Pages

Tuesday, 25 March 2014

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం ఏడవ అధ్యాయం


శ్రీనారద ఉవాచ
ఏవం దైత్యసుతైః పృష్టో మహాభాగవతోऽసురః
ఉవాచ తాన్స్మయమానః స్మరన్మదనుభాషితమ్

ఇది వరకు నేను చెప్పిన దాన్ని గుర్తు చేసుకుని మహాభాగవత అసురుడైన ప్రహ్లాదుడు ఇలా అన్నాడు

శ్రీప్రహ్రాద ఉవాచ
పితరి ప్రస్థితేऽస్మాకం తపసే మన్దరాచలమ్
యుద్ధోద్యమం పరం చక్రుర్విబుధా దానవాన్ప్రతి

మా నాన్న గారు తీవ్రమైన తపస్సు చేయడానికి మందర పర్వతానికి వెళ్ళినప్పుడు, ఇదే అవకాశమని దేవతలు మా మీదకి దండించి వచ్చారు

పిపీలికైరహిరివ దిష్ట్యా లోకోపతాపనః
పాపేన పాపోऽభక్షీతి వదన్తో వాసవాదయః

హిరణ్యకశిపుడు పూర్తిగా తపస్సులో మునిగి అతని మీద పుట్టా మొలిచి పాములూ వచ్చి, శరీరాన్ని క్రిమికీటకాలు తినివేసి ఉన్నప్పుడు వచ్చారు

తేషామతిబలోద్యోగం నిశమ్యాసురయూథపాః
వధ్యమానాః సురైర్భీతా దుద్రువుః సర్వతో దిశమ్

వారు విజృంభించగా అది తట్టుకోలేని రాక్షసులు వేరు వేరు దిక్కులకు పారిపోయారు

కలత్రపుత్రవిత్తాప్తాన్గృహాన్పశుపరిచ్ఛదాన్
నావేక్ష్యమాణాస్త్వరితాః సర్వే ప్రాణపరీప్సవః

తమ ప్రాణాలు కాపాడుకుంటే చాలని వేటినీ పట్టించుకోకుండా సైన్యాధికారులందరూ పారిపోయారు

వ్యలుమ్పన్రాజశిబిరమమరా జయకాఙ్క్షిణః
ఇన్ద్రస్తు రాజమహిషీం మాతరం మమ చాగ్రహీత్

దేవతలు నగరాన్ని స్వాధీనం చేసుకుంటే ఇంద్రుడు మా తల్లిని బంధించాడు

నీయమానాం భయోద్విగ్నాం రుదతీం కురరీమివ
యదృచ్ఛయాగతస్తత్ర దేవర్షిర్దదృశే పథి

అలా తీసుకుని వెళుతుంటే భగవత్సంకల్పముతో నారదుడు అక్కడికి వచ్చాడు

ప్రాహ నైనాం సురపతే నేతుమర్హస్యనాగసమ్
ముఞ్చ ముఞ్చ మహాభాగ సతీం పరపరిగ్రహమ్

వద్దు నాయనా ఈమెను చెరపట్టవద్దు. ఈమె ఎటువంటి అపరాధం చేయలేదు. పరుల భార్యను చెరబట్టడం మంచిది కాదు

శ్రీన్ద్ర ఉవాచ
ఆస్తేऽస్యా జఠరే వీర్యమవిషహ్యం సురద్విషః
ఆస్యతాం యావత్ప్రసవం మోక్ష్యేऽర్థపదవీం గతః

ఈమె గర్భములో హిరణ్యకశిపుని కొడుకు పెరుగుతున్నాడు. ప్రసవించేంత వరకూ నా దగ్గర పెట్టుకుని ప్రసవించిన తరువాత విడిచిపెడతాను

శ్రీనారద ఉవాచ
అయం నిష్కిల్బిషః సాక్షాన్మహాభాగవతో మహాన్
త్వయా న ప్రాప్స్యతే సంస్థామనన్తానుచరో బలీ

ఆ కడుపులో ఉన్నది పరమ భాగవతుడు. ఏమాత్రం కపటం లేని వాడు. అతన్ని నీవు ఏమీ చేయలేవు. అతను పరమ భక్తుడు. అందుకు గర్భములో ఉండగానే నీ కంటే బలవంతుడు.

