త్రేతాయుగంలో భీమాసురుడనే రాక్షసుడు సహ్యాద్రిపై తల్లి కర్కటితో కలిసి జీవిస్తూ, ప్రజలను పీడిస్తూండేవాడు. కర్కటి, పుష్కసి – కర్కటుల కూతురు. లేక లేక పుట్టిన కూతుర్ని అత్యంత గారాబంగా పెంచసాగారు ఆ రాక్షసదంపతులు. యుక్తవయస్కురాలైన కర్కటిని విరాధునికి ఇచ్చి పెండ్లి చెసారు. ఆ విరాధుడు, శ్రీరామునిటొ జరిగిన యుద్ధంలో మరణించగా, మరలా కర్కటి తల్లిదండ్రులను ఆశ్రయించింది. ఒకరోజు అగస్త్యుని శిష్యుడైన సుతీక్షణుడు భీమానదిలో స్నానం చేస్తుండగా, కర్కటి తల్లిదండ్రులు అతనిని కబళీంచేందుకు ప్రయత్నించి, అ ముని శాపానికి గురై భస్మమయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన కర్కటి అనాథగా ఆ మిగిలింది. అనాథగా సహ్యపర్వతంపై తిరుగుతున్న కర్కటిని చూసి, మోహావేశుడైన రావణుని సోదరుడు కుంభకర్ణుడు,ఆమెను బలాత్కరించి, లంకా నగరానికి వెళ్ళిపోయాడు. ఫలితంగా కర్కటి గర్భనతై భీమాసురునికి జన్మనిచ్చింది. తన తల్లి కథను విన్న భీమాసురుడు, దీనంతాటికి కారకుడు రామావతారం ధరించిన విష్ణువేనని, విష్ణువుపై తన పగను తీర్చుకోవాలని, వేయి సంవత్సరాలపాటు బ్రహ్మ గురించి తపస్సుచేసి వరాలను పొందాడు. ఎల్లలోకవాసులను గడగడలాడించిన భీమాసురుడు కామరూప దేశాధిపతి సుదక్షిణుని ఓడించి కారాగృహంలో బంధించాడు.అతని భార్య సుదక్షిణాదేవిని కూడ బంధిస్తాడు. కారాగారంలో సంకెళ్ళతో బంధింపబడినప్పటికీ ఆ దంపతులు, మానస గంగాస్నానం చేస్తూ, ఇసుకలింగాన్ని చేసి ఆరాద్ హించసాగారు. వారి పూజలను చూసిన భీమాసురుడు ఈ లింగం మిమ్ములను రక్షిస్తుందా అంటూ తన కరవాలాన్ని విసురుతాడు. రాక్షసుని కత్తి పార్థివలింగాన్ని తాకినంతనే కోటి సూర్యప్రభలతో స్వామి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, త్రిశూలంతో రాక్షస సంహారం గావించాడు. సకలలోకవాసులు సంతోషించారు. అప్పట్నుంచి స్వామి లోకకళ్యాణార్థం అక్కడనే ఉంటూ భక్తజనా వళిని కరుణిస్తున్నాడు. ఎందరో భక్తుల కోరికలను ఈడేరుస్తున్నాడు.