Pages

Sunday, 27 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఆరవ అధ్యాయం


             ఓం నమో భగవతే వాసుదేవాయ 


శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఆరవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
వృష్ణీనాం ప్రవరో మన్త్రీ కృష్ణస్య దయితః సఖా
శిష్యో బృహస్పతేః సాక్షాదుద్ధవో బుద్ధిసత్తమః

ఉపనయనం చదువూ పూర్తి అయ్యాయి కృష్ణునికి. ఇక ఆ రాజ్యానికి ఒక మంచి మంత్రి కావాలి. వృష్ణి వంశానికి ఉత్తముడైన మంత్రి ఉద్ధవుడు. ఆయన సాక్షాత్ బృహస్పతి శిష్యుడు. ఉత్తమ బుద్ధిమంతుడు. యాదవులకు శ్రేష్ట్మైన మంత్రి.

తమాహ భగవాన్ప్రేష్ఠం భక్తమేకాన్తినం క్వచిత్
గృహీత్వా పాణినా పాణిం ప్రపన్నార్తిహరో హరిః

ఆయన కేవలం బుద్ధిమంతుడే కాక ఆయన కృష్ణ పరమాత్మకు ఏకాంత భక్తుడు. ఆశ్రయించిన వారి ఆర్తిని పోగొట్టే కృష్ణుడు ఉద్ధవుడి చేతిని చేతిలోకి తీసుకున్నాడు

గచ్ఛోద్ధవ వ్రజం సౌమ్య పిత్రోర్నౌ ప్రీతిమావహ
గోపీనాం మద్వియోగాధిం మత్సన్దేశైర్విమోచయ

కుబ్జ దగ్గరకు వెళ్ళబోయే ముందు తనతో చాలా కాలం ప్రాణానికి ప్రాణముగా తిరిగిన గోపికల వద్దకు తన ప్రతినిధిగా వెళ్ళమని చెప్పాడు. నంద యశోదలకు ప్రీతిని కలిగించు. నా ఎడబాటు వలన కలిగిన బాధను తొలగించు

తా మన్మనస్కా తృష్ట్ప్రాణా మదర్థే త్యక్తదైహికాః
మామేవ దయితం ప్రేష్ఠమాత్మానం మనసా గతాః
యే త్యక్తలోకధర్మాశ్చ మదర్థే తాన్బిభర్మ్యహమ్

వారు నాయందే మనసూ ప్రాణమూ ఉంచినవారు.  నా కోసమే వారు తమ దేహానికి కావలసిన సౌకర్యాలు కల్పించుకోవడం కూడా మానేసారు.
నన్నే ప్రియునిగా ఇష్టతమునిగా ఆత్మగా వారు నన్నే చేరారు.
నాకోసం అన్నీ వదిలిపెట్టిన వారినీ, అన్నీ మాని వేసిన వారినీ నేను భరిస్తాను. నాకోసం మానివేసిన పనులను నేనే చేస్తాను.

మయి తాః ప్రేయసాం ప్రేష్ఠే దూరస్థే గోకులస్త్రియః
స్మరన్త్యోऽఙ్గ విముహ్యన్తి విరహౌత్కణ్ఠ్యవిహ్వలాః

ప్రీతి పాత్రులందరిలోకల్లా ప్రీతిపాత్రునిగా నన్ను భావించి బాధపడుతున్న ఆ స్త్రీలను, ఎడబాటుతో విహ్వలులై మూర్చ పోతూ ఉన్న ఆ స్త్రీలను

ధారయన్త్యతికృచ్ఛ్రేణ ప్రాయః ప్రాణాన్కథఞ్చన
ప్రత్యాగమనసన్దేశైర్బల్లవ్యో మే మదాత్మికాః

నేను వస్తాను అని చెప్పినందుకు నా కోసం ఎదురుచూస్తున్న స్త్రీలను ప్రాణాలు విడువకుండా నా కోసం నిలుపుకుంటున్నారు వారు. నేను మళ్ళీ వస్తాను అని చెప్పాను వారితో. నీవు వెళ్ళి నేను ఎందుకు రాలేదో ఎపుడు వస్తానో నేను రానంతకాలం వారు ఎలా ఉండాలో నా మాటగా వారికి చెప్పి వార్ని ఓదార్చి వారి దుఃఖాన్ని తగ్గించి రా.

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్త ఉద్ధవో రాజన్సన్దేశం భర్తురాదృతః
ఆదాయ రథమారుహ్య ప్రయయౌ నన్దగోకులమ్

ఇలా కృష్ణ పరమాత్మ సందేశాన్ని తీసుకుని ఉద్దవుడు నందగోప భవనానికి వెళ్ళాడు. (ఊరు చేరాలంటే సూర్యాస్తమములోగా చేరాలి)

ప్రాప్తో నన్దవ్రజం శ్రీమాన్నిమ్లోచతి విభావసౌ
ఛన్నయానః ప్రవిశతాం పశూనాం ఖురరేణుభిః

గోధూళి వేళ ఆవులు నడుస్తుంటే లేచిన దుమ్ముతో ఉద్దవుని రథం కనపడకుండా పోయింది.

వాసితార్థేऽభియుధ్యద్భిర్నాదితం శుశ్మిభిర్వృషైః
ధావన్తీభిశ్చ వాస్రాభిరుధోభారైః స్వవత్సకాన్

సాయం కాలం పూటా అవులూ దూడలూ ఎలా ప్రవర్తిసాయో, అలా అరుస్తూ పోరాడుతూ కోట్లాడుతూ పక్కవాటిని పొడుస్తూ ఇలాంటి చేష్టలన్నీ చేస్తూ

ఇతస్తతో విలఙ్ఘద్భిర్గోవత్సైర్మణ్డితం సితైః
గోదోహశబ్దాభిరవం వేణూనాం నిఃస్వనేన చ

అటూ ఇటూ గంతులేస్తూ ఉన్నాయి. ఆవు పాలు పితికే చప్పుడూ పిల్లన గ్రోవి చప్పుడూ కృష్ణ రామ లీలలను గానం చేస్తున్న పాటలతో

గాయన్తీభిశ్చ కర్మాణి శుభాని బలకృష్ణయోః
స్వలఙ్కృతాభిర్గోపీభిర్గోపైశ్చ సువిరాజితమ్

చక్కగా అలంకరించుకుని కృష్ణ బలరాముల చరితమును గానం చేసుకుంటూ పాలు పితుకుతున్నారు, వారి చరితాన్ని జ్ఞ్యాపకం చేసుకుంటూ మజ్జిగ చేస్తున్నారు.

అగ్న్యర్కాతిథిగోవిప్ర పితృదేవార్చనాన్వితైః
ధూపదీపైశ్చ మాల్యైశ్చ గోపావాసైర్మనోరమమ్

వైశ్యులు కాబట్టి అగ్నినీ సూర్యున్నీ అతిథులనూ బ్రాహ్మణులను పితృ దేవతలనూ దేవతలనూ ఆరాధిస్తున్నారు.

సర్వతః పుష్పితవనం ద్విజాలికులనాదితమ్
హంసకారణ్డవాకీర్ణైః పద్మషణ్డైశ్చ మణ్డితమ్

అందమైన ఆ నంద వ్రజమూ, అంతా చుట్టూ తోటలూ పూలూ తుమ్మెదలూ వాటి నాదాలు.

తమాగతం సమాగమ్య కృష్ణస్యానుచరం ప్రియమ్
నన్దః ప్రీతః పరిష్వజ్య వాసుదేవధియార్చయత్

ఇలా వచ్చిన ఉద్దవున్ని నందుడు కౌగిలించుకుని ఆతిధ్యమిచ్చి కృష్ణుడే స్వయముగా వచ్చాడని భావించి పూజించాడు.

భోజితం పరమాన్నేన సంవిష్టం కశిపౌ సుఖమ్
గతశ్రమం పర్యపృచ్ఛత్పాదసంవాహనాదిభిః

పరమాన్న భోజనాన్ని పెట్టి పరుపు మీద కూర్చోపెట్టి పాద సేవలు చేస్తూ అలసట పోయిన తరువాత

కచ్చిదఙ్గ మహాభాగ సఖా నః శూరనన్దనః
ఆస్తే కుశల్యపత్యాద్యైర్యుక్తో ముక్తః సుహృద్వ్రతః

శూర సేనుని పుత్రుడైనా నా మిత్రుడైనా వసుదేవుడు క్షేమముగా వున్నాడా, మిత్రులందరూ బాగునారా

దిష్ట్యా కంసో హతః పాపః సానుగః స్వేన పాప్మనా
సాధూనాం ధర్మశీలానాం యదూనాం ద్వేష్టి యః సదా

అదృష్టం బాగుండి కంసుడు తన పరివారముతో కలసి అతని పాపముతో అతను చంపబడ్డాడు. ధర్మమే స్వభావముగా గల సాధువులను నిత్యం ద్వేషిస్తూ ఉండేవాడు

అపి స్మరతి నః కృష్ణో మాతరం సుహృదః సఖీన్
గోపాన్వ్రజం చాత్మనాథం గావో వృన్దావనం గిరిమ్

కృష్ణుడు మమ్ము అసలు తలుస్తున్నాడా, నన్నూ యశోదనూ తలుస్తున్నాడా జ్ఞ్యాపకం చేసుకుంటున్నాడా
గోపాలురనూ వ్రేపల్లెనూ బృందావనాన్ని గోవులనూ గోవర్ధన పర్వతాన్నీ తలచుకుంటున్నాడా, మళ్ళీ వస్తాడా ఇక్కడకు

అప్యాయాస్యతి గోవిన్దః స్వజనాన్సకృదీక్షితుమ్
తర్హి ద్రక్ష్యామ తద్వక్త్రం సునసం సుస్మితేక్షణమ్

అతని చక్కని సుందరమైన ముఖాన్ని అతను వస్తేనే కదా చూడగలిగేది.

దావాగ్నేర్వాతవర్షాచ్చ వృషసర్పాచ్చ రక్షితాః
దురత్యయేభ్యో మృత్యుభ్యః కృష్ణేన సుమహాత్మనా

అతను మమ్ములను దావాగ్ని నుండీ రాళ్ళవాన నుండీ వృషభాసురుడి నుండీ కాలీయుడి నుండీ కాపాడాడు
ఇతరులెవ్వరూ దాటలేని గొప్ప ఆపదల నుండీ కష్టాల నుండీ కాపాడడు.

స్మరతాం కృష్ణవీర్యాణి లీలాపాఙ్గనిరీక్షితమ్
హసితం భాషితం చాఙ్గ సర్వా నః శిథిలాః క్రియాః

పరమాత్మ యొక్క ప్రతాపాన్ని విలాసముగా చూసే క్రీగంటి చూపునూ నవ్వునూ మాటనూ,
మేము ఉంటూ పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఇవి జ్ఞ్యాపకం రాగానే పని ఏమీ చేయలేకపోతున్నాము

సరిచ్ఛైలవనోద్దేశాన్ముకున్దపదభూషితాన్
ఆక్రీడానీక్ష్యమాణానాం మనో యాతి తదాత్మతామ్

పోనీ మరచిపోదామంటే అది అయ్యేపని కాదు. పల్లెకు పోయినా అడవులకు పోయినా (పరమాత్మ ఏ కొండ మీద పాదాలు పెట్టడో అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయని హరి వంశములో ఉంది) కృష్ణున్ని చూస్తున్నట్లే ఉంది

మన్యే కృష్ణం చ రామం చ ప్రాప్తావిహ సురోత్తమౌ
సురాణాం మహదర్థాయ గర్గస్య వచనం యథా

ఇవన్నీ చూస్తోంటే కృష్ణ బలరాములు దేవతోత్తములే, వారే ఇక్కడ అవతరించి వచ్చినట్లున్నది.
దేవతల ప్రయోజనం నెరవేచడానికి వచ్చినట్లుంది. గర్గుడు ఆనాడే చెప్పాడు. అదే ప్రమాణం.

కంసం నాగాయుతప్రాణం మల్లౌ గజపతిం యథా
అవధిష్టాం లీలయైవ పశూనివ మృగాధిపః

కంసుడిని చంపడమే అందుకు నిదర్శనం. పది వేల ఏనుగుల బలం కలవాడు కంసుడు. వాడినీ మల్లులనూ ఏనుగునూ అవలీలగా చంపాడు. ఆయుధాలు లేకుండా చంపాడు.

తాలత్రయం మహాసారం ధనుర్యష్టిమివేభరాట్
బభఞ్జైకేన హస్తేన సప్తాహమదధాద్గిరిమ్

ధనువును భంగం చేసాడు. ఆ ధనువు మూడు తాటి చెట్ల పొడుగు ఉంది. దాన్ని చెరుగు గడను ఏనుగు విరిచినట్లు అవలీలగా ఎత్తి ఒక చేత్తో విరిచాడు. గోవరథన పర్వతాన్ని ఏడు రాత్రులు ధరించాడు

ప్రలమ్బో ధేనుకోऽరిష్టస్తృణావర్తో బకాదయః
దైత్యాః సురాసురజితో హతా యేనేహ లీలయా

దేవ దానవులను ఓడించిన ప్రలంబుడూ ధేనుకుడూ తృణావర్తుడూ అరిష్టాసురుడూ బకాస్రుడూ మొదలైన రాక్షసులనూ లీలగా చంపిన కృష్ణుడు మళ్ళీ వస్తాడా

శ్రీశుక ఉవాచ
ఇతి సంస్మృత్య సంస్మృత్య నన్దః కృష్ణానురక్తధీః
అత్యుత్కణ్ఠోऽభవత్తూష్ణీం ప్రేమప్రసరవిహ్వలః

మనసులో భావాలు మెదలుచుండగా మాట్లాడి మాట్లాడి ఉత్కంఠ పెరిగి గొంతులో నీరు నిండి మాట పెగలకుండా ఐపోయి.

యశోదా వర్ణ్యమానాని పుత్రస్య చరితాని చ
శృణ్వన్త్యశ్రూణ్యవాస్రాక్షీత్స్నేహస్నుతపయోధరా

నందుడికి ఈ మాత్రం మాటలు వచ్చాయి గానీ అవి అన్నీ వింటున్న యశోదమ్మకు కన్నీళ్ళు మాత్రమే వచ్చాయి

తయోరిత్థం భగవతి కృష్ణే నన్దయశోదయోః
వీక్ష్యానురాగం పరమం నన్దమాహోద్ధవో ముదా

అది చూసి ఉద్దవుడు అనుకున్నాడు. ఎంతటి ధన్యమైన జన్మ వీరిది. పరమాత్మ మీద వీరికి ఎంతటి భక్తి. ఎన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వస్తుంది.

శ్రీద్ధవ ఉవాచ
యువాం శ్లాఘ్యతమౌ నూనం దేహినామిహ మానద
నారాయణేऽఖిలగురౌ యత్కృతా మతిరీదృశీ

ప్రాణులందరిలో మీరే ఉత్తములూ, కొనియాడదగినవారు. శ్రీమన్నారాయణుని మీద ఇంతటి ప్రేమను చూపిన మీరు ఎన్నో కోట్ల జన్మల పుణ్యం చేసుకుని ఉంటారు.

ఏతౌ హి విశ్వస్య చ బీజయోనీ రామో ముకున్దః పురుషః ప్రధానమ్
అన్వీయ భూతేషు విలక్షణస్య జ్ఞానస్య చేశాత ఇమౌ పురాణౌ

ఈ బలరామ కృష్ణులే ప్రకృతీ పురుషులు.
ప్రపంచాన్ని సృష్టించి అందులో తాను ప్రవేశించి, అనుసరించి, అన్ని జ్ఞ్యానములనూ ప్రబోదింపచేస్తారు ఈ పురాణ పురుషులు

యస్మిన్జనః ప్రాణవియోగకాలే క్షనం సమావేశ్య మనోऽవిశుద్ధమ్
నిర్హృత్య కర్మాశయమాశు యాతి పరాం గతిం బ్రహ్మమయోऽర్కవర్ణః

స్వామి ఎంత గొప్పవాడంటే ఏ మహానుభావుని యందు ఒక్క క్షణం అంత్యకాలములో పరమాత్మయందు పరిశుద్ధమైన మనసు లగ్నం చేసుకుని అన్ని కర్మలూ పరిశుద్ధం చేసుకుని ఆయన ధామానికి వెళతారో అటువంటి పరమాత్మను మీరు ప్రతీ క్షణం ప్రతీ దినం పరిశుద్ధ భావముతో స్మరిస్తున్నారంటే మీకు కలిగే ఉత్తమ గతిని గురించి చెప్పగలిగేదేముంది.

తస్మిన్భవన్తావఖిలాత్మహేతౌ నారాయణే కారణమర్త్యమూర్తౌ
భావం విధత్తాం నితరాం మహాత్మన్కిం వావశిష్టం యువయోః సుకృత్యమ్

ఒక పని సాధించడానికి మానవ దేహం ధరించిన శ్రీమన్నారాయణుని యందు మనసు ఉంచారు. మీకు ఇంకేమి పుణ్యం కావాలి.

ఆగమిష్యత్యదీర్ఘేణ కాలేన వ్రజమచ్యుతః
ప్రియం విధాస్యతే పిత్రోర్భగవాన్సాత్వతాం పతిః

చాలా ఎక్కువ కాలం కాక ముందే ఇక్కడకు కృష్ణ బలరాములు వస్తారు
మీ ఇద్దరకూ ప్రీతిని కలిగిస్తాడు

హత్వా కంసం రఙ్గమధ్యే ప్రతీపం సర్వసాత్వతామ్
యదాహ వః సమాగత్య కృష్ణః సత్యం కరోతి తత్

రంగ మధ్యములో కంసున్ని చంపిన తరువాత మీ దగ్గరకు వచ్చి ఓదార్చి ఏమన్నాడో ఆ మాటను నిజం చేస్తాడు. కృష్ణుడు ఎపుడూ అన్న మాటను తప్పడు

మా ఖిద్యతం మహాభాగౌ ద్రక్ష్యథః కృష్ణమన్తికే
అన్తర్హృది స భూతానామాస్తే జ్యోతిరివైధసి

కృష్ణున్ని త్వరలోనే చూస్తారు. ఐనా ఆయన లేనిదెక్కడా. సకల ప్రాణుల హృదయములో అంతర్యామిగా ఉన్నాడు. జ్యోతిలా ఉన్నాడు.

న హ్యస్యాస్తి ప్రియః కశ్చిన్నాప్రియో వాస్త్యమానినః
నోత్తమో నాధమో వాపి సమానస్యాసమోऽపి వా

అహంకార మమకారాలు లేని పరమాత్మకు ప్రియ్డూ అప్రియుడూ అని ఎవరూ ఉండరు. తల్లీ తండ్రీ గురువూ మొదలైన వారు మనకు.

న మాతా న పితా తస్య న భార్యా న సుతాదయః
నాత్మీయో న పరశ్చాపి న దేహో జన్మ ఏవ చ

తన వారూ శత్రువూ శరీరమూ పుట్టుకా అతని ప్రత్యేకముగా చేయవలసిన పని అంటూ ఏమీ ఉండదు.

న చాస్య కర్మ వా లోకే సదసన్మిశ్రయోనిషు
క్రీడార్థం సోऽపి సాధూనాం పరిత్రాణాయ కల్పతే

పరమాత్మ ఆటకోసం, సాధువులను రక్షించడం కోసం తాను దేహాన్ని స్వీకరించి వస్తాడు

సత్త్వం రజస్తమ ఇతి భజతే నిర్గుణో గుణాన్
క్రీడన్నతీతోऽపి గుణైః సృజత్యవన్హన్త్యజః

అతను ఎలాంటి సాత్వికాది గుణాలులేని వాడైనా మన రక్షణ కోసం దుష్ట శిక్షణ కోసం ఆయా శరీరాలు ఆయా గుణాలతో ధరించి వస్తాడు
ఆ క్రీడలోనే ప్రపంచాన్ని సృష్టిస్తాడూ కాపాడుతాడు సంహరిస్తాడు

యథా భ్రమరికాదృష్ట్యా భ్రామ్యతీవ మహీయతే
చిత్తే కర్తరి తత్రాత్మా కర్తేవాహంధియా స్మృతః

తుమ్మెదా లేదా సాలెపురుగూ తాను చుట్టిన దారములో తానే చిక్కుతుంది, ఆ దారాన్ని తానే తినివేసి బయటకు వస్తుంది. అది అందులో ఉన్నపుడు అది బయటకు రాలేదేమో అనిపిస్తుంది. దారాన్ని సృష్టించనపుడు, ఇది దారాన్ని సృష్టిస్తుందా అనిపిస్తుంది. పరమాత్మ ప్రళయ కాలములో లేడేమో అనిపిస్తాడు. సృష్టించిన తరువాత అంతవరకూ లేని జగత్తు కనపడుతుంది. సూక్ష్మావస్థలో ఉన్న పరమాత్మే సృష్టి జరిగాక స్థూలావస్థలో ఉంటాడు. ఆయనకు అహంకార మమకారాలు లేవు.

యువయోరేవ నైవాయమాత్మజో భగవాన్హరిః
సర్వేషామాత్మజో హ్యాత్మా పితా మాతా స ఈశ్వరః

నంద యశోదల్లారా ఆయన మీకే కాదు అందరికీ ఆత్మ. అందరికీ అన్నీ ఆయనే. మీకే కాదు

దృష్టం శ్రుతం భూతభవద్భవిష్యత్
స్థాస్నుశ్చరిష్ణుర్మహదల్పకం చ
వినాచ్యుతాద్వస్తు తరాం న వాచ్యం
స ఏవ సర్వం పరమాత్మభూతః

ప్రపంచములో చూడబడినది వినబడినదీ జరిగినదీ జరగబోవునదీ గొప్పదీ పెద్దదీ చిన్నదీ అని వేటిని అనుకుంటున్నామో పరమాత్మ లేకుండా అవేవీ ఉండవు. పరమాత్మ లేకుండా ఉన్నాయని చెప్పడానికి లేదు
అతని కాని వస్తువు లేదు, అతను కానిది లేదు. ఆయన అందరివాడు. ఆయననుండే అన్నీ వచ్చాయి.అన్నిటిలోనూ ఆయన ఉన్నాడు.

ఏవం నిశా సా బ్రువతోర్వ్యతీతా నన్దస్య కృష్ణానుచరస్య రాజన్
గోప్యః సముత్థాయ నిరూప్య దీపాన్వాస్తూన్సమభ్యర్చ్య దౌధీన్యమన్థున్

ఈ విధముగా నందుడూ యశోదా ఉద్దవుడూ ముగ్గురూ మాట్లాడుతూ ఉండగానే రాత్రి గడిచింది
తెల్లవారగానే గోపికలు లేచి గృహదేవతలను పూజించి పెరుగు చిలుకుతున్నారు

తా దీపదీప్తైర్మణిభిర్విరేజూ రజ్జూర్వికర్షద్భుజకఙ్కణస్రజః
చలన్నితమ్బస్తనహారకుణ్డల త్విషత్కపోలారుణకుఙ్కుమాననాః

వారి ఆభరణాలు మణుల కాంతితో ప్రకాశిస్తున్నాయి. పెరుగు చిలకడముతో అవి చప్పుడు చేస్తున్నాయి,

ఉద్గాయతీనామరవిన్దలోచనం వ్రజాఙ్గనానాం దివమస్పృశద్ధ్వనిః
దధ్నశ్చ నిర్మన్థనశబ్దమిశ్రితో నిరస్యతే యేన దిశామమఙ్గలమ్

గోపికలు పెరుగు చిలుకుతూ పరమాత్మ నామాన్ని గానం చేస్తున్నారు, ఎలుగెత్తి పాడుతున్నారు, వారి పాట ధ్వనీ ఆభరణాల ధ్వనీ  పెరుగు చిలికే ధ్వనీ . ఈ మూడూ కలసి సకల దిక్కుల అమంగళాన్నీ తొలగిస్తున్నాయి. భగవంతుని  భక్తుల ప్రతీ మాటా అమంగళాన్ని తొలగిస్తుంది. ఈ మూడూ కలసి మున్నీరు అనవచ్చు. మున్నీరు అంటే సముద్రం. మూడు రకాల నీరు.
వారు ధరించిన ఆభరణముల ధ్వనీ అడుగుల సవ్వడీ కూడా అమంగళాన్ని తొలగిస్తుంది.
వారు చేసే ధ్వని స్వర్గం దాకా వెళ్ళింది. పాద ధ్వనీ ఆభరణముల ధ్వనీ పెరుగు చిలికే ధ్వని. ఈ మూడు ధ్వనులు కలిసి మునీరు (సముద్రం - సముద్రములో మూడు రకాల నీళ్ళు ఉంటాయి. పైనుంచి వర్ష జలం, భూమి నుంచి నదీ జలం, అడుగునుంచి ఊట జలం. ఇలా మూడూ కలిస్తే సముద్రం. ఈ వ్రేపల్లె ఒక సముద్రం. ఇక్కడ కూడా మూడు ధ్వనులు కలుస్తున్నాయి. కాలి ధ్వనీ ఆభరణుల ధ్వనీ పెరుగు చిలికే ధ్వని)
ఈ ధ్వని సకల దిక్కుల అమంగళాన్ని తొలగిస్తున్నాయి. భగవంతుని భక్తుల ప్రతీ మాటా అమంగళాన్ని పోగొడుతుంది, ప్రతీ అడుగూ అమంగళాన్ని పోగొడుతుంది. అందుకే ఆభరణాలు గానీ కొత్త వస్తువులు గానీ పెద్దల//భక్తుల చేతికిచ్చి మనం తీసుకోవడం సాంప్రదాయం. అది వస్తువులలో దోషాలను పోగొడుతుంది.

భగవత్యుదితే సూర్యే నన్దద్వారి వ్రజౌకసః
దృష్ట్వా రథం శాతకౌమ్భం కస్యాయమితి చాబ్రువన్

ఇలా పని పూర్తి అయ్యాక సూర్యోదయం అయ్యాక వారు బయటకు వచ్చి చూస్తే నందుని ఇంటిముందు ఒక బంగారు రథం కనపడింది.

అక్రూర ఆగతః కిం వా యః కంసస్యార్థసాధకః
యేన నీతో మధుపురీం కృష్ణః కమలలోచనః

మళ్ళీ కంసుని పనులు చక్కబెట్టే అకౄరుడు వచ్చాడా. అతనే పద్మాక్షుడైన కృష్ణున్ని మాకు దూరం చేసాడు

కిం సాధయిష్యత్యస్మాభిర్భర్తుః ప్రీతస్య నిష్కృతిమ్
తతః స్త్రీణాం వదన్తీనాముద్ధవోऽగాత్కృతాహ్నికః

ఇపుడు ఇలా ఉన్న మాకు కూడా బాధ కలిగించి చనిపోయిన కంసునికి ఏమి ఇంకేమి ఉపకారం చేస్తాడు. ఇలా వారు మాట్లాడుతూ ఉండగానే ఉద్ధవుడు తన నిత్య కృత్యములు ముగించుకుని ఉద్ధవుడు వచ్చాడు.
                                                        సర్వం శ్రీకృష్ణార్పణమస్తు