Pages

Saturday, 8 August 2015

విశ్వరూపసందర్శనయోగః 5 (అథ ఏకాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్‌
గరీయ సే బ్రహ్మణోప్యాదికర్త్రే
అనంత దేవేశ జగన్నివాస
‌త్వమక్షరం సదసత్తత్పరం యత్‌.


మహాత్మా! అనంతరూపా! దేవదేవా! జగదాశ్రయా! సత్‌ అసత్తులకు, స్థూలసూక్ష్మజగత్తుల రెండింటికిని పరమైనట్టి అక్షర (నాశరహిత), పరబ్రహ్మ స్వరూపులు మీరే అయియున్నారు. బ్రహ్మదేవునకు గూడా ఆదికారణులు, కనుకనే సర్వోత్కృష్టులు అగు మీకు జను లేల నమస్కరింపకుందురు (వారి నమస్కారములకు మీరు తగుదురు అని భావము).

******************************************************************************************* 37

త్వమాదిదేవః పురుషః పురాణ
స్త్వమస్య విశ్వస్య పరంనిధానమ్‌,
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వ మనంతరూప.


అనంతరూపులగు ఓ కృష్ణా! మీరు ఆదిదేవులును, సనాతన పురుషులును, ఈ ప్రపంచమునకు శ్రేష్ఠమైన ఆధారమున్ను, సమస్తమును తెలిసికొనినవారును, తెలియదగినవారును, సర్వోత్తమ స్థానమును అయియున్నారు. మీచేతనే ఈ ప్రపంచమంతయును వ్యాపింపబడియున్నది.

******************************************************************************************* 38

వాయుర్యమోగ్నిర్వరుణశ్శశాజ్కః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ
నమో నమస్తేస్తు సహస్రకృత్వః
పునశ్చభూయోపి నమోనమస్తే.


వాయువును, యముడును, అగ్నియు, వరుణుడును, చంద్రుడును, బ్రహ్మదేవుడును, బ్రహ్మదేవునకు తండ్రియును మీరే అయియున్నారు. మీ కనేక వేల నమస్కారములు! మరల మీకు నమస్కారము !.

*******************************************************************************************  39

నమః పురస్తాదథ పృష్ఠతస్తే
నమోస్తు తే సర్వత ఏవ సర్వ
అనంతవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతోసి సర్వః‌.


సర్వరూపులగు ఓ కృష్ణా! ఎదుటను, వెనుకను మీకు నమస్కారము, మరియు అన్ని వైపులను మీకు నమస్కారమగుగాక! అపరిమితసామర్థ్యము, పరక్రమము గలవారగు మీరు సమస్తమును లెస్సగ వ్యాపించి యున్నారు. కనుకనే సర్వస్వరూపులై యున్నారు.

******************************************************************************************* 40

సఖేతి మత్వాప్రసభం యదుక్తం
హే కృష్ణ హే యాదవ హే సఖేతి
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ప్రణయేనవాపి.

యచ్చాపహాసార్థమసత్కృతోసి
విహారశయ్యాసన భోజనేషు,
ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం
తతా మయేత్వామహ మప్రమేయమ్‌


నాశరహితులగు ఓ కృష్ణా! మీయొక్క ఈ మహిమను తెలియక పొరపాటునగాని, చనువువలనగాని, సఖుడవని తలంచి 'ఓ కృష్ణా, ఓ మాదవా, ఓ సఖా' అని అలక్ష్యముగ మిమ్ముగూర్చి నేనేది చెప్పితినో, మరియు విహారము సల్పునపుడుగాని, పరుండునపుడుగాని, కూర్చుండునపుడుగాని, భుజించునపుడుగాని, ఒక్కరుగా నున్నపుడుగాని లేక ఇతరుల యెదుట గాని పరిహాసముకొరకు ఏ అవమానమును గావించితినో ఆయపరాధము లన్నిటిని అప్రమేయులగు మిమ్ము క్షమింప వేడుచున్నాను.

*******************************************************************************************  41, 42

పితాసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్‌
న త్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యో
లోకత్రయేప్యప్రతిమప్రభావ.


సాటిలేని ప్రభావము గల ఓ కృష్ణమూర్తీ! మీరు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమున కంతకును తండ్రి అయియున్నారు. మరియు మీరు పూజ్యులును, సర్వశ్రేష్ఠులవగు గురువును అయి వెలయుచున్నారు. ముల్లోకములందును మీతో సమానమైన వాడులేడు. ఇక మిమ్ము మించినవాడు మరియొక డెట్లుండ గలడు?.

*******************************************************************************************  43

తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహమీశమీడ్యం
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియాయార్హసి దేవసోఢుమ్‌‌.


అందువలన నేను శరీరమును భూమిపై సాష్టాంగముగ బడవైచి నమస్కరించి ఈశ్వరుడును, స్తుతింపదగినవారునునగు మిమ్ము అనుగ్రహింప వేడుచున్నాను. దేవా, కుమారుని (అపరాధమును) తండ్రివలెనె, స్నేహితుని (అపరాధమును) స్నేహితుడువలెనె ప్రియురాలి (అపరాధమును) ప్రియుడువలెనె (నాయొక్క అపరాధమును) మీరు క్షమింపుడు.

*******************************************************************************************  44

అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే
తదేవ మే దర్శయ దేవ రూపం
ప్రసీద దేవేశ జగన్నివాస.


ఇదివర కెన్నడును జూడనట్టి ఈ విశ్వరూపమును జూచి ఆనందమును బొందితిని. కాని భయముచే నాయొక్క మనస్సు మిగుల వ్యధనొందుచున్నది. కావున దేవా! ఆ మునుపటి (సౌమ్య) రూపమునే నాకు జూపుడు. దేవదేవా! జగదాధారా! అనుగ్రహింపుడు!.

*******************************************************************************************  45