖ దుఃఖాల కోసం ప్రయత్నించడం అనే మాటను వదిలిపెట్టండి. అది ఆయనే ఇస్తాడు. మనం చేయవలసింది మాత్రం ఆయనను చేరడానికి ప్రయత్నించడం. దేహాన్ని ఇచ్చిన దైవమే ఆ దేహమునకు సుఖమునూ దుఃఖమునూ ఇస్తాడు. 

తత్ప్రయాసో న కర్తవ్యో యత ఆయుర్వ్యయః పరమ్
న తథా విన్దతే క్షేమం ముకున్దచరణామ్బుజమ్

కాబట్టి శరీరమునిచ్చిన పరమాత్మ శరీరానికి కావలసినవి ఇస్తాడు కాబట్టి, శరీరమునకు కావలసిన వాటి గురించి ప్రయత్నించి ఆయుష్యాన్ని దుర్వినియోగం చేసుకోకండి. పరమాత్మ పాదపద్మములే మనకు యోగ క్షేమమును (ప్రాప్తిః ప్రాప్తిశ్చ రక్షణం) కలిగిస్తాయి.  పరమాత్మ పాదములు లభించుట అంత సులభం కాదు. ఆహార విహార జీవనం దొరికినట్లూ, సుఖం సంతోషం లభించినట్లు పరమాత్మ పాదములు లభించవు. పరమాత్మ కటాక్షం కలిగితే ఒక క్షణ కాలం ఒక భక్తునితో సంగం లభిస్తుంది. సజ్జన సహవాసం క్షణ కాలం కలిగినా మన జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. పరమాత్మ పాద పద్మాలను మనం అంత సులభముగా పొందలేము. సంసారమనే మహా ఆపదలో పడ్డవాడు అలాంటి క్షేమకరమైన పరమాత్మ పాదములు పొందడానికి ప్రయత్నం చేయాలి. 

తతో యతేత కుశలః క్షేమాయ భవమాశ్రితః
శరీరం పౌరుషం యావన్న విపద్యేత పుష్కలమ్

మనకు లభించిన మానవ దేహం ఇంత కాలం ఆరాగ్యముగా ఉంటుందీ అని ఎవరూ చెప్పలేరు. మానవ శరీరమునకు ఆపద కలగక మునుపే పరమాత్మను చేరడానికి ప్రయత్నించాలి. 

పుంసో వర్షశతం హ్యాయుస్తదర్ధం చాజితాత్మనః
నిష్ఫలం యదసౌ రాత్ర్యాం శేతేऽన్ధం ప్రాపితస్తమః

నూరేళ్ళ ఆయుష్షులో రాత్రిల్లు నిద్రతో గుడ్డి చీకటి పొంది వృధాగా రాత్రి పూట పడుకుంటాడు. 

ముగ్ధస్య బాల్యే కైశోరే క్రీడతో యాతి వింశతిః
జరయా గ్రస్తదేహస్య యాత్యకల్పస్య వింశతిః

యాభై ఏళ్ళలో శిశువుగా బాలుడిగా ఆటలలో ఇరవై ఏళ్ళు గడుస్తాయి. అరవై ఏళ్ళు వచ్చినప్పుడు వృద్ధాప్యముతో చింతిస్తూ ఇంకో ఇవరి ఏళ్ళు

దురాపూరేణ కామేన మోహేన చ బలీయసా
శేషం గృహేషు సక్తస్య ప్రమత్తస్యాపయాతి హి

మంచి యవ్వన మదములో కామముతో క్రీడిస్తూ పదేళ్ళను పది నిముషాలుగా గడుపుతాడు. ఆటలలో ఆసక్తి తగ్గించి పరమాత్మ యందు మనసు లగ్నం చేయండి. బాల్యము నుంచీ పరమాత్మ మీద భక్తి ఉన్న వారికి యవ్వనములో కామాసక్తి తగ్గిపోతుంది. మనకున్న కామనలు ఎన్నాళ్ళు అనుభవించినా తగ్గవు. ఎంత ప్రయత్నించినా నింపశక్యము కాని కోరికతో మోహముతో గృహములో ఆసక్తుడవ్వకుండా బాల్యమునుంచీ పరమాత్మ యందు భక్తి కలిగి ఉండాలి.

