Pages

Monday, 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- తారకాసురుడి కొడుకులు



తారకాసురుడి కొడుకులు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు, అనే వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షమయ్యకా, తమకు ఎన్నడూ చావు లేకుండా వరమిమ్మని కోరారు. అది అసాధ్యమన్నాడాయన. మరేదైనా వరం కోరుకొమ్మన్నాడు.

"అయితే సకల సౌకర్యాలూ కలిగి కామగమనం గల మూడు పట్టణాలు మా ముగ్గిరికీ ఇవ్వు. అవి దేవదానవాదులెవరూ భేదించరానివిగా ఉండాలి. అలా అయితే మేము సుఖంగా వుంటాం" అన్నారు వాళ్ళు.

"సరే ! అలాగే ఇస్తాను. కాని ఆ మూడు పట్టణాలూ ఒక్కచోటికి రాకూడదు. తీరా వచ్చాకా బలవంతుడెవడైనా అది చూసి బాణం వేస్తే మాత్రం అవి నాశనమవుతాయి. అలా రాకుండా జాగ్రత్తపడండి" అన్నాడు బ్రహ్మ దేవుడు.

"అలాగే" అని ఆ వరం పొందారు వాళ్ళు.

తరువాత మయుణ్ణి పిలిచి పురాలు నిర్మించవలసిందన్నారు. అతడు తన తపస్సంతా ధారపోసి, నాలుగుదిక్కులూ నూరేసి యోజనాలుండేట్టుగా ముగ్గురికీ మూడు పట్టణాలు నిర్మించాడు. ఒకటి బంగారుది, రెండవది వెండిది, మూడోది ఇనుముతో చేసినది. తారకాక్షుడికి బంగారు పట్టణం ఇచ్చాడు. అది స్వర్గంలో సంచరిస్తుంది. కమలాక్షుడికి వెండి పట్టణం ఇచ్చాడు. అది అంతరిక్షంలో తిరుగుతుంది. ఇనుపనగరును విద్యున్మాలికిచ్చాడు. అది భూమిమీద తిరుగాడుతుంది. అలా ఆ రాక్షసులు ముగ్గురూ సకల భోగాలు అనుభవిస్తూ అంతటితో తృప్తి పడక ముల్లోకాలనూ స్వాధీనపర్చుకున్నారు. మయుడు తన మాయాజాలంతో వాళ్ళకు కావలసినవన్నీ సమకూరుస్తుండేవాడు. ఇలా చాలా ఏళ్ళు గడిచిపోయాయి. తారకాక్షుడికి 'హరి' అనే కొడుకు పుట్టాడు. అతడు కూడా బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేసి , ' త్రిపురాల్లో వున్న రక్కసులు ఒకవేళ ఆయుధాల వల్ల చనిపోతే వాళ్ళను నీళ్ళలో పడేసిన వెంటనే ఒక్కడు పదిమందై అమిత బలంతో లేచి రావాలి. అలాంటి బావులు ఆ మూడు పట్టణాల్లోనూ వుండేటట్టు వరమివ్వు. వాటిలో నీళ్ళు నిరంతరం వుండలి ' అని వరమడిగాడు. బ్రహ్మ సరేనని వరమిచ్చాడు.

అంతటితో వాళ్ళ ఆగడాలు పెచ్చుమీరాయి. ముల్లోకాలనూ వేధించడం మొదలు పెట్టారు. దేవేంద్రుడు తట్టుకోలేక బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మ పరమేశ్వర సన్నిదికి చేరాడు. అంతా విని పరమేశ్వరుడు " ఆ రాక్షసులు చాలా బలవంతులు. నా ఒక్కడి చేత చెడరు. అందుచేత నా తేజోబలాల్లో సగం తీసుకుని మీరందరూ కలిసి వాళ్ళను సంహరించండి" అన్నాడు.

"మహాత్మా! అది మా వల్ల కానిపని. నీ తేజస్సును మేము భరించలేం, అందుచేత మా అందరి తేజోబలాల్లో సగం సగం నీకే ఇస్తాం. నువ్వే ఆ శత్రువుల్ని సంహరించు' అని దేవతలు ప్రార్థించారు.

"సరే! అలాగే కానివ్వండి. నేను వాళ్ళను సంహరిస్తాను. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి. లోకాలన్నిటికీ పశుత్వం సహజం - నాకు పశుపతిత్వం కలగాలి. అలా అయితే పశువుల్ని చంపినా పాపం వుండదు. దివ్య రథం తయారుచేయండి. దానికి తగిన సారధినీ, విల్లమ్ములనూ తీసుకురండి" అన్నాడు శివుడు. తమకందరికీ పశుత్వం కలగడాన్ని గురించి దేవతలు విచారిస్తుంటే వాళ్ళ మనస్సు గ్రహించి "భయపడకండి! పాశుపతవ్రతం చేస్తే పశుత్వం పోతుంది" అని అభయమిచ్చాడు శివుడు. అప్పుడు దేవతలంతా తృప్తి పడి పరమేశ్వరుణ్ణి 'పశుపతి' అని స్తుతించారు. తమ తమ తేజోబలాలు సగం ధారపోసి ఆయనకు అభిషేకం చాశారు. విశ్వకర్మ దివ్య రథం తయారు చేశాడు.

"నా రథానికి సారథి ఎవరు?" అని అడిగాడు భవుడు.

"మీ ఇష్టం" అన్నారు దేవతలు.

"అలా కాదు. నాకంటే గొప్పవాణ్ణి సారథిగా మీరే నిర్ణయించండి" అని ముక్కంటి అనగానే దేవతలూ, మునులూ బ్రహ్మ దేవుడి వైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేశారు.

"శక్తి , చాతుర్యం కలిగిన సారథి రథికుణ్ణి తప్పకుండా గెలిపిస్తాడు. ఇంతగొప్ప రథానికి నీవంటి వాడు తప్ప మరొకడు సారథ్యం చెయ్యలేడు. ఇందుకు నువ్వు అంగీకరించాలి" అన్నాడు శివుడు బ్రహ్మదేవుడితో.

చేతిలో వున్న కమండలం పక్కన పెట్టి, జడ ముడి బిగించి, ఓంకారాన్ని ములుకోలగా చేసుకుని రథమెక్కాడు బ్రహ్మ. శివుడు రుద్రుడై నారి సారించి, పాశుపతాస్త్రంతో సహా నారాయణాస్రాన్ని సంధించి ఆ మూడు పట్టణాల్నీ మనస్సులో నిలిపాడు. మరుక్షణం ఆ మూడూ ఒక్కచోటుకు చేరాయి. ఆశ్వరుడు బాణం విడవడం, ఆ మూడు పట్టణాలూ బూడిదై పశ్చిమ సముద్రంలో కలవడం కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయాయి. అప్పుడు సకల లోకాలూ సంతోషంతో మహాదేవుణ్ణి స్తుతించాయి.

మహాభారత యుద్ధంలో తనంతటి వాడు కర్ణుడికి సారథిగా వుండటమేమిటని శల్యుడు భీష్మించిన సందర్భంలో యీ కథ చెబుతూ కౌరవాగ్రజుడు, "మహాత్మా! విన్నావా! లోకహితం కోరి పరమేష్టి అంతటివాడు శివుడికి సారథ్యం చేశాడు. అలాగే ఇప్పుడు నాకోసం నువ్వు కర్ణుడికి సారథ్యం వహించు. నా గౌరవం కాపాడు. నన్ను రక్షించు. సారథి రథికుడి కంటే గొప్పవాడు కావాలనే నీతి నీ దయవల్ల నాకు సిద్ధింపచెయ్యి" అని శల్యుణ్ణి ప్రార్థించి ఒప్పించాడు.