ఇత్యుక్తస్తాం విహాయేన్ద్రో దేవర్షేర్మానయన్వచః
అనన్తప్రియభక్త్యైనాం పరిక్రమ్య దివం యయౌ

దేవర్షి వాక్యాన్ని మన్నిస్తూ దేవేంద్రుడు పరమాత్మ భక్తుడు ఉన్నాడని తెలుసుకుని, ఆమెకు ప్రదక్షిణం చేసి వెళ్ళాడు.

తతో మే మాతరమృషిః సమానీయ నిజాశ్రమే
ఆశ్వాస్యేహోష్యతాం వత్సే యావత్తే భర్తురాగమః

మా తల్లిని నారదుడు తన ఆశ్రమానికి తీసుకుని వచ్చి, నీ భర్త వచ్చేంత వరకూ నా ఆశ్రమములోనే ఉండమని చెప్పాడు

తథేత్యవాత్సీద్దేవర్షేరన్తికే సాకుతోభయా
యావద్దైత్యపతిర్ఘోరాత్తపసో న న్యవర్తత

నారదుని వద్ద ఎటువంటి భయం ఉండే అవకాశం లేదు కాబట్టి ఆమె ఆనందముగా అంగీకరించింది. తపస్సు అయ్యేంత వరకూ ఆ ఆశ్రమములోనే ఉన్నది

ఋషిం పర్యచరత్తత్ర భక్త్యా పరమయా సతీ
అన్తర్వత్నీ స్వగర్భస్య క్షేమాయేచ్ఛాప్రసూతయే

అక్కడ ఉన్నంత కాలం పరమభక్తితో నారదున్ని సేవించింది. తన గర్భం క్షేమముగా ఉండాలనీ, తాను కోరుకున్నప్పుడే ప్రసవించాలీ అని వరము కోరుకుంది.

ఋషిః కారుణికస్తస్యాః ప్రాదాదుభయమీశ్వరః
ధర్మస్య తత్త్వం జ్ఞానం చ మామప్యుద్దిశ్య నిర్మలమ్

ఆమె కోరిన కోరిక ప్రకారం నారదుడు రెండు వరాలనూ ప్రసాదించాడు. మా అమ్మగారికీ నాకూ, ఇద్దరికీ పనికొస్తుందనీ ధర్మమునూ తత్వ జ్ఞ్యానమునూ ఉపదేశించాడు.

తత్తు కాలస్య దీర్ఘత్వాత్స్త్రీత్వాన్మాతుస్తిరోదధే
ఋషిణానుగృహీతం మాం నాధునాప్యజహాత్స్మృతిః

ఇది జరిగి చాలా కాలం జరిగింది కాబట్టి, తాను స్త్రీ కాబట్టీ ఆ విషయం మరచిపోయింది. నారద మహర్షి అనుగ్రహం వలన నాకు ఆ జ్ఞ్యానం ఇప్పటికీ గుర్తు ఉంది

భవతామపి భూయాన్మే యది శ్రద్దధతే వచః
వైశారదీ ధీః శ్రద్ధాతః స్త్రీబాలానాం చ మే యథా

నా మాట మీద నమ్మకం ఉంటే మీకు కూడా అటువంటి అత్యుత్తమైన జ్ఞ్యానం కలుగుతుంది. స్త్రీలకైనా బాలకులకైనా ఎవరికైనా శ్రద్ధ ఉంటే జ్ఞ్యానం కలుగుతుంది.

జన్మాద్యాః షడిమే భావా దృష్టా దేహస్య నాత్మనః
ఫలానామివ వృక్షస్య కాలేనేశ్వరమూర్తినా

పుట్టుకా ఉనికీ పెరుగుటా తరుగుటా మారుటా నశించుటా అనే ఆరు భావములూ  శరీరానికి గానీ ఆత్మకు కాదు. ఒక చెట్టుకు పూవూ, పిందె, కాయా, పండూ, పండు రాలిపోవడం అనే వికారాలు ఉంటాయి. కాని ఇవి జరిగినా ఆ చెట్టుకు ఏమీ జరుగదు. అలాగే ఈ వికారాలన్నీ శరీరానికే గానీ ఆత్మకు కాదు.

ఆత్మా నిత్యోऽవ్యయః శుద్ధ ఏకః క్షేత్రజ్ఞ ఆశ్రయః
అవిక్రియః స్వదృఘేతుర్వ్యాపకోऽసఙ్గ్యనావృతః

ఆత్మ నిత్యమూ నాశము లేనిది, గుణాలు లేనిది, రెండవది అంటూ లేనిది, శరీరం యొక్క స్థితి స్వరూపాన్ని తెలుసుకునేది, ఎలాంటి వికారాలు లేనిది, తనను తాను తెలుసుకునేది. అంతటా వ్యాపించి ఉంటుంది గానీ వ్యాప్యమైన వాటితో సంగం ఉండదు

ఏతైర్ద్వాదశభిర్విద్వానాత్మనో లక్షణైః పరైః
అహం మమేత్యసద్భావం దేహాదౌ మోహజం త్యజేత్

ఇది ఆత్మ యొక్క పన్నెండు లక్షణాలు. ఈ లక్షణాలున్న ఆత్మను తెలియక శరీరం యందూ శరీరం కొరకూ శరీరం వలన వచ్చిన వారి యందు నాదీ నేనూ అన్న భావం వదిలిపెట్టలేరు. ఆత్మ కంటే శరీరం వేరు అని తెలుసుకున్న వారు దేహముతో వచ్చిన సంబంధీకులని నా వారు అనుకోడు. మోహం వలన పొందే ఈ బ్ర్హమను వదిలిపెడతాడు

స్వర్ణం యథా గ్రావసు హేమకారః క్షేత్రేషు యోగైస్తదభిజ్ఞ ఆప్నుయాత్
క్షేత్రేషు దేహేషు తథాత్మయోగైరధ్యాత్మవిద్బ్రహ్మగతిం లభేత

ఇది అందరికీ తెలియదు. బంగారం గనులలో ఉంటుంది, అంటే భూమిలోనే ఉంటుంది. అలా అని భూమిలో ఎక్కడ పడితే అది ఉండదు. ఎక్కడ ఉన్న రాయిని బాగా పరీక్షించి చూస్తే అది బంగారం అని తెలిసినవాడికి  బంగారం లభిస్తుందో, దహరాకాశ లక్షణం హృదయ లక్షణం తెలిసినవాడికి ఆత్మ గురించి తెలుసుతుంది. ఆత్మ తత్వం తెలిసిన వాడికే ఆత్మ జ్ఞ్యానం లభిస్తుంది. ఆత్మకు శరీరం క్షేత్రం. ఆధ్యాత్మ యోగముతో ఆ ఆత్మ జ్ఞ్యానాన్ని తెలుసుకుంటాడు.

అష్టౌ ప్రకృతయః ప్రోక్తాస్త్రయ ఏవ హి తద్గుణాః
వికారాః షోడశాచార్యైః పుమానేకః సమన్వయాత్

భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మహత్తూ అహంకారం ప్రకృతి, ఇవి అష్ట ప్రకృతి, మూడు గుణాలు (సత్వ రజ తమో), ఇవి కాక ఐదు జ్యాన ఐదు కర్మేంద్రియ పంచ భూతాలూ మనసు కలిపి పదహారు వికారాలు. ఇవి అన్నీ కలిపిన ఇరవై ఏడులో జీవుడు మాత్రం ఒక్కడే.

దేహస్తు సర్వసఙ్ఘాతో జగత్తస్థురితి ద్విధా
అత్రైవ మృగ్యః పురుషో నేతి నేతీత్యతత్త్యజన్

ఈ శరీరం సర్వ సంఘాతం. ఈ పైన చెప్పిన ఇరవై ఏడూ కలిస్తే దేహం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. స్థావరమూ జంగమమూ. కదిలేదీ కదలనిది. ఈ సముదాయములోనే ఆత్మను వెతికి పట్టుకోవాలి. లేదు లేదు అన్న అసత్యాన్ని విడిచిపెట్టి వెతకాలి.

అన్వయవ్యతిరేకేణ వివేకేనోశతాత్మనా
స్వర్గస్థానసమామ్నాయైర్విమృశద్భిరసత్వరైః

ఆత్మ ఉన్నట్లు ఎలా తెలుసుకోవాలి. అన్వయ వ్యతిరేకాలతో తెలుసుకోవాలి. ఆత్మ ఉంటేనే శరీరానికి ఉనికి. ఆత్మ లేకపోతే శరీరాన్ని మనమే విడిచిపెడతాము. వివేక జ్ఞ్యానముతో ఆత్మ వేరూ శరీరం వేరూ అన్న పరిశీలముతో తెలుసుకోవాలి. ఈ లోకములో కొన్నాళ్ళు ఉండీ, పరలోకములో కొన్నాళ్ళు ఉంటాము. స్వగ్రాది భావములు ఉన్నవీ అని ఒప్పుకుంటే ఆత్మ ఉన్నది అని ఒప్పుకోవాలి. పరలోకం ఉన్నది అని ఒప్పుకుంటే ఆత్మ ఉన్నది అని ఒప్పుకోవాలి. పరలోకం అనేది శరీరం పోయిన తరువాతే వస్తుంది.

బుద్ధేర్జాగరణం స్వప్నః సుషుప్తిరితి వృత్తయః
తా యేనైవానుభూయన్తే సోऽధ్యక్షః పురుషః పరః

బుద్ధికి మూడు వృత్తులు ఉంటాయి జాగరణ నిద్రపోవుటా కలలు గనుట. ఈ మూడు ఎవరికి గలవో వాడు ఆత్మ. అలా మేలుకొనే, కలలు గనే , నిద్రపోయేది బుద్ధి. నిద్రలో పరమాత్మతో జీవుడు చక్కగా కలిసిపోతాడు. ఇవి ఎవరితో అనుభవించబడుతున్నాయో వాడు దేహాధ్యక్షుడు. ఇవే మూడు. ఈ మూడూ బుద్ధి భేధాలు. ఈ మూడూ ఒప్పుకున్నామంటే శరీఎరం కంటే బుద్ధి కంటే మనసు కంటే ఆత్మ వేరే ఉన్నాడు. వేరే ఆత్మ లేకుంటే కలలూ రావు మెలుకువా లేదు. 

ఏభిస్త్రివర్ణైః పర్యస్తైర్బుద్ధిభేదైః క్రియోద్భవైః
స్వరూపమాత్మనో బుధ్యేద్గన్ధైర్వాయుమివాన్వయాత్

గాలి ఉన్నది అని ఎలా నమ్మాలి? వాసన బట్టి వాయును నమ్మాలి. వాయువు లేకుంటే వాసన ఉండదు. నిద్ర కానీ స్వప్నం కానీ మెలుకువ కానీ శరీరానికి కాదు. బుద్ధికి. ఆత్మ లేకుంటే బుద్ధి లేదు. వీటిని బట్టే ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి. శరీరమును బట్టే సంసారం. శరీరం రావడానికి బుద్ధే కారణం. 

ఏతద్ద్వారో హి సంసారో గుణకర్మనిబన్ధనః
అజ్ఞానమూలోऽపార్థోऽపి పుంసః స్వప్న ఇవార్ప్యతే

ఈ బుద్ధే మనం ఆచరించే కర్మలను బట్టీ, మనం అనుభవించే సంస్కారాన్ని బట్టి ఉంటుంది. సంసారం అజ్ఞ్యాన మూలం. శరీరం కంటే విడిగా ఉన్న ఆత్మ సంగతి తెలిసి కూడా శరీరమే ఆత్మ అని అపార్థం చేసుకుంటున్నాము. ఇదే అజ్ఞ్యానం. కలలో ఎలా ఐతే మనం కలలో ఉన్న వస్తువులను నిజం అనుకుంటున్నామో శరీరం ఆత్మ అనుకోవడం కూడా అంతే.

తస్మాద్భవద్భిః కర్తవ్యం కర్మణాం త్రిగుణాత్మనామ్
బీజనిర్హరణం యోగః ప్రవాహోపరమో ధియః

కర్మలను ఆచరించినా కర్తృత్వ బుద్ధి వదిలిపెట్టాలి. "నేను చేస్తున్నాను" అన్న భావన లేకుంటే కర్మ బద్ధించదు. సత్వ రజస్సూ తమస్సు గల కర్మలను బీజం (విత్తనం) లేకుండా చేయాలి. బుద్ధి యొక్క ప్రవాహాన్ని ఆపెయ్యాలి. బుద్ధిలో కలిగే సంస్కారముతో బుద్ధి ఏమేమి చేయాలని ఆలోచిస్తోందో అది ఆపెయ్యాలి. బుద్ధిలో నేనూ నాదీ అన్న సంస్కారం ఉంటే సంసారం ఉంటుంది. 

తత్రోపాయసహస్రాణామయం భగవతోదితః
యదీశ్వరే భగవతి యథా యైరఞ్జసా రతిః

అలా చేయడానికి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి గానీ అవి మనం చేయలేము. ఒక్క ఉపాయం మాత్రం చేయగలం. భగవంతుని మీద ప్రేమా భక్తీ ఉంటే మనం సంసారములో చిక్కుకోము. 

