Pages

Saturday, 8 August 2015

విశ్వరూపసందర్శనయోగః 3 (అథ ఏకాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

అనాది మధ్యాంత మనంతవీర్య
మనంతబాహుం శశిసూర్యనేత్రమ్‌,
పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపంతమ్‌.


ఆదిమధ్యాంతరహితులుగను, అపరిమిత సామర్థ్యము గలవారుగను, అనేక హస్తములు గల వారుగను, చంద్రసూర్యులు నేత్రములుగ గలవారును, ప్రజ్వలించు అగ్నిహోత్రునివంటి ముఖము గలవారుగను, స్వకీయ తేజస్సుచే ఈ ప్రపంచమునంతను తపింపజేయుచున్న వారుగను మిమ్ము చూచుచున్నాను.

******************************************************************************************* 19

ద్యావాపృథివ్యోరిదమంతరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చసర్వాః,
దృష్ట్వాద్భుతంరూపముగ్రంతవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్‌.


ఓ మహాత్మా! భూమ్యాకాశముల యొక్క ఈ మధ్య ప్రదేశమంతయును, దిక్కులన్నియును మీయొక్కరి చేతనే వ్యాపింపబడి యున్నవిగదా! మఱియు భయంకరమైనదియు ఆశ్చర్యకరమైనదియునగు మీ యీ రూపమును జూచి ముల్లోకములున్ను మిగుల భీతిని బొందియున్నవి.

******************************************************************************************* 20

అమీ హి త్వాం సురసజ్ఘా విశంతి
కేచిద్భీతాః ప్రాఞ్జలయో గృణంతి
స్వస్తీత్యుక్త్వా మహర్షి సిద్ధసజ్ఘాః
స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః.


ఈ దేవతాసమూహములు మీయందు ప్రవేశించుచున్నవి. (మరి) కొందరు భీతిల్లి చేతులుజోడించుకొని మిమ్ము స్తుతించుచున్నారు. మహర్షులయొక్కయు, సిద్ధులయొక్కయు, సమూహములు లోకమునకు క్షేమమగుగాక!' యని పలికి సంపూర్ణములగు స్తోత్రముల చేత మిమ్ము పొగుడుచున్నారు.

*******************************************************************************************  21

రుద్రాదిత్యావసవో యే చ సాధ్యా
విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ
గంధర్వయక్షాసురసిద్ధసజ్ఘా 
వీక్షంతేత్వాం విస్మితాశ్చైవ సర్వే.


రుద్రులును, సూర్యులును, వసువులును, సాధ్యులును, విశ్వేదేవతలును, అశ్వినీదేవతలును, గంధర్వుల యొక్కయు, యక్షులయొక్కయు, అసురులయొక్కయు, సిద్ధులయొక్కయు సంఘములును వీరందరున్ను ఆశ్చర్యచకితులై మిమ్ము చూచుచున్నారు.

******************************************************************************************* 22

రూపం మహత్తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబాహూరు పాదమ్‌,
బహూదరం బహుదం ష్ట్రాకరాలం
దృష్ట్వా లోకాః ప్రవ్యథితా స్తథాహమ్‌‌.


గొప్ప భుజములు గల ఓ కృష్ణా! అనేక ముఖములు, నేత్రములు గలిగినట్టియు, అనేకములగు హస్తములు, తొడలు, పాదములు గలిగినట్టియు, పెక్కు కడుపులు గలిగినట్టియు, అనేకములైన కోరలచే భయంకరమైనట్టియు, మీ యొక్క గొప్ప రూపములను జూచి జనులందరును మిగుల భయపడుచున్నారు. నేనున్ను అట్లే భయపడుచున్నాను.

*******************************************************************************************  23

నభః స్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్‌
దృష్ట్వాహి త్వాం ప్రవ్యథితాంతరాత్మా
ధృతిం న విందామి శమం చ విష్ణో.


ఓ విష్ణుమూర్తీ! ఆకాశమును తాకుచున్నవారును, ప్రకాశించుచున్న వారును, పెక్కురంగులు గల వారును, తెరవబడిన నోరుగలవారును, జ్వలించుచున్న విశాలములైన నేత్రములు గలవారును నగు మిమ్ముజూచి మిగుల భీతిల్లిన మనస్సుగలవాడనై ధైర్యమును, శాంతిని నేను పొందజాలకున్నాను.

*******************************************************************************************  24

దం ష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానల సన్నిభాని
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస‌.


కోరలచే భయంకరములైనవియు, ప్రళయయాగ్నిని బోలినవియునగు మీ ముఖములనుజూచి, నేను దిగ్బ్రమ జెందియున్నాను. సుఖమును గూడ బొందకయే యున్నాను. కావున ఓ దేవదేవా! జగదాశ్రయా! ప్రసన్నులుకండు (నన్ననుగ్రహింపుడు).

*******************************************************************************************  25

అమీచ త్వాం ధృతరాష్ట్రస్యపుత్రాః
సర్వే సహైవావనిపాలసజ్ఘైః,
భోష్మోద్రోణస్సూతపుత్ర స్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యైః.

వక్త్రాణి తే త్వరమాణా విశంతి
దం ష్ట్రాకరాలాని భయానకాని,
కేచిద్విలగ్నాదశనాంత రేషు
సందృశ్యంతే చూర్ణితై రుత్తమాజ్గైః


ధృతరాష్ట్రుని కుమారులందరును, భీష్మడును, ద్రోణుడును, కర్ణుడును, వారిసేనయందలి సమస్త రాజసమూహములను, అట్లే మన సేనయందలి సైనిక ప్రముఖులును, మిమ్ము త్వరితముగ జేరుచున్నవారై కోరలచే భయంకరములుగనున్నట్టి మీనోళ్లయందు ప్రవేశించుచున్నారు. (వారిలో) కొందరు మీ పండ్ల సందులయందు చిక్కుకొనినవారై పొడుముచేయబడిన శిరస్సులతో కనుపించుచున్నారు.

*******************************************************************************************  26,27