Pages

Thursday, 29 May 2014

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పధ్నాలుగవ అధ్యాయం

       ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పధ్నాలుగవ అధ్యాయం

శ్రీఉద్ధవ ఉవాచ
వదన్తి కృష్ణ శ్రేయాంసి బహూని బ్రహ్మవాదినః
తేషాం వికల్పప్రాధాన్యముతాహో ఏకముఖ్యతా

జీవుడు లోకములో పొందవలసిన ఉత్తమ గతులు చాలా ఉన్నాయి (సారూప్యం సాయుజ్యం...). ఇవన్నీ దేనికై వేరా, ఒకే దాని యొక్క రూపాంతరాలా, అన్నీ ఒకటేనా

భవతోదాహృతః స్వామిన్భక్తియోగోऽనపేక్షితః
నిరస్య సర్వతః సఙ్గం యేన త్వయ్యావిశేన్మనః

కర్మ జ్ఞ్యాన భక్తి ప్రపతీ అవతార జ్ఞ్యాన మొదలైన వన్నీ మోక్షాన్నిస్తాయని అన్నారు. ఇవన్నీ కలిపి ఇస్తాయా? దేనికవి వేరు వేరుగా ఇస్తాయా. వీటన్నిటి స్వరూపం ఒకటేనా,గుణం ఒకటేనా?
సంగ రహితమైన భక్తి యోగం, అన్ని సంగాలూ తొలగించి నీ యందు మనసు నిలుపుతుంది అని చెప్పారు. మరి జ్ఞ్యాన కర్మ యోగాలు నిలుపవా?

శ్రీభగవానువాచ
కాలేన నష్టా ప్రలయే వాణీయం వేదసంజ్ఞితా
మయాదౌ బ్రహ్మణే ప్రోక్తా ధర్మో యస్యాం మదాత్మకః

నన్ను చేరడానికి కావలసిన ధర్మ సాధనముగా ఉన్న ఈ విధానాన్నే వేదం అని అన్నారు. ఇది ప్రళయకాలములో అస్తమించింది. నేను సృష్టి కాలములో బ్రహ్మకు ఉపదేశించాను. నా స్వరూపాన్ని బోధించే ధర్మం ఇందులో చెప్పబడి ఉంది

తేన ప్రోక్తా స్వపుత్రాయ మనవే పూర్వజాయ సా
తతో భృగ్వాదయోऽగృహ్ణన్సప్త బ్రహ్మమహర్షయః

నా వలన విన్న బ్రహ్మ మనువుకు చెప్పాడు. మనువు దీన్ని ఇక్ష్వాకుకు చెప్పగా, వారినుండి మరీచి అత్రి బృగువాదులు, వారి నుండి వారి పుత్రులూ. అలా మానవులూ రాక్షసులూ యక్షులూ కింపురుషులూ గంధర్వులూ సిద్ధులూ విద్యాధరులూ కిన్నెరులూ నాగులూ, ఎందరో సత్వ రజస్తమో గుణములు కలిగి ఉన్నవారు స్వీకరించారు

తేభ్యః పితృభ్యస్తత్పుత్రా దేవదానవగుహ్యకాః
మనుష్యాః సిద్ధగన్ధర్వాః సవిద్యాధరచారణాః

కిన్దేవాః కిన్నరా నాగా రక్షఃకిమ్పురుషాదయః
బహ్వ్యస్తేషాం ప్రకృతయో రజఃసత్త్వతమోభువః

యాభిర్భూతాని భిద్యన్తే భూతానాం పతయస్తథా
యథాప్రకృతి సర్వేషాం చిత్రా వాచః స్రవన్తి హి

ఇలా ఇంత మంది తీసుకున్న ఈ విద్యతో భూతములలో భేధం వచ్చింది, వారి బుద్ధులు కూడా భిన్నమయ్యాయి. రకరకాలుగా దన్ని విన్నవారు, వారు అర్థం చేసుకున్న దాన్ని వినే వారికి బోధించారు. ఇలా అది అంతా మారింది.

ఏవం ప్రకృతివైచిత్ర్యాద్భిద్యన్తే మతయో నృణామ్
పారమ్పర్యేణ కేషాఞ్చిత్పాషణ్డమతయోऽపరే

కొందరు పాఖండ మతస్తులయ్యారు. అదంతా నా మాయ. వారి బుద్ధి మోహించబడింది

మన్మాయామోహితధియః పురుషాః పురుషర్షభ
శ్రేయో వదన్త్యనేకాన్తం యథాకర్మ యథారుచి

శ్రేయస్సును, వారి వారి అభిరుచిని బట్టి మార్చి చెప్పారు. వారి వారి కర్మను బట్టి, వారి స్వభావన్ని బట్టి మార్చ్ చెప్పారు

ధర్మమేకే యశశ్చాన్యే కామం సత్యం దమం శమమ్
అన్యే వదన్తి స్వార్థం వా ఐశ్వర్యం త్యాగభోజనమ్
కేచిద్యజ్ఞం తపో దానం వ్రతాని నియమాన్యమాన్

కొందరు ధర్మాన్ని కొందరు కామాన్ని కొందరు కీర్తిని కొందరు సత్యాన్ని కొందరు దమాన్ని కొందరు శమాన్నీ, కొందరు స్వార్థమే శ్రేయస్సన్ని, కొందరు ఐశ్వర్యం శ్రేయస్సనీ
యజ్ఞ్యమూ తపమూ దానమూ నియమమూ యమమూ ఇలాంటీ వాటిని శ్రేయస్సంటారు

ఆద్యన్తవన్త ఏవైషాం లోకాః కర్మవినిర్మితాః
దుఃఖోదర్కాస్తమోనిష్ఠాః క్షుద్రా మన్దాః శుచార్పితాః

అన్ని లోకాలూ మనం ఆచరించే కర్మ వలన ఏర్పడేవే. ఈ లోకాలన్నీ దుఃఖమునకు ఫలించేవి, తమస్సులో ఉండేవి. ఉండే స్వల్పమైన ఆనందం కూడా దుఃఖములోనే ఉంటుంది

మయ్యర్పితాత్మనః సభ్య నిరపేక్షస్య సర్వతః
మయాత్మనా సుఖం యత్తత్కుతః స్యాద్విషయాత్మనామ్

నా యందే మనసు ఉంచిన వారికి అంతటా నేనే కనపడుతూ ఉంటాను కాబట్టి వారికి మాయ కలుగదు. విషయములయందే మనసు ఉంచిన వారికి నా మీద భక్తి ఎలా కలుగుతుంది. నా మీద భక్తి ఉన్నవారు పొందే ఆనందం వారు ఎలా పొందుతారు

అకిఞ్చనస్య దాన్తస్య శాన్తస్య సమచేతసః
మయా సన్తుష్టమనసః సర్వాః సుఖమయా దిశః

ఏమీ లేనివారూ, ఏమీ కావాలి అని కోరుకోనివారు, ఇంద్రియ నిగ్రహం కలవారూ, శాంతులూ, దేని యందూ ఆశ లేనివారు, సర్వత్రా సమబుద్ధి కలవారికి అంతా సుఖమే. అన్ని వైపులా ఆనందమే.

న పారమేష్ఠ్యం న మహేన్ద్రధిష్ణ్యం
న సార్వభౌమం న రసాధిపత్యమ్
న యోగసిద్ధీరపునర్భవం వా
మయ్యర్పితాత్మేచ్ఛతి మద్వినాన్యత్

ఎందుకంటే నేను తప్ప వారు దేన్నీ కోరరు. బ్రహ్మ లోకం, మహేంద్ర పదవీ చక్రవర్తిత్వం రసాతలాధిపత్యమూ, యోగమూ సిద్ధీ మోక్షమూ మరి దేన్నీ కోరరు

న తథా మే ప్రియతమ ఆత్మయోనిర్న శఙ్కరః
న చ సఙ్కర్షణో న శ్రీర్నైవాత్మా చ యథా భవాన్

నన్ను తప్ప మరి దేన్నీ వారు కోరరు. అలాంటి వారి కన్నా బ్రహ్మా సంకర్షణుడూ శివుడూ అమ్మవారూ నాకు అంత ప్రీతి పాత్రులు కారు.నన్ను మాత్రమే కోరిన వారు నాకెంత ప్రియులో,నాకు నేను కూడా నాకు అంత ప్రీతి పాత్రున్ని కాను

నిరపేక్షం మునిం శాన్తం నిర్వైరం సమదర్శనమ్
అనువ్రజామ్యహం నిత్యం పూయేయేత్యఙ్ఘ్రిరేణుభిః

ఏమీ కోరని వాడు  , మౌని , పరమశాంతుడు, ఎవరినీ ద్వేషించని వాడు, అందరిలో సమానముగా నన్ను చూసేవాడి పాద పరాగమముతో నేనే పావనమవుతా అన్న భావనతో అటువంటి వారిని నేను అనుసరిస్తూ ఉంటాను

నిష్కిఞ్చనా మయ్యనురక్తచేతసః శాన్తా మహాన్తోऽఖిలజీవవత్సలాః
కామైరనాలబ్ధధియో జుషన్తి తే యన్నైరపేక్ష్యం న విదుః సుఖం మమ

ఏదీ లేని వారు, దేని యందూ ఆశలేని వారు గుణ రహితులూ, నాయందు మాత్రమే ప్రేమ ఉన్నవారు, శాంతులూ,అన్ని ప్రాణుల యందూ వాత్సల్యం కలవారు, కోరికలతో కప్పిపుచ్చని మనసు గలవారు, అలాంటి వారు దేనినీ కోరనందువలన ఉండే సుఖం వారికి మాత్రమే తెలుసు.

బాధ్యమానోऽపి మద్భక్తో విషయైరజితేన్ద్రియః
ప్రాయః ప్రగల్భయా భక్త్యా విషయైర్నాభిభూయతే

నిరపేక్షులు పొందే ఆనందం మిగతావారికి అర్థమే కాదు.ఇంద్రియ నిగ్రహం లేకున్నా, ఇంద్రియములు బాధిస్తూ ఉన్నా, విషయాలలో ప్రవర్తిస్తూ ఉన్నా నా భక్తుడైతే అలాంటివాడిని విషయములు పూర్తిగా ఆక్రమించలేవు. సాంసారిక విషయ భోగాల యందు ప్రవర్తించాలని కోరిక ఉన్నా, వారు ఆ ప్రవృత్తే పరమార్థముగా భావించడు. పరమాత్మే నా చేత ఇలా ప్రవర్తింపచేస్తున్నాడు అని తెలుసుకుంటాడు. భగవంతుని యందు భారమూ నమ్మకం ఉన్నవారికి ఆశలూ అభిలాషలూ ఉన్నా, ఆశలు తీరకపోతే పెద్దగా బాధపడడు, తీరితే సంతోషించడు

యథాగ్నిః సుసమృద్ధార్చిః కరోత్యేధాంసి భస్మసాత్
తథా మద్విషయా భక్తిరుద్ధవైనాంసి కృత్స్నశః

బాగా ప్రజ్వరిల్లిన అగ్ని సమిధలను దగ్ధం చేసినట్లుగా, నా యందు ఉన్న భక్తి అతని పాపములను సంగ్రముగా భస్మం చేస్తుంది

న సాధయతి మాం యోగో న సాఙ్ఖ్యం ధర్మ ఉద్ధవ
న స్వాధ్యాయస్తపస్త్యాగో యథా భక్తిర్మమోర్జితా

స్వాధ్యాయమూ తపస్సూ యోగమూ సాంఖ్యమూ త్యాగమూ, ఇవేవీ భక్తి నన్ను చేర్చినట్లుగా చేర్చలేవు. నేను కేవలం భక్తితో  గ్రహించబడతాను.

భక్త్యాహమేకయా గ్రాహ్యః శ్రద్ధయాత్మా ప్రియః సతామ్
భక్తిః పునాతి మన్నిష్ఠా శ్వపాకానపి సమ్భవాత్

నేను సజ్జనులకు ప్రీతి పాత్రుడిని. నా యందు ఉండే భక్తి వాడిని పాపం చేస్తుంది. చండాలురను కూడా నా యందు ఉందే భక్తి పావనం చేస్తుంది.

ధర్మః సత్యదయోపేతో విద్యా వా తపసాన్వితా
మద్భక్త్యాపేతమాత్మానం న సమ్యక్ప్రపునాతి హి

సత్యం దయ, దానితో కూడి ఉన్న ధర్మం గానీ, తపస్సుతో కూడిన విద్య గానీ, నా భక్తి లేని వాడిని అంత బాగా పవిత్రం చేయజాలదు.

కథం వినా రోమహర్షం ద్రవతా చేతసా వినా
వినానన్దాశ్రుకలయా శుధ్యేద్భక్త్యా వినాశయః

భక్తి లేని మనసు ఎండిపోతుంది. అందులో ఆర్థ్రత ఉండదు.నా కథలూ గుణలూ వింటూ ఉంటే నా నామాలు కీర్తిస్తూ ఉంటే నా భజన చేస్తుంటే శరీరం పులకించకుండా మనసు కరగకుండా కళ్ళకు ఆనందాశ్రువులు రాకుంటే పవిత్రత ఎలా కలుగుతుంది. భక్తి లేని మనసు ఎలా శుద్ధి పొందుతుంది

వాగ్గద్గదా ద్రవతే యస్య చిత్తం రుదత్యభీక్ష్ణం హసతి క్వచిచ్చ
విలజ్జ ఉద్గాయతి నృత్యతే చ మద్భక్తియుక్తో భువనం పునాతి

నా గుణాలనీ నా నామాలనూ నా కథలనూ స్మరిస్తూ ఉంటే ఆనందముతో వాక్కూ కంఠమూ బొంగురు కావాలి. మనసు ద్రవించాలి
ఆనందముతో నవ్వుతాడు, ఏడుస్తాడు, సిగ్గు విడిచి పెద్దగా గానం చేస్తాడు, నాట్యం చేస్తాడు

యథాగ్నినా హేమ మలం జహాతి ధ్మాతం పునః స్వం భజతే చ రూపమ్
ఆత్మా చ కర్మానుశయం విధూయ మద్భక్తియోగేన భజత్యథో మామ్

లోకాన్ని పావనం చేస్తాడు
నిప్పుతో బంగారం తన మురికిని వదులుకున్నట్లుగా, కరిగిస్తే అది తన వాస్తవ స్వరూపాన్ని పొందినట్లుగా ఆత్మ కూడా కర్మ వలన పొందిన సంస్కారాన్ని తొలగించి నా భక్తితో నన్ను పొందుతాడు

యథా యథాత్మా పరిమృజ్యతేऽసౌ మత్పుణ్యగాథాశ్రవణాభిధానైః
తథా తథా పశ్యతి వస్తు సూక్ష్మం చక్షుర్యథైవాఞ్జనసమ్ప్రయుక్తమ్

పవిత్రమైన నా గాధలనూ వినడమూ చెప్పడముచే పరిశుద్ధి చేయబడతాడు. వింటున్న కొద్దీ చెబుతున్న కొద్దీ ధ్యానం చేస్తున్న కొద్దీ క్రమ క్రమముగా కాటుక పెట్టిన కన్ను అతి సూక్ష్మమైన రూపాన్ని ఎలా చూడగలదో నా భక్తితో నా కథలను విన్న మనసు పరిశుద్ధమై అతి సూక్ష్మమైన నా రూపాన్ని చూడగలదు

విషయాన్ధ్యాయతశ్చిత్తం విషయేషు విషజ్జతే
మామనుస్మరతశ్చిత్తం మయ్యేవ ప్రవిలీయతే

ఊరికే ఎపుడూ విషయాలను ధ్యానం చేస్తూ ఉంటే అక్కడే ఉంటుంది. అదే నన్ను ధ్యానం చేస్తే నా యందే ఉంటుంది.

తస్మాదసదభిధ్యానం యథా స్వప్నమనోరథమ్
హిత్వా మయి సమాధత్స్వ మనో మద్భావభావితమ్

కాబట్టి, చెడును ధ్యానం చేయకూడదు. స్వప్నములో మనం పొందాలనుకునే మనోరథాలను కూడా ధ్యానం చేయరాదు. వాటిని విడిచిపెట్టి నిరంతరం నా భావముతో భావించబడి నన్నే ధ్యానిస్తున్న మనసును నా యందు లగ్నం చేస్తే, నిరంతరం నన్నే చూస్తూ ఉంటావు

స్త్రీణాం స్త్రీసఙ్గినాం సఙ్గం త్యక్త్వా దూరత ఆత్మవాన్
క్షేమే వివిక్త ఆసీనశ్చిన్తయేన్మామతన్ద్రితః

స్త్రీ స్వరూపాన్ని ధ్యానం చేసేవారు గానీ, స్త్రీ స్వరూపాన్ని ధ్యానించేవారితో కలసి ఉండేవారితో గానీ సంగాన్ని విడిచిపెట్టి మనో నిగ్రహం కలవాడై, ఏకాంతమైన ప్రదేశములో ఉండి, ఏమరపాటు లేకుండా నన్నే ఎపుడూ ధ్యానం చేస్తూ ఉండాలి

న తథాస్య భవేత్క్లేశో బన్ధశ్చాన్యప్రసఙ్గతః
యోషిత్సఙ్గాద్యథా పుంసో యథా తత్సఙ్గిసఙ్గతః

స్త్రీ సంగం వలన కానీ, స్త్రీ సంగాన్ని కోరేవారి సంగాన్ని కానీ కలసి ఉండడం మహాప్రమాదం. మొదట ఇలాంటి కామ అభిరతిని పూర్తిగా విడిచిపెట్టాలి.

శ్రీద్ధవ ఉవాచ
యథా త్వామరవిన్దాక్ష యాదృశం వా యదాత్మకమ్
ధ్యాయేన్ముముక్షురేతన్మే ధ్యానం త్వం వక్తుమర్హసి

మిమ్ములను ఎలా ధ్యానం చేయాలి. నిన్ను ఏ రూపములో ఉన్నవాడిగా ధ్యానం చేయాలి. నీ స్వరూపం ఏమిటి ఆకారం ఏమిటి

శ్రీభగవానువాచ
సమ ఆసన ఆసీనః సమకాయో యథాసుఖమ్
హస్తావుత్సఙ్గ ఆధాయ స్వనాసాగ్రకృతేక్షణః

మొదట ఆసనం ఎత్తు పల్లాలూ లేకుండా సమానముగా ఉండాలి. కూర్చునేవాడు కూడా సమకాయుడై నిటారుగా కూర్చోవాలి.చేతులు రెండూ తొడ మీద పెట్టుకుని, దృష్టి నాసికాగ్రమున ఉంచి ప్రాణాయామం చేయాలి

ప్రాణస్య శోధయేన్మార్గం పూరకుమ్భకరేచకైః
విపర్యయేణాపి శనైరభ్యసేన్నిర్జితేన్ద్రియః

గాలిని విడుచుటా, గాలిని స్వీకరించుట, స్వీకరించిన దాన్ని ఉంచుట (రేచక పూరక కుంభక). రేచకముతో మొదలుపెట్టి పూరకముతో ఆపవచ్చు, లేక్దా పూరకముతో మొదలుపెట్టి రేచకము వరకూ చేయాలి. మెల మెల్లగా చేయాలి.
ప్రాణాయామం వలన ఇంద్రియ జయం కలుగుతుంది. వాయువు ఏ ఏ భాగము నుండి ఎలా ఎలా ప్రవర్తిస్తోందో తెలుసుకోవాలి. మనసు వాయువు యందు లంగం చేసి, అలా రోజూ అలవాటు చేస్తే దేని యందు ఉంచాలకుంటామో దాని యందు మనసు ఉంచగల గుణం అబ్బుతుంది. ఇంద్రియ మనో నిగ్రహానికి ఇది మూలం

హృద్యవిచ్ఛినమోంకారం ఘణ్టానాదం బిసోర్ణవత్
ప్రాణేనోదీర్య తత్రాథ పునః సంవేశయేత్స్వరమ్

హృదయములో అవిచ్చినముగా జరిగే, ఘంటానాదములా వినపడే  ఓంకారాన్ని ప్రాణ వాయువుతో పట్టుకోవాలి. పూరక కుంభక రేచకములతో ఓం కారమును ధ్యానం చేయగలగాలి. ప్రాణాయామం వాయువు నుండి ఓంకారానికి మరల్చి, ఆ స్వరములో ఉంచి

ఏవం ప్రణవసంయుక్తం ప్రాణమేవ సమభ్యసేత్
దశకృత్వస్త్రిషవణం మాసాదర్వాగ్జితానిలః

ఓంకారముతో కూడుకునే దానిలా ప్రాణ వాయును అభ్యసించాలి. ఒక నెలలోపు రోజూ మూడు వేళలలో పూటకు పది సార్లుగా అభ్యాసం చేస్తే మనం అపుడు వాయువును జయించిన వారమవుతాము.

హృత్పుణ్డరీకమన్తఃస్థమూర్ధ్వనాలమధోముఖమ్
ధ్యాత్వోర్ధ్వముఖమున్నిద్రమష్టపత్రం సకర్ణికమ్

హృదయములో పుండరీకం యొక్క ఆకారములాగ ఒక పద్మం ఉంటుంది. ఈ హృదయ పద్మములో నాలం పైకి ఉంటుంది, దళములు కిందకు ఉంటాయి. ఇలా ఉన్న దానిని ఊర్ధ్వ ముఖముగా, వికసించి ఉన్నటువంటి, అష్టపత్రము ఉన్నదానిగా ధ్యానం చేసి

కర్ణికాయాం న్యసేత్సూర్య సోమాగ్నీనుత్తరోత్తరమ్
వహ్నిమధ్యే స్మరేద్రూపం మమైతద్ధ్యానమఙ్గలమ్

హృదయ మధ్య భాగములో సూర్య సోమ అగ్ని, ఇలా మొదట అగ్నినీ, సోముడినీ, సూర్యుడినీ స్థాపించి,అలా ఉంచిన అగ్ని మధ్యములో నన్ను ధ్యానించాలి.
ప్రాణాయామముతో ప్రాణాన్నీ, ఇంద్రియాన్ని వశం చేసుకుని, ఓంకార యుక్త ప్రాణాయామం చేసి, కిందకు దళములూ పైకి నాలమూ ఉన్న పద్మాన్ని పైకి దళములు ఉన్న దానిగా ధ్యానం చేసి, అందులో అగ్ని సోమ సూర్య ఆకారాలు ప్రతిష్ఠ చేసి, అందులో ఉన్న అగ్నిలో నా ధ్యాన రూపాన్ని ప్రవేశింపచేసి

సమం ప్రశాన్తం సుముఖం దీర్ఘచారుచతుర్భుజమ్
సుచారుసున్దరగ్రీవం సుకపోలం శుచిస్మితమ్

చక్కని మెడా చిరునవ్వూ కంఠమూ ఉన్న నన్ను

సమానకర్ణవిన్యస్త స్ఫురన్మకరకుణ్డలమ్
హేమామ్బరం ఘనశ్యామం శ్రీవత్సశ్రీనికేతనమ్

పీతాంబరం ధరించి మేఘ శ్యామ వర్ణముతో శ్రీ వత్స శ్రీ నికేతుడనైన నన్ను, శంఖ చక్ర గదా పద్మ వనమాలతో భూషించబడిన వాడు

శఙ్ఖచక్రగదాపద్మ వనమాలావిభూషితమ్
నూపురైర్విలసత్పాదం కౌస్తుభప్రభయా యుతమ్

పాదాభరణాలతో శొభించే పాదములూ, వక్షస్థలములో కౌస్తుభ మణితో

ద్యుమత్కిరీటకటక కటిసూత్రాఙ్గదాయుతమ్
సర్వాఙ్గసున్దరం హృద్యం ప్రసాదసుముఖేక్షనమ్

కిరీటములూ కటకములూ అంగదములూ కటిసూత్రములూ, అనుగ్రహముతో ప్రసన్నమైన ముఖం గలవాడు

సుకుమారమభిధ్యాయేత్సర్వాఙ్గేషు మనో దధత్
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యో మనసాకృష్య తన్మనః
బుద్ధ్యా సారథినా ధీరః ప్రణయేన్మయి సర్వతః

అలా సుకుమారమైన నన్ను, నా అన్ని అవయవాలనూ ఒక్కో సారే ధ్యానం చేస్తూ సాగాలి. ఒక్కో అవయవములో మనసు నిలిపుట అభ్యసించాలి. పరమాత్మ ముఖం ధ్యానం చేస్తూ ఉంటే ముఖమే కనపడాలి. ఏ అవయవాన్ని ధ్యానం చేస్తామో ఆ ఒక్క అవయవం యందే మనసు నిలుపాలి
ఇంద్రియములను విషయముల నుండి మనసుతో లాగేసి, ఆ మనసును, సారధి ఐన బుద్ధితో నా యందు నిలపాలి
తత్సర్వవ్యాపకం చిత్తమాకృష్యైకత్ర ధారయేత్
నాన్యాని చిన్తయేద్భూయః సుస్మితం భావయేన్ముఖమ్

ఇలా అంతటా వ్యాపించి ఉండే చిత్తాన్ని లాగుకొని వచ్చి ఒకే చోట నిలపాలి. మనసు ఒకే చోట ఉంచాలి గానీ వేరే వాటిని ఆ సమయములో చింతించకూడదు. ముఖాన్ని ధ్యానం చేయదలచుకుంటే చిరునవ్వుతో ఉన్న పరమాత్మ ముఖాన్ని ధ్యానం చేయాలి
తత్ర లబ్ధపదం చిత్తమాకృష్య వ్యోమ్ని ధారయేత్
తచ్చ త్యక్త్వా మదారోహో న కిఞ్చిదపి చిన్తయేత్

అలా మనసు  ముఖం యందు నిలవడం మొదలుపెడితే, సాకారమైన నా యందు మనసు నిలుపడం పూర్తి ఐన తరువాత నిరాకారమైన నా యందు నిలుప ప్రయత్నించాలి
చివరకు దాన్ని కూడా వదలి, నాలోకే వచ్చేసి, ఏ విషయమునూ ధ్యానించకుండా ఉండాలి

ఏవం సమాహితమతిర్మామేవాత్మానమాత్మని
విచష్టే మయి సర్వాత్మన్జ్యోతిర్జ్యోతిషి సంయుతమ్

ఇలా సావధాన మనస్కుడై నాలో అన్నీ చూస్తున్నవాడు, అగ్నిలో అగ్ని చేరినట్లుగా దీపములో దీపం చేరినట్లుగా కాంతిలో కాంతి చేరినట్లుగా,

ధ్యానేనేత్థం సుతీవ్రేణ యుఞ్జతో యోగినో మనః
సంయాస్యత్యాశు నిర్వాణం ద్రవ్య జ్ఞానక్రియాభ్రమః


 ఇలా సుతీవ్రమైన ధ్యానముతో యోగులు మనసును నా యందు  లగ్నం చేస్తారు.
ద్రవ్య జ్ఞ్యాన క్రియా అనబడే సకల భ్రమలూ లీనమై నా యందే మనసు నిలుస్తుంది.


                                                      సర్వం శ్రీకృష్ణార్పణమస్తు