కో గృహేషు పుమాన్సక్తమాత్మానమజితేన్ద్రియః
స్నేహపాశైర్దృఢైర్బద్ధముత్సహేత విమోచితుమ్

ప్రపంచములో ఎవరైనా, ఎంత గొప్పవాడైనా, ధారా పుత్రుల యందు ఆస్కతుడై, ఇంద్రియ నిగ్రహం లేని వాడు సంసారం యందు ఆస్కత్మై స్నేహ పాశములతో గట్టిగా కట్టబడిన మన్సుని లాగగలడా? 

కో న్వర్థతృష్ణాం విసృజేత్ప్రాణేభ్యోऽపి య ఈప్సితః
యం క్రీణాత్యసుభిః ప్రేష్ఠైస్తస్కరః సేవకో వణిక్

అర్థ కామాల యందు ఉన్న ఆసక్తిని ఎవరైనా విడిచిపెడతాడా? అర్థ కామాల మీద ఆశ ప్రాణముల కంటే గొప్పది. అత్యంత ప్రీతి పాత్రములైన ప్రాణులతో దొంగలూ సేవకులు వ్యాపారస్థులు ఆడుకొంటారు. (వ్యాపారస్థులు పాతరోజులలో సముద్ర ప్రయాణం చేసేవారు, అంటే ప్రాణం పణముగా పెట్టి వ్యాపారం చేసేవారు.) 

కథం ప్రియాయా అనుకమ్పితాయాః సఙ్గం రహస్యం రుచిరాంశ్చ మన్త్రాన్
సుహృత్సు తత్స్నేహసితః శిశూనాం కలాక్షరాణామనురక్తచిత్తః

ఏకాంతములో దయచూపిన ప్రియురాలు చెవిలో మాట్లాడే మనసుకు నచ్చే తీయ తీయని మాటలను వినడానికి ఆశపడి ప్రియులు ప్రాణాలను పణముగా పెడతారు. ఆమెతో సమాగమం, ఆలోచన, ఆమె మాటలనే మంత్రములు,  వినడానికి ఆసక్తుడై కొంత కాలం. దాని వలన పుట్టిన్ శిశువులతో కొంతకాలం, వారు మాట్లాడే వచ్చీ రాని మాటలకు, స్నేహితులతో కొంతకాలం, ఉన్న వారు పరమాత్మను స్మరిస్తారా.

పుత్రాన్స్మరంస్తా దుహితౄర్హృదయ్యా భ్రాతౄన్స్వసౄర్వా పితరౌ చ దీనౌ
గృహాన్మనోజ్ఞోరుపరిచ్ఛదాంశ్చ వృత్తీశ్చ కుల్యాః పశుభృత్యవర్గాన్

పిల్లలలనూ పుత్రికలనూ అన్నలనూ తల్లి తండ్రులనూ, ఇళ్ళూ, అందమైన గొప్ప ఆభరణములూ వస్త్రములూ, బతుకు తెరువులూ, పశువులూ సేవకులూ ఇతరులనీ ఎవరైనా వదిలిపెడతాడా?

త్యజేత కోశస్కృదివేహమానః కర్మాణి లోభాదవితృప్తకామః
ఔపస్థ్యజైహ్వం బహుమన్యమానః కథం విరజ్యేత దురన్తమోహః

వీటిని వదిలిపెట్టినవాడే జ్ఞ్యాని. సాలెపురుగు తన నోటి నుంచి దారం తీసి గూడు కడుతుంది, తానే దారాన్ని మింగేస్తుంది. అలాగే మనమే కూర్చుకోవాలి, మనమే వదిలేసుకోవాలి. కోశస్కృద్ అన్నదానికి తేనెటీగ అన్న పేరు కూడా ఉంది. తేనెపట్టును కష్టపడి సేకరించి తాను కూర్చుకున్న తేనెతుట్టను వదిలివెళ్ళిపోతుంది. అలాగే గృహస్థుడు కూడా పైవాటన్నిటినీ (వాటి మీద ఆసక్తిని) వదిలిపెట్టాలి. 
కానీ లోభముతో కోరికలయందు తృప్తే కలగక, ఉపస్థ జిహ్వా, ఈ రెండు ఇంద్రియాలకే తృప్తి కలిగించడానికి బతికే వారు ఈ సంసారం చాలు అని అంటారా? ఇలాంటి వారు అసలు విరక్తిని పొందుతారా? 

