Pages

Thursday, 29 May 2014

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవై తొమ్మిదవ అధ్యాయం

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవై తొమ్మిదవ అధ్యాయం

శ్రీద్ధవ ఉవాచ
సుదుస్తరామిమాం మన్యే యోగచర్యామనాత్మనః
యథాఞ్జసా పుమాన్సిద్ధ్యేత్తన్మే బ్రూహ్యఞ్జసాచ్యుత

ఆత్మ వివేకం లేనివాడికి నీవు చెప్పిన యోగ చర్య అందనిది, చేయశక్యం కానిది.
ఇది అందరూ చేయలేరు. సులభముగా తరించే మార్గము చెప్పు.

ప్రాయశః పుణ్దరీకాక్ష యుఞ్యన్తో యోగినో మనః
విషీదన్త్యసమాధానాన్మనోనిగ్రహకర్శితాః

లోకములో యోగమును ఆచరించే యోగులు మనసును నిగ్రహించుకోలేక ఫలితాన్ని పొందక విషాదాన్నే పొందుతున్నారు

అథాత ఆనన్దదుఘం పదామ్బుజం హంసాః శ్రయేరన్నరవిన్దలోచన
సుఖం ను విశ్వేశ్వర యోగకర్మభిస్త్వన్మాయయామీ విహతా న మానినః

పరమ జ్ఞ్యానులు అన్ని ఆనందాదులనూ  కలిగించే నీ పాద పద్మాలను సేవిస్తారు
అలాంటి వారికి నీ పాదపద్మాలను ఆశ్రయించేవారికి ఏ సుఖానికీ భంగం లేదు
యోగముతో సుఖం కూర్చుకుందామంటే అభిమానులవుతారు తప్ప యోగాన్ని కూర్చుకోలేరు

కిం చిత్రమచ్యుత తవైతదశేషబన్ధో దాసేష్వనన్యశరణేసు యదాత్మసాత్త్వమ్
యోऽరోచయత్సహ మృగైః స్వయమీశ్వరాణాం శ్రీమత్కిరీటతటపీడితపాదపీఠః

అనన్యమైన భక్తి గల నీ దాసుల యందు 'నేనే వారు ' అన్నావు కదా.
మహాయోగేశ్వరుల యొక్క , దేవతల కిరీటముల చేత స్పృశించబడే పాద పీఠం గలవాడా,  నీ పాద పీఠం తప్ప ఈ యోగం మాకెందుకు.

తం త్వాఖిలాత్మదయితేశ్వరమాశ్రితానాం
సర్వార్థదం స్వకృతవిద్విసృజేత కో ను
కో వా భజేత్కిమపి విస్మృతయేऽను భూత్యై
కిం వా భవేన్న తవ పాదరజోజుషాం నః

ఆశ్రయించిన వారికి అన్నీ నీవే, అన్నీ ఇచ్చేవాడవు నీవే
ఇలాంటి నిన్ను ఎవరు విడిచిపెడతారు. చేయకున్నా చేస్తున్నా, పిలువకున్న పిలిచినా అన్నీ ఇస్తూ ఉంటావు.
ఏమి వస్తుందో ఏమి రాదో మాకెందుకు. నీ పాద పద్మ పరాగాన్ని సేవించేవారికి ఏమి వచ్చినా, ఏమీ రాకున్నా ఒకటే

నైవోపయన్త్యపచితిం కవయస్తవేశ
బ్రహ్మాయుషాపి కృతమృద్ధముదః స్మరన్తః
యోऽన్తర్బహిస్తనుభృతామశుభం విధున్వన్న్
ఆచార్యచైత్త్యవపుషా స్వగతిం వ్యనక్తి

ఎంత పండితుడైనా నీవు చేసిన మేలుకు ప్రతిమేలు చేయగలడా
బ్రహ్మకల్ప కాలం ఉన్నా నీవు చేసిన ఉపకారాన్ని, నీవు చేసిన దాన్ని, నీవు పెంచిన దాన్నీ, స్మరిస్తూ ఉంటారు.
అంతర్యామిగా ఉండి దేహధారుల యొక్క లోపలా వెలుపలా ఉన్న అశుభాన్ని తొలగిస్తూ ఆచార్య రూపముతో అర్చారూపముగా ఉండి మాకు మా గతిని ప్రసాదిస్తున్నావు

శ్రీశుక ఉవాచ
ఇత్యుద్ధవేనాత్యనురక్తచేతసా పృష్టో జగత్క్రీడనకః స్వశక్తిభిః
గృహీతమూర్తిత్రయ ఈశ్వరేశ్వరో జగాద సప్రేమమనోహరస్మితః

భక్తి నిండిన ఉద్ధవుడు ఈ విధముగా అడిగితే, ప్రేమ మనోహరములతో ఇలా అంటున్నాడు

శ్రీభగవానువాచ
హన్త తే కథయిష్యామి మమ ధర్మాన్సుమఙ్గలాన్
యాన్శ్రద్ధయాచరన్మర్త్యో మృత్యుం జయతి దుర్జయమ్

నీకు నా ధర్మాలన్నీ చెబుతాను. శ్రద్ధగా దీన్ని ఆచరిస్తే మానవుడు సంసారాన్ని జయిస్తాడు

కుర్యాత్సర్వాణి కర్మాణి మదర్థం శనకైః స్మరన్
మయ్యర్పితమనశ్చిత్తో మద్ధర్మాత్మమనోరతిః

అన్ని కర్మలనూ నన్ను తలచుకుంటూ నా కోసమే ఆచరించాలి. మనసునూ చిత్తమునూ నా యందే అర్పించి చేయాలి. నా ధర్మముల యందే మనసుకు ప్రీతి కలిగించుకుని ఉండాలి

దేశాన్పుణ్యానాశ్రయేత మద్భక్తైః సాధుభిః శ్రితాన్
దేవాసురమనుష్యేషు మద్భక్తాచరితాని చ

పుణ్య తీర్థములను సేవించాలి. నా భక్తులు నివసించే సాధువులు నివసించే పుణ్య తీర్థాలను ఆశ్రయించండి. దేవతలలో రాక్షసులలో మనుష్యులలో నా భక్తులు చేసినవాటిని స్మరించండి

పృథక్సత్రేణ వా మహ్యం పర్వయాత్రామహోత్సవాన్
కారయేద్గీతనృత్యాద్యైర్మహారాజవిభూతిభిః

విడిగా కానీ కలసి గానీ పండుగలనూ యాత్రలనూ ఉత్సవాలను చేయించాలి.
శక్తి ఉంటే మహా రాజ భోగములతో జరుపాలి

మామేవ సర్వభూతేషు బహిరన్తరపావృతమ్
ఈక్షేతాత్మని చాత్మానం యథా ఖమమలాశయః

లోపలా వెలుపలా ఉన్న నన్ను చూడాలి
పరిశుద్ధమైన మనసు ఉన్నవాడు ఆకాశాన్ని చూడగలిగినట్లుగా నాలో పరమాత్మను చూడాలి

ఇతి సర్వాణి భూతాని మద్భావేన మహాద్యుతే
సభాజయన్మన్యమానో జ్ఞానం కేవలమాశ్రితః

సకల ప్రాణులనూ నాభావనతోనే చూడాలీ గౌరవించాలి తలచాలి
తక్కినవాటి జోలికి వెళ్ళకుండా జ్ఞ్యానాన్ని మాత్రమే ఆశ్రయించి

బ్రాహ్మణే పుక్కసే స్తేనే బ్రహ్మణ్యేऽర్కే స్ఫులిఙ్గకే
అక్రూరే క్రూరకే చైవ సమదృక్పణ్డితో మతః

అన్నిటి యందూ అంతర్యామిగా ఉన్న పరమాత్మను చూడాలి. వాడే పండితుడు.

నరేష్వభీక్ష్ణం మద్భావం పుంసో భావయతోऽచిరాత్
స్పర్ధాసూయాతిరస్కారాః సాహఙ్కారా వియన్తి హి

తోటి మానవులలో నా స్వరూపాన్ని మాటి మాటికీ స్మరించి భావించేవాడికి త్వరలోనే స్పర్థా అసూయా తిరస్కార అహంకారాలన్ని తొలగిపోతాయి

విసృజ్య స్మయమానాన్స్వాన్దృశం వ్రీడాం చ దైహికీమ్
ప్రణమేద్దణ్డవద్భూమావాశ్వచాణ్డాలగోఖరమ్

(సిగ్గూ బిడియం) అలాంటి వాటిని విడిచిపెట్టి, నాకు దండ ప్రణామం చేయాలి.

యావత్సర్వేషు భూతేషు మద్భావో నోపజాయతే
తావదేవముపాసీత వాఙ్మనఃకాయవృత్తిభిః

సకల ప్రాణులలో నా భావం కలుగనంతవరకూ అప్పటిదాకా వాక్కుతో మనసుతో శరీరముతో ఇలా ఉపాసించాలి.

సర్వం బ్రహ్మాత్మకం తస్య విద్యయాత్మమనీషయా
పరిపశ్యన్నుపరమేత్సర్వతో ముతసంశయః

విద్యతో ఆత్మ జ్ఞ్యానముతో జగత్తంతా పరమాత్మే  ఉంటాడు అని చూస్తూ
అన్ని విషయాలలో సందేహం తొలగి అతను విరమించాలి

అయం హి సర్వకల్పానాం సధ్రీచీనో మతో మమ
మద్భావః సర్వభూతేషు మనోవాక్కాయవృత్తిభిః

ఇదే సులభ మార్గము.అందరిలో నన్ను చూడు. జగత్తంతా నా స్వరూపముగా భావించు
అన్ని మార్గాల కంటే ఉత్తమ మార్గం అని నా ఉద్దేశ్యం. త్రికరణములతో సకల ప్రాణుల యందూ నా భావం కలిగి ఉండుటే ఉత్తమము.

న హ్యఙ్గోపక్రమే ధ్వంసో మద్ధర్మస్యోద్ధవాణ్వపి
మయా వ్యవసితః సమ్యఙ్నిర్గుణత్వాదనాశిషః

ప్రారంభించినంత మాత్రాన ఎటువంటి ధ్వంసమూ హానీ,ఏ కొంచెం కూడా ఉండదు
నా గురించి చేస్తున్నావు, నేను నిర్గుణున్ని, ఏ కోరికా లేనివాన్ని, నన్ను పూజించేవారిని కూడా అలాగే తయారు చేస్తాను

యో యో మయి పరే ధర్మః కల్ప్యతే నిష్ఫలాయ చేత్
తదాయాసో నిరర్థః స్యాద్భయాదేరివ సత్తమ

నా యందు ఏ ఏ భావాలను కల్పిస్తాడో, అలా కల్పించిన భావం అతనికి భక్తినో విరక్తినో కల్పించకుంటే అటువంటి ఆయాసం నిరర్థకం. భయముతో ఆచరించిన పని ఫలించనట్లుగా ఇది కూడా నిష్పలం అవుతుంది

ఏషా బుద్ధిమతాం బుద్ధిర్మనీషా చ మనీషిణామ్
యత్సత్యమనృతేనేహ మర్త్యేనాప్నోతి మామృతమ్

బుద్ధిమంతులకు బుద్ధీ మనసు ఉన్నవారికి జ్ఞ్యానమూ ఇదే
మర్త్యుడు అనృతుడు, నేను సత్యం. అలాంటి నన్ను పొందుతాడు

ఏష తేऽభిహితః కృత్స్నో బ్రహ్మవాదస్య సఙ్గ్రహః
సమాసవ్యాసవిధినా దేవానామపి దుర్గమః

సంపూర్ణముగా నేను నీకు బ్రహ్మవాదాన్ని వివరించాను
ఇది దేవతలకు కూడా అర్థం కాదు. సంగ్రహముగా, విస్తారముగా కూడా చెప్పాను

అభీక్ష్ణశస్తే గదితం జ్ఞానం విస్పష్టయుక్తిమత్
ఏతద్విజ్ఞాయ ముచ్యేత పురుషో నష్టసంశయః

ఏమాత్రం సందేహం లేకుండా మాటి మాటికీ, ఎన్నో సార్లు స్పష్టముగా, యుక్తి కలిగినవాటిగా చెప్పాను.
ఈ జ్ఞ్యానాన్ని తెలుసుకున్నవాడు సంశయాలు తొలగి ముక్తిని పొందుతాడు

సువివిక్తం తవ ప్రశ్నం మయైతదపి ధారయేత్
సనాతనం బ్రహ్మగుహ్యం పరం బ్రహ్మాధిగచ్ఛతి

నీవు బాగా అడిగావు.అందుకు తగ్గట్టుగానే చెప్పాను.
నేను చెప్పినది నీవు ధరించాలి. ఇది ధరించినవాడు పరమాత్మను చేరతాడు

య ఏతన్మమ భక్తేషు సమ్ప్రదద్యాత్సుపుష్కలమ్
తస్యాహం బ్రహ్మదాయస్య దదామ్యాత్మానమాత్మనా

ఇంతటి విజ్ఞ్యానాన్నీ జ్ఞ్యానాన్ని తత్వాన్నీ, పుష్కలముగా నా భక్తులకు ఉపదేశించేవాడు
వినే వారికి బ్రహ్మనే దానం చేస్తున్నవాడవుతాడు. అటువంటి వాడికి నన్ను నేనే ఇచ్చుకుంటాను

య ఏతత్సమధీయీత పవిత్రం పరమం శుచి
స పూయేతాహరహర్మాం జ్ఞానదీపేన దర్శయన్

పరమూ, పవిత్రమూ పావనం ఐన దీన్ని అధ్యయనం చేస్తే
జ్ఞ్యానదీపముతో మాటి మాటికీ నన్ను చూచేవాడు పరిశుద్ధుడవుతాడు

య ఏతచ్ఛ్రద్ధయా నిత్యమవ్యగ్రః శృణుయాన్నరః
మయి భక్తిం పరాం కుర్వన్కర్మభిర్న స బధ్యతే

ఎవడు దీన్ని శ్రద్ధగా సావధానముగా వింటాడో నాయందు భక్తి కలిగి మళ్ళీ కర్మలలో చిక్కుకోడు

అప్యుద్ధవ త్వయా బ్రహ్మ సఖే సమవధారితమ్
అపి తే విగతో మోహః శోకశ్చాసౌ మనోభవః

చెప్పినదంతా విన్నావు కదా, ఇపుడు బ్రహ్మ అంటే తెలిసిందా
శోకమూ మోహమూ దుఃఖమూ పోయిందా

నైతత్త్వయా దామ్భికాయ నాస్తికాయ శఠాయ చ
అశుశ్రూషోరభక్తాయ దుర్వినీతాయ దీయతామ్

దీన్ని నీవు నాస్తికునీ దాంభికునీ మోసగాడికీ
గురు సేవ చేయని వాడికీ భక్తి లేనివాడికీ దుర్వినీతునికీ ఇవ్వరాదు

ఏతైర్దోషైర్విహీనాయ బ్రహ్మణ్యాయ ప్రియాయ చ
సాధవే శుచయే బ్రూయాద్భక్తిః స్యాచ్ఛూద్రయోషితామ్

ఈ పైలోపాలు లేనివాడికీ బ్రాహ్మణునికీ భక్తునికీ పవిత్రమైన వాడికి ఇవ్వాలి
భక్తి ఉంటే శూద్రునికి కూడా ఇవ్వాలి

నైతద్విజ్ఞాయ జిజ్ఞాసోర్జ్ఞాతవ్యమవశిష్యతే
పీత్వా పీయూషమమృతం పాతవ్యం నావశిష్యతే

ఇది తెలుసుకున్న తరువాత తెలియగోరేవాడికీ ఇంకా తెలియవలసినది అంటూ ఏదీ మిగులదు

జ్ఞానే కర్మణి యోగే చ వార్తాయాం దణ్డధారణే
యావానర్థో నృణాం తాత తావాంస్తేऽహం చతుర్విధః

జ్ఞ్యానమూ కర్మా యోగమూ జీవనమూ దండ ధారణం అన్నీ నేనే
సామ దాన భేధ దండాలూ నేనే

మర్త్యో యదా త్యక్తసమస్తకర్మా నివేదితాత్మా విచికీర్షితో మే
తదామృతత్వం ప్రతిపద్యమానో మయాత్మభూయాయ చ కల్పతే వై

అన్ని కర్మలనూ వదలిపెట్టి తనను నాకు అర్పించి నా గురించి సేవ చేయాలి అనుకుంటే వాడూ అమృతుడవుతాడు. అలాంటివాడికి నేనే ఆత్మ స్వరూపాన్నీ, జ్ఞ్యానాన్నీ కలిగిస్తాను.

శ్రీశుక ఉవాచ
స ఏవమాదర్శితయోగమార్గస్తదోత్తమఃశ్లోకవచో నిశమ్య
బద్ధాఞ్జలిః ప్రీత్యుపరుద్ధకణ్ఠో న కిఞ్చిదూచేऽశ్రుపరిప్లుతాక్షః

ఈ రీతిలో చక్కగా చూపిన యోగమార్గాన్ని ఉద్ధవునికి వినిపించాక, ఉద్ధవుడు చేతులు జోడించి, ప్రీతితో గొంతు పూరుకుపోయి, కళ్ళ నిండా నీరు నిండగా

విష్టభ్య చిత్తం ప్రణయావఘూర్ణం ధైర్యేణ రాజన్బహుమన్యమానః
కృతాఞ్జలిః ప్రాహ యదుప్రవీరం శీర్ష్ణా స్పృశంస్తచ్చరణారవిన్దమ్

ప్రణయ్ముతో ఉన్న చిత్తాన్ని గట్టిగా పట్టుకుని, కృష్ణ పరమాత్మ పాద పద్మాలను శిరసా స్పృశిస్తూ

శ్రీద్ధవ ఉవాచ
విద్రావితో మోహమహాన్ధకారో య ఆశ్రితో మే తవ సన్నిధానాత్
విభావసోః కిం ను సమీపగస్య శీతం తమో భీః ప్రభవన్త్యజాద్య

ఇంతటి మోహం అనే మహా అంధకారాన్ని పారద్రోలావు నీ సన్నిధానముతో
సూర్యభగవానుని వద్ద ఉన్నవారికీ చీకటీ చలీ భయం లేనట్లుగా నీ దగ్గర ఉన్నవాడికి మోహం ఎక్కడిది

ప్రత్యర్పితో మే భవతానుకమ్పినా భృత్యాయ విజ్ఞానమయః ప్రదీపః
హిత్వా కృతజ్ఞస్తవ పాదమూలం కోऽన్యం సమీయాచ్ఛరణం త్వదీయమ్

దయతో నీవు ఈ భృత్యునికి విజ్ఞ్యాన దీపాన్ని అందించావు
ఇంత విన్న తరువాత నీ పాద మూలాన్ని విడిచిపెట్టి బుద్ధి ఉన్నవాడు మరి దేన్ని ఆరాధిస్తాడు

వృక్ణశ్చ మే సుదృఢః స్నేహపాశో దాశార్హవృష్ణ్యన్ధకసాత్వతేషు
ప్రసారితః సృష్టివివృద్ధయే త్వయా స్వమాయయా హ్యాత్మసుబోధహేతినా

నా స్నేహ పాశాన్ని నీవు చేదించావు. ఆత్మ జ్ఞ్యానం కోసం నీవు చక్కని జ్ఞ్యాన ప్రదీప్తాన్నీ తత్వాన్నీ అందించావు

నమోऽస్తు తే మహాయోగిన్ప్రపన్నమనుశాధి మామ్
యథా త్వచ్చరణామ్భోజే రతిః స్యాదనపాయినీ

మహా యోగీ, నేను నిన్నే ఆశ్రయించాను. నన్ను రక్షించు, శాసించు
నీ పాద పద్మముల మీద ఉన్న భక్తి నిరంతరం ఇలాగే ఉండాలి, ఎపుడూ తొలగిపోకూడదు

శ్రీభగవానువాచ
గచ్ఛోద్ధవ మయాదిష్టో బదర్యాఖ్యం మమాశ్రమమ్
తత్ర మత్పాదతీర్థోదే స్నానోపస్పర్శనైః శుచిః

నేను ఆజ్ఞ్యాపిస్తున్నాను, నా ఆశ్రమమైన బదరిక ఆశ్రమానికి వెళ్ళు.
అక్కడ స్నానం చేసి నా పాద తీర్థం సేవించి

ఈక్షయాలకనన్దాయా విధూతాశేషకల్మషః
వసానో వల్కలాన్యఙ్గ వన్యభుక్సుఖనిఃస్పృహః

అలకనందా దర్శనముతో అన్నీ పాపాలూ తొలగిపోయి
నార వస్త్రాలు కట్టుకుని పళ్ళు  తింటూ సుఖం యందు ఆశ లేకుండా

తితిక్షుర్ద్వన్ద్వమాత్రాణాం సుశీలః సంయతేన్ద్రియః
శాన్తః సమాహితధియా జ్ఞానవిజ్ఞానసంయుతః

ఓర్పుతో చలీ వేడీ లాంటి ద్వంద్వాలను సహిస్తూ ఇంద్రియ నిగ్రహముతో సచ్చీలముతో

మత్తోऽనుశిక్షితం యత్తే వివిక్తమనుభావయన్
మయ్యావేశితవాక్చిత్తో మద్ధర్మనిరతో భవ
అతివ్రజ్య గతీస్తిస్రో మామేష్యసి తతః పరమ్

నేను నీకు ఏమి చెప్పానో దాన్ని ఏకాంతములో ధ్యానం చేస్తూ
వాక్కునూ మనసునూ నాయందే ఉంచి నా ధర్మం యందే ఆసక్తుడవు కా.
అన్ని లోకాలనూ దాటి తరువాత నన్ను చేరుతావు

శ్రీశుక ఉవాచ
స ఏవముక్తో హరిమేధసోద్ధవః ప్రదక్షిణం తం పరిసృత్య పాదయోః
శిరో నిధాయాశ్రుకలాభిరార్ద్రధీర్న్యషిఞ్చదద్వన్ద్వపరోऽప్యపక్రమే

పరమాత్మ ఇలా చెబితే అటువంటి స్వామికి ప్రదక్షిణం చేసి, శిరస్సును పాదముల యందు ఉంచి,
కళ్ళనిండా నీళ్ళతో మొత్తం తడిసిన బుద్ధి కలవాడై, స్నేహమూ మోహమూ లాంటివి విడిచిపెట్టినా స్వామి పాదాలను కన్నీటితో కడిగాడు

సుదుస్త్యజస్నేహవియోగకాతరో న శక్నువంస్తం పరిహాతుమాతురః
కృచ్ఛ్రం యయౌ మూర్ధని భర్తృపాదుకే బిభ్రన్నమస్కృత్య యయౌ పునః పునః

సకల లోకాధీశుడైన స్వామి వియోగాన్ని తట్టుకోలేక, వదలలేక, మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తూ విడువలేక విడువలేక అక్కడ నుంచి వెళ్ళిపోయాడు

తతస్తమన్తర్హృది సన్నివేశ్య గతో మహాభాగవతో విశాలామ్
యథోపదిష్టాం జగదేకబన్ధునా తపః సమాస్థాయ హరేరగాద్గతిమ్

ఎదురుగా ఉన్న పరమాత్మను హృదయములో ఉంచి బదరీ (విశాల) వెళ్ళాడు
స్వామి చెప్పినట్లుగా పరమాత్మను ధ్యానం చేస్తూ హరి యొక్క గతిని పొందాడు

య ఏతదానన్దసముద్రసమ్భృతం జ్ఞానామృతం భాగవతాయ భాషితమ్
కృష్ణేన యోగేశ్వరసేవితాఙ్ఘ్రిణా సచ్ఛ్రద్ధయాసేవ్య జగద్విముచ్యతే

కృష్ణ ఉద్ధవ సంవాదం ఒక ఆనందం అనే మహా సముద్రం నుండి ఉప్పొంగి వచ్చింది.
ఇది పరమభాగవతునికి యోగీశ్వరులచే సేవించబడే పాదపద్మములు కల కృష్ణ పరమాత్మ చేత చెప్పబడింది
ఇలాంటి అమృతాన్ని శ్రద్ధగా సేవించి ప్రకృతినుండి విడివడ్డాడు ఉద్ధవుడు

భవభయమపహన్తుం జ్ఞానవిజ్ఞానసారం
నిగమకృదుపజహ్రే భృఙ్గవద్వేదసారమ్
అమృతముదధితశ్చాపాయయద్భృత్యవర్గాన్
పురుషమృషభమాద్యం కృష్ణసంజ్ఞం నతోऽస్మి

సంసార భయం తొలగించడానికి జ్ఞ్యాన విజ్ఞ్యాన సారమైన దీన్ని,
తుమ్మెద పద్మ సారాన్ని అందించినట్లు పరమాత్మ సకల వేద సారాన్ని అందించాడు
ఆనాడు మోహిని అమృతాన్ని దేవతలకు మాత్రమే తాపించినట్లుగా ఈనాడు ఈ పరమాత్మ భక్తులకు మాత్రమే ఈ జ్ఞ్యానామృతాన్ని తాపించాడు
ఇలా తాపించిన ఆది పురుషుడికీ, కృష్ణ భగవానునికి నమస్కారం చేస్తున్నాను.

                                                        సర్వం శ్రీకృష్ణార్పణమస్తు