Pages

Sunday, 11 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై నాలగవ అధ్యాయం

             ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై నాలగవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ఇతి సర్వే సుసంరబ్ధా వాహానారుహ్య దంశితాః
స్వైః స్వైర్బలైః పరిక్రాన్తా అన్వీయుర్ధృతకార్ముకాః

అపుడు అందరూ వచ్చారు, వారి వాహనాలను ఎక్కి, ధనస్సూ ఆయుధాలను తీసుకుని ఆ రథం వెంట బడ్డారు

తానాపతత ఆలోక్య యాదవానీకయూథపాః
తస్థుస్తత్సమ్ముఖా రాజన్విస్ఫూర్జ్య స్వధనూంషి తే

బలరాముడు మొదలైన వారు ఆ వచ్చే సైన్యం మీద ఆయుధాలు ఎక్కిపెట్టి ఏనుగు మీద గుర్రం మీదా రథం మీదా యుద్ధం చేయడం నేర్పరులైన వారు మేఘములు పర్వతం మీద వర్షం కురిపించినట్లుగా వారి మీద శరవరషం కురిపించారు

అశ్వపృష్ఠే గజస్కన్ధే రథోపస్థేऽస్త్ర కోవిదాః
ముముచుః శరవర్షాణి మేఘా అద్రిష్వపో యథా

పత్యుర్బలం శరాసారైశ్ఛన్నం వీక్ష్య సుమధ్యమా
సవ్రీడ్మైక్షత్తద్వక్త్రం భయవిహ్వలలోచనా

కృష్ణ పరమాత్మ రథం చుట్టూ శత్రు సైన్యం చుట్టి ఉండగా రుక్మిణీ బయముతో సిగ్గుతో స్వామిని చూచింది

ప్రహస్య భగవానాహ మా స్మ భైర్వామలోచనే
వినఙ్క్ష్యత్యధునైవైతత్తావకైః శాత్రవం బలమ్

నీవు ఏమీ భయపడవలదు అని చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. నీ సైన్యముతో నీ శత్రువులు సంహరించబడతారు. కృష్ణుడి రథం ఎక్కింది కాబట్టి యాదవ సైన్యం అంతా రుక్మిణీ సైన్యమే. రథం ఎక్కే దాక రక్షకులుగా ఉన్నవారు ఇపుడు శత్రువులు. మనం కూడా స్వామి మనవాడు అనుకుంటే స్వామి సైన్యం (భాగవతోత్తములు) అంతా మనవారు.

తేషాం తద్విక్రమం వీరా గదసఙ్కర్షనాదయః
అమృష్యమాణా నారాచైర్జఘ్నుర్హయగజాన్రథాన్

బలరాముడూ గదుడూ మొదలైన వారు శత్రువుల పరాక్రమాన్ని చూచి తమ ధనువులతో బాణములతో గదలతో ఖడ్గములతో శిరస్సులనూ భుజములనూ రథములనూ ఆయుధములనూ కిరీటాలనూ కిందపడవేస్తున్నారు. చేతులూ కాళ్ళూ బాహువులూ పాదములూ శిరస్సులూ గుర్రములూ ఏనుగులూ అన్ని కిందబడుతున్నాయి, నరకబడుతున్నాయి. యాదవుల పరాక్రమానికి జరాసంధాదులు తాళలేక పలాయనం చిత్తగించారు

పేతుః శిరాంసి రథినామశ్వినాం గజినాం భువి
సకుణ్డలకిరీటాని సోష్ణీషాణి చ కోటిశః

హస్తాః సాసిగదేష్వాసాః కరభా ఊరవోऽఙ్ఘ్రయః
అశ్వాశ్వతరనాగోష్ట్ర ఖరమర్త్యశిరాంసి చ

హన్యమానబలానీకా వృష్ణిభిర్జయకాఙ్క్షిభిః
రాజానో విముఖా జగ్ముర్జరాసన్ధపురఃసరాః

శిశుపాలం సమభ్యేత్య హృతదారమివాతురమ్
నష్టత్విషం గతోత్సాహం శుష్యద్వదనమబ్రువన్

పారిపోతూ జరాసంధుడు శిశుపాలున్ని ఓదారుస్తాడు. శిశుపాలుని ముఖములో కాంతిపోయింది.

భో భోః పురుషశార్దూల దౌర్మనస్యమిదం త్యజ
న ప్రియాప్రియయో రాజన్నిష్ఠా దేహిషు దృశ్యతే

నీవు ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు. లోకములో జీవులకు ఎపుడూ ప్రియము కానీ ఎపుడూ అప్రియముగానీ జరుగదు. మనమనుకున్నది ఎపుడూ జరుగదూ అనుకోనిది ఎపుడూ ఆగదు. దానికి చింతించవలసిన పనిలేదు

యథా దారుమయీ యోషిత్నృత్యతే కుహకేచ్ఛయా
ఏవమీశ్వరతన్త్రోऽయమీహతే సుఖదుఃఖయోః

తోలు  బొమ్మ ఆడించేవాడి (కుహకుడు - నటుడు) ఇష్టం ప్రకారం ఆడుతుంది. ప్రపంచమంతా భగవంతుంది ఆధీనములో ఉంటుంది. ఎపుడు సుఖం ఎపుడు దుఃఖం కలుగుతుందో చెప్పలేము

శౌరేః సప్తదశాహం వై సంయుగాని పరాజితః
త్రయోవింశతిభిః సైన్యైర్జిగ్యే ఏకమహం పరమ్

నన్ను చూచి నేర్చుకో నేను కృష్ణునితో పదిహేడు సార్లు యుద్ధం చేసి ఓడిపోయాను. పద్దెనిమిదవ సారి గెలిచాను. నేను బాధనూ సంతోషన్ని పొందలేదు.

తథాప్యహం న శోచామి న ప్రహృష్యామి కర్హిచిత్
కాలేన దైవయుక్తేన జానన్విద్రావితం జగత్

ప్రపంచమంతా కాలముతో పరిగెత్తుతున్నది, దైవం కాలాన్ని నడిపిస్తున్నది. మనకు మనముగా ఏమీ చేయలేము, సాధించలేము.

అధునాపి వయం సర్వే వీరయూథపయూథపాః
పరాజితాః ఫల్గుతన్త్రైర్యదుభిః కృష్ణపాలితైః

అంత తక్కు మంది సైన్యం ఉన్నా ఆ యాదవులు మనను దొంగ దెబ్బ తీసారు. తెలివిగా యుద్ధం చేసారు.

రిపవో జిగ్యురధునా కాల ఆత్మానుసారిణి
తదా వయం విజేష్యామో యదా కాలః ప్రదక్షిణః

ఇపుడు కాలం వారికి అనుకూలముగా ఉన్నది. ఎపుడు కాలం మనకు అనుకూలముగా ఉంటుందో అపుడు మనం గెలుస్తాము

శ్రీశుక ఉవాచ
ఏవం ప్రబోధితో మిత్రైశ్చైద్యోऽగాత్సానుగః పురమ్
హతశేషాః పునస్తేऽపి యయుః స్వం స్వం పురం నృపాః

ఇలా శిశుపాలున్ని ఓదార్చి చావగా మిగిలిన వారు వారి వారి పురాలకు వెళ్ళారు

రుక్మీ తు రాక్షసోద్వాహం కృష్ణద్విడసహన్స్వసుః
పృష్ఠతోऽన్వగమత్కృష్ణమక్షౌహిణ్యా వృతో బలీ

రుక్మిణి అన్న ఐన రుక్మి ఈ రాక్ష వివాహాన్ని ఒప్పుకోక ఒక అక్షౌహిణీ సైన్యముతో వెంటబడ్డాడు

రుక్మ్యమర్షీ సుసంరబ్ధః శృణ్వతాం సర్వభూభుజామ్
ప్రతిజజ్ఞే మహాబాహుర్దంశితః సశరాసనః

అందరితో ప్రతిజ్ఞ్య చేసాడు.

అహత్వా సమరే కృష్ణమప్రత్యూహ్య చ రుక్మిణీమ్
కుణ్డినం న ప్రవేక్ష్యామి సత్యమేతద్బ్రవీమి వః

శత్రువును చంపకుండా రుక్మిణిని తీసుకు రాకుండా నేను నగరములోకి ప్రవేశించను అని ప్రతిజ్ఞ్య చేసి రథం ఎక్కి వేగముగా బయలుదేరాడు

ఇత్యుక్త్వా రథమారుహ్య సారథిం ప్రాహ సత్వరః
చోదయాశ్వాన్యతః కృష్ణః తస్య మే సంయుగం భవేత్

కృష్ణుని బలగర్వాన్ని నేను నా బాణములతో హరిస్తాను

అద్యాహం నిశితైర్బాణైర్గోపాలస్య సుదుర్మతేః
నేష్యే వీర్యమదం యేన స్వసా మే ప్రసభం హృతా

వికత్థమానః కుమతిరీశ్వరస్యాప్రమాణవిత్
రథేనైకేన గోవిన్దం తిష్ఠ తిష్ఠేత్యథాహ్వయత్

పరమాత్మ స్వరూపాన్ని తెలియని ఈ దుర్బుద్ధి తన ఒక రథముతో కృష్ణున్ని ఉండు ఉండమని

ధనుర్వికృష్య సుదృఢం జఘ్నే కృష్ణం త్రిభిః శరైః
ఆహ చాత్ర క్షణం తిష్ఠ యదూనాం కులపాంసన

హవిస్సును తీసుకు వెళుతున్నట్లుగా మా చెల్లెలను తీసుకుని ఎక్కడకు వెళతావు. ఆగు.

యత్ర యాసి స్వసారం మే ముషిత్వా ధ్వాఙ్క్షవద్ధవిః
హరిష్యేऽద్య మదం మన్ద మాయినః కూటయోధినః

ఇవాళ నీ మదాన్ని గర్వాన్ని నేను హరిస్తాను. రహస్యముగా యుద్ధం చేసేవాడవు నీవు.

యావన్న మే హతో బాణైః శయీథా ముఞ్చ దారీకామ్
స్మయన్కృష్ణో ధనుశ్ఛిత్త్వా షడ్భిర్వివ్యాధ రుక్మిణమ్

నా బాణములతో నిన్ను కొట్టకముందే నా చెల్లెలను విడిచిపెట్టు. ఆ మాట విని కృష్ణునికి నవ్వు వచ్చింది. తన బాణముతో వాడి ధనువును విరిచి

అష్టభిశ్చతురో వాహాన్ద్వాభ్యాం సూతం ధ్వజం త్రిభిః
స చాన్యద్ధనురాధాయ కృష్ణం వివ్యాధ పఞ్చభిః

ఒక ఆరు బాణాలతో వాడి శరీరాన్ని గుచ్చాడు. ఇంకో ధనువు తీసుకోగా దాన్ని విరిచాడు, ఇంకోటి తీసుకుంటే దాన్నీ విరిచాడు

తైస్తాదితః శరౌఘైస్తు చిచ్ఛేద ధనురచ్యుతః
పునరన్యదుపాదత్త తదప్యచ్ఛినదవ్యయః

పరిఘం పట్టిశం శూలం చర్మాసీ శక్తితోమరౌ
యద్యదాయుధమాదత్త తత్సర్వం సోऽచ్ఛినద్ధరిః

కృష్ణున్ని కొట్టడానికి తీసుకున్న ప్రతీ ఆయుధాన్ని చేదించాడు

తతో రథాదవప్లుత్య ఖడ్గపాణిర్జిఘాంసయా
కృష్ణమభ్యద్రవత్క్రుద్ధః పతఙ్గ ఇవ పావకమ్

ఖడ్గం తీసుకుని రథం మీద నుండి దిగి అగ్ని మీదకు మిడత పోయినట్లుగా కృష్ణుని మీదకు రుక్మి కత్తి తీసుకు వెళ్ళగా

తస్య చాపతతః ఖడ్గం తిలశశ్చర్మ చేషుభిః
ఛిత్త్వాసిమాదదే తిగ్మం రుక్మిణం హన్తుముద్యతః

తన బాణముతో కత్తిని పొడిగా చేసాడు. తాను కూడా రథం మీద నుండి దూకి ఖడ్గం తీసుకుని రుక్మిని చంపబోగా

దృష్ట్వా భ్రాతృవధోద్యోగం రుక్మిణీ భయవిహ్వలా
పతిత్వా పాదయోర్భర్తురువాచ కరుణం సతీ

అన్నను చంపబోవుతున్న స్వామిని చూచి భయముతో రుక్మిణి స్వామి పాదాల మీద పడి కరుణతో ఇలా అంది

శ్రీరుక్మిణ్యువాచ
యోగేశ్వరాప్రమేయాత్మన్దేవదేవ జగత్పతే
హన్తుం నార్హసి కల్యాణ భ్రాతరం మే మహాభుజ

ఇది రుక్మిణి కృష్ణ పరమాత్మను ఉద్దేశ్యించి అన్న మొట్టమొదటి పదం యోగేశ్వరా.
యోగేశ్వరా పరమాత్మా దేవ దేవా. సామ వేదం యోగాన్ని చెబుతుంది. ఋగ్వేదం పరమాత్మ తత్వాన్ని చెబుతుంది. యజుర్వేదం దేవతల ఆరాధనని చెబుతుంది.
ఇలా చెప్పి, చివరగా నీవు సకల జగన్నాథుడవు. కళ్యాణం చేసుకోవడానికి వచ్చావు.
నా అన్నగారిని చంపదగవు. (మనకు వివాహములో తెర తీయగానే కన్య యొక్క ముఖాన్ని చూడమంటారు. చూచే క్రమములో అబ్రాతృఘ్ని, అపితృఘ్ని అపుత్రఘ్ని అంటారు. రుక్మిణి ఒక రకముగా బ్రాతృఘ్ని అయ్యింది. సత్యభామ పితృఘ్ని, గంగ పుత్రఘ్ని అయ్యింది.
బలరాముని వివాహం చేసుకునే అమ్మాయి బలరాముని కంటే యాభై రెట్లు ఎత్తు ఎక్కువ. ఆయన రోకలితో కొట్టగా సమానమయ్యింది. అపుడు రోకలికి మట్టి అంటిందని మళ్ళీ నీరు పోసి శుద్ధి చేసారు. తన కంటే పెరగకుండా చేయడానికి ఈ ప్రక్రియ. అలాగే ఇంకో గంధర్వ కన్య ఉంది. సూర్యుని గురించి తపసు చేస్తే సూర్యుడు అక్కడినుంచి అమృతం రథం యొక్క రంధ్రాల ద్వారా దర్భలతో అమృతాన్ని కురిపించాడు. అదే ఇపుడు కూడా తల మీద దర్భలు  పెట్టి నీరు పోస్తాము)

శ్రీశుక ఉవాచ
తయా పరిత్రాసవికమ్పితాఙ్గయా శుచావశుష్యన్ముఖరుద్ధకణ్ఠయా
కాతర్యవిస్రంసితహేమమాలయా గృహీతపాదః కరుణో న్యవర్తత

ముఖం ఎండిపోయి గొంతు పెగలక దైన్యముతో మెడలో ఉన్న  బంగారు మాల జారిపోగా , ఇలా ప్రార్తించగా, కాళ్ళు పట్టుకుంది కాబట్టి చంపడాన్ని విరమించాడు

చైలేన బద్ధ్వా తమసాధుకారీణం సశ్మశ్రుకేశం ప్రవపన్వ్యరూపయత్
తావన్మమర్దుః పరసైన్యమద్భుతం యదుప్రవీరా నలినీం యథా గజాః

అతనికి బుద్ధి చెప్పడానికి ఉత్తరీయముతో అతనీ కట్టి, తలా మీసమూ గడ్డమూ గొరిగివేసి విరూపున్ని చేసాడు
సరసుని ఏనుగు చిన్నాభిన్నం చేసినట్లు బలరాముడు శతృ సైన్యాన్ని ధ్వంసం చేసాడు. కృష్ణుడి వద్దకు వచ్చాడు.

కృష్ణాన్తికముపవ్రజ్య దదృశుస్తత్ర రుక్మిణమ్
తథాభూతం హతప్రాయం దృష్ట్వా సఙ్కర్షణో విభుః
విముచ్య బద్ధం కరుణో భగవాన్కృష్ణమబ్రవీత్

కట్టబడి ఉన్న రుక్మిని చూచాడు. ఇంచుమించు చనిపోయినట్లు ఉన్న రుక్మిని చూచి, కట్లు విప్పి కృష్ణుడితో ఇలా అన్నాడు

అసాధ్విదం త్వయా కృష్ణ కృతమస్మజ్జుగుప్సితమ్
వపనం శ్మశ్రుకేశానాం వైరూప్యం సుహృదో వధః

కృష్ణా నీవు చేసిన పని మనవంటి వారికి తగినది కాదు.  నింద్యం.

మైవాస్మాన్సాధ్వ్యసూయేథా భ్రాతుర్వైరూప్యచిన్తయా
సుఖదుఃఖదో న చాన్యోऽస్తి యతః స్వకృతభుక్పుమాన్

ఇపటి వరకూ  మనం అనుకున్నప్రకారముగా చేయవచ్చు. కాని ఇక ముందు ఆమె కూడా మనసు బాధపడని రీతిన్ ప్రవర్తించాలి.మా అన్నకు ఇలా చేసారని రుక్మిణి మనసులో బాధపడితే తరువాతి నీ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది.
రుక్మిణీ నీవు మనసులో ఏమీ పెట్టుకోకు. ప్రపంచములో సుఖం కానీ దుఃఖం కానీ ఇంకొకరు ఇచ్చేది కాదు. తాను చేసిన దాన్నే అనుభవిస్తాడు.

బన్ధుర్వధార్హదోషోऽపి న బన్ధోర్వధమర్హతి
త్యాజ్యః స్వేనైవ దోషేణ హతః కిం హన్యతే పునః

బంధువైన వాడు చంపదగిన పని చేసిన బంధువైనందున వారిని చంపక వదిలిపెట్టాలి.వాడి తప్పుతోనే వాడు చచ్చాక మళ్ళీ వారిని చంపరాదు

క్షత్రియాణామయం ధర్మః ప్రజాపతివినిర్మితః
భ్రాతాపి భ్రాతరం హన్యాద్యేన ఘోరతమస్తతః

ఇది క్షత్రియ ధర్మం, తండ్రిని కొడుకూ, అన్నని తమ్ముడు, బంధ్వును బంధువూ రాజ్య కాంక్షతో చంపుకుంటారు. ఇది క్షత్రియ ధర్మమే. రుక్మిణీ, నీవేమీ అనుకోకు.

రాజ్యస్య భూమేర్విత్తస్య స్త్రియో మానస్య తేజసః
మానినోऽన్యస్య వా హేతోః శ్రీమదాన్ధాః క్షిపన్తి హి

యుద్ధం చేయడానికి ఎన్నో కారణాలు. రాజ్యం భూమి ధనం స్త్రీ అభిమానం కోసం బలనిరూపణ కోసం ఇంక వేరే కారణాలతో శ్రీమదాంధులై యుద్ధం చేస్తారు

తవేయం విషమా బుద్ధిః సర్వభూతేషు దుర్హృదామ్
యన్మన్యసే సదాభద్రం సుహృదాం భద్రమజ్ఞవత్

స్వామీ నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది. ఎల్లపుడు మిత్రులకు మంగళాన్ని శుభాన్నీ యోచించే నీవు ఈ అభద్రాన్ని ఎలా యోచించావు

ఆత్మమోహో నృణామేవ కల్పతే దేవమాయయా
సుహృద్దుర్హృదుదాసీన ఇతి దేహాత్మమానినామ్

శత్రువూ మిత్రుడూ అన్న భేధ భావన దేవ మాయ వలనే వస్తుంది. శరీరమే ఆత్మ అనుకునే వారికి మాత్రమే వీడు శత్రువూ, వీడు మిత్రుడూ అన్న భావన వస్తుంది.

ఏక ఏవ పరో హ్యాత్మా సర్వేషామపి దేహినామ్
నానేవ గృహ్యతే మూఢైర్యథా జ్యోతిర్యథా నభః

సకల జీవులకూ పరమాత్మ ఒక్కడే. అతనే మనం చేరవలసిన వాడు.
శరీరములో వచ్చే దోషములూ శరీరములో ఉండే ఆత్మకు అంటవు. కట్టెలో ఉన్న దోషం నిప్పుకూ కుండలో ఉన్న దోషం ఆకాశానికీ అంటనట్లుగా

దేహ ఆద్యన్తవానేష ద్రవ్యప్రాణగుణాత్మకః
ఆత్మన్యవిద్యయా క్లృప్తః సంసారయతి దేహినమ్

పుట్టుకా మరణం ఈ రెండూ ఉన్నది దేహం. శరీరం అంటే ద్రవ్యమూ ప్రాణమూ సత్వాది గుణములూ కలది.
అవిద్యతో ఆత్మలోనే (శరీరములోనే) ఆత్మ భావం పెట్టి బాధపడతాడు, సంసారములో ఉంటాడు

నాత్మనోऽన్యేన సంయోగో వియోగశ్చసతః సతి
తద్ధేతుత్వాత్తత్ప్రసిద్ధేర్దృగ్రూపాభ్యాం యథా రవేః

ఆత్మకు సమ్యోగం వియోగం లేదు. ఇక్కడకు వచ్చాము, అక్కడకు వెళ్ళాము అన్నది శరీరానికే. ఆత్మ సర్వ వ్యాపకం.

జన్మాదయస్తు దేహస్య విక్రియా నాత్మనః క్వచిత్
కలానామివ నైవేన్దోర్మృతిర్హ్యస్య కుహూరివ

పుట్టుకా ఉండుటా పెరుగుటా తరుగుటా మారుటా నశించుటా, ఈ ఆరు పుట్టేదానికి ఉండే (నశించే దానికి) వికారాలు. ఇవి షడ్ భావ వికారాలు. షడూర్ములు.
చంద్రుడు క్షీణిస్తున్నాడా, చంద్రుని కళలు క్షీణిస్తున్నాయా. చంద్రుడు మారడు. చంద్రుని కళలు మాత్రమే మారతాయి

యథా శయాన ఆత్మానం విషయాన్ఫలమేవ చ
అనుభుఙ్క్తేऽప్యసత్యర్థే తథాప్నోత్యబుధో భవమ్

లేని దాన్ని ఉన్నట్లు అనుకుంటాము. పడుకుని కలలు కంటాము. ఆ కలలు ఉన్నవా లేనివా.. ఎలా స్వప్నములో లేనివాటిని ఉన్నట్లుగా అనుభవిస్తావో, నీకు ఈ దేహం రావడమే స్వప్నం. మేలుకుంటే కల కరిగిపోయినట్లు ఆత్మ జ్ఞ్యానం కలిగితే దేహగత సకల బంధములూ భ్రమలూ తొలగిపోతాయి.

తస్మాదజ్ఞానజం శోకమాత్మశోషవిమోహనమ్
తత్త్వజ్ఞానేన నిర్హృత్య స్వస్థా భవ శుచిస్మితే

శరీరాన్ని ఇంకింపచేసే అజ్ఞ్యానం వలన వచ్చిన ఈ మోహాన్ని పవిత్రమైన చిరునవ్వు గల దానా ఆత్మ జ్ఞ్యానముతో ఈ అజ్ఞ్యానాన్ని పోగొట్టి కోపాన్ని వీడి స్వస్థురాలివి కమ్ము

శ్రీశుక ఉవాచ
ఏవం భగవతా తన్వీ రామేణ ప్రతిబోధితా
వైమనస్యం పరిత్యజ్య మనో బుద్ధ్యా సమాదధే

ఇది విన్న తరువాత రుక్మిణి ప్రసన్ను రాలైంది.

ప్రాణావశేష ఉత్సృష్టో ద్విడ్భిర్హతబలప్రభః
స్మరన్విరూపకరణం వితథాత్మమనోరథః
చక్రే భోజకటం నామ నివాసాయ మహత్పురమ్

దక్కిన ప్రాణాలతో, అనుకున్నదాన్ని చేయలేపోవడాన్ని, జరిగిన అవమానాన్నీ తలచుకుని, తన ప్రతిజ్ఞ్య ప్రకారం పట్టణానికి పోకుండా భోజకటం అనే పట్టణాన్ని నిర్మించుకుని అక్కడ ఉన్నాడు.

అహత్వా దుర్మతిం కృష్ణమప్రత్యూహ్య యవీయసీమ్
కుణ్డినం న ప్రవేక్ష్యామీత్యుక్త్వా తత్రావసద్రుషా

కోపముతో అక్కడేఉ ఉన్నాడు

భగవాన్భీష్మకసుతామేవం నిర్జిత్య భూమిపాన్
పురమానీయ విధివదుపయేమే కురూద్వహ

స్వామి కృష్ణ పరమాత్మ శత్రువు దగ్గరనుంచి రుక్మిణీ అమ్మవారిని తీసుకు వెళ్ళి శత్రువులని గెలిచి తన నగరానికి వచ్చి యధావిధిగా వివాహం చేసుకున్నాడు.

తదా మహోత్సవో నౄణాం యదుపుర్యాం గృహే గృహే
అభూదనన్యభావానాం కృష్ణే యదుపతౌ నృప

అపుడు ద్వారకా నగరములో ప్రతీ ఇంటిలో పండుగ చేసుకున్నారు. కృష్ణ పరమాత్మయందు అలాంటి భావం పౌరులందరిలో నిండిపోయింది

నరా నార్యశ్చ ముదితాః ప్రమృష్టమణికుణ్డలాః
పారిబర్హముపాజహ్రుర్వరయోశ్చిత్రవాససోః

పురుషులూ స్త్రీలూ పరమానందముతో తమను తాము అలంకరించుకున్నారు. వధూవరులకు కానుకలు తెచ్చి చదివించారు. ఆయాదవ పురి ఇంద్ర కేతువులూ పుష్పమాలలూ అంబరములూ రత్నాభరణములూ మొదలైనవాటితో ప్రతీ ఇంటి ముంగిలీ అలంకరించబడి ఉంది. ధూప దీపములూ రథములూ పతాకములూ ద్వజములూ తోరణములూ, ఏనుగులు స్రవించిన మద జలముతో భూమి తడిసిపోయాయి (అంతమంది రాజులు వచ్చారు)

సా వృష్ణిపుర్యుత్తమ్భితేన్ద్రకేతుభిర్
విచిత్రమాల్యామ్బరరత్నతోరణైః
బభౌ ప్రతిద్వార్యుపక్లృప్తమఙ్గలైర్
ఆపూర్ణకుమ్భాగురుధూపదీపకైః

సిక్తమార్గా మదచ్యుద్భిరాహూతప్రేష్ఠభూభుజామ్
గజైర్ద్వాఃసు పరామృష్ట రమ్భాపూగోపశోభితా

పిలువబడిన మిత్రులైన రాజుల ఏనుగుల మదజలముతో భూమి తడిసిపోయింది. ఏనుగులే అరటి చెట్లను తీసుకు వచ్చి ద్వారానికి కట్టాయి. అరటి స్తంభాలతో కొబ్బరి కాయలతో ముత్యాల హారాలూ రత్నాల తోరణాలు

కురుసృఞ్జయకైకేయ విదర్భయదుకున్తయః
మిథో ముముదిరే తస్మిన్సమ్భ్రమాత్పరిధావతామ్

కురు రాజులూ సృంజయ కైకేయ విదర్భ కుంతీ రాజ్య రాజులు సంతోషముతో కోలాహలం చేస్తున్నారు

రుక్మిణ్యా హరణం శ్రుత్వా గీయమానం తతస్తతః
రాజానో రాజకన్యాశ్చ బభూవుర్భృశవిస్మితాః

కృష్ణ పరమాత్మ రుక్మిణిని అపహరించి తీసుకు వచ్చి వివాహం చేసుకున్నాడట అని విని అందరూ పరమ ఆశ్చర్యాన్ని పొందారు. ఇంత బలీయమైన రాజులు కాపలాగా ఉండగా రుక్మిణిని తీసుకు వచ్చాడన్న అద్భుత వృత్తాంతాన్ని విని కృష్ణుని బలపరాక్రమాలు విని అందరూ ఆనందాన్ని పొందారు.
రాజ కన్యలూ రాజులూ కూడా ఆనందించారు.

ద్వారకాయామభూద్రాజన్మహామోదః పురౌకసామ్
రుక్మిణ్యా రమయోపేతం దృష్ట్వా కృష్ణం శ్రియః పతిమ్

ద్వారకా పట్టణములో ప్రజలందరికీ గొప్ప సంతోషం. స్వామి శ్రియ@పతి అయ్యాడు. రుక్మిణితో ఉన్న కృష్ణున్ని చూచి పరమానందాన్ని పొందారు.

                      సర్వం శ్రీకృష్ణార్పణమస్తు