కుటుమ్బపోషాయ వియన్నిజాయుర్న బుధ్యతేऽర్థం విహతం ప్రమత్తః
సర్వత్ర తాపత్రయదుఃఖితాత్మా నిర్విద్యతే న స్వకుటుమ్బరామః

కుటుంబాన్ని పోషించడానికే ఆయుష్యాన్ని ఖర్చు చేస్తూ ఆయుష్యం ఐపోతున్నదన్న విషయం తెలుసుకోడు. శరీరం కానీ తన పురుషార్థములు కానీ ఐపోతున్నవన్న విషయం తెలియలేడు. ప్రతీ చోటా తాపత్రయాలే ఎదురవుతాయి. శరీరమైనా బాగుండదు, మనస్సయినా బాగుండదూ, చుట్టూ ఉన్నవైనా బాగుండవు. 
ఇలా ప్రతీ క్షణం బాధపడుతున్నా కుటుంబం మీద ప్రేమ ఉండటముతో విరక్తి మాత్రం కలుగదు. ఆ బాధలకంటే తన కుటుంబాన్ని ఎక్కువ పోషిస్తూ ఉంటాడు. 

విత్తేషు నిత్యాభినివిష్టచేతా విద్వాంశ్చ దోషం పరవిత్తహర్తుః
ప్రేత్యేహ వాథాప్యజితేన్ద్రియస్తదశాన్తకామో హరతే కుటుమ్బీ

జ్ఞ్యానం కలవాడికి కూడా నిరంతరం వీడి మనసు ధనము యందే ఉంటుంది. దానికోసం మోసం చేస్తాడు. పరవిత్తాన్ని అపహరిస్తాడు. ఆ అపహరించడం దోషముగా కాక గుణముగా భావిస్తాడు. ఇంద్రియ నిగ్రహం లేక, కోరికలను శమింపచేసుకోలేక ఇతరుల ద్రవ్యాన్ని హరిచి, తన మనశ్శాంతిని హరించుకుంటాడు. 

విద్వానపీత్థం దనుజాః కుటుమ్బం పుష్ణన్స్వలోకాయ న కల్పతే వై
యః స్వీయపారక్యవిభిన్నభావస్తమః ప్రపద్యేత యథా విమూఢః

పండితుడు కూడా ఇదే రీతిలో తన కుటుంబాన్ని పోషించుకుంటూ తాను చేరవలసిన ఉత్తమలోకానికి చేరలేకపోతున్నాడు. ఇలా ఉత్తమ లోకాలను పొందకపోవడానికి కారణం, ఇది నాది, అది వాడిదీ అన్న భేధ దృష్టి ఉండటం. ముసలితనం వరకూ "నీ నా" అన్న భేధ బుద్ధి ఉన్న వారికి ముసలితనములో ఐనా వైరాగ్యం ఎలా వస్తుంది. ఇలా అజ్ఞ్యానాన్ని పొందుతాడు మూఢుడిలాగ. 

యతో న కశ్చిత్క్వ చ కుత్రచిద్వా దీనః స్వమాత్మానమలం సమర్థః
విమోచితుం కామదృశాం విహార క్రీడామృగో యన్నిగడో విసర్గః

ఏ విధముగా చూచినా ఏ దిక్కునుంచి కూడా సంసారములో చిక్కుకున్న వాడు విడిపించుకోజాలడు. స్త్రీలకు ఒక ఆట మృగముగా మారి బిడ్డలు గుదిబండలుగా మారిన వాడు సంసారమునుంచి ఎలా బయటపడగలడు.

తతో విదూరాత్పరిహృత్య దైత్యా దైత్యేషు సఙ్గం విషయాత్మకేషు
ఉపేత నారాయణమాదిదేవం స ముక్తసఙ్గైరిషితోऽపవర్గః

కాబట్టి దైత్యులారా, విషయముల యందు సంగం ఉన్న రాక్షసుల సంగాన్ని వదిలిపెట్టండి, శ్రీమన్నారాయణుని ఆశ్రయించండి. ఆయనే సంగమును వదిలిన వారిచేత పొందదగిన వాడు. మీలాంటి రాక్షసులతో స్నేహం చేయకండి, పరమాత్మను ఆశ్రయించండి. 

న హ్యచ్యుతం ప్రీణయతో బహ్వాయాసోऽసురాత్మజాః
ఆత్మత్వాత్సర్వభూతానాం సిద్ధత్వాదిహ సర్వతః

ఇంట్లో పిల్లలుగా ఉన్నప్పుడు తల్లినీ తండ్రినీ మిత్రులనీ మెప్పించాలి, పెద్దయ్యాక భార్యని మెప్పించాలి, సేవకుడైతే యజమానిని మెప్పించాలి. ఎంత ప్రయత్నించినా వారిని మెప్పించలేము. కానీ శ్రీమన్నారాయణుని మెప్పించడానికి పెద్ద ప్రయత్నం అవసరము లేదు. ఆయన సకల భూతములకూ ప్రాణులకూ ఆత్మ. అందరిలో ఉంటాడు. అంతటా ఉన్నాడు. నీవెక్కడున్నావో అక్కడే ఉన్నాడు. ఆయనను మెప్పించడానికి శ్రమతో పని లేదు. 

పరావరేషు భూతేషు బ్రహ్మాన్తస్థావరాదిషు
భౌతికేషు వికారేషు భూతేష్వథ మహత్సు చ

అన్ని రకముల ప్రాణులూ, బ్రహ్మ దగ్గర నుంచీ స్తంభం వరకూ, పాంచభౌతిక వికారములు కలిగి, పంచభూతముల యందు

గుణేషు గుణసామ్యే చ గుణవ్యతికరే తథా
ఏక ఏవ పరో హ్యాత్మా భగవానీశ్వరోऽవ్యయః

సత్వ రజస్సు తమో గుణాలూ, ప్రకృతి (గుణసామ్యే ), మహత్ తత్వమూ  (గుణవ్యతికరే ), వీటన్నిటిలో ఉండేవాడు ఒక్కడే, ఆయనే పరమాత్మ, శాసకుడు, నాశము లేని వాడు, తరగని అవడు. 

ప్రత్యగాత్మస్వరూపేణ దృశ్యరూపేణ చ స్వయమ్
వ్యాప్యవ్యాపకనిర్దేశ్యో హ్యనిర్దేశ్యోऽవికల్పితః

ఈయనే ప్రత్యగాత్మగా, జీవాత్మగా, అంతర్యామిగా, శరీరముగా ఉంటాడు. ఆయనే వ్యాప్యం (అన్ని చోట్లా ఉండేవాడు), వ్యాపి (కొన్ని చోట్ల ఉన్నట్లు కనపడే వాడు).(మనుష్యత్వం వ్యాప్తి, ఆత్మ వ్యాపకం). ఆధారమూ (వ్యాపకం) ఆధేయమూ (వ్యాప్తి) ఆయనే. చూపదగిన వాడూ, తెలియదగినవాడు, తెలపలేని వాడు ఆయనే. 

కేవలానుభవానన్ద స్వరూపః పరమేశ్వరః
మాయయాన్తర్హితైశ్వర్య ఈయతే గుణసర్గయా

ఈయనను ఎవరికి వారు అనుభవిస్తేనే అర్థమవుతుంది కానీ ఈ రూపమని ఎవ్వరూ స్వామిని నిర్దేశించి చెప్పలేరు. అలా అని చెప్పలేకుండా ఊరుకోలేరు. ఈయన మూడు గుణమ్ములు సృష్టించే ప్రకృతి చేత పొందబడతాడు. ప్రకృతితో (మాయతో) జగత్తుని సృష్టిస్తాడు. ప్రకృతిలో ఉండే మనం పరమాత్మను పొందాలి. 

తస్మాత్సర్వేషు భూతేషు దయాం కురుత సౌహృదమ్
భావమాసురమున్ముచ్య యయా తుష్యత్యధోక్షజః

పరమాత్మ సకల చరాచర జగత్తులలో అన్ని ప్రాణులలో అంతర్యామిగా ఉన్నాడు. అన్ని ప్రాణుల యందూ దయ చూపండి. సకల భూత దయే పరమాత్మ ఆరాధన. స్నేహాన్ని చేయండి, ప్రతీ ప్రాణినీ ప్రేమించండి, దయ చూపించండి. ఇదే నారాయణుని ఆరాధన. అన్ని ప్రాణుల యందూ దయ చూపలంటే ముందు మనలో ఉన్న రాక్షసత్వాన్ని విడిచిపెట్టాలి. అది వదిలి ప్రతీ ప్రాణినీ దయ చూచుట నేర్చుకొనుటే భగవదారాధన. అప్పుడే పరమాత్మ సంతోషిస్తాడు. 

