Pages

Monday, 20 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- అహం వినాశకారి


పిల్లలు చిన్న తనం నుంచీ విధేయతలు నేర్చుకోవాలి. మర్యాద తప్పకూడదు.

మనకంటే గొప్పవాళ్ళు లేరని విర్రవీగకూడదు.

పెద్దల యెడ భయభక్తులు కలిగి ఉండాలి.

మనిషిలో గర్వం పెరిగితే ఎప్పుడో ఒకప్పుడు దెబ్బతింటాడు.

భరద్వాజమహర్షి కుమారుడు యవక్రీతుడు. వేద విద్యలన్నీ నేర్చుకున్నాడు. గొప్ప పండితుడయ్యాడు.

' నేను గదా తపస్సు చేసి ఇంద్రుడి వల్ల వరం సంపాదించి ఇంత పాండిత్యం పొందాను ' అని ఎప్పుడూ గర్వపడుతూ ఉండేవాడు. కమారుడి ప్రవర్తన భరద్వాజుడికి నచ్చేది కాదు. తన స్నేహితుడు రైభ్యుడితోను, అతని పిల్లలతోనూ ఏ క్షణాన తగాదా పెట్టుకుని విరోధం తెచ్చుకుంటాడో అని భయపడేవాడు. ఆ భయం కారణంగానే ఒక రోజు భరద్వాజుడు కుమారుడికో కథ చెప్పాడు. అదేమంటే...

అప్పుడెప్పుడో చాలా ఏళ్ళ క్రితం బాలదిహి అనే ఒక ముని ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. పాపం ఆ కొడుకు కాస్తా ఉన్నట్టుండి చనిపోయాడు. దాంతో ఆ ముని చాలా దఃఖపడ్డాడు. ఈ సారి చావు లేని కుమారుణ్ణి పొందాలనుకుని ఘోర తపస్సు చేసాడు.

" మనిషై పుట్టాకా ఎప్పుడో ఒకప్పుడు చనిపోవల్సిందే. అసలు చావే లేకుండా వరం పొందటం కుదరదు. అందుచేత ఈ సారి నీకు పుట్టబోయే కొడుకు ఎన్నాళ్ళు జీవించాలనుకూంటున్నావో చెప్పు, అన్నేళ్ళు ఆయుష్షు ఇస్తాం" అన్నారు దేవతలు.

" సరే! అలాగైతే - అదిగో ఆ ఎదురుగా కొండ ఉందే- అది ఉన్నంతకాలం నా బంగారుకొండ బతికుండాలి" అని బాలదిహి కోరుకున్నాడు. దేవతలు అలాగే వరం ఇచ్చారు. తరువాత వరప్రభావంతో మునికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి "మేధావి" అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచాడు ముని.

' నా ప్రాణానికి ముప్పు లేదు. కొండలాగా స్థిరంగా ఎంత కాలమైనా బతకొచ్చు ' అనే గర్వం కలిగింది మేధావికి. దాంతో పెద్దాచిన్నా తారతమ్యం లేకుండా అందరితోనూ పొగరుగా ప్రవర్తించేవాడు.

ఒకరోజు ధనుసాక్షరి అనే మహాత్ముణ్ణి మేధావి తూలనాడాడు. అతని పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. ధనుసాక్షరి భగ్గున మండిపడి, " నీవు భస్మమైపోతావు పో!" అని శపించాడు.

కాని మేధావికి శాపం తగల్లేదు.

కొండలా ఉన్నాడు.

అప్పుడు ధనుసాక్షరి మేధావికి గల వరాన్ని జ్ఞాపకం తెచ్చుకుని వెంటనే తపోమహిమ వల్ల తానొక అడవి దన్నుగా మారిపోయి కొండను దభీమని ఢీకొట్టి దాన్ని బద్దలు చేసాడు. కొండ చీలిపోతూనే మేధావి తల కూడా రెండు ముక్కలైంది.

ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసిన విషయాలు చాలా వున్నాయి.

వరాలు పొందామని ఎప్పుడూ గర్వపడకూడదు ;

పెద్దల్ని యిష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. అందర్నీ గౌరవించడం నేర్చుకోవాలి.

ఇదీ భరద్వాజుడు కొడిక్కి చెప్పింది.