Pages

Monday, 21 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై ఎనిమిదవ అధ్యాయం


                   ఓం నమో భగవతే వాసుదేవాయ 


శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై ఎనిమిదవ అధ్యాయం

శ్రీబాదరాయణిరువాచ
ఏకాదశ్యాం నిరాహారః సమభ్యర్చ్య జనార్దనమ్
స్నాతుం నన్దస్తు కాలిన్ద్యాం ద్వాదశ్యాం జలమావిశత్

ఒక ఏకాదశి నాడు, నందుడు ఉపవాసముండి జనార్దనుని పూజించి ద్వాదశి ఘడియలు వస్తున్నప్పుడు యమునా నదిలో స్నానానికి దిగాడు.

తం గృహీత్వానయద్భృత్యో వరుణస్యాసురోऽన్తికమ్
అవజ్ఞాయాసురీం వేలాం ప్రవిష్టముదకం నిశి

నిశి రాత్రిన నదిలో దిగి నందున, అది దిగకూడని వేళ కావడము వలన వరుణ దూత ఆయనను పాశములతో బంధించి వరుణ లోకానికి తీసుకు వెళ్ళాడు

చుక్రుశుస్తమపశ్యన్తః కృష్ణ రామేతి గోపకాః
భగవాంస్తదుపశ్రుత్య పితరం వరుణాహృతమ్
తదన్తికం గతో రాజన్స్వానామభయదో విభుః

నందుడు కనిపించకపోవడముతో గోపికలూ రామా కృష్ణా అంటూ ఆర్తనాదం చేయగా నందుడిని వరుణ దూతలు అపహరించిన సంగతి తెలుసుకున్నాడు కృష్ణుడు. భక్తులకు అభయాన్ని ప్రసాదించే పరమాత్మ వరుణ సభకు వెళ్ళాడు

ప్రాప్తం వీక్ష్య హృషీకేశం లోకపాలః సపర్యయా
మహత్యా పూజయిత్వాహ తద్దర్శనమహోత్సవః

హృషీకేశుడు రావడం చూచిన లోకపాలకుడు వరుణుడు ఆయనను పూజించి, సపర్యలు చేసి, పరమ ఆనందముతో ఇలా అన్నాడు.

శ్రీవరుణ ఉవాచ
అద్య మే నిభృతో దేహోऽద్యైవార్థోऽధిగతః ప్రభో
త్వత్పాదభాజో భగవన్నవాపుః పారమధ్వనః

నేను దేహం ధరించినందుకు ఇపుడు నా జన్మ సార్ధకమయ్యింది. నీ పాదాలను చేరిన వాడు ఈ సంసారాన్ని దాటగలడు.

నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే
న యత్ర శ్రూయతే మాయా లోకసృష్టివికల్పనా

పరమాత్మా పరబ్రహ్మా నీకు నమస్కరాము. అనంతములైన లోకములను సృష్టించడనైకి కావలసిన మాయ నీ దగ్గర పని చేయదు.

అజానతా మామకేన మూఢేనాకార్యవేదినా
ఆనీతోऽయం తవ పితా తద్భవాన్క్షన్తుమర్హతి

తెలియక మూర్ఖుడై మా వాడు మీ తండ్రిని పట్టుకొచ్చాడు, మహానుభావులైన మీరు క్షమించండి.

మమాప్యనుగ్రహం కృష్ణ కర్తుమర్హస్యశేషదృక్
గోవిన్ద నీయతామేష పితా తే పితృవత్సల

నీవు అన్నీ చూసేవాడివి. ఈ పొరబాటు ఎలా జరిగి ఉంటుందో నీకు తెలిసే ఉంటుంది. వారిని క్షమించు. తండ్రిగారి కోసం ఇంత దూరం వచ్చావంటే నీకు తండ్రి మీద చాలా ప్రేమ ఉంది. ఆయనను తీసుకు వెళ్ళండి

శ్రీశుక ఉవాచ
ఏవం ప్రసాదితః కృష్ణో భగవానీశ్వరేశ్వరః
ఆదాయాగాత్స్వపితరం బన్ధూనాం చావహన్ముదమ్

ఇలా వరుణుడు ప్రార్థిస్తే నాన్నగారిని తీసుకు వచ్చి బందువులకు సంతోషాన్ని కలిగించాడు

నన్దస్త్వతీన్ద్రియం దృష్ట్వా లోకపాలమహోదయమ్
కృష్ణే చ సన్నతిం తేషాం జ్ఞాతిభ్యో విస్మితోऽబ్రవీత్

ఇంటికి వచ్చిన తరువాత నందుడు వరుణ లోకములో కృష్ణ పరమాత్మకు వరుణుడు చేసిన మర్యాద చూసాడు. వరుణ లోక వైభవం చూసాడు. ఇంత పెద్ద వైభవం గల లోకపాలకులు కృష్ణుని మీద అంత భక్తి కలిగి ఉన్నారు. మరి ఈ కృష్ణుడు పిల్లవాడా పెద్దవాడా

తే చౌత్సుక్యధియో రాజన్మత్వా గోపాస్తమీశ్వరమ్
అపి నః స్వగతిం సూక్ష్మాముపాధాస్యదధీశ్వరః

తాను కనులారా చూసినది తన బంధువులకు చెప్పాడు. ఎపుడైతే లోకపాలకులు అందరూ కృష్ణున్ని అంత భయభక్తులతో ఆరాధిస్తున్నారంటే ఈయన లోకపాలకులందరికీ అధిపతి అయి ఉండాలి. ఇన్ని చేసిన వాడు మా అందరికీ ఒక్క సారి ఆయన ఉండే లోకాన్ని చూపితే బాగుండు కదా. అలా చూపుతాడా

ఇతి స్వానాం స భగవాన్విజ్ఞాయాఖిలదృక్స్వయమ్
సఙ్కల్పసిద్ధయే తేషాం కృపయైతదచిన్తయత్

ఇలావారిలో వారు అనుకుంటూ ఉండగా. అన్నీ చూచే వాడైన కృష్ణుడు తనవారి మనసులో ఉండే కోరిక చూచి సరే అలాగే చూపుతా అని భావించాడు.

జనో వై లోక ఏతస్మిన్నవిద్యాకామకర్మభిః
ఉచ్చావచాసు గతిషు న వేద స్వాం గతిం భ్రమన్

మాయతో అజ్ఞ్యానముతో కోరికలతో మోహముతో అనేకమైన వాటితో ఆచరించే పనులతో గొప్పవారిగా పుడుతున్నారు, తక్కువ వారిగా పుడుతున్నారు. కానీ ఇవన్నీ నేను చేసుకున్నందువలనే అవుతున్నాయి అనుకోక అంతా భగవంతుడే చేస్తున్నాడు అని భగవంతుని నిందిస్తున్నారు. వారు చేరుకోవలసిన లోకాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు.అలా అనుకునే జ్ఞ్యానం వారికి కలగడం లేదు.

ఇతి సఞ్చిన్త్య భగవాన్మహాకారుణికో హరిః
దర్శయామాస లోకం స్వం గోపానాం తమసః పరమ్

గొప్ప దయ గల పరమాత్మ ఇలా అనుకుని వారి కోరిక ఎందుకు కాదనాలని, ప్రకృతి కంటే అవతల ఉన్న తన దివ్య ధామన్ని తను సాక్షాత్కరింపచేసాడు.

సత్యం జ్ఞానమనన్తం యద్బ్రహ్మజ్యోతిః సనాతనమ్
యద్ధి పశ్యన్తి మునయో గుణాపాయే సమాహితాః

త్రికాల అబాధితం, సకల చరాచర జగత్తు యొక్క స్వరూప స్వభావాలకు మూలము, ప్రవృత్తి నివృత్తులకు మూలం, దేశ కాల వస్తు పరిచ్చేద రహితం. అంతటా వ్యాపించి ఉండేది సనాతనమైన జ్యోతి స్వరూపం, త్రిగుణములు తొలగిన తరువాత మునులు ఏ లోకాన్ని చూస్తారో ఆ లోకాన్ని తనవారికి స్వామి చూపాడు.

తే తు బ్రహ్మహ్రదమ్నీతా మగ్నాః కృష్ణేన చోద్ధృతాః
దదృశుర్బ్రహ్మణో లోకం యత్రాక్రూరోऽధ్యగాత్పురా

పరబ్రహ్మ అనే ఒక పెద్ద మడుగులో మునిగారు. మరలా స్వామి వారిని అందులోంచి బయటకు తెచ్చాడు.

నన్దాదయస్తు తం దృష్ట్వా పరమానన్దనివృతాః
కృష్ణం చ తత్ర చ్ఛన్దోభిః స్తూయమానం సువిస్మితాః

అకౄరుడు స్వామిని తీసుకు వెళుతూ యమునా నదిలో సంధ్యావందనానికి దిగి అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఆ జలములో ఏ స్వామినీ లోకాన్నీ చూస్తాడో ఈనాడు గోకులమంతా ఆ లోకాన్ని చూసారు
నందాదుల అందరి సందేహాలు అన్నీ తొలగిపోయాయి. వేద పురాణ శాస్త్ర ఇతిహాసములూ ఋషులు దేవతలూ వేద స్తుతితో ఇక్కడ ఉన్న ఈ స్వామిని స్తోత్రం చేయడం చూసారు. అది చూసి "మాది కేవలం ఊహ కాదు. ఈయన నిజముగా పరమాత్మే అని తెలుసుకున్నారు"


                                                                సర్వం శ్రీకృష్ణార్పణమస్తు