Pages

Thursday, 10 September 2015

వేమన శతకము - 2

అల్పుడెప్పుడు పల్కు నాడంబరము గాను 
సజ్జనుండు పలుకుఁ జల్లగాను 
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా 
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| అల్పబుద్ది గలవాడు లేనిపోని గొప్పలు చెప్పుకొనుచు ఎక్కువగా మాటలాడును. సజ్జనుడైన వాడు తన గొప్పదనమును మరుగుపరచి, అందరతోనూ మృదు మధురముగా కొద్దిగా మాటలాడును. లోకములో విలువ తక్కువైన కంచు, పెద్దగా మ్రోగుటయు, విలువ ఎక్కువ గల బంగారము తక్కువగా మ్రోగుటయు మనము చూచుచున్నాము గదా!

*******************************************************************************************  11

కులములోన నొకడు గుణవంతుడుండినఁ 
గులము వెలయు వాని గుణము వలన 
వెలయు వనములోన మలయజంబున్నట్లు 
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| అడవిలో ఒక్క మంచి గంధపు చెట్టున్నచో అడవియంతయు సువాసనతో నిండిపోవును. అట్లే వంశములో ఒక్క సద్గుణవంతుడు పుట్టినచో వాని వలన ఆ వంశమంతయు కీర్తి ప్రతిష్టాలు పొందును.

*******************************************************************************************  12

పూజకన్ననెంచ, బుద్ధి ప్రథానంబు
మాట కన్ననెంచ మనసుదృఢము 
కులము కన్న మిగుల గుణము ప్రధానంబు 
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| చేసెడి పూజకన్నను, ఎందుకు చేయుచున్నామో తెలిసిన బుద్ది ముఖ్యమైనది. ఆడిన మాట కన్నను మాట నిలబెట్టుకొనవలెనన్నమనసు ముఖ్యము. ఆ విధముగానే, ఏ కులములో బుట్టినాడను విషయముకంటెను వానికి గల సద్గుణమును ప్రధానముగా చూడవలెను.

*******************************************************************************************  13

ఉత్తముని కడుపున నోగు జన్మించిన
వాడు చెఱచు వాని వంశమెల్లఁ 
చెఱకు వెన్నుపుట్టి చెరపదా తీపెల్ల?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఉత్తముడైన వాని కడుపున దుర్మర్గుడొకడు పుట్టినచో వాడు తన దుష్ట ప్రవర్తనము చేత వంశ ప్రతిష్టనంతను పాడుచేయును. తీయని రసము గలిగిన చెఱకు గడ చివర వెన్నుపుట్టి, ఆ తీయదనమునంతను చెదగొట్టును గదా!

*******************************************************************************************  14

కులములోన నొకడు గుణహీనుడుండెన 
కులముచెడును వాని గుణము వలన 
వెలయు చెఱకునందు వెన్నువెడలినట్లు 
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| తీయని రసముతొ నిండియున్న చెఱకు గడ చివర వెన్ను పుట్టి ఆ మాధుర్యమునంతను పోగొట్టి నట్లు, వంశములొ ఒక్క గుణ హీనుడు జన్మించినచో వాని దుర్మార్గ ప్రవర్తనము చేత ఆ వంశగౌరవము నశించును.

*******************************************************************************************  15

రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులముఁ జెఱచె
నిలను బుణ్యపాప మీలాగు కాదొకో
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| అవతార పురుషుడైన రాముడు సూర్యవంశంలో జన్మించి దుష్టశిక్షణ చేసి ఆ వంశమును ప్రసిద్ధినొందునట్లు చేసెను. కురువంశంలో దుర్యోధనుడు జన్మించి, తనవంశము వారిని నిర్మూలించుటే కాక, కులమునకు అప్రతిష్ట తెచ్చెను. వీరిద్దరును పుణ్యపాపము లిట్లుండునని నిరూపించిరి.

*******************************************************************************************  16

హీనగుణమువాని నిలుసేర నిచ్చిన
నెంతవానికైన నిడుమ గలుగు
ఈగ కడుపుఁజొచ్చి యిట్టట్టు సేయదా?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| నీచ స్వభావము గలవాని నొక్కనిని ఇంటిలో చేరనిచ్చినచో, యజమాని యెంత జాగ్రత్తగలవాడైనను కష్టాల పాలు గాక తప్పదు. ప్రమాదవశమున ఈగ యొకటి కడుపులో ప్రవేశించినచో మొత్త మా మనుష్యునే తలక్రిందులు చేయును గదా! (అంత కలవరపఱచి బాధించునని భావము).

*******************************************************************************************  17

వేరుపురుగు చేరి వృక్షంబుఁ జెఱచును
చీడ పురుగు చేరి చెట్టుఁ జెఱచుఁ
గుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| వేరును నశింపజేయు పురుగుచేరి మొత్తము చెట్టునే పాడుచేయును. ఆకులు తినెడి చీడపురుగు పట్టి మొక్కలను నాశనము చేయును. అట్లే దుర్భుద్ధి గలవాడు దగ్గరకు జేరి గుణవంతుని పాడుచేయును. (కావున దుర్జనులను దరికి చేరనీయరాదు)

*******************************************************************************************  18

అల్పుడెన్నివిద్య లభ్యసించినఁ గాని
ఘనుడుగాడు హీన జనుడెకాని
పరిమళములమోయ గాడిద, గజమౌనె
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| నీచబుద్ధి గల మానవుడు ఎన్ని విద్యలు నేర్చినను గొప్పవాడు కాలేడు. అధముడేయగును. గంధపు చెక్కలవంటి సుగంధద్రవ్యములను మోయుచున్నంత మాత్రమున గాడిద యేనుగవునా? (ఏనుగున కున్న గౌరవము వచ్చునా యని యర్థము)

*******************************************************************************************  19

విద్యలేనివాడు విధ్యాధికుల చెంత
నుండినంత పండితుండు కాడు
కొలని హంసలకడఁ గొక్కెర యున్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఒక చదువురాని వాడు పండితుల దగ్గర మసలినంత మాత్రముచేత పండితుడుగా గుర్తింపబడడు. వాని బండారము బయటపడుచునేయుండును. కొలనిలోని హంసల దగ్గర కొంగ తిరిగినంతమాత్రమున హంసయైపోవునా? వాని లక్షణములు దీనికెట్లు వచ్చును?

*******************************************************************************************  20