Pages

Sunday, 11 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై మూడవ అధ్యాయం


                                                             ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై మూడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
వైదర్భ్యాః స తు సన్దేశం నిశమ్య యదునన్దనః
ప్రగృహ్య పాణినా పాణిం ప్రహసన్నిదమబ్రవీత్

యదు వంశ ఉద్దీపుడైన స్వామి రుక్మిణీ దేవి పంపిన సందేశం విని, సంతోశముతో ఆ బ్రాహ్మణోత్తముని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు (జరగబోయే రుక్మిణీ పాణిగ్రహణానికి ఇది సూచిక)

శ్రీభగవానువాచ
తథాహమపి తచ్చిత్తో నిద్రాం చ న లభే నిశి
వేదాహమ్రుక్మిణా ద్వేషాన్మమోద్వాహో నివారితః

రుక్మిణి నా యందు ఎలా మనసు కలిగి ఉన్నదో నేను కూడా ఆమె యందు మనసు కలిగి ఉన్నాను. రాత్రి నిదుర పోవలేకపోతున్నాను
నా మీద ద్వేషముతో రుక్మి నాతో వివాహాన్ని నిషేధించాడని తెలుసు

తామానయిష్య ఉన్మథ్య రాజన్యాపసదాన్మృధే
మత్పరామనవద్యాఙ్గీమేధసోऽగ్నిశిఖామివ

ఆమె చెప్పినట్లే క్షుద్ర రాజులను యుద్ధములో మర్దించి ఆమెను తీసుకుని వస్తాను
ఆమె నా యందే మనసు ఉంచినది. కాయికా వాచిన మానసిక దోషములులేని ఆమెను సమిధలు అగ్నితో ఉన్నట్లుగా ఆమెను నాతో తీసుకు వస్తాను

శ్రీశుక ఉవాచ
ఉద్వాహర్క్షం చ విజ్ఞాయ రుక్మిణ్యా మధుసూదనః
రథః సంయుజ్యతామాశు దారుకేత్యాహ సారథిమ్

ఈ మాట చెప్పి వివాహ నక్షత్రం ఏనాడో తెలుసుకుని దారుకున్ని రథాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞ్యాపించాడు

స చాశ్వైః శైబ్యసుగ్రీవ మేఘపుష్పబలాహకైః
యుక్తం రథముపానీయ తస్థౌ ప్రాఞ్జలిరగ్రతః

ఇవన్నీ స్వామి యొక్క రథానికి పూంచబడిన గుర్రాల పేర్లు. శైబ్య సుగ్రీవ మేఘ పుష్ప బలాహక అనే నాలుగు గుర్రాలతో రథాన్ని పూంచి దారుకుడు తీసుకు రాగా

ఆరుహ్య స్యన్దనం శౌరిర్ద్విజమారోప్య తూర్ణగైః
ఆనర్తాదేకరాత్రేణ విదర్భానగమద్ధయైః

తాను అధిరోహించి బ్రాహ్మణోత్తమున్ని కూడా ఎక్కించుకుని చాలా వేగముగా వెళ్ళే అశ్వములతో ఒకే రాత్రిలో తన ద్వారక నుండి విదర్భ రాజ్యానికి చేరాడు

రాజా స కుణ్డినపతిః పుత్రస్నేహవశానుగః
శిశుపాలాయ స్వాం కన్యాం దాస్యన్కర్మాణ్యకారయత్

భీష్మకుడు కొడుకు మాటను కాదనలేక కొడుకు మీద ప్రీతితో కొడుకు నిశ్చ్యైంచిన శిశుపాలునితో వివాహానికి సన్నాహాలు మొదలుపెట్టాడు

పురం సమ్మృష్టసంసిక్త మార్గరథ్యాచతుష్పథమ్
చిత్రధ్వజపతాకాభిస్తోరణైః సమలఙ్కృతమ్

నగరాన్ని మొత్తం అలంకరించాడు.  చక్కటి గంధ జలముతో, ముత్యాల ముగ్గులతో, తోరణాలూ, ధ్వజములూ పతాకములూ, పూలమాలలూ గంధములూ ఆభరణములూ,

స్రగ్గన్ధమాల్యాభరణైర్విరజోऽమ్బరభూషితైః
జుష్టం స్త్రీపురుషైః శ్రీమద్ గృహైరగురుధూపితైః

స్త్రీ పురుషులు కూడా తమను తాము అలంకరించుకున్నారు

పితౄన్దేవాన్సమభ్యర్చ్య విప్రాంశ్చ విధివన్నృప
భోజయిత్వా యథాన్యాయం వాచయామాస మఙ్గలమ్

వివాహానికి పూర్వం నాందీ శ్రాద్ధం చేస్తారు. అలా చేసి పితృదేవతలనూ దేవతలనూ ఆరాధించి, ఎదురుగా ఉన్న భూదేవతలైన బ్రాహ్మణులను ఆరాధించి వారికి భోజన తాంబూలాలు ఇచ్చి, స్వస్తి పుణ్యాహవాచనాలు జరిపించుకుని

సుస్నాతాం సుదతీం కన్యాం కృతకౌతుకమఙ్గలామ్
ఆహతాంశుకయుగ్మేన భూషితాం భూషణోత్తమైః

రుక్మిణీ దేవి దంత దావహానదులు జరిపించుకుని, అభ్యంగన స్నానం చేసి , చక్కని ఆభరణములతో కొత్త వస్త్రముల జంటతో అలంకరించుకుని

చక్రుః సామర్గ్యజుర్మన్త్రైర్వధ్వా రక్షాం ద్విజోత్తమాః
పురోహితోऽథర్వవిద్వై జుహావ గ్రహశాన్తయే

మూడు వేద మంత్రములతో స్వస్తి వాచనం జరిపించి అన్ని గ్రహములూ శాంతించడానికి అధర్వ వేదం కూడా పఠించారు పురోహితులు.

హిరణ్యరూప్య వాసాంసి తిలాంశ్చ గుడమిశ్రితాన్
ప్రాదాద్ధేనూశ్చ విప్రేభ్యో రాజా విధివిదాం వరః

బంగారమూ వెండీ వస్త్రములూ నువ్వులూ (బెల్లముతో కలిపిన నువ్వులు), గోదానం బ్రాహ్మణోత్తములకు దానం చెఏసి, విధి విధానం తెలిసిన రాజు జరిపించాడు

ఏవం చేదిపతీ రాజా దమఘోషః సుతాయ వై
కారయామాస మన్త్రజ్ఞైః సర్వమభ్యుదయోచితమ్

చేది రాజు కూడా తన కుమారునికి అన్నీ జరిపాడు. రథములూ ఏనుగులూ అశ్వములతో శిశుపాలుడు రాగా

మదచ్యుద్భిర్గజానీకైః స్యన్దనైర్హేమమాలిభిః
పత్త్యశ్వసఙ్కులైః సైన్యైః పరీతః కుణ్దీనం యయౌ

తం వై విదర్భాధిపతిః సమభ్యేత్యాభిపూజ్య చ
నివేశయామాస ముదా కల్పితాన్యనివేశనే

వారికి అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి పూజించి,ఎవరెవరికి ఎలాంటి ఇల్లు యోగ్యమో అలాంటి నివాసాలు ఏర్పాటు చేసారు

తత్ర శాల్వో జరాసన్ధో దన్తవక్రో విదూరథః
ఆజగ్ముశ్చైద్యపక్షీయాః పౌణ్డ్రకాద్యాః సహస్రశః

శాల్వడూ జరాసంధుడూ మొదలైన వారు శిశుపాలుని మిత్రులు వారందరూ వేల కొద్దీ సైన్యం తీసుకు వచ్చారు

కృష్ణరామద్విషో యత్తాః కన్యాం చైద్యాయ సాధితుమ్
యద్యాగత్య హరేత్కృష్నో రామాద్యైర్యదుభిర్వృతః

రాం కృష్ణులను ద్వేషించడం కోసమే అన్ని ప్రయత్నాలూ చేసుకుని శిశుపాలుని వివాహం నిర్విఘ్నముగా కొనసాగించడానికి

యోత్స్యామః సంహతాస్తేన ఇతి నిశ్చితమానసాః
ఆజగ్ముర్భూభుజః సర్వే సమగ్రబలవాహనాః

పొరబాటున బలరాముడూ ఇతర సైన్యాన్ని తీసుకుని రుక్మిణిని తీసుకు రావడానికి వస్తే బుద్ధి చెప్పడానికి వారి వద్ద ఉన్న మొత్తం సైన్యాన్నీ వాహనాలనీ తీసుకు వచ్చారు

శ్రుత్వైతద్భగవాన్రామో విపక్షీయ నృపోద్యమమ్
కృష్ణం చైకం గతం హర్తుం కన్యాం కలహశఙ్కితః

బలరాముడు కృష్ణుడు వెళ్ళిన విషయం తెలుసుకుని, ఒక్కడే వెళ్ళాడని అనుమానించి, వారంతా సర్వ సన్నధముగా వచ్చి ఉంటారని అనుమానించి,

బలేన మహతా సార్ధం భ్రాతృస్నేహపరిప్లుతః
త్వరితః కుణ్డినం ప్రాగాద్గజాశ్వరథపత్తిభిః

తన సైన్యాన్ని తీసుకుని తమ్మునికి అండగా తమ్ముని  మీద ప్రేమతో ఈయనా బయలు దేరాడు

భీష్మకన్యా వరారోహా కాఙ్క్షన్త్యాగమనం హరేః
ప్రత్యాపత్తిమపశ్యన్తీ ద్విజస్యాచిన్తయత్తదా

ఆమెకూడా అన్ని కార్యక్రమములు పూర్తి చేసుకుని పరమాత్మ ఎపుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంది. అంతకన్నా ఉందు ఆ బ్రాహ్మణోత్తముడు రావాలి కదా అని ఆలోచిస్తోంది

అహో త్రియామాన్తరిత ఉద్వాహో మేऽల్పరాధసః
నాగచ్ఛత్యరవిన్దాక్షో నాహం వేద్మ్యత్ర కారణమ్
సోऽపి నావర్తతేऽద్యాపి మత్సన్దేశహరో ద్విజః

ఇంకా  తొమ్మిది గంటలే ఉంది పెళ్ళికి, తక్కువ పూజ చేసుకున్నానేమో ఇంకా స్వామి రాలేదు. నాకు కారణం అర్థం కావట్లేదు. ఆ బ్రాహ్మణోత్తముడు కూడా రాలేదు

అపి మయ్యనవద్యాత్మా దృష్ట్వా కిఞ్చిజ్జుగుప్సితమ్
మత్పాణిగ్రహణే నూనం నాయాతి హి కృతోద్యమః

నా ప్రవర్తనలో ఏదైనా తప్పు చూసాడేమో కృష్ణుడు.ఇంకా రాలేదు. అసలు వస్తాడా. నన్ను వివాహం చేసుకుంటాడా
“ఘనుడా భూసురుడేగెనో? నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో? విని కృష్ణుండది తప్పుగా తలచెనో? విచ్చేయునో? ఈశ్వరుండనుకూలింప దలంచునో? తలపడో? ఆర్యామహాదేవియున్‌ నను రక్షింప నెరుంగునో? ఎరుగదో? నా భాగ్యమెట్లున్నదో

దుర్భగాయా న మే ధాతా నానుకూలో మహేశ్వరః
దేవీ వా విముఖీ గౌరీ రుద్రాణీ గిరిజా సతీ

నేను దౌర్భాగ్యవంతురాలేమో బ్రహ్మ నాకు అనుకూలముగా లేడేమో. వివాహం జరిపించాలంటే పెద్ద ముత్తైదువు ఐన పార్వతీ అమ్మవారికి  ఇష్టం లేదేమో

ఏవం చిన్తయతీ బాలా గోవిన్దహృతమానసా
న్యమీలయత కాలజ్ఞా నేత్రే చాశ్రుకలాకులే

ఇలా మనసు పరమాత్మ యందే ఉంచి కంటి నిండా నీళ్ళు నిండి ఉండగా ఇంకా సమయం ఉన్నది,ఇంకా మించిపోలేదు అని రెండు కన్నులూ మూసుకున్నది

ఏవం వధ్వాః ప్రతీక్షన్త్యా గోవిన్దాగమనం నృప
వామ ఊరుర్భుజో నేత్రమస్ఫురన్ప్రియభాషిణః

భగవదాగమనానికొరకు ఎదురు చూస్తూ ఉండగా స్వామి వస్తున్నట్లు సందేశం తన శరీరం నుండే వచ్చింది.
1. శకునములు: ఇవి దేశ కాల దేహ మనో గతాలని నాలుగు విధాలుగా ఉంటాయి. మనమున్న ప్రదేశమే మనం ఎటువంటి ప్రయత్నం చేయకుండానే పుష్పాలో అక్షతలో కుంకుమలో పరమాత్మ సన్నిధిలో పడతాయి (కిందకాదు) . దీపం వెలుగుతూ ఉండగా నుండి నూనె చుక్కలు రాలడం.
కాలగతం - మండు వేసవిలో ఉరుములూ మెరుపులూ పడ్డాయి, అది శుభసూచకం.
వ్యక్తి గతం - మనకు ఇష్టమైన ఇష్టులు అనుకోకుండా రావదం
దేహగతం - శరీరములో మగవారైతే కుడి ఆడువారైతే ఎడమ భాగం స్పందించడం. తొడ భుహం కనురెప్ప అదరడం. వస్త్రం సహజముగా జారడం,
అనుకోకుండా బ్రాహ్మణ ఆశీర్వాదం: బ్రాహ్మణులు శుభం అని పలకడం.
బండి ఎక్కేప్పుడు రెండు పూలు పడి ఉండడం. ఉతికిన బట్టలు తీసుకు వెళ్ళే చాకలి రావడం, నిండు ముత్తైదువ రావడం, కలశములతో స్త్రీ రావడం, గాడిద అరుపు వినరావడం.
ఇలాంటి శకునాలు.
రుక్మిణికి కూడా వామ ఊరువూ వామ భుజం వామ నేత్ర అదిరాయి. కొంచెం అదృష్టం ఉంది అనుకుంటూ ఉండగానే

అథ కృష్ణవినిర్దిష్టః స ఏవ ద్విజసత్తమః
అన్తఃపురచరీం దేవీం రాజపుత్రీమ్దదర్శ హ

తాను  పంపిన బ్రాహ్మణుడు కృష్ణుడు పంపగా వచ్చాడు.
అంతఃపురములో ఉన్న రుక్మిణిని బ్రాహ్మణోత్తముడు చూచాడు!

సా తం ప్రహృష్టవదనమవ్యగ్రాత్మగతిం సతీ
ఆలక్ష్య లక్షణాభిజ్ఞా సమపృచ్ఛచ్ఛుచిస్మితా

వచ్చిన వారిని చూచింది, విప్పారిన ముఖముతో ఉన్నాడు. ఈమె కూడా లక్షణములను బాగా తెలిసినందు వలన పవిత్రమైన చిరునవ్వుతో బ్రాహ్మణునికి నమస్కారం చేసి

తస్యా ఆవేదయత్ప్రాప్తం శశంస యదునన్దనమ్
ఉక్తం చ సత్యవచనమాత్మోపనయనం ప్రతి

తమాగతం సమాజ్ఞాయ వైదర్భీ హృష్టమానసా
న పశ్యన్తీ బ్రాహ్మణాయ ప్రియమన్యన్ననామ సా

ఆయన కూడా కృష్ణ పరమాత్మ వచ్చాడు అన్న విషయాన్ని చెప్పాడు. నీవు చెప్పిన విధముగానే నిన్ను తీసుకు వెళతాడట అని చెప్పగా ఇటువంటి ఆనందాన్ని కలిగించిన బ్రాహ్మణోత్తమునికి ఏమివ్వాలి అని ఆలోచించి రెండు చేతులూ జోడించి నమస్కరించింది. ఆ బ్రాహ్మణోత్తమునికి ఏమివ్వాలో తెలియక నమస్కరించింది

ప్రాప్తౌ శ్రుత్వా స్వదుహితురుద్వాహప్రేక్షణోత్సుకౌ
అభ్యయాత్తూర్యఘోషేణ రామకృష్ణౌ సమర్హణైః

బలరామ కృష్ణులు పెళ్ళి చూడడానికి వచ్చారన్న విషయం తెలిసిన రుక్మిణి తండ్రి వారికి కూడా నివాసం ఏర్పాటు చేసి, వారికి మధుపర్కాలు ఇచ్చాడు

మధుపర్కముపానీయ వాసాంసి విరజాంసి సః
ఉపాయనాన్యభీష్టాని విధివత్సమపూజయత్

తయోర్నివేశనం శ్రీమదుపాకల్ప్య మహామతిః
ససైన్యయోః సానుగయోరాతిథ్యం విదధే యథా

వారి సైన్యానికి కూడా ఆతిధ్య ఏర్పాట్లు చేసాడు

ఏవం రాజ్ఞాం సమేతానాం యథావీర్యం యథావయః
యథాబలం యథావిత్తం సర్వైః కామైః సమర్హయత్

వారి పరాక్రమానికీ బలానికి వయసుకూ సంపదకూ అధికారానికీ తగినట్లుగా పూజించాడు.

కృష్ణమాగతమాకర్ణ్య విదర్భపురవాసినః
ఆగత్య నేత్రాఞ్జలిభిః పపుస్తన్ముఖపఙ్కజమ్

కృష్ణుడు వచ్చాడు అన్న వార్త నగరం మొత్తం పాకగా అందరూ బయటకు వచ్చారు. తమ కనులతో స్వామి ముఖపద్మములోని గంధాన్ని పానం చేసారు

అస్యైవ భార్యా భవితుం రుక్మిణ్యర్హతి నాపరా
అసావప్యనవద్యాత్మా భైష్మ్యాః సముచితః పతిః

స్వామిని చూచిన తరువాత మా రుక్మిణికి ఇతనే భార్య కావాలి అని పౌరులంతా అనుకుంటున్నారు

కిఞ్చిత్సుచరితం యన్నస్తేన తుష్టస్త్రిలోకకృత్
అనుగృహ్ణాతు గృహ్ణాతు వైదర్భ్యాః పాణిమచ్యుతః

మేమేదైనా పుణ్యం చేసుకుంటే దానికి పరమాత్మ సంతోషించి వీరిద్దరికీ వివాహం చేయాలి

ఏవం ప్రేమకలాబద్ధా వదన్తి స్మ పురౌకసః
కన్యా చాన్తఃపురాత్ప్రాగాద్భటైర్గుప్తామ్బికాలయమ్

పురవాసులు ప్రేమ నిండిన హృదయం కలవారై ఇలా మాట్లాడుతున్నారు

పద్భ్యాం వినిర్యయౌ ద్రష్టుం భవాన్యాః పాదపల్లవమ్
సా చానుధ్యాయతీ సమ్యఙ్ముకున్దచరణామ్బుజమ్

సమయం వచ్చింది కాబట్టి రుక్మిణీ కూడా సైన్యం రక్షిస్తూ ఉండగా పార్వతీ దేవి ఆలయానికి కాళ్ళతో నడచి వెళ్ళింది. భగవంతుని వద్దకు ఎపుడూ నడిచే వెళ్ళాలి. మనసులో మాత్రం కృష్ణ పరమాత్మ పాద పద్మాలను ధ్యానం చేసుకుంటూ

యతవాఙ్మాతృభిః సార్ధం సఖీభిః పరివారితా
గుప్తా రాజభటైః శూరైః సన్నద్ధైరుద్యతాయుధైః
మృడఙ్గశఙ్ఖపణవాస్తూర్యభేర్యశ్చ జఘ్నిరే

మౌన దీక్షతో వెళ్ళింది. సఖులతో చెలులతో కలసి రాజభటులంతా రక్షణ ఇస్తుండగా అన్ని మంగళ వాద్యాలూ మోగిస్తూ ఉండగా పుష్ప గంధ అక్షతాది పూజ సామాగ్రి తీసుకుని, ఆభరణములతో బ్రాహ్మణ పతునులు వెంటరాగా, కొందరు గానమూ కొందరు నాట్యమూ చేస్తుండగా

నానోపహార బలిభిర్వారముఖ్యాః సహస్రశః
స్రగ్గన్ధవస్త్రాభరణైర్ద్విజపత్న్యః స్వలఙ్కృతాః

గాయన్త్యశ్చ స్తువన్తశ్చ గాయకా వాద్యవాదకాః
పరివార్య వధూం జగ్ముః సూతమాగధవన్దినః

రుక్మిణీ దేవి చుట్టూ చేరి సూత మాగధ వందులు బయలుదేరారు

ఆసాద్య దేవీసదనం ధౌతపాదకరామ్బుజా
ఉపస్పృశ్య శుచిః శాన్తా ప్రవివేశామ్బికాన్తికమ్

ఇలా గుడికి వెళ్ళి కాళ్ళూ చేతులు కడుక్కుని ఆచమనం చేసి పవిత్రులై శాంతముగా పవిత్రురాలై ఆలయానికి వెళ్ళింది. ఉద్వేగమైన మనసుతో ఆలయానికి వెళ్ళరాదు.

తాం వై ప్రవయసో బాలాం విధిజ్ఞా విప్రయోషితః
భవానీం వన్దయాం చక్రుర్భవపత్నీం భవాన్వితామ్

పెద్ద ముత్తైదువులు విధి బాగా తెలిసిన వారు బ్రాహ్మణ పత్నులు అమ్మవారిని పూజింపచేసారు రుక్మిణి చేత

నమస్యే త్వామ్బికేऽభీక్ష్ణం స్వసన్తానయుతాం శివామ్
భూయాత్పతిర్మే భగవాన్కృష్ణస్తదనుమోదతామ్

అమ్మా శివునితో కుమార స్వామితో గణేశునితో కలసి ఉన్న నీకు నమస్కరిస్తున్నాను. దంపతులు అంటే భార్యా భర్తా సంతానం. సంతానం లేని దంపతులు పూజకు పనికిరారు. కుమారులతో భర్తఓ ఉన్న అమ్మవారిని బ్రాహ్మణ పత్నులు  పూజింపచేసారు
కృష్ణ పరమాత్మ నా భర్త అయ్యేట్లు నన్ను దీవించమని రుక్మిణీ దేవి వేడుకున్నది

అద్భిర్గన్ధాక్షతైర్ధూపైర్వాసఃస్రఙ్మాల్య భూషణైః
నానోపహారబలిభిః ప్రదీపావలిభిః పృథక్

పుష్పములూ మాలలూ ధూపములూ దీపములూ గంధములూ రక రకాల కానుకలూ పూజలతో, దీప దానం చేసారు. పెద్ద దీపాల వరస పెట్టారు
స్వామి దేవాలయములో ఎన్ని దీపాలు ఉంచితే అన్ని పాపాలు పోతాయి. మన శరీరం ప్రమిద, మన ప్రీతి తైలం, మన భక్తి వత్తి, మన భావన అగ్ని. ఇలా పెడితే అలా దీపం ఎంత సేపు ఉంటుందో పరమాత్మ మీద దృష్టి అంత సేపు ఉంటుంది. మనం వేసే వత్తిలో ఎన్ని దారపు పోగులు ఉంటే అన్ని వేల సంవత్సరాలు విష్ణు లోక నివాసం ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఎన్ని దీపాలు పెడితే అన్ని పాపాలు తొలగిపోతాయి. ఎంత సేపు దీపాలు పెడితే అంత మేరకు రాబోయే పాపాలు పోతాయని అర్థం. దీపం ఎనభై నాలుగు నిముషాలు (మూడు ఘడియలు) ఉండాలి కనీసం.పరమాత్మకు దీపం పెట్టడం మనకోసం. అద్దం మన ముఖాన్నే చూపుతుంది. అద్దములో ప్రతిబింబాన్ని చూచుకుంటూ మనం అలంకరించుకుంటాం. స్వామి అద్దం. మనం దీప ధూప నైవేద్యాలు పెడితే మన పాపాలు పోతాయి. సూర్యోదాయనికి ముందే దీపం పెడితే ఫలితం రెట్టింపు వస్తుంది. 108 దీపాలు పెడితే తిరిగి మళ్ళీ సంసారము లోకి రాము. ఏకాదశీ పూర్ణిమా అష్టమీ చతుర్దీ పంచమీ అమావాస్య - ఈ ఆరు పర్వదినాలు. ఈ దినాలలో 108 దీపాలు పెడితే మళ్ళీ జన్మ ఉండదు


విప్రస్త్రియః పతిమతీస్తథా తైః సమపూజయత్
లవణాపూపతామ్బూల కణ్ఠసూత్రఫలేక్షుభిః

బ్రాహ్మణోత్తముల భార్యల్ను పూజించారు. అకూపాలూ తాంబూలాలు మాంగళ్యాలతో సత్కరించారు

తస్యై స్త్రియస్తాః ప్రదదుః శేషాం యుయుజురాశిషః
తాభ్యో దేవ్యై నమశ్చక్రే శేషాం చ జగృహే వధూః

వారంతా ఆమెకు శుభ ఆశీర్వాదాలు ఇచ్చారు. వారిని పూజించి శేష వస్త్రం ఆమె తీసుకుంది.

మునివ్రతమథ త్యక్త్వా నిశ్చక్రామామ్బికాగృహాత్
ప్రగృహ్య పాణినా భృత్యాం రత్నముద్రోపశోభినా

మౌన వ్రతాన్ని వదలిపెట్టి ఆలయం నుండి బయటకు వెళ్ళింది. పక్కన ఉన్న చెలికత్తె చేయి తీసుకుని బయలుదెరింది.

తాం దేవమాయామివ ధీరమోహినీం సుమధ్యమాం కుణ్డలమణ్డితాననామ్
శ్యామాం నితమ్బార్పితరత్నమేఖలాం వ్యఞ్జత్స్తనీం కున్తలశఙ్కితేక్షణామ్

మహా వీరులందరినీ మోహింపచేస్తున్న దేవమాయలా చక్కని నడుమూ ముఖమూ కలది.
ముంగ్రులు ముఖం మీద పడ్డాయి. అవి కనులకు అడ్డుగా ఉన్నాయి.  కేశముల చాటున ఉన్న కనులతో బెదురు చూపులు చూస్తూ ఉంది

శుచిస్మితాం బిమ్బఫలాధరద్యుతి శోణాయమానద్విజకున్దకుడ్మలామ్
పదా చలన్తీం కలహంసగామినీం సిఞ్జత్కలానూపురధామశోభినా

పవిత్రమైన చిరునవ్వు ఎర్రని పెదవీ కలది ఐ, ఆ దొండపండు వంటి ఎర్రని పెదవి కాంతి పళ్ళ మీద పడి పళ్ళు కూడా ఎరుపుగా కనపడుతున్నాయి.అందెల శోభతో హంసలా ఉంది

విలోక్య వీరా ముముహుః సమాగతా యశస్వినస్తత్కృతహృచ్ఛయార్దితాః
యాం వీక్ష్య తే నృపతయస్తదుదారహాస వ్రీదావలోకహృతచేతస ఉజ్ఝితాస్త్రాః

ఆమె సౌందర్యాన్ని చూచి వచ్చిన వీరులు మూర్చపోయారు.
ఆమె సౌందర్యాన్ని చూచి వచ్చిన వీరులందరూ మోహం చెంది తమ చేతిలో ఉన్న ఆయుధాలు జారవిడిచారు.

పేతుః క్షితౌ గజరథాశ్వగతా విమూఢా యాత్రాచ్ఛలేన హరయేऽర్పయతీం స్వశోభామ్
సైవం శనైశ్చలయతీ చలపద్మకోశౌ ప్రాప్తిం తదా భగవతః ప్రసమీక్షమాణా

ఏనుగు మీద ఉన్నవారు రథం మీద ఉన్నవారు పదాతులూ గుర్రం మీద ఉన్నవారు భూమి మీద పడి మూర్చపోయారు. రుక్మిణీ దేవి తన ప్రియునికి తన సౌందర్య విలాసాలను యాత్ర నెపం మీద కానుకగా అర్పించింది. స్వామికి తన సౌందర్యాన్ని ఆరగింపుగా పెట్టింది. (ఆగమ శాస్త్రం ప్రకారం పెరుమాళ్ళకు ఆరగింపు చేస్తుంటే కళ్ళు మూసుకోవాలి అందరూ. కృష్ణ పరమాత్మకు తన సౌందర్య వయో విలాసాలను ఆరగింపు పెడితే అందరూ కనులు మూసుకుని మూర్చపోయారు)
ఆమె దేవాలయం నుంచి వెనకకు వెళ్ళేప్పుడు కృష్ణ పరమాత్మ రాకను ఎదురు చూస్తూ మెల్లగా నడుస్తోంది.

ఉత్సార్య వామకరజైరలకానపఙ్గైః ప్రాప్తాన్హ్రియైక్షత నృపాన్దదృశేऽచ్యుతం చ
తాం రాజకన్యాం రథమారురక్షతీం జహార కృష్ణో ద్విషతాం సమీక్షతామ్

అలా నడుస్తూ నడుస్తూ ఎడమ చేతి గోల్లతో తన కేశములను వెనక్కు జరిపి క్రీగంటి చూపుతో ఎవరెవరు వచ్చారో చూసింది. అలా చూస్తూ స్వామిని కూడా వచ్చినట్లుగ గుర్తించింది. రథం ఎక్కే లోపు స్వామి రావాలి. స్వామిని చూచాక రథం ఎక్కబోయింది

రథం సమారోప్య సుపర్ణలక్షణం రాజన్యచక్రం పరిభూయ మాధవః
తతో యయౌ రామపురోగమః శనైః శృగాలమధ్యాదివ భాగహృద్ధరిః

శత్రువులు అందరూ చూస్తుండగా స్వామి వచ్చి ఆమెను హరించాడు. గరుడ ద్వజ రథాన్ని ఎక్కించాడు. రాజులందరినీ ధిక్కరించి తన రథం మీద ఎక్కించుకుని బయలుదేరాడు కృష్ణుడు.
నక్కల మధ్యనుంచి సింహం తన భాగాన్ని తీసుకు పోయినట్లుగా కృష్ణ పరమాత్మ రుక్మిణిని తీసుకు వెళ్ళాడు

తం మానినః స్వాభిభవం యశఃక్షయం
పరే జరాసన్ధముఖా న సేహిరే
అహో ధిగస్మాన్యశ ఆత్తధన్వనాం
గోపైర్హృతం కేశరిణాం మృగైరివ

అపుడు అర్థమైంది, స్వామి వచ్చి మమ్ము అవమానించి తీసుకు వెళుతున్నాడని. దీన్ని జరాసంధాదులు సహించలేకపోయారు. సింహముల కీర్తిని లేళ్ళు తీసేసినట్లుగా మేము ఆయుధాలు పట్టుకుని ఉంటే మా మధ్యనుంచి తీసుకు వెళతాడా. ఇది మాకు అవమానం అని భావించారు

                           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు