Pages

Monday, 20 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- కర్ణుడి శాపాలు




భీష్మద్రోణులు వీరస్వర్గం పొందినా మిగిలిన కొంచెం సైన్యంతోనే పాండవుల్ని దుర్యోధనుడు గెలవాలనుకోవడం కేవలం కర్ణుణ్ణి నమ్ముకునే! కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడిని ధనుంజయుడికి ప్రతివీరుడుగా నిర్ణయించారు. సవ్యసాచి రథ సారథి కృష్ణుడు . అందుచేత యుద్ధచాతుర్యంలో, అశ్వజ్ఞానంలో కృష్ణుడితో సమానమైన శల్యుణ్ణి కౌరవులు కృష్ణుడికి ప్రతిగా, రాధేయుడికి సారథిగా నిలిపారు. శత్రువులకు హృదయశల్యంగా ఉంటాడు కనుక ఆయనకు ' శల్యుడని ' పేరు వచ్చింది.

"హితం చెప్పవలసి వచ్చినపుడు పొగడడమూ, నిందించడమూ కూడా జరుగుతుంది. నువ్వు బుద్ధి కలిగి అన్నీ ఓర్చుకోవాలి. దేవేంద్రుడి రథం కూడా నడపగలిగినవాడ్ని నేను. తగిన సలహా చెబుతూ నువ్వెప్పుడూ ఏమరకుండా చూస్తాను. అందుకు ఇష్టమైతే చెప్పు" అన్నాడు శల్యుడు కర్ణుడితో.

కర్ణుడు సరేనన్నాడు.

శల్య సారథ్యంతో కర్ణరథం యుద్ధభూమికి బయలుదేరింది. రథచక్రం యుద్ధభూమిని తాకుతూనే కర్ణుణ్ణి చూసి కౌరవ బలమంతా సంతోషంతో పొంగింది. సింహనాదాలు చేసింది. అది చూసి కర్ణుడు అతిశయంతో, " నేను విల్లంది విక్రమించానంటే దేవేంద్రుణ్ణయినా గడ్డిపరకతో సమానంగా చూస్తాను. అలాంటిది పాండుకుమారులో లెక్కా! దేవతలడ్డుపడినా సరే - ఒక్క చేత్తో ఆ ధనుంజయుణ్ణి చంపి తీరుతాను" అన్నాడు.

" ఊరుకో! ఊరుకో! ఉతుత్తి ప్రగల్భాలు పలకకు. కృష్ణార్జునులను ఒంటరిగా ఎదిరించడం ముక్కంటికి కూడా సాధ్యం కాదు. నామాట విని తగిన యోధుల్ని సాయం తీసుకుని మరీ వెళ్ళు" అన్నాడు శల్యుడు.

" నువ్వెన్ని చెప్పినా మానను. ఈ రోజు వాళ్ళో నేనో ఎవరో ఒక్కరమే మిగులుతాం" అని చుట్టూ ఉన్న రాజులందర్నీ చూసి కర్ణుడు మళ్ళీ శల్యుడితో ఇలా చెప్పాడు.

"తలచుకుంటే మనస్సుని నలిపేటంత బాధ కలిగించేవి రెండే రెండున్నాయి! అవి పరశురాముడి కోపమూ, బ్రాహ్మణుని శాపమూను! అవే లేకపోతే నేను కృష్ణార్జునుల్ని లెక్కచేస్తానా?

" నేను విలువిద్య నేర్చుకోవడం కోసం పరశురాముని ప్రార్ధించేందుకు మహేంద్ర పర్వతానికి వెళ్ళాను. ఆ మహాముని దయాసముద్రుడు. నా విన్నపాన్ని మన్నించి, నా కులాన్ని గురించి అడిగారు. బ్రహ్మాస్త్రం కోసమని నేను బ్రాహ్మణుడనని చెప్పాను. ఆయన నమ్మారు. నేను ఆయనను భక్తితో సేవిస్తూ వచ్చాను. నా సేవకు మెచ్చుకుని ఆయన బ్రహ్మాస్త్రం ఇచ్చి ఆపద సమయంలో తప్ప ప్రయోగించవద్దని చెప్పారు. ఆ మరునాడు ఆయన నా తొడ మీద తల పెట్టుకుని నిద్రపోతుంటే ఏదో పురుగు నా తొడ కింద చేరి తొలవడం ప్రారంభించింది! కదిలితే ఆ మహానుభావుడికి నిద్రాభంగం కలుగుతుందని అలాగే ఓర్చుకుని కూర్చున్నాను. తర్వాత కాసేపటికి ఆయన మేల్కొని నెత్తురు ప్రవాహం చూసి , ఆశ్చర్యపడి నా వైపు చూశారు. నేను జరిగిన దంతా చెప్పాను. అది విని నా ఓర్పుకి, ధైర్యానికి ఆశ్చర్యపడి ' నువ్వు బ్రాహ్మణుడవు కావు. బ్రాహ్మణుడవైతే ఇంత ఓర్పుండదు. నువ్వెవరు? నిజం చెప్పు ' అని గర్జించాడు. భయపడిపోయి శూద్రుడనని చెప్పేశాను. ఆయన కోపించి, ' కపటంగా బ్రహ్మాస్త్రం గ్రహించావు కనుక అది నీకు అవసరమైనప్పుడు స్ఫురించకుండా వుండుగాక ' అని శపించాడు.

ఇంక బ్రాహ్మణ శాపం సంగతి చెబుతా వినండి--

" ఒక నాడు నేను విలువిద్య పరిశ్రమ చేసుకుంటుంటే హఠాత్తుగా ఒక ఆవుదూడ అడ్డం వచ్చింది! కర్మవశాన నా బాణం దెబ్బకు అది ప్రాణం విడిచింది. దాని యజమాని అది చూసి మండిపడ్డాడు. ' ఇది హొమధేనువు దూడ. నిష్కారణంగా దీన్ని శల్యంతో చంపావు. నువ్వు పొంగిపొరలే ఉత్సాహంతో పట్టుదలగా యుద్ధం చేసే సమయంలో నీ రథచక్రం భూమిలో దిగబడుగాక! ఎవరిని ఎదుర్కొని చంపాలని ఇంత పరిశ్రమ చేస్తున్నావో వాళ్ళ చేతుల్లోనే నీకు చావు మూడుతుంది ' అని శపించాడు.

' అయ్యా! పొరపాటున ఇలా జరిగిపోయింది. నీకు వెయ్యి ఆవులూ, ఆరు వందల ఎడ్లూ, వంద రథాలు, వందమంది కన్యలూ, ఏడు వందల ఏనుగులూ ఇస్తాను . శాంతించి శాపం ఉపశమింప చెయ్యి ' అని వేడుకున్నా ఆయన కోపం చల్లారలేదు. విసవిసా నాలుగడుగులు నడిచి, వెనక్కు తిరిగి, ' నువ్వు చేసిన పాపం నిన్ను పరలోకంలో బాధించకుండా నీకిదే ప్రాయశ్చిత్తం అవుతుంది ఫో ' అన్నాడు.

" ఉన్న సంగతి చెప్పేశాను. ఇవీ నన్ను బాధిస్తున్న శాపాలు" అన్నాడు కర్ణుడు.

చేవ లేక చచ్చాడని ఎవరూ అనుకోకుండా ఇప్పుడీ రాజులందరికీ ఈ శాపగాథలు చెప్పాడు కాబోలనుకుని శల్యుడు చిన్నగా నవ్వి రథాన్ని అర్జునుడివైపు మళ్ళించాడు.