Pages

Tuesday, 8 April 2014

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
ఇతి వైరోచనేర్వాక్యం ధర్మయుక్తం స సూనృతమ్
నిశమ్య భగవాన్ప్రీతః ప్రతినన్ద్యేదమబ్రవీత్

అది విని స్వామి సంతోషించి అభినందించి ఇలా మాట్లాడుతున్నాడు 

శ్రీభగవానువాచ
వచస్తవైతజ్జనదేవ సూనృతం కులోచితం ధర్మయుతం యశస్కరమ్
యస్య ప్రమాణం భృగవః సామ్పరాయే పితామహః కులవృద్ధః ప్రశాన్తః

మహారాజా నీవు చెప్పిన మాట నిజమే. నీ కులానికి తగిన రీతిగా ధర్మ బద్ధముగా కీర్తిని పెంచే  విధముగా మాట్లాడావు. నీవు ఆచరించే ప్రతీ పనీ నీ గురువు ఐన భృగు మహర్షి చెప్పినదే ప్రమాణం, నీ తాతగారు ఇంకో ప్రమాణం. ఆ ప్రహ్లాదుడు కుల వృద్ధుడు, ప్రశాంతుడు. 

న హ్యేతస్మిన్కులే కశ్చిన్నిఃసత్త్వః కృపణః పుమాన్
ప్రత్యాఖ్యాతా ప్రతిశ్రుత్య యో వాదాతా ద్విజాతయే

ఈ కులములో బలహీనుడూ లోభి ఐనవాడు ఒక్కడూ ఉండడు. అడిగిన దాన్ని ఇస్తామని తిరస్కరించే స్వభావం నీ కులం వారిది కాదు

న సన్తి తీర్థే యుధి చార్థినార్థితాః పరాఙ్ముఖా యే త్వమనస్వినో నృప
యుష్మత్కులే యద్యశసామలేన ప్రహ్రాద ఉద్భాతి యథోడుపః ఖే

యుద్ధములో వెన్ను ఇచ్చి వెళ్ళరు. యుద్ధములో గానీ తీర్థములో గానీ యాచకులు అడిగినా లేదు అని అనరు. ఆకాశములో చంద్రునిలాగ ప్రహ్లాదుడు మీ కులానికి వెలుగు

యతో జాతో హిరణ్యాక్షశ్చరన్నేక ఇమాం మహీమ్
ప్రతివీరం దిగ్విజయే నావిన్దత గదాయుధః

అతని పిన తండ్రి హిర్ణ్యాక్షుడు ఒక్కడే భూమండలం మొత్తం సవాలు విసురుతూ తిరిగాడు. తనతో సాటి వచ్చే వీరుడే అతనికి కనపడలేదు

యం వినిర్జిత్య కృచ్ఛ్రేణ విష్ణుః క్ష్మోద్ధార ఆగతమ్
ఆత్మానం జయినం మేనే తద్వీర్యం భూర్యనుస్మరన్

అదే సమయములో శ్రీమహావిష్ణువు భూమి వెలికి తీసుతున్నాడు. అప్పుడు హిరణ్యాక్షుడు అడ్డు వస్తే కష్టపడి గెలిచాను అని అనుకున్నాడట విష్ణువు. హిరణ్యాక్షుని పరాక్రమం గుర్తు తెచ్చుకుని మాటి మాటికీ తన గెలుపునే తాను గెలుపుగా అంగీకరించలేకపోయాడు

నిశమ్య తద్వధం భ్రాతా హిరణ్యకశిపుః పురా
హన్తుం భ్రాతృహణం క్రుద్ధో జగామ నిలయం హరేః

తమ్మున్ని చంపిన విష్ణువును చంపుదామని వైకుంఠానికి యమునిలా వెళ్ళగా ఎలా తప్పించుకోవాలా అని ఆ మాయావి ఆలోచించి, మృత్యువులా నన్ను వీడు తరుముతున్నాడు అని 

తమాయాన్తం సమాలోక్య శూలపాణిం కృతాన్తవత్
చిన్తయామాస కాలజ్ఞో విష్ణుర్మాయావినాం వరః

వీడు పరాకు (తన వాడిని చూడలేడు, ఎదుటివారిని చూస్తాడు) కాబట్టి తన హృదయములో ప్రవేశించాడు

యతో యతోऽహం తత్రాసౌ మృత్యుః ప్రాణభృతామివ
అతోऽహమస్య హృదయం ప్రవేక్ష్యామి పరాగ్దృశః

ఏవం స నిశ్చిత్య రిపోః శరీరమాధావతో నిర్వివిశేऽసురేన్ద్ర
శ్వాసానిలాన్తర్హితసూక్ష్మదేహస్తత్ప్రాణరన్ధ్రేణ వివిగ్నచేతాః

అతను శ్వాస తీసుకుంటూ ఉంటే ఆ గాలిలో తాను చేరి హిరణ్యకశిపునిలో ఉద్విగ్న మనస్కుడై విష్ణువు దాక్కున్నాడు. అందుకే విష్ణువు కనపడకుంటే హిరణ్యకశిపుడు సింహనాదం చేసి అన్ని చోట్లా విష్ణువును వెతికాడు కానీ విష్ణువు కనపడలేదు. 

స తన్నికేతం పరిమృశ్య శూన్యమపశ్యమానః కుపితో ననాద
క్ష్మాం ద్యాం దిశః ఖం వివరాన్సముద్రాన్విష్ణుం విచిన్వన్న దదర్శ వీరః

అపశ్యన్నితి హోవాచ మయాన్విష్టమిదం జగత్
భ్రాతృహా మే గతో నూనం యతో నావర్తతే పుమాన్

ఈ జగత్తంతా మాయ అని తెలుసుకున్నాడు. ఎక్కడికి పోతే తిరిగి రాడో అక్కడికే ఈ విష్ణువు వెళ్ళి ఉంటాడు

వైరానుబన్ధ ఏతావానామృత్యోరిహ దేహినామ్
అజ్ఞానప్రభవో మన్యురహంమానోపబృంహితః

చూసావా మమకారం అహంకారం నిండిన వారికి పగ అంటే ఇలా ఉంటుంది. శరీరం కలవారికి ఎలా మృత్యు భయం ఉంటుందో వైరం కూడా అలాగే ఉంటుంది. 

పితా ప్రహ్రాదపుత్రస్తే తద్విద్వాన్ద్విజవత్సలః
స్వమాయుర్ద్విజలిఙ్గేభ్యో దేవేభ్యోऽదాత్స యాచితః

కాబట్టీ అతని పుత్రుడైన ప్రహ్లాదుడు ఆ విషయం తెలుసు కాబట్టి బ్రాహ్మణుల యందు భక్తి కలిగి ఉన్నాడు. అతని కుమారుడైన నీ తండ్రి విరోచనుడు ఈ వైరములు అన్ని నశ్వరములు అని తెలుసుకున్నాడు. ఆ విరోచనున్ని గెలవలేక దేవతలు బ్రాహ్మణ వేషములో వచ్చి మీ ప్రాణం కావాలి అని అడుగగా అతను ఇచ్చాడు.మీ వంశం అంతా ఇలాంటిది. బ్రాహ్మణులకు మీ తండ్రి ప్రాణాలిచ్చాడు మీ తాతగారు మొత్తమూ ఇచ్చారు. 

భవానాచరితాన్ధర్మానాస్థితో గృహమేధిభిః
బ్రాహ్మణైః పూర్వజైః శూరైరన్యైశ్చోద్దామకీర్తిభిః

గృహస్థ ధర్మాలన్నీ నీవు ఆచరించావు. బ్రాహ్మ్ణులచేత ఆచరించావు. నీ వంశం అంతా శూరులు కీర్తిగలవారు.

తస్మాత్త్వత్తో మహీమీషద్వృణేऽహం వరదర్షభాత్
పదాని త్రీణి దైత్యేన్ద్ర సమ్మితాని పదా మమ

నీది అలాంటి ఉదార వంశం కాబట్టి మీ దగ్గర కొద్దిగా భూమిని యాచిద్దామని వచ్చాను. నా పాదముతో భూమిని కొలిచి మూడు పాదముల స్థలం నాకు కావాలి. నీవు వదాన్యుడవు (దాతవు),  ఐనా నాకు మూడు అడుగులు చాలు

నాన్యత్తే కామయే రాజన్వదాన్యాజ్జగదీశ్వరాత్
నైనః ప్రాప్నోతి వై విద్వాన్యావదర్థప్రతిగ్రహః

జ్ఞ్యానమున్న బ్రాహ్మణుడు దానం తీసుకోడు కదా అని నీవనవచ్చును గానీ ఎంత అవసరమో అంత తీసుకుంటే పాపం కాదు

శ్రీబలిరువాచ
అహో బ్రాహ్మణదాయాద వాచస్తే వృద్ధసమ్మతాః
త్వం బాలో బాలిశమతిః స్వార్థం ప్రత్యబుధో యథా

నీవు పిల్లవాడివే గానీ పెద్దలు మెచ్చే మాటలు మాట్లాడుతున్నావు.నీవు పిల్లవాడవు కాబట్టి నీ బుద్ధి కూడా అలాగే ఉంది. ఎంత కావాలో అంత తీసుకోవడం తప్పు కాదన్న నీకు, నీకెంత కావాలో తెలియదు

మాం వచోభిః సమారాధ్య లోకానామేకమీశ్వరమ్
పదత్రయం వృణీతే యోऽబుద్ధిమాన్ద్వీపదాశుషమ్

నేను త్రిలోకాధిపతిని, అలాంటి నన్ను మంచి మాటలతో మెప్పించావు. కావాలంటే సప్త ద్వీపాలున్న వసుధలో ఒక ద్వీపాన్ని ఇస్తాను. నాకు ఒక నియమం ఉంది. నా వద్దకు వచ్చి యాచించిన వాడు ఇంకొకసారి ఇంకెవరినీ యాచించకూడదు. మళ్ళీ నీవు ఎవరినీ యాచించనంతగా కావలసిన భూమిని యాచించు

న పుమాన్మాముపవ్రజ్య భూయో యాచితుమర్హతి
తస్మాద్వృత్తికరీం భూమిం వటో కామం ప్రతీచ్ఛ మే

శ్రీభగవానువాచ
యావన్తో విషయాః ప్రేష్ఠాస్త్రిలోక్యామజితేన్ద్రియమ్
న శక్నువన్తి తే సర్వే ప్రతిపూరయితుం నృప

ఒక సత్యం చెబుతాను విను. ప్రపంచములో ప్రతీ వాడినీ ఊరించి కోరిక పెంచే విషయాలు ఇంద్రియ నిగ్రహం లేనివానికి తృప్తి కలిగించ జాలవు.

త్రిభిః క్రమైరసన్తుష్టో ద్వీపేనాపి న పూర్యతే
నవవర్షసమేతేన సప్తద్వీపవరేచ్ఛయా

మూడు పదములతో తృప్తి పొందని వాడు భూమి మొత్తం ఇచ్చినా పొందనివాడు. తొమ్మిది వర్షాలతో ఉండి ఏడు ద్వీపములు కలిగిన భూమి ఇచ్చినా తృప్తి పొందలేడు

సప్తద్వీపాధిపతయో నృపా వైణ్యగయాదయః
అర్థైః కామైర్గతా నాన్తం తృష్ణాయా ఇతి నః శ్రుతమ్

కోరికలతో అర్థములతో ప్రపంచములో ఎవరూ ఆశను ముగించుకోలేరు. తన కోరిక ఎన్నడూ పూర్తిగా తీరదు.ఏది కోరక పరమాత్మ ప్రసాదించిన దానితో తృప్తి పొందిన వాడే ఆనందముగా ఉంటాడు 

యదృచ్ఛయోపపన్నేన సన్తుష్టో వర్తతే సుఖమ్
నాసన్తుష్టస్త్రిభిర్లోకైరజితాత్మోపసాదితైః

ఇంద్రియ నిగ్రహం లేనివాడిచేత ప్రసాదించబడే మూడులోకాలతో కూడా ఎవరూ తృప్తి పొందలేరు . ఇచ్చేవాడికీ పుచ్చుకునేవాడికీ ఇంద్రియ నిగ్రహం ఉండాలి. 

పుంసోऽయం సంసృతేర్హేతురసన్తోషోऽర్థకామయోః
యదృచ్ఛయోపపన్నేన సన్తోషో ముక్తయే స్మృతః

అర్థకామాల యందు తృప్తి పొందకపోవడమే సంసారానికి కారణం. భగవంతుడు ప్రసాదించిన దానితో తృప్తి పొందుట ముక్తికి కారణం. 

యదృచ్ఛాలాభతుష్టస్య తేజో విప్రస్య వర్ధతే
తత్ప్రశామ్యత్యసన్తోషాదమ్భసేవాశుశుక్షణిః

బ్రాహ్మణుడైన వాడికి ఆశ అసలు ఉండరాదు.పరమాత్మ అనుగ్రహముతో పొందిన దానితో తృప్తి పడే బ్రాహ్మణుడికి తేజస్సు పెరుగుతుంది. నీటిలో పుట్టిన బడబాగ్ని జలముతో  ఎలా చల్లారదో అసంతుష్టి ఉన్న వారికి ఎంత ఇచ్చినా ఆ కోరిక చల్లారదు

తస్మాత్త్రీణి పదాన్యేవ వృణే త్వద్వరదర్షభాత్
ఏతావతైవ సిద్ధోऽహం విత్తం యావత్ప్రయోజనమ్

కాబట్టి నాకు మూడు పదముల స్థలం మాత్రమే చాలు. నాకు ఈ మాత్రం చాలు. ఇదే నేను అనుకున్న ప్రయోజనాన్ని నెరవేరుస్తుందు 

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్తః స హసన్నాహ వాఞ్ఛాతః ప్రతిగృహ్యతామ్
వామనాయ మహీం దాతుం జగ్రాహ జలభాజనమ్

ఈ మాట విని బలి చక్రవర్తి నవ్వి ఒప్పుకున్నాడు. వామనుడికి భూమిని ఇవ్వడానికి జలపాత్రను తీసుకున్నాడు

విష్ణవే క్ష్మాం ప్రదాస్యన్తముశనా అసురేశ్వరమ్
జానంశ్చికీర్షితం విష్ణోః శిష్యం ప్రాహ విదాం వరః

అలా జలమును తీసుకున్న బలి చక్రవర్తిని చూచి శుక్రాచార్యులవారు వచ్చినవాడు విష్ణువు అని తెలుసుకున్నాడు. జ్ఞ్యానులలో గొప్పవాడు ఐన శుక్రాచార్యుడు ఇలా చెబుతున్నాడు

శ్రీశుక్ర ఉవాచ
ఏష వైరోచనే సాక్షాద్భగవాన్విష్ణురవ్యయః
కశ్యపాదదితేర్జాతో దేవానాం కార్యసాధకః

ప్రతిశ్రుతం త్వయైతస్మై యదనర్థమజానతా
న సాధు మన్యే దైత్యానాం మహానుపగతోऽనయః

ఈయన వామనుడిలా కనపడుతున్నా కశ్యపుని నుండి అథితికి దేవకారయం సాధించడానికి పుట్టిన నాశములేని వాడైన విష్ణువు . జరగబోయే అనర్థాన్ని తెలియని నీవు ఇతను అడిగిన దాన్ని ఇస్తా అని ప్రతిజ్ఞ్య చేసావు. ఇది దైత్యులకు మేలు చేకూర్చదు, ఆపద తెచ్చిపెడుతుంది

ఏష తే స్థానమైశ్వర్యం శ్రియం తేజో యశః శ్రుతమ్
దాస్యత్యాచ్ఛిద్య శక్రాయ మాయామాణవకో హరిః

ఈఎ దొంగ బ్రహ్మచారి నీ స్థానమూ ఐశ్వ్యరం సంపదా కీర్తీ చదువూ అన్ని తీసుకుని ఇంద్రునికి ఇచ్చివేస్తాడు

త్రిభిః క్రమైరిమాల్లోకాన్విశ్వకాయః క్రమిష్యతి
సర్వస్వం విష్ణవే దత్త్వా మూఢ వర్తిష్యసే కథమ్

ఈయన విశ్వకాయ్డు, ప్రపంచం మొత్తం ఆయన శరీరమే. ఇతని మూడు అడుగులతో ప్రపంచం మొత్తం ఆక్రమిస్తాడు. నీకున్నదంతా ఆయనకిచ్చి నీవెలా బ్రతుకుతావు

క్రమతో గాం పదైకేన ద్వితీయేన దివం విభోః
ఖం చ కాయేన మహతా తార్తీయస్య కుతో గతిః

ఒక పాదముతో భూమినీ ఇంకో పాదముతో ఆకాశాన్ని ఆక్రమిస్తాడు,మూడవ అడుగు ఎక్కడినుంచి తెస్తావు.మూడు అడుగులను నీవు ఇవ్వలేవు.ఎలాగా ఇవ్వలేని దానికి ఇపుడు ఒప్పుకోవడం ఎందుకు. ప్రతిజ్ఞ్య చేసినదాన్ని ఇవ్వకుంటే నరకం తప్పదు.నీవు అనుకున్నదాన్ని ఇవ్వలేవు.బతుకు తెరువుకు ఆపద  వచ్చే దానం దానం కాదు.

నిష్ఠాం తే నరకే మన్యే హ్యప్రదాతుః ప్రతిశ్రుతమ్
ప్రతిశ్రుతస్య యోऽనీశః ప్రతిపాదయితుం భవాన్

న తద్దానం ప్రశంసన్తి యేన వృత్తిర్విపద్యతే
దానం యజ్ఞస్తపః కర్మ లోకే వృత్తిమతో యతః

 దాన్ని ఎవరూ మెచ్చుకోరు. మనం మొదలు బతికి ఉంటే కదా తరువాత దానమైనా యజ్ఞ్యమైనా తపస్సైనా. దాని భంగం కలిగించే దానం దానం కాదు. గృహస్థుడు తాను సంపాదించిన దాన్ని ఐదుభాగాలుగా విభజించి, ధర్మానికీ కీర్తికీ అర్థానికీ కామానికీ తన వారిని పోషించడానికీ అని తాను సంపాదించిన ధనాన్ని విభజించాలి

ధర్మాయ యశసేऽర్థాయ కామాయ స్వజనాయ చ
పఞ్చధా విభజన్విత్తమిహాముత్ర చ మోదతే

అత్రాపి బహ్వృచైర్గీతం శృణు మేऽసురసత్తమ
సత్యమోమితి యత్ప్రోక్తం యన్నేత్యాహానృతం హి తత్

నేను చెప్పే మాట నా మాట కాదు. ఋగ్వేదముతో ఋక్ సూత్రముతో బోధించబడింది.ఇది నిజము అంటే సత్యం. అలా కానిది అనృతం

సత్యం పుష్పఫలం విద్యాదాత్మవృక్షస్య గీయతే
వృక్షేऽజీవతి తన్న స్యాదనృతం మూలమాత్మనః

ఇందులో ఆత్మ అనే వృక్షానికి సత్యమనేది పూలూ పళ్ళుగా చెబుతారు. పూలూ పళ్ళూ బాగుండాలి అంటే మొదలు చెట్టు బాగుండాలి. అది బాగుంటేనే కదా.  

తద్యథా వృక్ష ఉన్మూలః శుష్యత్యుద్వర్తతేऽచిరాత్
ఏవం నష్టానృతః సద్య ఆత్మా శుష్యేన్న సంశయః

చెట్టును మూలముతో సహా పెకిలిస్తే ఎలా ఎండిపోతుందో అలాగే అబద్దం అస్సలు ఆడకుండా ఉంటే ఆత్మ ఎండిపోతుంది 

పరాగ్రిక్తమపూర్ణం వా అక్షరం యత్తదోమితి
యత్కిఞ్చిదోమితి బ్రూయాత్తేన రిచ్యేత వై పుమాన్
భిక్షవే సర్వమోం కుర్వన్నాలం కామేన చాత్మనే

ప్రపంచములో శూన్యముగా ఉన్నా నిండకున్నా అలాంటి చోట కూడా "నాదగ్గర ఏమీ లేదు" అనకూడదు. ఇవ్వలేకపోయినా లేకపోయినా ఇస్తాను అనే చెప్పాలి. ప్రతీ సారీ లేకున్నా ఉన్నా అలాగే అంటే వాడు నష్టపోతాడు.కొంత ఉంచుకుని కొంత ఇవ్వాలి. వచ్చిన భిక్షుకులందరికీ అలాగే ఇస్తాను అంటే నీవెలా బతుకుతావు. నీ బతుకుకి సరిపోతుందా లేదా అని ఆలోచించు

అథైతత్పూర్ణమభ్యాత్మం యచ్చ నేత్యనృతం వచః
సర్వం నేత్యనృతం బ్రూయాత్స దుష్కీర్తిః శ్వసన్మృతః

లేదు అనే మాట అబద్దం అనిపిస్తుంది కానీ, అదే అసలైన తత్వం. మొదలు లేదు అని చెప్పి తరువాత కొంచెం ఇవ్వాలి. అలా చేస్తేనే బతుకు తెరువు గడుస్తుంది.

స్త్రీషు నర్మవివాహే చ వృత్త్యర్థే ప్రాణసఙ్కటే
గోబ్రాహ్మణార్థే హింసాయాం నానృతం స్యాజ్జుగుప్సితమ్

స్త్రీల విషయములో , ప్రేమ వివాహాలలో, బతుకు తెరువు కోసం, ప్రాణాలకు ఆపద వచ్చినపుడు గోబ్రాహ్మణుల కొరకూ అబద్దం ఆడుట తప్పు కాదు.