Pages

Saturday, 19 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పధ్నాలుగవ అధ్యాయం

                                                                    ఓం నమో భగవతే వాసుదేవాయ 


శ్రీమద్భాగవతం దశమ స్కంధం పధ్నాలుగవ అధ్యాయం

ఇది బ్రహ్మ స్తుతి. మొత్తం భాగవానికి ఇది సారం.
మనకు చాలా బాగా తెలుసు అనుకునే విషయాలు పరమాత్మ సంకల్పము లేకుటే అవి తెలియకుండా అవుతాయి. కోపమూ మొదలైన వాటి వలన మానవుడు విచక్షణ కోల్పోతాడు. గురువును కూడా సంహరిస్తాడు. ద్వేషం వస్తే తల్లీ తండ్రీ బధువులూ భార్యా పిల్లలూ అన్న తేడా ఉండదు. లోభి ధనం కోరే వాడు ధనం కోసం ఏమైనా చేస్తాడు. ఉదాహరణకు లోభత్వమే దుర్యోధనుని చేత ఆ పనులు చేసింది.ధనం మీది కాంక్షతో తనకు రాజ్యాధికారం లేదని తెలిసీ కూడా దుర్యోధనుని చేత ఆ పని చేయించింది. అలాగే కామం కూడా మనను ఇలాగే బుట్టలో పడేస్తుంది. హిడింబి చేత తన అన్ననే చంపేట్లు చేసింది.
ఇటువంటి వ్యామోహాలకు కారణం పరమాత్మ సంకల్పమే.

గోపాల బాలురకూ గోవులకూ బ్రహ్మానుభూతి కలిగించాలి అని కృష్ణుడు సంకల్పించి బ్రహ్మను ఇలాంటి వ్యామోహానికి గురిచేసాడు. తెలియుటా తెలియకపోవుటా మన చేతుల్లో లేదు. మనకు తెలియాలి అని పరమాత్మ అనుకుంటే తెలుసుతుంది. లేకుంటే లేదు. బ్రహ్మరుద్రేందాదులకే తెలియకుంటే మనకు తెలిసేదెంత? జ్ఞ్యానం దేహి క్షమాం దేహి విద్యాం దేహి అని ప్రార్థన చేయాలి. జ్ఞ్యానం ఆయనే ఇవ్వాలి. బ్రహ్మకు ఇలాంటి వ్యామోహాన్ని కలిగించి గోవులకూ గోపబాలురకూ వత్సలకు తన స్వరూపాన్ని చూపించాడు.
శ్రంగభంగమైన బ్రహ్మ స్వామి వద్దకు వచ్చి ఆయన పాదల మీద పడి స్తోత్రం చేస్తున్నాడు

శ్రీబ్రహ్మోవాచ
నౌమీడ్య తేऽభ్రవపుషే తడిదమ్బరాయ
గుఞ్జావతంసపరిపిచ్ఛలసన్ముఖాయ
వన్యస్రజే కవలవేత్రవిషాణవేణు
లక్ష్మశ్రియే మృదుపదే పశుపాఙ్గజాయ

ఈడ్య అంటే స్తోత్రం చేయదగిన వాడా. అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. మేఘము వంటి శరీరం కలవాడా. పీతాంబరం ధరించినవాడా. బంగారపు రంగు వస్త్రం కలవాడా. గురివిందల దండలతో నెమలి పించముతో అలంకరించబడి శోభిస్తున్న ముఖం కలవాడా. అడవి పూల మాల వేసుకుని ఉన్నావు. ఒక కొమ్మూ మురళీ ఒక బెత్తం ఇలాంటి వాటితే శోభించబడే వాడా.
పరమ సుకుమారమైన పాదము కలవాడా. గోపాల వంశములో పుట్టినవాడా.
పశుపాఙ్గజాయ (పశువులను కాచేవాడి వలన పుట్టినవాడా). పరమాత్మకు తనను నందుని కుమారునిలా  సంభోదిస్తేనే సంతోషం కలుగుతుంది. ఇక్కడ పశుపతి అంటే శంకరుడూ అని కూడా అర్థం వస్తుంది. "ఎవరి శరీరం నుండి పశుపతి అయిన రుద్రుడు పుట్టాడో" .

అస్యాపి దేవ వపుషో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య న తు భూతమయస్య కోऽపి
నేశే మహి త్వవసితుం మనసాన్తరేణ సాక్షాత్తవైవ కిముతాత్మసుఖానుభూతేః

స్వామీ! ఇలా నెమలి పించమూ కొమ్మూ మురళీ బెత్తమూ,ఈ ఆభరణాలూ వీటిని చూస్తేనే నీవెవరో మాకు అర్థం కావట్లేదు. ఈ శరీరాన్ని నన్ను దయ చూడటానికే తీసుకున్నావు.
మాకు ఈ శరీరం కర్మను బట్టి వస్తుంది. నీకు మాత్రం నీ సంకల్పముతో వస్తుంది. మా శరీరములా ఇది పాంచభౌతికమైన శరీరం కాదు. ఎవరైనా సరే ఈ దివ్య మంగళ విగ్రహ మహిమను తెలుసుకోవీలు కాదు. మనసుతో గానీ బుద్ధితో కానీ తెలుసుకో వీలు కాదు. గొల్ల వేషములో ఉన్న ఈ శరీరము యొక్క ఆంతర్యం తెలుసుకోవడమే  మాకు వీలు కానప్పుడు, నీవు పరమాత్మగా వస్తే మేము తెలుసుకోగలమా

జ్ఞానే ప్రయాసముదపాస్య నమన్త ఏవ
జీవన్తి సన్ముఖరితాం భవదీయవార్తామ్
స్థానే స్థితాః శ్రుతిగతాం తనువాఙ్మనోభిర్
యే ప్రాయశోऽజిత జితోऽప్యసి తైస్త్రిలోక్యామ్

ఈ జ్ఞ్యానము ఎందుకూ పనికి రాదు. జ్ఞ్యానం కోసం కష్టమును మానేసి నీకు నమస్కరిస్తున్న వారు మాత్రమే బతుకుతారు. సజ్జనులు బోధిస్తున్న నీ కథకు నమస్కారం చేసినా చాలు. వారు నీ స్వరూపాన్ని తెలియగలుగుతారు. నిన్ను సాక్షాత్కరించగలుగుతారు.
అఖిల వేదములో ప్రసిద్ధమైనది నీ గాధ. తనువూ వాక్కూ మనసు అనే త్రికరణములతో ఎవరు నిన్ను అనునిత్యమూ పెద్దలు చెప్పిన నీ కథను వింటూ సేవించుకుంటూ ఉన్నారో, ఎవరి చేతా గెలవబడని వాడవు ఐన నీవు, వారి చేత గెలవబడతావు. అందరినీ గెలిచేవాడివి భక్తుల చేతిలో ఓడిపోతావు.

