Pages

Thursday, 17 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ప్రథమాధ్యాయం

  ఓం నమో భగవతే వాసుదేవాయ 


శ్రీమద్భాగవతం దశమ స్కంధం ప్రథమాధ్యాయం

శ్రీరాజోవాచ
కథితో వంశవిస్తారో భవతా సోమసూర్యయోః
రాజ్ఞాం చోభయవంశ్యానాం చరితం పరమాద్భుతమ్

మీరు ఇంతవరకూ సూర్య వంశముల చరిత్రను, పరమ ఆశ్చర్యకరమైన వారి అద్భుత చరితాన్నీ, పరమ ధర్మశీలుడైన యదువు గురించీ చెప్పావు.

యదోశ్చ ధర్మశీలస్య నితరాం మునిసత్తమ
తత్రాంశేనావతీర్ణస్య విష్ణోర్వీర్యాణి శంస నః

అవతీర్య యదోర్వంశే భగవాన్భూతభావనః
కృతవాన్యాని విశ్వాత్మా తాని నో వద విస్తరాత్

పరమాత్మ శ్రీకృష్ణుని గురించి నాకు విస్తారముగా చెప్పవలసింది. సకల చరాచహ్ర విశ్వాన్నీ సృష్టించే పరమాత్మ యదువంశములో పుట్టి ఏమేమి పనులు చేసాడు

నివృత్తతర్షైరుపగీయమానాద్భవౌషధాచ్ఛ్రోత్రమనోऽభిరామాత్
క ఉత్తమశ్లోకగుణానువాదాత్పుమాన్విరజ్యేత వినా పశుఘ్నాత్

పరమాత్మ చరిత్ర వింటూ ఉండి చాలు అని ఎవరైనా అంటారు. ఆశ తొలగినవారి చేత గానం చేయబడేది ఆయన చరిత్ర. సంసారానికి మందు ఆయన చరిత్ర. కొన్ని మాటలు వినడానికి బాగుంటాయి, కొన్న్ని మాటలు మనసుకు బాగుంటాయి. కానీ స్వామి మాటలు రెంటికీ నచ్చుతాయి. చెవులకూ మనసుకూ సుందరమైనది స్వామి కథా. అటువంటి ఉత్తమ శ్లోకుడైన పరమాత్మ గుణాలను చెబుతుంటే కసాయి వాడు తప్ప ఎవరు చాలు అని అంటాడు

పితామహా మే సమరేऽమరఞ్జయైర్దేవవ్రతాద్యాతిరథైస్తిమిఙ్గిలైః
దురత్యయం కౌరవసైన్యసాగరం కృత్వాతరన్వత్సపదం స్మ యత్ప్లవాః

మా తాతగార్లైన వారు బీష్మాదులను గెలిచారు. అతిరథ మహారథులను గెలిచారు మా తాతగార్లు. కౌరవ సంగ్రామమనే సాగరములో తిమింగలముల వంటి వారైన బీష్మాదులని, అటువంటి కౌరవ సముద్రాన్ని ఏ మహానుభావున్ని పడవగా చేసుకుని దాటారో ఆయన గురించి చెప్పు. ఆయనను ఆశ్రయించడం వలన ఆ సముద్రం వారికి దూడ పాదం వంటిదైంది.
నన్ను ఏ మహానుభావుడు చక్రం ధరించి కడుపులో ఉండగా అశ్వద్ధామ అస్త్రం నుండి కాపాడాడో అటువంటి వాడు నాకు శరణం, వాడే నాకు రక్షకుడు.

ద్రౌణ్యస్త్రవిప్లుష్టమిదం మదఙ్గం సన్తానబీజం కురుపాణ్డవానామ్
జుగోప కుక్షిం గత ఆత్తచక్రో మాతుశ్చ మే యః శరణం గతాయాః

వీర్యాణి తస్యాఖిలదేహభాజామన్తర్బహిః పూరుషకాలరూపైః
ప్రయచ్ఛతో మృత్యుముతామృతం చ మాయామనుష్యస్య వదస్వ విద్వన్

ఎల్ల శరీర ధారులకూ లోపలా వెలుపలా ఉంటాడు స్వామి. హృదయములో పురుషునిగా, అంతర్యామిగా, ఉంటాడు. బయట కాలముగా ఉంటాడు. కనపడేది కాలం, కనపడకుండా ఉండేవాడు అంతర్యామి. మాయామానుష విగ్రహుడు, మృత్యువునూ ప్రసాదిస్తున్నాడు, మోక్షాన్నీ ప్రసాదిస్తున్నాడు. ఆ స్వామి యొక్క చరిత్రను నాకు వివరించండి

రోహిణ్యాస్తనయః ప్రోక్తో రామః సఙ్కర్షణస్త్వయా
దేవక్యా గర్భసమ్బన్ధః కుతో దేహాన్తరం వినా

రోహిణీ గర్భము యందు పుట్టిన బలరాముడే దేవకీ గర్భములో ఉన్నాడని చెప్పావు.  ఒకే జన్మలో ఒకే వ్యక్తి ఇద్దరి గర్భాలలో ఎలా ఉన్నాడు.

కస్మాన్ముకున్దో భగవాన్పితుర్గేహాద్వ్రజం గతః
క్వ వాసం జ్ఞాతిభిః సార్ధం కృతవాన్సాత్వతాం పతిః

పరమాత్మ మధురా నగరం నుండి వ్రేపల్లెకు ఎందుకు వెళ్ళాడు.బంధువులతో కలిసి ఆయన ఎక్కడ నివసించాడు.

వ్రజే వసన్కిమకరోన్మధుపుర్యాం చ కేశవః
భ్రాతరం చావధీత్కంసం మాతురద్ధాతదర్హణమ్

కృష్ణ పరమాత్మ మధురా నగరములో వ్రేపల్లెలో ద్వారకలో ఉండి ఏమేమి చేసాడు. తల్లి సోదరున్నీ, చంపదగని వాడిని ఎందుకు చంపాడు

దేహం మానుషమాశ్రిత్య కతి వర్షాణి వృష్ణిభిః
యదుపుర్యాం సహావాత్సీత్పత్న్యః కత్యభవన్ప్రభోః

మానవ శరీరాన్ని తీసుకుని యాదవులతో కలిసి ఎన్ని సంవత్సరములు మధురా నగరములో ద్వారకానగరములో ఉన్నారు. ఎంత మంది భార్యలు ఉన్నారు.

ఏతదన్యచ్చ సర్వం మే మునే కృష్ణవిచేష్టితమ్
వక్తుమర్హసి సర్వజ్ఞ శ్రద్దధానాయ విస్తృతమ్

నేను అడిగినవీ అడగనివీ కలిపి నాకు వివరించ వలసినది. నేను శ్రద్ధతో వింటున్నాను.

నైషాతిదుఃసహా క్షున్మాం త్యక్తోదమపి బాధతే
పిబన్తం త్వన్ముఖామ్భోజ చ్యుతం హరికథామృతమ్

సహించడానికి శక్యము గాని ఇంత పెద్ద ఆకలి కూడా నీరు కూడా మాని వేసిన నన్ను బాధించుట లేదు. నీ ముఖం అనే పద్మం నుండి జాలు వారుతున్న కృష్ణ కథామృతాన్ని పానం చేస్తున్న నాకు నీరు వదిలిపెట్టినా ఆక్లి కూడా బాధించుట లేదు. నేను మకరందాన్ని తాగుతున్నాను. నీ ముఖ పద్మం నుండి జాలు వారుతున్న కృష్ణ కథా మకరందాన్ని పానం చేస్తున్న నాకు ఆకలి దప్పుల బాధే లేదు.

సూత ఉవాచ
ఏవం నిశమ్య భృగునన్దన సాధువాదం
వైయాసకిః స భగవానథ విష్ణురాతమ్
ప్రత్యర్చ్య కృష్ణచరితం కలికల్మషఘ్నం
వ్యాహర్తుమారభత భాగవతప్రధానః

ఇంత బాగా అడిగాడు కాబట్టి అటువంటీ పరీక్షిత్తుకు విష్ణు రాతుడు బాగా అడిగావని మెచ్చుకున్నాడు. ఆ కృష్ణ చరితం కలి యొక్క దోషాలను హరిస్తుంది. భాగవతోత్తములందరిలో ముఖ్యుడైన శుకయోగీంద్రుడు కృష్ణ కథను చెప్పడానికి ఉపక్రమించాడు

శ్రీశుక ఉవాచ
సమ్యగ్వ్యవసితా బుద్ధిస్తవ రాజర్షిసత్తమ
వాసుదేవకథాయాం తే యజ్జాతా నైష్ఠికీ రతిః

నీవు బాగా సంకల్పించావు. మంచి నిర్ణయం తీసుకున్నావు. నీకు పరమాత్మ కథ వినడములో నిష్ఠతో కూడిన ప్రీతి కలిగింది.

వాసుదేవకథాప్రశ్నః పురుషాంస్త్రీన్పునాతి హి
వక్తారం ప్రచ్ఛకం శ్రోతౄంస్తత్పాదసలిలం యథా

పరమాత్మ యొక్క కథా ప్రశ్న ముగ్గురిని పవిత్రం చేస్తుంది. అడిగినవాడినీ చెప్పేవాడినీ వినేవాడినీ ముగ్గురినీ పవిత్రం చేస్తుంది, ఆయన పాదోదకం లాగ. గంగకూడా అందులో మునిగినవాడినీ, మునిగినవాడిని తాకినా పవిత్రం చేస్తుంది, గంగ నామస్మరణ కూడా పవిత్రం చేస్తుంది.

భూమిర్దృప్తనృపవ్యాజ దైత్యానీకశతాయుతైః
ఆక్రాన్తా భూరిభారేణ బ్రహ్మాణం శరణం యయౌ

ఈ భూదేవి బాగా మధించి ఉండి రాజుల ఆకారముతో ఉన్న రాక్షసుల చేత బాధపడుతూ (పరమాత్మ చేత వధించబడ్డా పూర్తి పాపం పోనందువలన రాజుల రూపములో పుట్టారు) సహించలేక బ్రహ్మను శరణు వేడింది ఒక ఆవు రూపములో కళ్ళ నీరు కారుస్తూ దయ కలిగేలా అరుస్తూ ఆయన దగ్గరకు వెళ్ళి  తాను పడుతున్న బాధను వివరించింది

గౌర్భూత్వాశ్రుముఖీ ఖిన్నా క్రన్దన్తీ కరుణం విభోః
ఉపస్థితాన్తికే తస్మై వ్యసనం సమవోచత

బ్రహ్మా తదుపధార్యాథ సహ దేవైస్తయా సహ
జగామ సత్రినయనస్తీరం క్షీరపయోనిధేః

బ్రహ్మ ఆవిషయం విని ఆవును తీసుకుని దేవతలందరినీ శంకరున్నీ వెంటబెట్టుకుని, క్షీరసాగరానికి వెళ్ళి

తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిమ్
పురుషం పురుషసూక్తేన ఉపతస్థే సమాహితః

వృషా కపి, దేవ దేవుడైన పరమాత్మను పురుష సూక్తముతో స్తోత్రం చేసాడు

గిరం సమాధౌ గగనే సమీరితాం నిశమ్య వేధాస్త్రిదశానువాచ హ
గాం పౌరుషీం మే శృణుతామరాః పునర్విధీయతామాశు తథైవ మా చిరమ్

అలా స్తోత్రం చేస్తే స్వామి కనపడలేదు కానీ ఆకాశం నుండి ఒక చక్కని మాట విన వచ్చింది. అది బ్రహ్మగారికి మాత్రమే వినపడింది.
మీరు చెప్పిన ఈ పురుషుని వాక్యాన్ని విని నేను చెప్పినది చేయండి. ఆలసించకండి

పురైవ పుంసావధృతో ధరాజ్వరో భవద్భిరంశైర్యదుషూపజన్యతామ్
స యావదుర్వ్యా భరమీశ్వరేశ్వరః స్వకాలశక్త్యా క్షపయంశ్చరేద్భువి

మీరు చెప్పకముందే భూమి యొక్క బాధ పరమాత్మ తెలుసుకున్నాడు. మొదలు మీరంతా యదువంశములో మీ మీ అంశలతో పుట్టండి. పరమాత్మ తన కళతో అవతరించి భూభారాన్ని తొలగించేంతవరకు మీరు మీ అంశతో అక్కడే ఉండాలి.

వసుదేవగృహే సాక్షాద్భగవాన్పురుషః పరః
జనిష్యతే తత్ప్రియార్థం సమ్భవన్తు సురస్త్రియః

పరమాత్మ వసుదేవుని ఇంటిలో పుడతారు. అతనికి ప్రీతి కలిగించడానికి దేవతా స్త్రీలందరూ మునులూ గోవులూ, ముందే అక్కడ అవతరించండి.

వాసుదేవకలానన్తః సహస్రవదనః స్వరాట్
అగ్రతో భవితా దేవో హరేః ప్రియచికీర్షయా

పరమాత్మ వాసుదేవ కళ ఐన ఆదిశేషుడు కూడా ఇతని కంటే ముందు పుడతాడు పరమాత్మకు ప్రీతి కలిగించడానికి

విష్ణోర్మాయా భగవతీ యయా సమ్మోహితం జగత్
ఆదిష్టా ప్రభుణాంశేన కార్యార్థే సమ్భవిష్యతి

ఏ యోగ మాయతో సకల జగత్తూ మోహించబడుతుందో ఆ పరమాత్మ యోగమాయ, పరమాత్మ చేత ఆజ్ఞ్యాపించబడి అవతరిస్తుంది

శ్రీశుక ఉవాచ
ఇత్యాదిశ్యామరగణాన్ప్రజాపతిపతిర్విభుః
ఆశ్వాస్య చ మహీం గీర్భిః స్వధామ పరమం యయౌ

బ్రహ్మ ఇలా వారిని ఓదార్చి, వారిని ఆజ్ఞ్యాపించి పరమాత్మను మళ్ళీ కీర్తించి వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు

శూరసేనో యదుపతిర్మథురామావసన్పురీమ్
మాథురాఞ్ఛూరసేనాంశ్చ విషయాన్బుభుజే పురా

శూరసేనుడు యదుపతి. మధురలో ఉంటూ మధుర దేశ సంపదను అనుభవించాడు. సకల యాదవులకూ రాజధాని మధురా నగరం

రాజధానీ తతః సాభూత్సర్వయాదవభూభుజామ్
మథురా భగవాన్యత్ర నిత్యం సన్నిహితో హరిః

ఆ నగరములో పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు (కూర్మావతారం మోహినీ వామన నారసింహ పరశురాముడూ రాముడూ శతృఘ్నుడు...సృష్టి ఆది నుండీ పరమాత్మ చేత విడవబడకుండా సేవించబడుతున్న నగరం మధురా)

తస్యాం తు కర్హిచిచ్ఛౌరిర్వసుదేవః కృతోద్వహః
దేవక్యా సూర్యయా సార్ధం ప్రయాణే రథమారుహత్

అలాంటి మధురా నగరములో ఒక సారి శూర సేనుని పుత్రుడైన వసుదేవుడు దేవకీ దేవిని పెళ్ళి చేసుకున్నాడు. కొత్త పెళ్ళి కూతురిని సూర్య అంటారు. ఆమెతో రథాన్ని అధిరోహించి తన నగరానికి వెళుతున్నాడు

ఉగ్రసేనసుతః కంసః స్వసుః ప్రియచికీర్షయా
రశ్మీన్హయానాం జగ్రాహ రౌక్మై రథశతైర్వృతః

ఉగ్రసేనుడి పుత్రుడైన కంసుడు చెల్లెలికి ప్రీతి కలిగించాలన్న భావానతో గుర్రాల పగ్గాలను తీసుకుని సారధ్యం వహించాడు. అతనిని సాగనంపడానికి వందల బంగారు రథాలు వెంట వచ్చాయి.

చతుఃశతం పారిబర్హం గజానాం హేమమాలినామ్
అశ్వానామయుతం సార్ధం రథానాం చ త్రిషట్శతమ్

నాలుగు వందల ఏనుగులను అల్లుడికి కానుకలుగా ఇచ్చాడు. పదివేల గుర్ర్రాలను ఇచ్చాడు. పద్దెనిమిది వందల రథాలను ఇచ్చాడు

దాసీనాం సుకుమారీణాం ద్వే శతే సమలఙ్కృతే
దుహిత్రే దేవకః ప్రాదాద్యానే దుహితృవత్సలః

బిడ్డ అంటే ప్రీతి చేత రెండు వందల మందిని దాసీ జనాన్ని ఇచ్చాడు.

శఙ్ఖతూర్యమృదఙ్గాశ్చ నేదుర్దున్దుభయః సమమ్
ప్రయాణప్రక్రమే తాత వరవధ్వోః సుమఙ్గలమ్

మంగళ వాద్యాలు మోగాయి ప్రయాణం ప్రారంభించినపుడు

పథి ప్రగ్రహిణం కంసమాభాష్యాహాశరీరవాక్
అస్యాస్త్వామష్టమో గర్భో హన్తా యాం వహసేऽబుధ

ఇలా మహోత్సాహముగా కంసుడు రథాన్ని తీసుకు వెళుతూ ఉంటే ఆకాశ వాణి ఇలా అంది. ఏ తోడ బుట్టువును ప్రేమతో తీసుకుపోతున్నావో, అజ్ఞ్యానీ,  ఈమె యొక్క అష్టమ గర్భము నిన్ను తీసుకుపోతుంది. (ఎనిమిదవ సంతానం కాదు, ఎనిమిదవ గర్భం. కృష్ణుడు దేవకికి ఏడవ కొడుకవుతాడు, కానీ ఎనీందవ గర్భము. గర్భాలైతే ఎనిమిది, సంతానం ఐతే ఏడు).

ఇత్యుక్తః స ఖలః పాపో భోజానాం కులపాంసనః
భగినీం హన్తుమారబ్ధం ఖడ్గపాణిః కచేऽగ్రహీత్

ఈ మాట విన్న భోజ వంశానికి కలంకం తెచ్చేవాడైన కంసుడు చెల్లెలిని కిందకు లాగి చంపడానికి కత్తి దూసాడు

తం జుగుప్సితకర్మాణం నృశంసం నిరపత్రపమ్
వసుదేవో మహాభాగ ఉవాచ పరిసాన్త్వయన్

ఇంత నీచమైన పని చేయడానికి వడిగట్టిన పేరుకు మాత్రమే మనిషిగా ఉన్నవాడు, సిగ్గు వదిలిన వాడితో వసుదేవుడు ఓదారుస్తూ ఇలా అన్నాడు

శ్రీవసుదేవ ఉవాచ
శ్లాఘనీయగుణః శూరైర్భవాన్భోజయశస్కరః
స కథం భగినీం హన్యాత్స్త్రియముద్వాహపర్వణి

శూర వంశం వారందరూ నిన్ను ఉత్తమ గుణవంతుడు అని పొగడుతున్నారు. భోజవంశానికి నీవు కీర్తిని తెస్తావని అంటున్నారు. అలాంటిది నీవు చెల్లెలిని చంపుతావా? స్త్రీ హత్యే పాపం, అందులో చెల్లెలిని చంపడమింకా పాపం, కొత్తగా పెళ్ళైన స్త్రీని చంపడం మరింత పాపం

మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహ జాయతే
అద్య వాబ్దశతాన్తే వా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః

మృత్యువు అందరికీ అనివార్యము కదా. నీ శరీరముతో బాటే మృత్యువు కూడా పుట్టింది. శరీరముతో కలిసే పుడుతుంది మృత్యువు. అది ఇవాళ రావొచ్చు, కాకుంటే నూరేళ్ళ తరువాత రావొచ్చు. అది తప్పదు.

దేహే పఞ్చత్వమాపన్నే దేహీ కర్మానుగోऽవశః
దేహాన్తరమనుప్రాప్య ప్రాక్తనం త్యజతే వపుః

శరీరం మరణిస్తే, శరీరములో ఉన్న ఆత్మ, ఈ శరీరముతో ఆచరించిన కర్మకు వశమై ఇంకో దేహం తీసుకుంటాడు. ఇంకో దేహాన్ని తీసుకునే ఈ దేహాన్ని విడిచిపెడతాడు.

వ్రజంస్తిష్ఠన్పదైకేన యథైవైకేన గచ్ఛతి
యథా తృణజలౌకైవం దేహీ కర్మగతిం గతః

లేపిన కాలు ముందు పెట్టి వెనక కాలు ఎలా తీస్తావో, కాలు మోపడానికి భూమి చూసిన తరువాతే ముందర కాలు తీసి, తీసిన కాలు వేసిన తరువాతే వెనక కాలు  తీస్తారు. కొత్త శరీరాన్ని చేరాకే ఉన్న శరీరాన్ని విడిచిపెడ్తాడు. గడ్డి పురుగు ఎలాగైతే ముందర రెండు కాళ్ళతో ముందర గడ్డి మీద పెట్టి, అది బరువు ఆపిన తరువాత వెనక కాళ్ళు తీస్తుందో మనం కూడా మనం ఉండటానికి ఒక శరీరం సిద్ధముగా ఉన్న తరువాతే ఇంకో శరీరం తీసుకుంటాము.

స్వప్నే యథా పశ్యతి దేహమీదృశం మనోరథేనాభినివిష్టచేతనః
దృష్టశ్రుతాభ్యాం మనసానుచిన్తయన్ప్రపద్యతే తత్కిమపి హ్యపస్మృతిః

మనం మెలకువ ఉన్నప్పుడు దేన్ని దేన్ని తలచుకున్నామో అవి కలలో వస్తాయి. దేన్ని మెలకువలో ఉన్నప్పుడు పొందలేవో దాన్ని కలలో పొందుతావు. ఒక సారి చూచిన దాన్నో ఒక సారి విన్నదాన్నో మనసుతో ఆలోచిస్తే అది కలలో వస్తుంది. అత్యాశకు గురైనవన్నీ కలలో వస్తాయి. కల అంటే అపస్మృతి (అపస్మారకం)

యతో యతో ధావతి దైవచోదితం మనో వికారాత్మకమాప పఞ్చసు
గుణేషు మాయారోచితేషు దేహ్యసౌ ప్రపద్యమానః సహ తేన జాయతే

పరమాత్మ చేత ప్రయోగించబడి ప్రేరేపించబడి ఈ శరీరం ఎల ఎలా వెళుతుందో, వికారాత్మకమైన మనసు ఐదు వృత్తుల యందూ పంచ భూతముల యందూ , శబ్దాది విషయముల యందూ ప్రకృతి వలన వచ్చిన వాటి యందు, వేటిని తలచిందో వేటిని కోరిందో వాటితో కలసి మరలా పుడ్తాడు


జ్యోతిర్యథైవోదకపార్థివేష్వదః
సమీరవేగానుగతం విభావ్యతే
ఏవం స్వమాయారచితేష్వసౌ పుమాన్
గుణేషు రాగానుగతో విముహ్యతి

అగ్ని వాయువుచేత ప్రేరేపించబడి నీటిలోనూ ఉంటుంది కట్టెలోనూ ఉంటుంది. దీపాన్ని నీటిలో వదిలిపెడతాము, గాలి వలన ఆ దీపం కదులుతుంది. మనం దీపం వెళుతూ ఉంది అంటాము. కానీ గాలి దీపాన్ని తీసుకుని పోతుంది. పంపేది గాలే. దీపం ఎక్కడికీ వెళ్ళదు. నీటికీ దీపానికి మధ్యన ప్రమిద ఉంది. జన్మకూ జన్మాంతరానికీ మధ్యన శరీరం ఉంది. మనం శరీరముతో ముందుకు పోతున్నామంటే మనం పోవట్లేదు, మన కర్మ తీసుకు పోతుంది. అలాగే దీపన్ని గాలి తీసుకుపోతుంది. శబ్దాది విషయముల  యందు  ఆశతో ప్రేమతో కోరికతో ఈ లోకములో ఉండి సంచరిస్తూ ఉంటాడు.

తస్మాన్న కస్యచిద్ద్రోహమాచరేత్స తథావిధః
ఆత్మనః క్షేమమన్విచ్ఛన్ద్రోగ్ధుర్వై పరతో భయమ్

నీవు చేసినా చేయకున్నా నీ కర్మ ఫలితం తప్పదు కాబట్టి ఎవ్వరికీ బుద్ధిమంతుడు ద్రోహం చేయకూడదు. తాను బాగుండాలి అంటే ఎదుటివారికి ద్రోహం చేయకూడదు. ద్రోహం చేసిన వాడికే ఎదుటివాడి వలన భయం కలుగుతుంది. చేయని వాడికి ఏ భయమూ ఉండదు.

ఏషా తవానుజా బాలా కృపణా పుత్రికోపమా
హన్తుం నార్హసి కల్యాణీమిమాం త్వం దీనవత్సలః

నీ చెల్లెలు చిన్న పిల్ల దీనురాలు బిడ్డలాంటిది. ఇలాంటి ఈమెను నీవు చంపతగవు

శ్రీశుక ఉవాచ
ఏవం స సామభిర్భేదైర్బోధ్యమానోऽపి దారుణః
న న్యవర్తత కౌరవ్య పురుషాదాననువ్రతః

ఇలాంటి అనేకమైన సామ వచనాలతో చెప్పినా గానీ పరమ దారుణమైన తన సంకల్పాన్ని మార్చుకోలేదు. వాడు అప్పటికే రాక్షసులను (పురుషాద - పుర్షులను తినేవారు) అనుసరించేవాడు. ఆకాశవాణి మాట వినగానే కంసునిలో రాక్షసుడు ఆవహించాడు

నిర్బన్ధం తస్య తం జ్ఞాత్వా విచిన్త్యానకదున్దుభిః
ప్రాప్తం కాలం ప్రతివ్యోఢుమిదం తత్రాన్వపద్యత

ఇంత చెప్పినా వినకుంటే వసుదేవుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి సమయానుగుణముగా ఏదైనా పని చేయాలి కదా అని

మృత్యుర్బుద్ధిమతాపోహ్యో యావద్బుద్ధిబలోదయమ్
యద్యసౌ న నివర్తేత నాపరాధోऽస్తి దేహినః

ఏమి చేసినా చావు రాకుండా ఉండటం కుదరదు కానీ మన బుద్ధి ఉన్నంతవరకూ మరణాన్ని తప్పించుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఐనా పోతే మన తప్పు ఉండదు. ప్రయత్నం చేసినా చావు తప్పకుంటే వీడి తప్పు ఉండదు

ప్రదాయ మృత్యవే పుత్రాన్మోచయే కృపణామిమామ్
సుతా మే యది జాయేరన్మృత్యుర్వా న మ్రియేత చేత్

ముందు ఈమెకు వచ్చిన మృత్యువును తప్పించాలి. అలా చేయాలంటే ఆ మృత్యువుకు ఈమెను కాకుండా ఈమె పుత్రులను ఇవ్వలి. కంసునికి ఆ పుత్రులను ఇస్తాను. నాకు పిల్లలు పుడతారు అన్న నియమం ఏమీ లేదు. ఒక వేళ పుట్టినా వారు కంఅసున్ని చంపుతారనీ నియమం లేదు. అంతలోపు వారే చావవచ్చు

విపర్యయో వా కిం న స్యాద్గతిర్ధాతుర్దురత్యయా
ఉపస్థితో నివర్తేత నివృత్తః పునరాపతేత్

అంతలోపల వీడే చావవచ్చు. పరమాత్మ విధానం మనకు తెలియరానిది. వచ్చింది కాస్తా పోతుంది. పోయినది కాస్తా వస్తుంది. చేతికందినది జారుతుంది, జారినది చేతిలోకి వస్తుంది.

అగ్నేర్యథా దారువియోగయోగయోరదృష్టతోऽన్యన్న నిమిత్తమస్తి
ఏవం హి జన్తోరపి దుర్విభావ్యః శరీరసంయోగవియోగహేతుః

కట్టెలో నిప్పు  ఉంటుంది, కట్టెలోనే ఉన్న నిప్పు ఆ కట్టెకు ఎప్పుడు అంటుకుంటుందో ఎవరినా చెబుతారా. ఈ శరీరమనే కట్టే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు కాలిపోతుందో ఎవరికి తెలుసు. మనం పుట్టాలన్నా చావాలన్నా భగవంతుదే కారణం. ఇలాగే శరీరం రావడం పోవడం స్వామి ఇష్టము.

ఏవం విమృశ్య తం పాపం యావదాత్మనిదర్శనమ్
పూజయామాస వై శౌరిర్బహుమానపురఃసరమ్

ప్రసన్నవదనామ్భోజో నృశంసం నిరపత్రపమ్
మనసా దూయమానేన విహసన్నిదమబ్రవీత్

ఈ విధముగా కంసున్ని పూజించి ప్రసన్నున్ని చేసుకుని సిగ్గులేని వాడిని బాధపడుతున్న మనసుతో నవ్వుతూ ఇలా అన్నాడు

శ్రీవసుదేవ ఉవాచ
న హ్యస్యాస్తే భయం సౌమ్య యద్వై సాహాశరీరవాక్
పుత్రాన్సమర్పయిష్యేऽస్యా యతస్తే భయముత్థితమ్

అశరీర వాణితో కలిగిన భయం ఈమె వలన కాదు కదా, ఈమె పుత్రుల వలన కదా. ఆ పుత్రులను నీకు ఇచ్చివేస్తాను

శ్రీశుక ఉవాచ
స్వసుర్వధాన్నివవృతే కంసస్తద్వాక్యసారవిత్
వసుదేవోऽపి తం ప్రీతః ప్రశస్య ప్రావిశద్గృహమ్

అలా చెప్పిన వసుదేవుని వాక్యం విని మెచ్చుకుని అలాగే అని వెళ్ళిపోయాడు

అథ కాల ఉపావృత్తే దేవకీ సర్వదేవతా
పుత్రాన్ప్రసుషువే చాష్టౌ కన్యాం చైవానువత్సరమ్

ఇలా కొంతకాలం గడిచిన తరువాత దేవకీ దేవి ఎనింది మంది కుమారులనూ కన్నది, అమ్మాయినీ కన్నది.

కీర్తిమన్తం ప్రథమజం కంసాయానకదున్దుభిః
అర్పయామాస కృచ్ఛ్రేణ సోऽనృతాదతివిహ్వలః

కీర్తి మంతుడు అనే మొదటి కొడుకుని అబద్దం అంటే భయపడే వసుదేవుడు కంసునికి అప్పగించాడు.

కిం దుఃసహం ను సాధూనాం విదుషాం కిమపేక్షితమ్
కిమకార్యం కదర్యాణాం దుస్త్యజం కిం ధృతాత్మనామ్

సజ్జనులు సహించలేనిదంటూ  ఉంటుందా.మొదటి సంతానం పుత్రుడైనా సరే ఇచ్చి వేసాడు. విజ్ఞ్యానులు కోరలేనిది ఉంటుందా. దుర్మార్గులకు చేయరాని పని ఉంటుందా. ధైర్యం కలవారు దేనిని వదిలిపెట్టాలి.

దృష్ట్వా సమత్వం తచ్ఛౌరేః సత్యే చైవ వ్యవస్థితిమ్
కంసస్తుష్టమనా రాజన్ప్రహసన్నిదమబ్రవీత్

వసుదేవుని సత్య పరిపాలను చూసి కంసుడు నవ్వుతూ ఇతనితో నాకు పనిలేదు అష్టమ గర్భం కదా నన్ను చంపేది.

ప్రతియాతు కుమారోऽయం న హ్యస్మాదస్తి మే భయమ్
అష్టమాద్యువయోర్గర్భాన్మృత్యుర్మే విహితః కిల

తథేతి సుతమాదాయ యయావానకదున్దుభిః
నాభ్యనన్దత తద్వాక్యమసతోऽవిజితాత్మనః

పిల్లవాడిని తీసుకు వెళ్ళమని చెప్పినా వసుదేవుడు సంతోషించలేదు. కంసుడు ఇంద్రియ నిగ్రం లేని వాడూ దుర్మార్గుడు.

నన్దాద్యా యే వ్రజే గోపా యాశ్చామీషాం చ యోషితః
వృష్ణయో వసుదేవాద్యా దేవక్యాద్యా యదుస్త్రియః

సర్వే వై దేవతాప్రాయా ఉభయోరపి భారత
జ్ఞాతయో బన్ధుసుహృదో యే చ కంసమనువ్రతాః

ఇలా ఒకరూ ఇద్దరూ అవుతూ ఉంటే కంసుడు చంపలేదు. నారద మహర్షి అక్కడికి వెళ్ళి, వ్రేపల్లెలో ఉండే నందుని దగ్గర నుండీ మొత్తం గొల్లవారు అందరూ దేవతలు, నీవూ నీవారూ రాక్షసులు. నిన్ను చంపడానికి వారు వచ్చారు.నీ క్షేమం కోరి చెబుతున్నాను. నీవు కాలనేమివి,రాక్షసుడవు. ఇదివరకు నిన్ను చంపాడు ఆయన. ఇలా నారదుని వలన విని

ఏతత్కంసాయ భగవాఞ్ఛశంసాభ్యేత్య నారదః
భూమేర్భారాయమాణానాం దైత్యానాం చ వధోద్యమమ్

ఇలా నారదుని వలన విని,

ఋషేర్వినిర్గమే కంసో యదూన్మత్వా సురానితి
దేవక్యా గర్భసమ్భూతం విష్ణుం చ స్వవధం ప్రతి

వీరంతా దేవతలా, వీరిని వధిస్తాను అని. దేవకి కడుపులో విష్ణువే పుడతాడు వాడు నిన్ను చంపుతాడు అని విని, తరువాతి వాడిని కాపాడుకోవడానికే మొదటి వాడిని నాకిచ్చి నమ్మకం పాతుకోవడానికి ప్రయత్నించాడు వసుదేవుడు అని నిర్ణ్యైంచుకుని

దేవకీం వసుదేవం చ నిగృహ్య నిగడైర్గృహే
జాతం జాతమహన్పుత్రం తయోరజనశఙ్కయా

వసుదేవుడూ దేవకీ బయటకు వెళ్ళకుండా కారాగారములో ఉంచి పుట్టినవారిని పుట్టినట్లు చంపివేసాడు.

మాతరం పితరం భ్రాతౄన్సర్వాంశ్చ సుహృదస్తథా
ఘ్నన్తి హ్యసుతృపో లుబ్ధా రాజానః ప్రాయశో భువి

రాజులు తమ పదవినీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి తల్లినీ తండ్రినీ సోదరులనూ తమ్ములనూ మిత్రులందరినీ లుబ్దులై అందరినీ చంపుకుంటారు. వారిక్ది మామూలే.

ఆత్మానమిహ సఞ్జాతం జానన్ప్రాగ్విష్ణునా హతమ్
మహాసురం కాలనేమిం యదుభిః స వ్యరుధ్యత

కంసుడు తను కాలనేమి అనీ, ముందు జన్మలో విష్ణువు తనను చంపాడనీ, మళ్ళీ చంపడానికి యదు వంశములో పుడుతున్నాడనీ, యదు వంశముతో కూడా వైరం పెట్టుకున్నాడు.

ఉగ్రసేనం చ పితరం యదుభోజాన్ధకాధిపమ్
స్వయం నిగృహ్య బుభుజే శూరసేనాన్మహాబలః

తన తండ్రి ఐన ఉగ్రసేనున్ని  చెరసాలలో బంధించి మొత్తం రాజ్యం తానే తీసుకున్నాడు

                               సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు