Pages

Monday, 21 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై తొమ్మిదవ అధ్యాయం (రాస పంచాధ్యాయి - 1)


     ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై తొమ్మిదవ అధ్యాయం

రాసక్రీడను గోవింద పట్టాభిషేకం తరువాత, తనవారందరకూ కృష్ణుడు పరమాత్మగా సాక్షాత్కరించిన తరువాతే మనక్ రాస పంచాధ్యాయి వచ్చింది. అంటే రాస లీలలో ఉన్న ఆనందం లౌకికం కాదు.

రసం అంటే పరమాత్మ. రాస అంటే పరమాత్మ చేత అనుభవింపచేయబడే ఆనందం

శ్రీబాదరాయణిరువాచ
భగవానపి తా రాతృః శారదోత్ఫుల్లమల్లికాః
వీక్ష్య రన్తుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః


పరమాత్మ యోగమాయను ఆశ్రయించి,శరత్కాలములో బాగా వికసించిన మల్లికలు గల ఆ రాత్రులు చూచి, రమించాలనుకున్నాడు, సంకల్పించాడు.
పరమాత్మ పొందలేనిది అంటూ లేదు.ఐనా రమించాలనుకున్నాడంటే ఎవరి కోసం అనుకున్నాడు.ఒక నెల రోజులు కాత్యాయినీ వ్రతం చేసి పరమాత్మను ప్రసన్నం చేసుకున్నారు. ఆయనతో వరాన్నీ పొందారు. వారికి వారి వ్రతం సార్ధకం చేయడానికి శరత్కాలములో మల్లెలు వికసించిన ఆ రాత్రులలో (ఆ రాత్రి అంటే భగవంతున్ని జీవుడు చేరే రాత్రి. ఐదు రాత్రులు. మనకు కూడా ఐదు రకాల అజ్ఞ్యానం ఉంటుంది. అర్థ పంచక జ్ఞ్యానముతో పరమాత్మ జీవాత్మల స్వరూపం,పరమాత్మను చేరే ఉపాయం, పరమాత్మను చేరడం వలన ఫలితం, ఆ ఫలితం రాకుండా అడ్డుపడేది. ఈ అజ్ఞ్యానాలను తన సంబంధముతో జ్ఞ్యానులుగా చేసి స్వస్వరూప ఆవిర్భావం చేయాలనుకున్నాడు.) పరమాత్మ అయి ఉండి కూడా వారితో కలసి విహరించాలని సంకల్పించాడు
భగవాన్ అపితా - తండ్రి కాని వాడు.ఇంత మంది భార్యలు ఉన్నా ఆయన తండ్రికాలేదు.

తదోడురాజః కకుభః కరైర్ముఖం ప్రాచ్యా విలిమ్పన్నరుణేన శన్తమైః
స చర్షణీనాముదగాచ్ఛుచో మృజన్ప్రియః ప్రియాయా ఇవ దీర్ఘదర్శనః

ఎంత మంది భార్యలున్నా ఆయన మనసు చలించదు. ఎపుడైతే పరమాత్మ గోపికలతో రమించాలని సంకల్పించాడో అపుడు చంద్రుడు కూడా తన కిరణములచేత దిక్కులన్నీ అరుణ గంధాన్ని పూసాడు
అక్కడ ఉన్న సకల ప్రాణులలో ఆవరించి ఉన్న చీకటిని తొలగించడానికి చంద్రుడు తన కిరణములతో ముఖాన్ని కడిగి అరుణ వర్ణముతో బొట్టు పెట్టాడు దూరపు చూపు గలవాడు.
ఇక్కడ చంద్రుడు అంటే గురువుగారు అని అర్థం. ఆయన జ్ఞ్యానోపదేశముతో శిష్యులను సంతోషపెట్టారు.

దృష్ట్వా కుముద్వన్తమఖణ్డమణ్డలం
రమాననాభం నవకుఙ్కుమారుణమ్
వనం చ తత్కోమలగోభీ రఞ్జితం
జగౌ కలం వామదృశాం మనోహరమ్

చంద్రుడే లక్ష్మీ దేవి ముఖములా ఉంది. లక్ష్మీ దేవికి కూడా కుంకుమ బొట్టు ఉంటుంది. చంద్రుని యొక్క అతి సుకుమారమైన కిరణాలతో శోభిస్తోంది. వేణువు తీసుకుని స్త్రీల యొక్క మనసు హరించే రీతిలో అతి మధురముగా వేణువును ఊదాడు
పరమాత్మ గానం చేసిన మధురమైన వేణుగానం. మన్మధున్ని పెంపొందింపచేసే ఆ వేణుగానాన్ని ఆ గోపికలు విన్నారు.

నిశమ్య గీతాం తదనఙ్గవర్ధనం వ్రజస్త్రియః కృష్ణగృహీతమానసాః
ఆజగ్మురన్యోన్యమలక్షితోద్యమాః స యత్ర కాన్తో జవలోలకుణ్డలాః

వస్తూనే ఉన్నారు గానీ ఒకరినొకరు చూసుకోలేదు. ఎవరూ వీరి ప్రయత్నాన్ని గుర్తించలేదు. పరమాత్మ ఎక్కడ ఉన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. స్వామి మకర కుండలాలు చాలా వేగముగా కదులుతున్నాయి. పరమాత్మదగ్గరకు వచ్చేవారికి దారి చూపడానికా అన్నట్లు అవి మెరుస్తున్నాయి. (చెవి అంటే స్మృతి, వేదం. ఇలాంటి వేదములకు ఆభరణములు వేద విహిత ఆచరణములు) జీవాత్మ పరమాత్మను చేరడానికి కావలసిన తొందర అందులో వ్యక్తీకరించి ఉన్నది

దుహన్త్యోऽభియయుః కాశ్చిద్దోహం హిత్వా సముత్సుకాః
పయోऽధిశ్రిత్య సంయావమనుద్వాస్యాపరా యయుః

కృష్ణ పరమాత్మ దగ్గరకు గోపికలు ఎలా ఉన్నవారు అలాగే వెళ్ళారు.చేస్తున్న పని మధ్యలోనే ఆపి వెళ్ళారు.పాలు పితికేవారు దాన్ని పక్కన పెట్టి వెళ్ళారు. పొయ్యి మీద పాలు దింపకుండా వెళ్ళారు.

పరివేషయన్త్యస్తద్ధిత్వా పాయయన్త్యః శిశూన్పయః
శుశ్రూషన్త్యః పతీన్కాశ్చిదశ్నన్త్యోऽపాస్య భోజనమ్

భర్తలకు అన్నం వడ్డిస్తున్నవారూ, శిశువులకు పాలిస్తున్నవారు,భర్తలనూ బంధువ్లనూ సేవిస్తున్నవారు,తింటున్నవారు , అవి అన్నీ వదలిపెట్టి వచ్చారు.

లిమ్పన్త్యః ప్రమృజన్త్యోऽన్యా అఞ్జన్త్యః కాశ్చ లోచనే
వ్యత్యస్తవస్త్రాభరణాః కాశ్చిత్కృష్ణాన్తికం యయుః

కొందరు గంధం రాసుకుంటున్నారు,అలంకరించుకుంటున్నారు,అవి అన్నీ వదలి వచ్చేసారు. తొందరలో కంకణాలను కాళ్ళకూ కడియాలను చేతులకూ పెట్టుకున్నారు.

తా వార్యమాణాః పతిభిః పితృభిర్భ్రాతృబన్ధుభిః
గోవిన్దాపహృతాత్మానో న న్యవర్తన్త మోహితాః

 భర్తలూ తండ్రులూ సోదరులూ బంధువులూ హితులూ అందరూ అడ్డు చెబుతున్నా ఆపుతున్నా, పరమాత్మ  యందు మోహముతో పరమాత్మ చేత అపహరించబడిన మనసు గలవారై ఎందరు వారించినా వారు  వెనుకకు మరలలేదు

అన్తర్గృహగతాః కాశ్చిద్గోప్యోऽలబ్ధవినిర్గమాః
కృష్ణం తద్భావనాయుక్తా దధ్యుర్మీలితలోచనాః

తాము వారించినా ఆగకుండా బయలుదేరిన వారిని చూచి, లోపల గదిలో ఉన్న కొందరిని బయటకు రాకుండా తలుపులు బిగించి తాళం వేసారు. వారు శరీరముతో కాక ఆత్మగా వెళ్ళారు.మోక్షానికే వెళ్ళారు

దుఃసహప్రేష్ఠవిరహ తీవ్రతాపధుతాశుభాః
ధ్యానప్రాప్తాచ్యుతాశ్లేష నిర్వృత్యా క్షీణమఙ్గలాః

ఏమాత్రమూ సహించలేని ప్రియుని యొక్క వియోగముతో పాపమంతా పోయింది. ఎదురుగా లేని ప్రియున్ని మనసులో ధ్యానించడముతో పరమాత్మ స్వరూపం సాక్షాత్కరించింది. ఆ సాక్షాత్కర ఆనంద అనుభవముతో పుణ్యం వ్యయమయ్యింది.

తమేవ పరమాత్మానం జారబుద్ధ్యాపి సఙ్గతాః
జహుర్గుణమయం దేహం సద్యః ప్రక్షీణబన్ధనాః

కృష్ణపరమాత్మను భగవంతునిగా భావించకుండా, జార బుద్ధితో భావించినా మోక్షమే వచ్చింది. అగ్నిలో ఎలా పడినా వస్తువు కాలిపోతుంది. ప్రేమతో కామముతో పగతో ఏ భావముతో చేరినా, ఆయనతో చేరితే మోక్షమే. ఆయనకు ప్రేమా ద్వేషం మోహం వైరం అన్నీ ఒకటే
వారి అన్ని పాపములూ, అన్ని బంధములూ అన్నీ పోయాయి. గుణమయి దేహాన్ని కోల్పోయారు. తలుపు తీసుకుని కృష్ణుని వద్దకు వెళ్ళినవారికంటే తలుపు వేసి ఉండగా స్వామిని చేరిన వారే అదృష్టవంతులు

శ్రీపరీక్షిదువాచ
కృష్ణం విదుః పరం కాన్తం న తు బ్రహ్మతయా మునే
గుణప్రవాహోపరమస్తాసాం గుణధియాం కథమ్

కృష్ణున్ని వారు పరమాత్మ అనుకోలేదు కదా. మరి నిరంతరం గుణ ప్రవాహములతో ఉన్న శరీరం ఎలా తొలగిపోయింది

శ్రీశుక ఉవాచ
ఉక్తం పురస్తాదేతత్తే చైద్యః సిద్ధిం యథా గతః
ద్విషన్నపి హృషీకేశం కిముతాధోక్షజప్రియాః

పుట్టినప్పటినుండీ ద్వేషిస్తూ ఉన్న శిశుపాలునికే మోక్షం ఇచ్చాడు. మరి భగవంతుని ప్రేమించిన గోపికలు మోక్షానికి వెళ్ళరా

నృణాం నిఃశ్రేయసార్థాయ వ్యక్తిర్భగవతో నృప
అవ్యయస్యాప్రమేయస్య నిర్గుణస్య గుణాత్మనః

భగవంతుడు అవతరించినదే మానవులకు మోక్షాన్ని ఇవ్వడానికే. ఏ మాత్రం నాశమూ తరుగూ లేనివాడు. ఇంతటి వాడని మన బుద్ధికి అందని వాడు. సత్వ రజో తమో గుణాలు లేనివాడు.
గుణములే లేకుంటే గుణముల సంబధముల వలన కలిగే భావాలు ఎలా కలుగుతాయి
గుణాత్మనః - ఆయనకు ప్రకృతి గుణములు లేవు కానీ, కళ్యాణ గుణములు కలవాడు.

కామం క్రోధం భయం స్నేహమైక్యం సౌహృదమేవ చ
నిత్యం హరౌ విదధతో యాన్తి తన్మయతాం హి తే

ఏ భావముతో పరమాత్మను సేవించినా మోక్షమే.

