Pages

Saturday, 19 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదిహేనవ అధ్యాయం

                                                             ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదిహేనవ అధ్యాయం

మిత్రులతో కలిసి పరమాత్మ భోజనం చేయడం, అఘాసురున్ని చంపడం, బ్రహ్మ యొక్క స్తోత్రాన్ని చదివిన వారూ విన్నవారూ, తనకు కావలసిన, తాను కోరిన అన్ని కోరికలనూ పొందుతారు. ఇలాంటి వాటితో కౌమారాన్ని దాటారు.

శ్రీశుక ఉవాచ
తతశ్చ పౌగణ్డవయఃశ్రీతౌ వ్రజే
బభూవతుస్తౌ పశుపాలసమ్మతౌ
గాశ్చారయన్తౌ సఖిభిః సమం పదైర్
వృన్దావనం పుణ్యమతీవ చక్రతుః

ఇపుడు వారికి పౌగండ్రం వచ్చినిద్.వత్స పాలురు కాస్తా పశు పాలురు అయ్యారు. గోవులను కూడా కాస్తున్నారు. అతి సుకుమారమైన పాదములతో బృందావనములో సంచరిస్తూ గోవులను మేపుతూ వీరు సంచరిస్తున్నారు

తన్మాధవో వేణుముదీరయన్వృతో గోపైర్గృణద్భిః స్వయశో బలాన్వితః
పశూన్పురస్కృత్య పశవ్యమావిశద్విహర్తుకామః కుసుమాకరం వనమ్

కృష్ణ పరమాత్మ వేణువును ఊదుతూ గోపాలురందరూ తన చరితాన్ని గానం చేస్తూ ఉంటే బలము కలవాడయ్యాడు
అన్ని పూలతో రకరకాల పళ్ళతో కాయలతో ఉన్న వనానికి గోవులను తీసుకు వెళ్ళాడు.

తన్మఞ్జుఘోషాలిమృగద్విజాకులం మహన్మనఃప్రఖ్యపయఃసరస్వతా
వాతేన జుష్టం శతపత్రగన్ధినా నిరీక్ష్య రన్తుం భగవాన్మనో దధే

తుమ్మెదలూ లేళ్ళూ పక్షులూ మొదలైన వాటి ధ్వనితో వనమంతా నిండిపోయి ఉన్నది
మానస సరోవరములో ఉన్న నీటి వలన ఎలాంటి పరిమళమూ గాలీ వస్తుందో యమునా నదీ తీరములో అటువంటి గాలి వస్తుంటే ఈ నదీ పరిసరాలు బాగున్నాయని, ఈ రోజు ఇక్కడే రమించుటకు నిర్ణయించుకున్నాడు (సంకల్పించాడు)

స తత్ర తత్రారుణపల్లవశ్రియా ఫలప్రసూనోరుభరేణ పాదయోః
స్పృశచ్ఛిఖాన్వీక్ష్య వనస్పతీన్ముదా స్మయన్నివాహాగ్రజమాదిపూరుషః

ఎఱ్ఱబారిన చిగురుటాకుల శోభతో పళ్ళూ పూల బరువుతో చెట్ల కొమ్మలు భూమిని తాకుతున్నాయి. 
అన్నగారైన బలరామునితో ఇలా చెప్పాడు

శ్రీభగవానువాచ
అహో అమీ దేవవరామరార్చితం పాదామ్బుజం తే సుమనఃఫలార్హణమ్
నమన్త్యుపాదాయ శిఖాభిరాత్మనస్తమోऽపహత్యై తరుజన్మ యత్కృతమ్

అన్నగారూ, మీరు వేంచేసారని మీ పాదాలకు ఈ చెట్లన్నీ నమస్కారం చేస్తున్నాయి, మీ పాదాలున్నాయని కొమ్మలతో చెట్లు వంగుతున్నాయి. దేవతలలో శ్రేష్టులు మరణములేని ముక్తులచేత సేవించబడేవి మీ పాదాలు. సుమనః - అంటే దేవతలు. దేవతలకు కూడా ఫలాన్ని అందించేది. సుమనః అంటే జ్ఞ్యానులు. జ్ఞ్యానులకు కూడా వారు కోరిన ఫలితాన్ని ప్రసాదించేది.ఆదిశేషుడంటే ఆచర్యులు. గురువుగారి పాదపద్మాలే కదా పండితుల  యొక్క మనసులో ఉన్న కోరికలు తీర్చేది.
పూర్వ జన్మలో చేసిన పాపము వలన చెట్టు జన్మ వచ్చాయి వీటికి. పూర్వ జన్మలో చేసిన అపచారం పోగొట్టుకోవడానికి అవి మీకు నమస్కరిస్తున్నాయి.

ఏతేऽలినస్తవ యశోऽఖిలలోకతీర్థం
గాయన్త ఆదిపురుషానుపథం భజన్తే
ప్రాయో అమీ మునిగణా భవదీయముఖ్యా
గూఢం వనేऽపి న జహత్యనఘాత్మదైవమ్

చెట్లు నమస్కారం చేస్తుంటే తుమ్మెదలు సకల లోకములనూ పవిత్రం చేసే నీ కీర్తిని గానం చేస్తున్నాయి.
ఇవి చెట్లూ తుమ్మెదలు కావు. మీ ఎడబాటు క్షణమైన భరించలేక మునులు ఈ చెట్లగా వచ్చారు.
రహస్యముగా అడవిలో కూడా మిమ్ములను ఒంటరిగా విడిచిపెట్టుటలేదు. మీరు వారికి దైవం.

నృత్యన్త్యమీ శిఖిన ఈడ్య ముదా హరిణ్యః
కుర్వన్తి గోప్య ఇవ తే ప్రియమీక్షణేన
సూక్తైశ్చ కోకిలగణా గృహమాగతాయ
ధన్యా వనౌకస ఇయాన్హి సతాం నిసర్గః

నెమళ్ళు మీకు నాట్యం చేస్తూ ప్రీతిని కూరుస్తున్నాయి, లేళ్ళు మీవైపు బిత్తర చూపు చూస్తు మీకు గోపికలను గుర్తు చేస్తున్నాయి .
ఈ అరణ్యం కోఇకలకూ నెమళ్ళకూ వృక్షాలకూ ఇల్లు. ఇంటికి వచ్చిన అతిథికి పూజ చేయడం కర్తవ్యం. సత్పురుషుల స్వభావం ఇదే కదా. సత్పురుషులు తమ ఇంటివద్దకు వచ్చిన వారిని మర్యాద చేయకుండ ఉండలేరు కదా.

ధన్యేయమద్య ధరణీ తృణవీరుధస్త్వత్
పాదస్పృశో ద్రుమలతాః కరజాభిమృష్టాః
నద్యోऽద్రయః ఖగమృగాః సదయావలోకైర్
గోప్యోऽన్తరేణ భుజయోరపి యత్స్పృహా శ్రీః

ఇంతకాలానికి బృందావనం యొక్క ఈ భూమి ధన్యమైనది. నీ పాదముల స్పర్శనూ, చేతి వేళ్ళతో తాకబడినవి. (కరజ అంటే వేళ్ళూ కావొచ్చు, గోళ్ళూ కావొచ్చు).
నదులూ పర్వతాలూ పక్షములూ మృగములూ అన్నీ నీ కటాక్ష వీక్షణాలు పొంది ధన్యమైనవి.
నీ వక్షస్థములో ఏ అమ్మవారు స్పృహను ఉంచుతుందో అటువంటి నీ దివ్యమైన కరుణా కటాక్షాలు పడి భూమి మీద ఉండే నదులూ వృక్షములూ మృగములూ అన్ని ధన్యమయ్యాయి.

ఇలా వాచక కైంకర్యం చేసాడు కృష్ణుడు. ఇది ఆచార్య కైంకర్యం.

శ్రీశుక ఉవాచ
ఏవం వృన్దావనం శ్రీమత్కృష్ణః ప్రీతమనాః పశూన్
రేమే సఞ్చారయన్నద్రేః సరిద్రోధఃసు సానుగః

క్వచిద్గాయతి గాయత్సు మదాన్ధాలిష్వనువ్రతైః
ఉపగీయమానచరితః పథి సఙ్కర్షణాన్వితః

అనుజల్పతి జల్పన్తం కలవాక్యైః శుకం క్వచిత్
క్వచిత్సవల్గు కూజన్తమనుకూజతి కోకిలమ్
క్వచిచ్చ కాలహంసానామనుకూజతి కూజితమ్
 అభినృత్యతి నృత్యన్తం బర్హిణం హాసయన్క్వచిత్

మేఘగమ్భీరయా వాచా నామభిర్దూరగాన్పశూన్
క్వచిదాహ్వయతి ప్రీత్యా గోగోపాలమనోజ్ఞయా

పరమాత్మ పర్వత ప్రాంతాలలో పశువులను తిప్పుతూ తాను తిరుగుతూ ఆనందించాడు. తుమ్మెదలతో కోళ్ళతో పోటిగా పాడారూ కూసారు. కోతులతో లేళ్ళతో కప్పలతో సమానముగా గంతులు వేసారు. అడవిలో ఉన్న ప్రాణులు చేసిన పనులనే కృష్ణుడూ గోపాలురూ చేసారు. హంసలతో పాడారు, నెమళ్ళతో ఆడారు, మేఘాలు గర్ఝిస్తుంటే వారూ గంభీర నాదముతో మాట్లాడారు, నవ్విస్తుంటే నవ్వారు. పిల్లలు తనను పిలుస్తుంటే తాను వారినీ పిలిచాడు. పశువులను కూడా వాటి పేర్లతో గంభీర నాదముతో పిలిస్తే ఎంత దూరములో ఉన్నా అవి పరిగెత్తుకు వచ్చేవి. 

చకోరక్రౌఞ్చచక్రాహ్వ భారద్వాజాంశ్చ బర్హిణః
అనురౌతి స్మ సత్త్వానాం భీతవద్వ్యాఘ్రసింహయోః

పెద్ద పుల్లకూ సింహాలకు భయపడిన ఇతర మృగాలు ఏ ధ్వని చేస్తారో ఈ గోపాలురు కూడా ఆ ధ్వనినే అనుకరించారు

క్వచిత్క్రీడాపరిశ్రాన్తం గోపోత్సఙ్గోపబర్హణమ్
స్వయం విశ్రమయత్యార్యం పాదసంవాహనాదిభిః

బలరామునికి కాయిక కైంకర్యం కూడా చేయాలి కాబట్టి అడవిలో తిరిగి అలసిపోయిన బలరామునికి పాద సంవాహన చేసాడు కృష్ణుడు

నృత్యతో గాయతః క్వాపి వల్గతో యుధ్యతో మిథః
గృహీతహస్తౌ గోపాలాన్హసన్తౌ ప్రశశంసతుః

నాట్యం చేస్తున్నారు గానం చేస్తున్నారు
రకరకాల కూతలు కూస్తున్నారు పాటలు పాడుతున్నారు మల్ల యుద్ధం చేస్తున్నారు సరదాగా, ఒకరి చేయి ఒకరు పట్టుకుని తిరుగుతూ నవ్వుతూ నవ్విస్తూ ఒకరినొకరు పట్టుకుంటూ మల్ల యుద్ధం చేసి అలసిపోతే చిగురుటాకుల పరుపుల మీద శయనించారు

క్వచిత్పల్లవతల్పేషు నియుద్ధశ్రమకర్శితః
వృక్షమూలాశ్రయః శేతే గోపోత్సఙ్గోపబర్హణః

చెట్ల యొక్క నీడలో కొందరు పడుకుంటున్నారు. కొందరు బలరామ కృష్ణులిద్దరినీ సేవించారు. చామరాలతో వీస్తున్నారు.

పాదసంవాహనం చక్రుః కేచిత్తస్య మహాత్మనః
అపరే హతపాప్మానో వ్యజనైః సమవీజయన్

వారికి ఇష్టమైన చేష్టలు కొందరు చేస్తున్నారు

అన్యే తదనురూపాణి మనోజ్ఞాని మహాత్మనః
గాయన్తి స్మ మహారాజ స్నేహక్లిన్నధియః శనైః

పరమాత్మ యందు ప్రీతితో పులకించిన మనసూ బుద్ధీ కలవారై ఆయన చరిత్రను గానం చేస్తున్నారు

ఏవం నిగూఢాత్మగతిః స్వమాయయా గోపాత్మజత్వం చరితైర్విడమ్బయన్
రేమే రమాలాలితపాదపల్లవో గ్రామ్యైః సమం గ్రామ్యవదీశచేష్టితః

తన స్వరూపాన్ని అతి రహస్యముగా దాచుకున్న పరమాత్మ, అమ్మ వారి చేత లాలించబడిన పాదములు కల పరమాత్మ, తన పాదములతో బృందావనమంతా సంచరిస్తూ తన మాయతో ఆయన దివ్యత్వాన్ని మరుగు పరచుకోవడానికి మానవ చేష్టితములు చేస్తున్నాడు.
అజ్ఞ్యానులతో కలిసి తాను కూడా ఒక అజ్ఞ్యానిగా సంచరించాడు. ఇదంతా ఈశ చేష్టితం.

శ్రీదామా నామ గోపాలో రామకేశవయోః సఖా
సుబలస్తోకకృష్ణాద్యా గోపాః ప్రేమ్ణేదమబ్రువన్

ఈ సమయములో బలరామకృష్ణులిద్దరికీ అత్యంత ప్రీతి పాత్రులైన గోపాలకులలో నిరంతరం కృష్ణ పరమాత్మ ఎవరి భుజాన్ని విడిచిపెట్టడో అతను శ్రీదాముడు (రామావతారములో లక్ష్మణునిలాగ) , మిగిలిన గోపాలకులతో కలిసి ఇలా అంటున్నారు

రామ రామ మహాబాహో కృష్ణ దుష్టనిబర్హణ
ఇతోऽవిదూరే సుమహద్వనం తాలాలిసఙ్కులమ్

ఫలాని తత్ర భూరీణి పతన్తి పతితాని చ
సన్తి కిన్త్వవరుద్ధాని ధేనుకేన దురాత్మనా

సోऽతివీర్యోऽసురో రామ హే కృష్ణ ఖరరూపధృక్
ఆత్మతుల్యబలైరన్యైర్జ్ఞాతిభిర్బహుభిర్వృతః

తస్మాత్కృతనరాహారాద్భీతైర్నృభిరమిత్రహన్
న సేవ్యతే పశుగణైః పక్షిసఙ్ఘైర్వివర్జితమ్

విద్యన్తేऽభుక్తపూర్వాణి ఫలాని సురభీణి చ
ఏష వై సురభిర్గన్ధో విషూచీనోऽవగృహ్యతే

బలరామా శ్రీకృష్ణా, ఇక్కడకి దగ్గరలోనే తాళ వనం ఉంది. ఎపుడూ పళ్ళు పడుతూనే ఉంటాయి అక్కడ. అవి చాలా రుచిగా ఉంటాయి, సుగంధముతో ఉంటాయి. అది గోపాల బాలకులందరూ తిందామనుకుంటున్నారు. కానీ ధేనుకుడనే రాక్షసుడు ఆ వనాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆ రాక్షసునికి భయపడి ఎవరూ తినలేకుండా ఉన్నారు. ఇంతవరకూ ఎవరూ తినలేదు వాటిని. వాటి సుగంధం ఇక్కడిదాకా వస్తున్నాది. మీరిద్దరూ మాకు ఆ పళ్ళు తినడానికి అవకాశం కల్పించండి

ప్రయచ్ఛ తాని నః కృష్ణ గన్ధలోభితచేతసామ్
వాఞ్ఛాస్తి మహతీ రామ గమ్యతాం యది రోచతే

మేము తృప్తి పొందుతాము. మాకు చాలా పెద్ద కోరిక ఉంది, ఆ ఫలాలను తినాలని. మీకు నచ్చితే వెళదాము

ఏవం సుహృద్వచః శ్రుత్వా సుహృత్ప్రియచికీర్షయా
ప్రహస్య జగ్మతుర్గోపైర్వృతౌ తాలవనం ప్రభూ

అలా అడిగితే వారికి ప్రీతి కలిగించాలి అని సంకల్పించి, ఒక సారి నవ్వి అందరితో కలిసి తాల వనానికి వెళ్ళారు

బలః ప్రవిశ్య బాహుభ్యాం తాలాన్సమ్పరికమ్పయన్
ఫలాని పాతయామాస మతఙ్గజ ఇవౌజసా

బలరాముడు వెళ్ళడమే కాకుండా తన బాహువులతో తాటి చెట్లను ఒప్పి అన్ని పళ్ళనూ కిందపడవేసాడు. ఆఅ చప్పుడు విన్న రాక్షసుడు పర్వతాలతో సహా భూమిని కంపింపచేస్తూ పరిగెత్తుకు వచ్చి గాడిద రూపములో వచ్చి వెనక కాళ్ళతో బలరామున్ని తన్నడానికి ప్రయత్నించాడు

ఫలానాం పతతాం శబ్దం నిశమ్యాసురరాసభః
అభ్యధావత్క్షితితలం సనగం పరికమ్పయన్

సమేత్య తరసా ప్రత్యగ్ద్వాభ్యాం పద్భ్యాం బలం బలీ
నిహత్యోరసి కాశబ్దం ముఞ్చన్పర్యసరత్ఖలః

పాదాలతో తన్నాడు. గాడిద కాబట్టి దుష్ట శబ్దాన్ని వినిపిస్తూ మళ్ళీ జరిగి మళ్ళీ తన్నడానికి వస్తున్నాడు

పునరాసాద్య సంరబ్ధ ఉపక్రోష్టా పరాక్స్థితః
చరణావపరౌ రాజన్బలాయ ప్రాక్షిపద్రుషా

అదే రీతిలో బలరామున్ని తన్నడానికి రెండు కాళ్ళూ ఎత్తాడు

స తం గృహీత్వా ప్రపదోర్భ్రామయిత్వైకపాణినా
చిక్షేప తృణరాజాగ్రే భ్రామణత్యక్తజీవితమ్

ఆ రెండు కాళ్ళనే తీసుకుని గిరగిరా తిప్పి చెట్టుకు కొట్టాడు.

తేనాహతో మహాతాలో వేపమానో బృహచ్ఛిరాః
పార్శ్వస్థం కమ్పయన్భగ్నః స చాన్యం సోऽపి చాపరమ్

వాడూ చనిపోయాడు. ఆ రాక్షసుని పరివారం కూడా వచ్చింది. అపుడు కృష్ణుడూ బలరాముడు వారిని తీసుకుని చెట్లకేసి కొడుతూ వధించారు

బలస్య లీలయోత్సృష్ట ఖరదేహహతాహతాః
తాలాశ్చకమ్పిరే సర్వే మహావాతేరితా ఇవ

రాక్షసులతో వారి దేహములతో బలరామ కృష్ణుల బాహుబలముతో చెట్లన్నీ వణికిపోయాయి.

నైతచ్చిత్రం భగవతి హ్యనన్తే జగదీశ్వరే
ఓతప్రోతమిదం యస్మింస్తన్తుష్వఙ్గ యథా పటః

అనంత బ్రహ్మాండాలని నెత్తిన మోసేవాడికి ఇది ఒక వింతా? దారములలో వస్త్రం దాగి ఉన్నట్లుగా సకల ప్రపంచమూ అతనిలో ఇమిడి ఉంది

తతః కృష్ణం చ రామం చ జ్ఞాతయో ధేనుకస్య యే
క్రోష్టారోऽభ్యద్రవన్సర్వే సంరబ్ధా హతబాన్ధవాః

ఇలా వచ్చిన ప్రతీ వాడినీ బలరామ కృష్ణులు వధిస్తూ ఉండడముతో మిగిలిన వారు రాకుండా పారిపోయారు. బలరాముడూకృష్ణుడూ కలిసి వచ్చిన వారిని వచ్చినట్లుగా చెట్లకు కొట్టేస్తున్నారు

తాంస్తానాపతతః కృష్ణో రామశ్చ నృప లీలయా
గృహీతపశ్చాచ్చరణాన్ప్రాహిణోత్తృణరాజసు

ఫలప్రకరసఙ్కీర్ణం దైత్యదేహైర్గతాసుభిః
రరాజ భూః సతాలాగ్రైర్ఘనైరివ నభస్తలమ్

ఎక్కడ చూసినా తాల (తాటి) ఫలములూ రాక్షస దేహములూ ఆవరించి ఉన్నాయి. కొంచెం గట్టిగా కొడితే పళ్ళే కాకుండా తాటి చెట్టు యొక్క అగ్ర భాగం కూడా కింద పడ్డాయి. తాల అగ్రభాగములూ తాల ఫలములూ దైత్య దేహములతో నిండిపోయింది

తయోస్తత్సుమహత్కర్మ నిశమ్య విబుధాదయః
ముముచుః పుష్పవర్షాణి చక్రుర్వాద్యాని తుష్టువుః

ఇలాంటి ఉత్తమ కర్మను చూచి వారందరినీ చంపడం చూసిన దేవతలు పుష్ప వర్షాన్ని కురిపించి నాట్యం చేసారూ గానం చేసారు

అథ తాలఫలాన్యాదన్మనుష్యా గతసాధ్వసాః
తృణం చ పశవశ్చేరుర్హతధేనుకకాననే

అది ఒక గొప్ప పండుగగా భావించి గోపాల బాలకులు ఆ పాళ్ళను హాయిగా తిన్నారు
ఆ తాల వనం సరిహద్దు వరకూ ఏ దూడా ఆవూ ప్రవేశించలేదు  రాక్షసుని భయం వలన. ఇపుడు ఆవులూ దూడలూ ప్రవేశించి యధేచ్చగా ఏపుగా పెరిగిన గడ్డిని తిన్నాయి.

కృష్ణః కమలపత్రాక్షః పుణ్యశ్రవణకీర్తనః
స్తూయమానోऽనుగైర్గోపైః సాగ్రజో వ్రజమావ్రజత్

ఇలా ఆ పని పూర్తి కాగానే కృష్ణున్నీ, కమలముల వంటి కనులు కలవాడినీ, పరమపవిత్రుల చేత కీర్తించబడే మహానుభావుడు, తన వెంట నడిచే గోపాల బాలురచే స్తోత్రం చేయబడుతూ తన వ్రజానికి తాను వెళ్ళాడు.

తం గోరజశ్ఛురితకున్తలబద్ధబర్హ
వన్యప్రసూనరుచిరేక్షణచారుహాసమ్
వేణుమ్క్వణన్తమనుగైరుపగీతకీర్తిం
గోప్యో దిదృక్షితదృశోऽభ్యగమన్సమేతాః

సూర్యాస్తమయం కాబోతున్నదీ అనగానే, కృష్ణ బలరాములు వస్తారని, గోపికలందరూ ఊరి వెలుపలకే వచ్చేసారు, కొందరు ఎదురు చూస్తూ కూర్చున్నారు.
గోవుల ధూళి మొహం అంతా కమ్మి ఉంది.
పసిపిల్లలకూ పెద్దవారికీ ఇంట్లో అశుభం జరిగినా, పవిత్రం కావడానికి గోమూత్రం గోక్షీరం గోధూళి (ఆవు తొక్కిన రజస్సు) వాడతారు. అందుకే గోధూళి వేళ ఊరిలో ప్రవేశించాలి అంటారు. అది కోరే కృష్ణుడు గోపాల బాలకుడయ్యాడంటారు.
ఆవుల యొక్క దుమ్ము కేశములంతా పడగా, ఆ కేశములకు నెమలి పించమూ, దానికి అడవి మల్లెల దండా ఉంది. తన శిఖకు కట్టిన పూలూ, దానికి ఉన్న నెమలి పించాన్ని చూసుకుంటూ ఉన్నాడు కృష్ణుడు. అందమైన కన్నులూ... అంతకంటే అందమైన నవ్వు.... ఒక పక్క వేణువును వాయిస్తూ ఉండగా, అనుచరులు తన కీర్తిని గానం చేస్తూ ఉండగా, ఇటువంటి స్వామి దివ్య మంగళ విగ్రహ సౌంద్రయాన్ని చూడడానికి గోపికలందరూ కుటుంబసమేతముగా వచ్చారు.
ఈ శ్లోఖాన్ని వేయి రోజులు, రోజులు 108 సార్లు ధ్యానిస్తే ఈ రూపం మనకు సాక్షాత్కరిస్తుందని వ్యాసుని శపధం
వ్యాస వాల్మీకులు మంత్రము చెప్పదలచుకుంటే "త" తో మొదలు పెడతారు. కాస్త విశేషం అనుకుంటే "త" తో చెబుతారు. సృష్టిలో మొదటి సారి (బ్రహంఅ) చెవిలో పడిన అక్షరం త.

పీత్వా ముకున్దముఖసారఘమక్షిభృఙ్గైస్
తాపం జహుర్విరహజం వ్రజయోషితోऽహ్ని
తత్సత్కృతిం సమధిగమ్య వివేశ గోష్ఠం
సవ్రీడహాసవినయం యదపాఙ్గమోక్షమ్

పరమాత్మ ముఖమనే తేనె చేట్టును తాగారు. సారఘ అంటే తేనే టీగ, సరఘ చేత ఏర్పరచబడినది సారఘం. పుట్ట తేనె అంటే తేనెపుట్ట నుండి పడుతూ ఉండేది. అటువంటిదే గోపికలు కళ్ళు అనే తేనెటీగలతో కృష్ణ పరమాత్మ ముఖమునుండి తాగారు. పగలంతా ఎడబాటుతో కలిగిన తాపాన్ని విడిచిపెట్టారు. వారు చేసిన సత్కారాన్ని పొంది తన గోష్టములోకి వెళ్ళాడు. కాస్త సిగ్గుపడుతూ చిరునవ్వు నవ్వుతూ తల వంచుకుని వినయముగా క్రీగంటి చూపు చూస్తూ వెళ్ళాడు.

తయోర్యశోదారోహిణ్యౌ పుత్రయోః పుత్రవత్సలే
యథాకామం యథాకాలం వ్యధత్తాం పరమాశిషః

అలసి వచ్చిన బలరామకృష్ణులకు యశోడా రోహిణులు సమయానుగుణముగా ప్రదేశానుగుణముగా ఆచారానుగుణముగా ఏ సమయములో ఏ ఏ ఆశీస్సులు కావాలో అవి ఇస్తూ వచ్చారు. అలసి వచ్చిన వారికి నలుగు పెట్టి ఒళ్ళంతా మర్దనా చేసి స్నానం చేయించి వస్త్రాలు కట్టి పూల మాలలూ సుగంధాలతో అలంకరించి అమ్మ అన్నం పెడితే అది తిని, అమ్మ చేత లాలించబడి, అమ్మ పడుకోబెట్టిన శయ్య మీద హాయిగా పడుకున్నారు

గతాధ్వానశ్రమౌ తత్ర మజ్జనోన్మర్దనాదిభిః
నీవీం వసిత్వా రుచిరాం దివ్యస్రగ్గన్ధమణ్డితౌ

జనన్యుపహృతం ప్రాశ్య స్వాద్యన్నముపలాలితౌ
సంవిశ్య వరశయ్యాయాం సుఖం సుషుపతుర్వ్రజే

ఏవం స భగవాన్కృష్ణో వృన్దావనచరః క్వచిత్
యయౌ రామమృతే రాజన్కాలిన్దీం సఖిభిర్వృతః

ఆ రాత్రి బాగా పడుకుని మర్నాడు పొద్దూనే కృష్ణ పరమాత్మ బృందావనములో ఉన్న కాళిందీ నదికి వెళ్ళాడు. కొందరి మిత్రులను మాత్రమే తీసుకు వెళ్ళాడు. బలరామున్ని వదిలిపెట్టాడు

అథ గావశ్చ గోపాశ్చ నిదాఘాతపపీడితాః
దుష్టం జలం పపుస్తస్యాస్తృష్ణార్తా విషదూషితమ్

అలా వెళ్ళిన గోపాల బాలురూ దూడలూ ఆవులూ ఎండబాగా ఉండడముతో అందరికీ దప్పి అయి పిల్లలూ దూడలూ ఆవులూ ఆ విష జలాన్ని తాగారు

విషామ్భస్తదుపస్పృశ్య దైవోపహతచేతసః
నిపేతుర్వ్యసవః సర్వే సలిలాన్తే కురూద్వహ

వీక్ష్య తాన్వై తథాభూతాన్కృష్ణో యోగేశ్వరేశ్వరః
ఈక్షయామృతవర్షిణ్యా స్వనాథాన్సమజీవయత్

ఒడ్డుకు వచ్చి అందరూ పడిపోయారు. తన చూపు అనే అమృతాన్ని ప్రసారం చేసి చనిపోయిన వారిని జీవింపచేసాడు

తే సమ్ప్రతీతస్మృతయః సముత్థాయ జలాన్తికాత్
ఆసన్సువిస్మితాః సర్వే వీక్షమాణాః పరస్పరమ్

అన్వమంసత తద్రాజన్గోవిన్దానుగ్రహేక్షితమ్
పీత్వా విషం పరేతస్య పునరుత్థానమాత్మనః

లేచాక వారిలో వారు ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూచుకున్నారు.
విషం తాగి పడిపోయిన వారు కూడా మళ్ళీ బతకడం అంటే ఇది పరమాత్మ యొక్క అనుగ్రహమనే కటాక్షం అని వారు భావించారు.

                                                            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు