వైద్యానాథ జ్యోతిర్లింగ విషయంలో అనేక భేధాభిప్రాయాలున్నాయి. మహారాష్ట్ర పర్లీ గ్రామంలోనిదే అసలైన జ్యోతిర్లింగమని, గంగా ఖేడలోనిలింగం, పంజాబ్ కీరగ్రామం లోని లింగం, హిమాచల్ ప్రదేశ్ లోని పఠాన్ కోట్ కు సమీపంలోని లింగం, కర్ణాటకలోని గోకర్ణ లింగం…ఇవన్నీ శివుని ఆత్మలింగాలేనన్న వాదన బలంగా ఉంది. అయితే జార్ఘండ్ వైద్యనాథంలో వెలసినదే అసలైన జ్యోతిర్లింగమని విజ్ఞుల వాదన. పూర్వం రావణాసురుడు కఠోరనియమాలతో, ఒక చెట్టుకింద అగ్ని గుండాన్ని ఏర్పరచి, పార్థివలింగాన్ని, ప్రతిష్టించి, శివపంచాక్షరీమంత్రంతో, హవన కార్యక్రమంతో నిష్ఠతో ప్రార్థించగా,శివుడు రావణుని కోరికననుసరించి తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. అయితే ఆ లింగాన్ని భూమికి తాకించిన వెంటనే అక్కడే స్థిరపడుతుందని హెచ్చరించాడు. ఆత్మలింగంతో లంకానగరాంకి తిరుగు ప్రయాణమైన రావణుడు సంధ్యావందనం చేసేందుకు ఒక పశువుల కాపరికి (దేవతల కోరికపై వినాయకుడు ఈ వేషాన్ని ధరించాడు) లింగాన్ని ఇవ్వగా, ఆ కాపరి ఆత్మలింగాన్ని కిందపెడతాడు. ఫలితంగా ఆ లింగం అక్కడే స్థిరపడుతుంది. రవణుడు ఎంతగా ఆత్మలింగాన్ని పెకలించి లంకానగరానికి తీసుకెళదామని ప్రయత్నించినప్పటికీ ఫలితం ఉండదు. వైధ్యనాథ్ దేవాలయంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా శివాలయ మందిర శిఖరంపై త్రిశూలం ఉంటుంది కానీ, ఈ ఆలయ మందిర శిఖరంపై పంచశూలం ఉంది. మరి ఏ ఇతర జ్యోతిర్లింగ ఆలయాలలో ఇలాంటి అమరిక లేదు. పంచాక్షరీమంత్రంగా కలిగిన పంచముఖ శివునకు పంచప్రాణాలు అంతర్నిహితంగా కలిగిన శివతత్త్వమే ఇందులోని గూఢార్థం.