గురుశుశ్రూషయా భక్త్యా సర్వలబ్ధార్పణేన చ
సఙ్గేన సాధుభక్తానామీశ్వరారాధనేన చ

గురువుగారిని భక్తిగా సేవిస్తే పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. గురువే మనకు కనపడే దైవం. దొరికిన వస్తువు దాచుకుంటున్న కొద్దీ సంసారం మీద ఆసక్తి పెరుగుతుంది. దాని వలన ప్రీతీ ఆస్కతీ వాసనా సంస్కారం పెరుగుతుంది. దొరికింది దొరికినట్లు పరమాత్మకు గానీ గురువుగారికి గానీ సమర్పించాలి. సజ్జనుల సంగముతో పరమాత్మను ఆరాధించడముతో పరమాత్మ కథ యందు శ్రద్ధతో, పరమాత్మ గుణాను కీర్తనం చేయడముతో, పరమాత్మ పాద పద్మాలను ధ్యానం చేయడం వలన, పరమాత్మ అర్చామూర్తిని చూడటము వలనా, అర్చా మూర్తిని ఆరాధించడం వలనా

శ్రద్ధయా తత్కథాయాం చ కీర్తనైర్గుణకర్మణామ్
తత్పాదామ్బురుహధ్యానాత్తల్లిఙ్గేక్షార్హణాదిభిః

హరిః సర్వేషు భూతేషు భగవానాస్త ఈశ్వరః
ఇతి భూతాని మనసా కామైస్తైః సాధు మానయేత్

ఇవన్నీ కలిగితే అన్ని ప్రాణులలో పరమాత్మే ఉన్నాడు. పరమాత్మే నియామకుడు అనీ, అన్ని ప్రాణులూ పరమాత్మ స్వరూపాలే కాబట్టి ఆ ప్రాణుల అవసరాలు కూడా తీరుస్తాము. మనఃపూర్వకముగా ప్రీతితో సాధువులకు సమర్పించాలి, వారిని గౌరవించాలి. 

ఏవం నిర్జితషడ్వర్గైః క్రియతే భక్తిరీశ్వరే
వాసుదేవే భగవతి యయా సంలభ్యతే రతిః

అప్పుడు గానీ మనం అరిషడ్వర్గాన్ని జయించలేము. అప్పుడు భగవంతుని యందు భక్తి కలుగుతుంది. ఇలా చేస్తే పరమాత్మ యందు భక్తి కలుగుతుంది.

నిశమ్య కర్మాణి గుణానతుల్యాన్వీర్యాణి లీలాతనుభిః కృతాని
యదాతిహర్షోత్పులకాశ్రుగద్గదం ప్రోత్కణ్ఠ ఉద్గాయతి రౌతి నృత్యతి

పరమాత్మ యొక్క సాటి లేని లీలవతారములనూ, ఆయా గుణములనూ, కర్మలనూ విని, మహా ఆనందముతో శరీరం పులకించి ఆనందబాష్పాలతో శరీరం పొంగిపోయి గొతు బొంగురు పోయి అరుస్తాడు, ఆడతాడు పాడతాడు, దెయ్యం పట్టినవాడిలాగ ఉంటాడు. ఒక చో నమస్కారం చేస్తాడు. నారాయణా ముకుందా గోవిందా అని హరి నామములను పిలుస్తూ ఉంటాడు

యదా గ్రహగ్రస్త ఇవ క్వచిద్ధసత్యాక్రన్దతే ధ్యాయతి వన్దతే జనమ్
ముహుః శ్వసన్వక్తి హరే జగత్పతే నారాయణేత్యాత్మమతిర్గతత్రపః

తదా పుమాన్ముక్తసమస్తబన్ధనస్తద్భావభావానుకృతాశయాకృతిః
నిర్దగ్ధబీజానుశయో మహీయసా భక్తిప్రయోగేణ సమేత్యధోక్షజమ్

సంసారాన్ని పట్టించుకోకుండా పరమాత్మ నామ గుణ కర్మలను కీర్తిస్తూ ఉంటే సంసారం వదిలిపెట్టింది అని అర్థం. విత్తనం కూడా కాలిపోవాలి. విత్తు వెంట ఉండే మొలక (బీజ అనుశయః) కూడా లాగెయ్యాలి. ఆ మొత్తాన్ని తగలపెట్టాలి. అప్పుడే మొలక రాకుండా ఉంటుంది. గొప్ప భక్తి ప్రయోగముతో ఈ సంస్కారాన్ని (శరీరాన్ని కాదు) తగలపెట్టాలి. అలాంటప్పుడు మాత్రమే పరమాత్మను పొందుతాడు.

అధోక్షజాలమ్భమిహాశుభాత్మనః శరీరిణః సంసృతిచక్రశాతనమ్
తద్బ్రహ్మనిర్వాణసుఖం విదుర్బుధాస్తతో భజధ్వం హృదయే హృదీశ్వరమ్

పరమాత్మను పొందుట ఒక్కటే (అధోక్షజాలమ్భం) ఆత్మను అశుభాన్ని కలిగించే సంసార సంబంధాన్ని తొలగించేది. శరీరమునకూ ఆత్మకూ సంసార సంబంధం తొలగుటే మోక్షానందం అని చెబుతారు. అందుకు హృదయ పూర్వకముగా పరమాత్మను ధ్యానించండీ, స్మరించండి. 

కోऽతిప్రయాసోऽసురబాలకా హరేరుపాసనే స్వే హృది ఛిద్రవత్సతః
స్వస్యాత్మనః సఖ్యురశేషదేహినాం సామాన్యతః కిం విషయోపపాదనైః

ఆయనను ధ్యానించడం ఎంతో సులభం. మన హృదయ రంధ్రములోనే స్వామి ఉన్నాడు. అలాంటి పరమాత్మను చూడటానికి ప్రయాస ఏముంది. సకల ఆత్మకు ఆయన బంధువు. ఆయను వదిలిపెట్టి ఆత్మను సంసారములో బంధించేటటువంటి వాటి గురించి ప్రయత్నిస్తారు. 

రాయః కలత్రం పశవః సుతాదయో గృహా మహీ కుఞ్జరకోశభూతయః
సర్వేऽర్థకామాః క్షణభఙ్గురాయుషః కుర్వన్తి మర్త్యస్య కియత్ప్రియం చలాః

ధనమూ భార్యా భర్తా పశువులూ పుత్రాదులూ ఇల్లూ భూమీ ఏనుగూ గుర్రాలూ ధన కోశములూ అన్ని రకాల అర్థ కామాలూ క్షణ భంగురాలే. ఎందుకంటే అది సంపాదించినవాడే క్షణ కాలం ప్రాణములు గలవాడు. సంపాదించినవాడే స్థిరం కానప్పుడు వాడు సంపాదించిన ధనం ప్రీతిని కలిగిస్తాయా? 

ఏవం హి లోకాః క్రతుభిః కృతా అమీ క్షయిష్ణవః సాతిశయా న నిర్మలాః
తస్మాదదృష్టశ్రుతదూషణం పరం భక్త్యోక్తయేశం భజతాత్మలబ్ధయే

కాబట్టి, ఇవే కావు, ఇహ లోకములో సంపాదించేవే కాకుండా, యజ్ఞ్య యాగాలతో సంపాదించిన సత్కర్మలైనా శాశ్వతముగా ఉంటాయా? ఇహ లోకం ఎలా క్షణికమో పరలోకము కూడా అలాగే నశ్వరం. వృధా ప్రయాస మాత్రం మిగులుతుంది. కేవలం గొప్పలు మాత్రమే మిగులుతాయి. అవేవీ పరిశుద్ధులు కావు.

యదర్థ ఇహ కర్మాణి విద్వన్మాన్యసకృన్నరః
కరోత్యతో విపర్యాసమమోఘం విన్దతే ఫలమ్

ఎప్పుడూ ఎలాంటి దోషములూ చూడబడని వినబడని పరమాత్మని ఆశ్రయించి ఆనందించక పుట్టినప్పటినుంచీ తప్పులూ దూషణలూ నాశములే చూస్తారు. పరమాత్మ దగ్గర ఈ దోషాలేవీ ఉండవు. పరమాత్మ లబ్ధి కోసం చేయవలసినది భక్తి మాత్రమే.  ఏదో ఫలితం వస్తుందని భావించుకుంటూ మనిషి పనులు చేస్తాడు, కాని దానికి విపర్యయం కలుగుతుంది. సుఖం కోసం చేసే పని దుఃఖాన్ని ఇస్తుంది. భోగం వస్తుంది అనుకుంటే రోగం వస్తుంది. ఆస్తి చేకూరుతుందీ అనుకుంటే ఉన్నది కాస్తా పోతుంది. 

సుఖాయ దుఃఖమోక్షాయ సఙ్కల్ప ఇహ కర్మిణః
సదాప్నోతీహయా దుఃఖమనీహాయాః సుఖావృతః

పని చేసేవాడు సుఖం కలగాలని దుఃఖం తొలగాలని పని చేస్తాడు, కానీ నిరంతరం కోరిక కలుగుతున్న కొద్దీ దుఃఖమే ఏర్పడుతుంది. కోరిక ఉంటే దుఃఖం, కోరిక లేకపోతే సుఖం.

కామాన్కామయతే కామ్యైర్యదర్థమిహ పూరుషః
స వై దేహస్తు పారక్యో భఙ్గురో యాత్యుపైతి చ

ఏ ఏ ఆశలతో వేటి వేటిని మానవుడు కోరతాడో అవన్నీ శరీరానికే. ఆ శరీరం కూడా తనది కాదు. ఇతరులకు పరాధీనమై ఉన్నది, దానికోసం కోరికలు కోరి పనులు చేయడం అజ్ఞ్యానానికి పరాకాష్ఠ. కోరికలు కోరుతున్నకొద్దీ శరీరం యొక్క రాకపోకలు పెరుగుతాయి. మళ్ళీ రాకుండా ఉండాలి అంటే కోరికలు మానుకోవాలి. 

కిము వ్యవహితాపత్య దారాగారధనాదయః
రాజ్యకోశగజామాత్య భృత్యాప్తా మమతాస్పదాః

సంతానం భర్తా ఇల్లూ సంపదలూ రాజ్యం గజములూ దంతములూ వాహనములూ ఇవన్నీ "నావి" అన్న భావన వలన వచ్చినవి. కానీ వీటిలో ఏ భాగమూ ఆత్మకు చెందదు. 

కిమేతైరాత్మనస్తుచ్ఛైః సహ దేహేన నశ్వరైః
అనర్థైరర్థసఙ్కాశైర్నిత్యానన్దరసోదధేః

ఇవన్నీ అర్థములలా అనిపించే అనర్థములు. నష్టములని లాభములనుకుంటాము. పరమాత్మ నిత్యానంద స్వరూపుడు. ఆయన్ని వదిలి అజ్ఞ్యానులు దుఃఖాన్ని పొందుతున్నారు. 

నిరూప్యతామిహ స్వార్థః కియాన్దేహభృతోऽసురాః
నిషేకాదిష్వవస్థాసు క్లిశ్యమానస్య కర్మభిః

శరీరం ఆచరిస్తున్న పనుల వలనా, శరీరం పొందుతున్న సుఖ దుఃఖాల వలన ఆత్మకు ఏమైనా లాభం ఉందా? అన్ని సార్లు ఆత్మ శరీరాన్ని ధరించేట్లు చేస్తున్నాము. గర్భాదానం నుంచి మొదలుపెట్టి శ్మశానములో దహనం వరకూ ప్రతీ అవస్థలో పనులతో కష్టపడుతున్నాము. నిరంతరం కష్టపడుతూ ఆయా కర్మలు చేస్తూ ఉంటాడు. 

కర్మాణ్యారభతే దేహీ దేహేనాత్మానువర్తినా
కర్మభిస్తనుతే దేహముభయం త్వవివేకతః

ఈ కష్టం దేహముతో ఉన్నందుకు ఆత్మవి అనుకుంటాడు. ఆత్మను అనుసరించే దేహముతో అన్ని కష్టములూ పడుతూ, దేహముతో కర్మలు చేస్తూ, కర్మలతో దేహాన్ని ధరిస్తాడు. సమూలముగా దహించనంత వరకూ చేసిన కర్మల ఫలితాన్ని కొన్ని వందల, వేల దేహములతో అనుభవిస్తూ ఉంటాడు. 

తస్మాదర్థాశ్చ కామాశ్చ ధర్మాశ్చ యదపాశ్రయాః
భజతానీహయాత్మానమనీహం హరిమీశ్వరమ్

కోరికలేకుండా ధర్మ బుద్ధితో ఆచరించాలి, పరమాత్మ అర్పణ బుద్ధితో కర్మలు ఆచరించాలి, భగవదాజ్ఞ్యయా భగవత్ కైంకర్య రూపముగా ఆచరించాలి. భగవంతుంది పొందాలి అన్న కోరికతో ఆచరించాలి. కర్మలనీ భగవదారాధనా రూపముగా ఆచరించిన నాడు ఆ కర్మలు మనని బంధించవు. 

సర్వేషామపి భూతానాం హరిరాత్మేశ్వరః ప్రియః
భూతైర్మహద్భిః స్వకృతైః కృతానాం జీవసంజ్ఞితః

ప్రతీ ప్రాణికీ సఖుడూ ప్రియుడూ ఆత్మా, శాసకుడూ పరమాత్మే. పంచభూతములూ పంచ తన్మాత్రములూ పంచ జ్ఞ్యానేంద్రియములూ పంచ కర్మేంద్రియములూ పంచ విషయములూ అనే వీటి సంఘాతముతో శరీరమును చేసి అందులో ఆత్మను బంధిస్తున్నాము. ఆ బంధాన్ని పోగొట్టాలి. 

దేవోऽసురో మనుష్యో వా యక్షో గన్ధర్వ ఏవ వా
భజన్ముకున్దచరణం స్వస్తిమాన్స్యాద్యథా వయమ్

భగవంతున్ని దేవతలే ఆరాధించాలీ, మానవులే ఆరాధించాలి, యక్ష గంధర్వులే ఆరాధించాలి అన్న నియమం ఏమీ లేదు. అందుకు నేనే ఉదాహరణ. నేను రాక్షసున్నైనప్పటికీ పరమాత్మని ఆరాధిస్తూ ఆనందిస్తున్నాను. 

నాలం ద్విజత్వం దేవత్వమృషిత్వం వాసురాత్మజాః
ప్రీణనాయ ముకున్దస్య న వృత్తం న బహుజ్ఞతా

బ్రాహ్మణుడూ దేవతా ఋషీ కావాలనో సచ్చరిత్రా ఆచారం జ్ఞ్యానం కావాలని అనుకోకండి. 

న దానం న తపో నేజ్యా న శౌచం న వ్రతాని చ
ప్రీయతేऽమలయా భక్త్యా హరిరన్యద్విడమ్బనమ్

ఒక్క పరిశుద్ధమైన భక్తి ఒకటి ఉంటే చాలు. పరమాత్మ ఆనందిస్తాడు. భక్తి తప్ప మిగతావన్నీ ఆడంబరాలే. 

తతో హరౌ భగవతి భక్తిం కురుత దానవాః
ఆత్మౌపమ్యేన సర్వత్ర సర్వభూతాత్మనీశ్వరే

కాబట్టి రాక్షసులారా పరమాత్మ యందు భక్తి కలిగి ఉండండి. ఎలా నా యందు పరమాత్మ ఉన్నాడో అన్ని ప్రాణులలో పరమాత్మే ఉన్నాడు. ఎలా నాకు కష్టమూ దుఃఖమూ రావొద్దని ప్రార్థిస్తామో అందరికీ అలాగే ఉండాలని కోరుకోవాలి. 

దైతేయా యక్షరక్షాంసి స్త్రియః శూద్రా వ్రజౌకసః
ఖగా మృగాః పాపజీవాః సన్తి హ్యచ్యుతతాం గతాః

రాక్షసులూ యక్షులూ స్త్రీలూ మృగములూ పాపులూ మొదలైన వారందరూ పరమాత్మని ఆరాధించి పరమాత్మని పొందారు. నిష్కల్మషమైన భక్తితో పరమాత్మని ఆరాధిస్తే పరమాత్మను పొందుతారు

ఏతావానేవ లోకేऽస్మిన్పుంసః స్వార్థః పరః స్మృతః
ఏకాన్తభక్తిర్గోవిన్దే యత్సర్వత్ర తదీక్షణమ్

ప్రతీ ఆత్మకూ కల పరమ స్వార్థం ఒక్కటే. పరమాత్మ యందు ఏకాంత భక్తి ఉండుటే. ప్రతీ వారూ పరమాత్మ యందు ఏకాంత భక్తి కోరాలి. అదే కోరదగిన వస్తువు. అన్ని చోట్లా పరమాత్మనే చూడాలి. సకల చరాచర జగత్తులో పరమాత్మని చూచుటా, పరమాత్మ యందు ఏకాంత భక్తిని ఉంచుటా, ఈ రెండే ఆత్మకు పరమ స్వార్థములు. ఇవి కలిగి ఉండండి అని రాక్షస బాలురకు ప్రహ్లాదుడు ఉపదేశించాడు.