Pages

Monday, 20 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- కర్ణుడు


కుంతీదేవి యదువంశీయుడైన శూరసేనుని కుమార్తె. కుంతిభోజుడి దత్తపుత్రిక. కుంతిభోజుడి ఇంటి దగ్గర పెరుగుతున్న రోజులలోనే కుంతి దుర్వాసమహర్షిని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రురాలైంది. అప్పుడాయన ఆమెకో మంత్రం ఉపదేశించి ఆ మంత్ర జపంతో ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దైవం వచ్చి సంతానాన్ని అనుగ్రహిస్తాడని చెప్పాడు.

మంత్ర మహిమను పరీక్షించాలన్న చాపల్యంతో కుంతి ఆ మంత్రం జపించి సూర్యుణ్ణి ఆహ్వానించింది. సూర్యుడు దివ్యతేజస్సుతో ఆమె ఎదుట సాక్షాత్కరించాడు. కుంతి భయపడిపోయి " స్వామీ! నన్ను మన్నిచండి. ఆకతాయితనంతో మహర్షి మంత్ర ప్రభావం పరీక్షిద్దామని పిలిచాను. క్షమించి మీరు వెళ్ళిపోండి" అంది.

సూర్యుడు నవ్వి, " కుమారీ! మంత్ర శక్తి వృథా కాదు. నువ్వేమీ భయపడకు. నా వల్ల కలిగే కుమారుడు సహజ కవచకుండల శోభితుడై, మహాదాతగా, తేజశ్శౌర్యగాంభీర్యధైర్యాలలో తనకు తానే సాటిగా ప్రఖ్యాతుడవుతాడు" అంటూ కుంతిని సమీపించాడు. ఫలితంగా ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. అతనే కర్ణుడు.

కన్యాత్వానికి అపప్రధ వాటిల్లుతుందన్న భయంతో కుంతి ఆ పసివాణ్ణి గంగలో విడిచింది. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆ బాలుణ్ణి అతిరథుడనే సూతుడు, అతని భార్య రాధ పెంచి పెద్దవాణ్ణి చేశారు. ఊహ తెలిసిన దగ్గర్నుంచి ఎవరు ఏది దానం అడిగినా లేదనకుండా ఆ బాలుడు సంతృప్తి పరచి పంపుతున్నాడు. కర్ణుడి దాన గుణం జగద్విఖ్యాతమవుతోంది.

ఈ సూర్యపుత్రుడి వల్ల తన కుమారుడైన అర్జునుడికి ముందు ముందు ఆపద రాబోతోందని గ్రహించిన దేవేంద్రుడు ఒకనాడు పేద బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి దగ్గరకు వెళ్ళి అతడి కవచకుండలాలు దానం ఇమ్మని అర్థించాడు. ఇలాంటి మోసమేదో జరుగుతుందని ఊహించిన సూర్యుడు , " దేవేంద్రుడు విప్రరూపంలో వచ్చి నీ కవచకుండలాలు ఇమ్మంటాడు. అవి మాత్రం ఇవ్వకు" అని కుమారుణ్ణి ముందుగానే హెచ్చరించాడు. కాని, సహజ దానశీల అయిన కర్ణుడు తన ప్రత్యర్థి అర్జునుడికి మేలు జరుగుతుందని తెలిసినప్పటికీ జంకలేదు. వెంటనే కత్తితో కోసి తన కవచాన్ని , కుండలాల్ని ఇచ్చేశాడు.

దేవేంద్రుడు దిగ్ర్భాంతి చెంది వరం కోరుకొమ్మనగా ఆ పసివాడు, " దేవరాజా! ఎంతటి శత్రువులనైనా సరే అవలీలగా చంపగల మీ శక్తి ఆయుధాన్ని అనుగ్రహించండి" అని అడిగాడు.

" అలాగే తీసుకో! కాని ఒక్క మాట! యుద్ధంలో నీవీ శక్తిని ప్రయోగిస్తే ఎటువంటివాణ్ణయినా సరే యిది సంహరిస్తుంది. అయితే ఒక్కణ్ణే చంపుతుంది. మరుక్షణం మళ్ళీ ఈ ఆయుధం నా దగ్గరకు వచ్చేస్తుంది" అని చెప్పి ఇంద్రుడు అంతర్థానమయ్యాడు.

ఇలా వుండగా దుర్యోధన సోదరులకు, పాండవులకు ద్రోణాచార్యుల వారు ఒక నాడు ధనుర్విద్యలో పోటీలు నిర్వహించారు. ఆ పోటీలు చూడటానికి హస్తినాపురంలోని జనమంతా వచ్చారు. అందరిలోకీ అర్జునుడు చూపిన ధనుర్విద్యాకౌశలం ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది. ద్రోణుడు ప్రియశిష్యుణ్ణి గాఢాలింగనం చేసుకున్నా డు. దుర్యోధనుడు ఓర్వలేకపోయాడు. ఇంతలో కర్ణుడు మత్తగజంలా అడుగులు వేస్తూ సభామధ్యానికి వచ్చి " అర్జునా! ఈ పాటి విద్యలు నేనూ ప్రదర్సించగలను. కావాలంటే అంతకంటే గొప్పవిద్యలు కూడా చేసి చూపిస్తాను ధైర్యముంటే ముందుకురా" అని సవాలు చేశాడు.

ఆ మాటలు వినగానే నిశ్చేష్టులయ్యారు ప్రేక్షకులు. అసూయతో రగిలిపోతున్న దుర్యోధనుడి మనస్సు మాత్రం ఆనందంతో పరవళ్ళు తొక్కింది. ద్రోణుడు కర్ణుణ్ణి చూసి, " నాయనా ! ద్వంద్వ యుద్దానికి దిగేవారి కులశీలాలు సమానం కావాలి. అర్జునుడు పాండురాజునందనుడు! కుంతీకుమారుడు , కురు వంశీయుడు. మరి నువ్వు ఏ రాజ వంశానికి చెందినవాడవో, నీ తల్లిదండ్రులెవరో చెప్పి ముందుకురా. కులం, కులాచారం తెలియందే రాజకుమారులు సమయుద్దం చెయ్యరు" అని అన్నాడు.

ఆ మాటలు వినగానే కర్ణుడు తల వాల్చుకున్నాడు.

అప్పుడు దుర్యోధనుడు లేచి " ఆచార్యా! మీరు ఆదేశించినట్టు కర్ణుడు రాజయితే తప్ప అర్జునుడితో యుద్ధానికి దిగడానికి అవకాశం లేకపోతే ఈ క్షణమే కర్ణుణ్ణి నేను రాజును చేస్తాను" అని ప్రకటన చేశాడు. ఆ వెంటనే పవిత్రజలాలు, రత్నకిరీటం, కనకాంగద కేయూరాలు, వడ్డాణాలు, రత్నహారాలు, తెప్పించి కర్ణుణ్ణి అంగరాజ్యానికి ప్రభువును చేశాడు.

సంతోషం పట్టలేక కర్ణుడు సుయోధన చక్రవర్తిని గాఢాలింగనం చేసుకుని, " ఈ జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను. మీ ఆజ్ఞ నాకు ఎల్లవేళలా శిరోధార్యం" అని వినయంగా అన్నాడు.

కొడుకు రాజయిన సంగతి తెలుసుకుని సూతుడు వచ్చాడక్కడికి . కర్ణుడు సింహాసనం దిగివచ్చి పితృభక్తితో నమస్కరించాడు.

భీమసేనుడు అది చూసి హేళనగా " ఓహొ! నువ్వు సూతపుత్రుడవా! ఇంకేం? కొరడా చేతపట్టి గుర్రాలు తోలుకో! అర్జునుడితో యుద్ధమేం చేస్తావు?" అన్నాడు.

సభలో కలకలం బయలు దేరింది.

సూర్యాస్తమయం కావడంతో వెలుతురు కూడా తగ్గింది.

ఆ నాటికి విద్యా ప్రదర్సన కూడా ఆగింది. కర్ణుడి చెయ్యి పుచ్చుకుని దుర్యోధనుడు నిష్క్రమించాడు