Pages

Thursday, 29 May 2014

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవై రెండవ అధ్యాయం

    ఓం నమో భగవతే వాసుదేవాయ 

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవై రెండవ అధ్యాయం

శ్రీద్ధవ ఉవాచ
కతి తత్త్వాని విశ్వేశ సఙ్ఖ్యాతాన్యృషిభిః ప్రభో
నవైకాదశ పఞ్చ త్రీణ్యాత్థ త్వమిహ శుశ్రుమ

తత్వాలు కొందరు తొమ్మిదీ కొందరు పదకొండూ కొందరు ఐదు కొందరు పది కొందరు ఇరవై నాలుగు కొందరు ఇరవై ఒకటి అని చెప్పారు
ఋషులు తత్వాలు ఎంతగా చెప్పారు.

కేచిత్షడ్వింశతిం ప్రాహురపరే పఞ్చవింశతిం
సప్తైకే నవ షట్కేచిచ్చత్వార్యేకాదశాపరే
కేచిత్సప్తదశ ప్రాహుః షోడశైకే త్రయోదశ

కొందరు ఇవరై ఆరు అన్నారు, ఇరవై ఐదు, ఏడు, తొమ్మిది, ఆరు, నాలుగు పదకొండు పది, పదమూడు, పదహారు. అని ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పారు

ఏతావత్త్వం హి సఙ్ఖ్యానామృషయో యద్వివక్షయా
గాయన్తి పృథగాయుష్మన్నిదం నో వక్తుమర్హసి

ఇన్ని భేధాలు, ఇన్ని తీరులుగా ఋషులు ఏమి చెప్పదలచుకుని చెప్పారు.
అన్నీ చెప్పీ ఏమి చెప్పదలచుకున్నారో చెప్పలేదు. నాకిది అర్థం కాలేదు.

శ్రీభగవానువాచ
యుక్తం చ సన్తి సర్వత్ర భాషన్తే బ్రాహ్మణా యథా
మాయాం మదీయాముద్గృహ్య వదతాం కిం ను దుర్ఘటమ్

అన్నీ సత్యమే. బ్రాహ్మణులు అబద్దం  ఆడరు. యుక్తమైన దాన్నే మాట్లాడతారు. అందరూ నా మాయకు లోనైన వారే. నా మాయకు లోనైనవారు ఎన్నైనా చెబుతారు, వారికి ఏమి చెప్పడానికి వీలు ఉండదు?

నైతదేవం యథాత్థ త్వం యదహం వచ్మి తత్తథా
ఏవం వివదతాం హేతుం శక్తయో మే దురత్యయాః

ఒకరు చెప్పినది ఖండించి మరీ చెబుతారు. నేను చెప్పినదే నిజమంటారు. ఇలా పలికేవారు చెబుతున్న కారణాలను నేను కూడా కాదనలేనేమో.

యాసాం వ్యతికరాదాసీద్వికల్పో వదతాం పదమ్
ప్రాప్తే శమదమేऽప్యేతి వాదస్తమను శామ్యతి

చెప్పేవారికి ఆయా వికల్పాలే కారణం. వారి బుద్ధిలోని భేధమే వారి మాటలలో భేధానికి కారణం.
శమదమములు లేనిచో వారికి విషయ పరిజ్ఞ్యానం కన్నా వాదం మీదే వారికి రుచి ఎక్కువ

పరస్పరానుప్రవేశాత్తత్త్వానాం పురుషర్షభ
పౌర్వాపర్యప్రసఙ్ఖ్యానం యథా వక్తుర్వివక్షితమ్

ప్రతీ తత్వములో ఇంకో తత్వం చేరే ఉంది. ఒక దానిలో ఒకటి ప్రవేశించడం కనపడుతుంది కాబట్టి, కొందరు ఆ ప్రవేశించడం చూచి, అది ఒకటే అంటారు. తత్వములు ఒక దానిలో ఇంకొకటి ప్రవేశించడాన్ని బట్టి ఒకటే అని అంటున్నారు
ఏది ముందూ ఏది వెనుకా అన్న విషయం ఎవరూ తేల్చలేరు. ఆ వక్త ఏది ముందు చూస్తాడో ఏది ముందు అర్థమవ్తుందో ఏది ముందు చెప్పాలనుకుంటున్నాడో దాని బట్టి చెబుతాడు

ఏకస్మిన్నపి దృశ్యన్తే ప్రవిష్టానీతరాణి చ
పూర్వస్మిన్వా పరస్మిన్వా తత్త్వే తత్త్వాని సర్వశః

ఒకే దానిలో చాలా చేరుతాయి. చాలా దానిలో ఒకటీ చేరుతుంది.
పూర్వ తత్వములో పరతత్వాలు, పరతత్వములో పూర్వతత్వాలు ప్రవేశిస్తాయి. కాబట్టి అదే మొదలు అంటాడు. ఇదే తరువాత అంటాడు. కొందరు భూమి మొదలంటారు. కొందరు తేజస్సు మొదట పుట్టింది, దాని తరువాత ఆకాశం పుట్టింది అంటారు. కొందరు ఆకాశం నుంచి వాయువు, వాయువు నుండి అగ్నీ పుట్టింది అని చెబుతారు. వారు చూచిన దాన్ని బట్టి చెబుతారు. ఇందులో ఏది ముందూ ఏది తరువాతా అన్న దాన్ని భ్రమతో ఎవరూ తెలియలేరు

పౌర్వాపర్యమతోऽమీషాం ప్రసఙ్ఖ్యానమభీప్సతామ్
యథా వివిక్తం యద్వక్త్రం గృహ్ణీమో యుక్తిసమ్భవాత్

ఎవరు ఏ విషయములో బాగా యుక్తి చెప్పారో విన్నవారు "ఇదే బాగుంది. ఇదే విషయం" అనుకుంటారు

అనాద్యవిద్యాయుక్తస్య పురుషస్యాత్మవేదనమ్
స్వతో న సమ్భవాదన్యస్తత్త్వజ్ఞో జ్ఞానదో భవేత్

ఇలా అనాదినుండీ అవిద్యతో ఉన్నవారికి, ఎవరికి వారికి తమకు తాముగా తత్వం తెలియదు. తప్పనిసరిగా తత్వం చెప్పేవారు వేరేగా ఉండాలి. వారే జ్ఞ్యానం ఇచ్చేవారు

పురుషేశ్వరయోరత్ర న వైలక్షణ్యమణ్వపి
తదన్యకల్పనాపార్థా జ్ఞానం చ ప్రకృతేర్గుణః

జీవాత్మకూ పరమాత్మకూ ఏ కొంచెం కూడా వైలక్షణం లేదు
దాన్ని వేరు చేసి చెప్పడం అపార్థం. ఈ జ్ఞ్యానం అనేది ప్రకృతి యొక్క గుణములే.

ప్రకృతిర్గుణసామ్యం వై ప్రకృతేర్నాత్మనో గుణాః
సత్త్వం రజస్తమ ఇతి స్థిత్యుత్పత్త్యన్తహేతవః

ప్రకృతి అంటే గుణ సామ్యము. ఈ గుణాలు ప్రకృతికే గానీ ఆత్మకు కావు.
సత్వముతో రక్షణ, రజస్సుతో సృష్టి, తమస్సుతో ప్రళయం. ఆ మూడిటికీ ఈ మూడు జ్ఞ్యానం

సత్త్వం జ్ఞానం రజః కర్మ తమోऽజ్ఞానమిహోచ్యతే
గుణవ్యతికరః కాలః స్వభావః సూత్రమేవ చ

సత్వం అంటే జ్ఞ్యానం, రజస్సు అంటే కర్మ, తమస్సు అంటే అజ్ఞ్యానం
గుణవ్యతికరమే కాలం, స్వభావం సూత్రము

పురుషః ప్రకృతిర్వ్యక్తమహఙ్కారో నభోऽనిలః
జ్యోతిరాపః క్షితిరితి తత్త్వాన్యుక్తాని మే నవ

1)పురుషుడు 2)ప్రకృతి 3) వ్యక్తమూ 4)అహంకారము 4)ఆకాశం 5)అగ్ని 6)జలమూ 7)భూమి 9)వాయువు, కొందరు తొమ్మిది తత్వాలుగా చెప్పారు

శ్రోత్రం త్వగ్దర్శనం ఘ్రాణో జిహ్వేతి జ్ఞానశక్తయః
వాక్పాణ్యుపస్థపాయ్వఙ్ఘ్రిః కర్మాణ్యఙ్గోభయం మనః

శ్రోత్రము త్వక్ దర్శనం ఘ్రాణమూ జిహ్వ - ఇవి జ్ఞ్యానేంద్రియాలు
వాక్కు పాణి ఉపస్థ పాణి కాళ్ళు ఇవి కర్మేంద్రియాలు
మనసు రెండూ చేస్తుంది. జ్ఞ్యానాత్మకం కర్మాత్మకం. రెంటిలో చేరుతుంది

శబ్దః స్పర్శో రసో గన్ధో రూపం చేత్యర్థజాతయః
గత్యుక్త్యుత్సర్గశిల్పాని కర్మాయతనసిద్ధయః

శబ్ద స్పర్శ రసం గంధమూ రూపం విషయములు
వెళ్ళుటా వచ్చుటా పలుకుట విడుచుట తీసుకొనుట - ఇవి కర్మలు

సర్గాదౌ ప్రకృతిర్హ్యస్య కార్యకారణరూపిణీ
సత్త్వాదిభిర్గుణైర్ధత్తే పురుషోऽవ్యక్త ఈక్షతే

సృష్టి ప్రారంభములో ఈ ప్రకృతే కార్య కారణ రూపములో ఉంటుంది.
ఈ ప్రకృతి సత్వాది గుణములతో పరమాత్మ చేత శోభించబడి మహత్తుగా మారుతుంది

వ్యక్తాదాయో వికుర్వాణా ధాతవః పురుషేక్షయా
లబ్ధవీర్యాః సృజన్త్యణ్డం సంహతాః ప్రకృతేర్బలాత్

పరమాత్మ యొక్క సంకల్పముతో వ్యక్తాది ధాతువులు అన్నీ శక్తిని పొంది ఒక అండముగా మారుతాయి.
అదే బ్రహ్మాండము. ప్రకృతితో పరమాత్మ చేరడం వలన కలిగిన బలముతో అండం ఏర్పడుతుంది

సప్తైవ ధాతవ ఇతి తత్రార్థాః పఞ్చ ఖాదయః
జ్ఞానమాత్మోభయాధారస్తతో దేహేన్ద్రియాసవః

ధాతువులు ఏడు, విషయాలు ఐదు, విషయములు, భూతములు ఐదు.
దీన్ని బట్టే జ్ఞ్యానమూ శరీరము ఇంద్రియములూ ప్రాణములు.

షడిత్యత్రాపి భూతాని పఞ్చ షష్ఠః పరః పుమాన్
తైర్యుత ఆత్మసమ్భూతైః సృష్ట్వేదం సమపావిశత్

ఐదు భూతములూ ఐదు ఇంద్రియములూ ఐదు విషయములూ, ఆరవ వాడు పురుషుడు.
తన నుండి పుట్టిన, తాను సృష్టించిన ఆ విషయాదులతో కలసి ఈ ప్రపంచాన్ని సృష్టించి,  ప్రపంచములో ప్రవేశిస్తాడు పరమాత్మ

చత్వార్యేవేతి తత్రాపి తేజ ఆపోऽన్నమాత్మనః
జాతాని తైరిదం జాతం జన్మావయవినః ఖలు

కొందరు నాలుగే అంటున్నారు. తేజస్సూ ఆత్మ నీరు అన్నం అని. అన్నం బ్రహ్మేదివ్య జానాత్ అని కొందరు, తేజస్సని కొందరు జలం అని కొందరు ఆత్మ అని కొందరు.కొందరు వీటితో ఐదనీ ఆరనీ ఏడనీ తొమ్మిది అని చెబుతున్నారు.

సఙ్ఖ్యానే సప్తదశకే భూతమాత్రేన్ద్రియాణి చ
పఞ్చ పఞ్చైకమనసా ఆత్మా సప్తదశః స్మృతః

పదిహేడు అన్నప్పుడు పంచభూతములూ తన్మాత్రలూ ఇంద్రియములూ (5+5+5 = 15) మనసూ (16) ఆత్మ (17)

తద్వత్షోడశసఙ్ఖ్యానే ఆత్మైవ మన ఉచ్యతే
భూతేన్ద్రియాణి పఞ్చైవ మన ఆత్మా త్రయోదశ

కొందరు ఆత్మనూ మనసునూ కలిపి పదహారు అంటున్నారు.
కొందరు భూత ఇంద్రియాలను కలిగి, మనసు ఆత్మనూ కలిపి త్రయోదశం అంటున్నారు.

ఏకాదశత్వ ఆత్మాసౌ మహాభూతేన్ద్రియాణి చ
అష్టౌ ప్రకృతయశ్చైవ పురుషశ్చ నవేత్యథ

పదకొండు అంటే - ఐదు మహా భూతములూ ఐదు ఇంద్రియములూ ఆత్మ ఒకటి, 11
భూమి ఆపః అనల వాయువు ఆకాశం, మనసు బుద్ధీ అహంకారం, ఆత్మ - ఇవి పది

ఇతి నానాప్రసఙ్ఖ్యానం తత్త్వానామృషిభిః కృతమ్
సర్వం న్యాయ్యం యుక్తిమత్త్వాద్విదుషాం కిమశోభనమ్

ఈ దృష్టిలో ఇన్ని రకాలుగా ఋషులు తత్వాలుగా చెప్పారు
ప్రతీ దానిలోనూ యుక్తి ఉంది కాబట్టి అన్నీ న్యాయమే
పండితులు ఏది చెప్పినా బాగా చెబుతారు.

శ్రీద్ధవ ఉవాచ
ప్రకృతిః పురుషశ్చోభౌ యద్యప్యాత్మవిలక్షణౌ
అన్యోన్యాపాశ్రయాత్కృష్ణ దృశ్యతే న భిదా తయోః
ప్రకృతౌ లక్ష్యతే హ్యాత్మా ప్రకృతిశ్చ తథాత్మని

మీరు చెప్పారు. ప్రకృతీ పురుషులు ఆత్మ కన్నా విలక్షణులని. ప్రకృతి కంటే పురుషుడు వేరు పురుషుని కంటే ప్రకృతి వేరు అని. ప్రకృతిని పురుషుడు పురుషున్ని ప్రకృతి ఆశ్రయించి ఉన్నాయి,
ప్రకృతిని ఆశ్రయించకుండా పురుషుడూ, పురుషున్ని ఆశ్రయించకుండా ప్రకృతీ ఎక్కడా కనపడవు
ప్రకృతి పురుషులకు భేధం మనకు కనపడదు. ప్రకృతిలో ఆత్మ కనపడుతుంది.
ఒకదానిలో  ఒకటి కనపడుతున్నపుడు రెండూ వేరు ఎలా అవుతాయి
న్యాబద్ధమైన మాటలతో నా ఈ సందేహాన్ని తీర్చవలసింది

ఏవం మే పుణ్డరీకాక్ష మహాన్తం సంశయం హృది
ఛేత్తుమర్హసి సర్వజ్ఞ వచోభిర్నయనైపుణైః

జ్ఞ్యానం వచ్చినా పోయిన అది నీ దయ వలననే కలుగుతుంది

త్వత్తో జ్ఞానం హి జీవానాం ప్రమోషస్తేऽత్ర శక్తితః
త్వమేవ హ్యాత్మమాయాయా గతిం వేత్థ న చాపరః


నీ మాయ గురించి నీకే తప్ప ఇంకెవరికి తెలుస్తుంది

శ్రీభగవానువాచ
ప్రకృతిః పురుషశ్చేతి వికల్పః పురుషర్షభ
ఏష వైకారికః సర్గో గుణవ్యతికరాత్మకః

ఇదంతా వైకారికము. సాత్విక అహంకారం వలన కలిగిన సృష్టి. గుణ వ్యతికర స్వరూపము
ఇదంతా నా మాయ. ఇది గుణ మయి. ఇది ఎన్నో రకాలుగా ఉంది
గుణములే వికల్ప  బుద్ధిని కలిగిస్తాయి.

మమాఙ్గ మాయా గుణమయ్యనేకధా వికల్పబుద్ధీశ్చ గుణైర్విధత్తే
వైకారికస్త్రివిధోऽధ్యాత్మమేకమథాధిదైవమధిభూతమన్యత్

ఆధ్యాత్మ ఆది దైవిక ఆది భూతమని ఈ సాత్విక అహంకారం ఉంది.

దృగ్రూపమార్కం వపురత్ర రన్ధ్రే పరస్పరం సిధ్యతి యః స్వతః ఖే
ఆత్మా యదేషామపరో య ఆద్యః స్వయానుభూత్యాఖిలసిద్ధసిద్ధిః

ఒక ఆకారం ఉంది. ఆ ఆకారాన్ని కన్ను చూస్తుంది. సూర్యభగవానుడు ఉంటే చూస్తుంది. చూపించేవాడు సూర్యుడా నేత్రమా? కన్నే చూస్తుంది అని కొందరంటారు. సూర్యుడు ఉన్నప్పుడు కన్ను చూస్తుంది అంటారు, మరి చూపేది సూర్యుడా కన్నా? కన్ను అని కొందరు సూర్యుడు అని కొందరు అంటారు
ఇలా ఉంటాయి వితర్కాలు.
రూపమూ సూర్యుడూ రెండూ ఆకాశములోనే ఉన్నాయి కాబట్టి ఆకాశం మూలం అని అంటారు. రూపమూ సూర్యుడూ కన్నూ మనసు యొక్క సంకల్పమూ ఉండాలి. ఇవి ఉండడానికి ఆకాశమూ ఉండాలి. ఇలా వారి వారి దృష్టిలో దేన్ని దేన్ని ప్రధానముగా భావించుకుంటారో అదే దర్శనమని చెప్పుకుంటారు

వీటన్నిటికంటే ఆత్మ ఆద్యము. ప్రతీవాడికి ఆత్మానుభూతితోనే అన్ని సిద్ధులూ ఏర్పడతాయి

ఏవం త్వగాది శ్రవణాది చక్షుర్
జిహ్వాది నాసాది చ చిత్తయుక్తమ్

కొందరికి త్వక్ నుంచీ, కొందరికి జిహ్వా కొందరికి నాసికా కొందరికి శ్రవణం, నేత్రమూ, ఏదైనా మనసుతో కలిపి ఉంచితేనే జ్ఞ్యానం ఏర్పడుతుంది

యోऽసౌ గుణక్షోభకృతో వికారః ప్రధానమూలాన్మహతః ప్రసూతః
అహం త్రివృన్మోహవికల్పహేతుర్వైకారికస్తామస ఐన్ద్రియశ్చ

ప్రథానము మూలముగా ఉండే మహత్ తత్వం నుండే సాత్వికాహంకారం పుట్టింది
ఈ అహంకారం త్రివృత్. సాత్విక రాజసిక తామస , ఈ మూడు రకాల అహంకారమే రకరకాల మోహం కలగడానికీ, మోహములో వికల్పాలకూ కారణం -సాత్విక రాజసిక తామస

ఆత్మాపరిజ్ఞానమయో వివాదో హ్యస్తీతి నాస్తీతి భిదార్థనిష్ఠః
వ్యర్థోऽపి నైవోపరమేత పుంసాం మత్తః పరావృత్తధియాం స్వలోకాత్

ఆత్మ అనేది జ్ఞ్యాన స్వరూపము. కొందరు ఉందంటున్నారు, కొందరు లేదంటున్నారు
ఉన్నది అనడానికి ఎలా వస్తువు కావాలో, లేదు అనడానికి కూడా వస్తువు కావాలి.
ఏ వస్తువు లేదు అని చెప్పాలి అనుకుంటున్నామో ఆ వస్తువు స్వభావం మనకు తెలిసి ఉంటేనే మనం అది లేదు అని చెప్పగలము. కుండ గురించి బాగా తెలిసి ఉంటేనే కుండ లేదు అని చెప్పగలము.
ఈ వాదాలతో ప్రయోజనం లేకున్నా వాదించుకోవడం మాత్రం మానరు
నేనే వారి బుద్ధిని అటు తిప్పాను. కాబట్టే ప్రయోజనం లేని వాదాలన్నీ పెట్టుకుంటారు

శ్రీద్ధవ ఉవాచ
త్వత్తః పరావృత్తధియః స్వకృతైః కర్మభిః ప్రభో
ఉచ్చావచాన్యథా దేహాన్గృహ్ణన్తి విసృజన్తి చ

మీరే అంటున్నారు, నేనే వారి బుద్ధినీ మనసునీ మార్చాను అని. మరి మీరే బుద్ధిని మారిస్తే, వారి వరు చేసుకున్న కర్మలతో వారికి ఆ దేహాలు వచ్చాయి అంటున్నావు. మరి బుద్ధి నీవు మారిస్తే వారి కర్మ వలన జరిగింది అని చెప్పడం ఎలా సాధ్యం.

తన్మమాఖ్యాహి గోవిన్ద దుర్విభావ్యమనాత్మభిః
న హ్యేతత్ప్రాయశో లోకే విద్వాంసః సన్తి వఞ్చితాః

ఆత్మ జ్ఞ్యానం లేని వారికి అర్థం కాని విషయం. నాకు ఈ విషయాన్ని వివరించండి.
దీనితోనే పండితులందరూ వంచించబడుతున్నారు. ఎవరి కర్మ వారిదే ఐనపుడు నీవు బుద్ధి ఎలా ఇస్తావు. నీవు బుద్ధి మారిస్తే ఆ కర్మ కూడా నీవు చేయించినదే కదా? వారిది ఎలా అవుతుంది.

శ్రీభగవానువాచ
మనః కర్మమయం ణౄణామిన్ద్రియైః పఞ్చభిర్యుతమ్
లోకాల్లోకం ప్రయాత్యన్య ఆత్మా తదనువర్తతే

మనం చేసిన కర్మలతోనే మనస్సు ఏర్పడుతుంది. (మనం కూడా ఒక వ్యక్తిని మంచి మనసు కలవాడా చెడు మనసు కలవాడా అని వాడు చేసే పనులబట్టే చెబుతాము.) కర్మలతో ఏర్పడేదే మనసు.
ఈ మనసు ఐదు ఇంద్రియాలతో కలసి, ఈ లోకం నుంచి ఆ లోకానికీ తిర్గుతూ ఉంటుంది.లోకాలన్నీ తిరుగుతున్న మనసుని ఆత్మ అనుసరిస్తుంది. దానికి సంబంధం ఉండదు, ఐనా వెంట ఉంటుంది.

ధ్యాయన్మనోऽను విషయాన్దృష్టాన్వానుశ్రుతానథ
ఉద్యత్సీదత్కర్మతన్త్రం స్మృతిస్తదను శామ్యతి

ఈ మనసు చూచిన వాటినో విన్నవాటినో ధ్యానం చేస్తూ ఉంటుంది. అవి మంచివైతే సంతోషిస్తుంది. చెడ్డవైతే బాధపడుతుంది. అభివృద్ధికి గానీ వినాశానికి కానీ కర్మే మూలము. ఈ బాధను 'మరుపూ తగ్గిస్తుంది.

విషయాభినివేశేన నాత్మానం యత్స్మరేత్పునః
జన్తోర్వై కస్యచిద్ధేతోర్మృత్యురత్యన్తవిస్మృతిః

విషయముల యందు మనసు ఉన్నవాడు ఆత్మను తలచకుంటే పూర్తిగా వాడిని మరపించేది మృత్యువు.

జన్మ త్వాత్మతయా పుంసః సర్వభావేన భూరిద
విషయస్వీకృతిం ప్రాహుర్యథా స్వప్నమనోరథః

అన్ని భావాలకూ పుట్టుక, జన్మ విషయములను స్వీకరించుటే. అనుభవించాలని విషయాలను స్వీకరించుటే జన్మ. పూర్వ జన్మలో ఆచరించిన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పుడుతున్నాము. శబ్ద స్పర్శ రస రూప గంధములను స్వీకరించుటే కర్మ. పుట్టడం అంటే విషయాలను తలచడమే. పూర్వజన్మలో వేటిని బాగా తలచి వేటి యందు బాగా ఇష్టం కలిగి ఉన్నామో వాటిని అనుభవించడానికే పుడుతున్నాము. అందరూ అందరితో ఒకే తీరుగా లేకుండుటకు వారి పూర్వ జన్మ సంస్కారమే కారణం. జన్మ అంటే విషయ స్వీకారం.
ఎలాగైతే మన కోరికలే స్వప్నాలో విషయ స్మృతే పుట్టుక.స్మరణే కల ఐనట్లుగా, స్మరణే పుట్టుక.

స్వప్నం మనోరథం చేత్థం ప్రాక్తనం న స్మరత్యసౌ
తత్ర పూర్వమివాత్మానమపూర్వమ్చానుపశ్యతి

కానీ జరిగిన దాన్ని స్మరించలేడు.  పూర్వ జన్మ స్మృతి ఉండదు.
ఇది వరకు ఉన్నదే ఐనా జ్ఞ్యాపకం లేదు కాబట్టి మళ్ళీ కొత్తే. జ్ఞ్యాపకం లేదు కాబట్టి స్మరణలో లేదు కాబట్టి అంతకు ముందే ఐన అనుభవాలను కొత్తవి అని అనుకుంటాడు

ఇన్ద్రియాయనసృష్ట్యేదం త్రైవిధ్యం భాతి వస్తుని
బహిరన్తర్భిదాహేతుర్జనోऽసజ్జనకృద్యథా

ఇంద్రియాలతో విషయాలతో ఇది మూడు రకాలుగా భాసిస్తుంది. ఒకటి లోపలా ఒకటి వెలుపలా. ఆసక్తి ఉంటే ఒకటి, ఆసక్తి లేకుంటే ఇంకొకటి అని భావిస్తూ ఉంటాము.

నిత్యదా హ్యఙ్గ భూతాని భవన్తి న భవన్తి చ
కాలేనాలక్ష్యవేగేన సూక్ష్మత్వాత్తన్న దృశ్యతే

ఈ ప్రాణులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.
కాలము మహా వేగం కాబట్టి, మనకు స్మృతిలో ఉండదు. మరుపు వస్తుంది. కాలం వలన విషయాలను మనం మరుస్తాము.

యథార్చిషాం స్రోతసాం చ ఫలానాం వా వనస్పతేః
తథైవ సర్వభూతానాం వయోऽవస్థాదయః కృతాః

ఉదాహరణకు సమిధలు వేసి మంట పెట్టాము. కొత్తగా సమిధలు వేసినపుడు మంట బాగా ఉంటుంది, అవి తగ్గుతూ ఉన్న కొద్ది మంటలు తగ్గుతూ ఉండి చివరకు పోతుంది. మరి పెరిగింది తరిగింది పోయిందీ మంటా,కట్టెలా? అగ్నికి హెచ్చూ తగ్గూ మార్పూ లేదు. వర్షం వస్తే నదీ ప్రవాహం పెరుగుతుంది, వర్షం లేకుంటే తగ్గుతుంది, ఎండిపోతుంది. ఇక్కడ ఎండిపోయింది ప్రవాహమే కానీ నది కాదు.
ఒక చెట్టుకు పూసిందీ, కాసింది, కాసి పడిపోయిందీ పళ్ళా చెట్టా? పూసిన పూలూ కాసినా రాలినా పళ్ళతో చెట్టుకు సంబంధం ఉండదు. చెట్టు శాశ్వతం. అలాగే శైశవం బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం శరీరానికే గానీ ఆత్మకు కాదు. ఆత్మ అనుభవిస్తున్న మనసు వెంట ఉంటుంది.

సోऽయం దీపోऽర్చిషాం యద్వత్స్రోతసాం తదిదం జలమ్
సోऽయం పుమానితి నృణాం మృషా గీర్ధీర్మృషాయుషామ్

కాంతికి దీపం లాగ, ప్రవాహానికి జలం లాగ, వీడు మనిషి అంటున్నాము. కనపడేది ఆత్మ అనేది అబద్దపు బుద్ధి. చచ్చేవాడు ఐన వాడికి పుట్టిన అబద్దపు బుద్ధి

మా స్వస్య కర్మబీజేన జాయతే సోऽప్యయం పుమాన్
మ్రియతే వామరో భ్రాన్త్యా యథాగ్నిర్దారుసంయుతః

ఎలాంటి కర్మను ఆచరించడం వలన కలిగిన సంస్కారం కల మనసుతో కూడి ఆత్మ ఉంటుందో, దానికి సరిపడా దేహం వచ్చి, అందులో మనసు, దాన్ని అనుసరించి ఆత్మా ఉంటుంది
కట్టెలతో కూడిన అగ్ని చల్లారినట్లు, శరీరములో ఉన్న అమరుడైన (మృత్యువు లేని) ఆత్మ కూడా నశించదు.

నిషేకగర్భజన్మాని బాల్యకౌమారయౌవనమ్
వయోమధ్యం జరా మృత్యురిత్యవస్థాస్తనోర్నవ

శరీరానికి తొమ్మిది అవస్థలు ఉంటాయి.
నిషేకం
గర్భమూ
జన్మ
బాల్యం
కౌమారం
యవ్వనం
వయో మధ్యం
జరా
మృత్యువు
ఈ తొమ్మిదీ ఆత్మకుకావు శరీరానికి

ఏతా మనోరథమయీర్హాన్యస్యోచ్చావచాస్తనూః
గుణసఙ్గాదుపాదత్తే క్వచిత్కశ్చిజ్జహాతి చ

మనం ఇది వరకు శరీరములో ఉన్నపుడు కోరిన కోరికలతో ఏర్పడినదే ఈ శరీరం. కోరుకున్నవాటిని అనుభవించడానికి ఏ శరీరం కావాలని కోరుకున్నామో ఆ శరీరం వస్తుంది. మనసుతోనే వస్తుంది శరీరం. గుణ సంగాన్ని బట్టే పుడుతుంటాడు, గుణ సంగాన్ని బట్టే విడిచిపెడుతూ ఉంటాడు

ఆత్మనః పితృపుత్రాభ్యామనుమేయౌ భవాప్యయౌ
న భవాప్యయవస్తూనామభిజ్ఞో ద్వయలక్షణః

ఎవరూ వారి పుట్టుకనూ మరణాన్నీ చూడలేరు. కనపడనివన్నీ నమ్మము అనేవారు ఈ రెంటినీ నమ్మకూడదు. మన చుట్టూ వారిని (పితృ పుత్రులని బట్టి) ఈ జన్మ మరణములు తెలుసుకోవాలి
వాస్తవముగా స్వయముగా పుట్టుకని మరణాన్నీ తెలుసుకున్నవాడు లేడు.

తరోర్బీజవిపాకాభ్యాం యో విద్వాఞ్జన్మసంయమౌ
తరోర్విలక్షణో ద్రష్టా ఏవం ద్రష్టా తనోః పృథక్

చెట్టు వచ్చింది బీజం నుండే, బీజం వచ్చేది చెట్టు నుండి.ఇలా ఒక దాన్ని ఒకటి అనుసరించి ఉంటాయి
కాయా పండూ పూవు కంటే చెట్టును వేరుగా చూచేవాడు బాల్య యవ్వన కౌమారముల కంటే ఆత్మ వేరు అని తెలుసుకుంటాడు.శరీరం కంటే ఆత్మ వేరు అని తెలుసుకుంటాడు

ప్రకృతేరేవమాత్మానమవివిచ్యాబుధః పుమాన్
తత్త్వేన స్పర్శసమ్మూఢః సంసారం ప్రతిపద్యతే

ఇలా తెలుసుకోని అజ్ఞ్యాని మూర్ఖుడై సంసారాన్ని పొందుతాడు

సత్త్వసఙ్గాదృషీన్దేవాన్రజసాసురమానుషాన్
తమసా భూతతిర్యక్త్వం భ్రామితో యాతి కర్మభిః

సత్వ గుణం ఉంటే దేవతలూ ఋషులుగా పుడతారు
రజో గుణం ఉంటే రాక్షసులూ మానవులుగా
తమో గుణముతో పశు జన్మా పొందుతారు.

నృత్యతో గాయతః పశ్యన్యథైవానుకరోతి తాన్
ఏవం బుద్ధిగుణాన్పశ్యన్ననీహోऽప్యనుకార్యతే

ఎదుటివాడు నాట్యం చేస్తున్న్నాడు, ఎవరో పాట పాడుతూ ఉంటారు. అది చూస్తున్న మనం కూడా కూనిరాగం తీస్తూ కాళ్ళు కద్లిస్తూ ఉంటాము
ఇలాగే బుద్ధి గుణాలు చూస్తూ అసలు ఆత్మకు ఏ రూపం లేకున్నా అనుసరిస్తూ ఉంటుంది.

యథామ్భసా ప్రచలతా తరవోऽపి చలా ఇవ
చక్షుసా భ్రామ్యమాణేన దృశ్యతే భ్రమతీవ భూః

ప్రవాహం చాలా వేగముగా వెళుతూ ఉంటే దాని వెనక చెట్లు కూడా వేగముగా వెళుతూ కనపడతాయి
ప్రవాహ వేగానికి కన్ను కూడా తిరుగుతూ చెట్లు తిరుగుతూ ఉన్నట్లుగా కనపడుతుంది.

యథా మనోరథధియో విషయ్షానుభవో మృషా
స్వప్నదృష్టాశ్చ దాశార్హ తథా సంసార ఆత్మనః

కోరికల బుద్ధే విషయానుభవముగా వస్తుంది
ఆత్మకు ఎలాంటి విషయానుభవం లేదు
కోరికలమీద బుద్ధికి ఉన్న అనుభవాన్ని ఆత్మ తన అనుభవముగా భావిస్తుంది

కలలో చూస్తున్నవి ఎలా లేవో సంసారములో అనుభవిస్తూ ఉన్నది కూడా అలాగే లేదు

అర్థే హ్యవిద్యమానేऽపి సంసృతిర్న నివర్తతే
ధ్యాయతో విషయానస్య స్వప్నేऽనర్థాగమో యథా

అర్థం లేకున్నా సంసారం మాత్రం పోదు
అక్కడ వస్తువు లేకున్నా మనసులో తలచుకుంటూ ఉంటారు.  విషయ ధ్యానమే సంసారానికి కారణం గానీ విషయాలు కాదు. స్వప్నములు రావడానికి మనోరథాలే కారణం. వేటిని ఆలోచించావో అవే కలలో వస్తాయి. వేతిని ధ్యానించావో అవే అనుభవానికి వస్తున్నాయి

తస్మాదుద్ధవ మా భుఙ్క్ష్వ విషయానసదిన్ద్రియైః
ఆత్మాగ్రహణనిర్భాతం పశ్య వైకల్పికం భ్రమమ్

ఉద్ధవా చెడు ఇంద్రియములతో విషయములను అనుభవించకు.  అనుభవిస్తే సంసారం తప్పదు.
ఇదంతా భ్రమ.ఇదంతా వికల్పమే. ఆత్మను పట్టి లాగి వచ్చి ఇక్కడకు పడేయడమే అవుతుంది అలా చేస్తే

క్షిప్తోऽవమానితోऽసద్భిః ప్రలబ్ధోऽసూయితోऽథ వా
తాడితః సన్నిరుద్ధో వా వృత్త్యా వా పరిహాపితః

ఈ ప్రంచములో ఎన్ని రకముల అనుభవాలు ఉంటాయో అవి అన్నీ శరీరానికే ఆత్మకు కాదు
నిందించినా గౌరవించినా . వంచన చేసినా తప్పులు చూపించినా కొట్టినా కట్టినా

నిష్ఠ్యుతో మూత్రితో వాజ్ఞైర్బహుధైవం ప్రకమ్పితః
శ్రేయస్కామః కృచ్ఛ్రగత ఆత్మనాత్మానముద్ధరేత్

ఉద్యోగాన్ని పోగొట్టినా ఉమ్మి వేసినా మూత్రం వేసినా ఇన్ని రకాలుగా చేసినా
ఇలాంటి అనుభవాలు కలిగినపుడు శ్రేయస్సును కోరేవాడు, మనసుతోనే ఆత్మను ఉద్ధరించాలి.ఇవన్నీ శరీరానికి కానీ ఆత్మకు కావు అన్న ఒక్క విషయం తెలుసుకోవాలి.

శ్రీద్ధవ ఉవాచ
యథైవమనుబుధ్యేయం
వద నో వదతాం వర

ఇలా అనడానికి బాగానే ఉంది కానీ అలా ఎలా అనుకోవాలి.
ఆ భావన ఎలా వస్తుంది. అలా అనుకోలేము కదా. అలా అనుకోవాలంటే ఏమి చేయాలో చెప్పు.

సుదుఃషహమిమం మన్య ఆత్మన్యసదతిక్రమమ్
విదుషామపి విశ్వాత్మన్ప్రకృతిర్హి బలీయసీ
ఋతే త్వద్ధర్మనిరతాన్శాన్తాంస్తే చరణాలయాన్

ఇది చాలా కష్టం. అలా అనుకోలేము. దాన్ని సహించలేము. ఈ మనసులో ఉండే అసదతిక్రమం (చెడును దాటడం) చాలా కష్టమైన పని
పండితుడైనా సరే ప్రకృతి బలీయం కాబట్టి అతనికి కూడా శరీరమే ఆత్మ అన్న భావన ఉంటుంది.
ప్రకృతి బలీయం
నీ ధర్మం యందు ఆసక్తి ఉన్నవారు,నీ పాద పద్మాలు ఆశ్రయించిన వారు శాంతులూ తప్ప.

                                                     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు