Pages

Monday, 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- రుక్మి


కురుపాండవ సంగ్రామంలో ఎవరి పక్షానా చేరకుండా ఉండిపోయింది ఇద్దరే ఇద్దరు. ఒకరు బలరాముడు, మరొకరు రుక్మి. బలరాముడికి మహాజన క్షయకరమైన కురుపాండవ యుద్ధం ఇష్టం లేదు. ఈ అభిప్రాయాన్ని ఆయన కృష్ణుడి ఎదుట చాలా సార్లు వ్యక్తం చేశాడు. బంధుమిత్రులూ, క్షత్రియులూ అందరూ క్షేమంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కాని తమ్ముడు ఏ పనిచేస్తే దానినే బలరాముడు అంగీకరిస్తాడు. తమ్ముడంటే ఆయనకు అంత ప్రేమ, అభిమానం, గౌరవం. అలా అని కౌరవులు రణభూమిలో కూలిపోవడం కూడా ఆయన సహించలేడు. అన్నదమ్ములు ఒకరి నొకరు చంపుకోవాలనుకోవడం ఆయనకు బాధ కలిగించింది. అందుకే తీర్థయాత్రల పేరుతో సరస్వతీ నదీ తీరానికి వెళ్ళిపోయాడు.

భీష్మక మహారాజు కుమారుడు రుక్మి మహా పరాక్రమవంతుడు. ఇంద్రుడికి ప్రాణస్నేహితుడు. ఇతన్నే హిరణ్యరోముడని కూడా పిలుస్తారు. రుక్మిణీదేవికి స్వయంగా అన్నగారు. గంధమాదన పర్వతం మీద వున్న ద్రుముడనే కింపురుషుడి అనుగ్రహం వల్ల 'విజయం ' అనే దివ్య ధనస్సు సంపాదించాడు.

లోకంలో శ్రేష్ఠమైన దివ్య ధనస్సులు మూడే ఉన్నాయి. దేవతల ధనస్సులేవీ వాటితో సాటిరావు. వాటిలో ఒకటి విష్ణుమూర్తి శార్ఞం అనే ధనువు. శత్రువులకు దానిపేరు చెబితేనే నిద్రహారాలుండవు. శ్రీ కృష్ణుడు దానిని ధరించాడు. మరొకటి గాండీవం. ఖాండవ వనదహన సందర్భంలో అగ్నిదేవుడు అర్జునుడికీ ధనస్సు ఇచ్చాడు. ఇక మూడోవది విజయం. ద్రుముణ్ణి ఆరాధించి రుక్మి అతని దగ్గర శస్త్రాస్త్ర విద్యలు అనేకం అభ్యసించాడు. మేఘగర్జనవలె ధ్వనించే విజయ నామక చాపాన్ని అతనినుండి సంపాదించాడు రుక్మి. రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడానికి శ్రీ కృష్ణుడు ఆమెను రథం మీద తీసుకుపోతుంటే రుక్మి బలగర్వితుడై డాంబికాలు పలుకుతూ కృష్ణుణ్ణి ఎదిరించి నిందారోపణలు చేశాడు. తీరా కృష్ణుడు రథం నిలిపి బలాబలాలు చూసుకుందాం రమ్మని పిలిస్తే ఎదుర్కోలేక అవమానాలపాలయ్యాడు.

కురుపాండవ సంగ్రామం జరగబోతోందని తెలిసి ఒక అక్షౌహిణి సేనతో పాండవుల దగ్గరకు వెళ్ళాడు రుక్మి. పాండవులు అతన్ని సాదరంగా ఆహ్వానించి గౌరవించారు. అతిథి సత్కారాలు అందుకున్నాకా రుక్మి అందరూ వింటూవుండగా పార్థుణ్ణి పిలిచి, "అర్జునా! రాబోయే సంగ్రామం గురించి బాధపడుతున్నావేమో! నేను నీకు అండగా ఉంటాను. నా అండదండల వల్ల నీకు విజయం తథ్యం. నన్ను మించిన పరాక్రమవంతుడు లేడు. పైగా నా దగ్గర తేజోమయమయిన ధనస్సు ఉంది. దానితో ద్రోణ, భీష్మ, కృపాచార్యాది కౌరవులను క్షణాల్లో మట్టి కరిపిస్తాను. ఈ రాజ్యం నీ వశం చేస్తాను. సరేనా" అన్నాడు.

అర్జునుడు నవ్వుకున్నాడు.

కృష్ణుడూ, ధర్మరాజూ వుండగా ఏమిటీ బీరాలు పలకటమని అందరూ చెవులు కొరుక్కున్నారు.

"ఓయీ! వీరాధివీరా! మాకు సాయం చేస్తానని ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే కృష్ణుడు మాకు ఎల్లవేళలా సాయంగా ఉంటాడన్న సంగతి మాత్రం మర్చిపోకు. ఆయన సాయం వుంటే ఇంకెవరి అండదండలూ అక్కర్లేదు మాకు. పైగా నా చేతిలో గాండీవం ఉంది. సాక్షాత్తూ ఇంద్రుడే వజ్రాయుధం ధరించి వచ్చినప్పటికీ నేను భయపడను" అన్నాడు అర్జునుడు రుక్మితో.

ఆ మాటలు రుక్మికి కోపం తెప్పించాయి. వెంటనే తన సైన్యాన్ని తీసుకుని సుయోధన సార్వభౌముడి దగ్గరకు వెళ్ళాడు.

"రాబోయే కురుపాండవ యుద్ధంలో నేను మీ పక్షం ఉంటాను, మీ విజయానికి నేను తోడ్పడతాను. పాండవుల పొగరు అణుద్దాం. నా చాపంతో వాళ్ళందర్నీ స్వర్గం చేరుస్తాను. నా ప్రతాపం చూపిస్తాను" అన్నాడు.

అయితే సుయోధనుడు కూడా అభిమానం కలవాడు. అతను కూడా రుక్మి సహాయం అక్కర్లేదని మంచిగా చెప్పాడు.

రుక్మి సిగ్గుపడ్డాడు.

దుర్యోధనుడు కూడా తిరస్కరించాకా వచ్చినదారినే తన నగరానికి తిరిగి వెళ్ళాడు.

తన శక్తియుక్తుల్ని అధికంగా ఊహించుకోవడం, ఎదుటివారి తెలివితేటల్నీ, శక్తినీ తక్కువుగా అంచనా వేయడం ఎవరికీ మంచిది కాదు.

రుక్మికి ఈ అలవాటు మొదటినుంచీ ఉంది. అందుకే అనేకసార్లు పరాభవాలు పొందాడు.