తుష్టే చ తత్ర కిమలభ్యమనన్త ఆద్యే
కిం తైర్గుణవ్యతికరాదిహ యే స్వసిద్ధాః
ధర్మాదయః కిమగుణేన చ కాఙ్క్షితేన
సారం జుషాం చరణయోరుపగాయతాం నః

అలాంటి పరమాత్మ సంతోషిస్తే మనకు పొందరానిదేదైనా ఉంటుందా. ప్రకృతి మహత్తు అహంకారం , వాటినుంచి వచ్చే భూత సృష్టితో మనకేమి పని. ఏ గుణమూ లేని ప్రకృతీ, ప్రకృతి ధర్మాలతో మనకేంటి పని. దేనితో పరమాత్మ ఆనందిస్తాడో అలాంటి సకల జీవుల యందూ స్నేహం కలిగి ఉండి శ్రీమన్నారాయణుని పాదపద్మములను కీర్తిస్తూ ఉండడి. ఇదే మనకు ధర్మం, ఇదే మనకు కామం, ఇదే మనకు అర్థం. 

ధర్మార్థకామ ఇతి యోऽభిహితస్త్రివర్గ
ఈక్షా త్రయీ నయదమౌ వివిధా చ వార్తా
మన్యే తదేతదఖిలం నిగమస్య సత్యం
స్వాత్మార్పణం స్వసుహృదః పరమస్య పుంసః

ధర్మ అర్థ కామములనే త్రివర్గములూ, తర్క మీమాంస వేదములూ రాజనీతి, బతుకు తెరువూ, ఇదంతా సత్యమే. వేదములలో చెప్పబడినవే. గురువుగారి దగ్గర ఇవన్నీ నేర్చుకుని అవి అన్నీ మనకు పరమ మిత్రుడైన పరమాత్మకు అర్పించాలి. చదువు యొక్క ఉద్దేశ్యం అదే. అప్పుడే చదువుకున్న విద్య సఫలమవుతుంది. లేకపోతే ఆ చదువు బంధాన్నిస్తుంది. 

జ్ఞానం తదేతదమలం దురవాపమాహ
నారాయణో నరసఖః కిల నారదాయ
ఏకాన్తినాం భగవతస్తదకిఞ్చనానాం
పాదారవిన్దరజసాప్లుతదేహినాం స్యాత్

ఇప్పుడు నేను నీకు చెబుతున్న జ్ఞ్యానం ఎవరికీ కలిగేది కాదు. దీన్ని శ్రీమన్నారాయణుడు తనకు అత్యంత భక్తుడైన నారద మహామునికి అందించాడు. ఈ జ్ఞ్యానం కలగాలంటే భగవంతుని కంటే భిన్నమైన వస్తువేది లేదు అని తెలుసుకుని త్రికరణములతో భగవానునికి అర్పితమైన వారి పాద ధూళి ఎవరికి దొరుకుతుందో వారికి దొరుకుతుంది.  భాగవత దాస్యం చేస్తేనే ఈ జ్ఞ్యానం లభిస్తుంది. 

శ్రుతమేతన్మయా పూర్వం జ్ఞానం విజ్ఞానసంయుతమ్
ధర్మం భాగవతం శుద్ధం నారదాద్దేవదర్శనాత్

ఈ జ్ఞ్యానం నేను పూర్వం నారదుని వలనే విన్నాను. పరిశుద్ధమైన పరంభాగవత ధర్మాన్ని భగవంతుని సాక్షాత్కరించుకున్న నారదుని వలన విన్నాను. 

శ్రీదైత్యపుత్రా ఊచుః
ప్రహ్రాద త్వం వయం చాపి నర్తేऽన్యం విద్మహే గురుమ్
ఏతాభ్యాం గురుపుత్రాభ్యాం బాలానామపి హీశ్వరౌ

మనమందరం చదువుకున్నది ఒకే గురువుగారి దగ్గర కదా? నీకూ మాకూ వీరే కదా గురువులు. ఇక్కడకు రాక ముందు అంతఃపురములో ఉన్న నీవు చిన్నపిల్లవాడికి. మరి నీకు ఈ సమాగమం ఎలా జరిగింది. 

బాలస్యాన్తఃపురస్థస్య మహత్సఙ్గో దురన్వయః
ఛిన్ధి నః సంశయం సౌమ్య స్యాచ్చేద్విస్రమ్భకారణమ్

మా మీద ప్రీతి ఉంటే మాకు చెప్పవచ్చు అనుకుంటే ఈ రహస్యాన్ని వివరించు.