Pages

Saturday, 18 April 2015

గజేంద్రమోక్షము - 14


. ఒకనాడా నృపుడచ్యుతు న్మనములో నూహించుచు న్మౌనియై
యకలంకస్థితినున్నచో గలశజుండచ్చోటికి న్‌వచ్చి లే
వక పూజింపకయున్న రాజు గని వ్యక్రోధుడై మూఢ లు
బ్ద కరీద్రోత్తమయోని బుట్టుమని శాపంబిచ్చె భూవల్లభా.


తా!! ఓ పరీక్షిణ్మహరాజా! ఒకదినమున ఇంద్రద్యుమ్ను మహారాజు మౌనవ్రత దీక్షలో భగవంతుని ధ్యానము జేయుచున్న సమయమున అగస్త్యమహాముని అచటకేతెంచెను. ధ్యాననిమగ్నుడై యున్న ఇంద్రద్యుమ్నుడు అగస్త్యుని రాకను గమనింపక స్వాగత సత్కారము లీయజాలకపోయెను. అవమానమును భరింపజాలక అగస్త్యమహాముని కోపించి " మదించిన గర్వముతో నెవ్వరిని కానలేకున్నావు. గాన గజేంద్ర వంశమునబుట్టెదవుగాక" యని శపించెను.

*******************************************************************************************  107

క. మునిపతి నవమానించిన
ఘను డింద్రద్యుమ్నవిభుడు కౌంజరయోనిన్‌
జననం బందెను విప్రుల
గని యవమానింపదగదు ఘనపుణ్యులకున్‌


గొప్పవాడైన ఇంద్రద్యుమ్నుడు అగస్త్యుని అవమానించి నందున గజేంద్రుడయ్యెను. బ్రాహ్మణులనవమానించిన వాడగుటచే అంతటి గొప్పవాడైన ఇంద్రద్యుమ్నుడు ఇక్కట్లు పాలయ్యెను. కావున ఎంతటి బుద్ధిశాలురయిననూ, పుణ్యవంతులయిననూ బ్రాహ్మణుల నవమానించరాదని, అట్లు జేసినచో ముప్పు వాటిల్లునని భావము.

******************************************************************************************   108

క. కరినాథుడయ్యె నాతడు
కరులైరి భటాదులెల్ల గజముగ నయ్యున్‌
హరి చరణ సేవ కతమున
గరివరునకు నధికముక్తి గలిగె నరేంద్రా


తా: ఓ రాజా! మకరితో పోరు సల్పిన గజేంద్రుడే ఇంద్రద్యుమ్నుడిగాను, ఆతని సేవకులే గజేంద్రపరివారముగాను జన్మించిరి. ఇంద్రద్యుమ్నుడు గజేంద్రుడయ్యును విష్ణుభక్తి వదలక పోవుటచే శాశ్వతమగు మోక్షమును సంపాదించుకొనగలిగెను.

******************************************************************************************   109

ఆ. కర్మతంత్రుడగుచు గమలాక్షు గొల్చుచు
నుభయ నియతవృత్తి నుండె నేని
జెడును గర్మమెల్ల శిధిలమై మెల్లన
బ్రబలమైన విష్ణు భక్తి చెడదు.


తా!! కర్మాబద్ధుడై, మానవధర్మములను అనుసరించుచు, మధుసూధనుని యందు మనస్సు నిల్పి భక్తితో ఉభయ వృత్తులను చిత్తసుద్ధితో నిర్వర్తించువాని పాపములు ఆ సర్వేశ్వరుడగు భగవంతుడే నశింపజేయును. విష్ణుభక్తియు జెడిపోదు. భక్తితో భగవంతుని సదా స్మరించినచో ఏదియో యొక జన్మలోనైనా ముక్తి గలుగుట తథ్యము.గజరాజు జీవితమే దీనికొక నిదర్శనము.

*******************************************************************************************  110

క. జెడు గరులు హరులు ధనములు
జెడుదురు నిజసతులు సుతులు జెడుచెనటులకున్‌
జెడక మను నెఱసుగుణులకు
జెడని పదార్థములు విష్ణుసేవానిరతుల్‌


తా!! మూఢులు సంసారబంధములజిక్కి పశు, వాహన, ధం, ధాన్యాధులు, పుత్ర, మిత్ర, కలత్ర భాంధవులు శాశ్వతమని నమ్మి భగవంతుని యందు భక్తి నిలుపక చెడుమార్గమున జీవించుచున్నారు. సత్కార్యములు జేయుచు, భగవంతుని భక్తితో ధ్యానించిన వారికి స్థిరచరాస్తులను ఆ పరమేశ్వరుడే కల్పించును. పిమ్మట మోక్షపదమును గూడ పొందుదురు. కావున అస్థిరమైన ఐశ్వర్యములకు ప్రాకులాడక భగవంతుని భజించి తరించండి.

*******************************************************************************************  111

వ. అప్పుడు జగజ్జనకుండగు నప్పరమేశ్వరుండు దరహసిత
ముఖకమలయగు నక్కమల కిట్లనియె


తా!! చిరుమందహాసముతో విరాజిల్లు కమలము వంటి మోముగల ఆ లక్ష్మీదేవితో జగత్ప్రభువైన పరమేశ్వరుడు ఇట్లనియె.

*******************************************************************************************  112

క. బాలా నా వెనువెంటను
హేలన్వినువీథినుండి యేతెంచుచు నీ
చేలాంచలంబు బట్టుట
కాలో నేమంటి నన్ను సంభోజముఖీ


తా!! ఓ లక్ష్మీదేవీ! కమలముల వంటి మోముగలదానా! నీ పైటకొంగుముడి విడదీయక గజేంద్రుని కాపాడాలనే సంరంభమున నిన్ను గూడ ఈడ్చుకొనిపోయినందుకు నీవేమనుకొంటివి.

*******************************************************************************************  113

క. ఎఱుగుదు దెఱవా యెప్పుడు
మఱవను సకలంబు నన్ను మఱచిన యెడలన్‌
మఱతు నని యెఱిగి మొఱగక
మఱువక మొఱ యిడిర యేని మఱి యన్యములన్‌


తా!! ప్రియసఖీ! సుందరీ! నన్ను మరచిన వానిని నేను మరతునని తెలుసుకొనుము. నన్ను తెలిసినవారిని నేనెల్లప్పుడు మరువను. సర్వదా భజించువారినాపదలను నేను బాపుదును. అట్టి భక్తులను నేనే చూచుకొందును. వారు నాకు క్రొత్తగాదు. వారెల్లపుడు నాకనుసన్నలలో నుండువారే

*******************************************************************************************  114