Pages

Saturday, 19 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదమూడవ అధ్యాయం

                                            ఓం నమో భగవతే వాసుదేవాయ 


శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదమూడవ అధ్యాయం

మోక్షం కావాలనుకునే వారు పారాయణ చేయాల్సిన అధ్యాయం ఇది. సంచి ఆగామి ప్రారబ్ధ కర్మలు పోగొడుతుంది.

శ్రీశుక ఉవాచ
సాధు పృష్టం మహాభాగ త్వయా భాగవతోత్తమ
యన్నూతనయసీశస్య శృణ్వన్నపి కథాం ముహుః

అపుడు శుకుడు "చాలా బాగా అడిగావు. దాని వలన నాకు వాటిలో ఉన్న కొత్త రుచిని అందిస్తున్నావు"

సతామయం సారభృతాం నిసర్గో యదర్థవాణీశ్రుతిచేతసామపి
ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య యత్స్త్రియా విటానామివ సాధు వార్తా

పరమాత్మ యొక్క భక్తులకు సజ్జనులను నిరంతరం సేవించేవారికి, ఇది స్వభావం. నిరంతరం పరమాత్మ కథలూ గుణాలూ నామసంకీర్తనం చేస్తూ ఉన్నా, దానితోనే మనసునూ చెవులనూ నోటినీ పావనం చేస్తూ ఉన్నా, అది ఏ క్షణానికి ఆ క్షణం కొత్తదే.
వేశ్యకు విటుడి వార్త ఎప్పుడూ కొత్తగా ఉన్నట్లు, పరమాత్మ కథ కూడా భక్తులకు ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది.

శృణుష్వావహితో రాజన్నపి గుహ్యం వదామి తే
బ్రూయుః స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత

ఇది మనకు తదీయారాధన ఘట్టం. "మహారాజా మనసునూ ఒంటినీ దగ్గర పెట్టుకుని సావధానముగా విను. నేను అతి రహస్యమైన దాన్ని చెప్పబోవుతున్నాను. స్నేహ పాత్రుడైన శిష్యునికి గురువుగారు అడుగకున్న ఉత్తమ రహస్యాలను చెబుతూ ఉంటారు." శిష్యుడికి ఇది అడగాలి అని తెలియదు. కాబట్టి గురువుగారే చెప్పాలి.

తథాఘవదనాన్మృత్యో రక్షిత్వా వత్సపాలకాన్
సరిత్పులినమానీయ భగవానిదమబ్రవీత్

ఈ రీతిలో పరమాత్మ పాము నోటిలో నుండి బయటకు తెచ్చిన గోపాలబాలకులను నదీ తీరములో కూర్చోబెట్టి

అహోऽతిరమ్యం పులినం వయస్యాః స్వకేలిసమ్పన్మృదులాచ్ఛబాలుకమ్
స్ఫుటత్సరోగన్ధహృతాలిపత్రిక ధ్వనిప్రతిధ్వానలసద్ద్రుమాకులమ్

మిత్రులారా ఎంత బాగుంది ఈ నదీ తీరం, రక రకాలుగా ఆడీ ఆడీ, ఆటల వలన గడ్డి అంతా అణచిపోయి,  తివాచీ పరచినట్లుగా ఉంది
పద్మాలలో ఉండే మకరందాన్ని ఆస్వాదించడానికి వచ్చిన తుమ్మెదల గుంపు చేసే ఝంకారం ప్రతిధ్వనించబడి సందడిగా ఉంది

అత్ర భోక్తవ్యమస్మాభిర్దివారూఢం క్షుధార్దితాః
వత్సాః సమీపేऽపః పీత్వా చరన్తు శనకైస్తృణమ్

ఈ రోజు మనం ఇక్కడే కూర్చుని తిందాము. ఈ ప్రదేశం చాలా బాగుంది. సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చాడు. మనందరకూ ఆకలి వేస్తోంది. దూడలు కూడా దప్పి గొన్నాయి. అవి కూడా పక్కకు వెళ్ళి తింటూ ఉంటాయి.

తథేతి పాయయిత్వార్భా వత్సానారుధ్య శాద్వలే
ముక్త్వా శిక్యాని బుభుజుః సమం భగవతా ముదా

అందరూ సరే అని దూడలను దూరముగా తీసుకుపోయి వాటికి నీటిని తాపి, దూరముగా ఉన్న పచ్చికలో విడిచిపెట్టి, వాటి మూతికి ఉన్న బుట్టను విప్పారు
పరమాత్మతో కలిసి అందరూ సంతోషముతో భోజనం చేయడం మొదలుపెట్టారు

కృష్ణస్య విష్వక్పురురాజిమణ్డలైర్
అభ్యాననాః ఫుల్లదృశో వ్రజార్భకాః
సహోపవిష్టా విపినే విరేజుశ్
ఛదా యథామ్భోరుహకర్ణికాయాః

