Pages

Saturday, 18 April 2015

గజేంద్రమోక్షము - 15 (సంపూర్ణము)


ప. అని పలికిన నరవిందమందిరయగునయ్యిందిరాదేవి మందస్మిత చంద్రికా
దరహాస సుందర వదనారవింద యగుచు ముకుందునకిట్లనియె


తా!! విష్ణుమూర్తి పలుకులకు చిరునగవుతో కమలవాసినియగు లక్ష్మీదేవి యిట్లనెను.

*******************************************************************************************  115

క. దేవా దేవరయడుగులు
భావంబున నిలిపికొలుచు పని నాపని గా
కో వల్లభ యే మనియెద
నీవెంటనె వచ్చుచుంటి నిభిలాధిపతీ


తా: ఓ! జగన్నాయకా! మీ పాదసేవయే నా పరమావధి. నాకు వేరొండుబనిలేదు. కావున మిమ్ములను వెంబడించితినేగాని మరే తలంపులేదు.

******************************************************************************************   116

క. దీనుల కుయ్యాలింపను
దీనుల రక్షింప మేలు దీవనబొందన్‌
దీనావన నీ కొప్పును
దీన పరాధీన దేవ దేవ మహేశా!


తా: నిన్ను కొల్చిన వారిని కొంగుబంగారమై కాపాడు దేవదేవా! మహేశా! ఆపన్నుల దీనాలాపములను విని రక్షించే రక్షకుడవు. భక్తులచే, దీనులచే మిక్కిలిగా బొగడబడినవాడవు. నాకు నీవే దిక్కు! అని లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని గొనియాడెను.

******************************************************************************************   117

వ. అని మఱియును సముచిత సంభాషణంబుల నంకించుచున్న
యప్పరమవైష్ణవీరత్నంబును సాదర సరస సల్లాప మంద
హాస పూర్వకంబుగా నాలింగనంబు గావించి సపరివారుండై
గరుడగంధర్వసిద్ధి విబుథగణజేగీయమానుండై గరుడా
రూఢుండగుచు హరి నిజసదనంబునకుం జనియె నని చెప్పి శుక
యోగీంద్రుడిట్లనియె.


తా!! ఈ విధముగా సముచిత సంబాషణములతో కొలుచుచున్న, ఆ విష్ణుమూర్తి భక్తులలో శ్రేష్ఠురాలైన లక్ష్మీదేవిని చిరునవ్వుతో ప్రేమ పూర్వకముగా ఆలింగనము చేసుకుని శ్రీ మహావిష్ణువు సపరివారముగా గరుడ, గంధర్వ, సిద్ధ, దేవతాగణ సమూహితుడై గరుడ వాహనారూఢుడై, వైకుంఠమునకు బయలుదేరాడు" అని శుకమహర్షి పరీక్షిణ్మహరాజుకు చెప్పి ఇంకనూ యిట్లనియె.

*******************************************************************************************  118

సీ. నరనాథ నీకును నాచేత వివరింప
బడినయీ కృష్ణాను భావమైన
గజరాజమోక్షణ కథ విను వారికి
యశములెచ్చును గల్మ షావహంబు
దుస్వప్న నాశంబు దుఃఖ సంహారంబు
ప్రొద్దుల మేల్కాంచి పూతవృత్తి
నిత్యంబు పఠియించు నిర్మలాత్మకులైన
విప్రులకును బహు విభవ మమరు

తే. సంపద గల్గు బీడలు్ శాంతి బొందు
సుఖము సిద్ధించు వర్థిల్లు శోభనములు
మోక్ష మరచేతిదైయుండు ముదముజేరు
ననుచు విష్ణుండు బ్రీతుడై యానతిచ్చె


తా!! ఓ పరీక్షిణ్మహారాజా! శ్రీ మహావిష్ణువు యొక్క మహిమాన్విత గాధల నొప్పు గజేంద్ర మోక్షమును విన్నవారి కీర్తి మెండగును. ఈ గజేంద్రమోక్షము దుఃఖ, దుస్వప్నములను హరించును. ప్రతిరోజూ వేకువజామునే లేచి గజేంద్రమోక్షమును పఠించువారి యోగక్షేమములను సర్వేశ్వరుడైన యా భగవంతుడే చూసుకొంటాడు. రోగములు దరిచేరవు. ఐశ్వర్యప్రాప్తి సిద్ధించును. సంతోషములు గలుగును యని విష్ణుమూర్తి ఆనతిచ్చాడు.

*******************************************************************************************  119

వ. అని మఱియు నప్పరమేశ్వరుడిట్లని యానతిచ్చె "నెవ్వ
రేనియు నపర రాత్రంబున మేల్కాంచి సమాహితమనస్కు
లై శ్వేతద్వీపంబును, నాకుం బ్రియంబైన సుధాసాగరం
బును హేమనగంబును, నిగ్గిరికందర కాననంబులను,
వేత్రకీచక వేణు లతాగుల్మసుర పాదపంబులును, ఏనును
బ్రహ్మయు ఫాలలోచనుండును నివసించి యుండున క్కొండ
శిఖరంబులను, కౌమోదకీ కౌస్తుభ్య సుదర్శన పాంచజన్యంబులను,
శ్రీదేవిని, శేషగరుడ వాసుకి ప్రహ్లాదనారదులను, మత్స్య
కూర్మ వరహాద్యవతారబులను, తదవతారకృత కార్యం
బులను, సూర్యసోమపావకులను, ప్రణవంబును, ధర్మ
తపస్సత్యంబులను, వేదంబులను, వేదాంగంబులను 
శాస్త్రంబులను, గోభూసుర సాధు పతివ్రతాజనంబులను,
చంద్రకాశ్యవజాయా సముదయంబును గౌరీగంగా సరస్వతీ
కాళిందీ సునందా ప్రముఖ పుణ్య తరంగిణీచయంబును,
అమరులను, అమరతరువులను, ఐరావతంబును, అమృతం
బును, ధ్రువుని, బ్రహ్మర్షినివహంబును పుణ్యశ్లోకులైన
మానవేంద్రులను, సమాహితచిత్తులై దలంచువారలకు
బ్రాణావసానకాలంబున మదీయంబగు విమలగతి నిత్తునని
హృషీకేశండు నిర్దేశించి శంఖంబు పూరించి విహగపరివృఢ
వాహనుండై వేంచేసె విబుధానీకంబు సంతోషించెనని చెప్పి శుకుండు రాజున కిట్లనియె


తా!! యింకను శ్రీ మహావిష్ణువు యిట్లు చెప్పుచున్నాడు. ప్రతిదినము వేకువజామున మేల్కొని నిశ్చల మనస్సుగల వారై శ్వేత దీపంబును, పాలసముద్రమును, కరిమకరితటాకమును, మేరుపర్వత గుహలను, వనములను, వృక్షలతలను, త్రిమూర్తులు విహరించు పర్వతశిఖరములను, విష్ణుమూర్తి యొక్క కౌమోదకీగదను, కౌస్తుభమణి, సుదర్శనచక్రము, పాంచజన్యశంఖము, లక్ష్మీదేవిని, ఆదిశేషుని, గరుఢుని, నారదమునిని, మత్స, కూర్మ, వరాహాది అవతరంబులను, అందలి సుకృత్యములను, సూర్య, సోమ, పావకులను, (సూర్య, చంద్రాగ్నులు), ఓంకార ప్రణవమును, ధర్మ, తపస్సత్యంబులును, వేద వేదంగ శాస్త్రములను, గోవులు, బ్రాహ్మణులు, సాధు పతివ్రతా జనంబులను, చంద్రకాశ్యప భార్యలను, గౌరీ, గంగా, సరస్వతీ, కాళిందీ, సునందాది ప్రముఖ పుణ్యనదులను, దేవతలను, కల్పవృక్షమును, ఐరావతమును, ధ్రువుడు, బ్రహ్మర్షి సమూహంబును, పుణ్యమూర్తుల కధలను చదువు మానవులకు వారి అవసాన కాలమున నా యొక్క గొప్పదైన శాశ్వతలోకంబును ప్రసాదింతును. " అని చెప్పి శ్రీ మహావిష్ణువు పాంచజన్య శంఖాన్ని పూరించి పక్షిరాజైన గరుడ వాహనమెక్కి వైకుంఠమునకు జనియె. వేల్పులందరును భక్తితో నమస్కరించి సంతోషించిరి. అని శుకమహర్షి పరిక్షిణ్మహారాజుతో నిట్లనియె .

*******************************************************************************************  120

ఫలశృతి

క. గజరాజుమోక్షణంబును
నిజముగ బఠియించునట్టి నియతాత్ములకున్‌
గజరాజవరదు డిచ్చును
గజతురగస్యందనములు గైవల్యంబున్‌


తా!! ఈ గజేంద్రమోక్షమును భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పఠించువారికి ఆ శ్రీమన్నారాయణుడు ఏనుగులు, గుర్రములు, మొదలుగా గల అష్టైశ్వర్యములను, ఇహలోక పరలోక, మోక్షమును సిద్ధింపజేయును .

*******************************************************************************************  121

క. జనకసుతాహృచ్చోరా
జనకవచోలబ్ధవిలీన శైలవిహారా
జనకామితమందారా
జనకాదిమహేశ్వరాతి శయ సంచారా


తా!! సీతాదేవి భర్తయైన శ్రీరామా! పితృఆజ్ఞను పాటించి అరణ్యముల సంచరించినవాడా! పర్వతనివాసి! కల్పవృక్షముల వలె ప్రజల కోర్కెలు దీర్చువాడవును, జనకుడు మున్నగు రాజులను మించిన రాజైన యో రామా! వినుము.

*******************************************************************************************  122

మాలిని -

దివిజరిపువిదారీ దేవలోకోపకారీ
భువనభరనివారీ పుణ్యరక్షానుసారీ
ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషప్రవర్తీ
ధవళబహుళకీర్తి ధర్మనిత్యానుపర్తీ


తా!! రాక్షస సంహారీ! దేవతలకు ఉపకారము జేయువాడా! దుష్టులను దునుమాడి ధరణి భారమును దగ్గించినవాడా! పుణ్యమూర్తులను రక్షించువాడా! స్వచ్ఛమైన కాంతితో వెలిగే నీలమేఘ శరీరా! భక్తబంధు ప్రీతియందు ఆసక్తిగలవాడా! స్వచ్ఛమైన నిష్కల్మషమైన కీర్తిని పొందినవాడా! ధర్మమును నిలుపువాడా శ్రీరామా! అవధరింపుము.

******************************************************************************************* 

శ్రీ బమ్మెరపోతనామాత్యునిచే రచించబడిన శ్రీ మదాంద్ర భాగవత అష్టమస్కంధము నందలి మోక్షప్రదమైన గజేంద్రమోక్షము సంపూర్ణము