న చైవం విస్మయః కార్యో భవతా భగవత్యజే
యోగేశ్వరేశ్వరే కృష్ణే యత ఏతద్విముచ్యతే

ఆయన సంసారమూ ఇవ్వగలడూ,మోక్షమివ్వగలడు.పరమాత్మ "ఇది ఎలా ఇచ్చాడు" అని మనమనలేము.
ఆయన యోగీశ్వరులందరికీ ఈశ్వరుడు.

తా దృష్ట్వాన్తికమాయాతా భగవాన్వ్రజయోషితః
అవదద్వదతాం శ్రేష్ఠో వాచః పేశైర్విమోహయన్

గోపికలకు ఇల్లు వదలి పరమాత్మను చేరేవరకే జారుడన్న భావం. ఒక సారి కృష్ణున్ని చూసిన తరువాత వారికి కృష్ణుడు పరమాత్మ అన్న భావం బలపడింది.
వారిని చూచిన పరమాత్మ ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
స్వాగతం వో మహాభాగాః ప్రియం కిం కరవాణి వః
వ్రజస్యానామయం కచ్చిద్బ్రూతాగమనకారణమ్

మహాబుభావునులారా,మీకు నేనేమి చేయగలవాడను, ఎలాంటి ప్రీతిని కలిగించాలి.వ్రేపల్లె బాగానే ఉంది కదా.ఏ బాధాలేదు కదా. మరి ఎందుకు వచ్చారు.

రజన్యేషా ఘోరరూపా ఘోరసత్త్వనిషేవితా
ప్రతియాత వ్రజం నేహ స్థేయం స్త్రీభిః సుమధ్యమాః

అసలే రాత్రి,భయంకరమైంది,ఇక్కడ కౄరమృగాలు ఉన్నాయి. ఇంతటి భయంకరమైన అరణ్యములోకి స్త్రీలు ఈ రాత్రి పూట రాకూడదు

మాతరః పితరః పుత్రా భ్రాతరః పతయశ్చ వః
విచిన్వన్తి హ్యపశ్యన్తో మా కృఢ్వం బన్ధుసాధ్వసమ్

మీ వాళ్ళు మీ కోసం వెతుకుతూ ఉంటారు. బంధువులలో ఆందోళన కలిగించవద్దు

దృష్టం వనం కుసుమితం రాకేశకరరఞ్జితమ్
యమునానిలలీలైజత్తరుపల్లవశోభితమ్

అరణ్యం చూద్దామని వచ్చారా. చక్కగా పూచిన పూలనూ, చంద్రుని కిరణముల చేత రంజింపబడిన వనాన్నీ, యమునా తటి పైనుంచి వచ్చే చల్లని గాలితో పెరుగుతున్న వృక్షాలను చూచి ఉంటారు

తద్యాత మా చిరం గోష్ఠం శుశ్రూషధ్వం పతీన్సతీః
క్రన్దన్తి వత్సా బాలాశ్చ తాన్పాయయత దుహ్యత

త్వరగా వెళ్ళి మీ పతులను మీరు సేవించండి. మీ పిల్లలు స్తన్యం కావాలని ఏడుస్తూ ఉంటారు. దూడలు కూడా ఆకలిగా ఉంటాయి. గోవుల చేత పాలిప్పించండి

అథ వా మదభిస్నేహాద్భవత్యో యన్త్రితాశయాః
ఆగతా హ్యుపపన్నం వః ప్రీయన్తే మయి జన్తవః

భర్తుః శుశ్రూషణం స్త్రీణాం పరో ధర్మో హ్యమాయయా
తద్బన్ధూనాం చ కల్యాణః ప్రజానాం చానుపోషణమ్

నాకోసమే వచ్చానని అంటున్నారా. అది ఐతే సహజమే. సకల చరాచర ప్రాణులూ నన్ను ప్రేమిస్తారు. ఇక వెళ్ళండి. స్త్రీలు కపటం లేకుండా భరతను సేవించడమే స్త్రీ ధర్మం. భర్తనే కాక బంధువులనూ, పిల్లలనూ సేవించాలి, పోషించాలి

దుఃశీలో దుర్భగో వృద్ధో జడో రోగ్యధనోऽపి వా
పతిః స్త్రీభిర్న హాతవ్యో లోకేప్సుభిరపాతకీ

భర్త ఎలాంటి వాడైనా స్త్రీలు భర్తను విడిచిపెట్టకూడదు. ఉత్తమలోకాలను కోరేవారు ఎలాంటి పరిస్థితుల్లో భర్తను విడిచిపెట్టరాదు

అస్వర్గ్యమయశస్యం చ ఫల్గు కృచ్ఛ్రం భయావహమ్
జుగుప్సితం చ సర్వత్ర హ్యౌపపత్యం కులస్త్రియః

భర్త లేకుంటే భర్తగా నన్న్ కోరుట న్యాం. కాని పెళ్ళైన తరువాత నన్ను కోరడం సరికాదు. అది నీచమైన పని.నరకాన్ని నిందనూ కష్టాన్ని భయాన్నీ అసహ్యాన్నీ కలిగిస్తుంది.

శ్రవణాద్దర్శనాద్ధ్యానాన్మయి భావోऽనుకీర్తనాత్
న తథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్

వినడం వలనా చూడటం వలనా, నా  యందు ధ్యానం వలనా, నా మాటలు చెప్పుకోవడం వలననే ప్రేమ పెరుగుతుందు.నిజముగా మీరు నన్ను ప్రేమించేవారే ఐతే నాకు దూరముగా ఉండండి.
దగ్గరగా ఉంటే ఆ ప్రేమ ఉండదు. మీరు మీ ఇళ్ళకు వెళ్ళండి

శ్రీశుక ఉవాచ
ఇతి విప్రియమాకర్ణ్య గోప్యో గోవిన్దభాషితమ్
విషణ్ణా భగ్నసఙ్కల్పాశ్చిన్తామాపుర్దురత్యయామ్

కృష్ణుడు ఇలా మాట్లాడతాడని అనుకోలేదు. విషాదం పొందారు. అంతులేని చింతను పొందారు.

కృత్వా ముఖాన్యవ శుచః శ్వసనేన శుష్యద్
బిమ్బాధరాణి చరణేన భువః లిఖన్త్యః
అస్రైరుపాత్తమసిభిః కుచకుఙ్కుమాని
తస్థుర్మృజన్త్య ఉరుదుఃఖభరాః స్మ తూష్ణీమ్

అందరూ ముఖాన్ని వంచి,దుఃఖపు వేడినిట్టూరుతు ముఖం వాడిపోగా కాలిగోటితో నేలమీద రాస్తూ కన్నీటితో వక్షస్థలాన్ని తడుపుతూ ఏమీమాట్లాడకుండా నేల మీద చూస్తూ ఉండిపోయారు. ప్రపంచములో పరమాత్మను మించిన ప్రియుడులేడు.అంత ఉత్తమప్రియుడు ప్రియుడు కాని వాడిలాగ మాట్లాడుతున్నాడు

ప్రేష్ఠం ప్రియేతరమివ ప్రతిభాషమాణం
కృష్ణం తదర్థవినివర్తితసర్వకామాః
నేత్రే విమృజ్య రుదితోపహతే స్మ కిఞ్చిత్
సంరమ్భగద్గదగిరోऽబ్రువతానురక్తాః

అతని కోసం అందరినీ వదులుకుని అన్ని కోరికలనూ తొలగించుకుని వచ్చారు
కొంచెం కోపముతో విషాదముతో గొంతు బొంగురుపోగా ప్రేమకలవారి పలికారు

శ్రీగోప్య ఊచుః
మైవం విభోऽర్హతి భవాన్గదితుం నృశంసం
సన్త్యజ్య సర్వవిషయాంస్తవ పాదమూలమ్
భక్తా భజస్వ దురవగ్రహ మా త్యజాస్మాన్
దేవో యథాదిపురుషో భజతే ముముక్షూన్

వినడానికి కూడా పనికిరాని ఇలాంటి మాటలు నీవు పలుకరాదు.అన్ని కోరికలనూ బంధములనూ విడిచిపెట్టి నీ పాద మూలాన్ని చేరాము. మేము నీ భక్తులము.మమ్ము విడిచిపెట్టవద్దు. మోక్షం యందు ఆసక్తి కలవారిని పరమాత్మ సేవించినట్లు మీరు మమ్ము సేవించండి

యత్పత్యపత్యసుహృదామనువృత్తిరఙ్గ
స్త్రీణాం స్వధర్మ ఇతి ధర్మవిదా త్వయోక్తమ్
అస్త్వేవమేతదుపదేశపదే త్వయీశే
ప్రేష్ఠో భవాంస్తనుభృతాం కిల బన్ధురాత్మా

నీవే ధర్మ స్వరూపుడవు. భర్తలూ సోదరులూ అందరినీ వదిలిపెట్టవద్దని చెప్పావు. అది ఉన్న మాటే చెప్పావు. ఇది ఉపదేశించడానికే బాగుంటుంది. కానీ మేము విన్నదేమంటే జీవులకు అన్ని రకముల బంధువూ నీవే అని విన్నాము.

కుర్వన్తి హి త్వయి రతిం కుశలాః స్వ ఆత్మన్
నిత్యప్రియే పతిసుతాదిభిరార్తిదైః కిమ్
తన్నః ప్రసీద పరమేశ్వర మా స్మ ఛిన్ద్యా
ఆశాం ధృతాం త్వయి చిరాదరవిన్దనేత్ర

నేర్పరులు నీయందు మాత్రమే బుద్ధి కలిగి ఉంటారట. నీవు నిత్యప్రియుడవట. పతి సుతాదులతో మాకేమి పని. వారు మాకు ఎపుడూ ఆర్తినీ దుఃఖాన్నే ఇస్తారు
ఎంతో కాలం నీ మీద ఆశతో ఉన్నాము. అలాంటి ఆశను తెంపవద్దు

చిత్తం సుఖేన భవతాపహృతం గృహేషు
యన్నిర్విశత్యుత కరావపి గృహ్యకృత్యే
పాదౌ పదం న చలతస్తవ పాదమూలాద్
యామః కథం వ్రజమథో కరవామ కిం వా

ఇంటిపనులు చేయలేకపోతున్నాము, భర్త గురించి కూడా ఆలోచించలేకపోతున్నాము. మా మనసును నీవు అపహరించావు. గృహకృత్యాలలో మా చేతులు ప్రవేశించట్లేదు. మాపాదాలు నీ పాదాల నుంచి దూరముగా పోదలచుకోలేదు. మేము ఎలా వెళతాము వ్రేపల్లెకు. వెళ్ళినా ఏమి చేయగలము

సిఞ్చాఙ్గ నస్త్వదధరామృతపూరకేణ
హాసావలోకకలగీతజహృచ్ఛయాగ్నిమ్
నో చేద్వయం విరహజాగ్న్యుపయుక్తదేహా
ధ్యానేన యామ పదయోః పదవీం సఖే తే

మా మనసులో పెరిగిన మంటను నీ చిరునవ్వు అనే అమృతముతో తడిపి ఈ నిప్పును చల్లార్చు. నీ అద్భుతమైన వేణూ గానం, నీ చిరునవ్వుతో తడుపు. నీవు ఇక్కడ ఇప్పుడు మా కోరికను తీర్చడానికి ముందుకు వస్తే నీ పాదాలదగ్గర ఉంటాము. లేకున్నా నీ పాదాలదగ్గరే ఉంటాము. విరహాగ్నిలో మమ్ము  మేము దహించుకుని వైకుంఠములో ఉన్న నీ పాదాలను ఆశ్రయిస్తాము

యర్హ్యమ్బుజాక్ష తవ పాదతలం రమాయా
దత్తక్షణం క్వచిదరణ్యజనప్రియస్య
అస్ప్రాక్ష్మ తత్ప్రభృతి నాన్యసమక్షమఞ్జః
స్థాతుంస్త్వయాభిరమితా బత పారయామః

నీతో కలసి ఉంటే తప్ప ఏ పనీ చేయలేము. నిన్ను తప్ప మరొకదాన్ని స్పృశించలేము. నీ నామం తప్ప మరొక దాన్ని తలచలేము. నీ విగ్రహం తప్ప మరి దేన్నీ చూడలేము.  వక్షస్థలములో ఉండమని నివాసం ఏర్పాటు చేసినా అమ్మవారు తులసి దళముతో సేవించబడిన నీ పాదాలనే కోరింది

శ్రీర్యత్పదామ్బుజరజశ్చకమే తులస్యా
లబ్ధ్వాపి వక్షసి పదం కిల భృత్యజుష్టమ్
యస్యాః స్వవీక్షణ ఉతాన్యసురప్రయాసస్
తద్వద్వయం చ తవ పాదరజః ప్రపన్నాః

లక్ష్మీ దేవి కటాక్షం పడాలని బ్రహ్మ రుద్రేంద్రాదులు తపస్సు చేస్తున్నారో అటువంటి లక్ష్మి నీ వక్షస్థలములో ఉండి కూడా నీ పాదాలనే కోరుతున్నది

తన్నః ప్రసీద వృజినార్దన తేऽన్ఘ్రిమూలం
ప్రాప్తా విసృజ్య వసతీస్త్వదుపాసనాశాః
త్వత్సున్దరస్మితనిరీక్షణతీవ్రకామ
తప్తాత్మనాం పురుషభూషణ దేహి దాస్యమ్

సంసారం అంతా విడిచిపెట్టి అని కోరికలూ విడిచిపెట్టి నీ పాద మూలం చేరాము. నిరంతరం నీ సుందరమైన చిరునవ్వుతో కూడుకుని ఉన్న నీ ముఖమండలాన్ని సేవించాలన్న విరహముతో ఉన్న మాకు నీ దాస్యాన్ని ప్రసాదించు.

వీక్ష్యాలకావృతముఖం తవ కుణ్దలశ్రీ
గణ్డస్థలాధరసుధం హసితావలోకమ్
దత్తాభయం చ భుజదణ్డయుగం విలోక్య
వక్షః శ్రియైకరమణం చ భవామ దాస్యః

ముంగురులు కప్పి ఉన్న ముఖం. మకర కుండలాల కాంతితో శోభను పెంచుకున్న కపోలములూ, నవ్వుతో చూచే, అందరికీ అభయం ఇచ్చే నిన్ను చూచి అమ్మవారి మాత్రమే ఆనందించే వక్షస్థలాన్ని చూచి మేము దాసీలమయ్యాము

కా స్త్ర్యఙ్గ తే కలపదాయతవేణుగీత
సమ్మోహితార్యచరితాన్న చలేత్త్రిలోక్యామ్
త్రైలోక్యసౌభగమిదం చ నిరీక్ష్య రూపం
యద్గోద్విజద్రుమమృగాః పులకాన్యబిభ్రన్

నీ వేణు గానం విన్న తరువాత మోహించని స్త్రీ ఎక్కడుంటుంది ఈ ముల్లోకములలో. మూడు లోకాలనూ మోహింపచేయగల ఇంతటి దివ్య మంగళ విగ్రహాన్ని చూచి గోవులూ పక్షులూ మృగములూ చెట్లు కూడా పులకించాయి. జ్ఞ్యానం లేని వాటికే అంత ప్రేమ ఉంటే మనుషులమైన మాకు ఉండదా.

వ్యక్తం భవాన్వ్రజభయార్తిహరోऽభిజాతో
దేవో యథాదిపురుషః సురలోకగోప్తా
తన్నో నిధేహి కరపఙ్కజమార్తబన్ధో
తప్తస్తనేషు చ శిరఃసు చ కిఙ్కరీణామ్

మాకు తెలుసు. నీవు వ్రేపల్లెలో ఉన్న వారి భయాన్ని పోగొట్టడానికి వచ్చావు. నీవు ఆదిపురుషుడవు. అఖిల దేవతా లోకాన్ని కాపాడేవాడవు. నీవే వ్రేపల్లెలో ఉండే మా భయాన్ని పోగొట్టడానికి వచ్చావు. కాబట్టి నీ పాద పద్మాన్ని మా వక్షస్థలములో శిరస్సు మీదా ఉంచి మా తాపాన్ని పోగొట్టు. మా దుఃఖాన్ని పోగొట్టు

శ్రీశుక ఉవాచ
ఇతి విక్లవితం తాసాం శ్రుత్వా యోగేశ్వరేశ్వరః
ప్రహస్య సదయం గోపీరాత్మారామోऽప్యరీరమత్

ఈ రీతిలో వారు పలికిన మాటలు విని నవ్వాడు. తత్వం తెలుసుకున్నారు గోపికలు.
వారు స్పష్టముగా చెబితే వారి ఆర్తిని చూచి యోగేశ్వరేశ్వరుడై దయతో ఈ గోపికలతో ఆత్మారాముడైనా వారితో తాను రమించాడు.
సదయం - వాత్సల్యం

తాభిః సమేతాభిరుదారచేష్టితః ప్రియేక్షణోత్ఫుల్లముఖీభిరచ్యుతః
ఉదారహాసద్విజకున్దదీధతిర్వ్యరోచతైణాఙ్క ఇవోడుభిర్వృతః

పరమాత్మ వారితో రమించడానికి సిద్ధపడగా ఆనందముతో విపారిన కృష్ణుని ముఖపద్మాన్ని చూచి, ప్రియున్ని చూడటం వలన శోభిస్తున్న కనులు గల గోపికలతో చూడబడుతున్న కృష్ణుడు
ఉదారమైన నవ్వులతో కొద్దిగా బయలుపడ్డ దంతముల కాంతితో ఉన్న పరమాత్మ ముఖం నక్షత్రములతో కూడిన చంద్రుని కాంతి వలే ఉన్నది (ముఖం చంద్రుడు, నక్షత్రాలు పలు వరుసలు)
ఇక్కడ ద్విజములంటే దంతములు

ఉపగీయమాన ఉద్గాయన్వనితాశతయూథపః
మాలాం బిభ్రద్వైజయన్తీం వ్యచరన్మణ్డయన్వనమ్

గోపికా సైన్యముచే గానం చేయబడుతూ వైజయంతీ మాల ధరించి బృందావనం అంతా సంచరించాడు.

నద్యాః పులినమావిశ్య గోపీభిర్హిమవాలుకమ్
జుష్టం తత్తరలానన్ది కుముదామోదవాయునా

చల్లని ఇసుక కలిగిన నదీతీరానికి వచ్చాడు. ముఖ సుగంధముతో పరమాత్మ ఆనందించాడు

బాహుప్రసారపరిరమ్భకరాలకోరు నీవీస్తనాలభననర్మనఖాగ్రపాతైః
క్ష్వేల్యావలోకహసితైర్వ్రజసున్దరీణాముత్తమ్భయన్రతిపతిం రమయాం చకార

ఆ గోపికలతో గోపికలలో మన్మధున్ని ప్రేరేపిస్తూ, మన్మధోద్రేకాన్ని గోపికలలో కలిగిస్తూ రమించాడు

ఏవం భగవతః కృష్ణాల్లబ్ధమానా మహాత్మనః
ఆత్మానం మేనిరే స్త్రీణాం మానిన్యో హ్యధికం భువి

కృష్ణ పరమాత్మతో ఇంత గొప్ప మన్ననను పొందారు. ప్రపంచములో మా అంత అదృష్టవంతులైన స్త్రీలు లేరు. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందిన మా కన్నా గొప్పవారు ఎవరు

తాసాం తత్సౌభగమదం వీక్ష్య మానం చ కేశవః
ప్రశమాయ ప్రసాదాయ తత్రైవాన్తరధీయత

పరమాత్మ ఎపుడూ గర్వాన్ని సహించడు. గోపికల ప్రవృత్తిని చూచాడు కృష్ణుడు. వారి సౌభాగ్య మదాన్నీ అభిమానాన్నీ చూచి, భర్తగా ఉన్న తాను అది పోగొట్టాలని సంకల్పించాడు. వారిని అనుగ్రహించడానికి గర్వాన్ని తగ్గించడానికి వెంటనే అక్కడే అంతర్ధానమయ్యాడు.


                                             సర్వం శ్రీకృష్ణార్పణమస్తు