శ్రేయఃసృతిం భక్తిముదస్య తే విభో
క్లిశ్యన్తి యే కేవలబోధలబ్ధయే
తేషామసౌ క్లేశల ఏవ శిష్యతే
నాన్యద్యథా స్థూలతుషావఘాతినామ్

దాన్ని కాదని జ్ఞ్యానం సంపాదించడానికి కష్టపడుతున్నవారికి కష్టం మాత్రం మిగులుతుంది. ఎలాగైతే పెద్ద పెద్ద ఆకారముతో ఉన్న తారు ధాన్యాన్ని (లోపల గింజ లేని ధాన్యాం తారు ధాన్యం. అవి మామూలు వడ్ల గింజలకంటే పెద్దవిగా ఉంటాయి గాని ధాన్యం ఉండదు) దంచేవాడికి శ్రమ మాత్రమే ఎలా మిగులుతుందో.
భక్తితోనే నీ లోఖానికి చేరతారు. జ్ఞ్యానముతో చేరేవారు నాకెవరూ కనపడలేదు. తమ కర్మ వశముతో లభించినా, నీ యందు కలిగిన భక్తి వలన, కోరికంతా నీకే అర్పించి, నీ కథలను వినడం వలన కలిగిన భక్తితోనే నీ లోకాన్ని పొందుతారు

పురేహ భూమన్బహవోऽపి యోగినస్త్వదర్పితేహా నిజకర్మలబ్ధయా
విబుధ్య భక్త్యైవ కథోపనీతయా ప్రపేదిరేऽఞ్జోऽచ్యుత తే గతిం పరామ్

నీ గుణముల యొక్క మహిమలు తెలుసుకోవీలు ఎవరికి ఉంది. పరిశుద్ధమైన ఆత్మలు కొంచెం ప్రయత్నం చేయగలరు నీ స్వరూపం తెలుసుకోవడానికి. ఎవరికీ తెలియనటువంటీ, ఎలాంటి వికారమూ లేనటువంటి, అనుభవముతో మాత్రమే తెలియబడే, కేవలానంద స్వరూపమైన, అనుభవానందస్వరూపమైన, ఎలాంటి రూపము లేనిదైన, భక్తితో తప్ప మరి దేనితో తెలియబడనిది ఐనది భగవంతుని రూపము. ఇతరమైన ఏ సాధనములతో కూడా తెలియబడకుండా ఉండేది పరమాత్మ అని నీ కథ వింటే అర్థం అవుతుంది.

తథాపి భూమన్మహిమాగుణస్య తే విబోద్ధుమర్హత్యమలాన్తరాత్మభిః
అవిక్రియాత్స్వానుభవాదరూపతో హ్యనన్యబోధ్యాత్మతయా న చాన్యథా
గుణాత్మనస్తేऽపి గుణాన్విమాతుం హితావతీఋనస్య క ఈశిరేऽస్య
కాలేన యైర్వా విమితాః సుకల్పైర్భూపాంశవః ఖే మిహికా ద్యుభాసః


నీ గుణములు అనంతములు. నీ గుణ దోషాలు ఎవరికీ తెలియలేవు. నీ గుణాలు అనంతములూ, నీకు దోషాలు లేవు. లేని దోషాలు లెక్కపెట్టలేము, అలాగే అనంతమైన గుణాలనూ లెక్కించలేము. లోకానికి హితం కలిగించడానికే నీవు పుట్టావు. ఈ భూమండలములో ఉన్న రేణువులనూ ఆకాశములో నక్షత్రాలనూ ఎవరైనా లెక్కపెడితే నీ గుణాలను లెక్కించవచ్చు

తత్తేऽనుకమ్పాం సుసమీక్షమాణో భుఞ్జాన ఏవాత్మకృతం విపాకమ్
హృద్వాగ్వపుర్భిర్విదధన్నమస్తే జీవేత యో ముక్తిపదే స దాయభాక్

తాము చేసిన కర్మ పరిపాకాన్ని అనుభవిస్తూ, నీ దయ ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తూ, శరీర మనో వాక్కులతో నీకు నమస్కారం చేస్తూ ఎవరు బతుకుతాడో అటువంటి వాడు నీ దయను పొంది ముక్తిని పొందుతాడు.

పశ్యేశ మేऽనార్యమనన్త ఆద్యే పరాత్మని త్వయ్యపి మాయిమాయిని
మాయాం వితత్యేక్షితుమాత్మవైభవం హ్యహం కియానైచ్ఛమివార్చిరగ్నౌ

దానికి నేనే దుష్టాంతం. నీవు పరమాత్మవు నియంతవు సకల లోక రక్షకుడవు, మాయ కలవారందరినీ మాయ చేసే నీ యందు నేను మాయ చేయాలనుకున్నాను. మాయను కలిగించి నీ వైభవాన్ని చూతామని సంకల్పించాను.
అగ్నిలో ఎంత తేజస్సు ఉందో మిణుగురు పురుగు తెలుసుకుంటుందో. నీవు ఎంత మాయావివో తెలుసుకో ప్రయత్నిస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది. ఐనా నాకీ సంకల్పము నీ మాయ చేతనే కలిగింది

అతః క్షమస్వాచ్యుత మే రజోభువో హ్యజానతస్త్వత్పృథగీశమానినః
అజావలేపాన్ధతమోऽన్ధచక్షుష ఏషోऽనుకమ్ప్యో మయి నాథవానితి

నీ ఈ తప్పును క్షమించు. నేను పుట్టింది రజో గుణముతోనే. అందుకే నాకు ఇలాంటి బుద్ధి పుట్టుంది. తెలియని వాడిని. నేను నీ కంటే వేరుగా ఒక ప్రభువును అనుకున్నాను.
నేను సృష్టి కర్తనూ, నాకు ఆధిపత్యం ఉంది, నేను నీ కంటే విడిగా ఆధిపత్యాన్ని భావించే నా అపరాధాన్ని క్షమించండి. నాకు కూడా కనులు ఉన్నాయి గానీ అవి గుడ్డి కన్నులు.
పరమాత్మను తిరస్కరించుట అనే అజ్ఞ్యానముతో గుడ్డిగా మారిన కనులు గల నేను నీ చేత దయ చూడగలిగిన వాడను. నేను దిక్కులేని వాడను కాను. నీవే నాకు దిక్కు. నీవు ఉండగా నాకు కష్టాలు ఎలా వస్తాయి.
అందుచే నా తప్పును క్షమించి నన్ను మన్నించి నా మీద దయ చూపాలి.

క్వాహం తమోమహదహంఖచరాగ్నివార్భూ
సంవేష్టితాణ్డఘటసప్తవితస్తికాయః
క్వేదృగ్విధావిగణితాణ్డపరాణుచర్యా
వాతాధ్వరోమవివరస్య చ తే మహిత్వమ్

ఎన్నో పుట్టిన తరువాత చివర పుట్టిన వాడిని నేను.  ప్రకృతీ మహదాది తత్వాలూ ఇంద్రియాలూ చిత్తమూ అహంకారమూ మొదలైనవి పుట్టి బ్రహ్మాండం ఏర్పడితే అందులోంచి పుట్టాను నేను.
తరువాతి వారిని సృష్టించడానికి కావలసిన ముడి సరుకుని సృష్టించి తరువాత నన్ను సృష్టించావు. నీవు వాటి అవతల ఉన్నావు. బ్రహ్మాండ ఏర్పడ్డ తరువాత ఏర్పడిన నేనేక్కడ, ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని ఏర్పరచిన నీవెక్కడ. బ్రహ్మాండాన్ని ఆవరించి ఉన్న ఏడు ఆవరణల (పంచభూతములు, మహదహంకారములు) తరువాత నేను బ్రహ్మాండములో చేరాను. అటువంటి నేనెక్కడా? లెక్కపెట్టడానికి అందనటువంటి అనంతమైన బ్రహ్మాండములను ఏర్పరచగల అణువు.  నీవు అణువులో చర్య కలిగిస్తే ఇదంతా పుట్టింది.
సకల వాయువులూ ఆకాశములూ ఆకాశ మార్గములో ఉండే అనంతకోటి బ్రహ్మాండాలన్నీ పరమాత్మ యొక్క రోమ కూపాలలో ఉంటాయి
అటువంటి నేను నీ స్వరూపం ఎలా తెలుసుకోగలను

ఉత్క్షేపణం గర్భగతస్య పాదయోః కిం కల్పతే మాతురధోక్షజాగసే
కిమస్తినాస్తివ్యపదేశభూషితం తవాస్తి కుక్షేః కియదప్యనన్తః

నన్ను పరీక్షించావనుకుంటున్నావు కానీ, గర్భములో ఉన్న శిశువు గర్భ కోశములో తిరుగుతూ తిరుగుతూ కాలితో తల్లిని తన్నితే అది పాపమా? తల్లి విషయములో అది అపరాధముగా మారుతుందా. నేను కూడా నీ గర్భములోనే ఉన్నాను. ఉన్నదో లేదో అనుకునే ప్రపంచమంతా నీ కుక్షిలోనే కదా ఉన్నది.

జగత్త్రయాన్తోదధిసమ్ప్లవోదే నారాయణస్యోదరనాభినాలాత్
వినిర్గతోऽజస్త్వితి వాఙ్న వై మృషా కిన్త్వీశ్వర త్వన్న వినిర్గతోऽస్మి

ప్రళయ సముద్రములో పడుకుని ఉన్న నీ (శ్రీమన్నారాయణుని) నాభి కమలములోంచే నేను పుట్టాను. ఆ మాట నిజం కాదా. పసిపాప తంతే ఏ తల్లి ఐనా తప్పు అనుకుంటుందా.

నారాయణస్త్వం న హి సర్వదేహినామాత్మాస్యధీశాఖిలలోకసాక్షీ
నారాయణోऽఙ్గం నరభూజలాయనాత్తచ్చాపి సత్యం న తవైవ మాయా

నీవు నారాయణుడవు. నారములూ ఉండాలి, అయణములూ ఉండాలి. లోకములో సకల జీవులకూ నీవు సాక్షివీ, ఆత్మవూ. మేము ఏది చేస్తున్నా చూసేవాడవు నీవే. నీకు తెలియకుండా నీవు చూడకుండా మేమేమీ చేయలేము. నీకు చెప్పకుండా కూడా మేము ఏమీ చేయలేము. అందరికీ అంతర్యామివి నీవు. నిన్ను నీవే పరీక్ష చేసుకుంటున్నావు. నీ స్వరూపమే గెలుపు.
నరభూజలాయనాత్ నారాయణ అంగం - వీటన్నిటికీ నీవే అంగము. ఇదంతా నీ మాయే. నేను మోహపడటం కూడా నీ మాయే. మోహం కలిగించిందీ నీవు, నన్ను నవ్వుల పాలు చేసినదీ నీవే, గెలిచానని అనుకుంటూన్నదీ నీవే.

తచ్చేజ్జలస్థం తవ సజ్జగద్వపుః
కిం మే న దృష్టం భగవంస్తదైవ
కిం వా సుదృష్టం హృది మే తదైవ
కిం నో సపద్యేవ పునర్వ్యదర్శి

నీవు ఉన్నది నీటిలోనే ఐతే నేను పుట్టినపుడు పద్మము యొక్క నాడం మొత్తం వెతికా. కానీ నీవు దొరకలేదు. ఎందుకంటే ఆ జలం అంతా నీలోనే ఉంది. నేను తిరిగినది నీ కడుపులోనే. కడుపులో తిరిగి వెతికినవాడికి ఆ  కడుపు ఎవరిదో ఎలా తెలుసుతుంది. నిజముగా నీవు నీటిలో ఉంటే అపుడే నాకు కనపడేవాడివి. అంత నీరూ వెతికితే కనపడలేదు. తీరా పైకి రాగానే హృదయములో నీవే కనపడ్డావు. నీవు నీటిలో ఉన్నావా, నా హృదయములో ఉన్నావా, నేను నీలో ఉన్నానా, నేను నీలో ఉంటే నా హృదయములో నీవెలా కనపడ్డావు. ఇది నాకు అర్థం కాదు.

అత్రైవ మాయాధమనావతారే హ్యస్య ప్రపఞ్చస్య బహిః స్ఫుటస్య
కృత్స్నస్య చాన్తర్జఠరే జనన్యా మాయాత్వమేవ ప్రకటీకృతం తే

వెలుపల బాగా కనపడుతున్న ఈ అనంతమైన జగత్తూ కడుపులో మావి వంటిది. కడుపులో పిల్లవాడి చుట్టూ తిరిగేది నేను. ఇది నా స్వరూపము.

యస్య కుక్షావిదం సర్వం సాత్మం భాతి యథా తథా
తత్త్వయ్యపీహ తత్సర్వం కిమిదం మాయయా వినా

నీ కడుపులో ఈ సకల చరాచర జగత్తూ ఉన్నదున్నాట్లు కనపడుతుంది. అలా కనపడే జగత్తులో నీవు కనపడుతున్నావు. ఇది నిజమా మాయ. ప్రపంచము నీలో ఉంది, నీవు ప్రపంచములో ఉన్నావు. ఇది మాయ కాక మరేమిటి.

అద్యైవ త్వదృతేऽస్య కిం మమ న తే మాయాత్వమాదర్శితమ్
ఏకోऽసి ప్రథమం తతో వ్రజసుహృద్వత్సాః సమస్తా అపి
తావన్తోऽసి చతుర్భుజాస్తదఖిలైః సాకం మయోపాసితాస్
తావన్త్యేవ జగన్త్యభూస్తదమితం బ్రహ్మాద్వయం శిష్యతే

నాకు ఇపుడే నీ మాయా ప్రభావం ఎంతో స్పష్ట బడినది. ఒక సారి నీవు ఒకడిగా ఉండి, దూడలూ పిల్లలూ అన్నీ నీవే అయ్యావు. ప్రతీ వారికీ నాలుగు భుజాలూ శంఖ చక్రాది ఆయుధాలు వనమాలా కనపడ్డాయి. వారందరినీ నేను చూసాను. ఒక్కో కృష్ణుడిలో ఒక్కో బ్రహ్మాండం ఉన్నట్లే కదా. ఎందరు గోపాల బాలురు ఉన్నారో ఎందరు గోవత్సములు ఉన్నాయో అవి నీ రూపముగా చూసాను. వారిలో ప్రపంచాన్ని చూసాను. ఎన్ని బ్రహ్మాండాలూ, నీ స్వరూపలు ఎన్ని, ఇవి ఎలా తెలుసుకోవాలి. అన్నీ చూస్తే ఏమీ లేవు, చివరకు నీవే ఉన్నావు. చూచే మాకు ఇలా కనిపిస్తావు. ఒక్క అద్వైతం మాత్రమే చివరకు మిగులుతుంది.

అజానతాం త్వత్పదవీమనాత్మన్యాత్మాత్మనా భాసి వితత్య మాయామ్
సృష్టావివాహం జగతో విధాన ఇవ త్వమేషోऽన్త ఇవ త్రినేత్రః

మీ స్వరూపం తెలియని వారికి నీవు మాయను ప్రయోగించి, ఆత్మ కాని శరీరాన్ని ఆత్మగా అనిపిస్తావు.
ఎలాగంటే బ్రహ్మ సృష్టిస్తాడూ, రుద్రుడు సంహరిస్తాడూ అనిపిస్తుంది గానీ, వాస్తవముగా ముగ్గురూ నీ రూపమే. సృష్టి యందు నేను రక్షణలో నీవు అంతములో శంకరుడూ అని అనిపిస్తావు కానీ, వాస్తవముగా ఈ మూడూ చేసేది నీవే.

సురేష్వృషిష్వీశ తథైవ నృష్వపి తిర్యక్షు యాదఃస్వపి తేऽజనస్య
జన్మాసతాం దుర్మదనిగ్రహాయ ప్రభో విధాతః సదనుగ్రహాయ చ

నీవు దేవతల  యందూ, ఋషుల  యందూ నరులలో తిర్యక్ జలచరుల జన్మలలో ఇలా రక రకాలుగా పుట్టావు. దుర్మార్గుల గర్వాన్ని హరించడానికి పుట్టావు. సజ్జనులను అనుగ్రహించడానికి పుట్టావు.

కో వేత్తి భూమన్భగవన్పరాత్మన్యోగేశ్వరోతీర్భవతస్త్రిలోక్యామ్
క్వ వా కథం వా కతి వా కదేతి విస్తారయన్క్రీడసి యోగమాయామ్

 ఈ మూడు లోకాలలో ఉన్నవాడెవరైనా నిన్ను తెలియగలడా, ఎక్కడ ఎన్ని రూపాలలో ఎప్పుడు ఉంటావో ఎవరికీ తెలియదు. నీ సంకల్పానుగుణముగా నీవు ఏ ఏ ప్రదేశాలలో ఎప్పుడెప్పుడు అవసరమైతే అక్కడ అవతరిస్తూ ఉంటావు

తస్మాదిదం జగదశేషమసత్స్వరూపం
స్వప్నాభమస్తధిషణం పురుదుఃఖదుఃఖమ్
త్వయ్యేవ నిత్యసుఖబోధతనావనన్తే
మాయాత ఉద్యదపి యత్సదివావభాతి

 ఈ జగత్తు, అశేషం, తమో రూపం( లేనిదే ఉన్నట్లు కనపడుతూ ఉన్నది), ఈ జగత్తు కలలాంటిది, ఉన్న బుద్ధిని పోగొడుతుంది. ఎపుడూ ఇంకొకరికోసం ఏడవడముతోనే సరిపోతుంది. మంది కోసం ఏడిచేవాడే జీవుడు.
మాయతో పుట్టిన ఈ జగత్తు నీ యందే భాసిస్తూ ఉంది. నిత్యానంద స్వరూపుడవైన నీలో నిత్య దుఃఖానికి అలవాలమైన జగత్తును చూసేవాడు అజ్ఞ్యాని.
లేనిది కూడా ఉన్నట్లు భాసిస్తుంది.

ఏకస్త్వమాత్మా పురుషః పురాణః సత్యః స్వయంజ్యోతిరనన్త ఆద్యః
నిత్యోऽక్షరోऽజస్రసుఖో నిరఞ్జనః పూర్ణాద్వయో ముక్త ఉపాధితోऽమృతః

నీవొక్కడవే ఆత్మవు. నీవే పురుషుడవు. మొదటి నుండీ ఉన్నవాడవు నీవే.
 సత్యం జ్ఞ్యానం అంతం బ్రహ్మ.నాశం లేనివాడు మార్పు లేనివాడు నిరంతర ఆనందస్వరూపుడు, ఏదీ అంటని వాడు , పరిపూర్ణుడుం, అద్వయుడు, ఉపాధిబట్టి మారణి వాడు (ఏ ఉపాధి  ఉన్నా ఆయన మోక్ష స్వరూపుడవు),

ఏవంవిధం త్వాం సకలాత్మనామపి స్వాత్మానమాత్మాత్మతయా విచక్షతే
గుర్వర్కలబ్ధోపనిషత్సుచక్షుషా యే తే తరన్తీవ భవానృతామ్బుధిమ్

అన్ని ఆత్మలకూ ఆత్మవూ, అత్మలో మనసూ బుద్ధీ నీవే. గురువు అనే సూర్యుని కిరణాలతో పొందిన ఉపనిషత్ అనే కన్నులు ఉన్నవాడికి నీవు అర్థం అవుతావు. గురువు అనే సూర్యుని యొక్క ప్రకాశముతో పొందిన ఉపనిషత్ అనే నేత్రములు కలవారికి దొరుకుతావు.

ఆత్మానమేవాత్మతయావిజానతాం తేనైవ జాతం నిఖిలం ప్రపఞ్చితమ్
జ్ఞానేన భూయోऽపి చ తత్ప్రలీయతే రజ్జ్వామహేర్భోగభవాభవౌ యథా

శరీరం వేరు ఆత్మ వేరు అని విడిగా తెలియదు మనుషులకు. ప్రపంచమంతా ఆత్మ (పరమాత్మతోనే ) పుట్టింది. తాడును చూసి పాము అనుకుంటారు. పాము కాని దాన్ని పాము అనుకోగానే భయం పుట్టినట్లు, ఆత్మ కాని దాన్ని ఆత్మ అనుకోవడం వలన సంసారం పుడుతుంది.

అజ్ఞానసంజ్ఞౌ భవబన్ధమోక్షౌ ద్వౌ నామ నాన్యౌ స్త ఋతజ్ఞభావాత్
అజస్రచిత్యాత్మని కేవలే పరే విచార్యమాణే తరణావివాహనీ

సంసారమూ మోక్షమూ రెండూ అజ్ఞ్యానమే. ఆత్మకు ఈ రెండూ లేవు. ఆ రెండూ పేరుతోటే గానీ నిజముగా లేవు. నిరంతరం గురువును సేవించడం వలన పరమాత్మ ఒక్కడే నిజం అని తెలుసుకొని పగలూ రాత్రీ సూర్యుడిలో ఉండుట ఎంత అబద్దమో సంసారమూ మోక్షమూ ఆత్మలో ఉన్నాయి అనుకోవడం అంత అబద్దం. పరమాత్మ అనుగ్రహిస్తే మోక్షం, నిగ్రహిస్తే సంసారం.