అందరూ కృష్ణుని చుట్టూ చేరారు. పరమాత్మ చుట్టూ అన్ని రకములుగా వ్యాపించిన దివ్య తేజస్సును తనివి తీరా చూడాలని ఆయనకు అన్ని వైపులా కూర్చున్నారు. ఇలాంటి పరమాత్మను ఇంత దగ్గరగా చూసే అవకాశం దొరికిందని వారి ముఖాలు వికసించాయి, కనులు విప్పారాయి
అందరూ కలిసి అరణ్యములో కూర్చుని శోభిస్తున్నారు. పద్మము యొక్క మధ్యభాగము( కర్ణిక) చుట్టూ పుప్పొడి ఉన్నట్లుగా కృష్ణ పరమాత్మ చుట్టూ అందరూ మూగి ఉన్నారు

కేచిత్పుష్పైర్దలైః కేచిత్పల్లవైరఙ్కురైః ఫలైః
శిగ్భిస్త్వగ్భిర్దృషద్భిశ్చ బుభుజుః కృతభాజనాః

తినడానికి పూలనూ ఆకులనూ చిగురుటాకులనూ మొలకలనూ పళ్ళనూ చెట చర్మమూ రాళ్ళూ వీటిని పాత్రలుగా చేసుకున్నారు. వీటిని పాత్రలుగా చేసుకుని తినడం మొదలుపెట్టారు.

సర్వే మిథో దర్శయన్తః స్వస్వభోజ్యరుచిం పృథక్
హసన్తో హాసయన్తశ్చా భ్యవజహ్రుః సహేశ్వరాః

తాను తింటూ పక్కవారికి చూపుతున్నారు. ఒకరి పదార్థాల రుచిని మరొకరు చూస్తున్నారు. నవ్వుతూ నవ్విస్తున్నారు.

బిభ్రద్వేణుం జఠరపటయోః శృఙ్గవేత్రే చ కక్షే
వామే పాణౌ మసృణకవలం తత్ఫలాన్యఙ్గులీషు
తిష్ఠన్మధ్యే స్వపరిసుహృదో హాసయన్నర్మభిః స్వైః
స్వర్గే లోకే మిషతి బుభుజే యజ్ఞభుగ్బాలకేలిః

పరమాత్మతో కలిసి అనుభవించారు. అందరూ ఆరగిస్తూ ఉంటే, అందరినీ ప్రోత్సహిస్తూ స్వామి భోజనం పెడుతూ, వడ్డిస్తూ తింటున్నాడు.
మురళిని బొడ్డు దగ్గర దోపుకుని, కొమ్మూ కొరడా చంకలో ఇరికించుకున్నాడు, ఎడమ చేతిలో మీగడ ముద్దపెట్టుకుని, ఊరగాయ ముక్కలను వేళ్ళ సందుల పెట్టుకున్నాడు, తన మిత్రుల మధ్య నిలబడి తనదైన చమత్కారమైన మాటలతో నవ్విస్తూ, పై నుంచి స్వర్గ లోకం చూస్తూ ఉంటే యజ్ఞ్య ఫలితాన్ని తినేవాడు ఈ ఊరగాయను తిన్నాడు. పరమాత్మ పిల్లల ఆటలా తిన్నాడు.
ఈ మొత్తం శ్లోకం " 'అహమన్నం, అహమన్నం అహమన్న, అహమన్నాదో, అహమన్నాదో' అని తైత్తర్యోపనిషత్తులో వున్న ప్రమాణ శ్లోకానికి వ్యాఖ్యానం.

మన కర్మ ఫలాన్ని ఆయన తింటేనే మనకు మోక్షం.  మనం ఆచరించిన కర్మలను కృష్ణార్పణం అంటే చాలు. మనం చేసే కర్మలే ఊరగాయ ముక్కలు. ఇక్కడ వేళ్ళ సందులలో (అంగుళీ  - అంగం లాతీతి - శరీరాన్ని తెచ్చేది) అంటే శరీరం ఇచ్చేది అని అర్థం. శరీరం మనకు ఇచ్చేది వాసన. ఆ వాసనతోనే మనకు శరీరం వస్తుంది. వాటి మధ్యన (వేళ్ళ మధ్యన - అంటే వాసనల మధ్యన, సంచిత ఆగాములకు మధ్యన పరమాత్మ మనను తనవాడిగా చేసుకుని అనుభవిస్తూ మోక్ష సామ్రాజ్యాన్ని అందిస్తున్నాడు)
మన పూర్వ జన్మల వాసనలను నిర్మూలించి మనకు మోక్షన్నిస్తున్నాడు (పుణ్య పాపే విధూయ). పాలు వేడి చేసి తోడు పెట్టి గట్టిగా చేసి అన్నములో కలిపితే పెరుగు. పరమాత్మ అనంత కళ్యాణ గుణములు  పాలు. పరమాత్మ బోధించే జ్ఞ్యానముతో తోడు పెడితే పెరుగు. దాన్ని భగవత్ స్వరూప విభూతులలో కలిపితే పెరుగన్నం. అది మనం తింటే మనం మళ్ళీ పుడతాము. పరమాత్మ తింటే మనకు మళ్ళీ పుట్టుక రాదు. భగవంతునికి భోజనం పెట్టడం కంటే భగవద్ భక్తులకు భోజనం పెడితే విశేష ఫలం. ("నా భక్తులకు భోజనం పెడితే వారి నాలుక మీద నేను నాట్యం చేస్తూ తింటాను ")
భక్తుల నాలికే నదీ తీరం. అక్కడ స్వామి విహరిస్తున్నాడు. ఈ ఒక్క ఘట్టం పరమాత్మ ఎలా మనకు మోక్షం ఇస్తాడు. ఇచ్చేముందు మన కర్మలు ఎలా దూరం చేస్తాడు ఆయన సంకల్పిస్తే. ఇలాంటిదంతా భగవంతుని మాయలో ఎంత అత్యత్భుతమో చెప్పడానికి శుకుడు "జాగ్రత్తగా విను" అని చెప్పాడు పరీక్షిత్తుకి (శృణుష్వావహితో రాజన్).
పాద్మములో హరివంశములో బ్రహ్మ వైవర్తములో ఈ ఘట్టం పదహారు అధ్యాయాలలో చెబుతారు. పరమాత్మ ఇందరిని కూర్చోబెట్టి అందరకూ భోజనం పెట్టి తాను దగ్గరగా కూర్చుని భుజిస్తుంటే భగవత్ భాగవత శేషం దొరుకుతోందని, ముప్పై మూడు కోట్లమంది దేవతలూ కాకుల రూపములో చెట్ల మీద వాలారు.
అలా వస్తే కృష్ణుడు దేవతలు  మారు వేషములో వచ్చారు, వారి ధాంభికం వదలలేదని గ్రహించి పిల్లలతో "ఒక్క మెతుకూ కిందపడకుండా తినమన్నాడు".అది చూసిన దేవతలు కనీసం వీరు చేతులు కడుక్కునేప్పుడైనా రాలిన మెతుకులు తిందాం అనుకుంటే, కృష్ణుడు మళ్ళీ పిల్లలతో " మిత్రులారా, ఇది భగవంతునికి మనం నివేదించి తింటున్న ఆహారం. కావున ఇది ప్రసాదం. ప్రసాదం తిని చేతులు కడుక్కోరాదు." అని చెప్పాడు. అందుకే ఇప్పటికీ ప్రసాదం తీసుకున్న చేతిని తుడుచుకోవాలి గానీ కడుక్కోకూడదు. పరమాత్మ చేతి ప్రసాదం దేవతలకు కూడా దుర్లభం. అది గోపాల బాలురకు లభించింది


భారతైవం వత్సపేషు భుఞ్జానేష్వచ్యుతాత్మసు
వత్సాస్త్వన్తర్వనే దూరం వివిశుస్తృణలోభితాః

అందరూ కలిసి ఆనందముగా భోజనం చేస్తూ ఉంటే దూడలు కూడా ఆనందముగా గడ్డి మేస్తూ మేస్తూ ఆ అరణ్యములోకి చాలా దూరము వెళ్ళిపోయాయి. అప్పుడు గోపాలురు లేవబోతుంటే కృష్ణుడు వారించాడు. తినడానికి కూర్చుని మధ్యలో లేస్తే మళ్ళీ దాన్ని తినరాదు (అది మలముతో సమానం). భోజనం చేస్తూ మధ్యలో లేవరాదు. ఉత్తరాపోసనం చేసిన తరువాతే లేవాలి. బ్రాహ్మణేతరులైనా సరే భోజనం మధ్యలో లేవరాదు.

తాన్దృష్ట్వా భయసన్త్రస్తానూచే కృష్ణోऽస్య భీభయమ్
మిత్రాణ్యాశాన్మా విరమతే హానేష్యే వత్సకానహమ్

నేను తీసుకు వస్తాను దూడలను, అని కృష్ణుడు అంతటా చూసాడు. చేతిలో ముద్ద పట్టుకునే అంతా తిరుగుతున్నాడు. పధ్నాలుగు లోకాలూ పరమాత్మ చేతిలో అన్నం ముద్దే.

ఇత్యుక్త్వాద్రిదరీకుఞ్జ గహ్వరేష్వాత్మవత్సకాన్
విచిన్వన్భగవాన్కృష్ణః సపాణికవలో యయౌ

ఇలా కృష్ణపరమాత్మ వెదకడానికి బయలుదేరగానే పద్మములో పుట్టిన బ్రహ్మగారు కృష్ణున్ని పరీక్షించగోరి

అమ్భోజన్మజనిస్తదన్తరగతో మాయార్భకస్యేశితుర్
ద్రష్టుం మఞ్జు మహిత్వమన్యదపి తద్వత్సానితో వత్సపాన్
నీత్వాన్యత్ర కురూద్వహాన్తరదధాత్ఖేऽవస్థితో యః పురా
దృష్ట్వాఘాసురమోక్షణం ప్రభవతః ప్రాప్తః పరం విస్మయమ్

దూడలనూ గోపాల బాలురనూ అంతర్ధానం చేసి పర్వత గుహలో వాటిని నిలిపారు.
అఘాసురున్నుండి అందరినీ బతికించాడు. ఇపుడేమి చేస్తాడో చూద్దాం.

తతో వత్సానదృష్ట్వైత్య పులినేऽపి చ వత్సపాన్
ఉభావపి వనే కృష్ణో విచికాయ సమన్తతః

క్వాప్యదృష్ట్వాన్తర్విపినే వత్సాన్పాలాంశ్చ విశ్వవిత్
సర్వం విధికృతం కృష్ణః సహసావజగామ హ

తతః కృష్ణో ముదం కర్తుం తన్మాతౄణాం చ కస్య చ
ఉభయాయితమాత్మానం చక్రే విశ్వకృదీశ్వరః

దూడలు కనపడలేదని వెనక్కు వచ్చిన కృష్ణుడికి గోపాల బాలకులు కూడా కనపడలేదు. ఇదంతా బ్రహ్మ చేసిన పని అని స్వామి తెలుసుకున్నాడు. సకల చరాచర జగత్తును సృష్టించే పరమాత్మ ఒక్క యశోదా నందులకు ఆనందం కలిగించి ఏమి లాభం అనుకున్నాడు. మిగతా గోపికలకూ గోవులకూ తన సామ్రాజ్యం అందించగోరిన పరమాత్మ, సకల చరాచర జగత్తునీ సృష్టించిన పరమాత్మ అన్నీ తానే అయ్యాడు. ప్రతీ దూడా కృష్ణుడూ, ప్రతీ గోపాల బాలుడూ కృష్ణుడే అయ్యాడు. ఏ గోపిక తన పిల్లవాడికి పాలిచ్చినా అది కృష్ణుడే, ఏ గోవు పాలిచ్చినా కృష్ణుడే గోవు రూపములో తాగాడు. మొత్తం తానే అయ్యాడు

యావద్వత్సపవత్సకాల్పకవపుర్యావత్కరాఙ్ఘ్ర్యాదికం
యావద్యష్టివిషాణవేణుదలశిగ్యావద్విభూషామ్బరమ్
యావచ్ఛీలగుణాభిధాకృతివయో యావద్విహారాదికం
సర్వం విష్ణుమయం గిరోऽఙ్గవదజః సర్వస్వరూపో బభౌ

తల్లులు కూడా గుర్తుపట్టలేనంతగా ఉన్నారు ఆ గోపాల బాలుకులు. గోపాల బాలురూ గోవులూ, వారి వేళ్ళూ కాళ్ళూ పాదములూ , వారు పట్టుకున్న మురళీ కొమ్మూ  ఆకు ఉట్టీ వస్త్రమూ, శీలమూ గుణమూ, నవ్వూ, కోపమూ, పిలుపూ, అడుగులూ, అలకా, సర్వం విష్ణుమయం
పరమాత్మ వాక్కులూ శరీరాలూ చేష్టలూ వాక్కులూ ఆభరణాలూ అవయవాలూ ప్రకృతి ఆహారాలు అన్నీ వారు ఎలా ఉన్నారో ఎవ్వరికీ ఏమీ తేడా తెలియకుండా ఉన్నారు.

స్వయమాత్మాత్మగోవత్సాన్ప్రతివార్యాత్మవత్సపైః
క్రీడన్నాత్మవిహారైశ్చ సర్వాత్మా ప్రావిశద్వ్రజమ్

తాను తానుగా ఉండి, ఆత్మలో తానే ఉండి, ఆత్మ ఉన్న శరీరం తానే అయి, శరీరం చేసే క్రియా తానే అయి,
దూడలు అటూ ఇటూ వెళుతూ ఉంటే గోపాలబాలకులు పట్టుకుని ఆపుతున్నారు, గోపాలురు దారి తప్పుతూ ఉంటే పరమాత్మ వారిని పిలిచి ఆపుతున్నాడు, కానీ ఇపుడు తానే దూడలుగా గోపాలురుగా ఉండి, తానే తనను ఆపుతున్నాడు, తానే తనను పంపిస్తున్నాడు, తానే తన వారికి దారి చూపుతున్నాడు.
తాను గానే ఉండి ఆపుతున్నాడు, తానుగానే ఉండి మేపుతున్నాడు. సర్వాత్మ అయిన  పరమాత్మ అందరిగా ఉన్న పరమాత్మ వ్రేపల్లెకు ప్రవేశించాడు.

తత్తద్వత్సాన్పృథఙ్నీత్వా తత్తద్గోష్ఠే నివేశ్య సః
తత్తదాత్మాభవద్రాజంస్తత్తత్సద్మ ప్రవిష్టవాన్

ఏ దూడ ఏ గోశాలలో ఉండాలో అందులో వాటిని బంధించి, ఆయా రూపములో ఆయా  ఇళ్ళకు ఆయా దూడలను కట్టి తాను తన ఇంటికి వచ్చాడు

తన్మాతరో వేణురవత్వరోత్థితా ఉత్థాప్య దోర్భిః పరిరభ్య నిర్భరమ్
స్నేహస్నుతస్తన్యపయఃసుధాసవం మత్వా పరం బ్రహ్మ సుతానపాయయన్

గోపాలురు ఇంటికి వచ్చీ "అమ్మా పాలు" అనగానే "స్నానం చేసి రా" అనే తల్లులు పిల్లలు రాగానే వారిని కౌగిలించుకుని వారికి స్తన్యమును తాపిస్తున్నారు. అందరూ యశోదమ్మలే అయ్యారు. పరమాత్మ భావనతోనే తల్లులు పిల్లలకు పాలు  తాపించారు.దేవాలయాలలో మన ఇంటిలో ఉన్న అర్చా మూర్తికి అభిషేకం చేస్తాము మనం.

తతో నృపోన్మర్దనమజ్జలేపనా లఙ్కారరక్షాతిలకాశనాదిభిః
సంలాలితః స్వాచరితైః ప్రహర్షయన్సాయం గతో యామయమేన మాధవః


కానీ పరమాత్మకు చేస్తున్నం అన్న భావనతో చేస్తున్నామా. గోరు వెచ్చటి నీటితో స్వామికి అభిషేకం చేయాలి. ఈ గోపికలు కృష్ణ పరమాత్మకు (తమ పిల్లల రూపములో ఉన్న కృష్ణ పరమాత్మకు) నలుగు పెట్టి స్నానం పోసి గంధం రాసి అలంకారం చేసి తిలకం పెట్టి అన్నం పెట్టి లాలిస్తున్నారు. ఆ పిల్లలు కూడా పిల్లల ఆటలతో ముద్దు ముద్దు మాటలతో తల్లులను ఆనందింపచేస్తున్నారు.

గావస్తతో గోష్ఠముపేత్య సత్వరం హుఙ్కారఘోషైః పరిహూతసఙ్గతాన్
స్వకాన్స్వకాన్వత్సతరానపాయయన్ముహుర్లిహన్త్యః స్రవదౌధసం పయః

గోగోపీనాం మాతృతాస్మిన్నాసీత్స్నేహర్ధికాం వినా
పురోవదాస్వపి హరేస్తోకతా మాయయా వినా

పరమాత్మ పిల్లల్లాగ ఆడిస్తున్నాడు, ఆడుతున్నాడు. ఇలా గోపాల బాలురు వస్తే తల్లులు ఎలా పిల్లలను దగ్గరకు తీసుకుని ఆనందించి స్తన్యం తాపించారో దూడలు వెళితే ఆవులు కూడా తమకు తాము పరిగేడుతూ వస్తూ అంబారాం చేస్తూ పాలు ఇచ్చాయి. తమ పొదుగునుండి పాలిస్తున్నాయి.  అవి పాలు తాగుతూ ఉంటే అవి నాలుకతో దూడల ఒంటిని నాకుతున్నాయి. పిల్లలను కోపించడం అదిరించడం బెదిరించడం విసుక్కోవడం ఎక్కడా కనిపించుటలేదు. క్షణ క్షణం ప్రేమ ఎలాంటి మాయా లేకుండా పొంగుతూనే ఉంది.

వ్రజౌకసాం స్వతోకేషు స్నేహవల్ల్యాబ్దమన్వహమ్
శనైర్నిఃసీమ వవృధే యథా కృష్ణే త్వపూర్వవత్

కృష్ణ పరమాత్మ యందు గోపికలకు ఎలా ప్రేమ పెరిగిందో పిల్లలందరూ కృష్ణులే కాన తల్లులందరికీ పిల్లల మీద ఎన్నడూ లేనీ ప్రేమ పొంగుకు వచ్చింది

ఇత్థమాత్మాత్మనాత్మానం వత్సపాలమిషేణ సః
పాలయన్వత్సపో వర్షం చిక్రీడే వనగోష్ఠయోః

తాను తనతో తనవారిని పోషించుకుంటున్నాడు, తానే తన వారిని కాపలా కాస్తున్నాడు, తానే తన వారికి స్నానదులు పోయిస్తున్నాడు, తానే దూడలుగా అందరినీ బయటకు పంపిస్తున్నాడు, దూడలుగా దూడలు కాచేవాడిగా ఉంటూ ఒక సంవత్సర కాలం విహరించాడు

ఏకదా చారయన్వత్సాన్సరామో వనమావిశత్
పఞ్చషాసు త్రియామాసు హాయనాపూరణీష్వజః

ఇంకో ఐదారు రోజులలో సంవత్సరం పూర్తి అవుతుంది అనుకుంటుండగా దూరముగా మేస్తున్న దూడలను చూస్తున్న ఆవులు పరిగెత్తుకుంటూ వచ్చాయి, పిల్లలను చూసిన తల్లులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇవి గంతులేస్తూ తోకలు ఎగరేస్తూ ఆవులు వచ్చాయి, దూడలు కూడా పాలు తాగుతున్నాయి. శరీరం అంతా పులకించిపోగా

తతో విదూరాచ్చరతో గావో వత్సానుపవ్రజమ్
గోవర్ధనాద్రిశిరసి చరన్త్యో దదృశుస్తృణమ్

దృష్ట్వాథ తత్స్నేహవశోऽస్మృతాత్మా స గోవ్రజోऽత్యాత్మపదుర్గమార్గః
ద్విపాత్కకుద్గ్రీవ ఉదాస్యపుచ్ఛోऽగాద్ధుఙ్కృతైరాస్రుపయా జవేన

సమేత్య గావోऽధో వత్సాన్వత్సవత్యోऽప్యపాయయన్
గిలన్త్య ఇవ చాఙ్గాని లిహన్త్యః స్వౌధసం పయః

గోపాస్తద్రోధనాయాస మౌఘ్యలజ్జోరుమన్యునా
దుర్గాధ్వకృచ్ఛ్రతోऽభ్యేత్య గోవత్సైర్దదృశుః సుతాన్

శరీరం అంతా పులకించి ఆనందపరవశులై పిల్లలను వారూ దూడలను ఆవులూ చూస్తూ ఉన్నారు

తదీక్షణోత్ప్రేమరసాప్లుతాశయా జాతానురాగా గతమన్యవోऽర్భకాన్
ఉదుహ్య దోర్భిః పరిరభ్య మూర్ధని ఘ్రాణైరవాపుః పరమాం ముదం తే

పిల్లలను వారూ దూడలనూ ఆవులూ ప్రేమతో చూస్త్న్నాయి, "అంత ఆలస్యమయ్యిందా " అంటూ వారు చేసిన ఆలస్యానికి కోపించిన తల్లులు కోపాన్ని వదిలి వారిని దగ్గరకు తీసుకున్నారు.

తతః ప్రవయసో గోపాస్తోకాశ్లేషసునిర్వృతాః
కృచ్ఛ్రాచ్ఛనైరపగతాస్తదనుస్మృత్యుదశ్రవః

పెద్దలూ వృద్ధులూ పిల్లలూ అందరూ అలాగే ఉన్నారు. ఇది వరకు వ్రేపల్లె కాదు ఇది. అని బల రాముడు కనిపెట్టాడు.

వ్రజస్య రామః ప్రేమర్ధేర్వీక్ష్యౌత్కణ్ఠ్యమనుక్షణమ్
ముక్తస్తనేష్వపత్యేష్వప్యహేతువిదచిన్తయత్

పాలు తాగడం మరచిన పిల్లలు కూడా తల్లుల వద్దకు వచ్చి పాలు తాగుతున్నారు. తల్లులు పాలు ఇస్తున్నారు. దూడలు కూడా అంతే.

కిమేతదద్భుతమివ వాసుదేవేऽఖిలాత్మని
వ్రజస్య సాత్మనస్తోకేష్వపూర్వం ప్రేమ వర్ధతే

ఎన్నడూ లేనిది వ్రేపల్లెలో తల్లులకు పిల్లల మీద అద్భుతమైన ప్రేమ పుట్టింది. ఇదంతా మాయలా ఉంది. తక్కిన మాయలు చాలా ఉండవచ్చు గానీ నన్ను కూడా మోహింపచేసే మాయ అంటే ఇది నా ప్రభువు మాయే అని తలచాడు బలరాముడు

కేయం వా కుత ఆయాతా దైవీ వా నార్యుతాసురీ
ప్రాయో మాయాస్తు మే భర్తుర్నాన్యా మేऽపి విమోహినీ

ఇతి సఞ్చిన్త్య దాశార్హో వత్సాన్సవయసానపి
సర్వానాచష్ట వైకుణ్ఠం చక్షుషా వయునేన సః

అపుడు ఒక సారి కళ్ళు మూసుకుని జ్ఞ్యాన దృష్టితో చూస్తే అంతా కృష్ణుడే కనిపించారు
ఏ ప్రాణీ నోచుకోని అదృష్టం వీరికి ఇస్తున్నావు

నైతే సురేశా ఋషయో న చైతే త్వమేవ భాసీశ భిదాశ్రయేऽపి
సర్వం పృథక్త్వం నిగమాత్కథం వదేత్యుక్తేన వృత్తం ప్రభుణా బలోऽవైత్

కనపడదేదీ కనిపించేదీ తినబడేదీ తినిపించేదీ అంతా నీవే వేదం అంతా ఒకటే అంటుంది. ఆ వేద శాఖలన్నీ ఇపుడు వచ్చి చూస్తే, నీ ఈ రూపాన్ని చూసాక అన్ని సందేహాలూ తీరిపోతాయి

తావదేత్యాత్మభూరాత్మ మానేన త్రుట్యనేహసా
పురోవదాబ్దం క్రీడన్తం దదృశే సకలం హరిమ్

ఇదంతా కృష్ణ మాయ అని తెలుసుకుని, ఇలా జరుగుతూ ఉంటే బ్రహ్మ తన లెక్కలో ఒక తృటి గడిచాక చూస్తే అంతా మామూలుగానే ఉంది

యావన్తో గోకులే బాలాః సవత్సాః సర్వ ఏవ హి
మాయాశయే శయానా మే నాద్యాపి పునరుత్థితాః

అంతా ఎప్పటిలాగే ఉంది. ఎందరు గోపాల బాలురో ఎన్ని గోవులో అన్నీ ఉన్నాయి. అనుమానం వచ్చింది బ్రహ్మకు. నేను గుహలో పడుకోబెట్టినవారందరూ అలాగే ఉన్నారు.మరి వీరంతా ఎలా వచ్చారు. చూస్తే వాళ్ళలాగే ఉన్నారు.

ఇత ఏతేऽత్ర కుత్రత్యా మన్మాయామోహితేతరే
తావన్త ఏవ తత్రాబ్దం క్రీడన్తో విష్ణునా సమమ్

ఏవమేతేషు భేదేషు చిరం ధ్యాత్వా స ఆత్మభూః
సత్యాః కే కతరే నేతి జ్ఞాతుం నేష్టే కథఞ్చన

ఇంతకూ అసలు ఎవరు నకిలీ ఎవరు? ఎలా తెలుసుకోవాలి

ఏవం సమ్మోహయన్విష్ణుం విమోహం విశ్వమోహనమ్
స్వయైవ మాయయాజోऽపి స్వయమేవ విమోహితః

పరమాత్మను మోహింపచేయబోయిన బ్రహ్మ కృష్ణుని చేత తన మాయతో తానే మోహించబడ్డాడు. సృష్టికర్తను నేనేనా కాదా? అని సందేహించాడు
బ్రహ్మగారు తన లోకానికి వెళ్ళగానే ద్వార పాలకులు అడ్డగించారు.

తమ్యాం తమోవన్నైహారం ఖద్యోతార్చిరివాహని
మహతీతరమాయైశ్యం నిహన్త్యాత్మని యుఞ్జతః

తావత్సర్వే వత్సపాలాః పశ్యతోऽజస్య తత్క్షణాత్
వ్యదృశ్యన్త ఘనశ్యామాః పీతకౌశేయవాససః

చతుర్భుజాః శఙ్ఖచక్ర గదారాజీవపాణయః
కిరీటినః కుణ్డలినో హారిణో వనమాలినః

ద్వారపాలకులు బ్రహ్మగారిని ఆయన లోకం వద్దనే అడ్డగించారు. అప్పుడు బ్రహ్మగారు చూడగా అందరూ చతుర్భుజములతో శంఖ చక్రములతో పీతాంబరధారులై కిరీటాలతో కుండలాలతో కేయూరమూ వనమాలా హారాలూ నూపురాలూ కనపడ్డారు.

శ్రీవత్సాఙ్గదదోరత్న కమ్బుకఙ్కణపాణయః
నూపురైః కటకైర్భాతాః కటిసూత్రాఙ్గులీయకైః

తల నుంచీ పాదముల దాకా వేళ్ళాడుతున్న తులసీ మాల కలవారు

ఆఙ్ఘ్రిమస్తకమాపూర్ణాస్తులసీనవదామభిః
కోమలైః సర్వగాత్రేషు భూరిపుణ్యవదర్పితైః

చన్ద్రికావిశదస్మేరైః సారుణాపాఙ్గవీక్షితైః
స్వకార్థానామివ రజః సత్త్వాభ్యాం స్రష్టృపాలకాః

సకల చరాచర జగత్తు మొత్తం అలాగే కనపడింది. అప్సరసలూ కిన్నెరలూ కింపురుషులూ దేవతలూ గానం చేస్తున్నారు నాట్యం చేస్తున్నారు, అష్ట సిద్ధులూ, ఇరవై నాలుగు తత్వాలూ మహదాదులతో రూపు దాల్చి, కాలమూ సంస్కారమూ వాటి గుణాలూ రూపాలు ధరించి, సత్య జ్ఞ్యాన స్వరూపుడైన పరమాత్మను, ఎంత గొప్పవారికైనా, ఉపనిషత్తులు వడియబోసిన వారికి కూడా అర్థం కాని పరమాత్మను సేవిస్తున్నాయి. అందరినీ పరమాత్మ స్వరూపముగా చూసాడు

ఆత్మాదిస్తమ్బపర్యన్తైర్మూర్తిమద్భిశ్చరాచరైః
నృత్యగీతాద్యనేకార్హైః పృథక్పృథగుపాసితాః

అణిమాద్యైర్మహిమభిరజాద్యాభిర్విభూతిభిః
చతుర్వింశతిభిస్తత్త్వైః పరీతా మహదాదిభిః

కాలస్వభావసంస్కార కామకర్మగుణాదిభిః
స్వమహిధ్వస్తమహిభిర్మూర్తిమద్భిరుపాసితాః

సత్యజ్ఞానానన్తానన్ద మాత్రైకరసమూర్తయః
అస్పృష్టభూరిమాహాత్మ్యా అపి హ్యుపనిషద్దృశామ్

ఏవం సకృద్దదర్శాజః పరబ్రహ్మాత్మనోऽఖిలాన్
యస్య భాసా సర్వమిదం విభాతి సచరాచరమ్

ఏ పరమాత్మ యొక్క కాంతితో ఈ ప్రపంచం అంతా భాసిస్తోందో

తతోऽతికుతుకోద్వృత్య స్తిమితైకాదశేన్ద్రియః
తద్ధామ్నాభూదజస్తూష్ణీం పూర్దేవ్యన్తీవ పుత్రికా

పరమాశ్చర్యముతో బ్రహ్మగారికున్న పదకొండు ఇంద్రియాలూ పని చేయడం ఆపేసాయి
తన ముందర ఉన్న బొమ్మ తాను చేతిలో పట్టుకుంటే అటూ ఇటూ కదలకుండా ఎలా ఆగిపోతుందో, పరమాత్మ వలన బ్రహ్మ అలా అయ్యారు

ఇతీరేశేऽతర్క్యే నిజమహిమని స్వప్రమితికే
పరత్రాజాతోऽతన్నిరసనముఖబ్రహ్మకమితౌ
అనీశేऽపి ద్రష్టుం కిమిదమితి వా ముహ్యతి సతి
చచ్ఛాదాజో జ్ఞాత్వా సపది పరమోऽజాజవనికామ్

ఆయనకు ఆయనే ప్రమాణమైన పరమాత్మ, ఇంకెక్కడా పరమాత్మ పుట్టడూ పెరగడూ అనుకున్నవారి మతమును ఖండించడానికి అందరి ముఖమునూ వాగ్బంధము చేస్తూ, పరమాత్మ లేడు అనే వారు కూడా పరమాత్మను ఒప్పుకునేట్లుగా, బ్రహ్మను కూడా కప్పివేసిన మాయా తెరను బ్రహ్మ ఒక్కసారి చూడగా అర్థం అయ్యింది

తతోऽర్వాక్ప్రతిలబ్ధాక్షః కః పరేతవదుత్థితః
కృచ్ఛ్రాదున్మీల్య వై దృష్టీరాచష్టేదం సహాత్మనా

చనిపోయినవారు బతికి వస్తే అన్నీ ఎలా  జ్ఞ్యాపకం వస్తాయో అలా బ్రహ్మకు అన్నీ జ్ఞ్యాపకం వచ్చాయి.
అతి కష్టముతో కనులు తెరుచుకుని ఇలా అన్నారు

సపద్యేవాభితః పశ్యన్దిశోऽపశ్యత్పురఃస్థితమ్
వృన్దావనం జనాజీవ్య ద్రుమాకీర్ణం సమాప్రియమ్

కన్నులు నులుముకుని చూడగానే బృందావనములో పిల్లలు ఆడుకుంటున్నారు. అంతవరకూ ఉన్న లోకాలు లేవు.

యత్ర నైసర్గదుర్వైరాః సహాసన్నృమృగాదయః
మిత్రాణీవాజితావాస ద్రుతరుట్తర్షకాదికమ్

ఒక వింత మాత్రం కనపడుతోంది. అనాధి నుండీ విరోధం ఉన్న జంతువులు కూడా తమ విరోధాలు విడిచిపెట్టి ఆడుకుంటున్నాయి. శరీర జ్ఞ్యానం ఉన్నంత వరకే విరోధం. ఆత్మ జ్ఞ్యానం కలిగితే విరోధం ఉండదు. పరమాత్మ నివాసం ఉండటముతో ఆకలీ దప్పీ కోరికా వైరం పారిపోయాయి


తత్రోద్వహత్పశుపవంశశిశుత్వనాట్యం
బ్రహ్మాద్వయం పరమనన్తమగాధబోధమ్
వత్సాన్సఖీనివ పురా పరితో విచిన్వద్
ఏకం సపాణికవలం పరమేష్ఠ్యచష్ట

కృష్ణుడు తన తాండవాన్ని చూపాడు బ్రహ్మకు. అద్వితీయుడైన, అపరిచ్చిన్నుడైన, ఎవరికీ అర్థం కానటువంటి, పరమాత్మ మళ్ళీ మామూలుగానే తాను పిల్లలను మాయం చేసినపుడు అరచేతిలో ఆవకాయ పట్టుకున్న కృష్ణున్ని చూచాడు.  ఆ కృష్ణుడు పిల్లలను  ఇంకా వెదుకుతూనే ఉన్నాడు

దృష్ట్వా త్వరేణ నిజధోరణతోऽవతీర్య
పృథ్వ్యాం వపుః కనకదణ్డమివాభిపాత్య
స్పృష్ట్వా చతుర్ముకుటకోటిభిరఙ్ఘ్రియుగ్మం
నత్వా ముదశ్రుసుజలైరకృతాభిషేకమ్

తన హంస నుండి కిందకు దూకి, సాష్టాంగనమస్కారం చేసి, నాలుగు తలలూ భూమికి తగిలించి ఆనందబాష్పాలతో స్వామికి అభిషేకం చేస్తూ,పడుతూ లేస్తూ,

ఉత్థాయోత్థాయ కృష్ణస్య చిరస్య పాదయోః పతన్
ఆస్తే మహిత్వం ప్రాగ్దృష్టం స్మృత్వా స్మృత్వా పునః పునః

శనైరథోత్థాయ విమృజ్య లోచనే ముకున్దముద్వీక్ష్య వినమ్రకన్ధరః
కృతాఞ్జలిః ప్రశ్రయవాన్సమాహితః సవేపథుర్గద్గదయైలతేలయా

అంతకు ముందు చూసినవన్నీ తలచి తలచి, లేచి కళ్ళు తుడుచుకుని, పరమాత్మను చూచి మెడ వంచి వినయముతో సావధానముతో చేతులు జోడించి వణుకు వస్తోంటే బొంగురు పోయిన కంఠముతో పరమాత్మను స్తోత్రం చేసాడు


                                                                   సర్వం శ్రీకృష్ణార్పణమస్తు