Pages

Sunday, 27 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఏడవ అధ్యాయం

         

  ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఏడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
తం వీక్ష్య కృషానుచరం వ్రజస్త్రియః
ప్రలమ్బబాహుం నవకఞ్జలోచనమ్
పీతామ్బరం పుష్కరమాలినం లసన్
ముఖారవిన్దం పరిమృష్టకుణ్డలమ్

ఉద్ధవుడు కూడా కృష్ణుడిలాగే ఉంటాడు. పీతాంబరధారి ఆజానుబాహుడు పద్మాక్షుడు పద్మాల ధరించిన వాడు, మణి కుండలాలు ప్రకాశించే ముఖ పద్మం పవిత్రం ఐన చిరునవ్వుతో శుభముగా కనపడుతున్నాడు

సువిస్మితాః కోऽయమపీవ్యదర్శనః
కుతశ్చ కస్యాచ్యుతవేషభూషణః
ఇతి స్మ సర్వాః పరివవ్రురుత్సుకాస్
తముత్తమఃశ్లోకపదామ్బుజాశ్రయమ్

గోపికలందరు ఎవరితను, కృష్ణుడిలాగే ఉన్నాడు , అవే ఆభరణాలు అదే రూపముతో ఉన్నాడు. అని ఉత్సాహం కలవారై

తం ప్రశ్రయేణావనతాః సుసత్కృతం సవ్రీడహాసేక్షణసూనృతాదిభిః
రహస్యపృచ్ఛన్నుపవిష్టమాసనే విజ్ఞాయ సన్దేశహరం రమాపతేః

అందరూ వెళ్ళి అతని చుట్టూ చేరగా, వారు ఆయనను సత్కరించి ఒక ఉన్నత ఆసనములో కూర్చోబెట్టి స్త్రీ సహజమైన చిరునవ్వుతో సిగ్గుతో
ఇలా అడిగారు. సింహాసనములో కూర్చోబెట్టగానే కృష్ణుడు పంపిన సందేశాన్ని తీసుకుని వచ్చిన వాడని తెలుసుకున్నాడు

జానీమస్త్వాం యదుపతేః పార్షదం సముపాగతమ్
భర్త్రేహ ప్రేషితః పిత్రోర్భవాన్ప్రియచికీర్షయా

మనకు బాగా కావలసిన వాడు మనకు దూరముగా వెళ్ళిపోతే వారు పంపినవారు మన దగ్గరకు సందేశం ఇవ్వడానికి వస్తే ఉండే అక్కసు ఇక్క్కడ కనపడుతుంది మనకు
నీవు కృష్ణుడి సేవకుడవు  అని మాకు తెలిసింది. అతను పంపితేనే వచ్చినట్లున్నావు. తల్లి తండ్రుల క్షేమం తెలుసుకోవాలని పంపినట్లుంది.

అన్యథా గోవ్రజే తస్య స్మరణీయం న చక్ష్మహే
స్నేహానుబన్ధో బన్ధూనాం మునేరపి సుదుస్త్యజః

అది కాకుంటే వ్రేపల్లెలో అంతకన్నా ఆయన గుర్తుంచుకోవలసిన వారెవరున్నారు. తల్లి తండ్రుల మీద మునులకు కూడా ప్రేమ ఉంటుంది.

అన్యేష్వర్థకృతా మైత్రీ యావదర్థవిడమ్బనమ్
పుమ్భిః స్త్రీషు కృతా యద్వత్సుమనఃస్వివ షట్పదైః

సహజముగా ఉండే ప్రేమ తల్లీ తండ్రుల మీద ఉంటుంది. తక్కిన వారి మీద అవసరం ఎంత వరకో అంత వరకే ప్రేమ ఉంటుంది
మగవారికి ఆడ వారి మీద ప్రేమ పూల మీద తుమ్మెదలకు ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది (మకరందం ఎంత వరకూ ఉంటుందో పూవు మీద అంతవరకూ ప్రేమ ఉంటుంది)

నిఃస్వం త్యజన్తి గణికా అకల్పం నృపతిం ప్రజాః
అధీతవిద్యా ఆచార్యమృత్విజో దత్తదక్షిణమ్

ఎవరెవరు ఎవరెవరిని ఎంతవరకూ వాడుకొని వదిలిపెడతారో ఇందులో చెప్పబడుతుంది. ఇవి సార్వకాలిక సత్యాలు
వేశ్యలు విటులను డబ్బు ఐపోగానే విడిచిపెడతారు
ప్రజలు సమర్ధుడు కాని రాజుని విడిచిపెడతారు
శిష్యులు చదువు ఐపోయిన తరువాత గురువును విడిచిపెడతారు
దక్షిణ ఇచ్చేదాకే యజమాని వద్ద ఋత్విక్కులు ఉంటారు

ఖగా వీతఫలం వృక్షం భుక్త్వా చాతిథయో గృహమ్
దగ్ధం మృగాస్తథారణ్యం జారా భుక్త్వా రతాం స్త్రియమ్

పళ్ళు ఉన్నంత వరకే పక్షులు ఆ చేట్టు మీద ఉంటాయి
అతిథులు ఇంటిలో భోజనం చేసే దాకే ఉంటారు
మృగములో కాలిపోయిన అడవిని వదలిపెడతారు
జారుడు తన ప్రియురాలిని అనుభవించేందవరకే వాడుకుంటాడు

ఇతి గోప్యో హి గోవిన్దే గతవాక్కాయమానసాః
కృష్ణదూతే సమాయాతే ఉద్ధవే త్యక్తలౌకికాః

పైకి మాత్రం కృష్ణుడి పేరు చెప్పకున్నా వాకూతో మనసుతో శరీరముతో నోటితో ఆయననే స్మరిస్తూ కృష్ణుడి దూత వచ్చాడనీ, ఆయనతో ఎలా మాట్లాడాలో కూడా తెలియక లౌకిక ధర్మాన్ని కూడా వదలిపెట్టారు.

గాయన్త్యః ప్రీయకర్మాణి రుదన్త్యశ్చ గతహ్రియః
తస్య సంస్మృత్య సంస్మృత్య యాని కైశోరబాల్యయోః

కృష్ణుడి చేతలు తలచుకుంటూ ఏడుస్తూ సిగ్గు విడిచిపెట్టి స్వామి యొక్క బాల్య కిశోర చేష్టలు తలచుకుంటూ ఇలా అన్నారు
దీన్ని భ్రమర సందేశం అంటారు. కృష్ణుడితో మాట్లాడవలసిన మాటలన్నీ తుమ్మెదతో మాట్లాడుతున్నారు. ఇవి కూడా భాగవతములో నిత్య పారాయణం చేసుకోవాలి. అపుడు చాలా కాలం తెలియకుండా తప్పిపోయిన వారు తప్పక వచ్చి కలుస్తారు.  ఒక ప్రియుడు ఇంకొంక ప్రియురాలి వద్దకు వెళ్ళిరాగా ఆ ప్రియురాలి వద్దకు వెళ్ళి వచ్చిన గుర్తులు కనపడుతున్నాయి. అపుడు ఆ ప్రియురాలు ఎలా మాట్లాడుతుందో ఇలా ఉంటుంది

కాచిన్మధుకరం దృష్ట్వా ధ్యాయన్తీ కృష్ణసఙ్గమమ్
ప్రియప్రస్థాపితం దూతం కల్పయిత్వేదమబ్రవీత్

గోప్యువాచ
మధుప కితవబన్ధో మా స్పృశఙ్ఘ్రిం సపత్న్యాః
కుచవిలులితమాలాకుఙ్కుమశ్మశ్రుభిర్నః
వహతు మధుపతిస్తన్మానినీనాం ప్రసాదం
యదుసదసి విడమ్బ్యం యస్య దూతస్త్వమీదృక్

కపట బంధువా నా పాదాన్ని ముట్టుకోకు. సవతి యొక్క వక్షస్థలములో అలంకరించబడిన కుంకుమ తాకిన నీ చేతులతో నా కాళ్ళు ముట్టుకోకు.
ఆ మధుపతి వారి వారి ప్రియురాళ్ళ అనుగ్రహాన్ని పొందనీ  నాకెందుకు. నీలాంటి వాడు దూతగా ఉన్నాడంటే అతను చాలా మంచివాడే.

సకృదధరసుధాం స్వాం మోహినీం పాయయిత్వా
సుమనస ఇవ సద్యస్తత్యజేऽస్మాన్భవాదృక్
పరిచరతి కథం తత్పాదపద్మం ను పద్మా
హ్యపి బత హృతచేతా హ్యుత్తమఃశ్లోకజల్పైః

ఒక్క సారి అదరామృతాన్ని పానం చేయించి మళ్ళీ వదలిపెట్టివెళ్ళాడు. ఇలాంటి వంచకుడి పాదపద్మాన్ని ఆమె (లక్ష్మీ దేవి) ఎలా సేవిస్తున్నది. అనవసరముగా ఆయన గురించి మంచి వారంతా చాలా చెప్పారు. అది  విని ఉంటుంది. అతను ఎలాంటి వాడో ఆమెకు తెలిసి ఉండదు.

కిమిహ బహు షడఙ్ఘ్రే గాయసి త్వం యదూనామ్
అధిపతిమగృహాణామగ్రతో నః పురాణమ్
విజయసఖసఖీనాం గీయతాం తత్ప్రసఙ్గః
క్షపితకుచరుజస్తే కల్పయన్తీష్టమిష్టాః

ఆరు పాదములు గల తుమ్మెద (ఇదంతా శ్రీవైష్ణవ సాంప్రదాయానికి మకుటాయమానం. ఆరు పాదములు గలది ద్వయమంత్రం. ద్వయ మంత్రం నిరంతరం పరమాత్మ పాద పద్మాలనే గుర్తుచేస్తుంది. మొట్టమొదట స్వామిని పట్టునుకునేది అమ్మవారే. లక్ష్మీ దేవికి కూడా పరమాత్మ యందు మనసు కలగాడనికి భాగవతులు గానం చేసిన భగవంతుని కళ్యాణ గుణములే కారణం. ఇక పామరులు పరమాత్మను గానం చేయకుండా ఎలా ఉంటారు. షట్పదీ అంటే ద్వయమంత్రం).
ఆరు పాదములు గల తుమ్మెద నీవు పరమాత్మను గానం చేస్తున్నావు. ఇల్లూ వాకిలీ లేని మా ముందర గానం చేస్తే ఏమి లాభం. నగరములో నాగరిక స్త్రీల దగ్గర గానం చేయి. మాకు ఇల్లూ వాకిలీ లేదు (పరమాత్మను నమ్ముకున్న వారికి ఇల్లూ వాకిలీ ఎలాగా ఉండదు. స్వామి కృప లభించినవారి సంపద అంతా స్వామి హరిస్తాడు. పరమాత్మ తప్ప మరి ఏదీ లేని వాళ్ళం అని అర్థం)
వారు ఎపుడు రమిస్తున్నాడో వారికి ఈ విషయం (కృష్నపరమాత్మ దొతను ఇంకొకరి వద్దకు పంపించాడన్న మాట వింటే) వారు కూడా ఆయనను బయటకు పంపించివేస్తారు. వారి దగ్గరకే వెళ్ళి గానం చేయి

దివి భువి చ రసాయాం కాః స్త్రియస్తద్దురాపాః
కపటరుచిరహాసభ్రూవిజృమ్భస్య యాః స్యుః
చరణరజ ఉపాస్తే యస్య భూతిర్వయం కా
అపి చ కృపణపక్షే హ్యుత్తమఃశ్లోకశబ్దః

మూడు లోకాలలో ఆయన పొందలేని స్త్రీ అంటూ ఉంటుందా. ఎంత కపటముగా నవ్వుతారు. కనుబొమ్మలు కదిలిస్తూ నవ్వే ఆ కపట నవ్వు చూస్తే ఎవరైనా ఆయనతో ప్రేమల్తో పడిపోకుండా ఉంటారా. ఆయన పాద పారగాన్ని లక్ష్మీ దేవే ధరిస్తుంది అంటే ఇంక మేమెంత.
దిక్కు లేని వారు ఆయనను ఉత్తముల చేత గానం చేయబడే వాడా అని పిలుస్తారా. కేవలం ఉత్తమ శ్లోకుడు అన్న శబ్దం మాత్రం మిగిలింది. అటువంటి వారు మాకెందుకు. భక్తుల చేత గానం చేయబడతాడన్న పేరే ఆయనకు కీర్తి. పరమ భాగవతోత్తముల వలననే భగవంతునికి కీర్తి