త్వామాత్మానం పరం మత్వా పరమాత్మానమేవ చ
ఆత్మా పునర్బహిర్మృగ్య అహోऽజ్ఞజనతాజ్ఞతా

నీవే ఆత్మవూ పరమాత్మవూ అని తెలిసి కూడా నీకంటే వేరే చోట ఆత్మ ఉందీ అని వెతుకుట అజ్ఞ్యానుల అజ్ఞ్యానం. సంసారములో పుట్టిన సజ్జనులు, దేహాత్మభావాన్ని వదిలిపెట్టకుండా బయట వెదుకుతూ ఉన్నారు. లేని ప్రపంచం ఉన్నదనీ, ఉన్న నీవు  లేవనీ తలుస్తూ ఉంటారు

అన్తర్భవేऽనన్త భవన్తమేవ హ్యతత్త్యజన్తో మృగయన్తి సన్తః
అసన్తమప్యన్త్యహిమన్తరేణ సన్తం గుణం తం కిము యన్తి సన్తః

లేదు అనే భావన కలిగించే దాన్ని లేదనుకుని, ఉన్న నీవు లేవని అనుకుని, అసలు  లేని ప్రపంచాన్ని ఉంది అనుకుటున్నారు
లేని దాన్ని ఉన్నదనుకునేవారు నిజముగా ఉన్నదాన్ని పొందగలరా

అథాపి తే దేవ పదామ్బుజద్వయ ప్రసాదలేశానుగృహీత ఏవ హి
జానాతి తత్త్వం భగవన్మహిమ్నో న చాన్య ఏకోऽపి చిరం విచిన్వన్

ఇదంతా తెలుసుకోవాలనే ప్రయత్నం మాని నీ పాదములను పట్టుకుంటే నీ పాద ద్వయమును స్వీకరించిన కొద్ది అనుభవముతో ఈ తత్వమంతా తెలుసుకోవచ్చు

తదస్తు మే నాథ స భూరిభాగో భవేऽత్ర వాన్యత్ర తు వా తిరశ్చామ్
యేనాహమేకోऽపి భవజ్జనానాం భూత్వా నిషేవే తవ పాదపల్లవమ్

నీ ఇష్టమొచ్చిన రీతిన నన్ను సృష్టి చేయి. సకల జంతువులలో కూడా సృష్టించు. ఎలా సృష్టించినా నీ వళ్ళ మధ్యలో సృష్టించు
వ్రేపల్లెలో ఉండే గోవులూ గోపికలూ ఎంత గొప్ప ధన్యులు. ఎందుకంటే వారందరి స్తన్యమునూ నీవు తాగావు. ఒక్క యశోదా నందులకే ఆ భాగ్యం ఇవ్వకుండా అందరికీ ఆ భాగ్యం అందించడానికి గోపాల బాలకుడిగా వచ్చావు

అహోऽతిధన్యా వ్రజగోరమణ్యః స్తన్యామృతం పీతమతీవ తే ముదా
యాసాం విభో వత్సతరాత్మజాత్మనా యత్తృప్తయేऽద్యాపి న చాలమధ్వరాః

ఎన్ని యజ్ఞ్యాలు చేసినా తృప్తి పొందని నీవు గోపాలుర వత్సముల రూపములో వచ్చి గోపికల, గోవుల రూపములో వచ్చి వారి స్తన్యం తాగి తృప్తి పొందావు

అహో భాగ్యమహో భాగ్యం నన్దగోపవ్రజౌకసామ్
యన్మిత్రం పరమానన్దం పూర్ణం బ్రహ్మ సనాతనమ్

నందగోకులములో ఉండే వారి భాగ్యమే భాగ్యం. పరమాంద స్వరూపుడైన పర బ్రహ్మ ఎవరికి మిత్రుడో అలాంటి వారి జన్మ కదా భాగ్యం

ఏషాం తు భాగ్యమహిమాచ్యుత తావదాస్తామ్
ఏకాదశైవ హి వయం బత భూరిభాగాః
ఏతద్ధృషీకచషకైరసకృత్పిబామః
శర్వాదయోऽఙ్ఘ్ర్యుదజమధ్వమృతాసవం తే

నీ మహిమ తెలుసని చెప్పడానికి యోగ్యులైన పదకొండు మంది నీ భక్తులం మాత్రం నీ మహిమను తెలుసుకో గల యోగ్యులం అని అనుకున్నాము.  (బ్రహ్మ రుద్రుడూ ఇంద్రుడూ యముడూ త్వష్టా సూర్యుడూ...) ఈ పదకొండుమందిమీ ఇంద్రియాలనే పదకొండు డొప్పలతో మాటి మాటికీ నీ పాదోదకం అనే మధుర అమృత రసాన్ని తాగుతూ ఉన్నాము.
మేము ధన్యులం అని అనుకుంటూ ఉన్నాము. ఈ పనిని వ్రేపల్లెలో గోవులూ గోపాలకులూ గోపికలూ రోజూ చేస్తూ ఉన్నారు

తద్భూరిభాగ్యమిహ జన్మ కిమప్యటవ్యాం
యద్గోకులేऽపి కతమాఙ్ఘ్రిరజోऽభిషేకమ్
యజ్జీవితం తు నిఖిలం భగవాన్ముకున్దస్
త్వద్యాపి యత్పదరజః శ్రుతిమృగ్యమేవ

కాబట్టి బ్రహ్మలోకములో పుట్టుట అదృష్ట హీనత. అంత కన్నా గోకులలో  ఉన్న ప్రాణులలో ఏదో ఒక ప్రాణి పాద ధూళి తగిలే ప్రాణిగా ఈ అడవిలో పుట్టడం ధన్యం.
వ్రేపల్లెలో ఉండే సకల ప్రాణుల బతుకు నీవే. అందుకే అక్కడ ఏ ప్రాణి పాద ధూళి సోకే జన్మ వచ్చినా అదృష్టమే
ఇప్పటికీ నీ పాద ధూళి ఎక్కడ దొరుకుతుందో అని వేదములు కూడా వెతుకుతూ ఉన్నాయి.

ఏషాం ఘోషనివాసినాముత భవాన్కిం దేవ రాతేతి నశ్
చేతో విశ్వఫలాత్ఫలం త్వదపరం కుత్రాప్యయన్ముహ్యతి
సద్వేషాదివ పూతనాపి సకులా త్వామేవ దేవాపితా
యద్ధామార్థసుహృత్ప్రియాత్మతనయప్రాణాశయాస్త్వత్కృతే

ఈ వ్రేపల్లె వాడల్లో ఉండేవారికి నిన్ను నీవు ఇచ్చుకున్నావు. వారేమి పుణ్యం చేసుకున్నారు. వారు పుణ్యం చేసుకుంటే నిన్ను నీవు ఇచ్చుకున్నావా లేక నీకు నిన్ను ఇచ్చుకోవాలనిపించుకుని ఇచ్చుకున్నావా. సకల జగత్తు యొక్క అజ్ఞ్యానాన్ని జ్ఞ్యానముగా భావించి, నిన్ను పొందాలనుకోవడం అజ్ఞ్యానం. మా భక్తితో జ్ఞ్యానముతో నీవు దొరికేవాడవు కావు. నీకు కృప కలిగితేనే దొరుకుతావు.
నిన్ను ద్వేషించిన పుణ్యానికి పూతన సకుటుంబముగా నిన్ను పొందింది. నిరంతరం ఇళ్ళూ వళ్ళూ భార్యా పిల్లలూ సంపదా అన్నీ నీవే అనుకున్న వ్రేపల్లె వాసులకు ఏమి దొరుకుతుందో వేరే చెప్పాలా.

తావద్రాగాదయః స్తేనాస్తావత్కారాగృహం గృహమ్
తావన్మోహోऽఙ్ఘ్రినిగడో యావత్కృష్ణ న తే జనాః

ప్రేమా మోహం ద్వేషం కోపం కలహం, ఇవన్నీ పనికి రానివి, నరకాన్నిస్తాయి, నిందించబడేవి. ఇల్లూ సంసారం అంతా బంధము. (వ్యా)మోహమనేది రెండు కాళ్ళ సంకెళ్ళు. కాని ఇదంతా నీయందు భక్తి కలిగే దాక. నీ వారు కానంత వరకూ ఇవన్నీ బంధనానికి కారణాలు. నిందించదగినవి. కామాదులు కాళ్ళకు సంకెళ్ళు. ఒక్క సారి నీవారే ఐతే అవన్నీ మోక్షాన్నిస్తాయి. పూతనా బకాసురుడూ శకటాసురుడూ నిన్ను ద్వేషించే మోక్షానికి వెళ్ళారు. గోపికలు కృష్ణున్ని జారుడనుకొనే వెళ్ళారు, మోక్షాన్ని పొందారు. కొడుకుగా ప్రేమించిన యశోదాదులకూ మోక్షం వచ్చింది. నరకాన్నిచ్చే పనులు నీయందు చేసే మోక్షం వస్తుంది.
నాలుగు వేదాల సారం ఈ శ్లోకం. నీవాన్ని అనుకుని ఏమి చేసినా ఏ పని చేసినా అది బంధించదు. ద్వేషించినా కామించినా నిందించినా మోక్షమే వస్తుంది.


ప్రపఞ్చం నిష్ప్రపఞ్చోऽపి విడమ్బయసి భూతలే
ప్రపన్నజనతానన్ద సన్దోహం ప్రథితుం ప్రభో

నీవాళ్ళు కానంతవరకే కామం బంధిస్తుంది, ఇల్లు బంధనముగా మారుతుంది, ప్రేమ వంచనా అన్నీ ఉంటాయి. ఏమీ లేని నీవు ఇంత ప్రపంచాన్ని చూపుతున్నావు. ప్రపంచాన్ని చూస్తే నీవు కనపడవు. నిన్ను చూస్తే నీవూ కనపడతావూ, నీలో ఉన్న ప్రపంచమూ కనపడుతుంది. అందుకే భగవంతునికి బదులు భక్తునికి దండం పెడితే అది భగవంతునికీ భక్తునికీ చెందుతుంది.
అన్నీ మాయలు తొలగిన తరువాత చేసిన ఈ స్తోరం అద్భుత స్తోత్రం. ఏమీ లేని నీవు ప్రపంచాన్ని ఎందుకు మాకు చూపుతున్నావంటే నిన్ను ఆశ్రయించిన వారిని నీవు కాపాడతావని ప్రచారం చేసుకోవడానికే. సంసారమూ ప్రపంచమూ భక్తులూ లేకుంటే పరమాత్మ భక్త జన రక్షకుడు అని ఎవరికి తెలుసుతుంది. అది అందరికీ తెలియజెప్పడానికే మాకు ఈ ప్రపంచాన్ని సృష్టించి చూపుతున్నావు. ఇంత నీచులనూ దీనులనూ కూడా నీవొచ్చి రక్షించడానికి సృష్టించావు.

జానన్త ఏవ జానన్తు కిం బహూక్త్యా న మే ప్రభో
మనసో వపుషో వాచో వైభవం తవ గోచరః

స్వయానా మహా జ్ఞ్యానులై నిన్ను తెలుసుకునే వారు ఉన్నారేమో గానీ, నాకు తెలిసింది మాత్రం ఒక్కటే మనసుతో వాక్కుతో శరీరముతో నిన్ను నేను తెలుసుకోలేను.

అనుజానీహి మాం కృష్ణ సర్వం త్వం వేత్సి సర్వదృక్
త్వమేవ జగతాం నాథో జగదేతత్తవార్పితమ్

ఇవన్నీ నేనేందుకు చెబుతున్నాను? నీకన్నీ తెలుసు కదా? నేనేమనుకుని స్తోత్రం చేస్తున్నానో నీకు తెలుసు. మీకంటే వేరేదేమైనా ఉంటే మీకు అది అర్పించవచ్చు. కానీ ఉన్న జగత్తంతా నీవే. అందుకు ఆ జగత్తునే నీకు అర్పిస్తున్నాను.

శ్రీకృష్ణ వృష్ణికులపుష్కరజోషదాయిన్
క్ష్మానిర్జరద్విజపశూదధివృద్ధికారిన్
ఉద్ధర్మశార్వరహర క్షితిరాక్షసధ్రుగ్
ఆకల్పమార్కమర్హన్భగవన్నమస్తే

శ్రీకృష్ణా వృష్ణి కులం (యదు వంశం) అనే పద్మానికి శాంతిని ప్రసాదించావు. భూలోకములో బ్రాహ్మణులూ పశువులూ సముద్రములూ మొదలైన వాటిని అభివృద్ధిచేసేవాడా, అధర్మం అనే చీకటిని తొలగించేవాడా, భూమి మీద ఉండే రాక్షసులను సంహరించేవాడా, ప్రళయం దాకా వెలుగునిచ్చేవాడా నీకు నమస్కారం

శ్రీశుక ఉవాచ
ఇత్యభిష్టూయ భూమానం త్రిః పరిక్రమ్య పాదయోః
నత్వాభీష్టం జగద్ధాతా స్వధామ ప్రత్యపద్యత

ఇలా పరమాత్మను స్తోత్రం చేసి మూడు సార్లు ప్రదక్షిణం చేసి పాదములకు నమస్కారం చేసి జగత్తును సృష్టించిన బ్రహ్మ తన నివాసానికి చేరుకున్నాడు

తతోऽనుజ్ఞాప్య భగవాన్స్వభువం ప్రాగవస్థితాన్
వత్సాన్పులినమానిన్యే యథాపూర్వసఖం స్వకమ్

ఆయనకు ఆజ్ఞ్యనిచ్చి బ్రహ్మ దాచిన తన పిల్లలను వ్రేపల్లెకు తెచ్చుకున్నాడు. వారికంతవరకూ ఏమీ తెలియలేదు. అపుడే అఘాసుర సంహారం జరిగింది అనుకున్నారు

ఏకస్మిన్నపి యాతేऽబ్దే ప్రాణేశం చాన్తరాత్మనః
కృష్ణమాయాహతా రాజన్క్షణార్ధం మేనిరేऽర్భకాః

సంవత్సరం గడిచినా పరమాత్మ మాయతో క్షణ కాలమే జరిగిందనుకుని కౌమారములో జరిగిన దాన్ని పౌగండ్రములో జరిగినట్లు చెప్పుకున్నారు

కిం కిం న విస్మరన్తీహ మాయామోహితచేతసః
యన్మోహితం జగత్సర్వమభీక్ష్ణం విస్మృతాత్మకమ్

పరమాత్మ మాయతో ఆయననే మరచిపోతున్నప్పుడు ఒక సంవత్సరాన్ని మరచిపోవడములో వింతేముంది. ఈ జగత్తంతా పరమాత్మ మాయ వలన ఆత్మనే మరచిపోయింది.

ఊచుశ్చ సుహృదః కృష్ణం స్వాగతం తేऽతిరంహసా
నైకోऽప్యభోజి కవల ఏహీతః సాధు భుజ్యతామ్

ఈ సంవత్సరకాలం కృష్ణ పరమాత్మ ఎడమ చేతిలో పెరుగు ముద్దా, ఊరగాయ బద్దా పట్టుకుని అలాగే నిలబడి ఉన్నాడు. ఆ బాలకులందరూ తినడానికి పిలిచారు కృష్ణున్ని.

తతో హసన్హృషీకేశోऽభ్యవహృత్య సహార్భకైః
దర్శయంశ్చర్మాజగరం న్యవర్తత వనాద్వ్రజమ్

పరమాత్మ కూడా తాను చేసిన కర్మను తాను అనుభవిస్తాడు. భోజనం చేద్దామని కూర్చుని ఉన్న అంబరీషున్ని ఏడాది బాటు తినకుండా నిలబెట్టినందుకు తనకుతాను అలా ఏడాది బాటు ముద్ద పట్టుకునే నిలబడ్డాడు (ఇది పాద్మ పురాణాంతర్గతం)
నవ్వుతూ నవ్విస్తూ పరమాత్మ బృందావనానికి వెళుతూ కొండచిలువ చర్మాన్ని చూపుతూ తీసుకు వెళ్ళాడు.

బర్హప్రసూనవనధాతువిచిత్రితాఙ్గః
ప్రోద్దామవేణుదలశృఙ్గరవోత్సవాఢ్యః
వత్సాన్గృణన్ననుగగీతపవిత్రకీర్తిర్
గోపీదృగుత్సవదృశిః ప్రవివేశ గోష్ఠమ్

నెమలి పించం పుష్పములూ రక రకాల ధాతువులతో అలంకరించుకుని బాగా మ్రోగించే వేణు నాదముతో పండుగ చేసుకుంటూ దూడలను వెతుకుతూ పిలిస్తూ తన వెంట ఉన్నవారి చేత గానం చేయబడుతున్న పవిత్రమైన కీర్తి కలవాడు. ఆ కృష్ణ పరమాత్మ ఆవులను పేర్లతో పిలుస్తున్నాడు. (నిరంతరం పరమాత్మ చేత పిలవబడేవి కాబట్టే మనం కూడా గోవులను పూజిస్తాము)
గోపికల కనులకు పండువ చేసే ఆకారం కలవాడు పరమాత్మ. మూడవ ఝాము కాగానే అన్ని పనులూ మానివేసుకుని కృష్ణుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వ్రేపల్లెకూ, తన ఇంటికి తాను ప్రవేశించాడు కృష్ణుడు

అద్యానేన మహావ్యాలో యశోదానన్దసూనునా
హతోऽవితా వయం చాస్మాదితి బాలా వ్రజే జగుః

అపుడే వ్రేపల్లెకు వచ్చిన పిల్లలు పెద్ద వింత జరిగిందీ అంటూ కృష్ణుడు చంపిన పెద్ద పాము గురించి చెప్పారు. అంతేకాదు మమ్ము మింగిన పాముని చంపి మమ్ము బతికించాడు. అఘాసుర సంహారాన్ని పాటలుగా అల్లుకుని అంతటా పాడుకుంటూ తిరిగారు.

శ్రీరాజోవాచ
బ్రహ్మన్పరోద్భవే కృష్ణే ఇయాన్ప్రేమా కథం భవేత్
యోऽభూతపూర్వస్తోకేషు స్వోద్భవేష్వపి కథ్యతామ్

సంసారములో ఉన్నవారికి ఆస్తీ ఇల్లూ ధనమూ సంపదా అంటే ఇష్టం ఉంటుంది కానీ కృష్ణుడి మీద ప్రేమ ఎందుకు కలిగింది.ఇంతకు ముందు ఆ పిల్లలూ దూడలూ వారివే. అప్పటిదాకా కలగని ప్రేమ అన్నీ కృష్ణుడే ఐనపుడు ఒక్కసారిగా అంత ప్రేమ ఎందుకు కలిగింది.

శ్రీశుక ఉవాచ
సర్వేషామపి భూతానాం నృప స్వాత్మైవ వల్లభః
ఇతరేऽపత్యవిత్తాద్యాస్తద్వల్లభతయైవ హి

నేను నా భార్యనూ పిల్లలనూ కొడుకులనూ డబ్బునూ ఇంటినీ ఎక్కువ ప్రేమిస్తున్నాను, నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని మనుషులు అంటూ ఉంటారు.  నిజమైన ప్రేమ వారి మీద వారికే. ప్రతీ ప్రాణికీ తన ఆత్మ అంటేనే ప్రేమ. ఆ ఆత్మను కూడా ప్రేమించడానికి కారణం అందులో పరమాత్మ ఉన్నాడు కాబట్టి. పరమాత్మ మీద ప్రేమే తెలియకుండా ఆత్మ మీద ప్రేమగా మారుతుంది.
తనకు ఇష్టం కాబట్టే భార్య మీదా పిల్లల మీదా ప్రేమ. ప్రేమ అనేది ఆత్మ తృప్తి కోసమే.
ఇదే బృహదారణ్యక ఉపనిషత్ వాక్యం. పెళ్ళి చేసుకునే ఏ అమ్మాయీ అబ్బాయీ ఐనా తన భర్తా లేదా భార్య ఒకరినొకరు బాగా ప్రేమించుకోవాలి పరస్పరం అనుకుంటారు. మరి కొద్ది కాలములోనే ఎందుకు మారుతున్నది? అలా అనుకున్న వారందరూ ప్రేమగానే ఉంటున్నారా? కొందరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు. భర్త కోరితే భార్య ప్రియురాలు కాలేరు, భార్య కోరితే భర్త ప్రియుడూ కాలేడు. పరమాత్మ సంకల్పిస్తేనే భార్య భర్తకు ప్రియురాలవుతుంది, పరమాత్మ సంకల్పిస్తేనే భర్త భార్యకూ ప్రియుడవుతాడు
అలా అన్యోన్యముగా భార్యా భర్తలు గడపడానికే వివాహములో అగ్నిహోత్ర ఆరాధన చేస్తారు. భగవంతుని అలా ప్రార్థించుటే వివాహ ప్రక్రియకు మూలము. (ఆత్మన కామాయ)
తనను తాను ప్రేమిస్తున్నాడు కాబట్టే అన్నిటినీ ప్రేమిస్తున్నారు. తనను తాను ప్రేమించడానికి కారణం తనలో పరమాత్మ ఉన్నాడుకాబట్టి. (ఆత్మన కామాయ)

తద్రాజేన్ద్ర యథా స్నేహః స్వస్వకాత్మని దేహినామ్
న తథా మమతాలమ్బి పుత్రవిత్తగృహాదిషు

తన మీద, తన ఆత్మ మీద ఎంత ప్రేమ ఉంటుందో, తన వారి మీద కూడా ప్రేమ ఉంటుంది. తనను తాను ప్రేమించని వాడు తన భార్యనూ పిల్లలనూ ప్రేమించలేడు.
తనను ప్రేమించుకుంటాడు కాబట్టే వారంతా ఇష్టులు. తనను తాను ప్రేమించుకోని నాడు ఎవరినీ ప్రేమించలేడు.

దేహాత్మవాదినాం పుంసామపి రాజన్యసత్తమ
యథా దేహః ప్రియతమస్తథా న హ్యను యే చ తమ్

ఆత్మను ప్రేమిస్తేనే ఈ ప్రేమలన్నీ ఉంటాయి. శరీరాన్ని మాత్రమే ప్రేమించుకునే వారు భార్యనూ కుటుంబాన్నీ మిత్రులనూ ప్రేమించలేరు. ఆత్మ వరకూ వెళ్ళిన వారు మాత్రమే భార్యనీ మిత్రులనీ బంధువులనూ ప్రేమించగలరు
శరీరాన్ని బాగా పోషించుకుంటా అనుకున్నవారు మాత్రమే భర్తను ప్రేమించరు. నా శరీరానికి కావలసిన సుఖాన్ని నేను కోరిన రీతిలో ఇవ్వలేదు కాబట్టి నాకీ భార్య వద్దు అనుకుంటాడు. స్వాత్మను ప్రేమించని వాడు జగత్తును ప్రేమించలేడు.

దేహోऽపి మమతాభాక్చేత్తర్హ్యసౌ నాత్మవత్ప్రియః
యజ్జీర్యత్యపి దేహేऽస్మిన్జీవితాశా బలీయసీ

శరీరం మీద ప్రేమ ఆత్మ స్వరూప సాక్షాత్కారానికి పనికొస్తేనే అది నిజమైన ప్రేమ.
ఆత్మ కోసమే ఈ సకల చరాచర జగతూ. ఆత్మకు ప్రీతి చేకూర్చడానికే ఈ జగత్తు. అటువంటి అన్ని ఆత్మలకు కృష్ణుడు ఆత్మ

తస్మాత్ప్రియతమః స్వాత్మా సర్వేషామపి దేహినామ్
తదర్థమేవ సకలం జగదేతచ్చరాచరమ్

కృష్ణమేనమవేహి త్వమాత్మానమఖిలాత్మనామ్
జగద్ధితాయ సోऽప్యత్ర దేహీవాభాతి మాయయా

అన్ని ఆత్మలకూ ఆత్మ ఐన పరమాత్మ జగత్తుకి హితం కలిగించాలని తాను కూడా శరీరధారిలా మన ముందు నిలబడ్డాడు

వస్తుతో జానతామత్ర కృష్ణం స్థాస్ను చరిష్ణు చ
భగవద్రూపమఖిలం నాన్యద్వస్త్విహ కిఞ్చన

నిజమైన జ్ఞ్యానం ఉన్నవాడికి ఈ ప్రపంచములో ఉన్న స్థావరమూ జంగమమూ, సకల వస్తువులూ పరమాత్మే.

సర్వేషామపి వస్తూనాం భావార్థో భవతి స్థితః
తస్యాపి భగవాన్కృష్ణః కిమతద్వస్తు రూప్యతామ్

భగవంతునికన్నా భిన్నమైనది ఏదీ లేదూ, ఉండదు. నిరంతరం ఉండే దాన్నే ఉన్నది అంటాము. ఏ ఉనికిని బట్టి నీవు ఉన్నది అంటున్నావో ఆ ఉనికి పరమాత్మ. ఉన్నదీ అన్నా పరమాత్మే, లేదు అన్నా పరమాత్మే. ఒక సారి కనపడి మరొకసారి కనపడకపోతే దాన్ని లేదూ అంటాము. లేదు అనడానికి కూడా ఉనికే కారణం. ఉన్నదే కనపడనప్పుడు లేదు అంటాము. లేదు అనేది ఉండడానికి కూడా ఉండడమే కారణం. లేనిదిలోనూ ఉన్నదిలోనూ ఉన్నవాడు పరమాత్మే.

సమాశ్రితా యే పదపల్లవప్లవం మహత్పదం పుణ్యయశో మురారేః
భవామ్బుధిర్వత్సపదం పరం పదం పదం పదం యద్విపదాం న తేషామ్
పరమ పవిత్రమైన కీర్తి కల పరమాత్మ పాద పల్లవమును ఆశ్రయించినవారికి సంసార సముద్రము ఒక గోష్పదం (చిన్న దూడ కాలువంటిది) . పరమ పాదము నమ్మిన వారికి పరమపదమే పదము, వారికి ఆపదలు ఉండవు

ఏతత్తే సర్వమాఖ్యాతం యత్పృష్టోऽహమిహ త్వయా
తత్కౌమారే హరికృతం పౌగణ్డే పరికీర్తితమ్

నీవడిగినది నేను చెప్పాను. కౌమారములో జరిగినది పౌగండ్రములో చెప్పడం గురించి చెప్పాను

ఏతత్సుహృద్భిశ్చరితం మురారేరఘార్దనం శాద్వలజేమనం చ
వ్యక్తేతరద్రూపమజోర్వభిష్టవం శృణ్వన్గృణన్నేతి నరోऽఖిలార్థాన్

మిత్రులతో కలిసి భోజనం చేయడం అఘాసుర వధనూ, బ్రహ్మ స్తోత్రాన్ని చెప్పాను. ఇది వింటూ చెబుతూ ఉన్నవారు అనుకున్నవాటిని పొందుతాడు.

ఏవం విహారైః కౌమారైః కౌమారం జహతుర్వ్రజే
నిలాయనైః సేతుబన్ధైర్మర్కటోత్ప్లవనాదిభిః

ఇలా పరమాత్మ కౌమార విహారముతో కుమార భావాన్ని వదిలిపెట్టాడు. దాగుడు మూతలతో పిచ్చుక గూళ్ళతో కోతి గంతులతో కౌమారం పూర్తి చేసుకున్నాడు

                                     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు