Pages

Monday, 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- బభ్రువాహనుడు



ధర్మరాజు అశ్వమేధ యాగం తలపెట్టాడు. సోదరులు మేలుజాతి గుర్రాన్ని ఎంపిక చేసి తెచ్చారు. వేదోక్త విధులన్నీ నిర్వర్తించాక ధర్మరాజు ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు. గాండీవమూ, అక్షయ తూణీరమూ ధరించి సవ్యసాచి దానివెంట వెళ్ళాడు. త్రిగర్తదేశం, ప్రాగ్జోతిషపురం, సింధుదేశం, గడిచాక మణిపురంలోకి ప్రవేశించింది అశ్వం. తండ్రి వస్తున్నాడని తెలిసి ఎదురువెళ్ళి అతని పాదాలకు వినయంగా నమస్కరించాడు బభ్రువాహనుడు. అర్జునుడు కొడుకును ఆదరించలేదు సరికదా ఈసడించుకున్నాడు. తండ్రి నిరాదరణకు కారణం తెలియక విచారిస్తూ మౌనంగా పక్కకు తప్పుకున్నాడు బభ్రువాహనుడు.

తలవంచుకుని విచారంగా తన మందిరానికి బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక స్త్రీ ఎదురువచ్చి, "నాయనా! నీకు నేను తల్లినవుతానురా. నాగేంద్రకుమారిని! నా పేరు ఉలూచి. నీకు హితం చెప్పడానికి వచ్చాను. యుద్ధం రాజధర్మం. వెళ్ళి నీ తండ్రితో యుద్ధం చెయ్యి. ఆయనకు అది ప్రియమవుతుంది" అని సలహా చెప్పింది.

"తల్లీ! తండ్రితో యుద్ధం కూడదని శాంతం వహించాను. అంతేగాని పిరికితనం వల్ల కాదు. నువ్వు చెప్పినట్టే యుద్ధం చేసి నా తండ్రికి సంతోషం కలిగిస్తాను" అని బభ్రువాహనుడు ఆమెకు నమస్కరించి సర్వసాధనాలతో కూడిన రథం ఎక్కి అశ్వానికి అడ్డుపడ్డాడు. అది చూసి మెచ్చుకున్నాడు సవ్యసాచి. ఇద్దరూ పట్టుదలతో చాలాసేపు యుద్ధం చేశారు. చివరకు లిప్తపాటు కాలంలో కొడుకు వేసిన క్రూరశరం ఒకటి రొమ్ములో దిగబడేసరికి నిలువునా కూలిపోయాడు అర్జునుడు. అదే క్షణంలో తండ్రి వేసిన బాణం సోకి బభ్రువాహనుడు మూర్చపోయాడు.

బభ్రువాహనుడి పరిచారకులు గబగబా వెళ్ళి సంగతంతా అతని కన్నతల్లి చిత్రాంగదకు తెలియచేశారు. ఆమె ఉలూచిని వెంటబెట్టుకని యుద్ధభూమికి వచ్చింది. రథానికి అడ్డంగా పడివున్న కొడుకును, నిర్జీవంగా వున్న భర్తను చూసి చిత్రాంగద దుఃఖవివశురాలయింది.

"అక్కా! ఎందుకు ఈ పసివాణ్ణి యుద్ధానికి ప్రోత్సహించావు? కొడుకు శౌర్యానికి బలి అయి చచ్చిపడి ఉన్న ఈ కురుకులవరేణ్యుణ్ణి నువ్వు బతికించకపోయావంటే నేను కూడా ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను" అంటూ పద్మాసనం వేసుకుని కూర్చుంది. కాసేపటికి తెప్పరిల్లాడు బభ్రువాహనుడు. విగతజీవుడైన తండ్రినీ, దుఃఖిస్తూన్న తల్లినీ చూసి ఎలుగెత్తి ఏడ్చాడు. తండ్రిని చంపిన పాపానికి తానూ ప్రాయోపవేశం చేసి తనువు చాలించాలనుకుని తండ్రి పాదాల దగ్గర కూర్చున్నాడు.

ఆ తల్లీకొడుకుల్నీ, అచేతనంగా పడివున్న భర్తనూ చూసి కన్నీరు పెట్టకుంది ఉలూచి. మృత సంజీవనీమణిని తలుచుకుంది. వెంటనే ఆ మణి వచ్చి ఆమె చేతులలో పడింది.

"నాయనా! బభ్రువాహనా! విజయుడికి మరణం ఉంటుందా? నీతో యుద్ధం చేసి నీ పరాక్రమం తెలుసుకోవాలనే కోరిక నీ తండ్రికి వుంది. అది తీరడానికే ఇంత పని చెయ్యవలసి వచ్చింది. ఇదిగో ఈ మణి తీసుకో! దీన్ని ఆయన హృదయం మీద పెట్టు" అంటూ తన చేతిలో ఉన్న మణిని కొడుక్కి ఇచ్చింది. అతడు దానిని తండ్రి హృదయానికి తాకించగానే నిద్రనుంచి మేలుకున్నట్టు లేచి కూర్చున్నాడు అర్జునుడు.

ఉలూచి భర్త పాదాలకు నమస్కరించి, "స్వామీ! శిఖండిని నెపంగా పెట్టుకుని భీష్ముణ్ణి కూల్చారు మీరు. అది పాపం! దానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా శరీరం విడిస్తే నరకం ప్రాప్తిస్తుంది మీకు. అందుకే కావాలని మీకూ, బభ్రువాహనుడికీ యుద్ధం కల్పించాను. నన్ను మన్నించండి" అంది.

"అసలేం జరిగింది?" అని ఉలూచిని అడిగాడు అర్జునుడు.

"ఒకనాడు స్నానం చేద్దామని ఆకాశగంగకు వెళ్ళాను నేను. వసువులంతా వచ్చారు అక్కడికి. ఒక రేవులో స్నానం చేశారు. ఇంతలో గంగాదేవి ప్రత్యక్షమైంది వాళ్ళకు. 'అమ్మా చూశావా! శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్ముణ్ణి కూల్చాడు అర్జునుడు! అన్యాయం కదా?" అన్నారు వసువులు. కోపించిన గంగాదేవి 'కన్నకొడుకు చేతిలోనే అర్జునుడు హతమవుగాక!' అని శపించింది. అది నేను విని పరుగున వెళ్ళి మా తండ్రికి చెప్పాను. ఆయన భయపడుతూ వచ్చి దేవిని అనేక విధాల ప్రార్థించాడు. చివరికి ఎలగైతేనేం - ఆమె ప్రసన్నురాలయింది. అర్జునుడు తన కొడుకైన బభ్రువాహనుడి అస్త్రాల వల్ల మరణిస్తాడనీ, నాగలోకన వున్న మృతసంజీవనిమణి వల్ల పునరుజ్జీవితుడు అవుతాడనీ ఉపాయం చెప్పింది. ఈ సంగతి మా తండ్రిగారు నాకు చెప్పారు. అందుచేత ఈ వేళ బభ్రువాహనుణ్ణి మీతో యుద్ధానికి పురికొల్పాను. యుద్ధసమయంలో ఇతనియందు మహాశౌర్యం ఆవహింపచేశాను. అతని వల్ల కూలిన మీ దేహాన్ని మృతసంజీవనిమణి వల్ల తిరిగి సజీవం చేశాను" అని శాపతృత్తాంతం చెప్పింది ఉలూచి.

"దేవీ! నీ వల్ల మా కులం నిలబడింది. కులవర్థినివి నువ్వు" అని ఉలూచిని గౌరవించి, కొడుకును ఆశీర్వదించి, చిత్రాంగదను దీవించి వారందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని సంతోషంగా బయలుదేరాడు అర్జునుడు.