విసృజ శిరసి పాదం వేద్మ్యహం చాతుకారైర్
అనునయవిదుషస్తేऽభ్యేత్య దౌత్యైర్ముకున్దాత్
స్వకృత ఇహ విషృష్టాపత్యపత్యన్యలోకా
వ్యసృజదకృతచేతాః కిం ను సన్ధేయమస్మిన్

నీవు కృష్ణుని వలన కోపించిన ఆడువారిని ఎలా ఓదార్చాలో బాగా నేర్చుకున్నావు. వాటిని నీవు వదలిపెట్టు. అతని కోసం మేము భరతలనూ ఇల్లనూ సోదరులనూ అందరినీ వదలిపెట్టి వచ్చాము. అందరినీ మేము వదలిపెట్టి వస్తే ఆయన మమ్ము వదలివెళ్ళాడు

మృగయురివ కపీన్ద్రం వివ్యధే లుబ్ధధర్మా
స్త్రియమకృత విరూపాం స్త్రీజితః కామయానామ్
బలిమపి బలిమత్త్వావేష్టయద్ధ్వాఙ్క్షవద్యస్
తదలమసితసఖ్యైర్దుస్త్యజస్తత్కథార్థః

వేటగాడు మృగమును మాటు వేసి గొయ్యి తవ్వి ఎలా పడేస్తాడో ఆయన కూడా మమ్ము వేటాడి ఆయన బంధములో పడేసాడు
నల్ల ప్రేమలు చాలు. (నల్లని వాని ప్రేమ చాలు - అసితం అంటే నలుపు). అతని ప్రేమ వద్దనుకున్నా ఆయన కథ మాత్రం మేము విడిచిపెట్టలేకున్నాము. ఆయన కథా విశేషాలు వదలిపెట్టరానివి. ఆయనను మరచిపోదామన్నా ఆయన కథలను మరువలేకున్నాము

యదనుచరితలీలాకర్ణపీయూషవిప్రుట్
సకృదదనవిధూతద్వన్ద్వధర్మా వినష్టాః
సపది గృహకుటుమ్బం దీనముత్సృజ్య దీనా
బహవ ఇహ విహఙ్గా భిక్షుచర్యాం చరన్తి

ఈ తుమ్మెద యొక్క ఝంకార నాదాలని హాస విలాసాలను చూచి ఇంక ఇక్కడ మేమెందుకని పక్షులన్నీ చెట్లు వదలి వెళ్ళిపోతున్నాయి. తుమ్మెద యొక్క దూర్త చేష్టలను చూచి 'ఏకాంత రామలైనా పక్షులన్నీ చెట్లు వదలివెళ్ళిపోతున్నయి. భగవంతుని కథలను వినీ గానం చేసి, గానం చేసిన వాటిని వినీ, సంసారులు అందరూ వారి ఇళ్ళను విడిచి వెళుతున్నారు అని దీని భావం. కృష్ణుని ఆచరణమూ లీలలను తమ చెవులకు అమృత బిందువుల వలె విని ఆస్వాదించుట వలన అన్ని ద్వంద్వములనూ తోసి,, అన్నీ విడిచిపెట్టి ఇంటినీ కుటుంబాన్నీ అన్నీ విడిచిపెట్టి వారు దీనులై పక్షులవలె వారు కూడా భిక్షుకులు అవుతున్నారు. ఒక సారి పరామాత్మ యొక్క ఏ ఒక్క చిన్న కథా అమృతం చెవిలో పడగానే రాగ ద్వేషాది ద్వంద్వాలను వదలిపెట్టి ఇల్లు వదలి సన్యాసులవుతున్నారు. తుమ్మెదలు కూడా రకరకాల పుష్పాలలో మకరందాన్ని ఆస్వాదించడానికి అలవాటుపడి, ఆ తుమ్మెదల కమ్మని ఝంకారాన్ని విని ఆ పద్మాలు కూడా వాటి శోభనూ గృహకృత్యాలనూ వదలిపెట్టాయి. పక్షులు కూడా ఈ చెట్టునుండి ఆ చెట్టుకూ తిరుగ్తున్నాయి భిక్షుకులలాగ. ఈ పక్షులు చెట్లని వదలి వేరే చెట్లకు వెళుతున్నాయి అనడములో భిక్షుకులే పక్షులు లాగ వెళుతున్నారు అని అర్థం. వాక్యము వ్యంగ్యమూ కలసి ఉన్నాయి ఇందులో. గోపికలు ఒక్క సారి కృష్ణ పరమాత్మ వేణు గానములో ఒక్క అంసం వింటే భర్తలనూ పుత్రులనూ సోదరులనూ బంధువులనూ అన్నీ వదలిపెట్టి ఆయన దగ్గరకే ప్రేమ భిక్ష కోసం తిరుగుతారు.

వయమృతమివ జిహ్మవ్యాహృతం శ్రద్దధానాః
కులికరుతమివాజ్ఞాః కృష్ణవధ్వో హరిణ్యః
దదృశురసకృదేతత్తన్నఖస్పర్శతీవ్ర
స్మరరుజ ఉపమన్త్రిన్భణ్యతామన్యవార్తా

వాడు కపటి. ఆ కపటి మాటలు విని నిజం అనుకున్నాము. కులికరుతం : వేటాడే వాడు ఏ పక్షులను వేటాడ దలచుకుంటాడో చెట్టు చాటున దాక్కుని ఆ పక్షి గొంతుతో అరుస్తాడు. అది విని వేరే పక్షులన్నీ మా పక్షికి ఆపద వచ్చిందేమో అని వస్తాయి. అపుడు వేటగాడు వల వేసి వాటిని పడతాడు. దీన్ని కులికరుతం అంటారు. గోపికలు కూడా అతని చేష్టలు నిజం అని నమ్మి మోసపోయారు. ఇక ఇతరుల సంగతి ఏమని చెప్పాలి. ఇతరులు మోసపోరా.

ప్రియసఖ పునరాగాః ప్రేయసా ప్రేషితః కిం
వరయ కిమనురున్ధే మాననీయోऽసి మేऽఙ్గ
నయసి కథమిహాస్మాన్దుస్త్యజద్వన్ద్వపార్శ్వం
సతతమురసి సౌమ్య శ్రీర్వధూః సాకమాస్తే

ఇన్ని తప్పులు చేసి మళ్ళీ ఆయన ఇంకా మిమ్ము పంపాడా మా ప్రియ సఖుడు. చెప్పు ఇంకేమైనా మిగిలి ఉందా. ఇంకేమి కావాలి నీకు.
మళ్ళీ మమ్ములనూ జంటగా (రెండవ వారిగా) పంపుతావా (సవతిగా పంపుతావా). వక్షస్థలములో నిరంతరం ఆమె కూర్చునే ఉన్నది కదా.

అపి బత మధుపుర్యామార్యపుత్రోऽధునాస్తే
స్మరతి స పితృగేహాన్సౌమ్య బన్ధూంశ్చ గోపాన్
క్వచిదపి స కథా నః కిఙ్కరీణాం గృణీతే
భుజమగురుసుగన్ధం మూర్ధ్న్యధాస్యత్కదా ను

ఇపుడు మథురా పురములో ఉన్నాడా ఆయనా? తల్లి తండ్రులనూ బంధువులనూ జ్ఞ్యాపకం ఉంచుకున్నాడా. మా గురించి ఎపుడైనా మాట్లాడతాడా. ఆయన గంధము చేత సుగంధమైన భుజాన్ని మా శిరస్సున ఎపుడు ధరిస్తామో.

శ్రీశుక ఉవాచ
అథోద్ధవో నిశమ్యైవం కృష్ణదర్శనలాలసాః
సాన్త్వయన్ప్రియసన్దేశైర్గోపీరిదమభాషత

అది చూచిన ఉద్దవుడు. కృష్ణుని యందు వీరికి ఎంత ప్రేమ ఉంది. వారిని ఓదారుస్తూ ఇలా అంటున్నాడు

శ్రీద్ధవ ఉవాచ
అహో యూయం స్మ పూర్ణార్థా భవత్యో లోకపూజితాః
వాసుదేవే భగవతి యాసామిత్యర్పితం మనః

అమ్మా, మీరు ఎంత మహానుభావురాళ్ళు, మీరు పరిపూర్ణార్థులు, మీకు కావలసినది ఏమీ లేదు. మిమ్ము లోకాలన్నీ పూజిస్తాయి. ఆయనను కాదు మిమ్ము పూజిస్తాయి.
పరిపూర్ణముగా మీ మనసును భగవానునికే అర్పించారు

దానవ్రతతపోహోమ జపస్వాధ్యాయసంయమైః
శ్రేయోభిర్వివిధైశ్చాన్యైః కృష్ణే భక్తిర్హి సాధ్యతే

పరమాత్మ యందు భక్తి కలగాలంటే దానమూ వ్రతమూ తపమూ హోమమూ స్వాధ్యాయమూ జపమూ చేయాలి. అలాంటి పరమాత్మ యందు మీరు సాటి లేని భక్తి కలిగి ఉన్నారు.

భగవత్యుత్తమఃశ్లోకే భవతీభిరనుత్తమా
భక్తిః ప్రవర్తితా దిష్ట్యా మునీనామపి దుర్లభా

మీరు చూపే భక్తి మునులకు కూడా లభించదు.

దిష్ట్యా పుత్రాన్పతీన్దేహాన్స్వజనాన్భవనాని చ
హిత్వావృనీత యూయం యత్కృష్ణాఖ్యం పురుషం పరమ్

మీరు పుత్రులనూ భర్తలనూ దేహములనూ తనవారినీ సంపదలనూ అన్ని వదలిపెట్టి కృష్ణున్ని సేవించారు. సకల వేద శాస్త్ర పురాణాలు దేన్ని కలిగి ఉండాలని చెప్పారో దాన్ని మీరు పరిపూర్ణముగా పొంది ఉన్నారు

సర్వాత్మభావోऽధికృతో భవతీనామధోక్షజే
విరహేణ మహాభాగా మహాన్మేऽనుగ్రహః కృతః

కృష్ణ పరమాత్మ నన్ను పంపి నా మీద చాలా గొప్ప దయ చూపాడు. భగవంతుని ఎలా ప్రేమిస్తారో మిమ్ము చూస్తే తెలుస్తుంది. మిమ్ము దర్శింపచేయడానికి నన్ను మీ వద్దకు పంపి ఉంటాడు.

శ్రూయతాం ప్రియసన్దేశో భవతీనాం సుఖావహః
యమాదాయాగతో భద్రా అహం భర్తూ రహస్కరః

మీకు పరమ సుఖాన్ని కలిగించే పరమాత్మ పంపిన సందేశాన్ని వినండి. నేను భతృ కృత్యాన్ని రహస్యముగా చేసేవాడిని. ఆయన వార్తను మీకు చెబుతున్నాను.

శ్రీభగవానువాచ
భవతీనాం వియోగో మే న హి సర్వాత్మనా క్వచిత్
యథా భూతాని భూతేషు ఖం వాయ్వగ్నిర్జలం మహీ
తథాహం చ మనఃప్రాణ భూతేన్ద్రియగుణాశ్రయః

గోపికల్లారా మీరు నేనూ వేరుగా లేము.. మీతో నా వియోగం నాతో మీ వియోగం లేదు. ప్రాణులలో పంచభూతములు వేరూ ప్రాణులు వేరుగా ఉండనట్లుగా. నేను సర్వ భూతాంతర్యామిని. అలాంటపుడు వియోగం ఎక్కడిది.

ఆత్మన్యేవాత్మనాత్మానం సృజే హన్మ్యనుపాలయే
ఆత్మమాయానుభావేన భూతేన్ద్రియగుణాత్మనా

నేనే నాలో నన్నే సృష్టించుకుంటాను నన్నే కాపాడుకుంటాను నన్నే లయం చేసుకుంటాను.
నా యోగ మాయతో పంచ భూతాలుగా గుణాలుగా జ్ఞ్యానేంద్రియాలుగా కర్మేంద్రియాలుగా సత్వ రజస్తమో గుణాలుగా కనిపిస్తాను.

ఆత్మా జ్ఞానమయః శుద్ధో వ్యతిరిక్తోऽగుణాన్వయః
సుషుప్తిస్వప్నజాగ్రద్భిర్మాయావృత్తిభిరీయతే

ఏ గుణము లేనిదీ జ్ఞ్యాన స్వరూపంది సత్వాది గుణ రహితమైనది అన్నిటికన్నా విలక్షణం, ఏ గుణముతో అన్వయించేది కాదు ఈ ఆత్మ
జాగృత్ స్వప్న సుషుప్తీ అనే మూడు అవస్థలూ శరీరానికి గానీ ఆత్మకు కాదు. కానీ శరీరానికి ఉన్న అవస్థలు ఆత్మకు అని ఆత్మ భావిస్తుంది నా మాయతో

యేనేన్ద్రియార్థాన్ధ్యాయేత మృషా స్వప్నవదుత్థితః
తన్నిరున్ధ్యాదిన్ద్రియాణి వినిద్రః ప్రత్యపద్యత

లేచిన వారు నాకు ఇలా కల వచ్చింది అనిలేవగానే చెప్పుకుంటాడు. అలా మరణం నుండి పుట్టిన వాడు దేహం రాగానే ఉన్నవాటినన్నటినీ నాకు వచ్చాయి అని అనుకుంటాడు. దేహం రాగానే నేను మనిషినీ అనుకుంటాడు. కాబట్టి ఎవడు ఇంద్రియములను అరికట్టగలడో వాడు భగవంతుని మాయా ప్రభావాన్ని, స్వరూపాన్ని తెలుసుకోగలడు.

ఏతదన్తః సమామ్నాయో యోగః సాఙ్ఖ్యం మనీషిణామ్
త్యాగస్తపో దమః సత్యం సముద్రాన్తా ఇవాపగాః

నిద్ర లేని వాడికి కలలు రానట్లుగా. నిత్యమూ మేలుకొని ఉన్న వారికికలలు రావు. ఇంద్రియములను తన వశములో ఉంచుకున్నవారికి అనర్థాలు రావు. యోగముగానీ సాంఖ్యముగానీ ఇదే. ఇంద్రియజయమే. ఇంద్రియ జయం కంటే వేరేది ఏదీ లేదు.

అన్ని నదులకూ సముద్రం ఎలా చివరి మెట్టో తపస్సూ త్యాగమూ దమమూ సత్యమూ మొదలైనవాటిని ఇంద్రియ నిగ్రహమే చివరి మెట్టు. అది పొందకపోతే ఎన్ని తపస్సులు చేసినా ప్రయోజనం లేదు.

యత్త్వహం భవతీనాం వై దూరే వర్తే ప్రియో దృశామ్
మనసః సన్నికర్షార్థం మదనుధ్యానకామ్యయా

నేను ఇపుడు మీకు దూరముగా ఉన్నాను. నేను మీకు ప్రియుడను. మీరు కూడా నాకు ప్రియురాళ్ళు. నిరంతరం మీరు నన్ను స్మరించడానికి నేను మీ మనసుకు దగ్గరగా ఉండడానికే మీ కనులకు దూరముగా ఉన్నాను. నన్నే మీరు ధ్యానించ్డానికే అలా ఉన్నాను.

యథా దూరచరే ప్రేష్ఠే మన ఆవిశ్య వర్తతే
స్త్రీణాం చ న తథా చేతః సన్నికృష్టేऽక్షిగోచరే

దూరముగా ఉన్న ప్రియుని యందు మనసు ఉన్నట్లుగా కంటికి ఎదురుగా ఉన్న ప్రియుని మీద ఉండదు.

మయ్యావేశ్య మనః కృత్స్నం విముక్తాశేషవృత్తి యత్
అనుస్మరన్త్యో మాం నిత్యమచిరాన్మాముపైష్యథ

అన్నిటినీ వదలిపెట్టి మీ మనసును నా యందే ఉంచి ఎపుడూ నన్నే స్మరిస్తూ త్వర్గానే నన్ను చేరుకుంటారు.

యా మయా క్రీడతా రాత్ర్యాం వనేऽస్మిన్వ్రజ ఆస్థితాః
అలబ్ధరాసాః కల్యాణ్యో మాపుర్మద్వీర్యచిన్తయా

ఆ రోజు రాస గోష్ఠిలో ఎవరెవరు నన్ను చూడలేదో నాతో క్రీడించలేదో వారందరూ నన్ను తలచుకుంటూ నన్నే చేరారు. నాతో కలసి విహరించిన వారికంటే నాతో దూరముగా ఉండి నన్ను స్మరించినవారికే ముందుగా వైకుంఠప్రాప్తి లభించింది. మీకు పరమ పదం లభించడానికే నేను మీకు దూరముగా ఉన్నాను

శ్రీశుక ఉవాచ
ఏవం ప్రియతమాదిష్టమాకర్ణ్య వ్రజయోషితః
తా ఊచురుద్ధవం ప్రీతాస్తత్సన్దేశాగతస్మృతీః

కృష్ణ సందేశం ఉద్ధవుని ద్వారా విని అసలు విషయం జ్ఞ్యాపకం వచ్చి ఇలా అన్నారు

గోప్య ఊచుః
దిష్ట్యాహితో హతః కంసో యదూనాం సానుగోऽఘకృత్
దిష్ట్యాప్తైర్లబ్ధసర్వార్థైః కుశల్యాస్తేऽచ్యుతోऽధునా

అదృష్టం బాగుండి కంసుడు చనిపోయాడు. యాదవులకు పాపం చేసిన కంసుడు వధించబడ్డాడు, రాజ్యములో ఉన్న వారి బాధలు పోయాయి.

కచ్చిద్గదాగ్రజః సౌమ్య కరోతి పురయోషితామ్
ప్రీతిం నః స్నిగ్ధసవ్రీడ హాసోదారేక్షణార్చితః

కృష్ణుడు ఇపుడు అక్కడ ఉన్న పౌర స్త్రీలకు ప్రీతి కలిగిస్తున్నాడా

కథం రతివిశేషజ్ఞః ప్రియశ్చ పురయోషితామ్
నానుబధ్యేత తద్వాక్యైర్విభ్రమైశ్చానుభాజితః

ప్రేమంటే బాగా తెలిసిన వాడు , స్త్రీలకు ప్రీతి ఐన వాడు, ఇతని చేష్టలతో మాటలలతో ఇతని వలలో పడని స్త్రీలెవరుంటారు. అంత ఘాడముగా ప్రేమించే స్త్రీలు వస్తే ఈయనైనా ఎలా కాదంటాడు

అపి స్మరతి నః సాధో గోవిన్దః ప్రస్తుతే క్వచిత్
గోష్ఠిమధ్యే పురస్త్రీణామ్గ్రామ్యాః స్వైరకథాన్తరే

పరమాత్మ మమ్ములను అపుడపుడైనా తలచుకుంటున్నాడా. మేమంతా పల్లెటూరి వాళ్ళం మాకు నాగరికత తెలియదు కదా.
నాగరికత తెలిసిన స్త్రీల మధ్య ఉండి మమ్ము అపుడపుడైనా స్మరించుకుంటున్నాడా.

తాః కిం నిశాః స్మరతి యాసు తదా ప్రియాభిర్
వృన్దావనే కుముదకున్దశశాఙ్కరమ్యే
రేమే క్వణచ్చరణనూపురరాసగోష్ఠ్యామ్
అస్మాభిరీడితమనోజ్ఞకథః కదాచిత్

మెల్లెలూ మొల్లలూ సన్నజాజులూ. ఇలాంటి రకరకాల పుష్పముల శోభతో వెన్నెలతో మేము  పరమాత్మతో కలసి విహరించిన రాత్రులను స్వామి జ్ఞ్యాపకం చేసుకుంటున్నాడా. మళ్ళీ ఇక్కడకు వస్తాడా

అప్యేష్యతీహ దాశార్హస్తప్తాః స్వకృతయా శుచా
సఞ్జీవయన్ను నో గాత్రైర్యథేన్ద్రో వనమమ్బుదైః

ఇంద్రుడు మేఘములతో వనాన్ని తడిపినట్లుగా  బాధతో ఎండిపోయిన మాహృదయాలను తడపగలడా

కస్మాత్కృష్ణ ఇహాయాతి ప్రాప్తరాజ్యో హతాహితః
నరేన్ద్రకన్యా ఉద్వాహ్య ప్రీతః సర్వసుహృద్వృతః

శతృ సంహారం ఐపోయింది రాజ్యం లభించింది. ఇంక ఆయన ఎందుకు వస్తాడు
రాజు కాబట్టీ రాజ పుత్రికలను వివాహం చేసుకుని హాయిగా ఉంటాడు.

కిమస్మాభిర్వనౌకోభిరన్యాభిర్వా మహాత్మనః
శ్రీపతేరాప్తకామస్య క్రియేతార్థః కృతాత్మనః

వనాలలో ఉండే మాతో ఆయనకు ఏమి పని. ఆయన పరమాత్మ, ఆయనకంటూ ఏ కోరికలూ ఉండవు. ఆయన కొత్తగా పొందేదేదీ ఉండదు.

పరం సౌఖ్యం హి నైరాశ్యం స్వైరిణ్యప్యాహ పిఙ్గలా
తజ్జానతీనాం నః కృష్ణే తథాప్యాశా దురత్యయా

ఆశ లేకపోవడమే సౌఖ్యం అని పింగళ (అనే వేశ్య చెబుతుంది. అవధూత ఇరవై నాలుగు మంది గురువులలో ఒకరు. ) చెబుతుంది. అందరికంటే శ్రీమంతుడు లోపలే ఉంటే (హృదయములో) ఆయనను వదలి బయటి శ్రీమంతుల కోసం వెతుకుతున్నా అని అనుకుంటుంది పింగళ.
నిరాశ సుఖం అని తెలిసినా మాకింకా కృష్ణుని మీద ఆశ పోవడం లేదు. అది పోదు.

క ఉత్సహేత సన్త్యక్తుముత్తమఃశ్లోకసంవిదమ్
అనిచ్ఛతోऽపి యస్య శ్రీరఙ్గాన్న చ్యవతే క్వచిత్

అలాంటి పరమాత్మను విడిచిపెట్టాలి అని అనుకునేవాడు ఎవడు. అనిత్యమైన లక్ష్మీ దేవి కూడా స్వామిని వదలిపెట్టక ఆశ్రయించి ఉంటుంది. అలంటి స్వామిని ఎవరు కాదనుకుంటారు.

సరిచ్ఛైలవనోద్దేశా గావో వేణురవా ఇమే
సఙ్కర్షణసహాయేన కృష్ణేనాచరితాః ప్రభో

అణువణువు చూసినా ఆయనే కనపడతాడు, పర్వతాలూ గడ్డిపోచలూ గోవులూ ఏది చూసినా అయానే కనపడతాడు. ఇదంతా బలరామునితో కలసి ఆయన సంచరించిన ప్రాంతమే.

పునః పునః స్మారయన్తి నన్దగోపసుతం బత
శ్రీనికేతైస్తత్పదకైర్విస్మర్తుం నైవ శక్నుమః

ఎంత వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాయి.
అమ్మవారి శోభను  పెంచే స్వామి యొక్క అడుగుల జాడలను చూస్తూ ఉంటే స్వామిని మరచిపోలేకపోతున్నాము.

గత్యా లలితయోదార హాసలీలావలోకనైః
మాధ్వ్యా గిరా హృతధియః కథం తం విస్మరామ హే

తీయని మాటలతో మా మనసును హరించిన స్వామిని మేము ఎలా మరచిపోతాము

హే నాథ హే రమానాథ వ్రజనాథార్తినాశన
మగ్నముద్ధర గోవిన్ద గోకులం వృజినార్ణవాత్

ఈ శ్లోకాన్ని రోజూ అనుసంధానం చేసుకుంటే సంసారములో ఏ చిక్కులూ రావు.  ఇది మంత్రం.
మనకూ లక్ష్మీ దేవికీ వ్రేపల్లెకూ నాధుడు ఆయన. అందరి ఆర్తినీ పోగొట్టే స్వామి. దుఃఖం అనే సముద్రములో ఉన్న పశువులం మేము. మమ్ము ఉద్ధరించు. ఇది  రోజు చదువుకుంటూ ఉంటే మనకు రోజూ సంసారములో ఉండే చిక్కులు రావు.

శ్రీశుక ఉవాచ
తతస్తాః కృష్ణసన్దేశైర్వ్యపేతవిరహజ్వరాః
ఉద్ధవం పూజయాం చక్రుర్జ్ఞాత్వాత్మానమధోక్షజమ్

తరువాత, వారంతా కృష్ణపరమాత్మ సందేశముతో వారి విరహ బాధ తొలగిపోగా, ఉద్ధవున్ని పూజించారు. ఉద్ధవున్ని కృష్ణ పరమాత్మగానే భావించి పూజించారు.

ఉవాస కతిచిన్మాసాన్గోపీనాం వినుదన్శుచః
కృష్ణలీలాకథాం గాయన్రమయామాస గోకులమ్

ఈ ఉద్ధవుడు కూడా కొన్ని నెలలు వారితో బాటే వారు పాడుతున్న కృష్ణ లీలలను వింటూ వ్రేపల్లెలోనే ఉన్నాడు. తాను కూడా కృష్ణ కథలను గానం చేస్తూ గోకులాన్ని ఆనందింపచేస్తూ అక్కడే ఉన్నాడు

యావన్త్యహాని నన్దస్య వ్రజేऽవాత్సీత్స ఉద్ధవః
వ్రజౌకసాం క్షణప్రాయాణ్యాసన్కృష్ణస్య వార్తయా

ఎన్ని నెలలు ఉద్ధవుడు వ్రేపల్లెలో ఉన్నాడో అన్ని నెలలూ వ్రేపల్లె వాసులకు కృష్ణ పరమాత్మ కథాలాపాలతో క్షణ కాలములా గడచిపోయాయి

సరిద్వనగిరిద్రోణీర్వీక్షన్కుసుమితాన్ద్రుమాన్
కృష్ణం సంస్మారయన్రేమే హరిదాసో వ్రజౌకసామ్

నదులనూ పర్వతములనూ లోయలనూ వనములనూ పూసినటువంటి చెట్లనూ హరిదాసుడైన ఉద్ధవుడు వ్రేపల్లె వాసులకు కృష్ణున్నే జ్ఞ్యాపకం చేయిస్తూ తిరిగాడు. వారికి కృష్ణ సాక్షాత్కారం కలిగించాడు.

దృష్ట్వైవమాది గోపీనాం కృష్ణావేశాత్మవిక్లవమ్
ఉద్ధవః పరమప్రీతస్తా నమస్యన్నిదం జగౌ

ఇలా ఉద్ధవుడు అన్ని రోజులు ఉండి కృష్ణ పరమాత్మ యందు గోపికలకున్న అనన్యమైన భక్తిని చూచి పరమ ప్రీతితో పరమానందాన్ని పొంది ఆ గోపిలకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఇలా చెప్పాడు

ఏతాః పరం తనుభృతో భువి గోపవధ్వో
గోవిన్ద ఏవ నిఖిలాత్మని రూఢభావాః
వాఞ్ఛన్తి యద్భవభియో మునయో వయం చ
కిం బ్రహ్మజన్మభిరనన్తకథారసస్య

ఎంత మహానుభావులు ఈ గోపికలు. దేహధారులు. ఈ గోపికలు సకల జగదంతర్యామి ఐన పరమాత్మ మీద అన్ని భావాలు నిలిపి ఉన్నవారు. సంసారం అంటే భయపడే మునులూ మేమూ ఎలాంటి భక్తి భావం కావాలి అని మేము కోరుకుంటున్నామో అలాంటి భకతి భావం కలిగి ఉన్నారు
బ్రహ్మ జన్మ ఎందుకు. ఇలాంటి జన్మ ఎత్తితే చాలు. ఇది ఉండగా ఆ బ్రహ్మపుట్టుక ఎందుకు.

క్వేమాః స్త్రియో వనచరీర్వ్యభిచారదుష్టాః
కృష్ణే క్వ చైష పరమాత్మని రూఢభావః
నన్వీశ్వరోऽనుభజతోऽవిదుషోऽపి సాక్షాచ్
ఛ్రేయస్తనోత్యగదరాజ ఇవోపయుక్తః

అడవిలో తిరిగే వారు, చూచేవారికి వ్యభిచారముతో దుష్టులుగా కనపడుతున్నారు. పరమాత్మ ఐన కృష్ణుని యందు దృఢమైన ప్రేమ భక్తి భావముతో ఉన్నారు
పరమాత్మ ఎంత దయా మయుడంటే ఏమీ తెలియకుండా సేవించినా స్వామి మోక్షన్నిస్తాడు. తెలియకున్నా వాడిన మందు (అగదరాజ) రోగాన్ని పోగొట్టినట్లుగా. మనకు ముక్తిని ప్రసాదిస్తాడు

నాయం శ్రియోऽఙ్గ ఉ నితాన్తరతేః ప్రసాదః
స్వర్యోషితాం నలినగన్ధరుచాం కుతోऽన్యాః
రాసోత్సవేऽస్య భుజదణ్డగృహీతకణ్ఠ
లబ్ధాశిషాం య ఉదగాద్వ్రజవల్లభీనామ్

గోపికలకు లభించిన ఈయోగం అమ్మవారికి కూడా లభించలేదు. ఈ అనుగ్రహం, నిరంతరం పరమాత్మనే ఆరాధించే అమ్మవారికి కూడా లభించలేదు. పారిజాత పుష్ప వాసనలు ఉన్న స్వర్గ స్త్రీలకు కూడా లభించలేదు. ఇక వేరే వారి గురించి చెప్పాలి. రాస లీలలో పరమాత్మ భుజ దండము చేత కంఠము ఆలింగనం చేసుకోబడింది. అటువంటి గోపికా స్త్రీలందరినుండి ఎలాంటి సతోషం కలిగిందో, అటువంటి సంతోషాన్ని కలిగించిన భగవానుని ప్రసాదం అమ్మవారికీ దేవతా స్త్రీలకూ లేదు.

ఆసామహో చరణరేణుజుషామహం స్యాం
వృన్దావనే కిమపి గుల్మలతౌషధీనామ్
యా దుస్త్యజం స్వజనమార్యపథం చ హిత్వా
భేజుర్ముకున్దపదవీం శ్రుతిభిర్విమృగ్యామ్

అందుకే నేనిక్కడే ఉండాలని ఉంటే ఉండనీయడు స్వామి, కానీ కనీసం వచ్చే జన్మలో ఐనా నేను ఈ బృందావనములో గోపికల పాదముల చే తొక్క పడే గడ్డిపోచలలో నేను కూడా ఒక చిన్న గడ్డిపోచ పుడితే చాలు. పొద గానీ తీగ గానీ ఒక తృణ కానీ. ప్రపంచములో విడిచిపెట్టలేని తనవారినీ ఇంటినీ సంపదనూ భావాలనూ విడిచిపెట్టి పరమాత్మ పాద పద్మాలను చేరారు. వేదవేదానతములు ఏ పరమాత్మ పాదపద్మాలను వెతుకుతున్నాయో అటువంటి పాదపద్మాలను చేరారు

యా వై శ్రియార్చితమజాదిభిరాప్తకామైర్
యోగేశ్వరైరపి యదాత్మని రాసగోష్ఠ్యామ్
కృష్ణస్య తద్భగవతః చరణారవిన్దం
న్యస్తం స్తనేషు విజహుః పరిరభ్య తాపమ్

అమ్మవారు పూజించారు అన్ని కోరికలనూ పొందిన బ్రహ్మాదులూ పూజించారు యోగీశ్వరులు పూజించారు. అటువంటి పరమాత్మ యొక్క పాదం ఆనాటి రాసలీలలో గోపికలు తమ స్తనములలో ఉంచుకుని ఆలింగనం చేసుకుని అన్ని తాపాలనూ తొలగించుకున్నారు. అటువంటి గోపికలు పాద సంచారం చేసే చోట ఒక గడ్డిపోచగా పుడితే చాలు

వన్దే నన్దవ్రజస్త్రీణాం పాదరేణుమభీక్ష్ణశః
యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయమ్

గోపికల పాద ధూళికి నేను నిరంతరం నమస్కారం చేస్తాను. వారిచేత గానం చేయబడే పరమాత్మ కథా గానం మూడు లోకములనూ పవిత్రం చేస్తుంది. అటువంటి పాద రేనువులకు నేను నమస్కరిస్తున్నాను.

శ్రీశుక ఉవాచ
అథ గోపీరనుజ్ఞాప్య యశోదాం నన్దమేవ చ
గోపానామన్త్ర్య దాశార్హో యాస్యన్నారురుహే రథమ్

ఇలా కొంతకాలం ఉండి గోపికలు చెప్పి వారి అనుమతి పొంది, నంద గోపునికీ గోపాలురకూ చెప్పి, తాను వెళ్ళ దలచుకుని రథాన్ని అధిరోహించాడు

తం నిర్గతం సమాసాద్య నానోపాయనపాణయః
నన్దాదయోऽనురాగేణ ప్రావోచన్నశ్రులోచనాఃఅ

అలా వెళుతున్న ఉద్ధవునికి గోపికలూ నందాదులూ కానుకలిచ్చి కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని ఇలా అంటున్నారు.

మనసో వృత్తయో నః స్యుః కృష్ణ పాదామ్బుజాశ్రయాః
వాచోऽభిధాయినీర్నామ్నాం కాయస్తత్ప్రహ్వణాదిషు

మా మనసు యొక్క అన్ని ప్రవృత్తులూ పరమాత్మ పాదాలను ఆశ్రయించే ఉండాలి.
మా వాక్కులు స్వామి పేర్లనే తలచాలి, మా దేహం అతనికి వంగి సేవచేస్తూ నమస్కరిస్తూ ఉండాలి

కర్మభిర్భ్రామ్యమాణానాం యత్ర క్వాపీశ్వరేచ్ఛయా
మఙ్గలాచరితైర్దానై రతిర్నః కృష్ణ ఈశ్వరే

మేము ఇది వరకు ఆచరించిన అనేక కర్మల చేత ఆయాలోకాలలో తిరిగుతున్న మేము పరమాత్మ సంకల్పముతో కొన్ని ఉత్తమ కర్మలు చేసి పరమాత్మను ప్రేమించగలిగిన జన్మను పొందగలిగాము.

ఏవం సభాజితో గోపైః కృష్ణభక్త్యా నరాధిప
ఉద్ధవః పునరాగచ్ఛన్మథురాం కృష్ణపాలితామ్

కృష్ణ పరమాత్మ యందు భక్తితో గోపాలురందరూ గౌరవిస్తే కృష్ణుని చేత పాలించబడే మధురాపురికి ఉద్ధవుడు వచ్చాడు

కృష్ణాయ ప్రణిపత్యాహ భక్త్యుద్రేకం వ్రజౌకసామ్
వసుదేవాయ రామాయ రాజ్ఞే చోపాయనాన్యదాత్

వచ్చి, సాష్టాంగ పడి ఆ గోపికల భక్తి ఉద్రేకాన్ని కృష్ణునికి చెప్పాడు.
గోపికలూ గోపాలురూ ఇచ్చిన కానుకలను బలరామునికీ రాజుకూ కృష్ణుడికీ కూడా ఇచ్చాడు.

                      సర్వం శ్రీకృష్ణార్పణమస్తు