పశ్చిమ సముద్ర తీరాన, దారుకుడనే రాక్షసుడు, ‘దారుక’ అనే తన భార్యతో కలిసి ప్రజలను చిత్రహింసలు గురిచేయసాగాడు. యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ, ముని జనులను హింసించసాగారు. వీరి హింసను తట్టుకోలేని ఋషులు ఔర్వమహర్షికి విన్న వించుకున్నారు. ఔర్వమహర్షి ఆ రాక్షస దంపతులను సతీసమేతంగా మరణించునట్లుగా శపించాడు. ఆ మునిశాపం భూమి పైనే పనిచేస్తుంది. కనుక, రాక్షదంపతులు సముద్రమధ్యంలో నివాసమేర్పరుచుకుని సముద్రయానం చేశేవారిని పీడించసాగారు. ఇలా కనబడిన ప్రయాణీకులందరి ధనవస్తువులను అపహరిస్తూ చెరసాలలో బంధించసాగారు. అలా బంధింపబడినవారిలో సుప్రియుడోకడు. ఇతడు పరమ శివభక్తుడు. రాక్షసబాధలను తట్టుకోలేక సుప్రియుడు ఆర్తనాదం చేయగా, దివ్యతేజః పుంజము కళ్ళు మిరిమిట్లు గొలుపునట్లు ప్రకాశించింది. ఆ కాంతికి దారుకునితోపటు సమస్త రాక్షసులు నేలకొరిగారు. అక్కడ పరమశివుడు నాగరూపమై జ్యోతిర్లింగమైవెలిసాడు. ఈ స్వామికి దర్శించి, సేవించుకున్నవారికి శాశ్వత పుణ్యలోకవాసం సిద్ధిస్తుందని ప్రతీతి.