ఈ సృష్టికి ముందునుంచే కాశీపురం పరమ పవిత్రమై విరాజిల్లుతోంది. ఇక్కడ పరమశివుడు సగుణరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపం శివశక్తి సమ్మేళనం. స్త్రీ, పురుష రూపాలకు భిన్నంగా ఉన్న ఆ రూపం ప్రకృతి,పురుషులు ఉదయించారు. పరమాత్మ తన నుండి తేజాన్ని వెలువరించి ఐదుక్రోసులమేరగల ఒక మహాపట్టణాన్ని ప్రకృతి పురుషులు తపస్సు చేయడానికి నిర్మించారు. అదే కాశి పట్టణం. పరమాత్మ అదేశానుసారం పురుషుడు సృష్టి నిర్మాణ సామార్థ్యాన్ని పొందేందుకు ఘోర తపస్సు చేసాడు. పరమపురుషుడైన శ్రీమహావిష్ణువు తపస్సు చేస్తుండగా, ఆ తపస్సు వేడికి అతని శరీరం నుండి నీరు కాలువలై ప్రవహించసాగాయి. ఆ జల ప్రదేశాన్ని చూసి ఆది నారాయణుడు ఆశ్చర్యచకితుడై తల ఊపాడు. ఆ ఊపుకు మణులతో కూడిన చెవి కమ్మ ఊడి ఒకచోట పడింది. ఆ చెవి పోగు ఊడి పడిన స్థలమే ‘మణికర్ణి’గా ప్రసిద్ధమైంది. అనంతమైన జలరాశినుండి కాశీపట్టణాన్ని పరమశివుడు తన శూలాగ్రంతో ధరించి కాపాడాడు. జాలం పైభాగంలో యోగనిద్రాపరవశుడైయున్ననారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉదయించి, శివాజ్ఞను అనుసరించి సృష్టి చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ముందుగా బ్రహ్మ పంచాశత్కోటి యోజన పరిమితమగు బ్రహ్మాండాన్ని సృజించి, నాలుగు వైపులా పద్నాలుగు భువనాలను నిర్మించాడు. ఆ బ్రహ్మాండం మజ్జిగలో వెన్నముద్ద వలె తేలియాడసాగింది. ఐరావతాదులతో బ్రహ్మాండం సుస్థిరంగా నిలిచి ఉంది. ఈ బ్రహ్మాండంలో సగం మధ్య భాగం, మిగిలిన సగభాగంలో సగం ఊర్థ్వభాగం, ఇక మిగిలిఉన్న పాతికభాగం అథోలోకమని చెప్పబడుతోంది. అప్పుడు దేవతలంతా పరమశివుని ప్రార్థించి, భూలోక వాసులను కాపాడేందుకు ఇక్కడే శాశ్వతంగా ఉండమని విన్నవించుకున్నారు. వారి మొరలను ఆలించిన పరమశివుడు విశ్వేశ్వరనామంతో జ్యోతిర్లింగమై కాశీ పట్టణంలో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, అష్టభైరవులు, ఢుంఢితో సహా 56గణపతులు, నవదుర్గలు కాశీలో కొలువై ఉన్నారు. కాశీలో ంగ్గంగాస్నానం చేసి, విశ్వేశ్వరుని,భిందు మాధవుని, డుంఢిగణపతిని, దండపాణిని, కాలభైరవుని, కుమారస్వామిని, అన్నపూర్ణను సేవించుకోవాలి. కాశీయాత్ర చేయలేనివారు, కాశీ పేరును తలచుకుంటే చాలు, యాత్రాపుణ్యఫలం దక్కుతుంది. కాశీలో మరణించిన వారికి కుడిచెవిలో శ్రీరామ తారక మంత్రోపదేశం లభించి మొక్షం సిద్ధిస్తుంది. రామేశ్వరం నుంచి ఇసుకను తీసుకొచ్చి కాశీ విశ్వేశ్వరుని అభిషేకిస్తే, ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇక్కడ గంగాస్నానం చేసిన వారికి ముక్తి, అన్నపూర్ణాదేవిని పూజించినవారికి భుక్తికి లోటుండదు.