Pages

Saturday, 8 August 2015

దైవాసురసంపద్విభాగయోగః 1 ( అథ షోడశోధ్యాయః, భగవద్గీత) -శ్రీ భగవద్గీత



శ్రీ భగవవానువాచ:-

అభయం సత్త్వసంశుద్ధి
ర్జ్ఞానయోగవ్యవస్థితిః,
దానం దమశ్చ యజ్ఞశ్చ
స్వాధ్యాయస్తప ఆర్జవమ్‌.

అహింసా సత్యమక్రోధ
స్త్యాగశ్శాంతిరపైశునమ్‌,
దయా భూతేష్వలోలత్వం
మార్దవం హ్రీరచాపలమ్‌.

తేజః క్షమాధృతిశ్శౌచ
మద్రోహో నాతిమానితా,
భవంతి సంపదం దైవీ
మభిజాతస్య భారత.


శ్రీ భగవంతుడు చెప్పెను:- ఓ అర్జునా! 1. భయములేకుండుట, 2. అంతఃకరణశుద్ధి, 3. జ్ఞానయోగమునందుండుట, 4. దానము, 5. బాహ్యేంద్రియనిగ్రహము, 6. (జ్ఞాన) యజ్ఞము, 7. వేదశాస్త్రాదుల అధ్యయనము, 8. తపస్సు, 9. ఋజుత్వము (కపటము లేకుండుట), 10. ఏ ప్రాణికిన్ని బాధ గలుగజేయకుండుట (అహింస), 11. సద్వస్తువగు పరమాత్మ నాశ్రయించుట లేక నిజము పలుకుట (సత్యము), 12. కోపము లేకుండుట, 13. త్యాగబుద్ధి గలిగియుండుట, 14. శాంతిస్వభావము, 15. కొండెములు చెప్పకుండుట, 16. ప్రాణులందు దయగలిగియుండుట, 17. విషయలోలత్వము లేకుండుట, అనగా విషయములందాసక్తి లేకుండుట వానిచే చలింపకుండుటయు, 18. మృదుత్వము (క్రౌర్యము లేకుండుట), 19. (ధర్మవిరుద్ధకార్యములందు) సిగ్గు, 20. చంచల స్వభావము లేకుండుట, 21. ప్రతిభ (లేక, బ్రహ్మతేజస్సు), 22. ఓర్పు, (కష్టసహిష్ణుత), 23. ధైర్యము, 24. బాహ్యాభ్యంతర శుచిత్వము, 25. ఎవనికిని ద్రోహము చేయకుండుట, ద్రోహచింతనము లేకుండుట, 26. స్వాతిశయము లేకుండుట (తాను పూజింపదగిన వాడనను అభిమానము గర్వము లేకుండుట), అను నీ సుగుణములు దైవసంపత్తియందు పుట్టిన వానికి కలుగుచున్నవి. (అనగా దైవసంపత్తిని పొందదగి పుట్టినవానికి కలుగుచున్నవని భావము.) .

******************************************************************************************* 1,2,3

దంభోదర్పోభిమానశ్చ
క్రోధః పారుష్యమేవ చ,
అజ్ఞానం చాభిజాతస్య
పార్థ సంపదమాసురీమ్‌.


ఓ అర్జునా! డంబము, గర్వము, అభిమానము (దురహంకారము), కోపము, (వాక్కు మున్నగువాని యందు) కాఠిన్యము, అవివేకము అను ఈ దుర్గుణములు అసురసంపత్తియందు పుట్టినవానికి కలుగుచున్నవి. (అనగా అసురసంపత్తిని పొందదగి జన్మించిన వారికి కలుగుచున్నవని భావము.).

******************************************************************************************* 4

దైవీసంపద్విమోక్షాయ
నిబంధాయాసురీ మతా,
మాశుచః సంపదం దైవీ
మభిజాతోసి పాణ్డవ.


ఓ అర్జునా! దైవీసంపద పరిపూర్ణ (సంసార) బంధనివృత్తిని, ఆసురీసంపద గొప్ప (సంసార) బంధమును గలుగజేయునని నిశ్చయింపబడినది. నీవు దైవీ సంపదయందే (దైవీసంపదను బొందదగియే) జన్మించినాడవు కావున శోకింప నవసరము లేదు.

******************************************************************************************* 5

ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్‌
దైవ ఆసుర ఏవ చ,
దైవో విస్తరశః ప్రోక్త
ఆసురం పార్థ మే శృణు.


ఓ అర్జునా! ఈ ప్రపంచమున దైవసంబధమైన గుణము కలదియని, అసురసంబంధమైన గుణము కలదియని రెండు విధములగు ప్రాణుల సృష్టులు కలవు. అందు దైవీసంబంధమైన దానిని గూర్చి నీకు సవిస్తరముగ తెలిపితిని. ఇక అసురసంబంధమైన దానిని గూర్చి నావలన వినుము.

******************************************************************************************* 6

ప్రవృత్తిం చ నివృత్తిం చ
జనా న విదురాసురాః,
న శౌచం నాపి చాచారో
న సత్యం తేషు విద్యతే‌.


అసురస్వభావముగల జనులు ధర్మప్రవృత్తినిగాని, అధర్మనివృత్తినిగాని యెఱుగరు. వారియందు శుచిత్వముగాని, ఆచారము (సత్కర్మానుష్టానము) గాని, సత్యముగాని యుండదు.

******************************************************************************************* 7

అసత్యమప్రతిష్ఠం తే
జగదాహురనీశ్వరమ్‌,
అపరస్పరసంభూతం
కిమన్యత్కామహైతుకమ్‌‌.


వారు జగత్తు అసత్యమనియు (వేదాదిప్రమణరహితమనియు), ప్రతిష్ట (ధర్మాధర్మవ్యవస్థలు) లేనిదనియు (కర్తయగు) ఈశ్వరుడు లేనిదనియు, కామమే హేతువుగాగలదై స్త్రీపురుషుల యొక్క పరస్పరసంబంధముచేతనే కలిగినదనియు, అదియుగాక ఈ జగత్తునకు వేఱుకారణమేమియులేదనియు చెప్పుదురు.

******************************************************************************************* 8

ఏతాం దృష్టి మవష్టభ్య
నష్టాత్మానోల్పబుద్ధయః,
ప్రభవంత్యుగ్రకర్మాణః
క్షయాయ జగతోహితాః.


(వారు) ఇట్టి నాస్తిక దృష్టిని అవలంబించి, చెడిన మనస్సు గలవారును, అల్పబుద్ధితో గూడియున్న వారును, క్రూరకార్యములను జేయువారును (జగత్తునకు) శత్రువులును (లోకకంటకులును) అయి ప్రపంచము యొక్క వినాశము కొఱకు పుట్టుచున్నారు.

******************************************************************************************* 9